Showing posts with label మధుపం. Show all posts
Showing posts with label మధుపం. Show all posts

Saturday, November 11, 2023

‘ఐదేళ్ల స్నేహమట...’


(ఫేస్‌బుక్‌లో ఐదేళ్ల స్నేహం అని మొన్న అక్టోబర్‌ 24న (2023) రిమైండర్‌ వచ్చినప్పుడు, దాన్ని తలుచుకుంటూనే, ‘మధుపం’ పుస్తకం మీద తన అభిప్రాయం రాశారు మానస చామర్తి. దాన్ని నేను ఈ బ్లాగులో తలుచుకుంటున్నాను.)


ఐదేళ్ళ స్నేహమట రాజిరెడ్డి గారూ! :)) ఐదుసార్లైనా మాట్లాడుకోకపోతిరి అని వెక్కిరిస్తోంది ఎఫ్.బి.

😜
*

పెళ్ళి అనేది రోజువారీ పోరు, నిరంతర మైత్రి అంటాడు రాజిరెడ్డి. "ఈ మనిషి కచ్చితంగా మనకోసమే పుట్టిందన్నంత నమ్మకం కలుగుతుంది; ఇంకోసారి పోయిపోయి ఈమె బారిన పడ్డామే అన్నంత వేదన వస్తుంది" అని రాశాడు మధుపం మొదటి పేజీలోనే. వార్నీ, ఇట్లాంటి మాటలు ఆడవాళ్ళ దగ్గర కదా విన్నాను అని చిన్న నవ్వొచ్చి వాలింది నా పెదాల మీద. నిజమే, మగవాడి ఫీలింగ్స్ అంత ఫిల్టర్స్ లేకుండా తెలిసే వీలేదీ? "మధుపం" నా చేతుల్లో పడబట్టి కానీ. ఇంతకీ నవ్వుకున్నాను అంటే, అదేమీ బిగ్గరగా నవ్వుకునే హాస్యం కాదు. అందరితో చకచకా పైకి చదువుకు పంచుకు చెప్పుకునేదీ కాదు.

రాజిరెడ్డి రాతల సరంజామా అంతా నీదీ నాదీ కూడా అయినా సంసారి జీవితం. ఎవరికి వాళ్ళమే ఎక్కడో ఓ చోట తారసపడతాం. ఆ ఫీలింగ్ బాగుంటుంది. కన్వీనియంట్‌గా మర్చిపోయే చిరాకు క్షణాలు కొన్నింటిని రాజిరెడ్డి రహస్యంగా ఫైల్ చేసి పెట్టాడు అనుకుంటే ఉన్నట్టుండి బ్రతుకు మీద కొత్త జాగ్రత్త మొదలవుతుంది. మూతివిరుపూ, నవ్వూ, చీర కట్టు, ఆఖరికి తన క్రాఫ్‌లో కదలాడే వేళ్ళ స్పర్శకు నెమ్మదించే తలనొప్పి కూడా ఒద్దికగా ఒక రెప్పచాటున రికార్డ్ అవుతోందనుకుంటే, రెపరెపలాడే గర్వం తోడుగా కొంత జాగ్రత్త, ఇంకొంచం ప్రేమా - నిజమా, కాదా?! తా వలచింది రంభ అయినా కూడా అందం కన్నా ఆమ్లెట్ కే ఎక్కువ మార్కులు అనుకునే లౌక్యాన్ని మగాడిలో చూసీ చూడనట్టు పోవడం ఆడవాళ్ళకేం సమస్య కాదు కానీ, రాత్రి వేళ మెతుకు మెతుకూ రుచి చూసుకుంటూ తినే మొగుడిని "కానీయ్..గిన్నెలు సర్దాలి" అనే పెళ్ళాం గొంతులోని విసుగు రంపంలా కోస్తుందంటే ఏమిటోగా ఉండదా! అమ్మాయిలు సీతాకోకలేమోలే కానీ కందిరీగలు అనకూడదా? అని ఎదురొచ్చి నిలదీస్తే సమాధానం దొరకబుచ్చుకోవడానికి సమయం కావాలా అక్కర్లేదా!

చూపూ చూపూ కలిపి కవ్వించే ఆడవాళ్ళ మనస్తత్వాన్ని గుర్తుపట్టి, వాళ్ళ అటెన్షన్ సీకింగ్ అర్థమైపోయిందనే మగవాళ్ళ వాలకం ఆడవాళ్ళకి గాభరా పుట్టించేస్తుంది. స్నేహితుడు ప్రాణాలడిగితే ఇచ్చేస్తాను కానీ పది రూపాయలంటేనే గుంజాటన మొదలవుతుందనే మధ్యతరగతి మొగుడి వాలకానికి అయ్యో రామా అనుకుంటుందేమో కానీ, నెలలో వారాలు గడిచేకొద్దీ బడ్జెట్ కి తగ్గట్టు జీవితాన్ని మలుపులు తిప్పుకుని కుటుంబాన్ని హత్తుకు పడుకునే వాణ్ణి ప్రేమించకుండానూ ఉండలేదు. అయినా అవన్నీ తెలిసే హత్తుకుంటారు వాళ్ళు, మధుపం చెప్పింది.

ఇన్ని రహస్యాలు తెలిసినవాడికి, కుతూహలం పోవడమే నిరాసక్తతకు కారణం అని కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది. అట్లాంటివాడు మరిక స్త్రీని ఎన్ని మాయలైనా చెయ్యగలడు. ఆమెకి ఎన్ని అబద్ధాలైనా చెప్పగలడు. రాత్రి పూట తన చేత్తో భోంచేసి ఎన్నాళ్ళైందో అనుకుంటూనే, పెళ్ళాం అంటే కోడెలేగ పొగరణచడానికి దాని మెళ్ళో కట్టే లెంకపీట లాంటిదని కూడా అనగలడు. సరే ఎన్ని అన్నా ఇంటికి రావడానికి ఒక కారణంగా కనపడే ఆమె వంటి విరుపు, టాటా చెప్పే పిల్లాడి కంటి మెరుపు చాలనుకునే సంసారిని మెచ్చకుండా ఎట్లా! "పెళ్ళి మోసపురాణమే కానీ, ఆ మోసంలో అందం ఉంది, ఆకర్షణ ఉంది, ఇష్టం ఉంది, స్త్రీ పురుషులు కలిసి నడవాల్సిన వాళ్ళమన్న గమనింపు ఉంది, ఏదోలా కాపురాన్ని సౌఖ్యంగా మలచుకోవాలన్న తహ తహ ఉంది..." అని కన్ఫెస్ చేశాక ఇక ఇలా ఎందుకన్నావ్ అని పోట్లాడేందుకేముంది? నిన్న పెట్టుకున్న నాగుపాము బొట్టుకూ, ఇవ్వాళ్టి దోసగింజ తిలకానికీ తేడా గుర్తించగల బ్రహ్మచారి చూపు సంసారంలో పడ్డాక కూడా ఎక్కడో నక్కి ఉంటుందనుకోవడంలోనే ఉంది బ్రతుకులోని "తీయ తేనియ బరువు"! ఈ రాజిరెడ్డి అలా కాదే! ఉందనో లేదనో అనడు. ఉందో లేదో అన్న గుంజాటన వీడడు. "సాహిత్యానికి చిక్కని క్షణాలు" పేజీల నిండుగా పరిచి, వెదుక్కుంటున్నది ఉందో లేదో వేయి వైపుల నుండి లెక్కలేసి చూసుకుని చూపిస్తాడా, దాని లెక్క తేల్చడం ఆషామాషీ వ్యవహారమేం కాదు.

24-10-2023

Friday, September 16, 2016

మూడు పుస్తకాలపై ఒక స్పందన

(పాఠకమిత్రుడు అశోక్ చిన్నం ఏప్రిల్, 2016లో మెయిల్ ద్వారా పంపిన లేఖా స్పందనను ఇక్కడ పోస్ట్ చేస్తున్నా. ఒకట్రెండు అక్షర దోషాలు మాత్రం సవరించాను.)

రియాలిటీ చెక్
ఉద్వేగాలను అక్షర  రూపంలోకి బదిలీ చేయవచ్చు అని రియాలిటీ చెక్ చదివిన తరువాతే తెలిసింది. మన స్పృహలోకి రాకుండా మనలో అతి మాములుగా చెలరేగే అనేక భావాలు వాక్యరూపం లో చూసి, ఇటువంటి భావాలను కూడా రాయవచ్చా అని  ఆశ్చర్యపోయి, అక్కడే కొద్దిసేపు ఆగి, ఆ ఆశ్చర్యాన్ని సంపూర్ణంగా అనుభవించి, తిరిగి చదవడం మొదలుపెట్టేవాణ్ణి. ఇంత సాధారణ వ్యవహార భాషలో, ఇలాంటి వచనం లో కూడా మనసుకు హత్తుకుని, మెదడులో ఇంకిపోయేలాగా తత్వాన్ని వివరించారు. "ప్రపంచం రెండు పరస్పర విరుద్ధావకాశాలను మనముందుంచి ఎంచుకునే విచక్షణ మీద ఒత్తిడి పెడుతుంది." ఈ వాక్యం కంటి నుండి మెదడుకి చేరగానే ఒక్కసారిగా ఆలోచనలు మనల్ని మన గతంలోని అలాంటి సన్నివేశంలోకి తీసుకెళ్తాయి. "నిరాడంబరతను జీవన విధానంగా చూపిస్తే ఆ గుణాన్ని పూజిస్తారుగానీ తమ జీవితాల్లోకి తెచ్చుకోరు." ఈ వాక్యం తో దేవుడి స్వరూపాన్ని చూడడానికి నాకు ఒక కొత్త కోణం దొరికినట్టుగా అనిపించింది. నాలోని నాస్తికత్వాన్ని ఆస్తికత్వాన్ని ఒకేసారి సంతృప్తి పరచగలిగారు. మౌనసందేశం ఏదో ఇమిడి ఉంది అందులో. "మరణం మాత్రమే మనిషి విలువని నిక్కచ్చిగా లెక్కకట్టగలదు" అని చెప్పినపుడు మీలోని తాత్విక లోతులు కనిపించాయి. కొడుకుని పోగొట్టుకున్న తండ్రి బాధని సరాసరి మా మనసుల్లోకి బదిలీ చేయగలిగారు, మా కళ్ళను కూడా తడిగా చేయగలిగారు. ఈ పుస్తకం చదువుతూ ఆనందించాను, ఆశ్చర్యపోయాను, బాధపడ్డాను, మౌనంగా ఐపోయాను, నవ్వాను, కోపం తెచ్చుకున్నాను, నాలోకి నేను వెళ్లి చూసుకున్నాను, నాలోనుండి ప్రపంచాన్ని కొత్తగా చూసాను. సుమారు దశాబ్దంన్నర నా పఠనం ప్రపంచంలో ఇంతగా నన్ను ప్రభావితం చేసిన పుస్తకం ఇదే!

మధుపం
రియాలిటీ చెక్ చదివిన తర్వాత కలిగిన కుతూహలంతో మీరు రాసిన ఇతర పుస్తకాల గురించి  ఆరా తీసి పనిగట్టుకుని కాచిగూడకి వెళ్లి తెచ్చుకున్న పుస్తకం మధుపం. అవివాహితుడినైన నాకు పెళ్లి మీద ఉండే సహజ కుతూహలాన్ని పెంచుతూ, అదే సమయంలో అస్పష్టమైన ఆందోళనను కూడా కలిగించింది ఈ పుస్తకం. ఒకే మగ జీవితాన్ని నాలుగైదు సార్లు జీవిస్తే తప్ప ఇలాంటి స్పష్టత (?), భావాలు కలుగవేమో అనిపించింది. స్వచ్ఛమైన, నిర్మలమైన మగ రాజసాన్నిఎంతగా అనుభవిస్తే ఇలాంటి భావాలు కలగాలి! " ఆ నవ్వు .. జీవితాన్ని చాలా చూసాక ఇంకా అంతకంటే నువ్ నన్నేం చేయగలవ్? అన్న ధిక్కారంలో నుంచి వచ్చిన నవ్వు... నీకు ఎదురొడ్డి పోరాడుతున్నాను చూడు... అన్న మగ అహంకారం లోనుంచి వచ్చిన నవ్వు.." లాంటి వాక్యాలు చదివినప్పుడు పెదవులు, ఛాతి ఒకేసారి కొంచెం వెడల్పు అయ్యాయి.. ఇది చదివిన ప్రతి మగవాడు తమ ఆత్మకథగా ఫీల్ అవుతాడు అని చెప్పడంలో అతిశయోక్తి  ఏమి అనిపించడం లేదు నాకు. అంతగా ప్రచారం లేని ఈ పుస్తకాన్ని నా స్నేహితుడికి ఇచ్చేటప్పుడే  హెచ్చరించాను తిరిగివ్వడం మర్చిపోవద్దని..

పలక పెన్సిల్
మొదటి రెండు పుస్తకాలు చదివిన తర్వాత, ఈ పుస్తకం నుండి మరిన్ని అనుభూతులు, చిరునవ్వులు ఆశించడంలో తప్పు లేదు. మొదటగా, వెనక కవర్ పేజి మీద ఉన్న "నువ్ ఉన్నావన్న ఒకే ఒక్క కారణంతో ఈ ప్రపంచాన్ని క్షమించేసాను" అనే వాక్యం చదవగానే ఈసారి మన రాజిరెడ్డికి కృష్ణశాస్త్రి  పూనాడేమో అని సందేహం కలిగింది. "పల్లెటూరి  సౌందర్యం అర్థం చేసుకోవాలంటే పట్నం రావాల్సిందే"  అని చదవగానే ఒక్కసారిగా బాధ, జ్ఞాపకాలు గాలివానలాగ చుట్టుముట్టాయి. "తొలి అడుగు" వ్యాసం ఒకేరోజు 4 సార్లు చదువుకున్నాను.. "నేనేమిటి" చదువుతున్నంతసేపు నిలువుటద్దం లో నన్ను నేను చూసుకున్న భావన. చక్కని ఫుట్ కోట్ లు వ్యాసాలకు మరింత ఆకర్షణగా నిలిచాయి . అలవాటు ప్రకారం ప్రతి వ్యాసంలో నచ్చిన వాక్యాలు అండర్ లైన్ చేస్తూపోయాను... తద్వారా చివరికి తెలిసింది ఏమిటంటే నా పెన్ లో ఇంకు ఐపోయింది అని. మన సిరిసిల్ల వ్యక్తిలో ఇంత తాత్వికత, భావ ప్రవాహం, రచనాపటిమ, మనో సంఘర్షణా విశ్లేషణ ఎలా పెరిగి ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ పుస్తకాన్ని అలమారలో సులువుగా కనిపించే విధంగా దాచుకున్నాను. బుచ్చిబాబు చివరకు మిగిలేది చదివిన తరువాత వచ్చే శూన్యం(?)  మరోసారి అనుభవించాను...

--
Ashok Ch.

Thursday, February 18, 2016

ఒక ప్రస్తావన


(ఫిబ్రవరి 1, 2016; సాక్షి - ఫ్యామిలీ)

Wednesday, November 3, 2010

ఒక ప్రశంస



ఈమధ్య ఇక్కడ అన్నీ సొంత డబ్బాలనే పోస్టు చేస్తున్నానని నాకు నేనే చింతిస్తున్నట్టుగా నటిస్తూ...

ఈభూమి మ్యాగజైన్ నవంబరు సంచికలో వచ్చిన వ్యాసం ఇది.
కమలాకర్ గారికీ, పొనుగోటి గారికీ ధన్యవాదాలు.

Monday, September 27, 2010

మధుపం రాజిరెడ్డి జెంటిల్మెన్ ఫీలింగ్స్



ఈ విలువైన సమీక్ష నిన్నటి(26 సెప్టెంబరు 2010) వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. సమీక్షించిన చింతపట్ల సుదర్శన్ గారికి ధన్యవాదాలు. ఈ పోస్టుకు పెట్టిన టైటిల్ సమీక్షకుడు ఒరిజినల్గా పెట్టుకున్నది.

Wednesday, August 4, 2010

థాంక్స్ విహారి గారు!




మధుపం- మీద వచ్చిన విలువైన రివ్యూ ఇది. రాసింది విహారి గారు. ఇది జూలై 18న ఈవారం జనవార్త పత్రికలో అచ్చయింది. కాని నేను ఆలస్యంగా, అంటే ఇవ్వాళే చూశాను. దాన్నే ఇక్కడ రీ-ప్రొడ్యూస్ చేస్తున్నా.

Friday, March 12, 2010

మధుపం: రివ్యూ


ఇది పాలపిట్ట మాస పత్రిక ఫిబ్రవరి సంచికలో వచ్చింది. వంశీ కృష్ణ గారికి థాంక్స్

Monday, February 22, 2010

మీకు బోరు కొట్టొచ్చు!


మన పుస్తకం మీద రివ్యూ వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పాలా వద్దా?
చదవండహో అన్నట్టుగా ఉంటుంది. ఇబ్బందే. నాకు తెలుసు. కాని పర్సనల్ బ్లాగ్ అనే మిష మీద ఇక్కడ పెట్టేసుకుంటున్న. రికార్డు కోసం. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు.
ఇవి వరుసగా ప్రభ, జ్యోతి, వార్తల్లో వచ్చాయి.

థాంక్స్ : విహారి, పప్పు, సుధామ.

Monday, January 4, 2010

ఒక మగవాడి ఫీలింగ్స్: సాక్షి రివ్యూ


సాక్షి సాహిత్యం పేజి లో ఇది ఈరోజు- జనవరి నాలుగో తారీఖు- వచ్చింది.
థాంక్స్ టు కల్పనా రెంటాల.
ఇదే సమీక్ష ఎడిట్ చేయని వెర్షన్ ఇక్కడ చదవండి.


Saturday, January 2, 2010

ఒక మగవాడి గురించి ఇంకో మగవాడి ఫీలింగ్స్



అభిప్రాయాన్ని రాతలో చెప్పడం, తక్కువ మందికి ఉండే సుగుణం.
అలా చెబితే ఆర్టిస్టు (పెద్ద మాట వాడేసానా!) అనేవాడు చాలా సంతోషిస్తాడు.
పైగా అది 'రికార్డు' అవుతుంది.
నా మిత్రుడు ప్రకాష్ అదే పని చేశాడు. అతడికి థాంక్యూ.
నా మధుపం పుస్తకం మీద అతని రివ్యూ కింది లింకులో...
http://vinuvinipinchu.blogspot.com/
అన్నట్టూ ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది అని ఒకరిద్దరు అడిగారు. విజయవాడ వాళ్ళయితే అక్కడ బుక్ ఫెయిర్ జరుగుతోంది. జనవరి పదకొండు వరకు. పాలపిట్ట బుక్ స్టాల్ నంబరు ముప్ఫై తొమ్మిది. ఇంకా విశాలాంధ్ర, ప్రజాశక్తి మామూలే.

Tuesday, December 1, 2009

ఒక మగవాడి ఫీలింగ్స్- రివ్యూ



iది నా తొలి పుస్తకం మధుపం (ఒక మగవాడి ఫీలింగ్స్) మీద వచ్చిన తొలి సమీక్ష.
మంచి రివ్యూ రాసిన బొల్లోజు బాబా గారికి థాంక్స్. కింది లింకులో...


Thursday, October 23, 2008

నన్ను విమర్శించిన వారికి వందనం

This was published in Feminist Monthly "Bhumika" of October 2008. Thanks to the author Ms Aranya.