ఎన్నిసార్లు అడిగాను. ఒక్కటి. ఒక్కటంటే ఒక్కటి.
"ఫోన్ల కాలంలో నీకీ ఉత్తరాల పిచ్చి ఎందుకన్నావ్?"
నాకు బాగా గుర్తుంది.
పోనీ పిచ్చే అనుకో. ఒక్కసారైనా నా కోరిక మన్నించొచ్చుగా. నీ అక్షరాలతో నాకు అభిషేకం చేయొచ్చుగా.
మంచం ఎక్కాక, నువ్వు నా కళ్లలోకి చూస్తూ, ఆ లేఖ చదివితే ఎంత బాగుంటుంది! ఎన్ని మంచి మంచి ఊహలొస్తాయ్.
నాకు తెలుసు... నీ రాత బాగోదు, పుస్తకాలు చదవ్వు, సూర్యోదయం చూడవు. నీలాంటివాడు కవిత్వం రాయడం...
అయినా నువ్వు ఏం రాసినా నాకు నచ్చుతుంది.
నువ్వు నా గురించి ఆలోచించావు, అక్షరాల్ని కరిగించావు అన్న భావన చాలు, నిన్ను ఏడాది భరించేంత ఓపిక వచ్చేస్తుంది.
కానీ నువ్వు రాయవు. నీకు ఓపిక లేదు. ఊహూ నీకు టేస్టు లేదు.
పోనీ రాసిందైనా చదువుతావా? మంచి మంచి అక్షరాల్ని ఏరి, దోసిళ్లతో తెచ్చి నీ ముందు రాశిగా పోస్తానా?
"ఏంటిదంతా?" అంటావు.
నేను ఎంత చిన్నబుచ్చుకున్నది నువ్వు గమనించావా?
అయినా నీ మీది నా కోపం నీటిబుడగ. ఇట్టే చిట్లిపోతుంది. నీ విసుగు అంతా ఆఫీసులోంచి తెచ్చిందని అర్థమవుతుంది.
సుధా! మనకు అవసరం లేనివాటికి అప్పుపెట్టకు.
వింటున్నావా?
సరే, ఉత్తరాల గొడవ వదిలేద్దాం.
నువ్వు ఆఫీసు పనిమీద నాలుగు, నాలుగు రోజులు ఊర్లు తిరిగినప్పుడు,
నువ్వు లేకుండా నేను తొంభై ఆరు గంటలు ఉండాల్సి వచ్చినప్పుడు,
ఒక్క ఎస్ ఎం ఎస్... రెండే రెండు లైన్లు...
నా మీద రాసి పంపొచ్చుగా.
మంచం మీద బోర్లా పడుకుని, నీ అక్షరాల్లో నిన్ను చూసుకోనా. నా ఒంటరితనాన్ని మరిచిపోనా.
నీకు తెలుసా?
ఇవ్వాళ నన్ను రూమీ పూనాడు.
ఈ చందమామ, వెన్నెల, పిల్లతెమ్మెర, మల్లెపూల వాసన... నువ్వు నా పక్కన లేకపోతే వీటిలో దేనికీ విలువలేదు. నువ్వు ఉంటే వీటితో నాకు పనిలేదు.
బాగుంటుందా?
ఇలా మాట్లాడితే నీకు నచ్చదు కదా!
"ఆ రూమీ ఎవడు?" అంటావ్.
మహానుభావా! జలాలుద్దీన్ రూమీ. పారసీ భాషలో ఎంత అందంగా సూఫీ కవిత్వం చెప్పాడనుకున్నావ్!
"అబ్బా నువ్వెప్పుడు పారసీ భాష నేర్చుకున్నావే" కచ్చితంగా నువ్విలాగే వెటకారం చేస్తావు.
ఏం తెలుగులో నేను చదివి ఉండకూడదా?
నీకు సున్నితత్వం లేదు. మంచంలో మల్లెపూల అవసరం తెలీదు. మాటల్లో ఎంత మత్తుంటుందో తెలీదు. రాత్రిని ఇంకెంత మధురంగా మలుచుకోవచ్చో ఆలోచించవు. కనీసం ఊహల్లోకి కూడా రానీయవు.
సుధా! జీతం సంపాదించడం కాదురా, జీవించడం నేర్చుకో.
బీ రొమాంటిక్. కొంచెం పొయెటిగ్గా ఉండు. ప్లీజ్...
-నీలిమ
(ఫన్డే రెండో సంచికలో ప్రచురితం. రచనాకాలం ఏప్రిల్ 6, 2008)
(రెండో వారంతో బెడ్ టైమ్ స్టోరీలో ఉన్న బెడ్ అనే మాట వల్ల ఆ శీర్షిక ముచ్చటైన ఆశగా మరిపోయింది)
(రెండో వారంతో బెడ్ టైమ్ స్టోరీలో ఉన్న బెడ్ అనే మాట వల్ల ఆ శీర్షిక ముచ్చటైన ఆశగా మరిపోయింది)




2 comments:
అద్భుతం! నీ అక్షరాలతో నాకు అభిషేకం చేయొచ్చుగా. బాగుందండీ ఈ భావన బాగా నచ్చింది నాకు!
థాంక్యూ అండీ.
Post a Comment