Pages

నేను ఈ ప్రపంచాన్ని రెండు రకాలుగా విభజిస్తున్నా. నాలా ఉండగలిగేవాళ్లు, నాలా ఉండలేనివాళ్లు.

Friday 11 November 2011

చిత్రవధ చేయకే చిత్రా!

నాలుగ్గోడల మధ్య జరిగేది శృంగారమని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. దాన్ని నలుగురితో పంచుకోవడమేమిటని నాకు నేనే అనుకుంటాను. అలాంటి విషయాలన్నా అవి రాసేవాళ్లన్నా నాకు చిరాకు.
మొదటిసారి నా నియమం నేనే ఉల్లంఘిస్తున్నా.
దీనికి నన్ను నేను క్షమించుకుంటానో లేదో తెలియదు. చిత్ర సంగతి అసలే చెప్పలేను.
చిత్ర... నా అందమైన భార్య.
నేను ఏరి కోరి నాకు నూటికి నూరుపాళ్లు సరితూగగల భాగస్వామి అని మనస్ఫూర్తిగా వలచిన దేవేరి.
"ఈ రెండు కళ్లు ఎందుకిచ్చావ్? ఇవ్వకపోయినా బాగుండేది. లేకపోతే ఓ పదయినా ఇవ్వకపోయావా?'
అని గాలిబ్ తన ప్రేయసి గురించి అడిగినట్టు, నేనూ దేవుణ్ని నిలదీశాను నీకోసం"
తనకు నేను ఇచ్చిన మొదటిలేఖలో ఇలాగే రాశాను.
ఆమెను చూడడానికి పది కళ్లేం ఖర్మ, పదివందల నయనాలూ చాలవు.
తాను వలచింది రంభ అని ఎవరైనా అనుకున్నా సరే. తను బావుంటుంది, కనీసం నా కళ్లకు.
రాత్రుళ్లు ఎంత చిత్రవధ చేసిందో చెప్పలేను. తనను చూసినప్పుడల్లా నేను ఎన్నిసార్లు చిత్తరువునైనానో లెక్కలేదు.
ఊహించినట్టే (అలా జరగాలనేం కోరుకోకపోయినా) మొదటి ఉత్తరానికి మందలింపులు తప్పలేదు.
నేను ఆశించినంత (అసలు ఆశించలేదనుకోండి) తీవ్రంగా అవి లేకపోయేసరికి నాకు సానుకూలంగానే అనిపించింది.
అదే నన్ను మరో ఒకట్రెండు లేఖలు ఇవ్వడానికి సాహసించేలా పురిగొల్పింది.
"ఒక్కసారి వీలైతే నా వాకిట్లోకి రా. అంత ఇష్టం లేకపోతే కనీసం నా కలలోకి. నీ వేడి నిట్టూర్పులకు నా కోరిక పర్వతం కరిగిపోతుంది"...
చిత్రం... ఈ లేఖ తర్వాతే మాకు పెళ్లయింది.

"అమ్మాయిలు మన పక్కనుంటేనే ఈజ్. మెడుకు కట్టుకుని కాంప్లికేట్ చేసుకోవద్దు" అని ఓ ప్రియమిత్రుడు సలహా ఇచ్చినట్టు గుర్తు, పెళ్లికి ముందు.
ప్రేమకు పెళ్లి మాత్రమే పరమార్థం అని బలంగా నమ్మిన రోజులవి. అంతకంటే లాజికల్ ఎండ్ వేరే ఏముంటుంది?
ఇప్పటికీ నా విశ్వాసం అదే.
సమస్య పెళ్లి కాదు, పెళ్లి తర్వాత వచ్చే ఇతరత్రా సౌఖ్యాలు కాదు. నేను పూర్తిగా హేపీ.
ప్రాబ్లెమ్ శృంగారం.
తనను సున్నితంగా ట్యూన్ చేసి, చెవుల్లో ఊపిరులూది, అణువుల్లో కంపనాలు నింపి, నేను చందమామకు నిచ్చెన వేస్తుంటానా...
"ఇంకెంతసేపు?"
తనలో విసుగు.
ఒకే ఒక్క మాట. శూలమై గుచ్చుతుంది. నా అడుగులు తడబడతాయి. నిచ్చెన ఒరిగిపోతుంది. నేను అమాంతం లోయలోకి పడిపోతాను.
అవుట్!
తెల్లవారుతుంది. మళ్లీ తెల్లవారుతుంది. మళ్లీ మళ్లీ తెల్లవారుతుంటుంది.
నా చిత్ర ఇంకా అందంగా కనిపిస్తుంది. నన్ను ఆహ్వానించినట్టే కనబడుతుంటుంది.
ఆమె సౌందర్యానికి నేను మోకరిల్లుతాను.
నన్ను తన హృదయ సామ్రాజ్యంలోకి లాక్కెళ్తుంది. శరీరవనంలో ఎక్కడో అగ్గిపుల్ల వెలిగిస్తుంది. కార్చిచ్చు రగులుకుంటుంది.
మంటలు... మంటలు...
"ఛీ ఛీ"
గుమ్మరిస్తుంది నీళ్లు.
క్లీన్ బౌల్డ్!
నువ్వు నా పక్కనుంటే చాలంటుంది. పక్క మాత్రం వద్దంటుంది. ఇదేం గొడవ?
"చిత్ర"మైన సమస్య.
నేను ఇష్టం లేదనదు. నేను ఏదన్నా కాదనదు. ఇక్కడే... ఈ ఒక్క దగ్గరే...
మొదటి రెండు మూడు అధ్యాయాల తర్వాతే...
"స్టాప్" గేట్ వేస్తుంది.
ఆ వారం రోజులు మాత్రమే గేటు తీస్తుంది. అది తన స్వార్థం. తల్లిని కావాలన్న స్వార్థం.
పిల్లల కోసమే శృంగారం అనుకునే మనుషులు ఈ కాలంలో కూడానా!

-శేఖర్
(ఈ సిరిస్లో ఇది చివరిది)
(ప్రచురణ ఏప్రిల్ ౨౦, 2008)
(ముచ్చటైన ఆశ శీర్షిక ఫన్డేలో సుమారు ఏడాదిపాటు కొనసాగింది)

3 comments:

జ్యోతి said...
This comment has been removed by the author.
పైడి నాయుడు గవిడి said...

చాలా బాగుంది. చివర్లో సంతానం కోసమే శృంగారం అన్నారు.సంతానం కోసం మాత్రమే శృంగారం చేస్తే అది బ్రహ్మ చర్యమే అని ఎక్కడో చదివినట్టు గుర్తు. నాలుగ్గోడల మధ్య జరిగేది శృంగారమని చెప్పారు ఓకే .
శృంగారానికి,కామానికి,క్రోదానికి అర్ధమేమిటో తెలుపగలరు.

Poodoori Raji Reddy said...

@ పైడినాయుడు:
ఆ తేడాలు నేనేం చెప్పగలనండీ!
క్రోధాన్ని ఇందులో ఎందుకు కలిపారు?

Post a Comment

Get Flower Effect