Sunday, June 19, 2011

నాన్న వేసిన రెండు ప్రశ్నలు



ఒక సాయంత్రం, కౌమారంలోంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న కొడుకును పిలిచాడు తండ్రి.
ఆయన కుర్చీ మీద కూర్చున్నాడు. ముందరి టేబుల్ మీద ప్యాడు, కాగితం, పెన్ను ఉన్నాయి.
కాగితం చేతిలోకి తీసుకున్నాడు అబ్బాయి. అందులో మొదటి ప్రశ్న ఇలా ఉంది.
'మనిషికి దుఃఖం ఎందుకుండాలి?'
సమాధానం రాయమన్నట్టుగా సంజ్ఞ చేశాడు తండ్రి.
ఇన్నేళ్లుగా తండ్రి తనకు స్నేహితుడయ్యాడు. ఉపాధ్యాయుడిలా పాఠాలు చెప్పాడు. తాత్వికుడిలా జీవితసారాన్ని ఎరిక పరిచే ప్రయత్నం చేశాడు. దాన్నే కాగితం మీద రాయడానికి ఉపక్రమించాడు కొడుకు.
'మొట్టమొదటిది, సంతోషం అంటే ఏమిటో తెలియడానికి దుఃఖం ఉండాలి. దుఃఖం లేకపోతే, సంతోషంలో ఉన్న గాఢత మన అనుభవంలోకి రాదు.
మనలోని కరుణ మేల్కొనేందుకు దుఃఖం దోహదం చేస్తుంది. మనల్ని మరింత సున్నితంగా, మరింత స్పందనలున్న జీవిగా మలిచేందుకు దుఃఖం తోడ్పడుతుంది.
దుఃఖం వల్లే ప్రపంచపు లోపలి పొరల్ని తరచి చూడగలిగే కాఠిన్యం అలవడుతుంది. దుఃఖంలోంచే మానవ జీవిత మూలాల్ని అన్వేషించే వివేకం మేల్కొంటుంది'.

రెండో ప్రశ్న:
'దుఃఖాన్ని తొలగించుకోవడం సాధ్యమేనా?'
దానికి కొడుకు జవాబు ఇలా రాయసాగాడు.
'దుఃఖాన్ని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలాసార్లు మరింత దుఃఖాన్నే మిగల్చవచ్చు. దుఃఖం ఉందన్న కారణంగా మళ్లీ దుఃఖపడటం, ఆ దుఃఖాన్ని రెండింతలు, నాలుగింతలు పెంచుకోవడమే అవుతుంది. జీవనవ్యాపారంలో దుఃఖం అనివార్యం అన్న ఎరిక కలిగిననాడు, దుఃఖంలోని తీవ్రత తగ్గిపోతుంది'.

ఇన్నాళ్లూ తన గూడులో భద్రంగా ఉన్న తన ప్రియమైన కొడుకు రాసింది ఒకటికి రెండుసార్లు చదువుకున్నాడు తండ్రి.
ఉన్నట్టుగా కనబడని పోరులోకి, కనబడకుండా దాడిచేసే శత్రువుల్లోకి, మొత్తంగా ఈ ప్రపంచంలోకి కొడుకు ధైర్యంగా అడుగుపెట్టగలడన్న నమ్మకం కలిగి, అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

ప్రేమ కూడా దుఃఖం కలిగిస్తుందని ఆ ఇద్దరికీ తెలుసు.

* 'తండ్రి ఎవరైనా కావచ్చు, కానీ కొంతమంది మాత్రమే నాన్న కాగలుగుతారు' అని ఒక సామెత. ఇలాంటి 'నాన్న'లందరికీ 'ఫాదర్స్ డే' శుభాకాంక్షలు.