Pages

నేను ఈ ప్రపంచాన్ని రెండు రకాలుగా విభజిస్తున్నా. నాలా ఉండగలిగేవాళ్లు, నాలా ఉండలేనివాళ్లు.

Tuesday 8 November 2011

పద్దూ, అంత విసుగొద్దు!

విసుగు అంటేనే నాకు విసుగు.
మనిషిలోని అన్ని చెడ్డగుణాలను రాశిగా పోసి, బరువు గనక తూచగలిగితే విసుగుతో ఏవీ సరిపోవు.
అంత చెడ్డగుణం ఇది. పైగా పోలీసుల దెబ్బల్లా(అనుభవంతో చెప్పట్లేదు, అందరూ అంటారు కదాని వాడాను) ఇది బయటకు కనబడదు. కానీ బాధిస్తుంది, వేధిస్తుంది, మనల్ని మనం అసహ్యించుకునేట్టు చేస్తుంది, జీవిత మీది మమకారం తగ్గించేస్తుంది. అంత పవర్ ఫుల్ ఈవిల్.
ఇంత చిన్న విషయం నా భార్యకు అర్థం కావట్లేదు. అందుకే ఇలా రచ్చకెక్కాల్సి వస్తోంది.
నేను ఆఫీసులో ఉంటాను. తను ఫోన్ చేస్తుంది.
"ఈరోజు తొందరగా ఇంటికొస్తావా?" ప్రశ్నలో ఆహ్వానం.
"ఊ చూస్తా"
"ఈరోజు కూడా లేటేనా?"
"పని కొంచెం ఎక్కువుంది"
"అబ్బో నువ్వే చేస్తున్నావు"
ఫోన్ ఆఫ్ అవుతుంది. నా మూడ్ కూడా.
****************

ఇంటికి వెళ్లేసరికి తాను తినేసి నాకోసం ఎదురుచూస్తుంటుంది. నాకోసం ఆగొద్దు, తినేయమని నేనే చెబుతుంటాను. తను ఆకలికి ఆగదు, పైగా ఖాళీగా ఉంచితే నాకు గోరుముద్దలు పెడుతుందన్న ఆశ.
"త్వరగా స్నానం చేసి రా. అన్నం వడ్డిస్తా" నా ఆకలి తెలసిన అమ్మలా కనబడుతుంది ఆ క్షణం.
వేడి ఒంటిని నీటితో చల్లబరుచుకుని వచ్చి కూర్చుంటాను.
"ఇంకాస్త కూర వేయనా?"
"చాలు"
"చిక్కగా కలుపుకోవడం నీకు ఇష్టం కదా"
"చాల్లేవే"
నేను మెతుకు మెతుకునూ రుచి చూసుకుంటూ తింటుంటాను.
"కానీ... గిన్నెలు సర్దాలి" తూటాల్లా వస్తాయి మాటలు.
ఏ సినిమా దర్శకుడైనా ఈ దృశ్యాన్ని తెరకెక్కిస్తే, కట్టెను రెండుగా చీల్చుతున్న రంపాన్ని చూపిస్తాడేమో!
****************

ఇవన్నీ చాలా క్యాజువల్గా అంటుంది. నన్ను టార్చర్ చేయాలన్నంత పెద్ద లక్ష్యేమేమీ ఉండదు. జస్ట్ అలా అనేస్తుంది. ఎలా అన్నా పడేది నేనుగా.
ఇవన్నీ బెడ్రూములో ప్రభావం చూపిస్తాయని తనకు అర్థం కాదు.
మళ్లీ నేను ముడుచుకుపోతే, ఎందుకలావున్నావని అడుగుతుంది. తనవల్ల తప్పేమైనా జరిగిందా అని బాధపడుతుంది.
ఏం చెప్పను? "ఊ" అన్న ఒకటిన్నర అక్షరం, బాణమై నా గుండెల్ని చీల్చుతుంది. తన స్వభావమే అంతా, నా మీద ఇష్టంలేదా అని ఒక్కోసారి గందరగోళంలో పడతాను.
కానీ నా మీద చూపించే శ్రద్ధను గమనిస్తే నా చిక్కుముడులు విడిపోతాయి.
మళ్లీ అంతా బాగుందనుకున్నప్పుడు-
తను నాకు నిన్నటిరోజుకంటే మరింత బాగా కనిపించినప్పుడు-
రెండు తనువుల పెనవేత, శ్వాసల కలబోత... ఇంకేవేవో అందమైన ఊహలు నా మదిలో నాటుకుంటున్నప్పుడు-
ఉన్నపళంగా, అసందర్భంగా, అనవసరంగా ఏదో ఒక్క మాట అంటుంది. అందులో కంపరమెత్తే విసుగు ధ్వనిస్తుంది. శరీరాన్ని తూట్లుతూట్లుగా పొడిచేంతటి విసుగు...
నేను కుప్పకూలిపోతాను.

మై డియర్ పద్దూ!
ఎన్ని విషయాల్లో నాకంటే బాగా ఆలోచించే నువ్వు ఈ ఒక్కటి ఎందుకు తెలుసుకోలేకపోతున్నావ్.
నీ సుగుణాలన్నింటినీ ఈ విసుగు ఒక్కటి కప్పేస్తుంది. నీ అందమైన ముఖాన్ని కళాహీనం చేస్తుంది. నీ దగ్గరికి రావాలంటేనే ఏదోలా అనిపిస్తుంది.
పద్దూ, కొంచెం సహనం... కొంచెమే అలవర్చుకో.
నిన్ను వీపున మోసుకుంటూ ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతా.

-వేణు

నోట్: ఊ పక్కన అరసున్నా ఎలా కొట్టాలో నాకు తెలియలేదు.

10 comments:

మందాకిని said...

రాజిరెడ్డిగారు,
మంచి పాయింట్ హైలైట్ చేస్తూ రాశారు. చెప్పాలనుకున్నది ఖచ్చితంగాను, అర్థమయ్యేలా నూ చెప్పారు.
టార్చర్ చేస్తున్నామని తెలీకుండా చేసేస్తుంటారు కొందరు. అభినందనలు మీకు.

Anonymous said...

బాగ రాసారు.చదివిన ప్రతీ మనిషి ఇది తన అనుభవమె అనుకునెలా ఉంది. అబినందనలు.

పంతుల జోగారావు said...

చాలా బాగా చెప్పారు. లభినందనలు. కావాలని కాక పోయినా, చాలా కాజువల్ గా మన జీవితాలను మనమే ఎంత రస హీనంగా చేసుకుంటూ ఉంటామో అనిపిస్తుంది. కారణాలేమీ ఉండ నక్కర లేదు. ప్రవర్తనా ధోరని, మాటతీరు కొంచెం మార్చుకుంటే చాలును.

జీవితం ఒక నందన వనమే.

prabandhchowdary.pudota said...

manchi point andi.

కొత్త పాళీ said...

beautiful

కొత్త పాళీ said...

BTw, read your "rendadugula nela" recently in palapitta special issue. Liked it very much.

రసజ్ఞ said...

చాలా చక్కగా వ్రాశారండీ! కొంతమంది మాట తీరే అంత కావాలని కాకపోయినా అలానే విసురుగా కటువుగా వస్తుంది!

Poodoori Raji Reddy said...

@మందాకిని, అజ్ఞాత, పంతుల జోగారావు, ప్రబంధ్, రసజ్ఞ:
థాంక్యూ వెరీ మచ్ అండీ.

@కొత్తపాళీ:
అలాగా! థాంక్యూ సర్.

Vinay Reddy said...

చాలా మంచి విశ్లేసన రాజీ రెడ్డి గారు

Poodoori Raji Reddy said...

వినయ్ గారు, థాంక్యూ!

Post a Comment

Get Flower Effect