మామూలు సందర్భంలో అయితే వాళ్ల కళ్ల పడకుండా, వాళ్లను దాటుకుని వెళ్తే చాలనిపించేది. వాళ్లు ఏదో చేస్తారనికాదుగానీ, ఒక లాంటి చిన్న భయం. వేరే ఒక స్త్రీతోనో, పురుషుడితోనో సంభాషించేప్పుడు మనం ఎలాగైతే అతి మామూలుగా ఉండగలిగే ఒక స్థితిలో ఉంటామో, వీళ్లతో ఉండలేమనిపిస్తుంది. అందుకే వాళ్లను ఎదుర్కోవడం కొంత ఇబ్బంది. "రియాలిటీ చెక్' కోసం నా ఇబ్బందిని పక్కనపెట్టి, వాళ్ల ఇబ్బందులేమిటో తెలుసుకోవడానికి బయలుదేరాను.
ఇంతకీ ఈ 'వీళ్లు' ఎవరు?
కొజ్జాలు, హిజ్డాలు, పాయింట్ ఫైవ్ గాళ్లు, చెక్కాగాళ్లు అని సమాజం తనకు ఇష్టమైన పేరు పెట్టుకుని వాళ్ల మీద తన అయిష్టాన్ని ప్రదర్శించినా... తమ మానాన తమ బతుకు సాగిస్తున్నవాళ్లు.
మరి వీళ్లు నాకు ఎక్కడ దొరకాలి?
సికింద్రాబాద్ ప్యాట్నీలో వాళ్లు తిరగడం గతంలో చూశాను. రైల్వే స్టేషన్ దగ్గర ఉంటారని ఒకరన్నారు. రేతిఫైల్ (ఇది రతిఫైల్ కాదట. ఇరవై ఏళ్లుగా నేను రతిఫైల్ అనే అనుకుంటున్నాను) బస్టాండులో దొరుకుతారని మరొకరు చెప్పారు. వీళ్ల మీద వర్క్ చేసినవాళ్లున్నారని సిటీ రిపోర్టర్ సమాచారం. ఆర్గనైజ్డ్గా కాకుండా 'జస్ట్ లైక్ దట్' వెళ్తే ఇంకా బాగుంటుందనిపించింది. అందుకే రైల్వేస్టేషన్ నుంచి రేతిఫైల్ మీదుగా ఉప్పల్ బస్టాండ్ దగ్గర మలుపు తిరిగి, తిరిగేముందు ఒక బ్లూసీ చాయ్ తాగి, మళ్లీ ఒక హాఫ్ రౌండ్ పూర్తయ్యాక-
మగవాళ్లు, ఆడవాళ్లు, కుంటివాళ్లు, గుడ్డివాళ్లు, పశువులు(నిజమైనవే)... హడావుడిగా తిరుగుతున్న ఈ జనారణ్యంలో వాళ్లను పట్టుకోవడం ఎలా? ఎవరిని అడిగితే బాగుంటుంది?
కొన్ని ముఖాల ఈద 'ఇంటూ మార్కు' పెట్టాక, ఒక 45 ఏళ్ల ఆట్రోడ్రైవర్ను అడిగాను. పేరు చంద్రయ్య.
'అన్నా, ఈడ... హిజ్డాలంటరుగదా... వాళ్లు ఎప్పుడన్న కనబడ్డరా?'
'రాత్రి పది, పన్నెండింటికి రా... బొచ్చెడు మంది దొరుకుతరు'. అప్పుడు మధ్యాహ్నం మూడు దాటింది.
"రాత్రి ఒచ్చి ఏం జేస్తరు?'
"ఎంజాయ్ జేపిస్తరు'. ఆయనే మళ్లీ చెప్పాడు. "ఒక్కొక్కతి ఏం తయారైతది, ఏ ఆడిది వనికిరాదు'.
లైంగిక కార్యానికి సంబంధించిన నా అజ్ఞానపూరిత ప్రశ్నక్కూడా ఆయన సమాధానమిచ్చాడు: "ఎనుక కేలి జేస్తరు".
అయితే, చంద్రయ్య అన్నట్టు రాత్రిదాకా వెయిట్ చేయనక్కర్లేకుండానే, నాకు కొందరు తారసపడ్డారు. మామూలు మనుషులతో మాట్లాడ్డానికే వందసార్లు ఆలోచించే నేను, వాళ్లతో ఎలా సంభాషించగలిగానో నాకే తెలియదు. ఔరా! నాకూ కొంచెం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి!
నన్ను నేను పరిచయం చేసుకున్నాక, నా ఐడెంటిటీ కార్డు చూశాక, కొంత నమ్మకం కుదిరాక, ఒకరిద్దరు నాతో మాట్లాడారు.
'సాధారణంగా అబ్బాయిలు పుస్తకాల్ని భుజం మీద పెట్టుకుని నడుస్తారు కదండీ! నాకు మాత్రం ఇలా సైడుకు పొదివి పట్టుకుని స్కూలుకు వెళ్లాలనిపించేది' అని తన గురించి చెప్పడం ప్రారంభించాడు అశోక్.
ఇతడిది గుంటూరు జిల్లాలోని ఒక పల్లెటూరు. ఇప్పటి పేరు అంజలి. వయసు 32. ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. వ్యవసాయ కుటుంబం. టెన్తు వరకు చదివాడు. "ఆడంగి చేష్టలు" చూసి నాన్న అలా చేయొద్దని కొట్టేవాడట. అయినా అవి తగ్గకపోగా విపరీతంగా పెరిగిపోయాయట. ఓణీలు వేసుకోవాలనీ, బ్రాసరీలు ధరించాలనీ, మగవాళ్లకు దగ్గరవ్వాలనీ అనిపించేదట. ఒకరోజు అమ్మానాన్నాట ఆడుతుంటే దొరికిపోయాడట(ఇతడు అమ్మ). "నువ్వు ఇక్కడుంటే మా పరువు పోతుందని ఒకరోజు నాన్న విపరీతంగా కొట్టాడు. అందుకని ఇల్లొదిలి పారిపోయి వచ్చేశాను'.
పారిపోయి వచ్చినప్పుడు అతడికి పదహారేళ్లు. పదిహేనేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాడు. తనలాంటివాళ్లు బాలానగర్, మియాపూర్, బంజారాహిల్స్, చందానగర్, మారేడ్ పల్లి... ఇలా చాలా చోట్ల ఉన్నారట.
అప్పుడప్పుడూ అమ్మానాన్న గుర్తొస్తారట. కానీ వెళ్లనంటాడు. "ఇప్పడు ఇదే నా లంగా కిందిది" అంటూ ఒకతణ్ని చూపించాడు.
"అంటే?"
"నాకు పుట్టిందని"
అంటే వాళ్లలో వాళ్లు అమ్మా, కూతురుగా వరసలు కలుపుకున్నారు. ఇలా అక్కాచెల్లిగానో, భార్యభర్తగానో వరసలు కలుపుకున్నప్పుడు వాళ్లలో వాళ్లు చిన్నపాటి ఫంక్షన్ కూడా చేసుకుంటారు.
ఆ కూతురు 'త్రిష'కు 24 ఏళ్లు. ఆదిలాబాద్ జిల్లా. డిగ్రీ డిస్కంటిన్యూ. ఒకతణ్ని పెళ్లి కూడా చేసుకున్నాడట. అంటే నిజంగానే తాళి కట్టించుకున్నాడట. మూడేళ్లు కాపురం చేశారట. అయితే అతడు ట్యూమర్తో చనిపోయాడు('నా కూతురు ముండమోసింది'!) బ్యాగులోంచి అతడి ఫొటో తీసి చూపించాడు. "బాగున్నాడు" అన్నాను. అతడు నిజంగా కూడా అందంగా ఉన్నాడు. 'బా..గు..న్నా..డు.. నీలాగే" అన్నాడు పక్కనున్న సీత నా బుగ్గగిల్లుతూ. కొంత భయమేసిన మాట నిజం.
ఆ ఫొటోకు త్రిష రోజూ అగరుబత్తులు ముట్టిస్తాడట. పూల మాల వేస్తాడట('ఇది పెద్ద పతివ్రత'). అయితే, ఈ వ్యవహారాలేవీ ఇంట్లోవాళ్లకు తెలియదట. ఊరికి వెళ్లినప్పుడు ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా మామూలు మగవాడిలా ఉండటానికి ప్రయత్నిస్తాడట. 'అసలు సంగతి చెబితే ఏమవుతుంది?'
"ఇలాంటివి అర్థం చేసుకునేంత ఎడ్యుకేటెడ్ కాదు మావాళ్లు'
ఇక, సీతది వరంగల్ జిల్లా. 23 ఏళ్లు. తను కవల సోదరుడు. ఇంకో అబ్బాయి మామూలు మగవాడిగానే ఉన్నాడట. ఇతడు మాత్రం వేములవాడ రాజేశ్వరస్వామిని భర్తగా స్వీకరించి, శివసత్తి అయ్యాడట. అంటే కత్తికీ, తనకూ పెళ్లి చేశారు. ప్రతీ శ్రీరామనవమికి వేములవాడ తప్పనిసరిగా వెళ్లివస్తాడు. కొమురవెల్లికి కూడా వెళ్తుంటాడు. అంజలి, త్రిషలాగే తను కూడా సెక్స్ వర్కర్గా చేస్తాడు. అప్పుడప్పుడూ భిక్షాటన చేస్తాడు. అయితే కండోమ్ వాడేలా జాగ్రత్త తీసుకుంటారట. 'కమ్యూనిటీ' వాళ్లకు పెద్ద వేడుక 'కూవగం ఫెస్టివల్'. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో జరుగుతుంది. వీళ్లందరూ పోయినేడాది వెళ్లొచ్చారట. అయితే కొన్ని ప్రశ్నలను వాళ్లకు వేయలేకపోయాను. మరీ జననాంగాల గురించి ఎలా అడిగేది?
అందుకే ఒక ఎన్జీఓ ప్రతినిధి చేసిన ఏర్పాటు ద్వారా మరో విడత సంభాషణ జరిపాను. ఈ ప్రతినిధి కూడా కమ్యూనిటీలో భాగమే. అతడితో కలిసి ముగ్గురు అబ్బాయిలు. అయితే వాళ్లు కాకుండా ఇంకెవరో మాట్లాడ్డానికి వస్తారని నేను ఎదురుచూస్తున్నాను.
నా అంచనా తప్పు. వీళ్లే వాళ్లు. షాక్!
చీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని, మేకప్ కొట్టుకుని ఉంటారనుకున్న నా ఊహ పటాపంచలైపోయింది. ఇద్దరికి పొడవు జుట్టున్న మాట నిజం. కానీ అది ఫ్యాషన్ అనుకున్నాను. ఒక ఫొటో తీసి చూపిస్తూ, "ఇదిగో ఈ ఎడమపక్కన కడగ్గా ఉన్నది నేను" అన్నాడు అందులోంచి ఒక వ్యక్తి. ఒక్కసారి కళ్లెత్తి ఫొటోలోని స్త్రీకీ, నాతో మాట్లాడుతున్న పురుషుడికీ పోలికలు వెతికాను. ఓర్నాయనో! నిజంగా నిజం.
అతడిది విజయవాడ. వయసు 28. ఒక అక్క, ఒక చెల్లి. నాన్న టీచర్. బీఎస్సీ పూర్తయ్యింది. ఎమ్మెస్సీ బోటనీ చదవాలని కోరిక. పెద్దవాళ్లు పెట్టిన పేరు జగదీశ్. రాధిక అని మరో పేరుంది. "టెన్తు, ఇంటరు దాకా మామూలుగానే ఉన్నానండీ.. డిగ్రీకి వచ్చాక... జనరల్గా ఫీలింగ్సుంటాయి కదా... అమ్మాయిలపట్ల ఏమీ కలిగేవి కాదు. ఒకాయన్ని మాత్రం ఎందుకో చూడాలనిపించేది. రెండు మూడు సార్లు నన్ను గమనించి ఆయన అడిగాడు: "ఏంటీ అలా చూస్తున్నావ్" నాకు భయమేసింది. కానీ అతడు ప్రేమగా మాట్లాడాడు. కాఫీకి తీసుకెళ్లాడు. తర్వాత తన గదికి" తన తొలి అనుభవం గురించి చెప్పడం మొదలుపెట్టాడు జగదీశ్. అమ్మాయిలను కాకుండా అబ్బాయిలను చూస్తేనే తనకు హృదయస్పందన కలిగేదట. కానీ ఏం చేయాలో తెలియదు. సాయంత్రాలు వచ్చి విజయవాడ బెంజ్ సర్కిల్లో నిలబడేవాడు. అక్కడ తనలాంటి భావనలున్న ఇంకో స్నేహితుడు కలిశాడు. ఇద్దరూ మంచి మిత్రులయ్యారు(లైంగికంగా కాదు). అనుకోకుండా ఒకరోజు వాళ్లకో గ్రూపు తారసపడింది. వాళ్లతో ముంబయి వెళ్లారు. అక్కడ 'గురుబాయి'... ఇద్దరినీ కమర్షియల్ సెక్స్ వర్క్ చేసుకొమ్మని దీవించి పంపిందట.
ఎప్పుడో నైజాంల కాలంలో మొదలైన పరంపర ఈ గురుబాయి. అతనూ వీళ్లలాంటి వ్యక్తే. తను నాయకుడిగా ఉంటూ, తన జీవితకాలంలో మరికొందరిని గురుబాయిగా ప్రకటిస్తాడు. వాళ్లు మరి కొందరిని. ఇదో గొలుసు.
"ముంబయిలో ఎంత కాలం ఉన్నారు?'
"రెండేళ్లుండి వచ్చేశాను. అక్కడే హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసింది. చాలా కుమిలిపోయాను'. తర్వాత కౌన్సిలింగ్ తీసుకున్నాడు. కొత్త జీవితం మొదలుపెట్టాడు. ఈ ఎన్జీవోలో ఉద్యోగం చేస్తున్నాడు. "రోజూ ఎక్సర్ సైజ్ చేస్తాను. ఎనభై కిలోల బరువైనా ఎత్తగలను'.
నిజంగానే జగదీశ్ ఆరోగ్యంగా కనిపించాడు. "మరి మీ మిత్రుడు?'
"అతను సెక్స్ మార్పిడి చేసుకున్నాడు. ఫుల్ టైమ్ సెక్స్ వర్కర్గా స్థిరపడ్డాడు. ముంబయిలో డ్యాన్స్ షోలు కూడా చేస్తాడు'
మార్పిడి అంటే పిల్లలు పుట్టేట్టుగా ఏమీ చేయరనీ, అంగాన్ని తీసేసి, యోని ఆకృతి వచ్చేలా చేస్తారనీ చెప్పాడు. దీనివల్ల ఒక లాభం ఏమిటంటే, మామూలు స్త్రీ వ్యభిచారులను కోరుకునే పురుషుడిని కూడా ఆకర్షించవచ్చు. "మీరు చేయించుకోలేదా?"
"ముంబయిలో ఉన్నప్పుడు ఛాతీ పెరిగేందుకు హార్మోన్స్ ఇంజెక్షన్ వేయించుకున్నాను. అయితే నేను ఇలా అని మా వాళ్లకు తెలియదు. అంటే నేను బయటపడలేదు"
"మరి ఇంట్లో ఏం చెబుతారు?"
"ఏం చెప్తాం. ఉద్యోగం చేస్తున్నానని చెప్తాం'
"సాధారణంగా ఒక కస్టమర్ ఎంతిచ్చేవాడు?'
"యాభై, వంద...'
"అవి సరిపోయేవా?'
"ఒక్కోరోజు ఐదారుగురు కూడా తగిలేవాళ్లు'
"మీరు చీరలు, నగలు ధరించరా?"
"ఎప్పుడైనా మాకు మేము దూరంగా వెళ్లి ఫంక్షన్లు చేసుకున్నప్పుడు అలా తయారవుతాను. అక్కడ అక్కా చెక్కా అని సరసాలాడుకుంటాం"
ఆ సమయంలో ముఖం మీద నునుపు తెచ్చుకోవడానికి వేడి వేడి బెల్లంపాకం, వ్యాక్స్ బట్టమీద వేసి బర్రున లాగేస్తారట("ఈ కొజ్జదాని ముఖానికి ఏం చేసినా నునుపు రాదులే" అని ఒకతను ఆట పట్టించాడు)
"కౌన్సిలింగ్ తీసుకుంటే మామూలు అబ్బాయిలా ప్రవర్తించే వీలుందా?"
"ప్రయోజనం ఉండదండీ, అది జన్మతః వచ్చిందికదండీ. కాకపోతే, నాలాంటివాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు, నేనొక్కడినే ఇలా తేడాగా లేను అని తెలిస్తే కొంత భారం దిగిపోతుంది. ఇదొక వాస్తవం అని తల్లిదండ్రులు కూడా గుర్తించాలి'.
ఆట పట్టించినతను సుస్మిత. ఇతనిది కర్నూలు. ఎంబీయే చేశాడు. ఒక కార్పొరేట్ బ్యాంకులో ఇన్సూరెన్సు విభాగంలో పని చేస్తున్నాడు. హాస్టల్లో ఉంటాడు. అయితే లైంగిక వ్యవహారాల జోలికి వెళ్లడు. కేవలం అమ్మాయిల్లా తయారవ్వాలని మాత్రం ఉంటుందట. వీళ్లు కొంత మానసికంగా దగ్గరితనం ఇవ్వగలరు కాబట్టి, అప్పుడప్పుడూ వచ్చి కలుస్తుంటాడు.
"మీరు పెళ్లి చేసుకుంటారా?'
"అన్నయ్య పెళ్లి ఈ మధ్యే అయింది. నన్ను కూడా చేసుకోమంటున్నారు. నాకు ఇష్టం లేదు. తర్వాత, తర్వాత అని వాయిదా వేస్తున్నాను'
"ఒకవేళ బలవంతం చేసి చేస్తే?"
అలా పెళ్లి చేసుకున్న ఒకతని గురించి వాళ్లు చెప్పారు. అతడు కూకుట్పల్లిలో ఉంటాడు. ఒక పిల్లాడు కూడా కలిగాడు. "మరి వాళ్లెలా కాపురం చేయగలరు?'
అంటే వాళ్లక్కూడా మరో మగవాడిని చూస్తే మనసు చలించినప్పుడు అంగస్తంభన జరుగుతుందట. అతడు ఇంకెవరో మగవాణ్ని ఊహించుకుంటూ భార్యతో కాపురం చేస్తూ ఉంటాడట.
"అది అన్యాయం కదా"
"న్యాయం ఎక్కడుందడీ, టీజ్ చేస్తున్నారని పోలీసుల దగ్గరికెళ్తే, 'టీజ్ చేస్తే నీకేమవుద్దిరా... అక్కాయ్ గాడివే కదా అంటారు' అని తమ బాధలు చెప్పడం మొదలుపెట్టారు. జనాలు హేళన చేస్తారనీ, ఛీత్కారంగా రాళ్లు రువ్వుతారనీ, ఎక్కడా అద్దెలకు ఇల్లు ఇవ్వరనీ, బయటికి ఒకలా, అంతర్గతంగా ఒకలా ఉంటున్నందుకు నరకం అనుభవిస్తామనీ, అందరినీ పుట్టించిన భగవంతుడే మమ్మల్నీ ఇలా పుట్టించాడు కదా, మేమేం తప్పు చేశామనీ, మాకు నచ్చినవిధంగా బతికే అవకాశం ఎందుకు లేదనీ, మనలాగా మనం బతక్కపోతే బతికినా చచ్చినా ఒకటే కదాని...
"మీరు కూడా కొన్నిసార్లు ఆ సిగ్నల్స్ దగ్గర దురుసుగా ఉంటుంటారు..." ఈ మాట కొంచెం నెమ్మదిగా అన్నాను.
"వాళ్లలో చాలామంది నిజమైన హిజ్డాలు కాదు. అడుక్కోవడానికి అదొక వేషమంతే'
స్త్రీ వేషధారణలో అడుక్కునేవాళ్లను బైరూపులు అంటారట. వీళ్లలో కొందరికి సాధారణ మగవాడి లైంగికవాంఛలే ఉంటాయట.
వాళ్ల దగ్గర సెలవు తీసుకునేముందు అందరం కలిసి టీ తాగాం. "ట..చ్..లో ఉండండి" అని నొక్కి పలుకుతూ సుస్మిత సరసం ఆడాడు. ప్లీజ్, నన్ను తమ్ముడిలాగా భావించమని చెప్పాను. "తమ్ముడివా, సరే" అని దగ్గరికి తీసుకుని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు.
లైంగికత ప్రాతిపదికన వాళ్లు ఈ సమాజం నుంచి వేరుచేయబడ్డారు కనుక, సంభాషణ ఎక్కువగా దాని మీద జరిగినమాట వాస్తవం. కానీ వాళ్లకూ మానవ సహజమైన ఉద్వేగాలు, ఆకాంక్షలు ఉన్నాయి. అంజలి తమ ఇంటికి ఇక వెళ్లలేనన్నప్పుడు అతడి కళ్లళ్లో నీళ్లు తిరిగాయి. అలాగే జగదీశ్ పత్రికలు బాగా చదువుతాడు. ముఖ్యంగా ట్రావెలాగ్స్ అంటే అతడికి ఇష్టం.
రాత్రంతా నా ఆలోచనలన్నీ వాళ్ల చుట్టూనే తిరుగుతున్నాయి. ఎక్కడో పడిన చిక్కులన్నింటినీ నాకు నేనే విప్పదీసుకునే ప్రయత్నం చేశాను.
పురుషుడిగా పుట్టి, పురుషుడిలా బతుకుతూ స్త్రీ పట్ల నిస్సహాయుడయ్యేవాడు నపుంసకుడు.
స్త్రీ మీది ఆకర్షణను జయించినవాడు యోగి.
పురుషుడిగా ఉంటూ పురుషుడిని కోరుకునేవాడు గే.
పురుషుడిగా పుట్టి స్త్రీలా బతకాలనుకునేవాడు హిజ్డా.
దానికోసం లింగమార్పిడి చేసుకునేవాడు ట్రాన్స్ జెండర్.
అటు స్త్రీ, ఇటు పురుషుడు ఇద్దరిపట్లా ఆకర్షితుడయ్యేవాడు బై-సెక్సువల్.
మనిషి ప్రకృతి ఎంత చిత్రమైంది!
గరుకైన పురుషులుగా పుట్టి, స్త్రీ సౌకుమార్యాన్ని అందుకోవాలన్న వీళ్ల తపనను ఎలా అర్థం చేసుకోవాలి? మళ్లీ విచిత్రంగా ఈ సౌకుమార్య సముపార్జనంతా మరో పురుషుడిని అందుకోవాలనే. అంటే తనలోని తనను అందుకోవాలనేనా!
వేషధారణకే అయినా అమ్మాయిని అబ్బాయిగా మననిచ్చే సమాజం, అబ్బాయిని అమ్మాయిగా ఎందుకు ఉండనివ్వదు? వీళ్లను తనలో భాగంగా ఎందుకు కలుపుకోదు?
చాలా రోజులుగా చదవాలనుకుని, మొన్నే బుక్ ఫెయిర్లో కొనుక్కొచ్చుకున్న 'అంటరాని వసంతం' గుర్తొచ్చి, ఏదో స్ట్రయిక్ అయినట్టయింది. వీళ్లు కూడా తమ "అంటరానితనాన్ని" కడుక్కునే క్రమంలో కొత్త పోరాటాలు చేస్తారా! అందుకు, ప్రధాన స్రవంతి సమాజపు మద్దతు కూడగట్టగలుగుతారా!
(వాళ్లు తమ పేర్లు గోప్యంగా ఉంచమన్నందువల్ల పేర్లు మార్చి రాయడం జరిగింది.)
(ఫన్డేలో 15-1-2012న అచ్చయినప్పుడు ఎడిట్ అయ్యిన భాగాల్ని కూడా ఇక్కడ చదవొచ్చు.)




5 comments:
SImply Superb ..
అబ్బ, ఇంత చేదు రియాలిటీని ఎలా భరించాలి? ఎన్ని వేల గుండెలుండాలి దీన్ని అర్థం చేసుకోడానికి?
baagundi...
Bhupen hazaika paata gurocchindi..
"apne deshme hum hai par desi"
కళ్ళలో నీళ్ళు తిరిగాయండీ!
ఎంతటి చేదు నిజం...వీరిని సమాజంలో కలుపులేకపోవడం మన failure!
గుండె పట్టేసింది....
@ జ్యోతి, సుజాత, అజ్ఞాత, సౌమ్య:
మీ కామెంట్లకు ధన్యవాదాలు.
Post a Comment