Showing posts with label సత్వం. Show all posts
Showing posts with label సత్వం. Show all posts

Thursday, August 6, 2026

ఆలోచనాపరుడు కృష్ణమూర్తి


జిడ్డు కృష్ణమూర్తి 
11 May 1895 - 17 Feb 1986


ఆలోచనాపరుడు


చిన్నారిగా ఇంకా ఆటలు ఆడుకుంటున్న జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో అనుకోని మలుపు– అతను దివ్యజ్ఞాన సమాజం దృష్టిలో పడటం! ఆ పిల్లాడే మున్ముందు అవతరించనున్న ‘వరల్డ్‌ టీచర్‌’ మైత్రేయుడికి వాహకుడై మానవజాతికి ‘మోక్షం’ కలిగిస్తాడని లెడ్‌బీటర్, అన్నీబీసెంట్‌లాంటి వాళ్లు సంపూర్ణంగా విశ్వసించారు; దానికి తగిన ఇమేజ్‌ను కృష్ణమూర్తికి కల్పించారు.

అయితే, యువకుడిగా కృష్ణమూర్తి జీవితంలోని రెండో మలుపునకు పూర్తి కారణం ఆయనే! తననొక దేవుడి అవతారంగా నమ్ముతుండటాన్ని ఆయన పూర్తిగా నిరసించాడు; తనచుట్టూ ఏర్పాటైన ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ద స్టార్‌’ సంస్థని రద్దుచేశాడు; సత్యాన్ని కనుగొనడానికి తొక్కుడుపడిన దారంటూ ఒకటి లేదు, అది వ్యవస్థలు అందిచ్చేది కాదు, అది పూర్తిగా వ్యక్తిగత ప్రయాణం, అని తేల్చేశాడు.

కృష్ణమూర్తి ఆలోచనల్లో సత్యానికి దారి చూపే గురువంటూ లేడు, దానికి పనికొచ్చే మతమంటూ లేదు, దానికోసం ఎవరూ చేయిపట్టుకుని నడిపించరు. అన్వేషణ, ప్రశ్నించే గుణాలే సత్యాన్ని చేరేందుకు ఉపకరణాలు!

కానీ దేవుడికో, గురువుకో ఒక నమస్కారం పెట్టేయడం తేలిక; వాటిచుట్టూవున్న అంశాల్ని తర్కించి అవగాహన చేసుకోవడం కష్టం; అందుకే జిడ్డు కృష్ణమూర్తి బాటలో నడవడంకన్నా ఏదో ఒక మతం చాటున దాక్కోవడం మనుషులకు సులభమవుతోంది. అయితే, ఈ మానవ బలహీనత గురించి కృష్ణమూర్తికి బాగా తెలుసు.

మనిషి తనకుతానుగా బతకడు; కనబడని షరతులకు లోబడివుంటాడు; అదృశ్య సంకెళ్లకు బందీగా ఉంటాడు;  నిత్యం రొద పెట్టే కీచుగొంతులకు బానిసయి ఉంటాడు; భావజాలాల ఒత్తిడిలో మునిగివుంటాడు. వీటన్నింటినీ తట్టుకుని ఒంటరిగా నిలబడాలంటే చాలా సామర్థ్యం ఉండాలి; ఇది లేనివాళ్లు మరొకరివైపు చూస్తారు; వాళ్లే గురువును నిలబెడతారు.

గురుపీఠాన్ని నిరాకరించిన ఈ సరికొత్త ఆలోచనాపరుడికి అనూహ్యమైన సంఖ్యలో అనుచరులు ఏర్పడ్డారు. వాళ్లు కృష్ణాజీ, కృష్ణ అని పిలిచేవారు. తనను గురువుగా కాకుండా ఒక స్నేహితుడిలా మాత్రమే చూడమన్నాడు కృష్ణమూర్తి. ప్రపంచమంతా తిరిగాడు; వేలాది ప్రసంగాలు చేశాడు; వ్యక్తులతోనూ, సమూహాలతోనూ సంభాషించాడు. అవే మనకు లభ్యమవుతున్న ఆయన తత్వచింతన!

ఏ మతమైనా నీ శత్రువును కూడా ప్రేమించమనే చెబితే, ఇన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంత హింస ఎందుకు చోటు చేసుకుంటోంది? జాతీయత పేరుతో, మతం పేరుతో, సిద్ధాంతాల పేరుతో, మనుషుల మధ్య గీసుకునే గీతలు అవి ఏ రకమైనవైనా పనికిరావన్నాడు. గాలి వీచినప్పుడు అది గీతలు చూసుకోదు; సత్యం కూడా అలా  వ్యాపించాలి; అప్పుడు మాత్రమే జీవితానికి ఆధ్యాత్మిక సొబగు అద్దగలం. భయం, ఘర్షణ, హింస లేకుండా జీవించగలిగే స్వేచ్ఛ అందరికీ ఉండాలి. ఎవరూ సెకండ్‌ హాండ్‌ మనిషిలా బతగ్గూడదు; సొంతంగా ఆలోచించాలి; చేస్తున్న ఆలోచన మీద పూర్తి స్పృహ కలిగివుండాలి; ధ్యానం అంటే ఏదో ఒకటి చేయడం కాదు; ఏదీ చెయ్యకుండావుంటే దానికదే కలిగే ఒక స్థితి!

రోజువారీ జీవితంలో మనిషి ఎదుర్కునే అన్ని రకాల ఘర్షణలనూ ఆయన చర్చించాడు. ఒక సందర్భంలో, ‘‘నా రహస్యం ఏమిటో మీకు తెలుసుకోవాలనుందా? అయితే వినండి, ఏది జరిగినా నేను పట్టించుకోను,’’ అన్నాడు. సమస్య ఉందని గుర్తించడానికీ, సమస్యను మనసుకు తీసుకోకుండా ఉండటానికీ మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాను పసిగట్టాలని ఆయన ఉద్దేశం!

జిడ్డు కృష్ణమూర్తి అన్న పేరు కూడా ఒక పూర్వవాసన కలిగివుంది కాబట్టి, కేవలం సాంకేతికంగా, తనను ‘కె’ అనిపించుకున్నాడు. ఆలోచనలు పవిత్రమైనవేమీ కావు; నన్ను కూడా గుడ్డిగా నమ్మవద్దన్నాడు. ఎప్పటికైనా నేను తెలుసుకున్న సత్యమే ఉంటుంది తప్ప, నీకు పనికొచ్చే సత్యం ఉండదు, నీది నువ్వే తెలుసుకోవాలి, అని చెప్పాడు.  తానేదో తెలుసుకున్నాడు కాబట్టి, తనకు గొప్పదనాన్ని ఆపాదించడానికి నిరాకరించాడు. మనుషులు మూర్ఖులైతే సత్యాన్నీ, వ్యక్తినీ కలగలుపుతారు; వ్యక్తి చుట్టూ ఆలయం నిర్మిస్తారు; వ్యక్తికంటే సత్యం గొప్పది; సత్యంకన్నా వ్యక్తి ఏనాటికీ గొప్పవాడు కాదు, అన్నాడు. ఆ విషయం చెప్పినందుకైనా ఆయన గొప్పవాడు!

(సాక్షి ఫన్‌డే; 11 మే 2014)
––––––––––––––––––––––

Sunday, August 2, 2026

ప్రేమతో... నీ వాలెంటైన్‌!


c.225 - c.270


 ప్రేమతో... నీ వాలెంటైన్‌!

(ప్రేమికుల దినోత్సవం కోసం రాసింది.)

 

ఒక మనిషి మీద ప్రేమ ఎందుకు పుడుతుందో ఎవరు చెప్పగలరు! కళ్లల్లోంచి హృదయంలోకి జారిపోయే ఆ వెలుగును వర్ణించడం ఎవరితరం?

సృష్టిని కొనసాగనిచ్చే ఆ పవిత్ర ప్రేమను ఎంతగానో ప్రేమించాడు సెయింట్‌ వాలెంటైన్‌. క్రీ.శ. 270 కాలంనాటి ఈ మతగురువు తమ రోమ్‌ సామ్రాజ్యం అంతటా ప్రేమతోటలు పెరగాలని కాంక్షించాడు. ప్రేమలో తడిసి ముద్దయ్యేవారిని ముద్దుచేశాడు.

అయితే, చక్రవర్తి రెండో క్లాడియస్‌ తీరు ఇందుకు భిన్నంగా ఉంది. ఒంటరి బ్రహ్మచారులే మంచి సైనికులుగా పోరాడగలరని క్లాడియస్‌ ఆలోచన. భార్యా, పిల్లాపీచూ అని సైనికులు తలుస్తూంటే కత్తులమీద పట్టు బిగుస్తుందా? అశ్వారూఢులై యుద్ధంలో అరివీర భయంకరులు కాగలరా? అందుకే ఎవరూ వివాహలు చేసుకోకూడదన్నాడు క్లాడియస్‌. ఏడుస్తున్న పిల్లలను సముదాయించడంలో సహనం కాదు, శత్రువులను తరిమి తరిమి కొట్టడంలో సాహసం చూపమన్నాడు.

చక్రవర్తి అజ్ఞానానికి నవ్వుకున్నాడు వాలెంటైన్‌. అన్యాయం కాదూ! అతర్కం కాదూ! ప్రేమంటే సాక్షాత్తూ దైవమే కాదూ! స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడగలిగే మహోన్నత బంధాన్ని అడ్డుకోవడమా? పెళ్లి మీద నిషేధం విధించడమా?

పారిపోయి వచ్చిన యువతీయువకులకు పెళ్లిళ్లు జరిపించాడు వాలెంటైన్‌. ప్రేయసీ ప్రియులను నూతన వధూవరులుగా దీవించి పంపాడు. ప్రేమాగ్నిలో మీ పొరపొచ్చాలను దహించుకోండి; పిల్లాపాపలతో సుఖంగా ఉండండి; ఇంతకంటే అద్భుతమైన కార్యం మరొకటి లేనంతగా ప్రేమలో మునిగిపొండి!

కానీ రహస్యం దాగలేదు. క్లాడియస్‌కు విషయం తెలిసింది. ఉగ్రుడయ్యాడు. రాజద్రోహిని బంధించి తెమ్మని ఆదేశించాడు. భటులు పరుగెత్తారు. వాళ్లను ప్రేమగా ఆహ్వానించాడు వాలెంటైన్‌.

ఒకవైపు రాజ్యం పొరుగుదాడుల్తో సంక్షోభంలో ఉంటే మీరు ప్రేమమంత్రాలు జపిస్తున్నారా? అన్నాడు క్లాడియస్‌.
మనుషుల్ని దగ్గరగా చేసే ప్రేమకు మనుషుల్ని దగ్గర చేస్తున్నాను, అన్నాడు వాలెంటైన్‌.

ప్రేమ మీద అధికారం గెలిచింది. శాసన ధిక్కారం సాకుగా మరణశిక్ష ఖాయమైంది. కారాగారంలో బందీ అయ్యాడు వాలెంటైన్‌. ఆ ప్రేమగురువును చూసేందుకు ఎవరెవరో వచ్చేవారు. వారిలో జైలు అధికారి కుమార్తె కూడా ఉండేది. వాలెంటైన్‌లోని పూజారిలోంచి ప్రేమికుడు మేల్కొన్నాడు. ఆ చివరి రోజుల్లో ఆమె వచ్చే ఆ క్షణాల్నే ఆయన పొదువుకున్నాడు. వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరి తీశారు. ఉరితీయబోయే ముందురోజు రాత్రి ‘నీ వాలెంటైన్‌ నుంచి’ అన్న వాక్యంతో ఆమెకో ఉత్తరం రాశాడు. అదొక చరిత్రాత్మక వాక్యం అయింది. కాలక్రమంలో వాలెంటైన్‌ అనే పేరు ప్రేమికుడికి పర్యాయపదం అయింది. క్లాడియస్‌ మరణించాడు. వాలెంటైన్‌ మరణించీ జీవించాడు. ప్రేమ మీద అధికారం ఎన్నటికీ గెలవలేదు!

ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో, కాలం తొలగించిన దుస్తులెన్నో, కట్టుకున్న కొత్త రెక్కలెన్నో! వాలెంటైన్‌ గురించిన ఎన్నో కథనాలు! ఇది ‘ప్రేమ’కు సమీపంగా ఉన్న కథగా ప్రపంచప్రేమికులందరూ గానం చేస్తున్నారు, ప్రేమికుల రోజున ప్రేమకు పునరంకితం అవుతున్నారు.

అయితే, వాలెంటైన్‌ డే అంటే ‘వంద కోట్ల కార్డులు అమ్మడం కాదు. కేవలం కోరుకోవడం కాదు, ఇవ్వడం! ప్రేమంటే కళ్లుమిరుమిట్లుగొలిపే ప్రవాహం కాదు, నిత్యం ప్రవహించాల్సిన జీవధార! పుట్టిన మనిషి చేయగలిగే పుణ్యకార్యం. మరణం దాకా నిలుపుకోగలిగే మహత్వం!

(సాక్షి ఫన్‌డే; 9 ఫిబ్రవరి 2014)

Thursday, July 30, 2026

ఘనజీవి రావిశాస్త్రి


 రాచకొండ విశ్వనాథశాస్త్రి

30 July 1922 - 10 Nov 1993

ఘనజీవి

జూలై 30న రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి జయంతి
------------------------------------------------------------------------


‘‘రావిశాస్త్రి మంచి రచయిత కాడు’’.
అది సుబ్బయ్య అభిప్రాయం కాదు.
‘‘రావిశాస్త్రి ఒట్టి చచ్చు రచయిత’’.
అదీ సుబ్బయ్య అభిప్రాయం కాదు.
‘‘రావిశాస్త్రి ఈజ్‌ వెరీ ఎఫిషియన్ట్‌ రైటర్‌’’.
సుబ్బయ్యలాగే అనేకమంది ‘పాస్‌’ చేసే ‘రిమార్క్‌’ అది.

రావిశాస్త్రి హాఫ్‌ హాండ్స్‌ చొక్కా వేసుకుంటాడు. వేసుకున్న హాఫ్‌హాండ్స్‌ చొక్కాను టక్‌ చేసుకుంటాడు. మనిషి చూడ్డానికి తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్నాయన నల్లటి కళ్లద్దాలు పెట్టుకుంటాడు. ఆ కళ్లద్దాలు మందంగా ఉంటాయి. హాఫ్‌హాండ్స్‌ చొక్కాను టక్‌ చేసుకునే ఈ తెల్లటి నల్ల కళ్లద్దాల మనిషిని పూర్తిపేరుతో రాచకొండ విశ్వనాథశాస్త్రి అని ఎవరూ పిలవరు. ‘చాత్రిబాబు’ అంటారు. లాయర్‌ బాబు అని కూడా అంటారు. అలాంటి లాయర్‌బాబైన చాత్రిబాబు ‘నంగిరిపింగిరి’గా ఎప్పుడూ రాయలేదు. ధైర్యంగా రాసేడు. జోరుగా రాసేడు. రకరకాల బతుకుల్నీ, ‘అధోజగత్‌’ జీవుల్నీ; కోర్టుల్లోని ప్లీడర్లనూ, సాక్షులనూ, సారాకాసేవాళ్లనూ, ఆ కాసిన సారాతాగేవాళ్లనూ, సిల్కు జాకెట్లనీ, ‘గవరయ్య’ల్నీ, నాయకుల్నీ, దోపిడీగాళ్లనీ, అమాయకుల్నీ, పిరికివాళ్లనీ అందరినీ బొమ్మ కట్టించేడు. ‘ధైర్యం ఉంటేనే మిగతా సద్గుణాలు (నిలబడతాయి.)... పాపుల్లో సాహసులూ ఉంటారు, భయస్తులూ ఉంటారు. కాని– భయానికీ మంచికీ పొందిక లేదు. పిరికివారెవరూకూడా మంచివారు కాజాలరు; మంచికి నిలబడలేరు... మంచిగా ఉండాలంటే గుండె నిబ్బరం చాలా ఉండాలి,’ అని మనస్ఫూర్తిగా నమ్మి రాసేడు. ‘డబ్బులో వుండే సౌఖ్యాలూ, లేమిలో వుండు దుఃఖాలూ, ధనం కల్పించే గొప్ప గర్వం మదాంధతా, లేమి కల్పించే నిస్పృహ నైచ్యం దైన్యం’ అన్నీ కూడా జీవితంలోంచి బాగా ఎరిగి రాసేడు. ‘నిజంగా జరిగింది నిజంగా జరిగిందా? జరిగినది నిజం జరిగినది నిజమేనా?’ అని అక్షరాలను ఆచితూచి మరీ రాసేడు. ‘దారిద్య్రం ఎవ్వరికీ... (చివరికి తన) పగవాడిక్కూడా ఉండకూడదని’ మరీమరీ తలిచేడు, తలిచి మరీ రాసేడు. ‘‘సందర్భానికి తగినట్టుగా ఆయన రచన ఒకచోట సెలయేటి నడకలా ఆహ్లాదం కొలుపుతుంది. మరొకచోట ప్రవాహంలా పరవళ్లు తొక్కుతుంది. ఇంకొకచోట జలపాతంలా ఊపిరి సలపకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉండి ఉండి ఒక్కొకచోట కవిత్వంగా మారి కావ్యస్థాయికి తీసుకెళ్తుంది’’.

‘బందోబస్తుగా చాలా భారీగా ఉన్నాడతను. సీమపందిలా ఎర్రగానూ, పనసకాయలా గరుగ్గానూ ఉన్నాడు. బాగా సర్వీసు చేసినప్పటికీ చెడిపోకుండా నిలబడ్డ బెంజి లారీలా దిట్టంగానూ ఉన్నాడు’. (‘రాజు–మహిషి’ నవలలో మందుల భీముడి గురించి)
‘ఆమెకు ముప్పయ్యేండ్లుండొచ్చు. ఒకప్పుడామె అందంగా ఉండుంటుంది. పెద్ద కొప్పుని ఒకప్పుడు చక్కగా ముడుచుకుని ఉండుంటుంది. ఆమె కట్టుకున్న నల్లకోక ఒకప్పుడు, అప్పుడెప్పుడో కొత్తదయుంటుంది. చాలారోజుల కిందట చాలాసార్లు భోంచేసి ఆమె ఆరోగ్యంగా ఉండుంటుంది (‘మాయ’ కథలో ముత్తేలమ్మ వర్ణన)

శంకరగిరి గిరిజాశంకరం, అన్‌జానా, జాస్మిన్, కాంతాకాంత, గొల్కొండ రాంప్రసాద్‌ లాంటి మారుపేర్లతోనూ రాశాడు రావిశాస్త్రి. తన కోపం, తన దుఃఖం, సంతోషం, సరదా, క్యూరియాసిటీ వగైరాలు ఇతరులకు తెలియచెయ్యడానికి కూడా ఆయన రచయిత అవతారం ఎత్తాడు. అయితే, ‘తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తూందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తూందో అని ఆలోచిం’చి మరీ జాగ్రత్తగా రాసేడు. ‘రచయిత (అయిన) ప్రతివాడూ’ కూడా అలాగే రాయాలని కోరుకున్నాడు.

ఆరు సారా కథలు, ఆరు సారో కథలు, ఆరు చిత్రాలు, మరో ఆరు చిత్రాలు, రుక్కులు, బాకీ కథలతోపాటు, అల్పజీవి, ఇల్లు, సొమ్ములు పోనాయండి, గోవులొస్తున్నాయి జాగ్రత్త నవలల్ని మళ్లీ మళ్లీ చదువుకొండని వదిలేసివెళ్లిపోయాడు రావిశాస్త్రి. రత్తాలు–రాంబాబు, రాజు–మహిషి లాంటి అసంపూర్ణ నవలలను పూరించుకునే అవకాశం కూడా ఇచ్చివెళ్లాడు. అర్ధాంతరంగా ముగించినా, వాటిని సంపూర్ణంగా పారాయణం చేయగలిగేలా చేసేది రావిశాస్త్రి చేసిన మాటల మాయాజాలం; కాళిదాసులాగా ముచ్చటగొలిపే ప్రతీకల శైలీ విన్యాసం. అసలు ఉపమానాలతోనే కడుపు నింపేస్తాడు. ఒక్కోసారి కథను పక్కనపెట్టి, చదవడం కోసమే చదువుకోగల వినోదం ఇస్తాడు. ఆ తరహా చాలా కొద్దిమందికి లోపమూ, చాలా ఎక్కువమందికి ఆయన అక్షరాల్ని విడిచిపెట్టకుండా చదువుకునే ఆకర్షణాబలమూ!

(సాక్షి ఫన్‌డే; 27 జూలై 2014)
––––––––––––––––––––––

Monday, July 27, 2026

నదిలాంటి మనిషి


రాహుల్‌ సాంకృత్యాయన్‌ 

9 Apr - 1893 - 14 Apr 1963


 

నదిలాంటి మనిషి



అద్భుతం అనే విశేషణానికే గనక రూపమొస్తే, అది ఆరడుగుల రాహుల్‌ సాంకృత్యాయన్‌లా ఉంటుంది. ఎలాంటి మనిషాయన!

యాత్రికుడు, చరిత్రకారుడు, భాషాశాస్త్రవేత్త, అనువాదకుడు, ఆచార్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అపారమైన పాండిత్యం ఉన్నప్పటికీ సరళమైన హిందీలో రాసిన రచయిత!

రాహుల్‌జీ పేరు వినగానే, కాళ్లకు కట్టుకోవడానికి బలపాల్ని వెతికేవాళ్లు ఉంటారు. అంతటి ఉత్తేజకర పాదాచారి ఆయన. యాత్రలు వాటికవే ఇవ్వగలిగే పరమానందాన్ని అనుభవిస్తూనే, వాటిద్వారా పరమార్థాన్ని కూడా ప్రజలకు అందించారు రాహులుడు.

ఒకసారి ఈ దృశ్యం ఊహిద్దాం! పదమూడో శతాబ్దంలో నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలను భక్తియార్‌ ఖిల్జీ ధ్వంసం చేసినప్పుడు బౌద్ధ భిక్షువులు పవిత్రమైన గ్రంథాలతో పారిపోయారనీ, ఆ విలువైన సంస్కృత పుస్తకాల్ని టిబెట్‌లోని ఆరామాల్లో భద్రపరిచివుంచారనీ ప్రచారంలో ఉంది. అయితే, ఆరు వందల ఏళ్లుగా వాటిల్లో ఏముందో చూసినవారు లేరు.

సాంకృత్యాయన్‌ వాటికోసం అన్వేషిస్తూ, దారి కూడా సరిగాలేని కొండల్లో నడుస్తూ, కాశ్మీర్, లడఖ్, కార్గిల్‌ మీదుగా టిబెట్‌ వెళ్లారు. అక్కడ పుస్తకాలైతే లభించాయిగానీ అవి సంస్కృతంలో లేవు. అన్నీ భోత్‌ భాషలో ఉన్నాయి. రాహుల్జీ కంచరగాడిదల మీద వాటిని తరలించుకొచ్చారు. మరో మూడుసార్లు టిబెట్‌ వెళ్లారు. టిబెటన్‌ నేర్చుకున్నారు. నేర్చుకోవడమేకాదు దాని వ్యాకరణ పుస్తకాలు రాశారు. టిబెటన్‌–హిందీ నిఘంటువు కూర్చారు. ఆ గ్రంథాలన్నీ పాట్నా మ్యూజియంలో ఉన్నాయిప్పుడు.

‘‘ప్రపంచంలో యాత్రలు చేయడానికి మించిన ముఖ్యమైన విషయం మరోటి లేదు. సమాజం కోసం ఒక యాత్రికుడికంటే శ్రేష్టంగా ఆలోచించగలవారు మరెవరూ ఉండరు,’’ అనేవారు రాహుల్జీ. ఈ ప్రపంచం ఈ రీతిన ఉండటానికి యాత్రికుల వివేకమే కారణమంటారాయన. ‘‘యాత్రలంటూ జరగకపోయివుంటే సోమరి మానవమూకలు పశుస్థాయినుంచి పరిణామం చెందేవే కాదు’’.

ఉత్తరప్రదేశ్‌లోని పల్లెటూరులో కేదార్‌నాథ్‌ పాండేగా జన్మించి, తొమ్మిదేళ్లప్పుడే ప్రపంచం ఏమిటో చూడాలని ఇంట్లోంచి పారిపోయాడు సాంకృత్యాయన్‌. వేలాది కిలోమీటర్లు కాలినడకన చుట్టివచ్చారు. బౌద్ధాన్ని తనలో ఇంకించుకున్నవాడుగా తన పేరును రాహుల్‌ సాంకృత్యాయన్‌గా మార్చుకున్నారు. మూడు బౌద్ధ వేదాలనూ జీర్ణించుకుని త్రిపిటకాచార్య అయ్యారు. టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, అప్పటి సోవియట్‌ రష్యా... ఎక్కడ తిరిగితే అక్కడి భాష నేర్చుకున్నారు. అరబిక్, భోజ్‌పురి, ఫ్రెంచ్, హిందీ, కన్నడం, మైథిలి, నేపాలీ, పాళీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళీస్, తమిళం, ఉర్దూలాంటి ముప్పైకి పైగా భాషలు, అందులోని యాసలు కూడా ఆయనకు తెలుసు. ఎక్కడా అధికారికంగా చదువుకోకపోయినా విశ్వవిద్యాలయాల్లో బోధించే స్థాయికి ఎదిగారు. అందుకే ఆయన్ని మహాపండిత్‌ అనేవారు.

చివరికి మార్క్సిజం దగ్గర తన భావాల్ని స్థిరీకరించుకున్న రాహుల్జీ... సోషియాలజీ, మతం, తత్వం, భాష, సైన్సు మీద శతాధిక పుస్తకాలు రాశారు. రుగ్వేద ఆర్యులు, లోకసంచారి, దివోదాసు, విస్మృత యాత్రికుడు, సింహసేనాపతి, జయమౌధేయ, మధురస్వప్నం లాంటివి అందులో కొన్ని. సృష్టాది నుంచీ ఈ ప్రపంచపు నడతను మేఘాల్లో కూర్చుని వీక్షించినట్టుగా ఆయన చరిత్రను రికార్డు చేసిపెట్టారు. లేదంటే ‘ఓల్గా నుంచి గంగకు’ రాయడం ఎలా సాధ్యం!

చరిత్రను అర్థం చేయించడానికి ఆయన పూసిన పంచదార పూత ఒక్కోసారి అది చరిత్రేనా అన్న అనుమానాన్ని కలిగిస్తుంది. కానీ ఎన్ని చరిత్రగ్రంథాలు చదివినా మెదడులో నమోదుకాని దృశ్యమాలిక ఆయన ‘ఓల్గా నుంచి గంగకు’ ద్వారా నమోదవుతుంది. రిఫరెన్సు పుస్తకాలు కూడా కంఠోపాఠంగా ఉంచుకున్న ఈ మహావిజ్ఞాని చివరిరోజుల్లో తన పేరేమిటో తనే చెప్పుకోలేని మతిమరుపులోకి జారిపోవడం సృష్టి వైచిత్రి. కానీ ఆయన్ని మనం మాత్రం మరిచిపోగలమా!

(సాక్షి ఫన్‌డే; 6 ఏప్రిల్‌ 2014)
––––––––––––––––––––––

Friday, July 24, 2026

పండిత్‌ చౌరాసియా


హరిప్రసాద్‌ చౌరాసియా 

 

పండిత్‌

హరిప్రసాద్‌ చౌరాసియా వేణుగానం పలికించడం చూస్తే– ఆ నాదం వాద్యంలోంచి మాత్రమే వచ్చినట్టు ఉండదు; మడిచిన పెదాలలోంచీ, ఆడే చేతివేళ్లలోంచీ మాత్రమే కాదు, ఆయన వెన్నులోంచీ, ఎగిరే జుట్టులోంచీ, మొత్తంగా ఆయన ఒంట్లోంచీ సంగీతం వెలువడినట్టుంటుంది.

‘కృష్ణభగవానుడితో నేరుగా అనుసంధానం కలిగిన వాద్యమిది. ఏ ఆడంబరం లేదు, ఏ తొడుగులు లేవు, ఏ తంత్రులు అక్కర్లేదు. వెదురు ముక్క చాలు. గాలిని నియంత్రించడానికి రంధ్రాలు! దేవుడు మాత్రమే ఇంత సరళమైన వాద్యాన్ని కనిపెట్టగలడు!’ అంటారు చౌరాసియా. ‘పైగా తీసుకెళ్లడం ఎంత సులభం’!

ఒక వస్తాదు కొడుకుగా చౌరాసియా సంగీతంతో రహస్యంగా కుస్తీ పట్టాల్సివచ్చింది. కారణం, వాళ్ల నాన్నకు సంగీతమంటే వేశ్యలకు సంబంధించింది! తనలాగే కొడుకూ వస్తాదు కావాలని ఆయన కోరిక.
 
నాలుగున్నరేళ్లప్పుడే అమ్మపోయింది కాబట్టి, నాన్నను ఒప్పించే మార్గం లేకపోయింది. అందుకే గుడికి వెళ్తున్నానని చెప్పి స్నేహితుడింటికి వెళ్లేవారు. అక్కడ పాడటం సాధన చేసేవారు. పండిత్‌ రాజారామ్‌ ఆయనలో ప్రతిభ ఉందని గుర్తించి, బోధించడం మొదలుపెట్టారు. అప్పటికింకా హరిప్రసాద్‌ చేతుల్లోకి వేణువు రాలేదు.

‘పదిహేనేళ్ల వయసులో అలహాబాద్‌ రేడియోలో తొలిసారి వేణుగానం విన్నాను. స్వర్గానికి రవాణా అయినట్టుగా అనుభూతి చెందాను. అది నా జీవితంలో కీలకమలుపు,’ అంటారు చౌరాసియా. అంతే! అంత గొప్పగాలేని తన గాత్రానికి స్వస్తిచెప్పారు. ఆ వేణువూదిన పండిత్‌ భోలానాథ్‌ను వెతుక్కుంటూ వెళ్లి, గుమ్మంలో వాలిపోయారు. కూరగాయలు కోయడం, మసాలాలు నూరడానికైనా ఈ పిల్లాడు పనికొస్తాడని ఒప్పుకున్నారాయన. కానీ అదే భోలానాథ్‌ అచ్చెరువొందేలా, వేణువుకు సరికొత్త ఊపిరిలూదారు చౌరాసియా.

వేణువు అర్హతగా ఒరిస్సా రేడియోలో ఉద్యోగం వచ్చినరోజున చౌరాసియా నాన్న ఆశ్చర్యపోయారు, దాచివుంచిన సంగతి గురించి! కానీ ఒప్పుకోక తప్పలేదు. అదే ఒరిస్సా రేడియో ఆయన్ని ‘బొంబాయి’ చేర్చింది. మదన్‌మోహన్, రోషన్‌ లాంటి సంగీతదర్శకులు ఆయన వేణుగానానికి సమ్మోహితులై సినిమాల్లోకి ఆహ్వానించారు. ఎస్‌ డి బర్మన్, ఆర్‌ డి బర్మన్‌తోనూ పనిచేశారు(తర్వాతి కాలంలో ‘సిరివెన్నెల’కు తన వేణువుతో  ప్రాణం పోశారు). ‘బాలీవుడ్‌ అవకాశాలు నన్ను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశాయి. భవంతి సమకూరింది, కారు ముంగిట ఆగింది, భౌతిక అవసరాలు తీరాయి; కానీ ఒక అసంతృప్తి మొదలైంది. నేను కళాకారుడిగా ఎదగడం లేదు. నాకు ఇంకేదో కావాలి, నా ఆత్మ సుఖించడం లేదు,’ అని అప్పటి మథనం గురించి చెబుతారాయన.

దాంతో ‘సుర్‌బహార్‌’ విద్వాంసురాలు అన్నపూర్ణాదేవిని కలిశారు. అప్పటికే పండిత్‌ రవిశంకర్‌నుంచి విడిగా ఉంటున్నారామె. బహిరంగ ప్రదర్శనలు మానేశారు. ఆమె చౌరాసియాను ముందు శిష్యుడిగా అంగీకరించలేదు. బయటికి తోసినంత పనిచేశారు. కానీ మూడేళ్లుగా చూపిస్తున్న ఆయన తపనకు తలొగ్గక తప్పలేదు. ‘నేను పట్టుదలతో ఉన్నానని తెలియజేయడానికి నా చేతుల్ని మార్చుకున్నాను. అంతకుముందు కుడిచేత్తో వాయించేవాడిని. ఎడమచేతికి మారిపోయాను. వెనక్కి చూడకుండా వెనక్కి తిరిగి నడవడం లాంటిదది. హింస! కానీ సంతోషం! ఆమె నాకు గురువు మాత్రమే కాదు, దేవతకన్నా ఎక్కువ. నా ఆకలి, ఆరోగ్యం పట్టించుకున్నారు. నా సంగీతానికి పరమార్థం కల్పించారు,’ అని తబ్బిబ్బవుతారు చౌరాసియా.

‘ఒక్కో క్షణం అద్భుతంగా ఉంటుంది. ఆ క్షణంలో సంగీతం ప్రవహిస్తుంది. ఒక నీటిచుక్క నువ్వు దాహంగా ఉన్నప్పుడు ఆర్తి తీర్చుతుంది. అదే బిందువు నీటియంత్రంలోంచి పైకి ఎగిరినప్పుడు దాని అందంతో మురిపిస్తుంది. మళ్లీ అదే చుక్క మురికినీరులో కలిసి అసహ్యం పుట్టిస్తుంది. అదే నీటిబిందువు నదిలో కలిసి ఈదే ఉత్సాహం కలిగిస్తుంది. అదే చుక్క సముద్రంలో కలిసినప్పుడు తన శక్తితో ఆశ్చర్యగొలుపుతుంది. ఇదంతా కూడా సంగీతంతో పలికించొచ్చు’.
 
‘వేణుగానం చేయడమంటే శ్వాసను నియంత్రించడం. ఇంకోమాటలో యోగా చేయడం. ఒక పవిత్రమైన బాధ్యతతో, ఆధ్యాత్మిక మానసిక స్థితితో ఒక ధ్యానంలాగా యోగంలాగా నేను పాడతాను. అసలు నేను శ్రోతలకోసమే పాడతాను. కానీ అందులో ఎన్నో రకాలవాళ్లుంటారు. వారందరినీ తృప్తి పరచడం సాధ్యం కాదు. వాళ్ల మధ్యలో ఒక గొప్ప శక్తి ఏదో కనబడుతుంది. అది మాధవుడే కావొచ్చు. ఆ శక్తికోసం నేను వేణువు పలుకుతాను. నాలోనేను దైవాన్ని అనుభవిస్తాను,’ అంటారు తన వేణుగానం గురించి.

‘సంగీతమే నా ప్రార్థన. సంగీతమే నా మతం’ అనే చౌరాసియాకు ఎక్కడా రికార్డుగా లేని కృష్ణుడి గానం వినలేదన్న చింత ఉందట! కానీ మనకా బాధ లేదు.

(సాక్షి ఫన్‌డే; 29 జూన్‌ 2014)
––––––––––––––––––––––

Tuesday, July 21, 2026

అగ్నిధార దాశరథి


దాశరథి కృష్ణమాచార్య
22 July 1925 - 5 Nov 1987
 

అగ్నిధార

జూలై 22న కవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి
---------------------------------------------------------------

‘‘నువ్వు ఎటు వెళుతున్నావ్‌?’’ అనడానికి ‘‘త్వకుంత్ర గచ్ఛసి’’ అనాలనేంతటి పట్టుదలవున్న ఇంట్లో జన్మించాడు దాశరథి. కానైతే ఆయనకు అంతటి సంస్కృత ‘ఛాందసం’ నచ్చేదికాదు. అలాగే, నిజాం కాలంలో ‘తెలుగు మీద దండయాత్ర’ జరుగుతున్న కాలంలో చదువుకున్నాడు. ఆయన అదీ సహించేవాడు కాదు. బహుశా, ఈ కారణాలవల్లేనేమో ఆయనలో రెండు పరస్పర విరుద్ధాంశాలు అద్భుతంగా సంలీనం చెందిన తీరు కనిపిస్తుంది. ‘సంప్రదాయం’లో బతుకుతూనే విప్లవమార్గాన్ని అనుసరించాడు; ‘పాత బూజు’గా ఎద్దేవా అవుతున్న పద్యాల్లోనే అభ్యుదయాన్ని కలగన్నాడు.

దాశరథి లాంటివాళ్లకు, లేదా ఆ కోవకు చెందిన రచయితలకు సాహిత్యం కేవలం సాహిత్యం కాదు; అది ఒక సామాజిక బాధ్యత. నిర్బంధం, చిత్రహింసలకు వ్యతిరేకంగా జాతిని జాగృతం చేయాల్సిన పవిత్ర కర్తవ్యం. అందువల్లే, ‘అగ్నిధార’, ‘రుద్రవీణ’, ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘తిమిరంతో సమరం’ లాంటి కావ్యాలు వెలువరించాడు. ‘అగ్నిధార అనేపేరును కొందరు ఆక్షేపించారు. అగ్ని ధారలా ప్రవహిస్తుందా? అన్నారు కొందరు. విద్యుత్తు అగ్ని కాదా? అది ప్రవహించదా? సముద్రంలోని బడబ, అగ్ని కాదా? అది నీటిలో అన్నివైపులా సాగిపోదా?’ అన్నాడు దాశరథి. అగ్నిని చైతన్యానికి సంకేతంగా, ఆ చైతన్యం ఒక మానవహృదయంలోనుండి ఇంకొకనిలోకి ప్రవహించి, జాతినంతటినీ ఏకసూత్రాన కట్టిపడేసేదిగా ఆయన తలచాడు.

‘నా గమ్యం ప్రపంచశాంతి. నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం’ అని ప్రకటించుకున్న దాశరథి జీవితాన్నే పోరాటంగా మలుచుకున్నాడు. ‘తిమిరంతో ఘనసమరం, జరిపిన బ్రతుకే అమరం’ అన్నాడు. ‘ఈ కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగల్చి కాల్చి, నాలో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు’ అని ప్రకటించాడు. కార్యాచరణ కూడా కవి కర్తవ్యంగా భావించినవాడు కాబట్టి, కటకటాల పాలయ్యాడు.

1948లో ఆయన్ని వరంగల్లు జైలునుంచి నిజామాబాద్‌ జైలుకు మార్చినప్పుడు మొదట వట్టికోట ఆళ్వారుస్వామి కనిపించి సంబరపడ్డాడట. వట్టికోట కోసం దాశరథి జైలుగోడమీద బొగ్గుతో ఈ పద్యం రాశాడు: ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్నబోలిన రాజు మాకెన్నడేని;/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ, కోటిరత్నాల వీణ.’

గాఢమైన యౌవనప్రాయంలో ఆయన జైలుగోడల్లో బందీ అయ్యాడు. కానీ ఆయన మధురస్వప్నాల్ని ఎవరు బంధించగలరు? ‘అంగారం, శృంగారం నీ రచనలో కలగలిసి ఉంటాయి,’ అనేవారు ఆయన్ని చనువున్న మిత్రులు. సైనికుడు యుద్ధంలో పోరాడుతూకూడా అప్పుడప్పుడూ తన ప్రియురాలి అందమైన కళ్లను తలచుకోవడం అస్వాభావికమా? అని ప్రశ్నిస్తాడు దాశరథి. అందుకేనేమో, ఆ భయానక ఒంటరి క్షణాల్లో వాళ్ల ఊరి నదికి మంచినీళ్లు తీసుకుపోవడానికి వచ్చే పచ్చని అమ్మాయి తలపుల్లో మెదులుతుండేదట! ఆకాశంలోకి తలెత్తి చూస్తే, మేఘాలు అందమైన అమ్మాయిల ఆకారాలు ధరించి, పొంగిన వక్షస్థలాలతో కవ్వించేవట! మరోపక్కేమో జైలు బ్యారకు, నగ్న ఖడ్గం ధరించిన తుపాకీ భటుడు కనిపించేవాడు. వాణ్ని నరికేసి, లేదా వానిచే నరకబడి, ఆకాశంలోని మేఘభూమి వైపు సాగిపోవాలనిపించేదట! ఏ శషభిషలు లేకుండా, ‘పాపులర్‌’ మూడ్‌ను పట్టించుకోకుండా రాయడం దాశరథి నిజాయితీ!

‘నేను పోతన కవీశానుగంటములోని ఒడుపుల కొన్నింటిని బడసినాను’ అని తన అభిమానాన్ని వెల్లడించిన దాశరథి... ‘మంచి కవిత్వం ఏ భాషలో వుంటే అది నా భాష/ మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడు’ అని తన రసహృదయాన్ని చాటుకున్నాడు. గాలిబ్‌ను అందువల్లే ఆయన పలవరించివుండొచ్చు. దాశరథిని తలుచుకోవడానికి నిజానికి గాలిబ్‌ గీతాల అనువాదం ఒక్కటి చాలు. ‘ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము/ నరుడు నరుడౌట యెంతొ దుష్కరము సుమ్ము’. ‘దేవి! మన పూర్వబంధమ్ము త్రెంచబోకు/ ప్రేమలేకున్న నుండనీ ద్వేషమేని’. ‘మనిషి ఏకాకియౌనను మనసులోన/ గుంపులుగ భావములు జేరి గోష్ఠి జరుపు’.

ఇక... ‘ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’, ‘నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలువనీరా’, ‘ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా’... సినిమా పాట స్థాయిని దిగజార్చకుండా పాటలు రాసిన అతికొద్దిమందిలో దాశరథీ ఒకరు.

ఆయన ‘ఆంధ్రప్రదేశ్‌ తొలి ఆస్థానకవి’గా నియమితుడయ్యాడు. ‘యాత్రాస్మృతి’ పేరిట చక్కటి వచనం రాశాడు. ఆయన్ని ఎరిగినవారు స్నేహశీలి, మృదుస్వభావి, నిరాడంబరుడు అని చెబుతారు. వేటూరి అన్నట్టు, ‘అతను బుడుగైనా ఆర్తి పొడుగు. మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది’!

(సాక్షి ఫన్‌డే; 20 జూలై 2014)

Wednesday, July 15, 2026

దిమ్మరి చార్లీ


చార్లీ చాప్లిన్‌
16 Apr 1889 - 25 Dec 1977


దిమ్మరి చార్లీ!


పుడుతూనే నడకతోపాటుగా నటన నేర్చుకున్నవాడు... చార్లీ చాప్లిన్‌! వేదిక మీద ఆగిపోయిన తల్లి పాటను అందుకుని గొంతెత్తి పాడితే, దానికి ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందిస్తుంటే, తనుమాత్రం మీదకు విసిరిన చిల్లరడబ్బుల్ని ఏరుకోవడంలో మునిగిపోయాడు. చప్పట్లు ఆకలి తీర్చుతాయా! ఆకలికి మాడినవాడు కాబట్టే, ‘బూట్లను ఉడికించి, తినాల్సివచ్చిన’ సన్నివేశాన్ని(గోల్డ్‌ రష్‌) సృజించగలిగాడు.

తాగుబోతు తండ్రి, మతిస్థిమితం తప్పిన తల్లి, అనాథశ్రమాల్లో గడపాల్సిన పరిస్థితి, రెండేళ్లు మాత్రమే చదివిన చదువు... ఖరీదైనదిగానే తప్ప మరోలా మన ఊహకు అందని లండన్‌ నగరంలోని అతిపేదరికాన్ని చిరు చాప్లిన్‌ అనుభవించాడు. అందుకేనేమో, ‘‘నేనెప్పుడూ వాననీటిలో నడవడానికి ఇష్టపడతాను, నా కన్నీళ్లు ఎవరికీ కనబడకుండా’’ అన్నాడు.

పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడకముందు చాప్లిన్‌ చాలాపనులు చేశాడు. స్టేషనరీ స్టోరులో, డాక్టర్‌ ఆఫీసులో, గ్లాసు ఫ్యాక్టరీలో, షాండ్లియర్‌ షాపులో, ప్రింటింగ్‌ ప్లాంటులో. అయినా అదంతా జీవితం ఇవ్వగలిగే అనుభవంగానే లెక్కించాడు. అసలంటూ బతక్కపోవడంకంటే అది మేలే కదా!
 
‘‘జీవితంలో ట్రాజెడీ ఒక భాగం. కానీ దాన్ని ఎదుర్కోవడానికి పుట్టిందే కామెడీ’’ అన్నాడు చాప్లిన్‌. కానీ ఆ కామెడీ ఎలా ఉండాలి? ‘‘నా బాధ ఒకరి నవ్వుకు కారణమైతే కావొచ్చుగాక, కానీ నా నవ్వుకు మాత్రం మరొకరి బాధ కారణం కారాదు’’. ‘‘ఒక వృద్ధుడు అరటితొక్క మీద కాలువేసి జారి పడితే– దానికి మనం నవ్వం. అదే కొంచెం అతిశయంతో నడుస్తున్న వ్యక్తి పడితే మాత్రం నవ్వుతాం’’. ఇదీ చాప్లిన్‌ హాస్యం! ప్రపంచంలో ఇంతమందికి బుగ్గల్లో సొట్టలు పడేలా చేసిన నటుడు మరొకరు లేరు.

కానీ ఆయన సినిమా అంటే హాస్యమొక్కటేనా? నలుపు తెలుపు చిత్రాల్లోనే జీవితంలోని అన్ని రంగుల్నీ చూపించాడు; నిశ్శబ్ద సినిమాల్లోనే జీవితపు అన్ని పార్శా్వల్నీ వ్యాఖ్యానించాడు.  పార్కు, ఓ అమ్మాయి, ఒక పోలీసు ఉంటే చాలు, సినిమా తీసేస్తాననేవాడు చాప్లిన్‌. మిగతా నటులందరికీ భిన్నంగా అందమైన ముఖాన్ని మేకప్‌ చాటున దాచిన ఏకైక నటుడు చాప్లిన్‌. బ్యాగీప్యాంటు, టైటుకోటు, పెద్ద తల, చిన్న టోపీ, వెలిసిపోయిన బట్టలు, అయినా హుందాతనాన్ని కాపాడుకునే యత్నంగా చేతికర్ర, చేసేది కామెడీయే అయినా సీరియస్‌నెస్‌ తేవడానికి చిన్నమీసాలు, పెద్దబూట్లు, పెంగ్విన్‌ లాంటి నడక... ఆయన నిజంగా దిమ్మరిగా గడిపినప్పుడు ఆదరణ లేదు; కానీ దిమ్మరి వేషానికి (ట్రాంప్‌) మాత్రం జేబుల్నిండా డబ్బులు కుక్కింది హాలీవుడ్‌. ద కిడ్, ద గోల్డ్‌ రష్, ద సర్కస్, సిటీ లైట్స్, మోడర్న్‌ టైమ్స్, ద గ్రేట్‌ డిక్టేటర్‌(టాకీ), లైమ్‌లైట్‌(టాకీ)... ఆయన సినిమాల్లోని సన్నివేశాల్లోంచీ, ఆయన కూర్చిన సంగీతంలోంచీ ఎన్నో సినిమాల్లో ఏదో ఒక రిఫరెన్సు లేకుండా ఉండదు! చాప్లిన్‌ లాంటివాళ్లకు తప్ప, కాలాతీతం అనేది ఊరికే వాడగలిగే మాటకాదు.

అయినా ఒరిజినాలిటీ అనేదాన్ని చాప్లిన్‌ అంగీకరించలేదు. ‘‘జీవితం మొత్తం స్టీరియోటైపే. మనం ఏ ఒరిజినాలిటీతోనూ నిద్ర లేవం. మనందరమూ మూడు పూటల భోజనం, ప్రేమలో పడి లేవడమనే సాధారణ వ్యవహారాలతోనే పుట్టి చచ్చిపోతాం. కాకపోతే దాన్ని మలచడంలోనే ఆసక్తి పుట్టించగలగాలి’’ అనేవాడు.

తొలుత ఆదరణ చూపిన అమెరికా చివరిదశలో వామపక్ష ముద్రతో తనను ఎంత వేధించినా, మనుషుల మీద ఆయన పూర్తి నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చినా, ‘‘అద్దం నా మంచి స్నేహితుడు; నేను ఏడ్చినప్పుడు అది నవ్వదు’’ అనేంతగా ఒంటరితనాన్ని అనుభవించినా, ‘‘జనం నిన్ను ఏకాంతంగా వదిలేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది’’ అనేంత పరాయితనాన్ని అనుభవించినా, ఆయన అందరికీ నవ్వునీ, ప్రేమనూ పంచాడు; ‘‘చిట్టచివరికి జీవితం ఒక ప్రాక్టికల్‌ జోక్‌’’ అని తేలిగ్గా తీసుకున్నాడు.

(సాక్షి ఫన్‌డే; ఏప్రిల్‌ 13, 2014)

Thursday, July 9, 2026

దాహపు మనిషి గురుదత్‌


గురుదత్‌
9 July 1925 - 10 Oct 1964

 

దాహపు మనిషి

జూలై 9న దర్శకుడు గురుదత్‌ జయంతి
-------------------------------------------------------------


గురుదత్‌ ప్రస్తావన లేకుండా భారతీయ సినిమా సంపూర్ణం కాదు.

భారతీయ సినిమాకు ముఖంగా పాశ్చాత్యులు పరిగణించే సత్యజిత్‌ రే మీద ఒక విమర్శ ఏమిటంటే, రే ప్రధాన ప్రేక్షకులు భారతీయేతరులే! కానీ గురుదత్‌ అలాకాదు. మౌఖిక సంప్రదాయంగా తరతరాలుగా వస్తున్న సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేశాడు. భారతీయ సినిమా తనకంటూ రూపొందించుకున్న నిర్దిష్టరూపాన్ని పాటిస్తూనే, సారంలో ఉన్నతిని ప్రదర్శించాడు. కెమెరాను స్వీయ వ్యక్తీకరణకు వాడుకున్నాడు.

వసంతకుమార్‌ శివశంకర్‌ పదుకోణెగా బెంగళూరులో జన్మించాడు గురుదత్‌. పూర్తి దక్షిణాదివాడు. పేరు మార్చుకునేలా చేసింది ఆయన ఇష్టంగా పీల్చిన బెంగాలీ గాలి! ఆయన సినిమాల్లో కూడా మార్మికత, అస్పష్టత లాంటి వంగతనం కనబడేది అందుకే!

ఒక కథ తట్టగానే అందులో లీనమవడం, అది ఉత్సాహమివ్వడం మానేయగానే దాన్ని వదిలేసి మరో కొత్తదాన్లో పడిపోవడం గురుదత్‌ స్వభావమట! పిల్లాడు బొమ్మను పొందేదాకా చాలా ముఖ్యమైందన్నంత పట్టింపు కనబరిచి, తీరా చేతిలోకొచ్చాక అటూయిటూ తిప్పి కిందపడేస్తాడు కదా, అలా ఉండేదట గురు శైలి. ఏ సన్నివేశమూ ఆయనకు ఒకపట్టాన నచ్చేది కాదు. ‘ఏక్‌ ఔర్, ఇంకోటి, ఇంకోటి,’ అంటూ తీస్తూపోయేవాడు. మరింత మెరుగైనది ముందుందని నమ్మేవాడు. ‘ప్యాసా’లోని ఒక సన్నివేశానికైతే 104 టేక్స్‌ చేశామని గురుదత్‌ ఆస్థాన సినిమాటోగ్రాఫర్‌ వి.కె.మూర్తి అంటారు. అందుకే, నిర్మాతలను విసిగించలేకే తొలిహిట్లతో కూడబెట్టిన డబ్బుతో స్వయంగా నిర్మాణానికి పూనుకున్నాడు గురుదత్‌.
ఈ సన్నివేశానికి సిద్ధమవుతూ కూడా, తరువాయి సన్నివేశం గురించి ఆలోచించేవాడట గురుదత్‌. సృజనాత్మక మెదడు ఎప్పుడూ ఖాళీగా ఉండనట్టుగా, ఏదో లోకంలో ఉండేవాడు. ‘పిలవగానే ఒక్కసారిగా మేల్కొన్నట్టుగా అందులోంచి బయటకు వచ్చేవాడు’.

‘ప్యాసా’లో నిజానికి దిలీప్‌కుమార్‌ నటించాల్సింది! కానీ పారితోషికం విషయంలో వచ్చిన చిక్కులవల్ల తానే ఆ ‘కవి’ పాత్రను పోషించేందుకు సిద్ధపడ్డాడు గురుదత్‌. అది క్లాసిక్‌గా నిలవడానికి అదీ ఒక కారణమంటారు విమర్శకులు.
ఏ దర్శకుడైనా తన జీవితంలో ఉన్నది సినిమాలో కలపకుండా ఉండడు. మెరుగుల ప్రపంచంలో నిలబడలేని తనలాంటి సున్నితమైన దర్శకుడి జీవితాన్నే ‘కాగజ్‌ కె ఫూల్‌’లో పాక్షికంగానైనా తెరకెక్కించడం గురుదత్‌కే చెల్లింది. అయితే, చిత్రంగా కాగజ్‌ కె ఫూల్‌ను అప్పటి ప్రేక్షకులు తిప్పికొట్టారు. తెరమీదకు రాళ్లు విసిరారు. రచ్చ గెలిచాకే, ఇంట్లోనూ హారతి పట్టడం మొదలైంది. కానీ గురుదత్‌ మనసు తీవ్రంగా గాయపడింది. ఒకటి మాత్రం నిజం. ప్రేక్షకుల ప్రమాణం పాక్షికమే! కాలమే సిసలైన నిర్ణేత. రాళ్లు వేయించుకోవడానికి ‘సిద్ధపడ్డవాడి’కే కాలం పూలు జల్లుతుంది, తన పరీక్ష తాను పెట్టి!

‘పరిశ్రమకు కొత్తగా వచ్చినవాళ్లకు ఆయన మంచి దర్శకుడు. ప్రత్యేకించి కొత్తవాళ్ల పరిమితుల్ని అర్థంచేసుకుని, వాటిని పరిష్కరించేవారు,’ అంటారు దత్‌ ఆస్థాన నటి వహీదా రెహమాన్‌. అంత జీవితాన్ని చూశాక కూడా, ఆయన తన సమస్యల్ని తానే పరిష్కరించుకోలేకపోవడం విధి వైచిత్రి!

జానీ వాకర్‌తో కలిసి చేపలు పట్టడానికి వెళ్లేవాడు. వి.కె.మూర్తితో దోశ, భేల్‌పూరి తినడానికి పోయేవాడు. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడు. మితం లేకుండా మద్యం తాగేవాడు. అటు భార్య గీతాదత్‌తో సర్దుబాటు కాలేక, ఇటు వహీదాతో కొత్త జీవితంలోకి అడుగిడలేక నలిగిపోయాడు.

(భర్తను భరించలేక) భార్య పిల్లల్తో సహా దూరమైపోవడం, వహీదా వేరే దర్శకులతో సినిమాలు తీయాలని నిర్ణయించుకోవడం, కొత్తగా జతచేరిన ఆర్థిక ఇబ్బందులు... అప్పటికే సొంతిల్లు అమ్మాడు. అద్దింట్లోకి మారాడు.
‘నేను అనాథను అయ్యాను. ఇంట్లోవాళ్లు లేరు. నువ్వు(వి.కె.మూర్తి) బెంగుళూరు వెళ్లిపోతున్నావు, అబ్రార్‌ (అల్వీ–గురుదత్‌ ఆస్థాన రచయిత) ఇంకో సినిమా రాయడానికి మద్రాసు వెళ్తున్నాడు, నేను ఏం చేయను?’ అన్నాడట, చివరిసారి తనను కలిసిన మిత్రులతో.

‘చూడు, నేను దర్శకుడిని కావాలనుకున్నాను, దర్శకుడిని అయ్యాను; నటుణ్ని కావాలనుకున్నాను, నటుణ్నయ్యాను; మంచి పిక్చర్లు తీయాలనుకున్నాను, మంచివి తీశాను. పైసలున్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా నా దగ్గర ఏమీలేదు,’ అనుకునేంత నిరాశలోకి కూరుకుపోయాడు. 39వ ఏట తనను తానే హత్య చేసుకున్నాడు.

‘యార్, జీవితంలో ఉన్నవేమిటి? రెండే రెండు విషయాలు... విజయం, పరాజయం. వీటికి మధ్యన ఏదీలేదు,’ అన్నాడో సందర్భంలో గురుదత్‌. ఆయన సినిమాల్లో సక్సెస్‌ అయ్యాడుగానీ జీవితంలో ఫెయిల్‌ అయ్యాడంటారు. కానీ ఆయనకు జీవితమే సినిమా అయినప్పుడు, జీవితంలో మాత్రం ఫెయిల్‌ అయ్యాడని అనగలమా!

(సాక్షి ఫన్‌డే; జూలై 6, 2014)
––––––––––––––––––––––

Monday, July 6, 2026

వెయ్యి బారల లోతు రచయిత



(కొన్నిసార్లు కొన్నింటిని ఓన్‌ చేసుకోవడానికి నేను భయపడుతాను. ఈ ‘సత్వం’ శీర్షికన ఫన్‌డే కోసం 2014లో రాసినవి కూడా అలాంటివే. అందుకే వాటికి బైలైన్‌ పెట్టుకోవడానికి జంకేవాడిని. (అందుకే ఆర్‌.ఆర్‌. పేరుతో రాశాను.) ఎందుకంటే వీటిల్లో జర్నలిస్టిక్‌ ట్రిక్‌ ఉంటుంది. అంటే ఎంతో మథించి రాసినట్టుగా పాఠకుడిని భ్రమింపజేయడం! కానీ అంత సీరియస్‌గా చదివి రాయడం కష్టం. ఒక పాత్రికేయ ఉద్యోగిగా వారంలో చేయాల్సిన పనుల్లో ఇదీ ఒకటి; అంతేగానీ ఇదే ఒకటి కాదు. తక్కువ సమయం, అందుబాటులో ఉండని మెటీరియల్‌ లాంటి పరిమితుల్లో 49 వారాల పాటు దీన్ని కొనసాగించాను. మళ్లీ ఇప్పుడు వాటిని చదువుకుంటే– గర్వపడేంత గొప్పగా లేకపోయినా, సిగ్గుపడేంత చెడ్డగా కూడా లేవు, అనిపించింది. అందుకే వరుసగా బ్లాగులో అప్డేట్‌ చేస్తూ వస్తున్నా.)



మార్క్‌ ట్వేన్‌
30 Nov 1835 - 21 Apr 1910

 

వెయ్యి బారల లోతు రచయిత

ఒక యువపాత్రికేయుడిగా రుడ్యార్డ్‌ కిప్లింగ్‌ తనను ఇంటర్వ్యూ చేసిన కొన్నాళ్ల తర్వాత, మార్క్‌ ట్వేన్‌ ఇలా వ్యాఖ్యానించాడు: ‘నేను అంతకుముందు కలిసిన వారందరికంటే ఆయనకు ఎక్కువ తెలుసు; అలాగే, ఆయన గతంలో కలిసిన వారందరిలోకీ నేను తక్కువ తెలిసినవాడినని ఆయనకు తెలుసని నాకు తెలుసు’.

మార్క్‌ ట్వేన్‌ అంటేనే ఒక చమత్కారం, ఒక నవ్వు, ఒక సరదా. ‘తల్లిదండ్రులకు విధేయంగా ఉండు, వాళ్లు ఉన్నప్పుడు’ అని పిల్లలకు సలహా ఇస్తాడు. ‘మనం తప్పులు చేయకూడదు, ఎవరైనా చూస్తున్నప్పుడు’ అని వ్యంగ్యం విసురుతాడు. ‘మంచిగా ఉండు; త్వరలోనే ఒంటరివాడవవుతావు’ అని సమాజతీరును పట్టిస్తాడు.

1876లో వచ్చిన ‘ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ టామ్‌ సాయర్‌’ ఆయన్ని రచయితగా నిలబెట్టింది. ప్రతి ఇంటి గోడకూ సాయర్‌ రంగులు పూశాడు. ప్రతి ఇంటి పిల్లాడికీ సాయర్‌తో దోస్తీ కుదిరింది. ప్రధానంగా బాలల వినోదం కోసం రాసినదైనా, పెద్దవాళ్లూ దాన్ని చదవడం మానలేదు. ‘పెద్దవాళ్లు తమ చిన్నతనంలో తాము ఎలా ఉండేవారో, తమ ఆలోచనలు ఎలా ఉండేవో, తాము ఎలా మాట్లాడేవారో, చిత్రమైన సన్నివేశాల్లో ఎలా చిక్కుకునేవారో ఆహ్లాదకరంగా వారికి జ్ఞాపకం’ చేసిందా నవల.

శామ్యూల్‌ లాంగ్‌హార్న్‌ క్లెమెన్స్‌గా అమెరికాలో జన్మించిన మార్క్‌ ట్వేన్‌ తన కలంపేరును స్వీకరించిన తీరు కూడా విచిత్రంగా ఉంటుంది. ఆయన స్టీమ్‌బోట్లో కొంతకాలం పనిచేశాడు. నీటిలోతు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, అందులోని సిబ్బంది, గట్టిగా, ‘మార్క్‌ ట్వేన్‌’ అని అరిచేవాళ్లు. మార్క్‌=గురుతు; ట్వేన్‌=రెండు; రెండు బారలు అని చెప్పడం వాళ్ల ఉద్దేశం!

తన పదకొండో ఏట తండ్రిని కోల్పోయిన ట్వేన్‌– ఏడుగురిలో ఒకడిగా పుట్టాడు. వాళ్ల నాన్న దగ్గర ఒక బానిస పనిచేసేవాడు. వాళ్ల చిన్నాన్న దగ్గర ఎక్కువమంది ఉండేవారు. ఆ బానిసలతో ట్వేన్‌ పొలంలో గడిపేవాడు. వాళ్ల ఇళ్లళ్లోకి వెళ్లి కూర్చునేవాడు. వాళ్లు చెప్పే కథల్ని వినేవాడు. ఆ బాల్యమే ఆయన్ని తర్వాత్తర్వాత మహోదాత్తమైన ‘ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ హకల్‌బెరీ ఫిన్‌’ రాయించింది.

ట్వేన్‌ మామూలుగా కుడిచేత్తోనే రాసేవాడు. ఒక దశలో ఆ చేయి నొప్పితో బాధించినప్పుడు ఎడమ చేత్తో కూడా సాధన చేశాడు. ఏ చేత్తో రాసినా హాస్యం చిప్పిల్లేది. అయితే, మార్క్‌ ట్వేన్‌ హాస్యం ఉత్తి నవ్వులాట హాస్యం కాదు. హాస్యం ఎప్పుడూ దుఃఖంలోంచి, ఆ దుఃఖం ఉపశమనం కోసమే పుడుతుంది. ఆయనే అన్నట్టు, ‘నిజమైన హాస్యం కరుణరసానికి దారి తీస్తుంది’.

‘పుస్తకాలు, స్వేచ్ఛ పొందిన మనుషుల ఆత్మలు’ అంటాడు ట్వేన్‌. ఆ పుస్తకాల్లో హాస్యం సాకుగా ఆయన ఎంత లోతైన ఆలోచనలు వెల్లడించాడో ‘ద మిస్టీరియస్‌ స్ట్రేంజర్‌’ (విచిత్రవ్యక్తి)లోని ఈ వాక్యాలు చెబుతాయి: ‘అయితే ప్రతి మనిషికీ ఇన్ని లక్షల గమ్యస్థానాలున్నప్పుడు తనకు ఇష్టమైనది ఎంచుకోవచ్చుగదా అని నువ్వంటావు. కాని అతడు చేరవలసిన గమ్యస్థానం నిర్ణయించేది అతడు కాదు; అతడు జీవితంలో మొట్టమొదట చేసిన పనే దాన్ని నిర్ణయిస్తుంది. ఒకవేళ ఫలానా పని చెయ్యగూడదని అనుకుంటాడనుకో. ఆ అనుకోవడాన్ని నిర్ణయించేది కూడా అతని మొదటి పనే. ఫలానా పని చెయ్యడనుకో. ఆ చెయ్యకపోవడాన్ని నిర్ణయించేది కూడా మొదటి పనే’.

లోతైన, గాఢమైన, ఛిద్రమైన జీవితాన్ని అనుభవించాడాయన. ప్రచురణ సంస్థ పెట్టాడు. మొదట్లో డబ్బులు కళ్లజూసినా అది క్రమంగా ఆయన్ని అప్పులపాలు చేసింది. లెక్చర్లు ఇస్తూ డబ్బులు సంపాదించాడు. వాటికిగానూ ఎన్నో దేశాలు పర్యటించాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉపన్యసించేవాడు కాబట్టి, ఆయన రచనల్ని ప్రచురించడానికి సంస్థలు ముందుకొచ్చేవి కాదు. ఈ నష్టం ఇలావుంటే, కుటుంబనష్టం మరీ కుంగదీసింది!  డిఫ్తీరియాతో రెండేళ్ల కొడుకు లాంగ్డన్‌ చనిపోయాడు. 24 ఏళ్ల వయసులో కూతురు సుసీ స్పైనల్‌ మెనింజైటిస్‌తో మరణించింది. మూర్ఛరోగమున్న కూతురు జీన్‌ 29 ఏళ్ల వయసులో చనిపోయింది. క్లారా ఒక్కతే తల్లిదండ్రులకు చివరిదాకా మిగిలిన బిడ్డ! ‘తన స్వీయ సమ్మతి లేకుండా ఏ మనిషి కూడా సౌకర్యంగా ఉండలేడు’ అనేవాడు ట్వేన్‌. తన సమ్మతి లేకుండా ఏ మనిషైనా బాధ కూడా ఎలా పడగలడు! ట్వేన్‌ కూడా ఈ కష్టాల్ని ఇలాగే దాటాడేమో!

మతగ్రంథాల్ని, ఆధ్యాత్మిక రచనల్ని ఎంతగా చదివినప్పటికీ దేవుడి ఉనికి మీద విశ్వాసంగానీ, అవిశ్వాసంగానీ ప్రకటించని అజ్ఞేయవాదిగానే జీవితాంతం మిగిలిపోయిన ట్వేన్‌... 75 ఏళ్లకు ఒకసారి కనిపించే హేలీ తోకచుక్క కనబడిన 1835(నవంబర్‌ 30)లో జన్మించాడు. తిరిగి మళ్లీ కనబడిన 1910లో తన ఏడుపదుల వయసులో అస్తమించాడు. చావుపుట్టుకల్ని కూడా చమత్కారంతో మేళవించడం ఎలా సాధ్యమైందో ఆయన్ని ఎలా అడగటం!

(సాక్షి ఫన్‌డే; 30 నవంబర్‌ 2014)
––––––––––––––––––––––

Tuesday, January 30, 2018

గురజాడ: మధుర వాణి!



‘కవిత్రయమంటే– తిక్కన, వేమన, గురజాడ’ అన్నాడు శ్రీశ్రీ, ప్రాచీన కవిత్రయపు పీఠాల్ని కాసేపు కదిలించి. గురజాడ భక్తుడిగా మాత్రమే శ్రీశ్రీ ఈమాట చెప్పి ఉండకపోవచ్చు; ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ పరిచిన బాటే, ఆయన్ని, తనకంటే ముందరి, భిన్నకాలాలకు చెందిన ఇరువురు మహనీయులతో కూడిన ఒక పదబంధాన్ని పంచుకునేలా చేసివుంటుంది.

‘ప్రాచీనత’, ‘ఆధునికత’ సంధియుగంలో జన్మించాడు గురజాడ. సాహిత్యం పునాదిగా ఆ కాలాన్ని అర్థం చేసుకుంటే– అది పురుషుడి విలాస వస్తువుగా స్త్రీ చూడబడుతున్న కాలం; వెర్రిగా బాల్యవివాహాలు జరుగుతున్న కాలం; కన్యాశుల్కం కింద చిన్నారి బాలికల్ని, కడువృద్ధులకు సైతం కట్టబెడుతున్న ‘రక్తమాంసాల విక్రయ’ కాలం; వితంతువుల పునర్వివాహానికి ఏమాత్రం ఆమోదం లేని కాలం; సామాన్యప్రజలు తమని తాము ‘కర్మ’కు  వదిలేసుకుని బతుకులీడుస్తున్న కాలం; మొత్తంగా– ‘నీతులూ, బూతులూ’ కలగలిసిన యుగం. అందుకే గురజాడ తన యావత్‌ సాహిత్యాన్ని ఈ సామాజిక రుగ్మతలపై పోరాటం కోసమే వెచ్చించాడు. దేశాన్ని ఉద్ధరించే, దేహాన్ని గౌరవించే, హేతువును పెంపొందించే రచనలకు శ్రీకారం చుట్టాడు. ‘సమాజాన్ని అప్రతిష్టపాలు చేసే పరిస్థితిని కళ్లముందర పెట్టి, నైతిక భావాల ఉన్నత ప్రమాణాల్ని ప్రాచుర్యానికి తేవడం కంటే, సాహిత్యానికి ఉత్తమమైన కార్యమేదీ ఉండదు’.

ఉపాధ్యాయుడిగానూ, డిప్యుటీ కలెక్టర్‌ ఆఫీసులో హెడ్‌క్లర్కుగానూ, విజయనగరం రాజు ఆస్థానంలోనూ, అధ్యాపకుడిగానూ పనిచేసిన గురజాడ– తొలుత ఆంగ్లంలో రాసినప్పటికీ, తర్వాత తెలుగులోకీ, అందునా ఆ సారం చేరవలసిన జనభాషలోకీ మరలాడు. స్నేహితుడు గిడుగు రామ్మూర్తితో కలిసి వ్యావహారిక భాషోద్యమానికి నడుం బిగించాడు. విజయనగర కేంద్రంగా జరిగే ‘కన్యాశుల్కము’ నాటకంలో అక్కడి యాసతో పాత్రోచిత భాషను ప్రవేశపెట్టాడు. పెద్ద కుటుంబాలనుంచి వచ్చినవారే నాయికానాయకులుగా సాహిత్యాన్ని ఆక్రమించుకుంటున్న కాలంలో వేశ్య మధురవాణిని నాయికను చేశాడు. వేశ్యావృత్తిని నిర్మూలించాలంటే, ముందుగా వేశ్యలను కూడా మనుషులుగా చూడటం అవసరమన్నాడు. గిరీశం, బుచ్చమ్మ, సౌజన్యారావు, రామప్పంతులు, లుబ్ధావదాన్లు, వెంకటేశం, కరటకశాస్త్రి... రచయితతో సమానంగా పాత్రలు గుర్తింపులోకి రావడం ఎప్పుడోగానీ జరగదు. వందేళ్లు పూర్తిచేసుకున్న ఈ నాటకం ప్రపంచనాటకాల్లో ఎన్నదగినదిగా ఖ్యాతిగాంచింది. ‘డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది’ ‘నాతో మాట్లాడడవే ఒక ఎడ్యుకేషన్‌’ ‘తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం’ ‘తాంబూలాలిచ్చాను, తన్నుకు చావండి’ ‘పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్‌’ ‘డబ్బు తేని విద్య దారిద్య్ర హేతువు’ ‘తనకి రొట్టా? ఒహడికి ముక్కానా?’ ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అంటూ ప్రతి సందర్భాన్నీ నాటకంతో ముడిపెట్టి మాట్లాడే ‘కన్యాశుల్కం’ భక్తులే పుట్టుకొచ్చారు.

‘దేశమును ప్రేమించుమన్నా’... గురజాడ తత్వం మొత్తాన్నీ వెల్లడించే గేయం. దానికి ప్రపంచ జాతీయగీతం కాగల శక్తివుందన్నాడు శ్రీశ్రీ. ఉత్తి భౌగోళిక దృష్టితో కాకుండా, మనుషులతో ముడిపెడుతూ దేశాన్ని చూశాడు గురజాడ. స్వయంసమృద్ధ, సహకారపూరిత అవనిని కాంక్షించాడు. ‘వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌/ గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌... ఈసురోమని మనుషులుంటే/ దేశమేగతి బాగుపడునోయ్‌... అన్ని దేశాల్‌ క్రమ్మవలెనోయ్‌/ దేశి సరుకుల నమ్మవలెనోయ్‌... పరుల కలిమికి పొర్లి యేడ్చే/ పాపి కెక్కడ సుఖం కద్దోయ్‌... సొంతలాభం కొంతమానుకు/ పొరుగువానికి తోడుపడవోయ్‌/ దేశమంటే మట్టికాదోయ్‌/ దేశమంటే మనుషులోయ్‌... దేశమనియెడి దొడ్డవృక్షం/ ప్రేమలను పూలెత్తవలెనోయ్‌’...

అస్పృశ్య నివారణ ఉద్యమరూపు దాల్చకముందే, ‘మంచి చెడ్డలు ఎంచి చూడగ మనుజులందున రెండె కులములు, మంచి యన్నది మాలౖయెతే మాలనే అగుదున్‌’ అని ప్రకటించాడు. సహపంక్తి భోజనంలో పాల్గొన్నాడు.
గురజాడ రాసిన ప్రతివాక్యమూ తెలుగునాట వ్యాప్తిలోకి వచ్చింది. ‘ఆటల పాటలతోటి కన్నియలు/ మొగుడు తాత యని కేలించ/ ఆటల పాటల కలియక పూర్ణిమ/ దుర్గను చేరీ దుఃఖించే (పూర్ణమ్మ);
‘పట్టమేలే రాజు అయితె/ రాజునేలే దైవముండడొ?/ పరువు నిలపను పౌరుషము మీ/ కేల కలగదొకో?’ (కన్యక); ఏనుగు ఎక్కి మనము/ ఏ వూరెళదాము?/ ఏనుగు ఎక్కి మనము/ ఏలూ రెళదాము (మిణుగురులు); ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ (ముత్యాల సరములు)...

కవిగా, నాటకకర్తగానే కాకుండా, ‘దిద్దుబాటు’తో ఆధునిక కథకు బలమైన పునాదిని ఏర్పాటుచేశాడు. దంపతుల మధ్య తప్పక ఉండవలసిన అనురాగాన్ని చిత్రించాడు.

1862లో జన్మించిన ఈ మహాకవి అనారోగ్యంతో 53 ఏళ్లకే కన్నుమూశాడు. ‘బ్రతికి చచ్చియు, ప్రజలకెవ్వడు/ బ్రీతి కూర్చునొ, వాడె ధన్యుడు’. కృష్ణశాస్త్రి అన్నట్టు, ‘గురజాడ 1915లో చనిపోలేదు, అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించాడు’.
–––––––––––––––––––––––––––––––––––
సెప్టెంబర్‌ 21న రచయిత గురజాడ అప్పారావు జయంతి
(ఫన్డే 2014)

 

Saturday, January 27, 2018

ఆర్కే నారాయణ్: మాల్గుడి స్వామి




ఒక గణింపుతో మాట్లాడాల్సివచ్చే ఫార్మల్‌ ఇంటర్వ్యూలంటే, నారాయణస్వామికి పూర్తి అయిష్టం. అదే ఉత్తినే ఇద్దరూ కూర్చుని, టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేయకుండా, తెలిసిన మనుషులకు మల్లే రోజువారీ విషయాలను కలబోసుకోవడం మహాఇష్టం. బహుశా, ఆ ‘క్యాజువల్‌ టోన్‌’ ఆయన్ని ‘ఆర్కే నారాయణ్‌’ అయ్యేలా చేసివుంటుంది!

‘రచయిత కావాలంటే మంచి చదువరి అయ్యుండాలి; భాషమీద గొప్ప సాధికారత ఉండాలి. కానీ కథ చెప్పేవాడిగా నిలబడటం దైవదత్తం. ఆయన పేజీ తిప్పేట్టు చేస్తాడు; రాస్తున్న మనిషి నీకు తెలుసు అనిపిస్తాడు. ఏ కోర్సూ కూడా నిన్ను ఆర్కే నారాయణ్‌ చేయలేదు,’ అంటాడు రచయిత జెఫ్రీ ఆర్చర్‌.

హెడ్‌మాస్టర్‌ కొడుకుగా అదేబాటలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా కుదిరినా, ఆ పని నారాయణ్‌కు ‘నిరర్థకం’గా కనబడిందట. అందుకే రచయిత అయిపోతానని వాళ్ల బామ్మ దగ్గర ప్రకటించేశాడు. ఆమె సూచన మేరకు, ఒక శుభముహూర్తాన(నిజంగానే) నోటుబుక్కు ముందేసుకుని కూర్చున్నాడు. స్వామి అనే పిల్లాడు ఒక చిన్న రైల్వేస్టేషన్‌కు వెళ్లడం, రైలు రాకపోకలు చూడటం అనే ఊహ తళుక్కుమందట! అదే ‘స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌’(1935)కు పడిన తొలివాక్యం.

చిన్న స్టేషన్, దానికో మాస్టర్, మర్రిచెట్టు... ‘స్టేషన్‌కు ఏం పేరు పెట్టాలి? రైల్వే టైమ్‌టేబుల్లో ఉండకూడదు. ఎందుకంటే ఎవరో ఒక అధికప్రసంగి, నువ్వు పేర్కొన్న దుకాణం లేదేమిటి, అని తప్పులు ఎంచుతాడు. అది వాస్తవ పట్టణం అయితే, ఆ చీదరంతా భరించాలి. అలాంటి ఆలోచనలో ‘మాల్గుడి’ నాలోకి దొర్లుకుంటూ వచ్చింది. దానికి అర్థం లేదు. తిరుచ్చి దగ్గర లాల్‌గుడి అని ఒక ఊరుంది; కుంభకోణం దగ్గరో మరోచోటో మన్‌గుడి అని మరో ఊరుంది. కానీ మాల్గుడి ఎక్కడా లేదు. నాకు కావాల్సిందే సరిగ్గా అదే’.

మాల్గుడికి కచ్చితమైన భౌగోళిక సరిహద్దులు లేవు, ఏవో కొన్ని కేంద్రాలు తప్ప. మళ్లీ, మాల్గుడి లాంటి ప్రదేశాలు మీకు వందలకొద్దీ కనబడతాయి. అలాగే స్వామి కూడా! అలాంటి పిల్లలు ఆఫ్రికాలోనూ ఉంటారు; అమెరికాలోనూ ఉంటారు. మళ్లీ స్వామికే ప్రత్యేకమైన మూలాలు కూడా ఉంటాయి. లోకల్, గ్లోబల్‌.
‘బాల్యంలో స్వీయస్పృహ తక్కువగా ఉంటుంది. విషయాలను విశ్లేషించవు; ఇలా జరగాలన్న అంచనాలుండవు; ఇది మంచి, ఇది చెడు అని తేల్చడానికి పూనుకోవు; జీవితం ఎలా వస్తే అలా స్వీకరిస్తావు; స్వాభావికంగా బతికేస్తావు’.

స్వామి ఇంగ్లీషులో మాట్లాడతాడు. ఆమాటకొస్తే ఆయన పాత్రలన్నీ ఇంగ్లీషులోనే మాట్లాడతాయి. పెరిగిన వాతావరణం వల్ల, అదొక పరాయి భాష అన్న భావనే ఆయనకు కలగలేదట. ఆయన్ని ప్రభావితం చేసిన పుస్తకాలూ, రచయితలూ... అంతా అదే భాష. అందుకే, పుట్టిన తమిళమంత, పెరిగిన కన్నడమంత మామూలుగా  ఇంగ్లీషులో రాయగలిగాడు. తొలితరపు భారతీయ ఆంగ్ల రచయిత కాగలిగాడు. గ్రాహం గ్రీన్‌ స్నేహం ఆయన్ని అంతర్జాతీయ పాఠకులకు దగ్గర చేసింది. ‘ది ఇంగ్లీష్‌ టీచర్‌’కు ముందు ‘జాస్మిన్‌ హోమ్‌’ అని పేరు పెడదామనుకున్నారట నారాయణ్‌. కవితాత్మకంగా, ఆకర్షణీయంగా, కరుణరసపూరితంగా ఉండే శీర్షికల్ని గ్రీన్‌ వద్దనేవాడు. ఇద్దరిలోనూ ఉన్న ఆ పొడిమాటల గుణంవల్లే వారి స్నేహం అర్ధశతాబ్దంపాటు, గ్రీన్‌ మరణం వరకూ కొనసాగింది.

‘ద బాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌’, ‘మిస్టర్‌ సంపత్‌’, ‘ఫినాన్సియన్‌ ఎక్స్‌పర్ట్‌’, ‘వెయిటింగ్‌ ఫర్‌ ద మహాత్మ’, ‘ద గైడ్‌’, ‘ద మ్యాన్‌ ఈటర్‌ ఆఫ్‌ మాల్గుడి’, ‘టాకెటివ్‌ మ్యాన్‌’ లాంటి నవలలు, ‘మాల్గుడి డేస్‌’, ‘అండర్‌ ద బన్యాన్‌ ట్రీ’ లాంటి కథాసంకలనాలు, ఆత్మకథ ‘మై డేస్‌’... అందంగా బౌండు చేసిన నోటుపుస్తకాలు తప్ప నారాయణ్‌కు రచయితగా పెద్ద డిమాండ్లేమీ లేవు. కాకపోతే, ‘ఆలోచించడంతో సరిపోదు. రాయడంవల్లే నువ్వు రచయిత కాగలవు’. మరొకటీ కావాలి: ‘జనాన్ని గమనించడంలో ఒక ఆనందం ఉండాలి; కానీ ఆ గమనింపు అదేపనిగా చేసినట్టుగా ఉండకూడదు’.

అయితే, ఆత్మకథాత్మకంగా కనబడే ఆయన పుస్తకాలకు, ‘ఈ కథలో ఏముంది? ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ శక్తివంతమైన క్లైమాక్స్‌ లేదు. అసలు ఎటు తీసుకెళ్దామని దీన్ని?’ లాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అయినా అదే శైలికి కట్టుబడి ఉండటానికి కారణం, ఇంకోరకంగా నేను రాయలేకపోవడమే, అంటారు. కానీ నెమ్మదిగా పాఠకుల్ని ఒప్పించగలిగారు. చిన్న మనుషులు, చిన్న సంపాదనలు, చిన్న సమస్యలు, అంతా చిన్నగా... పుస్తకం కూడా చిన్నదిగానే ఉండాలి; రెండొందల పేజీలకు మించకూడదు! రచయితకు ఒక ప్రత్యేక లక్ష్యం ఉండాలన్నది కూడా ఆయన అభిమతం కాదు. ఒక పాత్రగా, అది ప్రతినాయకుడైనా సరే, దాన్ని నిలబెట్టగలిగేదేదో పట్టుకోవడంలోనే ఉంది ఆయనకైనా, పాఠకునికైనా అసలైన మజా!

––––––––––––––––––––––––––––––––––––––––
అక్టోబర్‌ 10న రచయిత ఆర్కే నారాయణ్‌(1906–2001) జయంతి
(2014 ఫన్డే)



 

Tuesday, January 23, 2018

జాన్ కీట్స్: సౌందర్యానికి మోకరిల్లినవాడు



కొన్ని పేర్లు మరింత మృదువుగా తోచడానికి కారణం, అవి నిజంగానే సుతిమెత్తగా ధ్వనించడమా? లేక, వాళ్ల జీవితం కొంతైనా తెలిశాక, కరిగిపోయిన మనలోపలి గరుకుదనం కారణమా? జాన్‌ కీట్స్‌ను తడుముతూవుంటే ‘పూర్ణంగా వికసించిన గులాబిపువ్వు’ను చేతుల్లోకి తీసుకున్నట్టే ఉంది.

‘ఎ థింగ్‌ ఆఫ్‌ బ్యూటీ ఈజ్‌ ఎ జాయ్‌ ఫరెవర్‌. దాని మనోహరత్వం పెరుగుతూనేవుంటుంది; అది ఎన్నటికీ శూన్యంలోకి గతించదు’. రొమాంటిక్‌ మూవ్‌మెంట్‌కు ప్రాతినిధ్యం వహించగలిగే వాక్యం ఇది. తర్కాలతో విసిగిపోయిన కాలంలో అనుభూతిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు కీట్స్‌. అతడు సౌందర్యాన్ని ‘కంటితో’ ఎంతగా ‘తాగే’వాడంటే, తనకే ‘తెలియని వివశత్వంతో’ తల తూగిపోయేది. ‘సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం; ఇది తెలిస్తే ప్రపంచంలో ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదు,’ అన్నాడు.

పూబాలకుడి లాంటి కీట్స్‌ జీవితంలో ఎదలోకి దిగిన ముళ్లు కూడా ఉన్నాయి. అశ్వశాల నిర్వాహకుల ఇంట పుట్టాడు. సాహిత్య వాసన లేని కుటుంబం. కీట్స్‌కు పదేళ్లున్నప్పుడు తండ్రి గుర్రం మీంచి పడి చనిపోయాడు. మూడు నెలలకే తల్లి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. తమ్ముడితోపాటు కీట్స్‌ అమ్మమ్మ సంరక్షణలో పెరిగాడు. ఆమె దగ్గర ఆస్తిలేదు. ఉన్నది తగాదాల్లో ఉంది. అందువల్ల బంధువులు లేరు. ఇలాంటి నేపథ్యంలో పెరిగిన కీట్స్‌– మనుషులతో గొడవ పడేవాడు, కానీ పుస్తకాలతో స్నేహం చేసేవాడు. షేక్‌స్పియర్‌ ఎందుకు అంత గొప్పవాడయ్యాడో చాలా త్వరగా తెలుసుకున్నాడు.

సర్జన్‌ కావాలని ఉండేది. కొంతకాలం శిక్షణ కూడా పొందాడు. ఒకవైపు పాఠం జరుగుతుంటే, గదిలో పరుచుకునే సూర్యకిరణాలవెంట ఊర్ధ్వలోకాల్లోకి ఎగిరిపోయేవాడు. తనలాంటివాడు శస్త్రచికిత్సలు చేయలేడని గ్రహించాడు. ఆలోచనలకన్నా సంవేదనలతో కూడిన జీవితాన్ని కోరుకున్నాడు. ‘ధాన్యాగారాల్లో పసిడిపంటను నిల్వజేసినట్టు/ తలలో పొంగిపొర్లుతున్న ఆలోచనలను/ అక్షరరూపంలో పుస్తకాలలోకి’ అనువదించ బూనుకున్నాడు. ‘కవిత్వం ఆకులు చిగిర్చినంత సహజంగా రాకపోతే అది అసలు రాకపోవటమే మంచిది’ అన్నాడు. ‘మూఢులకు తమవైన స్వప్నాలుంటాయి; అందుకే వాళ్లు స్వర్గాన్ని (కూడా) ఒక వర్గం కోసమే నేస్తూవుంటారు’ అన్నాడు. అయితే, లండన్‌ పత్రికల్లో వచ్చిన సమీక్షలు అతడి మనసును గాయపరిచాయి.

ఆ పరిస్థితుల్లో అతడికి పెద్ద ఊరట ఫానీ బ్రాన్‌. ‘కవిత్వపు రెక్కల’ మీద ఆమె దగ్గర వాలేవాడు. ‘దేహం చాలనంతగా’ ప్రేమించేవాడు. ‘ప్రేమ నా మతం. దానికోసం ప్రాణమైనా ఇస్తా’ అనేవాడు. కానీ ప్రాణాన్ని బలి కోరడానికి ప్రేమకేం పని? ఆ కర్కశ కార్యాన్ని మృత్యువు తలకెత్తుకుంది. క్షయవ్యాధి రూపంలో కీట్స్‌ను వెంటాడింది. ఏ ‘తియ్యటి పాపం’ చేయనివ్వకుండానే పూర్తిగా ఆక్రమించుకుంది. అదే క్షయతో తల్లి చనిపోయింది, తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు తన వంతా?

చలి, దగ్గు బాధిస్తున్నాయి. అనారోగ్యంతో పేదఖైదీలాగా బందీ అయ్యాడు. దుప్పటిమీద కక్కుకున్న రక్తపు చుక్కలు కాలుడు పంపిన హెచ్చరికల్లా తోస్తున్నాయి. ‘మరో జీవితమంటూ ఉందా? నేను మేల్కొన్నాక దీన్నంతా ఒక కలగా తెలుసుకుంటానా? (మరో జీవితం) ఉండేవుండాలి, (లేదంటే) ఇలాంటి యాతనల్ని భరించడం కోసమే మనం సృష్టించబడివుండం’.

మద్యం ఆర్చేది కాదు, నల్లమందు తీర్చేదికాదు, ‘వృద్ధ దాదిలాంటి కాలం’ కూడా ఏ పరిష్కారమూ చూపించలేదు. అందుకే, నెగెటివ్‌ కేపబిలిటీ సిద్ధాంతాన్ని రూపొందించుకున్నాడు కీట్స్‌. అనిశ్చితాలు, ద్వంద్వాలు, మర్మాలు, సందేహాలు ఎన్ని చుట్టుముట్టినా భరించగల సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్నాడు. ‘పోనివ్వని నిద్రలా మోపిన మృత్యువు బరువును’ ఓర్చుకున్నాడు. వీలైనంత త్వరగా మరణాన్ని తన్నుకుపోవడానికి ఆకాశంలోని గద్దలా కాచుకుని పడుకున్నాడు. ‘నేను త్వరగా నిశ్శబ్దపు సమాధిలోకి ఒరిగిపోవాలి... ఆ నెమ్మదైన సమాధికి దేవుడికి ధన్యవాదాలు... ఓ! నా మీద పరుచుకుంటున్న చల్లటి మట్టిని అనుభూతిస్తున్నాను... నా మీద డైసీ పువ్వులు పెరుగుతున్నాయి’.

తన సమాధి ఫలకం మీద కీట్స్‌ ఇలా రాయాలని కోరుకున్నాడు: ‘ఇక్కడ నిద్రించేవారి పేరు నీటి మీద రాసిన రాత’. పాతికేళ్ల వయసులో(1795–1821) కీట్స్‌ శాశ్వతనిద్రలోకి జారుకున్న నేలలో పూసిన పూల గంధం విశ్వాన్ని చుట్టింది. ఆ సువాసనలను పీల్చినవాళ్లే భావకవులైనారు. ‘ఏడవకు, కళ్లు తుడుచుకో, ఈ పూవు మళ్లీ వచ్చే ఏడు పూస్తుంది’.

––––––––––––––––––––––––––––––––––––––
అక్టోబర్‌ 31న కవి ‘రొమాంటిక్‌ పొయెట్‌’ జాన్‌ కీట్స్‌  జయంతి
(ఫన్ డే, అక్టోబర్ 2014)


 

Saturday, January 20, 2018

పికాసో: విశ్వగీతాకారుడు



తన కొడుకు చాలా పెద్దపేరున్నవాడు అవుతాడని సర్రియలిజంగా చెప్పదలిచిందేమో, పాబ్లోకు డోనా ఇలా నామకరణం చేసింది: పాబ్లితో డీగో జోస్‌ శాంటియాగో ఫ్రాన్సిస్కో డి పాలా జువాన్‌ నెపోమ్యూసినో క్రిస్టీస్‌ క్రిస్పియానో డి లాస్‌ రెమెడియోస్‌ సిప్రియానో డి ల శాంటిసియా ట్రినిడాడ్‌ రూయిజ్‌ బ్లాస్కో వై పికాసో లోపెజ్‌.

పూర్వీకులు, బంధుమిత్రులు, క్రైస్తవ సన్యాసులు అందరినీ తన పేరులో కలుపుకున్న పికాసో– మాటలు రాకముందే బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. చిన్నవయసులోనే ఏ చిత్రాన్నైనా నకలు చేయగలిగేవాడు. అతడికి తండ్రి బ్లాస్కోనే తొలిగురువు. బ్లాస్కో పావురాల్ని పెంచేవాడు. వాటిని చూస్తూ కుమారుణ్ని గీయమనేవాడు. స్పెయిన్‌ సాంస్కృతిక ఉత్సాహంలో భాగమైన గుర్రాల్ని, బుల్‌ఫైట్‌ దృశ్యాల్ని కొడుక్కు  చూపించేవాడు. ఇవన్నీ పికాసో భావి జీవితాన్ని ప్రభావితం చేశాయి. అలాగే తనతో ఆడిపాడిన చెల్లెలి మరణం కూడా! అందుకే దేవుడు దయ్యంగా కనబడటం మొదలైంది. ‘మనం ఏది చిత్రించాలి? ముఖం మీద కనిపిస్తూ ఉన్నదా? ముఖం లోపల ఉన్నదా? ముఖం వెనుక ఉన్నదా?’ అన్న మథనం మొదలైంది.

పికాసో కౌమారంలోకి అడుగిడగానే జన్మదిన కానుకగా, వాళ్ల నాన్న తాను వాడే కుంచెలు, రంగులు, పేలెట్‌ బహుమతిగా ఇచ్చాడు. బ్లాస్కో మళ్లీ బొమ్మల జోలికి పోలేదు. ‘నా చిన్నప్పుడు మా అమ్మ ఓ మాట అంటుండేది. నువ్వు సైనికుడివైతే జనరల్‌వు అవుతావు. సన్యాసివైతే పోప్‌ అవుతావు అని. కానీ నేను చిత్రకారుణ్నయి పికాసోనయ్యాను,’ అన్నాడు సగర్వంగా. ‘శాస్త్రం – దాతృత్వం’, ‘తొలి ప్రార్థన’, ‘ముసలి గిటారిస్టు’, ‘పైప్‌తో పిల్లాడు’, ‘అవెన్‌యాన్‌ వేశ్యలు’ లాంటి ఎన్నో చిత్రాలు గీశాడు. అంతర్యుద్ధ సమయంలో స్పెయిన్‌ వినాశనాన్ని ప్రతిబింబిస్తూ ‘గుయెర్నికా’ (1937) వేశాడు. ఫ్రాంకో, జర్మన్‌ మిత్రపక్షాలు గుయెర్నికా అనే పట్టణంపై మూడు గంటలపాటు జరిగిన బాంబులదాడిలో సుమారు రెండువేల మంది చనిపోయారు. వందలమంది గాయపడ్డారు. వీరిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉన్నారు. ఎడ్లను సైనికులుగా దౌర్జన్యానికీ, గుర్రాలను ప్రజానీకంగా దుఃఖానికీ ప్రతీకలుగా 7.8 మీటర్ల వెడల్పు, 3.5 మీటర్ల ఎత్తుతో నలుపు, తెలుపుల్లో వేసిన ఈ పెయింటింగు– ఇరవయ్యవ శతాబ్దపు అత్యున్నత చిత్ర సృష్టిగా ప్రశంసలందుకుంది. అయితే, ఈ ప్రతీకలు విమర్శకులు ఊహించినవే తప్ప పికాసో నిర్ధారించలేదు. ఎద్దు ఎద్దే, గుర్రం గుర్రమే... కళను కళగానే చూడమన్నాడు. ఆయనే అన్నట్టు, ‘కళ ఒక అబద్ధం. అయితే సత్యాన్వేషణలో అది మనకు సాయం అందిస్తుంది.’ ‘ఆత్మమీద పేరుకుపోయిన రోజువారీ జీవితపు దుమ్మూ, ధూళిని పరిశుభ్రం చేస్తుంది’.

పికాసో చిత్రకళను సాధారణంగా ఏడు దశలుగా చెబుతారు. బ్లూ పీరియడ్, రోజ్‌ పీరియడ్, న్యూడ్, క్యూబిజం, ఆఫ్రికన్‌ ప్రభావం, క్లాసికల్, సర్రియలిజం. నీలిదశలోని చిత్రాలన్నీ నీలిరంగు నేపథ్యాన్ని కలిగివుంటాయి. ఉదాసీనతకూ, విచారానికీ ప్రతీకగావుండే నీలిరంగులోంచి తర్వాత గులాబీ దశలోకి మరలాడు. ఇదంతా ఉత్సాహపూరిత కాలం. అటుపై తానే మూలస్తంభంగా నిలిచి, ప్రచారంలోకి తెచ్చిన సరికొత్తశైలి క్యూబిజంలోకి వచ్చాడు. ఆఫ్రికన్‌ కళను అనాగరికంగా భావిస్తున్న రోజుల్లో వారి కళాత్మకతను అర్థం చేసుకుని ఆ ప్రభావంలో గీశాడు. ‘అల్ప కళాకారులు అరువు తెచ్చుకుంటారు; గొప్ప కళాకారులు దొంగిలిస్తారు,’ అని గడుసుగా కూడా ఒక మారు చెప్పుకున్నాడు.

ఆయన చిత్రకళలో ఏడు దశలున్నట్టే, ఆయన జీవితంలోనూ ఏడుగురు స్త్రీలున్నారు. పడతులపట్ల తన మోహాన్ని పికాసో ఏనాడూ దాచుకోలేదు. ఫెర్నాండో ఓలివేర్, ఎవా గూల్, మేరీ వాల్టర్, డోరా మార్, జాక్వెలిన్‌ రోకో... ‘నేను ఎవరితో ఉండాలీ అనే అంశాన్ని తేల్చటం కోసం ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకోవటం నా జీవితంలో అత్యంత మధురమైన సందర్భం’ అని చమత్కరించాడు. కొన్ని గాఢమైన క్షణాలు, తీవ్రమైన కౌగిళ్ల తర్వాత ఆ ప్రేమలన్నీ ఎడబాటుకే దారితీసేవి. వారి ప్రేమకు శాశ్వతత్వం లేకపోయినా, తన చిత్రాల ద్వారా ప్రియురాళ్లకు శాశ్వతత్వం కల్పించాడు. గుయెర్నికాలో డోరా మార్‌ కనబడుతుంది. ఇంకా ఆయా దశల్లోని చిత్రాల్లో ఆయా కాలాల ప్రేయసులు దర్శనమిస్తారు.

చిత్రకళలోనే కాదు, శిల్పంలో కూడా అసాధారణ ప్రతిభను చూపాడు పికాసో. కాగితంపైనే కాకుండా కుండలు, కలప, చర్మం, పింగాణిని కూడా మాధ్యమంగా ఉపయోగించుకున్నాడు. శాంతికి చిహ్నంగా ప్రపంచం గుర్తిస్తున్నది పికాసో పావురాన్నే!

అయితే, ఆయన చిత్రాల్లో అర్థం కానివే ఎక్కువ. ‘సమకాలీన ప్రపంచంలో ఏదీ అర్థం కాదు, మరి అర్థమయ్యే పెయింటింగు నేనెందుకు వెయ్యాలి?’ అని ఎదురు ప్రశ్నించాడు. అయినా కూడా ఒక యుగపురుషుని కీర్తి తన జీవితకాలంలోనే వచ్చిపడింది. కోట్ల రూపాయలకు పెయింటింగ్స్‌ అమ్ముడుకావడం మొదలైంది. వేలంవెర్రిగా జనం అభిమానిస్తుండటం చూసి, నా చిత్రాల్లో మీరు ఊహించుకుంటున్నదేదీ లేదు, అని కూడా చిరాకుపడ్డాడోసారి.
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పికాసో నిరాడంబరంగా బతికాడు. సాదాసీదాగా నిక్కరుమీదే పనిచేసుకునేవాడు. సందర్శకులనూ అలాగే కలిసేవాడు. స్పెయిన్‌లో పుట్టి, ఫ్రాన్స్‌లో స్థిరపడిన పికాసో చిత్రకారుడికి పర్యాయపదంగా నిలిచాడు.

––––––––––––––––––––––––––––––––––––
అక్టోబర్‌ 25న చిత్రకారుడు పికాసో(1881–1973) జయంతి
(ఫన్ డే, అక్టోబర్ 2014)
 

Tuesday, January 16, 2018

ఆమర్త్య సేన్: ఆర్థిక మానవతావాది



సాధారణంగా అంకెలు అంకెల్లానే వ్యవహరిస్తాయి. వాటికి ఆత్మాభిమానం, అణచివేత, క్షోభ, సామాజిక వ్యత్యాసం లాంటివేమీ తెలియదు. వృద్ధిరేటు ఎంత శాతం ఉంది? స్థూల జాతీయోత్పత్తి ఏ మేరకు పెరిగింది? ఇవి అవసరమే. కానీ వీటిని మాత్రమే ఆమర్త్య సేన్‌ లెక్కలోకి తీసుకోరు. ఆ అంకెలు ఉపరితలం నుంచి వచ్చినవా? అట్టడుగు వర్గాలను కూడా కలుపుకొన్నవా? అందుకే ఆయన మాటతీరు ఆర్థిక శాస్త్రవేత్తకన్నా మానవ హక్కుల మేధావిని తలపిస్తుంది. ‘ఆర్థికశాస్త్రానికి నైతిక కొలతను పునఃస్థాపించినవాడిగా’ ఆయనకు 1998లో నోబెల్‌ పురస్కారం దక్కింది ఈ కారణంగానే!

1933లో శాంతినికేతన్‌లో రవీంద్రనాథ్‌ టాగూర్‌ చేత నామకరణం చేయించుకున్న ఆమర్త్య కుమార్‌ సేన్‌... గాంధీజీ ‘విశ్వాసపు బాట’కన్నా, రవీంద్రుడి ‘హేతువు తోవ’కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చరఖా కన్నా పలక మిన్న అన్న గురుదేవుడి స్ఫూర్తిని జీర్ణించుకున్న ఆయన... పాకిస్తాన్‌ ఆర్థికవేత్త మహబూబ్‌ ఉల్‌ హక్‌తో కలిసి ‘మానవాభివృద్ధి సూచిక’ను రూపొందించారు. ఆయా దేశాల్లోని జీవన ప్రమాణాలను ఐక్యరాజ్యసమితి ఈ సూచిక ఆధారంగానే లెక్కిస్తోంది. దీనిప్రకారం భారత్‌ది 135వ స్థానం.

ప్రస్తుతం బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయానికి చాన్స్‌లర్‌గానూ, అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఆర్థిక, తత్వశాస్త్రాల బోధకుడిగానూ పనిచేస్తున్న ఆమర్త్య సేన్‌... తలసరి ఆదాయం మాత్రమే దేశాభివృద్ధికి సూచిక కాదంటారు. ‘మానవ సామర్థ్య’ పెరుగుదల మరింత ప్రాధాన్యమైన అంశం అంటారు. నిరక్షరాస్యత, కనీస ఆరోగ్య సౌకర్యాల లేమి, లైంగిక అసమానత్వం గురించి నొక్కి చెబుతారు. భిన్నవర్గాలకు గొంతుక ఇవ్వడంలో ఏ మేరకు సఫలీకృతమైందన్న దాన్ని బట్టే ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటారు. అయితే, ప్రజాస్వామ్యం దేనికీ గ్యారంటీ ఇవ్వదు. హక్కుల కోసం పోరాడాల్సివుంటుంది. ప్రాథమిక విద్యలాంటిదాన్ని ఉద్యమరూపంలోకి మలచడం అంత సులభం కాదని ఆయనకు తెలుసు. నిరంతర సంవాదం ద్వారా మౌలికావసరాల్ని సామూహిక స్పృహలోకి తేవాల్సి ఉందంటారు.

రెండు రకాల ఆర్థిక విధానాల గురించిన చర్చ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే వాళ్లే స్థూలజాతీయోత్పత్తిని పెంచుతారు, దానిలో భాగంగా పేదవాళ్లు కూడా దాని ఫలాలు అందుకుని పైకి ఎగబాకుతారనే ‘జీడీపీ వృద్ధి’ విధానం ఒకటీ; విద్య, ఆరోగ్యం లాంటివాటికి తొలి ప్రాధాన్యమిచ్చే ‘మానవ సామర్థ్య వృద్ధి’ విధానం మరొకటీ. చిత్రంగా మొదటిదానికే మన ప్రభుత్వాలు మరింత ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. దీన్ని ఆమర్త్యసేన్‌ వ్యతిరేకిస్తారు. ఏ దేశమూ కూడా మానవ సామర్థ్యాన్ని పెంపొందించకుండా అద్భుతమైన పెరుగుదలను సాధించలేదంటారు. జపాన్, చైనా, కొరియా, హాంగ్‌కాంగ్, తైవాన్, థాయ్‌లాండ్, యూరప్, అమెరికా, బ్రెజిల్‌... ఇవేవీ ట్రాక్‌ 1లో అభివృద్ధి చెందలేదంటారు.

‘సామ్యవాద ఆర్థికవ్యవస్థల్ని అణచివేత సహా ఎన్నో రాజకీయ, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టివున్నాయి. యాభై ఏళ్లక్రితం ఏ లక్ష్యాలైతే జనాన్ని సామ్యవాదంవైపు ఆకర్షించాయో, ఆ లక్ష్యాలు ఇప్పటికీ ప్రాధాన్యం కలిగినవే!’
మహిళలు ఎదుర్కొనే అణచివేత గురించి ఆయన 1960ల్లోనే రాశారు. విద్య, పోషణ విషయంలో ఒక కుటుంబంలో ఉండే పంపకాల్లోని అసమానతల గురించి చర్చించారు. ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ఇవన్నీ మాట్లాడాల్సిన పనేమిటని ఆయన్ని విమర్శించేవాళ్లున్నారు. ‘పేదరికం నాకు ఆసక్తి. బాలికల నిష్పత్తి నాకు ఆసక్తి. బాలల సంక్షేమం నాకు ఆసక్తి. శిశు మరణాలు నాకు ఆసక్తి’... ‘పాలను లీటర్లలో కొలిచినట్టుగా కవిత్వావేశం గణనకు లొంగదు, అంతమాత్రాన దాని ప్రభావం విస్మరించలేం కదా!’ అంటారు.

భిన్న సంస్కృతులు స్నేహపూర్వకంగా మనగలిగే సమాజాన్ని ఆయన కాంక్షిస్తారు. ప్రజాస్వామ్యం కేవలం అత్యధికుల పాలనావిధానం కాదనీ, అది సహనానికి సంబంధించినదనీ, అల్పసంఖ్యాకుల అభిప్రాయాల్నీ, విమర్శలనీ సహించడంలోనే ప్రజాస్వామ్య స్ఫూర్తి దాగుందనీ చెబుతారు.

కొందరి ప్రయోజనాలకు భంగం కలిగినా, కొందరు మార్కెట్‌ వెలుపలే ఉండిపోయినా కూడా కొందరైనా వ్యక్తిగతంగా లాభపడేలా చేస్తుంది కాబట్టి, మార్కెట్‌ ఎకానమీయే విజయం సాధిస్తుందంటారు. అయితే, నీకు చదువు లేకుండా, వ్యక్తిగత రుణం పొందే అవకాశం లేకుండా అందులో ఎప్పటికి పాల్గొనాలి?

పెట్టుబడీదారి విధానం సూత్రప్రాయంగా బలమైన వ్యక్తివాదాన్ని ప్రోత్సహించేదే అయినప్పటికీ, ఆచరణలో సమైక్యతకే దారితీసిందనీ, మన జీవితాల్ని మరింత పరస్పరాధారితంగా మార్చిందనీ చెబుతారు. ప్రపంచీకరణను ప్రతికూల దృష్టితో చూడనవసరం లేదంటారు. ‘అది ప్రపంచాన్ని సాంస్కృతికంగా, శాస్త్రీయంగా బలోపేతం చేసింది. ఎంతోమంది ఆర్థికంగా కూడా బలపడ్డారు’. ప్రతిదీ అందరికీ అందే దృష్టిలో దాన్ని స్వాగతిస్తారు. అలాగే దాన్ని మరింత మానవీయమైనదిగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ, అలా చేయడం కోసం జరిగే పోరాటాల్నీ సమర్థిస్తారు.

––––––––––––––––––––––
నవంబర్‌ 3న ఆమర్త్య సేన్‌ జన్మదినం
(2014 ఫన్ డే)

 

Saturday, January 13, 2018

క్యాల్విన్ క్లెయిన్: ఫ్యాషన్ బ్రాండ్ నేమ్




ఎవరో గల్లీకుర్రాడు వేసుకున్న టీ షర్ట్‌ మీద మీకు ఈ పేరు కనిపించివుండొచ్చు: క్యాల్విన్‌ క్లెయిన్‌! సంక్షిప్తంగా సి.కె. అదేమిటో కూడా తెలియకుండానే, ఒప్పందం కుదుర్చుకోని మోడల్‌గా మారిపోయాడు కుర్రాడు. ‘ఫ్యాషన్‌ బిజినెస్‌ ఇక ఎంతమాత్రమూ స్థానికమైనది కాదు; అది ప్రపంచ వ్యాపారం’ అని చెప్పే అమెరికన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌  క్యాల్విన్‌ క్లెయిన్‌... ప్రపంచం మీదకు చొచ్చుకువచ్చిన తీరుకు ఇది అద్దం పడుతుంది.

పచారీ కొట్టు నడిపే తండ్రికి 1942 నవంబరు 19న జన్మించిన క్లెయిన్‌... ఐదేళ్లప్పుడు వాళ్ల చెల్లెలి బొమ్మలకు బట్టలు కుట్టాడు. నెమ్మదిగా అది ఆడవాళ్ల దుస్తుల మీద ప్రత్యేక ఆసక్తికి కారణమైంది. 60ల చివర్లో సొంత స్టోర్‌ ప్రారంభించాడు. ర్యాంగ్లర్, లీవై, లీ లాంటి ‘సంప్రదాయ జీన్సు తయారీదార్ల’కు పోటీగా, ‘మా ఉత్పత్తులకు మాదైన తంత్రం, మాదైన తత్వం అద్దుతాం,’ అని బరిలోకి దిగాడు.

‘నాకూ క్యాల్విన్స్‌కు మధ్యన ఏముందో తెలుసుకోవాలనుందా? ఏమీలేదు’ అంటూ తొలియౌవనంలో ఉన్న బ్రూక్‌ షీల్డ్స్‌తో ఊహకు అవకాశమిచ్చేలా డైలాగ్‌ చెప్పించాడు. ‘నీకు పూర్తిగా తగినది కనుక్కో’మని ఊరిస్తూ, కౌమారంలోకి అడుగిడుతున్న అమ్మాయిలను ఆకట్టుకున్నాడు. ‘ఇంతకుముందుకంటే మనుషులు మరింత చక్కటి ఆకృతుల్లో ఉంటున్నారు. కొంచెం శ్రద్ధ పెడితే మీరు బాగా కనబడతారు. దుస్తులు ధరించినప్పుడు యౌవనపు అనుభూతి కలగాలి. అవి మీ ధోరణిని ప్రతిబింబిస్తాయి’ అని చెప్పాడు.

‘ఆధునిక సొగసు’కు మాస్టర్‌ డిజైనర్‌గా పేరొందిన సి.కె. తన పేరునే బ్రాండ్‌నేమ్‌ చేసుకున్నాడు. కోట్లు, జీన్సు, అండర్‌వేర్, స్పోర్ట్స్‌ వేర్, హ్యాండ్‌ బ్యాగ్స్, పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, బెడ్‌ షీట్స్, డైనింగ్‌ టేబుట్స్, డిషెస్, గ్లాస్‌వేర్‌... ఇలా అన్నింటా విస్తరిస్తూ వచ్చాడు. ‘ఎంతకాలం మన్నుతుంది, అనేదాన్నిబట్టి జీన్సు ధర నిర్ణయమవదు; దాన్ని ఉత్పత్తి చేయడంలో ఎంత శ్రమ దాగుంది? డిజైన్‌ సామర్థ్యం, వాష్‌ ఎంత అసలైనది... ఇలాంటివి ధరను నిర్ణయిస్తాయి’ అంటాడు. క్యాల్విన్‌ అన్ని సందర్భాల్లోనూ ఉత్పత్తిదారు కాదు. తన స్పెసిఫికేషన్స్‌కు తగ్గట్టుగా ఉత్పత్తుల్ని రూపొందించేలా ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. అమ్మకాల మీద రాయల్టీలు పొందుతాడు.

ఎన్ని రకాల డిజైన్లు చేసినప్పటికీ, తనను తాను తొలుత విమెన్‌ డిజైనర్‌గా భావిస్తాడు. మహిళల శరీరాలు, వాటి ధర్మాలు, వారి కోరికలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ‘వాళ్లకు సంబంధించిన ప్రతిదీ, ఇన్నర్‌వేర్, ఔటర్‌వేర్‌ ఏదైనా తేడా లేదు’; వాళ్లు అన్నీ అందంగానే ఉండాలని కోరుకుంటారంటాడు. ‘ఉత్పత్తికి సంబంధించిన ప్యాకేజింగ్, దాని వాణిజ్య ప్రకటన అన్నీ ఆ ఉత్పత్తిని ప్రతిబింబించాలి... అయితే, సెలబ్రిటీలకు నా బ్రాండ్‌ దుస్తులను తొడిగించడంలో ఏనాడూ ఆసక్తిలేదు; ఆధునిక అమెరికా మహిళ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడ్రన్‌ వర్కింగ్‌ వుమెన్‌... ఆమె యాక్టివ్, యంగ్, తనకో కుటుంబం ఉంటుంది, బిజీగా ఉంటుంది... స్త్రీగా ఉండటాన్ని ఆనందిస్తూనే కేవలం ఫ్యాషన్‌ బొమ్మగా పరిగణించడాన్ని సహించదు... వాళ్లు సోషలైట్స్‌ కానక్కర్లేదు... అలాంటివాళ్లకు డిజైన్‌ చేయడం’లో తనకు ఆనందం ఉందంటాడు.

అయితే వాణిజ్య ప్రకటనల్ని‘సెక్సీ’గా రూపొందించడం ద్వారా చాలాసార్లు విమర్శల పాలయ్యాడు. అలాగే, సౌష్టవమైన దేహంకన్నా బక్కపలుచటి మోడల్‌ కేట్‌మాస్‌ను వినియోగించినప్పుడు కూడా, ‘అస్తవ్యస్త పోషణ’కు కారణమయ్యాడంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, చక్కటి ఆకృతిలో ఉండటానికిగానూ వ్యాయామం చేసేలా ప్రేరేపిస్తోందికదా, అని నవ్వేస్తాడు. మద్యపానం, మాదకద్రవ్యాలు, బై సెక్సువల్‌ ఇమేజీ కూడా ఆయన్ని చాలాకాలం ప్రతికూల వార్తల్లో ఉంచాయి.

తన ఉత్పత్తులకు తరచూ మోడళ్లను రిపీట్‌ చేస్తాడు క్యాల్విన్‌. దానిలో ఉన్న సానుకూల అంశం ఏమిటంటే, ‘అది ఉత్పత్తికి సంబంధించిన కొనసాగింపు’ను సూచిస్తుందంటాడు. తన ఉత్పత్తులకు మోడళ్లనే ఎక్కువగా వినియోగించడానికి కారణం, ‘మోడల్‌ ఎంతో చెప్పగలుగుతుంది. అదే సెలబ్రిటీలు, నటులు వారిదైన మనుషులు’ అంటాడు. అందుకే, ప్రయాణిస్తున్నప్పుడు దారిలో కనబడిన మనిషి దగ్గర తన కారు ఆపుకొని అతణ్ని ఎంపిక చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి(ఉదా: టామ్‌ హింట్‌నౌస్‌).

తనను మరొకరు కాపీ కొట్టడం సంతోషమేనని చెబుతాడు. ‘ఫ్యాషన్‌ పరిశ్రమ అనేది కొత్తది కనుక్కోవడం కాదు’, ఉన్నదాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్లేదే! ‘అసలు ఎవరైనా మనల్ని కాపీ కొట్టకపోతేనే సమస్య. మనం సరైనది  ఇవ్వనట్టు లెక్క’ అంటాడు. ఫ్యాషన్‌ గురించి చక్కటి ముక్తాయింపు ఇస్తాడు. ‘ఒకరిని అందంగా కనిపింపజేయడంలో సహాయపడటానికి మించిన ఉత్సాహవంతమైన పని ఇంకేముంటుంది?’
(ఫన్ డే, నవంబర్ 2014)

 

Thursday, January 11, 2018

త్రిపురేని గోపీచంద్: వీలునామా బాకీపడిన సమర్థుడు

ప్రశ్న మాత్రమే మన జీవితాంతం తోడు రాగలుగుతుందా? ఎక్కడో ఒకచోట సమాధానపడవలసిన స్థితి తప్పక వస్తుందా? అలా వచ్చే స్థితి సహేతుకమా, నిర్హేతుకమా? ‘అసమర్థుని జీవయాత్ర’, ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’, ‘పోస్టు చేయని ఉత్తరాలు’, ‘మాకూ ఉన్నాయి స్వగతాలు’, ‘తత్వవేత్తలు’ ‘మెరుపులు మరకలు’ వంటి విశిష్ట రచనలు చేసిన గోపీచంద్ ప్రయాణం- నాస్తికత్వంతో మొదలై, మార్క్సిజం, నవ్య మానవతావాదాల్ని దాటుకుని, ఆధ్యాత్మిక చింతన దగ్గర నిలిచిపోయింది.

 ‘సూతాశ్రమం’ స్థాపకుడు త్రిపురనేని రామస్వామి చౌదరి ఇంట జన్మించిన గోపీచంద్- తండ్రి అడుగుజాడల్లో హేతువాదిగా మసలుకున్నాడు. ‘ఎందుకు?’ అన్న ప్రశ్న వెంట నడిచాడు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, ‘శాస్త్రీయ ధోరణి’తో రచనలుగావించాడు. మానసిక విశ్లేషణ చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. సిద్ధాంతాల్ని తేలికభాషలో చెప్పే రాజకీయ కథల్ని రాశాడు. మార్క్సిజం ఏమిటో వివరించే ప్రయత్నం చేశాడు. తర్వాత, ఎం.ఎన్.రాయ్ బాటలో నడిచి రాడికల్ హ్యూమనిస్టుగా ఖ్యాతిగాంచాడు. సంఘంలోని హెచ్చుతగ్గులకు భగవంతుణ్ని కారణంగా చెప్పటాన్ని మోసంగా జమకట్టాడు. నీతినియమాలు ప్రకృతిలో నియమనిబద్ధతకు సంబంధించినవన్నాడు. ఏ దృక్పథమైనా మానవుడి పరిణామానికి దోహదం ఇచ్చేదిగా ఉండాలి; అతని మీద పెత్తనం చలాయించేదిగా ఉండకూడదన్నాడు.

 లేని గౌరవాలకు పోయి, ఉన్నదంతా ఊడగొట్టుకుని, లౌకిక ప్రపంచపు విలువల్ని తిరిగి అందుకోవడంలో విఫలమై, అందరిలాంటివాడే అనిపించుకోవడం ఇష్టంలేక తనకుతానే ఒక ద్వీపకల్పంగా తయారై, చేసినపనిలో ఇమడలేక, ఏ పనిచేయాలో ఎందుకు చేయాలో అర్థంకాక, జీవితానికి ఏ సార్థకతా, పరమార్థమూ కనబడక,  తలెక్కడో తోకెక్కడో తెలియని సంఘంతో ఘర్షణ పడి, బతికినన్నాళ్లూ ఏదో ఒకరకంగా జీవితంలో పాల్గొనవలసిందేనన్నది మరిచిపోయి, పిచ్చివాడిగా ముద్రపడి, బలవన్మరణానికి గురైన ‘అసమర్థుడు’ సీతారామారావు పాత్రను సృష్టించాడు. ధనికులు మనిషిగానే జమకట్టని రిక్షావోడి అంతరంగాన్నీ, శరీరం సహకరించని దశలో ఆదరణ కరువైన ముసలి ఎద్దు వేదననీ తన రాతల్లో చిత్రికపట్టాడు. ప్రత్యేకించి తత్వశాస్త్రాన్ని అభ్యసించకపోయినా, స్వీయ అధ్యయనం ద్వారా ఎందరో తాత్వికుల ఆలోచనాధారను పరిచయం చేశాడు.

 వృత్తిరీత్యా గోపీచంద్ న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడుగానీ, అందులో నెగ్గలేకపోయాడు. సినిమాల్లోకి ప్రవేశించి ‘రైతుబిడ్డ’, ‘గృహప్రవేశం’ వంటి చిత్రాలకు రచన చేశాడు. ‘లక్ష్మమ్మ’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎంతో ప్రతిభ ఉన్నవాడైనప్పటికీ మద్రాసులో నిలదొక్కుకోలేక, ఆర్థికంగా చితికిపోయిన దశలో పాండిచ్చేరి అరవిందాశ్రమం ఒడిలో వాలిపోయాడు. అరవిందుని దర్శనాన్ని  విశ్వసించాడు. కొడుకు సాయిచంద్ ఆరోగ్యం బాగాలేనప్పుడు, సాయిబాబాను కూడా నమ్ముకున్నాడు. సామాన్యమానవులు అందుకోలేని కొన్ని స్థాయుల్ని మహర్షులు అందుకోగలిగారనీ, అందువల్ల వారిని ప్రశ్నించకుండా అంగీకరించాలనీ రాశాడు.  ‘ఎక్కడో ఒకచోట ఈ ఎందుకు? ఆగవలసిందేరా తండ్రుల్లారా’ అని సీతారామారావు వ్యాఖ్యానించినట్టుగా... ‘ఎందుకు? అన్న ప్రశ్న నేర్పిన’ నాన్న నుంచి పూర్తిగా ‘విముక్తుడయ్యాడు’.

 గోపీచంద్ జీవితం, ఆ లెక్కన ఏ సాధారణ మానవుడి జీవితం కూడా ఈ ‘భ్రమణానికి’ మినహాయింపు కాదేమో! పిల్లాడిగా తండ్రినీ, ఇంకా ఆ వయసులో బలమైన ముద్రవేయగలిగేవారినీ అనుకరించి, అనుసరించి... యౌవనంలో ప్రశ్నను ఆయుధంగా మలుచుకుని, నిర్లక్ష్యం చేస్తున్న ప్రపంచాన్ని తమ మాటలతో ఆకర్షించి... చిట్టచివరకు, అంతకుముందు భిన్నంగా నడిచిన పిల్లపాయ నుంచి తప్పుకుని ప్రధాన స్రవంతిలో ఏకమైపోవడంతో జీవితం పూర్తవుతుంది! కాకపోతే, అప్పటికి ‘ప్రగతిశీలం’గా కనబడే విలువల్లోంచే ఎవరినైనా అంచనా కడతాం కాబట్టి, గోపీచంద్ మీద ‘తాత్విక గందరగోళం’గా ముద్రవేయడానికి వీలుపడుతోంది.

 థియరీని ప్రాక్టికల్‌గానూ అన్వయించుకోవడంలో విఫలమైతే ఏ వాదానికైనా అర్థంలేదు. అందుకే తను రాసిన వాటిని తనే ధిక్కరించుకునే అవసరం గోపీచంద్‌కు వచ్చిందేమో! మానవ స్వభావపు పరిధిలోనే ఆయన రచనాక్రమం సాగిందేమో! చిట్టచివరికి ఆయన తన అసలు స్వభావానికి చేరుకున్నాడేమో! కాకపోతే ఒక కన్ఫెషనల్ స్టేట్‌మెంట్ ఏమైనా పాఠకులకు బాకీ ఉండిందేమో! 1962లో 52 ఏళ్లకే ఆయన అర్ధాంతరంగా మరణించివుండకపోతే ఆ బాకీ కూడా చెల్లిపోవునేమో! లేదా, ఆయన తిరిగిన ప్రతిమలుపూ అలా చేసిన ప్రకటనేనేమో!

(సెప్టెంబర్ 8న రచయిత త్రిపురనేని గోపీచంద్ జయంతి)

ఫన్డే-సాక్షి September 07, 2014

సాలీమ్ అలీ: పక్షి ప్రేమికుడు



చెబితే ఇది కూడా ఒక కథలాగే ఉంటుంది! అప్పుడు సాలీమ్‌ అలీకి పదేళ్లు. వేట తెలిసిన కుటుంబంలో పుట్టినవాడు కాబట్టి, ఇంట్లో ఎయిర్‌గన్‌ ఉంది. దాంతో ఆడుతూ, ఒకరోజు ఎగురుతున్న పిట్టను షూట్‌ చేశాడు. చూడ్డానికి అది మామూలు ఊరపిచ్చుక(స్పారో)లానే ఉంది. తీరా దగ్గరికెళ్తే కంఠం మీద పసుప్పచ్చ చార కనబడింది. దీని పేరేమిటి? వాళ్ల అంకుల్‌ అమీరుద్దీన్‌ను అడిగినా చెప్పలేకపోయాడు. ఆ అంకుల్‌ చేసిన మంచి పనేమిటంటే, పిల్లాడి కుతూహలాన్ని చంపేయకుండా, దగ్గర్లోనే ఉన్న ‘బాంబే నాచురల్‌ హిస్టరీ సొసైటీ’కి తీసుకెళ్లడం! సొసైటీ గౌరవ కార్యదర్శి డబ్లు్య.ఎస్‌.మిల్లర్డ్‌ బాలుడి ఆసక్తికి ముచ్చటపడి వాళ్ల దగ్గరున్న స్టఫ్డ్‌ బర్డ్‌ శాంపిల్స్‌ చూపించాడు. తను చూసిన పిట్టలాంటిది అక్కడా ఉండటం సాలీమ్‌కు ఉత్సాహం కలిగించింది. ఆ ఘట్టమే ఆయన్ని తర్వాత్తర్వాత గొప్ప ఆర్నిథాలజిస్టుగా తీర్చిదిద్దింది. అందుకే తన ఆత్మకథకు ‘ద ఫాల్‌ ఆఫ్‌ ఎ స్పారో’ అని పేరు పెట్టుకున్నాడు.
సాలీమ్‌ మొయిజుద్దీన్‌ అబ్దుల్‌ అలీ, వ్యవహారంలో సాలీమ్‌ అలీ(సలీం అలీ అని కొందరు రాసినా అసలు ఉచ్చారణ ఇదే!) 1896లో నవంబర్‌ 12న జన్మించాడు. బానే చదివేవాడుగానీ అంత శ్రద్ధ లేదు. అందువల్ల డిగ్రీదాకా రాలేదు. కుటుంబ మైనింగ్‌ వ్యాపారంలో భాగంగా బర్మా వెళ్లినప్పుడు, అక్కడి అడవుల్లో చూసిన మరిన్ని పిట్టలు ఆయనలోని పాత జిజ్ఞాసకు తిరిగి రెక్కలు తొడిగాయి. ఇక వాటి వెంటే ఎగరడానికి నిర్ణయించుకున్నాడు. అయితే, ఆసక్తి కన్నా కొన్నింటిని ‘విద్యార్హత’ నిర్ణయిస్తుంది కాబట్టి, ఆ అడ్డంకిని కూడా దాటాలనుకున్నాడు. జువాలజీతో బి.ఎ. హానర్స్‌ చేశాడు. అప్పటికి బీస్సీ లేదు. బాంబే నాచురల్‌ హిస్టరీ సొసైటీలో క్లర్కుగా ఉద్యోగం పొందాడు. పెళ్లి చేసుకున్నాడు.

మొదట్నుంచీ కూడా పక్షుల ప్రవర్తనను వాటి సహజ పరిసరాల్లో పరిశీలించాలనేది సాలీమ్‌ సంకల్పం. ఇది మామూలు విషయమే కదా అనిపించవచ్చు. కానీ స్వాతంత్య్రానికి పూర్వం, పక్షుల అధ్యయనమంటే వాటి కళేబరాలతో(టాక్సానమీ) ప్రయోగశాలల్లో చేసేదే! క్షేత్రాధ్యయనం తక్కువ. వేటగాళ్ల మీద ఆధారపడేవాళ్లు. అది సాలీమ్‌కు రుచించేది కాదు. మరింత అధ్యయనం కోసం, ఏడాది సెలవు తీసుకుని, జర్మనీ, ఇంగ్లండ్‌ వెళ్లాడు. తిరిగొచ్చేసరికి, సంస్థ నష్టాల్లో ఉన్న కారణంగా ఉద్యోగం పోయింది.

కొంత ఊగిసలాట తర్వాత, తను ప్రేమించే రంగాన్నే ఉపాధిగా మలుచుకోవడమే సరైందని నిర్ణయించుకున్నాడు. ముందుగా ‘హైదరాబాద్‌ ఆర్నిథాలాజికల్‌ సర్వే’ను సంప్రదించాడు. పక్షుల అధ్యయనం చేసిపెట్టినందుకుగానూ ఇంత ప్రతిఫలం ముట్టజెప్పేట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆరు నెలల కాలానికి ఆరువేల రూపాయలు! వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకోవడానికి, భార్య తెహ్మీనా అంగీకారంతో నగర శివార్లలోకి మారాడు. అది ఆయన్ని ప్రకృతికి మరింత దగ్గర చేసింది.

బైనాక్యులర్స్, నోట్సు, పెన్సిల్‌తో బయలుదేరిపోయేవాడు. మైళ్లకొద్దీ ఎగిరిపోయేవీ, కనీసం కూడా ఎగరలేనివీ; ఆడపక్షి గుడ్లు పెట్టడం కోసం అందమైన గూళ్లు అల్లేవీ, ఏ ప్రత్యేక శ్రద్ధా తీసుకోకుండా గుడ్లుపెట్టేవీ; పుట్టినచోటే జీవితాంతం గడిపేవీ, రెక్కలు రాగానే వెనక్కి చూడకుండా ఎగిరిపోయేవీ; మనుషుల మీదే ఆధారపడి బతికేవీ, మనుషులు దగ్గరికొస్తే ప్రాణాలకు ముప్పున్నవీ... ఎన్నిరకాల పక్షులు!

హైదరాబాద్‌ తర్వాత కొచ్చిన్, తిరువనంతపురం రాజ్యాల్లో ఈ సర్వే చేశాడు. తర్వాత గ్వాలియర్, ఇండోర్‌! అటుపై నీలగిరుల్లో తిరిగాడు. అఫ్గానిస్తాన్‌ కొండల్ని చుట్టాడు. కైలాస మానససరోవరం, హిమాలయాలు, భరత్‌పూర్, బస్తర్, రణ్‌ ఆఫ్‌ కచ్, లడఖ్‌... ఒంటెల మీదా, గుర్రాల మీదా, ఎడ్లబండ్లమీదా, కాలినడకనా... బొటనవేలంత చిన్నగావుండే తేనెపిట్ట, గుర్రప్పిల్లంత ఎత్తుండే నిప్పుకోడి; చలి ప్రాంతాల్లో పెరిగేది, వేడి ప్రదేశాల్లో మసిలేది; వంపు తిరిగిన ముక్కులూ, ఎర్రని మీసాలూ, తెల్లని బుగ్గలూ, దట్టమైన రంగులూ... ‘మన ప్రపంచంలోనే మరో ప్రపంచం’ అది! భారతదేశంలోనే 1200 జాతుల పక్షులున్నాయి. ఇవి ఎలా ఆహారం సేకరిస్తాయి, ఎలా జతను కూడతాయి, వాటి వన్నెలు, చిన్నెలు, ఈకలు, వాటికే ప్రత్యేకమైన ధ్వనులు... తన జీవితసారాన్ని ‘ద బుక్‌ ఆఫ్‌ ఇండియన్‌ బర్డ్స్‌’, ‘హాండ్‌బుక్‌ ఆఫ్‌ ద బర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ పాకిస్తాన్‌’(శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్‌ కూడా కలుపుకొని)గా వెలువరించాడు సాలీమ్‌. ఆయన విశేషకృషికిగానూ ‘పద్మవిభూషణ్‌’తో గౌరవించింది భారత ప్రభుత్వం.
పక్షుల్ని శాస్త్రీయ అవసరాలకోసం వేటాడ్డాన్ని ఆయన వ్యతిరేకించలేదు. అర్థరహితమైన హింసను మాత్రం పూర్తిగా నిరసించాడు. ఆ అభిప్రాయం అహింసలాంటి తాత్వికధారతో ముడిపడినది కాదు; పూర్తి పర్యావరణ హిత కారణాలవల్లే! వ్యక్తిగా కూడా ఆయన మతవిశ్వాసాలు పెద్దగా లేనివాడే! భక్తిని ప్రదర్శించడం ద్వారా తాము ఇతరులకన్నా నైతికంగా అధికులమనుకునే ధోరణిని చీదరించుకునేవాడు.

పాల్‌ గెట్టీ అవార్డుద్వారా ఆయనకు 4 లక్షలు వచ్చినప్పుడు ఒక బంధువు అన్నమాట: ‘ఆ డబ్బులు ఎవరికన్నా విరాళంగా ఇచ్చేముందు, మూడు శుభ్రమైన ప్యాంట్లు కొనుక్కో’.

(సాక్షి- ఫన్ డే; నవంబర్ 9, 2014)