Showing posts with label పిల్లలు - చదువులు. Show all posts
Showing posts with label పిల్లలు - చదువులు. Show all posts

Tuesday, December 13, 2022

క్రియతో సెల్ఫీ






క్రియతో సెల్ఫీ
పూడూరి రాజిరెడ్డి


కొత్తగూడెం బాలోత్సవ్‌గురించి వినడమేగాని ఎప్పుడూ పాల్గొనే అవకాశం రాలేదు. అది ఆగిపోయిన తర్వాత, దాని స్ఫూర్తితోనే కొనసాగుతున్న ‘క్రియ’ గురించి తెలిసిన ఏడాదే అనుకోకుండా అందులో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. అంతా రమణమూర్తి గారి చొరవ, నవీ¯Œ గారి కార్యదక్షత!

నాలుగు మాండలికాలనూ పలికిన ఒక పాప. కాగితంతో హంసకు జీవం పోసిన ఇంకో చిన్నారి. మట్టితో ఆకుల రేకులు తీర్చిన మరో ఆరింద. ‘మరేమో’ అంటూ ఊరిస్తూ కథ చెప్పిన ఒక బుడత. స్టేజంతా తనదిగా చేసుకుని నర్తించిన ఒక ముగ్ధ. నాన్న, నానమ్మల కష్టంలో ఎవరి కష్టం ఎక్కువ గొప్పదోనని యోచించే ఓ బాల తాత్వికుడు. జేఎన్‌టీయూకు వసంతం మూడు వారాల ముందే వచ్చింది; రెండ్రోజుల పాటు ఆవరణంతా చిన్నారి బాలలుగా పూచింది.

సముద్ర తీరంలో ఆరూ పంతొమ్మిదికి అయిన సూర్యోదయం, జాలార్లు అప్పటికే పట్టి ఒడ్డుకు చేర్చిన వలలో ఇంకా చురుగ్గా కదులుతున్న ఈల్‌చేపలు, మడ అడవుల్లో కలియ దిరుగుతున్న పసుప్పచ్చటి ఎండ్రకాయలు, గుత్తులుగా కాసి పచ్చివాసన వేస్తున్న మామిడి చెట్లు, బ్రహ్మ సమాజ భవనం, సుబ్బయ్య భోజనం, కోటయ్య కాజా; జీవితంలో మొదటిసారి వెళ్లిన కాకినాడలో ఇంకా చూడటానికి ఎంత మిగిలిపోయిందో, ఈ పిల్లల పండుగ కూడా అంతే మిగిలిపోయింది. ఎన్నో వేదికల మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటే ఏవని ఎంపిక చేసుకోగలం; ఇది బాగుందనీ, ఇది బాలేదనీ తేల్చాల్సిన తియ్యటి నేరాన్ని ఎలా చేయగలం!

సింపుల్‌భోజనం, సింపుల్‌ మనుషులు, పనిలో భాగంగా హడావుడి పడటమేగానీ హడావుడి చేయడమే పనిగా పెట్టుకోని నిర్వాహకులు, మట్టితో బొమ్మలు చేసే పిల్లలకు ఎప్పటికప్పుడు తడి అవసరం పడుతుందన్న వివరంతో సహా గుర్తుంచుకుని నెమ్మదిగా వరుసల మధ్య కదిలే వలంటీర్లు; ఈ క్రియకు చాలా భవిష్యత్‌ ఉందన్న భరోసా ఇచ్చారు. చప్పట్ల మధ్య ఆ వేదిక ఎక్కి, ఆ వేదిక మీద బహుమతి ఇస్తున్నవారు ఎవరో తెలియకపోయినా కచ్చితంగా ఎవరో పెద్దమనిషే అయివుంటాడని నమ్మేంత వయసు చిన్నారులకు– బహుశా వాళ్లు పెద్దయ్యేదాకా ఈ  జ్ఞాపకం వెంబడి ఉంటుందేమో; వాళ్లు ఆరోగ్యకరంగా పెద్దవాళ్లు కావడంలో ఒక అదృశ్య శక్తిగా కూడా పనిచేస్తుందేమో. అందుకైనా ఇలాంటి బాలోత్సవాలూ, ఇలాంటి క్రియ పండుగలూ అంతటా, ఎప్పటికీ అవసరమేమో!

ప్రత్యేకించి జానపద విభాగంలో, సీనియర్లూ జూనియర్లూ రెండు కేటగిరిల్లోనూ తెలంగాణ పాటలకు ఆంధ్రీయులు డాన్స్‌  చేయడం ముచ్చటేసింది.  ఒకవేళ ఉంటేగింటే రాజకీయాల వల్ల ఏర్పడిన అంతరాలను పూడ్చగలిగే శక్తి బహుశా సాహిత్యానికి మాత్రమే ఉందని మరోసారి నిరూపితమైంది.  

మాకు బసగా ఏర్పాటైన వందేళ్ల నాటి కాస్మొపాలిటన్ క్లబ్, వస్తూపోతుంటే కనబడిన అంతకంటే పాతదైన మెక్‌లారెన్  హైస్కూలు పట్టణంలో ఆంగ్లేయుల పాదజాడలను పట్టించాయి. పేర్లు మాత్రమే తెలిసి ముఖాలుగా తెలియనివాళ్లు కలిసి, కలిసేదాకా మనం తెలుసని మనకు తెలియనివాళ్లు తెలిసి కొత్త జీవనోత్సాహాన్ని నింపారు. మనుషులుగా దాటలేని బలహీనతలు గమనింపులోకి రావడమూ, గమనిస్తూనే అందులో భాగం కావడమూ ఇంకొక తమాషా.

మూడో రోజు తెల్లారి– ఎంగిలి విస్తరాకులు, కుల్ఫీ పుల్లలు సహా మొత్తం అద్దంలా ఊడ్చి ఇచ్చేస్తారన్న భరోసాతో దీనికి వరుసగా వేదిక అవుతున్న జేఎన్‌టీయూ ఆవరణలో ఒకచోట ఫొటోలు, సెల్ఫీలు దిగే వీలుగా ఐ లవ్‌ జేఎన్‌టీయూకే అని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఐ లవ్‌ క్రియ అని పెట్టివుంటే గనక నా ఖాతాలోనూ ఒక సెల్ఫీ పడేది.

(మార్చ్‌ 2020)
 
 

Monday, June 8, 2020

కొన్ని ఇంగ్లీషు ఆలోచనలు

(ఇది సరిగ్గా గతేడాది మే నెలలో రాసుకున్నది. ఇందులోని చాలా పాయింట్స్ మీద చర్చ జరిగింది; ఇంక మళ్లీ పునరుక్తి అవసరమా అనిపించిందప్పుడు. కానీ నా ఆలోచనా ధారను ఒక కొలిక్కి తెచ్చుకున్న ప్రయత్నాన్ని చూపడం కోసం ఇట్లా.)


పిల్లలు–చదువులు: 2

కొన్ని ఇంగ్లీషు ఆలోచనలు
-----------------------------
దీన్ని రాస్తున్నానంటేనే, నేను ఏ మీడియంలో నా పిల్లల్ని చదివిస్తున్నాను అనే ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత నా మీద ఉంటుంది. దాన్నేమీ దాటేయను.

మొన్నమొన్నటిదాకా tiny అనే పదాన్ని టినీ అనుకున్నాను. అంతకుముందెప్పుడో ఓ స్టార్‌ హీరోను ఇంటర్వ్యూ చేయాలనిపోయి (precious) ప్రీసియస్‌ అని పలికి చిన్నబోయినంత పనైనాను. ఇంగ్లీషు భాషకు సంబంధించి ఇవి అత్యంత ‘టైనీ’ వివరాలు, కానీ నా వరకూ ‘ప్రెషస్‌’ వివరాలు. తెలుగులో మనకు రాయడం వస్తే చదవడం వచ్చేసినట్టే. కానీ ఇంగ్లీషులో రాయడం వస్తే చదవడం వచ్చినట్టు కాదు. దాన్ని ఎలా పలకాలో తెలిసినవాళ్ల దగ్గర వింటేనే మనకు ఇంగ్లీషు వచ్చినట్టు.
నా ఎఫ్బీ జాబితాలో ఉన్న ఓ బెంగాలీ రచయితను నువ్వెందుకు బెంగాలీలో రాయవూ అని అడిగాను. నేను ఇంగ్లీషులోనే ఆలోచిస్తాను, అన్నాడు. నాకు తెలిసి ‘మన’ చాలామంది ఇళ్లల్లో మన తల్లిదండ్రులకు ఇంగ్లీషు రాదు. ఇంగ్లీషులో ఆలోచించడం అటుండనీ, కనీసం రోజువారీ జీవితంలో సుమారు ఇంగ్లీషు కూడా మాట్లాడం. మాట్లాడలేం.

ఈ మనం అనే మాట కొంచెం ట్రిక్కీ. సమాజాన్ని ఎన్నో రకాలుగా విభజించగలిగే సందర్భంలో మనం అంటే ఎవరం? దీన్ని ఎట్లా నిర్వచించాలి? మనం అని చదువుతున్నప్పుడు దాన్ని ఓన్‌ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్లందరూ ఈ మనంలో భాగమే.

ఇంగ్లీషు మాట్లాడగలిగినవాళ్లంతా జ్ఞానవంతులు అనే భ్రమ నాకు లేదు. ఇంగ్లీషు కూడానేమోగానీ, ఇంగ్లీషొక్కటే ఉపాధికి కీలకం అనీ నమ్మలేను. మన చుట్టూ ఎన్నో పనులు సమర్థంగా నిర్వహించగలిగిన ప్రతి ఒక్కరూ ఇంగ్లీషులో గడగడా మాట్లాడలేరు. జీవితంలో అపారమైన అనుభవం ఉన్న ఎందరో పెద్దవాళ్లు ఇంగ్లీషులో మాట్లాడబోయి భంగపడటం చూస్తుంటాను. సమస్య ఏమిటంటే, హిందీ నాకు రాదు అని సింపుల్‌గా చెప్పేయొచ్చు. మై ఆతీ హై అని వెటకారం చేసినా ఎదుటివాడు జోక్‌ అనుకుని నవ్వేస్తాడు. కానీ ఈ వెసులుబాటు ఇంగ్లీషుకు లేదు. అది మన ప్రయోజకత్వానికి చిహ్నం. అది మన ప్రగతికి చిహ్నం. రాదంటే న్యూనత. ఉపాధి కంటే ఈ న్యూనత బలమైనది. దీన్ని దాటడం కష్టం. దాదాపు అసాధ్యం.

పాత తెలుగులో వర్ధంతి అనే మాటకు జయంతి అనే అర్థం. కానీ ఇప్పుడు వర్ధంతి అంటే చనిపోయాక చేసేదే. ప్రస్తుతం తెలుగు భాషకు ఈ వర్ధంతి అనే మాట ఏకకాలంలో భిన్న అర్థాలిస్తూ బ్రహ్మాండంగా సరిపోతుంది. అలాగని భాషను బతికించడం ప్రత్యేకంగా ఎవరి బాధ్యతో కాదు. మన కోసం భాషగానీ భాషం కోసం మనం కాదు. కానీ తెలుగు మీద, మాతృభాష మీద అభిమానం చూపడం బ్రాహ్మణీకమో మరొకటో కాదు. మన శరీరం మీద మనకు ఉండవలసింది అభిమానం కాదు. అది వాస్తవమన్న గ్రహింపు. అట్లా తెలుగు మన భాష. మన వాస్తవం.

కానీ మన దగ్గర తెలుగు అనగానే రెండు ఎక్స్‌ట్రీమ్స్‌ ఉంటాయి. రోడ్డు, బస్సు పదాలు కూడా వాడొద్దనే తెలుగొకటి. సంస్కృత పదాళ మేళవింపు నాది కాదని ఈసడించుకునే తెలుగొకటి. బస్సులో పోతున్నాను, అన్నప్పుడు– లో అనే కనెక్టింగ్‌ మాట పడినంతకాలమూ అది తెలుగే. అట్లాగే ప్రతి మాటా మనకు ముందే తెలిసివుండటానికి మనమేమీ భాషను తయారు చేయలేదు. దానికి సమానార్థకాన్నిచ్చే ఇంగ్లీషు కూడా పరాయిభాషే కదా!

నాకు తిక్కన పద్యాలు అర్థం కావు, కానీ Catcher in the Rye అర్థమవుతుంది. ఇదొక వైరుధ్యం. కాలం గడిచేకొద్దీ ఒక తరపు భాష తరువాయి తరాలకే పరాయిది అవుతుంది. ఇది తెలుగుకే కాదు, ఇంగ్లీషుకూ వర్తిస్తుంది. మొన్నేదో లింకులో జూలియన్‌ ఆఫ్‌ నార్విచ్‌ గురించి రాశారు. ఆమె ‘మిడిల్‌ ఇంగ్లిష్‌’లో రాసిన వాక్యాలను ఇప్పటి ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసి పెట్టారు. కాబట్టి తెలుగు అంటున్నప్పుడు మనం ఇవ్వాళ ఎలా మాట్లాడుకుంటున్నామో ఆ సగటు తెలుగు. ఏ ఇబ్బంది లేకుండా అర్థం చేసుకుంటున్న తెలుగు. రైల్వే సిగ్నల్‌ను అనువాదం చేయనక్కర్లేని తెలుగు. మంచినీళ్లలా తాగగలిగే తెలుగు. ఒక్కోసారి పరగడుపున మంచినీళ్లు తాగడం కూడా కష్టమే. దానికీ కొంత ప్రయత్నం అవసరమే.

గాంధీజీ, సుందరయ్య, చిలుకూరి దేవపుత్ర లాంటి భిన్న భావజాలాలకు చెందిన వాళ్లందరూ మాతృభాషలోనే పిల్లల్ని చదివించడం మంచిదని అన్నారని చదివాను, విన్నాను. కానీ నాకు పిల్లలు పుట్టే కాలానికి లోకం ఒక రీతిలో సాగుతోంది. అందుకే చాలా గింజుకున్నాను, వేదన పడ్డాను, తలపోటు తెచ్చుకున్నాను, చివరికి ఒక స్థిరానికొచ్చాను. చాలాసార్లు మనం ప్రాక్టికల్‌గా ఉండవలసి వస్తుంది. లోకంతోపాటు నడిచి ఫెయిలైనా ఇబ్బంది ఉండదుగానీ లోకవిరుద్ధంగా పోయినప్పుడు విధిగా సక్సెస్‌ కావాల్సిన బరువు మన మీద పడుతుంది. అంత బరువు నేను మోయదలుచుకోలేదు. ఈ లోపల నా ఆలోచనల డోలాయమానం గానీ ఇంకే సంశయాలుగానీ లేకుండా ప్రభుత్వమే నా తరఫున నిర్ణయం తీసేసుకుంది. ఇంక నా పిల్లలు ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్నారు. మునిగితే అందరం కలిసే మునుగుదాం.

నా పిల్లలు గవర్నమెంట్‌ బడికి పోవడం లేదు. పోతున్న ప్రైవేటు స్కూలు ఘనంగా ఏమీ లేదు. అంటే టీచర్లు అందరూ మంచి డిగ్రీలు ఉన్నవాళ్లే. కానీ ఆ ఇంగ్లీషు వినగానే ఇది అయ్యేది కాదని మనకు అర్థమైపోతుంది. నాకిప్పుడు ఉద్యోగంలో ఎదగాలన్న లక్ష్యం లేదు. సొంతిల్లు కట్టుకోవాలన్న సంకల్పం లేదు. నా ఆరోగ్యం గురించిన చింత లేదు. ఈ చదువుల తీరు మాత్రం కలవరపెడుతోంది.

ఒక పది ఇరవై ఏళ్ల కిందట ఆ ఊరి సర్పంచ్‌ కొడుకూ, ఆ ఊరి సఫాయి కొడుకూ ఒకే బళ్లో చదివేవాళ్లు. ఏదో ఒక తలంలో రెండు భిన్న జీవితాలు సంపర్కం జరిగే అవకాశం ఉండింది. ఇప్పుడు ఇవి ఎప్పటికీ కలవనంత దూరం జరిగిపోతున్నాయి. ఒకే ప్రపంచంలో భిన్న ప్రపంచాలుగా మనుషులు బతికే ప్రమాదకరమైన వీలు ఏర్పడుతోంది. వాళ్లు పంపే స్కూళ్లు వేరు, మనం పంపే స్కూళ్లు వేరు. వాళ్లను కిందికి లాగాలని కాదు, కానీ మనం ఎప్పటికి వాళ్లదాకా ఎగబాకాలి? అందరికీ ఒకే రకమైన చదువు ఇవ్వగలిగే విద్యా వ్యవస్థ ఎందుకు లేకుండాపోయింది? అందుకే, నాలుగు లక్షల స్కూల్లో చదివినవాడు ‘మేనేజర్‌ ఇంగ్లిష్‌’ మాట్లాడితే, నలభై వేల వాడు ‘అటెండర్‌ ఇంగ్లిష్‌’ మాట్లాడేలా తయారవుతాడేమోనని నా భయం. అటు తెలుగూ రాక, ఇటు ఇంగ్లీషూ రాక కొత్తరకం నిరక్షరాస్యులుగా మన పిల్లలు తయారవుతారేమోనని నా దిగులు.

ఓసారి నేనూ, ఆనందూ ప్రెస్‌ క్లబ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైతే ఓ Biba నీళ్ల బాటిల్‌ చేతిలో పెట్టారు. అప్పుడు దీన్ని ఎలా పలకాలా అనే సందేహం వచ్చింది. బీబా, బైబా? అంటే దీన్ని ఎలా పలకాలో తెలిసినవాడిముందు మనం చిన్నబోయే సంభావ్యత యాభై శాతం. ఈ చిన్న చిన్న అవరోధాలనైనా దాటించగలిగే భాషాసామర్థ్యాలున్న  ఉపాధ్యాయులు ఈ రెండు రాష్ట్రాల్లో ఎంతమంది ఉండింటారు?

వెయ్యేళ్ల వయసున్న తెలుగును, దానికన్నా మూడొందల యేళ్లు చిన్నదైన ఇంగ్లీషు ఆడించడం పలు రాజకీయాల పరిణామం. భాష, రాజకీయంతో ముడిపడిపోయింది కాబట్టి, ఇక వెనక్కి వెళ్లలేమని తెలుసు. ఇది ఇప్పుడు మొదలైందీ కాదు, ఇక్కడితో ఆగేదీ కాదు. ఆ ఆంగ్లేయులతో ఇంగ్లీషులో మాట్లాడగలిగే శక్తి వల్లే సమాజంలో పైకి ఎదిగినవాళ్ల నుంచే ఇది మొదలైంది. అదే ఇంగ్లీషుతో అమెరికాలకు విమానాల్లో ఎగిరిపోయినవాళ్ల వల్ల బలపడింది. వీళ్లందరినీ ఆయా తీరాలకు చేర్చిన శక్తిసామర్థ్యాలు నిజానికి వేరేవి కావొచ్చు. కానీ కొట్టొచ్చినట్టు కనబడేది ఇంగ్లీషు. ఇంక దాన్ని అందుకోవడానికి ఎవరు మాత్రం ఎందుకు ప్రయత్నించరు? ఇప్పుడు ఇంగ్లీషు అనేది కేవలం ఒక భాష కాదు, అదొక విలువ.

కానీ తెలుగంతే జనాభా ఉన్న జర్మనీ గానీ, తెలుగులో ఎనిమిదో వంతే జనాభా ఉన్న స్వీడన్‌ గానీ తమ భాషల్ని అంతర్జాతీయంగా ఎలా వెలిగేలా చేసుకుంటున్నాయో ఆలోచించగలిగే మేధావులు, మార్గదర్శకులు ఇన్నేళ్లుగా ఈ నేలమీద లేకుండా పోవడమే వ్యక్తిగతంగా నా దురదృష్టం. విలువలు అనేవి మనం ఇవ్వడం వల్లే వస్తాయి. ఆ విలువల్నే తారుమారు చేయగలిగే శక్తిమంతులు తెలుగువాళ్లలో ఎవరూ లేకపోవడమే ఆశ్చర్యం.

------------------------------------------------------------------------------
(బొమ్మ,
ఇంకా చిన్నగానే ఉన్న మా పెద్దోడు ఇంకా చిన్నప్పుడు వేసింది.)

Friday, November 8, 2019

నేను పేదవాడిని కాదుగానీ...



(5 నవంబరున ఎప్భీలో చేసిన పోస్టు)

నన్ను నేను పేదవాడిగా ఎప్పుడూ భావించుకోలేదు. రెండేళ్లు మినహా నా చదువంతా జరిగింది గవర్నమెంటు స్కూళ్లు, కాలేజీల్లోనే అయినప్పటికీ నేను పేదవాడినని అనుకోలేదు. డిగ్రీకొచ్చేదాకా నేను స్లిప్పర్లు వేసుకుని కాలేజీకి పోయినప్పటికీ నేను పేదవాడినని అనుకోలేదు. దేనికైనా నూరు రూపాయలు అడిగితే మా బాపు ముందు అరవై సరిపోవా అనేవాడు; తరువాత ఎనభైకి వచ్చేవాడు; సరిగ్గా ఆ క్షణానికి వచ్చేసరికి ఆ నూరు రూపాయల నోటేదో చేతిలో పెట్టేవాడు. కాబట్టి నాకు డబ్బుల లేమి అనేది ఎప్పుడూ తెలియలేదు.
ఇప్పుడు మా(నా) ఇంట్లో సన్నటి పెద్ద టీవీ లేదు, కొనగలగడం కన్నా అద్దింట్లో ఆ ఉన్న టీవే ఎక్కువ అనిపించడం వల్ల. చేతుల్తోనే ఉతుక్కుంటాం కాబట్టి వాషింగ్ మెషీన్ లేదు. ఫ్రిజ్లో పెట్టదగినదంటూ ఒకటి ఇంట్లో ఉండదనే నమ్మకంతో ఫ్రిజ్ కొనలేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టును నమ్ముకున్నవాడిని కాబట్టి వ్యక్తిగత వాహనం లేదు. మానసికంగా నాకో స్థిరత్వం రాలేదు కాబట్టి సొంతింటి గురించి ఆలోచన చేయలేదు. ఇలాంటి లక్షణాలున్నప్పటికీ నన్ను నేను పేదవాడినని ఎప్పుడూ అనుకోలేదు. నాకు అవసరమైన డబ్బులు నా దగ్గర ఎప్పుడూ ఉన్నాయి. డబ్బులు లేక నేను ఫలానాది కొనడాన్ని ఎప్పుడూ వాయిదా వేయలేదు. నేను అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఏ స్నేహితుడో ఫోన్ చేసి, అర్జెంటుగా ఓ నాలుగు వేలు ఉన్నయా అంటే ఇవ్వడానికి నా దగ్గర ఎప్పుడూ డబ్బులున్నాయి.
నా దగ్గర తగినన్ని డబ్బులు ఉన్నప్పటికీ నాలో ఒక ఊరితనం ఉంటుంది. ఆ ఊరితనం గమనింపులోకి వస్తుందేమో అనుకునే ప్రతిచోటునీ నేను వెళ్లకుండా అవాయిడ్ చేస్తాను. అందుకే హైదరాబాద్లో చాలా చోట్లు నాకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందుకే మా పిల్లలను నా మానసిక స్థితికి ఇబ్బందికాని బళ్లలోనే వేశాను. కానీ అది మళ్లీ ఒక న్యూనత కలిగిస్తుంది. నేను దాటలేని అవరోధాల వల్ల పిల్లల్ని సరైన స్కూళ్లలో వేయలేదేమో, వాళ్లకు తగిన చదువును నేను ఇవ్వలేకపోతున్నానేమో, చేజేతులా వాళ్లకు అన్యాయం చేస్తున్నానేమో అని విచారం కలుగుతుంది.
ఇంక దాన్ని దాటి తీరాలని నిశ్చయించుకుని, చాలా రకాలుగా సెర్చ్ చేసి ఎంపిక చేసుకుని, ఇవ్వాళ ఒక స్కూలుకు వెళ్లాను. వాళ్లు చెప్పిన ఫీజు అక్షరాలా రెండు లక్షల యాభై ఎనిమిది వేలు. దీన్నో మూడు దఫాల్లో కట్టొచ్చు. ట్రాన్సుపోర్టుకు ఒక నలభై నాలుగు వేలు. దీన్ని రెండు దఫాల్లో కట్టొచ్చు. ఇంకా యూనిఫామ్స్, పుస్తకాలు ఈ ఖర్చులో లేవు. ఒక పిల్లాడు స్కూలుకు వెళ్తున్నాడంటే ఇంకా ఇతరత్రా ఖర్చులు ఎలా వస్తుంటాయో పిల్లల్ని బళ్లకు పంపే తల్లిదండ్రులకు తెలిసేవుంటుంది. కొంత కాషన్ డిపాజిట్ కూడా ఉందిగానీ అది పిల్లాడిని మాన్పించినప్పుడు మనకు తిరిగిచ్చేస్తారు. ఈ వివరాలను వాళ్లు చెబుతున్నప్పుడు, రేపు పొద్దున్నే వచ్చి ఏక మొత్తంలో చెల్లించేవాడిలాగా బయటపడకుండా మేనేజ్ చేశాను.
నేను పోయిన స్కూల్ దగ్గరలోనే ఇంకోటి కనబడింది. దాని గురించీ కొంత వినివున్నాను కాబట్టి, ఎటూ ఇంతదూరం వచ్చానుకదా అని అక్కడికీ వెళ్లాను. వాళ్లు ఒక లక్ష డెబ్బై వేల ఫీజు, నలభై వేల ట్రాన్సుపోర్టు అన్నారు.
జీవితంలోని అత్యంత రసహీన క్షణాలు ఏమైనా ఉన్నాయంటే అది డబ్బుల గురించి మాట్లాడుకోవడం అని నేను అనుకుంటాను. అందుకే నీకు జీతం ఎంతొస్తుంది, ఈ సంవత్సరం ఎంత పెరిగింది లాంటి ప్రశ్నల్ని నేను నా నోటితో ఎవరినీ అడగను. నేనేమీ ఇవ్వాళే గుడ్డులోంచి బయటికి వచ్చి లోకాన్ని చూస్తున్నవాణ్ని కాదు. ఎంతెంత మంది ఎంతెంత తక్కువ సంపాదనలతో బతుకులను వెళ్లదీస్తున్నారో నా అవగాహనలో లేని విషయమూ కాదు, ప్రైవేటు బళ్లలో ఫీజులు ఎలా ఉంటున్నాయనే విషయం నాకు ఇంతకుముందు తెలియదనీ కాదు. ఇప్పుడు చెప్పిన దానికి కనీసం నాలుగు రెట్లు ఎక్కువ ఫీజులున్న స్కూళ్లు కూడా నాకు తెలుసు. కానీ ఆ వాస్తవం మీది నుంచి నేను దొర్లుకుంటూ వెళ్లిపోయేవాణ్ని. అది నా కంఫర్ట్ ఏరియా కాదనుకున్నాను కాబట్టి అటువైపు వెళ్లలేదూ, వాటిగురించి పట్టించుకోలేదూ.
నేను ఇద్దరు పిల్లల తండ్రిని. నా పెద్దకొడుకును ఆర్టిస్ట్ అండ్ పొయెట్ అనుకుంటాను. నా చిన్నకొడుకును స్పోర్ట్స్ మన్ అనుకుంటాను. కానీ ఒక్కసారిగా– నువ్వేమి చేసీ కనీసం ఆ రెండో స్కూల్లోనైనా నీ ఒక్క పిల్లాణ్ని కూడా చేర్పించలేవూ, ఇదంతా నువ్వు అంగీకరించి తీరవల్సిన వాస్తవమూ అనిపించేసరికి జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు నిరుపేదరికం అనుభవంలోకి వచ్చింది.