ఈయన్నేనా పొద్దున ఎంత అందగాడనుకుంది!
ఆయన వేరే. ఈయన వేరే.
అందం నవ్వుమొహంలో ఉందని నాకు మరోసారి రుజువవుతుంది.
జీతం ఎక్కువని ఈమధ్యే ఆఫీసు మారాడు. పొద్దున తొమ్మిదింటికి వెళ్తే పునర్దర్శనం రాత్రి పదింటికి. నా అదృష్టం బాగుంటే తొమ్మిదీ ముప్పావుకి.
రాగానే మంచం మీద వాలిపోతాడు.
కాసేపు ఆర్టీసీని తిడతాడు, ఇంకాసేపు పొల్యూషన్ అంటాడు. మొత్తంగా ఈరోజు మూడ్ బాగోలేదని నాకు పరోక్షంగా చెప్పేస్తాడు.
నీకు మూడ్ బాగాలేదు, సరే. నీకు బాగాలేదంటే నాకూ బాగుండదే! అది తనకు తెలియదు.
తను ముడుచుకుని పడుకుంటే రిలాక్స్ అవుతాడు. ముసుగులు లేకుండా మాట్లాడితే నేను సేదతీరతాను. కానీ ఉలుకూ ఉండదు, పలుకూ ఉండదు.
బలవంతంగా లేపి, స్నానం చేయమని పోరుపెడితే తానాలాడతాడు.
కొంచెం హుషారు.
కలిపి ముద్దపెడితే మరికొంచెం హుషారు.
ఆ... గురుడు మెల్లగా ట్రాక్ లోకి వస్తున్నాడు.
రొమాంటిగ్గా చిలకలు చుట్టిద్దామనుకుంటానా...
అప్పటికి ఆయన గొంతు పెగులుతుంది.
"ఛీ ఈ ఉద్యోగం చేయడం కంటే పాన్ షాపు నడుపుకున్నది నయం"
అయిపోయింది, ట్రాక్ తప్పుతున్నాడు.
"ఏం మనుషులున్నారీ లోకంలో, ఒక్కడికీ సివిక్ సెన్స్ లేదు"
బస్సులో ఎవడో కాలు తొక్కి ఉంటాడు. లేదంటే ఫుట్ బోర్డు మీద అడ్డంగా నిల్చుని ఉంటాడు.
నెమ్మదిగా దువ్వుకున్నదంతా పోతుంది. కథ మొదటికొస్తుంది.
ముడుచుకుని పడుకోవడమా? మూణ్నిమిషాల్లో ముద్దూముచ్చట కానిచ్చేయడమా?
ఏదో ఒక ఆప్షన్ నన్ను టిక్కు పెట్టుకోమన్నట్టుగా ఉంటుందాయన ప్రవర్తన.
నాకేదీ వద్దు. నాకేదీ వద్దు.
మాట్లాడు బాబూ. కాసేపైనా మాట్లాడు.
ఇన్ని గంటలు నేను ఏం చేసివుంటాను?
నువ్వు ఆఫీసుకు పోయాక, ఎలా గడిపివుంటాను?
ఇంత పెద్ద ఇంట్లో (ఇది బడాయిలే) ఉండేది నేనొక్కదాన్నే కదా. నాకు ఎలా పొద్దు పోయి ఉంటుంది?
మందారపువ్వు బొమ్మ గీశానా?
మా ఊరి వంట చూసి కొత్త వంటకం ప్రయత్నించానా?
ఎఫ్ఎంలో హ్యాపీడేస్ పాట విన్నానా?
కల్యానితో కబుర్లు చెప్పానా?
పక్కింటి ఆంటీతో కూరగాయలు కొనడానికి వెళ్లానా?
తొంభై ఏళ్ల ఓనరమ్మకు తలంటి పుణ్యం మూటకట్టుకున్నానా?
ఏదైనా అడుగు. ఏం చేశావని అడుగు.
మాట్లాడితే, రోజూ ఇవే కదా అంటావు.
రోజూ ఇదే అన్నం. తినడంలో మజా వేరే. నువ్వే గుర్తించట్లేదు.
నువ్వు నాకు రోజూ ఎంత కొత్తగా ఉంటావో నీకు తెలుసా?
అసలు నీకు ప్రశంసించడం తెలియదు. మెచ్చుకుంటే నాకు ఎంత బాగుంటుందో తెలియదు.
"ఏం చెబుతాను, నీ బొంద?" అంటావు.
ఎన్ని చెప్పొచ్చు. ఇవ్వాళ ఆఫీసులో ఏం జరిగిందో చెప్పరాదా?
చిక్కుడుకాయ కూర బాగుందని చెప్పరాదా?
నిన్నటికంటే ఇంకా బాగున్నానని చెప్పరాదా?
ఏదో ఒకటి చెప్పు. కానీ చెప్పు.
-సింధు
(రచనాకాలం: 2008)
(బెడ్ టైమ్ స్టోరీగా ఫన్డే తొట్ట తొలి సంచికలోప్రచురణ)
(శీర్షికను ప్రారంభించడానికి నేనే నాలుగువారాలు మారుపేరుతో రాశాన్లే)
(బెడ్ టైమ్ స్టోరీగా ఫన్డే తొట్ట తొలి సంచికలోప్రచురణ)
(శీర్షికను ప్రారంభించడానికి నేనే నాలుగువారాలు మారుపేరుతో రాశాన్లే)




0 comments:
Post a Comment