Tuesday, January 23, 2018

జాన్ కీట్స్: సౌందర్యానికి మోకరిల్లినవాడుకొన్ని పేర్లు మరింత మృదువుగా తోచడానికి కారణం, అవి నిజంగానే సుతిమెత్తగా ధ్వనించడమా? లేక, వాళ్ల జీవితం కొంతైనా తెలిశాక, కరిగిపోయిన మనలోపలి గరుకుదనం కారణమా? జాన్‌ కీట్స్‌ను తడుముతూవుంటే ‘పూర్ణంగా వికసించిన గులాబిపువ్వు’ను చేతుల్లోకి తీసుకున్నట్టే ఉంది.

‘ఎ థింగ్‌ ఆఫ్‌ బ్యూటీ ఈజ్‌ ఎ జాయ్‌ ఫరెవర్‌. దాని మనోహరత్వం పెరుగుతూనేవుంటుంది; అది ఎన్నటికీ శూన్యంలోకి గతించదు’. రొమాంటిక్‌ మూవ్‌మెంట్‌కు ప్రాతినిధ్యం వహించగలిగే వాక్యం ఇది. తర్కాలతో విసిగిపోయిన కాలంలో అనుభూతిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు కీట్స్‌. అతడు సౌందర్యాన్ని ‘కంటితో’ ఎంతగా ‘తాగే’వాడంటే, తనకే ‘తెలియని వివశత్వంతో’ తల తూగిపోయేది. ‘సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం; ఇది తెలిస్తే ప్రపంచంలో ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదు,’ అన్నాడు.

పూబాలకుడి లాంటి కీట్స్‌ జీవితంలో ఎదలోకి దిగిన ముళ్లు కూడా ఉన్నాయి. అశ్వశాల నిర్వాహకుల ఇంట పుట్టాడు. సాహిత్య వాసన లేని కుటుంబం. కీట్స్‌కు పదేళ్లున్నప్పుడు తండ్రి గుర్రం మీంచి పడి చనిపోయాడు. మూడు నెలలకే తల్లి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. తమ్ముడితోపాటు కీట్స్‌ అమ్మమ్మ సంరక్షణలో పెరిగాడు. ఆమె దగ్గర ఆస్తిలేదు. ఉన్నది తగాదాల్లో ఉంది. అందువల్ల బంధువులు లేరు. ఇలాంటి నేపథ్యంలో పెరిగిన కీట్స్‌– మనుషులతో గొడవ పడేవాడు, కానీ పుస్తకాలతో స్నేహం చేసేవాడు. షేక్‌స్పియర్‌ ఎందుకు అంత గొప్పవాడయ్యాడో చాలా త్వరగా తెలుసుకున్నాడు.

సర్జన్‌ కావాలని ఉండేది. కొంతకాలం శిక్షణ కూడా పొందాడు. ఒకవైపు పాఠం జరుగుతుంటే, గదిలో పరుచుకునే సూర్యకిరణాలవెంట ఊర్ధ్వలోకాల్లోకి ఎగిరిపోయేవాడు. తనలాంటివాడు శస్త్రచికిత్సలు చేయలేడని గ్రహించాడు. ఆలోచనలకన్నా సంవేదనలతో కూడిన జీవితాన్ని కోరుకున్నాడు. ‘ధాన్యాగారాల్లో పసిడిపంటను నిల్వజేసినట్టు/ తలలో పొంగిపొర్లుతున్న ఆలోచనలను/ అక్షరరూపంలో పుస్తకాలలోకి’ అనువదించ బూనుకున్నాడు. ‘కవిత్వం ఆకులు చిగిర్చినంత సహజంగా రాకపోతే అది అసలు రాకపోవటమే మంచిది’ అన్నాడు. ‘మూఢులకు తమవైన స్వప్నాలుంటాయి; అందుకే వాళ్లు స్వర్గాన్ని (కూడా) ఒక వర్గం కోసమే నేస్తూవుంటారు’ అన్నాడు. అయితే, లండన్‌ పత్రికల్లో వచ్చిన సమీక్షలు అతడి మనసును గాయపరిచాయి.

ఆ పరిస్థితుల్లో అతడికి పెద్ద ఊరట ఫానీ బ్రాన్‌. ‘కవిత్వపు రెక్కల’ మీద ఆమె దగ్గర వాలేవాడు. ‘దేహం చాలనంతగా’ ప్రేమించేవాడు. ‘ప్రేమ నా మతం. దానికోసం ప్రాణమైనా ఇస్తా’ అనేవాడు. కానీ ప్రాణాన్ని బలి కోరడానికి ప్రేమకేం పని? ఆ కర్కశ కార్యాన్ని మృత్యువు తలకెత్తుకుంది. క్షయవ్యాధి రూపంలో కీట్స్‌ను వెంటాడింది. ఏ ‘తియ్యటి పాపం’ చేయనివ్వకుండానే పూర్తిగా ఆక్రమించుకుంది. అదే క్షయతో తల్లి చనిపోయింది, తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు తన వంతా?

చలి, దగ్గు బాధిస్తున్నాయి. అనారోగ్యంతో పేదఖైదీలాగా బందీ అయ్యాడు. దుప్పటిమీద కక్కుకున్న రక్తపు చుక్కలు కాలుడు పంపిన హెచ్చరికల్లా తోస్తున్నాయి. ‘మరో జీవితమంటూ ఉందా? నేను మేల్కొన్నాక దీన్నంతా ఒక కలగా తెలుసుకుంటానా? (మరో జీవితం) ఉండేవుండాలి, (లేదంటే) ఇలాంటి యాతనల్ని భరించడం కోసమే మనం సృష్టించబడివుండం’.

మద్యం ఆర్చేది కాదు, నల్లమందు తీర్చేదికాదు, ‘వృద్ధ దాదిలాంటి కాలం’ కూడా ఏ పరిష్కారమూ చూపించలేదు. అందుకే, నెగెటివ్‌ కేపబిలిటీ సిద్ధాంతాన్ని రూపొందించుకున్నాడు కీట్స్‌. అనిశ్చితాలు, ద్వంద్వాలు, మర్మాలు, సందేహాలు ఎన్ని చుట్టుముట్టినా భరించగల సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్నాడు. ‘పోనివ్వని నిద్రలా మోపిన మృత్యువు బరువును’ ఓర్చుకున్నాడు. వీలైనంత త్వరగా మరణాన్ని తన్నుకుపోవడానికి ఆకాశంలోని గద్దలా కాచుకుని పడుకున్నాడు. ‘నేను త్వరగా నిశ్శబ్దపు సమాధిలోకి ఒరిగిపోవాలి... ఆ నెమ్మదైన సమాధికి దేవుడికి ధన్యవాదాలు... ఓ! నా మీద పరుచుకుంటున్న చల్లటి మట్టిని అనుభూతిస్తున్నాను... నా మీద డైసీ పువ్వులు పెరుగుతున్నాయి’.

తన సమాధి ఫలకం మీద కీట్స్‌ ఇలా రాయాలని కోరుకున్నాడు: ‘ఇక్కడ నిద్రించేవారి పేరు నీటి మీద రాసిన రాత’. పాతికేళ్ల వయసులో(1795–1821) కీట్స్‌ శాశ్వతనిద్రలోకి జారుకున్న నేలలో పూసిన పూల గంధం విశ్వాన్ని చుట్టింది. ఆ సువాసనలను పీల్చినవాళ్లే భావకవులైనారు. ‘ఏడవకు, కళ్లు తుడుచుకో, ఈ పూవు మళ్లీ వచ్చే ఏడు పూస్తుంది’.

––––––––––––––––––––––––––––––––––––––
అక్టోబర్‌ 31న కవి ‘రొమాంటిక్‌ పొయెట్‌’ జాన్‌ కీట్స్‌  జయంతి
(ఫన్ డే, అక్టోబర్ 2014)


 

Saturday, January 20, 2018

పికాసో: విశ్వగీతాకారుడుతన కొడుకు చాలా పెద్దపేరున్నవాడు అవుతాడని సర్రియలిజంగా చెప్పదలిచిందేమో, పాబ్లోకు డోనా ఇలా నామకరణం చేసింది: పాబ్లితో డీగో జోస్‌ శాంటియాగో ఫ్రాన్సిస్కో డి పాలా జువాన్‌ నెపోమ్యూసినో క్రిస్టీస్‌ క్రిస్పియానో డి లాస్‌ రెమెడియోస్‌ సిప్రియానో డి ల శాంటిసియా ట్రినిడాడ్‌ రూయిజ్‌ బ్లాస్కో వై పికాసో లోపెజ్‌.

పూర్వీకులు, బంధుమిత్రులు, క్రైస్తవ సన్యాసులు అందరినీ తన పేరులో కలుపుకున్న పికాసో– మాటలు రాకముందే బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. చిన్నవయసులోనే ఏ చిత్రాన్నైనా నకలు చేయగలిగేవాడు. అతడికి తండ్రి బ్లాస్కోనే తొలిగురువు. బ్లాస్కో పావురాల్ని పెంచేవాడు. వాటిని చూస్తూ కుమారుణ్ని గీయమనేవాడు. స్పెయిన్‌ సాంస్కృతిక ఉత్సాహంలో భాగమైన గుర్రాల్ని, బుల్‌ఫైట్‌ దృశ్యాల్ని కొడుక్కు  చూపించేవాడు. ఇవన్నీ పికాసో భావి జీవితాన్ని ప్రభావితం చేశాయి. అలాగే తనతో ఆడిపాడిన చెల్లెలి మరణం కూడా! అందుకే దేవుడు దయ్యంగా కనబడటం మొదలైంది. ‘మనం ఏది చిత్రించాలి? ముఖం మీద కనిపిస్తూ ఉన్నదా? ముఖం లోపల ఉన్నదా? ముఖం వెనుక ఉన్నదా?’ అన్న మథనం మొదలైంది.

పికాసో కౌమారంలోకి అడుగిడగానే జన్మదిన కానుకగా, వాళ్ల నాన్న తాను వాడే కుంచెలు, రంగులు, పేలెట్‌ బహుమతిగా ఇచ్చాడు. బ్లాస్కో మళ్లీ బొమ్మల జోలికి పోలేదు. ‘నా చిన్నప్పుడు మా అమ్మ ఓ మాట అంటుండేది. నువ్వు సైనికుడివైతే జనరల్‌వు అవుతావు. సన్యాసివైతే పోప్‌ అవుతావు అని. కానీ నేను చిత్రకారుణ్నయి పికాసోనయ్యాను,’ అన్నాడు సగర్వంగా. ‘శాస్త్రం – దాతృత్వం’, ‘తొలి ప్రార్థన’, ‘ముసలి గిటారిస్టు’, ‘పైప్‌తో పిల్లాడు’, ‘అవెన్‌యాన్‌ వేశ్యలు’ లాంటి ఎన్నో చిత్రాలు గీశాడు. అంతర్యుద్ధ సమయంలో స్పెయిన్‌ వినాశనాన్ని ప్రతిబింబిస్తూ ‘గుయెర్నికా’ (1937) వేశాడు. ఫ్రాంకో, జర్మన్‌ మిత్రపక్షాలు గుయెర్నికా అనే పట్టణంపై మూడు గంటలపాటు జరిగిన బాంబులదాడిలో సుమారు రెండువేల మంది చనిపోయారు. వందలమంది గాయపడ్డారు. వీరిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉన్నారు. ఎడ్లను సైనికులుగా దౌర్జన్యానికీ, గుర్రాలను ప్రజానీకంగా దుఃఖానికీ ప్రతీకలుగా 7.8 మీటర్ల వెడల్పు, 3.5 మీటర్ల ఎత్తుతో నలుపు, తెలుపుల్లో వేసిన ఈ పెయింటింగు– ఇరవయ్యవ శతాబ్దపు అత్యున్నత చిత్ర సృష్టిగా ప్రశంసలందుకుంది. అయితే, ఈ ప్రతీకలు విమర్శకులు ఊహించినవే తప్ప పికాసో నిర్ధారించలేదు. ఎద్దు ఎద్దే, గుర్రం గుర్రమే... కళను కళగానే చూడమన్నాడు. ఆయనే అన్నట్టు, ‘కళ ఒక అబద్ధం. అయితే సత్యాన్వేషణలో అది మనకు సాయం అందిస్తుంది.’ ‘ఆత్మమీద పేరుకుపోయిన రోజువారీ జీవితపు దుమ్మూ, ధూళిని పరిశుభ్రం చేస్తుంది’.

పికాసో చిత్రకళను సాధారణంగా ఏడు దశలుగా చెబుతారు. బ్లూ పీరియడ్, రోజ్‌ పీరియడ్, న్యూడ్, క్యూబిజం, ఆఫ్రికన్‌ ప్రభావం, క్లాసికల్, సర్రియలిజం. నీలిదశలోని చిత్రాలన్నీ నీలిరంగు నేపథ్యాన్ని కలిగివుంటాయి. ఉదాసీనతకూ, విచారానికీ ప్రతీకగావుండే నీలిరంగులోంచి తర్వాత గులాబీ దశలోకి మరలాడు. ఇదంతా ఉత్సాహపూరిత కాలం. అటుపై తానే మూలస్తంభంగా నిలిచి, ప్రచారంలోకి తెచ్చిన సరికొత్తశైలి క్యూబిజంలోకి వచ్చాడు. ఆఫ్రికన్‌ కళను అనాగరికంగా భావిస్తున్న రోజుల్లో వారి కళాత్మకతను అర్థం చేసుకుని ఆ ప్రభావంలో గీశాడు. ‘అల్ప కళాకారులు అరువు తెచ్చుకుంటారు; గొప్ప కళాకారులు దొంగిలిస్తారు,’ అని గడుసుగా కూడా ఒక మారు చెప్పుకున్నాడు.

ఆయన చిత్రకళలో ఏడు దశలున్నట్టే, ఆయన జీవితంలోనూ ఏడుగురు స్త్రీలున్నారు. పడతులపట్ల తన మోహాన్ని పికాసో ఏనాడూ దాచుకోలేదు. ఫెర్నాండో ఓలివేర్, ఎవా గూల్, మేరీ వాల్టర్, డోరా మార్, జాక్వెలిన్‌ రోకో... ‘నేను ఎవరితో ఉండాలీ అనే అంశాన్ని తేల్చటం కోసం ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకోవటం నా జీవితంలో అత్యంత మధురమైన సందర్భం’ అని చమత్కరించాడు. కొన్ని గాఢమైన క్షణాలు, తీవ్రమైన కౌగిళ్ల తర్వాత ఆ ప్రేమలన్నీ ఎడబాటుకే దారితీసేవి. వారి ప్రేమకు శాశ్వతత్వం లేకపోయినా, తన చిత్రాల ద్వారా ప్రియురాళ్లకు శాశ్వతత్వం కల్పించాడు. గుయెర్నికాలో డోరా మార్‌ కనబడుతుంది. ఇంకా ఆయా దశల్లోని చిత్రాల్లో ఆయా కాలాల ప్రేయసులు దర్శనమిస్తారు.

చిత్రకళలోనే కాదు, శిల్పంలో కూడా అసాధారణ ప్రతిభను చూపాడు పికాసో. కాగితంపైనే కాకుండా కుండలు, కలప, చర్మం, పింగాణిని కూడా మాధ్యమంగా ఉపయోగించుకున్నాడు. శాంతికి చిహ్నంగా ప్రపంచం గుర్తిస్తున్నది పికాసో పావురాన్నే!

అయితే, ఆయన చిత్రాల్లో అర్థం కానివే ఎక్కువ. ‘సమకాలీన ప్రపంచంలో ఏదీ అర్థం కాదు, మరి అర్థమయ్యే పెయింటింగు నేనెందుకు వెయ్యాలి?’ అని ఎదురు ప్రశ్నించాడు. అయినా కూడా ఒక యుగపురుషుని కీర్తి తన జీవితకాలంలోనే వచ్చిపడింది. కోట్ల రూపాయలకు పెయింటింగ్స్‌ అమ్ముడుకావడం మొదలైంది. వేలంవెర్రిగా జనం అభిమానిస్తుండటం చూసి, నా చిత్రాల్లో మీరు ఊహించుకుంటున్నదేదీ లేదు, అని కూడా చిరాకుపడ్డాడోసారి.
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పికాసో నిరాడంబరంగా బతికాడు. సాదాసీదాగా నిక్కరుమీదే పనిచేసుకునేవాడు. సందర్శకులనూ అలాగే కలిసేవాడు. స్పెయిన్‌లో పుట్టి, ఫ్రాన్స్‌లో స్థిరపడిన పికాసో చిత్రకారుడికి పర్యాయపదంగా నిలిచాడు.

––––––––––––––––––––––––––––––––––––
అక్టోబర్‌ 25న చిత్రకారుడు పికాసో(1881–1973) జయంతి
(ఫన్ డే, అక్టోబర్ 2014)
 

Tuesday, January 16, 2018

ఆమర్త్య సేన్: ఆర్థిక మానవతావాదిసాధారణంగా అంకెలు అంకెల్లానే వ్యవహరిస్తాయి. వాటికి ఆత్మాభిమానం, అణచివేత, క్షోభ, సామాజిక వ్యత్యాసం లాంటివేమీ తెలియదు. వృద్ధిరేటు ఎంత శాతం ఉంది? స్థూల జాతీయోత్పత్తి ఏ మేరకు పెరిగింది? ఇవి అవసరమే. కానీ వీటిని మాత్రమే ఆమర్త్య సేన్‌ లెక్కలోకి తీసుకోరు. ఆ అంకెలు ఉపరితలం నుంచి వచ్చినవా? అట్టడుగు వర్గాలను కూడా కలుపుకొన్నవా? అందుకే ఆయన మాటతీరు ఆర్థిక శాస్త్రవేత్తకన్నా మానవ హక్కుల మేధావిని తలపిస్తుంది. ‘ఆర్థికశాస్త్రానికి నైతిక కొలతను పునఃస్థాపించినవాడిగా’ ఆయనకు 1998లో నోబెల్‌ పురస్కారం దక్కింది ఈ కారణంగానే!

1933లో శాంతినికేతన్‌లో రవీంద్రనాథ్‌ టాగూర్‌ చేత నామకరణం చేయించుకున్న ఆమర్త్య కుమార్‌ సేన్‌... గాంధీజీ ‘విశ్వాసపు బాట’కన్నా, రవీంద్రుడి ‘హేతువు తోవ’కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చరఖా కన్నా పలక మిన్న అన్న గురుదేవుడి స్ఫూర్తిని జీర్ణించుకున్న ఆయన... పాకిస్తాన్‌ ఆర్థికవేత్త మహబూబ్‌ ఉల్‌ హక్‌తో కలిసి ‘మానవాభివృద్ధి సూచిక’ను రూపొందించారు. ఆయా దేశాల్లోని జీవన ప్రమాణాలను ఐక్యరాజ్యసమితి ఈ సూచిక ఆధారంగానే లెక్కిస్తోంది. దీనిప్రకారం భారత్‌ది 135వ స్థానం.

ప్రస్తుతం బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయానికి చాన్స్‌లర్‌గానూ, అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఆర్థిక, తత్వశాస్త్రాల బోధకుడిగానూ పనిచేస్తున్న ఆమర్త్య సేన్‌... తలసరి ఆదాయం మాత్రమే దేశాభివృద్ధికి సూచిక కాదంటారు. ‘మానవ సామర్థ్య’ పెరుగుదల మరింత ప్రాధాన్యమైన అంశం అంటారు. నిరక్షరాస్యత, కనీస ఆరోగ్య సౌకర్యాల లేమి, లైంగిక అసమానత్వం గురించి నొక్కి చెబుతారు. భిన్నవర్గాలకు గొంతుక ఇవ్వడంలో ఏ మేరకు సఫలీకృతమైందన్న దాన్ని బట్టే ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటారు. అయితే, ప్రజాస్వామ్యం దేనికీ గ్యారంటీ ఇవ్వదు. హక్కుల కోసం పోరాడాల్సివుంటుంది. ప్రాథమిక విద్యలాంటిదాన్ని ఉద్యమరూపంలోకి మలచడం అంత సులభం కాదని ఆయనకు తెలుసు. నిరంతర సంవాదం ద్వారా మౌలికావసరాల్ని సామూహిక స్పృహలోకి తేవాల్సి ఉందంటారు.

రెండు రకాల ఆర్థిక విధానాల గురించిన చర్చ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే వాళ్లే స్థూలజాతీయోత్పత్తిని పెంచుతారు, దానిలో భాగంగా పేదవాళ్లు కూడా దాని ఫలాలు అందుకుని పైకి ఎగబాకుతారనే ‘జీడీపీ వృద్ధి’ విధానం ఒకటీ; విద్య, ఆరోగ్యం లాంటివాటికి తొలి ప్రాధాన్యమిచ్చే ‘మానవ సామర్థ్య వృద్ధి’ విధానం మరొకటీ. చిత్రంగా మొదటిదానికే మన ప్రభుత్వాలు మరింత ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. దీన్ని ఆమర్త్యసేన్‌ వ్యతిరేకిస్తారు. ఏ దేశమూ కూడా మానవ సామర్థ్యాన్ని పెంపొందించకుండా అద్భుతమైన పెరుగుదలను సాధించలేదంటారు. జపాన్, చైనా, కొరియా, హాంగ్‌కాంగ్, తైవాన్, థాయ్‌లాండ్, యూరప్, అమెరికా, బ్రెజిల్‌... ఇవేవీ ట్రాక్‌ 1లో అభివృద్ధి చెందలేదంటారు.

‘సామ్యవాద ఆర్థికవ్యవస్థల్ని అణచివేత సహా ఎన్నో రాజకీయ, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టివున్నాయి. యాభై ఏళ్లక్రితం ఏ లక్ష్యాలైతే జనాన్ని సామ్యవాదంవైపు ఆకర్షించాయో, ఆ లక్ష్యాలు ఇప్పటికీ ప్రాధాన్యం కలిగినవే!’
మహిళలు ఎదుర్కొనే అణచివేత గురించి ఆయన 1960ల్లోనే రాశారు. విద్య, పోషణ విషయంలో ఒక కుటుంబంలో ఉండే పంపకాల్లోని అసమానతల గురించి చర్చించారు. ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ఇవన్నీ మాట్లాడాల్సిన పనేమిటని ఆయన్ని విమర్శించేవాళ్లున్నారు. ‘పేదరికం నాకు ఆసక్తి. బాలికల నిష్పత్తి నాకు ఆసక్తి. బాలల సంక్షేమం నాకు ఆసక్తి. శిశు మరణాలు నాకు ఆసక్తి’... ‘పాలను లీటర్లలో కొలిచినట్టుగా కవిత్వావేశం గణనకు లొంగదు, అంతమాత్రాన దాని ప్రభావం విస్మరించలేం కదా!’ అంటారు.

భిన్న సంస్కృతులు స్నేహపూర్వకంగా మనగలిగే సమాజాన్ని ఆయన కాంక్షిస్తారు. ప్రజాస్వామ్యం కేవలం అత్యధికుల పాలనావిధానం కాదనీ, అది సహనానికి సంబంధించినదనీ, అల్పసంఖ్యాకుల అభిప్రాయాల్నీ, విమర్శలనీ సహించడంలోనే ప్రజాస్వామ్య స్ఫూర్తి దాగుందనీ చెబుతారు.

కొందరి ప్రయోజనాలకు భంగం కలిగినా, కొందరు మార్కెట్‌ వెలుపలే ఉండిపోయినా కూడా కొందరైనా వ్యక్తిగతంగా లాభపడేలా చేస్తుంది కాబట్టి, మార్కెట్‌ ఎకానమీయే విజయం సాధిస్తుందంటారు. అయితే, నీకు చదువు లేకుండా, వ్యక్తిగత రుణం పొందే అవకాశం లేకుండా అందులో ఎప్పటికి పాల్గొనాలి?

పెట్టుబడీదారి విధానం సూత్రప్రాయంగా బలమైన వ్యక్తివాదాన్ని ప్రోత్సహించేదే అయినప్పటికీ, ఆచరణలో సమైక్యతకే దారితీసిందనీ, మన జీవితాల్ని మరింత పరస్పరాధారితంగా మార్చిందనీ చెబుతారు. ప్రపంచీకరణను ప్రతికూల దృష్టితో చూడనవసరం లేదంటారు. ‘అది ప్రపంచాన్ని సాంస్కృతికంగా, శాస్త్రీయంగా బలోపేతం చేసింది. ఎంతోమంది ఆర్థికంగా కూడా బలపడ్డారు’. ప్రతిదీ అందరికీ అందే దృష్టిలో దాన్ని స్వాగతిస్తారు. అలాగే దాన్ని మరింత మానవీయమైనదిగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ, అలా చేయడం కోసం జరిగే పోరాటాల్నీ సమర్థిస్తారు.

––––––––––––––––––––––
నవంబర్‌ 3న ఆమర్త్య సేన్‌ జన్మదినం
(2014 ఫన్ డే)

 

Saturday, January 13, 2018

క్యాల్విన్ క్లెయిన్: ఫ్యాషన్ బ్రాండ్ నేమ్
ఎవరో గల్లీకుర్రాడు వేసుకున్న టీ షర్ట్‌ మీద మీకు ఈ పేరు కనిపించివుండొచ్చు: క్యాల్విన్‌ క్లెయిన్‌! సంక్షిప్తంగా సి.కె. అదేమిటో కూడా తెలియకుండానే, ఒప్పందం కుదుర్చుకోని మోడల్‌గా మారిపోయాడు కుర్రాడు. ‘ఫ్యాషన్‌ బిజినెస్‌ ఇక ఎంతమాత్రమూ స్థానికమైనది కాదు; అది ప్రపంచ వ్యాపారం’ అని చెప్పే అమెరికన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌  క్యాల్విన్‌ క్లెయిన్‌... ప్రపంచం మీదకు చొచ్చుకువచ్చిన తీరుకు ఇది అద్దం పడుతుంది.

పచారీ కొట్టు నడిపే తండ్రికి 1942 నవంబరు 19న జన్మించిన క్లెయిన్‌... ఐదేళ్లప్పుడు వాళ్ల చెల్లెలి బొమ్మలకు బట్టలు కుట్టాడు. నెమ్మదిగా అది ఆడవాళ్ల దుస్తుల మీద ప్రత్యేక ఆసక్తికి కారణమైంది. 60ల చివర్లో సొంత స్టోర్‌ ప్రారంభించాడు. ర్యాంగ్లర్, లీవై, లీ లాంటి ‘సంప్రదాయ జీన్సు తయారీదార్ల’కు పోటీగా, ‘మా ఉత్పత్తులకు మాదైన తంత్రం, మాదైన తత్వం అద్దుతాం,’ అని బరిలోకి దిగాడు.

‘నాకూ క్యాల్విన్స్‌కు మధ్యన ఏముందో తెలుసుకోవాలనుందా? ఏమీలేదు’ అంటూ తొలియౌవనంలో ఉన్న బ్రూక్‌ షీల్డ్స్‌తో ఊహకు అవకాశమిచ్చేలా డైలాగ్‌ చెప్పించాడు. ‘నీకు పూర్తిగా తగినది కనుక్కో’మని ఊరిస్తూ, కౌమారంలోకి అడుగిడుతున్న అమ్మాయిలను ఆకట్టుకున్నాడు. ‘ఇంతకుముందుకంటే మనుషులు మరింత చక్కటి ఆకృతుల్లో ఉంటున్నారు. కొంచెం శ్రద్ధ పెడితే మీరు బాగా కనబడతారు. దుస్తులు ధరించినప్పుడు యౌవనపు అనుభూతి కలగాలి. అవి మీ ధోరణిని ప్రతిబింబిస్తాయి’ అని చెప్పాడు.

‘ఆధునిక సొగసు’కు మాస్టర్‌ డిజైనర్‌గా పేరొందిన సి.కె. తన పేరునే బ్రాండ్‌నేమ్‌ చేసుకున్నాడు. కోట్లు, జీన్సు, అండర్‌వేర్, స్పోర్ట్స్‌ వేర్, హ్యాండ్‌ బ్యాగ్స్, పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, బెడ్‌ షీట్స్, డైనింగ్‌ టేబుట్స్, డిషెస్, గ్లాస్‌వేర్‌... ఇలా అన్నింటా విస్తరిస్తూ వచ్చాడు. ‘ఎంతకాలం మన్నుతుంది, అనేదాన్నిబట్టి జీన్సు ధర నిర్ణయమవదు; దాన్ని ఉత్పత్తి చేయడంలో ఎంత శ్రమ దాగుంది? డిజైన్‌ సామర్థ్యం, వాష్‌ ఎంత అసలైనది... ఇలాంటివి ధరను నిర్ణయిస్తాయి’ అంటాడు. క్యాల్విన్‌ అన్ని సందర్భాల్లోనూ ఉత్పత్తిదారు కాదు. తన స్పెసిఫికేషన్స్‌కు తగ్గట్టుగా ఉత్పత్తుల్ని రూపొందించేలా ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. అమ్మకాల మీద రాయల్టీలు పొందుతాడు.

ఎన్ని రకాల డిజైన్లు చేసినప్పటికీ, తనను తాను తొలుత విమెన్‌ డిజైనర్‌గా భావిస్తాడు. మహిళల శరీరాలు, వాటి ధర్మాలు, వారి కోరికలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ‘వాళ్లకు సంబంధించిన ప్రతిదీ, ఇన్నర్‌వేర్, ఔటర్‌వేర్‌ ఏదైనా తేడా లేదు’; వాళ్లు అన్నీ అందంగానే ఉండాలని కోరుకుంటారంటాడు. ‘ఉత్పత్తికి సంబంధించిన ప్యాకేజింగ్, దాని వాణిజ్య ప్రకటన అన్నీ ఆ ఉత్పత్తిని ప్రతిబింబించాలి... అయితే, సెలబ్రిటీలకు నా బ్రాండ్‌ దుస్తులను తొడిగించడంలో ఏనాడూ ఆసక్తిలేదు; ఆధునిక అమెరికా మహిళ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడ్రన్‌ వర్కింగ్‌ వుమెన్‌... ఆమె యాక్టివ్, యంగ్, తనకో కుటుంబం ఉంటుంది, బిజీగా ఉంటుంది... స్త్రీగా ఉండటాన్ని ఆనందిస్తూనే కేవలం ఫ్యాషన్‌ బొమ్మగా పరిగణించడాన్ని సహించదు... వాళ్లు సోషలైట్స్‌ కానక్కర్లేదు... అలాంటివాళ్లకు డిజైన్‌ చేయడం’లో తనకు ఆనందం ఉందంటాడు.

అయితే వాణిజ్య ప్రకటనల్ని‘సెక్సీ’గా రూపొందించడం ద్వారా చాలాసార్లు విమర్శల పాలయ్యాడు. అలాగే, సౌష్టవమైన దేహంకన్నా బక్కపలుచటి మోడల్‌ కేట్‌మాస్‌ను వినియోగించినప్పుడు కూడా, ‘అస్తవ్యస్త పోషణ’కు కారణమయ్యాడంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, చక్కటి ఆకృతిలో ఉండటానికిగానూ వ్యాయామం చేసేలా ప్రేరేపిస్తోందికదా, అని నవ్వేస్తాడు. మద్యపానం, మాదకద్రవ్యాలు, బై సెక్సువల్‌ ఇమేజీ కూడా ఆయన్ని చాలాకాలం ప్రతికూల వార్తల్లో ఉంచాయి.

తన ఉత్పత్తులకు తరచూ మోడళ్లను రిపీట్‌ చేస్తాడు క్యాల్విన్‌. దానిలో ఉన్న సానుకూల అంశం ఏమిటంటే, ‘అది ఉత్పత్తికి సంబంధించిన కొనసాగింపు’ను సూచిస్తుందంటాడు. తన ఉత్పత్తులకు మోడళ్లనే ఎక్కువగా వినియోగించడానికి కారణం, ‘మోడల్‌ ఎంతో చెప్పగలుగుతుంది. అదే సెలబ్రిటీలు, నటులు వారిదైన మనుషులు’ అంటాడు. అందుకే, ప్రయాణిస్తున్నప్పుడు దారిలో కనబడిన మనిషి దగ్గర తన కారు ఆపుకొని అతణ్ని ఎంపిక చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి(ఉదా: టామ్‌ హింట్‌నౌస్‌).

తనను మరొకరు కాపీ కొట్టడం సంతోషమేనని చెబుతాడు. ‘ఫ్యాషన్‌ పరిశ్రమ అనేది కొత్తది కనుక్కోవడం కాదు’, ఉన్నదాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్లేదే! ‘అసలు ఎవరైనా మనల్ని కాపీ కొట్టకపోతేనే సమస్య. మనం సరైనది  ఇవ్వనట్టు లెక్క’ అంటాడు. ఫ్యాషన్‌ గురించి చక్కటి ముక్తాయింపు ఇస్తాడు. ‘ఒకరిని అందంగా కనిపింపజేయడంలో సహాయపడటానికి మించిన ఉత్సాహవంతమైన పని ఇంకేముంటుంది?’
(ఫన్ డే, నవంబర్ 2014)

 

Thursday, January 11, 2018

త్రిపురేని గోపీచంద్: వీలునామా బాకీపడిన సమర్థుడు

ప్రశ్న మాత్రమే మన జీవితాంతం తోడు రాగలుగుతుందా? ఎక్కడో ఒకచోట సమాధానపడవలసిన స్థితి తప్పక వస్తుందా? అలా వచ్చే స్థితి సహేతుకమా, నిర్హేతుకమా? ‘అసమర్థుని జీవయాత్ర’, ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’, ‘పోస్టు చేయని ఉత్తరాలు’, ‘మాకూ ఉన్నాయి స్వగతాలు’, ‘తత్వవేత్తలు’ ‘మెరుపులు మరకలు’ వంటి విశిష్ట రచనలు చేసిన గోపీచంద్ ప్రయాణం- నాస్తికత్వంతో మొదలై, మార్క్సిజం, నవ్య మానవతావాదాల్ని దాటుకుని, ఆధ్యాత్మిక చింతన దగ్గర నిలిచిపోయింది.

 ‘సూతాశ్రమం’ స్థాపకుడు త్రిపురనేని రామస్వామి చౌదరి ఇంట జన్మించిన గోపీచంద్- తండ్రి అడుగుజాడల్లో హేతువాదిగా మసలుకున్నాడు. ‘ఎందుకు?’ అన్న ప్రశ్న వెంట నడిచాడు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, ‘శాస్త్రీయ ధోరణి’తో రచనలుగావించాడు. మానసిక విశ్లేషణ చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. సిద్ధాంతాల్ని తేలికభాషలో చెప్పే రాజకీయ కథల్ని రాశాడు. మార్క్సిజం ఏమిటో వివరించే ప్రయత్నం చేశాడు. తర్వాత, ఎం.ఎన్.రాయ్ బాటలో నడిచి రాడికల్ హ్యూమనిస్టుగా ఖ్యాతిగాంచాడు. సంఘంలోని హెచ్చుతగ్గులకు భగవంతుణ్ని కారణంగా చెప్పటాన్ని మోసంగా జమకట్టాడు. నీతినియమాలు ప్రకృతిలో నియమనిబద్ధతకు సంబంధించినవన్నాడు. ఏ దృక్పథమైనా మానవుడి పరిణామానికి దోహదం ఇచ్చేదిగా ఉండాలి; అతని మీద పెత్తనం చలాయించేదిగా ఉండకూడదన్నాడు.

 లేని గౌరవాలకు పోయి, ఉన్నదంతా ఊడగొట్టుకుని, లౌకిక ప్రపంచపు విలువల్ని తిరిగి అందుకోవడంలో విఫలమై, అందరిలాంటివాడే అనిపించుకోవడం ఇష్టంలేక తనకుతానే ఒక ద్వీపకల్పంగా తయారై, చేసినపనిలో ఇమడలేక, ఏ పనిచేయాలో ఎందుకు చేయాలో అర్థంకాక, జీవితానికి ఏ సార్థకతా, పరమార్థమూ కనబడక,  తలెక్కడో తోకెక్కడో తెలియని సంఘంతో ఘర్షణ పడి, బతికినన్నాళ్లూ ఏదో ఒకరకంగా జీవితంలో పాల్గొనవలసిందేనన్నది మరిచిపోయి, పిచ్చివాడిగా ముద్రపడి, బలవన్మరణానికి గురైన ‘అసమర్థుడు’ సీతారామారావు పాత్రను సృష్టించాడు. ధనికులు మనిషిగానే జమకట్టని రిక్షావోడి అంతరంగాన్నీ, శరీరం సహకరించని దశలో ఆదరణ కరువైన ముసలి ఎద్దు వేదననీ తన రాతల్లో చిత్రికపట్టాడు. ప్రత్యేకించి తత్వశాస్త్రాన్ని అభ్యసించకపోయినా, స్వీయ అధ్యయనం ద్వారా ఎందరో తాత్వికుల ఆలోచనాధారను పరిచయం చేశాడు.

 వృత్తిరీత్యా గోపీచంద్ న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడుగానీ, అందులో నెగ్గలేకపోయాడు. సినిమాల్లోకి ప్రవేశించి ‘రైతుబిడ్డ’, ‘గృహప్రవేశం’ వంటి చిత్రాలకు రచన చేశాడు. ‘లక్ష్మమ్మ’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎంతో ప్రతిభ ఉన్నవాడైనప్పటికీ మద్రాసులో నిలదొక్కుకోలేక, ఆర్థికంగా చితికిపోయిన దశలో పాండిచ్చేరి అరవిందాశ్రమం ఒడిలో వాలిపోయాడు. అరవిందుని దర్శనాన్ని  విశ్వసించాడు. కొడుకు సాయిచంద్ ఆరోగ్యం బాగాలేనప్పుడు, సాయిబాబాను కూడా నమ్ముకున్నాడు. సామాన్యమానవులు అందుకోలేని కొన్ని స్థాయుల్ని మహర్షులు అందుకోగలిగారనీ, అందువల్ల వారిని ప్రశ్నించకుండా అంగీకరించాలనీ రాశాడు.  ‘ఎక్కడో ఒకచోట ఈ ఎందుకు? ఆగవలసిందేరా తండ్రుల్లారా’ అని సీతారామారావు వ్యాఖ్యానించినట్టుగా... ‘ఎందుకు? అన్న ప్రశ్న నేర్పిన’ నాన్న నుంచి పూర్తిగా ‘విముక్తుడయ్యాడు’.

 గోపీచంద్ జీవితం, ఆ లెక్కన ఏ సాధారణ మానవుడి జీవితం కూడా ఈ ‘భ్రమణానికి’ మినహాయింపు కాదేమో! పిల్లాడిగా తండ్రినీ, ఇంకా ఆ వయసులో బలమైన ముద్రవేయగలిగేవారినీ అనుకరించి, అనుసరించి... యౌవనంలో ప్రశ్నను ఆయుధంగా మలుచుకుని, నిర్లక్ష్యం చేస్తున్న ప్రపంచాన్ని తమ మాటలతో ఆకర్షించి... చిట్టచివరకు, అంతకుముందు భిన్నంగా నడిచిన పిల్లపాయ నుంచి తప్పుకుని ప్రధాన స్రవంతిలో ఏకమైపోవడంతో జీవితం పూర్తవుతుంది! కాకపోతే, అప్పటికి ‘ప్రగతిశీలం’గా కనబడే విలువల్లోంచే ఎవరినైనా అంచనా కడతాం కాబట్టి, గోపీచంద్ మీద ‘తాత్విక గందరగోళం’గా ముద్రవేయడానికి వీలుపడుతోంది.

 థియరీని ప్రాక్టికల్‌గానూ అన్వయించుకోవడంలో విఫలమైతే ఏ వాదానికైనా అర్థంలేదు. అందుకే తను రాసిన వాటిని తనే ధిక్కరించుకునే అవసరం గోపీచంద్‌కు వచ్చిందేమో! మానవ స్వభావపు పరిధిలోనే ఆయన రచనాక్రమం సాగిందేమో! చిట్టచివరికి ఆయన తన అసలు స్వభావానికి చేరుకున్నాడేమో! కాకపోతే ఒక కన్ఫెషనల్ స్టేట్‌మెంట్ ఏమైనా పాఠకులకు బాకీ ఉండిందేమో! 1962లో 52 ఏళ్లకే ఆయన అర్ధాంతరంగా మరణించివుండకపోతే ఆ బాకీ కూడా చెల్లిపోవునేమో! లేదా, ఆయన తిరిగిన ప్రతిమలుపూ అలా చేసిన ప్రకటనేనేమో!

(సెప్టెంబర్ 8న రచయిత త్రిపురనేని గోపీచంద్ జయంతి)

ఫన్డే-సాక్షి September 07, 2014