Showing posts with label కథాసారం: ఇతర. Show all posts
Showing posts with label కథాసారం: ఇతర. Show all posts

Friday, July 3, 2026

ద లాస్ట్‌ నైట్‌ ఆఫ్‌ ద వల్డ్‌


రే బ్య్రాడ్బరీ

రే బ్య్రాడ్బరీ(1920–2012) కథ ‘ద లాస్ట్‌ నైట్‌ ఆఫ్‌ ద వల్డ్‌’ సంక్షిప్త స్వేచ్ఛానువాదం ఇది.  నిజంగానే ఆ యుగాంతం లాంటిది సంభవించనుందని మనుషులకు ముందే తెలిస్తే? ఈ కథ దీన్నే చిత్రిస్తుంది. ఇది మొదటిసారి 1951లో ప్రచురితమైంది. ఈ అమెరికన్‌ రచయిత చాలా చిన్నప్పుడే, తాను ఏదో ఒక కళలోకి ప్రవేశిస్తానని అనుకున్నాడు. పదకొండేళ్ల వయసు నుంచే రాయడం మొదలుపెట్టాడు. ఫాంటసీ, సైన్స్‌ ఫిక్షన్, హారర్‌ లాంటి రకరకాల జాన్రాల్లో గొప్ప కథలు రాశాడు. ఫారిన్‌హీట్‌ 451 ఆయన ప్రసిద్ధ నవల.


తర్వాతి రోజుల్లో ఒక రాత్రి


‘‘ప్రపంచానికి ఇదే చివరి రాత్రి అని తెలిస్తే నువ్వేం చేస్తావు?’’

‘‘నేనేం చేస్తాను; సీరియస్‌గానే అడుగుతున్నావా?’’

‘‘అవును, సీరియస్‌గానే.’’

‘‘నాకు తెలీదు– నేను ఆలోచించలేదు’’. వెండి కాఫీపాత్ర హాండిల్‌ను అతడి వైపు తిప్పి, సాసర్లలో రెండు కప్పులు పెట్టింది. అతడు కొంచెం కాఫీ వంపాడు. వెనక లాంతరు వెలుగులో ఇద్దరు బాలికలు బ్లాక్స్‌ ఆడుతున్నారు. సాయంత్రం గాలి కాఫీ వాసన వేస్తోంది.

‘‘ఇప్పుడు ఆలోచించరాదూ,’’ అన్నాడతను.

‘‘ఏంటి యుద్ధమా?’’ అతడు తలూపాడు.

‘‘హైడ్రోజనో, ఆటంబాంబో కాదుగా.’’

‘‘కాదు.’’

‘‘లేదంటే ఈ బయో వార్‌?’’

కాఫీని నెమ్మదిగా కలుపుతూ, ఆ నల్లటి వలయపు లోతుల్లోకి చూస్తూ, ‘‘అవేమీ కాదు, ఒక పుస్తకం అయిపోవడం అనుకుందాం’’ అన్నాడు.

‘‘నాకేమీ అర్థం కావడం లేదు.’’

‘‘చెప్పాలంటే నాకూ కాలేదు. ఏదో ఒక ఫీలింగ్‌; కొన్నిసార్లు అది భయపెడుతుంది, కొన్నిసార్లు అసలు భయమే వేయకపోగా శాంతిగా ఉంటుంది.’’ అతడు అమ్మాయిల వైపు చూశాడు. దీపం వెలుగులో వారి పసుపు రంగు జుట్టు మెరుస్తోంది. ‘‘నేను నీకు చెప్పలేదుగానీ నాలుగు రాత్రుల క్రితం మొదటిసారి అనిపించింది.’’

‘‘ఏంటి?’’

‘‘నాకో కలొచ్చింది. ఇదంతా ముగిసిపోనుందని ఏదో గొంతు చెబుతోంది, అది నాకు తెలిసిన గొంతయితే కాదు. కానీ ఈ భూమ్మీద అన్నీ ఆగిపోతాయని చెప్పింది. నిద్ర లేచాక దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఆ ఫీలింగ్‌ మాత్రం ఆ రోజంతా నాతో ఉండింది. మధ్యాహ్నం కిటికీలోంచి బయటకు చూస్తున్న స్టాన్‌ విల్లీస్‌తో, ‘స్టాన్, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్‌’ అనగానే, ‘నాకు రాత్రో కల వచ్చింది’ అని అతడు మొదలుపెట్టబోయేంతలోనే, అతడికి వచ్చిన కలేమిటో నాకు తెలిసిపోయింది. నాకూ అలాంటి కలే వచ్చిందని చెబితే అతడేమీ ఆశ్చర్యపోలేదు. విశ్రాంతిగా కనిపించాడు కూడా. ఊరికే అలా నడుచుకుంటూ ఆఫీసంతా కలయదిరిగాం. ప్రతి ఒక్కరూ కిటికీల వైపో, చేతుల వైపో చూస్తున్నారు.’’

‘‘వారందరూ అదే కలగన్నారంటావా?’’

‘‘అందరూ. అదే కల, మార్పే లేకుండా.’’

‘‘మరి ఎప్పుడు ముగుస్తుందంటావు? అంటే, ఈ ప్రపంచం.’’

‘‘రాత్రిలో ఏదో ఒక సమయంలో మనకు, ఎలా రాత్రవుతే అలా మిగతా ప్రపంచానికి. మొత్తం పోవడానికి 24 గంటలు పడుతుంది.’’

కాసేపు వాళ్లు కాఫీని తాకకుండా కూర్చున్నారు. మళ్లీ నెమ్మదిగా చేతుల్లోకి తీసుకుని, ఒకరినొకరు చూసుకుంటూ తాగారు.

‘‘నిజంగా మనకు ఇలా జరగాల్సిన వాళ్లమా?’’ అడిగిందామె.

‘‘జరగాల్సిన వాళ్లమా, కాదా అనికాదు. ఏదో తేడా జరిగిందంతే. కానీ నువ్వు దీని గురించి ఏమీ వాదించలేదు, ఏం?’’

‘‘దానికో కారణం ఉంది. చెప్పాలనిపించలేదు గానీ రాత్రే ఆ కల నాకూ వచ్చింది. మన వీధిలో ఉన్న ఆడవాళ్లు కూడా అదే మాట్లాడుకుంటున్నారు.’’ సాయంత్రం దినపత్రికను అతడి వైపు పెడుతూ, ‘‘కానీ ఇందులో దీని గురించి వార్తే లేదు’’ అంది.

‘‘అందరికీ తెలిసిపోయిం తర్వాత ఇంకెందుకు?’’ అతడు పత్రికను తీసుకుని, విరామంగా కుర్చీలో కూర్చుని, చిన్నారుల వంకోసారి చూశాడు. ‘‘నువ్వు భయపడ్డావా?’’

‘‘ఊహు. పిల్లల కోసం కూడా భయపడలేదు. చచ్చేంత భయమవుతుందని అనుకున్నాను గానీ కాలేదు.’’

‘‘మనుషులు తమను తాము కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారని శాస్త్రవేత్తలు తెగ మాట్లాడుతుంటారే.’’

‘‘జరుగుతుందంతా తార్కికంగానే ఉందనుకున్నప్పుడు నువ్వు అంత ఉద్వేగపడవు. మనం బతికిన విధానానికి ఇంకోలా జరిగే వీలే లేదు.’’

‘‘మనం అంత చెడుగా ఏమీ ప్రవర్తించలేదు, అవునా?’’

‘‘లేదు, అలాగని గొప్ప మంచిగా కూడా లేము. నేననుకోవడం అదే సమస్య. ప్రపంచం ఎన్నో రకాల ఘోరాల్లో మునిగివున్నప్పుడు, మన గురించి తప్ప మనం ఇంక దేనిగురించీ పెద్ద పట్టించుకోలేదు.’’

అమ్మాయిలు చేతులు ఊపుతూ బ్లాక్స్‌ కింద పడగొట్టి నవ్వుతున్నారు.

‘‘ఇట్లాంటి సమయాల్లో జనమంతా వీధుల్లో అరుస్తూ ఉంటారనుకున్నాను.’’

‘‘వాస్తవమైన విషయానికి ఎవరూ అరవరు.’’

‘‘నిన్నూ పాపలనూ మిస్సవుతానని తప్పిస్తే నాకేం బాధలేదు. ఈ సిటీ, ఆటోలు, ఫ్యాక్టరీలు, నా పని– ఇవేమీ ఎట్లాగూ నాకు నచ్చలేదు. నా కుటుంబమూ, వాతావరణంలో జరిగే మార్పులూ, ఎండలో వచ్చినప్పుడు గ్లాసెడు చల్లటి నీళ్లూ, నిద్ర అనే విలాసమూ, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కోల్పోతాను. ఇట్లా కూర్చుని మనం ఎట్లా మాట్లాడుకోగలం చెప్పు?’’

‘‘ఎట్లాగూ ఇంకేం చేయలేకా?’’

‘‘అట్లాగే అనుకో, ఒకవేళ ఉంటే అవే చేసేవాళ్లం. మనుషులు ప్రతి ఒక్కరికీ చివరి రాత్రి ఏమేం చేయబోతున్నారో తెలియడం నేననుకోవడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి.’’

‘‘ఈ సాయంత్రం, ఈ కొన్ని గంటలు మనుషులంతా ఏం చేస్తుంటారో కదా!’’

‘‘ఏదో షోకు వెళ్లడం, రేడియో వినడం, టీవీ చూడటం, పేకాడటం, పిల్లల్ని నిద్రపుచ్చడం, వాళ్లు  నిద్రపోవడం, ఎప్పటిలాగే.’’

‘‘ఎప్పటిలాగే మనం ఎంతోకొంత గర్వపడే విషయాలు.’’

‘‘మనం అంత చెడ్డవాళ్లమేం కాదు.’’

వాళ్లు అలా క్షణం ఉన్నాక, అతడు మరింత కాఫీ పోశాడు. ‘‘ఈరోజే అని ఎందుకు అనుకుంటున్నావు?’’

‘‘ఎందుకంటే’’

‘‘గత శతాబ్దిలోని ఓ పదేళ్ల కిందటి రాత్రో, ఓ ఐదో పదో వందల ఏళ్ల కిందో ఎందుక్కాదని?’’

‘‘ఎందుకంటే, చరిత్రలో ఇంతకుముందెన్నడూ 1951 ఫిబ్రవరి 30 అనే తేదీ లేదు గనక, ఇప్పుడు మాత్రమే ఉంది గనక, ఏ తేదీకీ లేని ప్రాముఖ్యత ఈ తేదీకి మాత్రమే ఉన్నది గనుక, 

ఈ సంవత్సరం మాత్రమే పరిస్థితులు ప్రపంచమంతటా ఎలా ఉండాలో అలా ఉన్నాయి గనక, అందుకే ఇది అంతం.’’

‘‘మహాసముద్రం మీద ఇరువైపులా ఈరాత్రి ప్రయాణిస్తున్న బాంబర్స్‌ ఇంకెప్పటికీ భూమిని చూడలేవు.’’

‘‘కారణాల్లో అది కూడా ఒక భాగం.’’

‘‘సరే అయితే, తర్వాతేంటి? గిన్నెలు తోమడమా?’’ అన్నాడతను.

గిన్నెలను ఇద్దరూ చాలా జాగ్రత్తగా శుభ్రం చేసి, అంతే నీటుగా వాటిని ఎక్కడివక్కడ సర్దారు.

ఎనిమిదిన్నరకు అమ్మాయిలను మంచం మీద నిద్రపుచ్చి, వారికి గుడ్‌నైట్‌ ముద్దిచ్చి, మంచాల పక్కన ఉన్న చిన్న లైట్లను మాత్రం వేసి, గది తలుపును కొద్దిగా తెరిచివుండేట్టుగా దగ్గరకు వేశారు.

‘‘నాకు అర్థం కావట్లేదు,’’ అన్నాడు భర్త, గదిలోంచి బయటికి వస్తూ, ఓసారి మళ్లీ వెనక్కి చూసి, తన పైపును అలాగే కాసేపు పట్టుకుని నిలబడి.

‘‘ఏంటి?’’

‘‘తలుపులు మొత్తం వేసేద్దామా, లేక వాళ్లు దేనికైనా పిలిస్తే వినబడేట్టు కొంచెం తెరిచివుంచుదామా?’’

‘‘నేనైతే పిల్లలకు తెలుసనుకోవట్లేదు, వాళ్లతో ఎవరూ ఏమీ చెప్పివుండరు.’’

‘‘అంతేలే. లేదంటే వాళ్లు మనల్ని అడిగివుండేవారుగా.’’

వాళ్లు కూర్చుని కాసేపు న్యూస్‌ పేపర్‌ చదివారు, కాసేపు రేడియోలో సంగీతం విన్నారు. తర్వాత ఇద్దరూ కట్టెబొగ్గుల్ని చూస్తూ పొయ్యి దగ్గర కూర్చున్నారు. గడియారం పదిన్నర, పదకొండు, పదకొండున్నర కొట్టింది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఈ సాయంత్రాన్ని తమకే సొంతమైన రీతిలో గడిపివుంటారని వాళ్లు తలపోశారు.

అతడు భార్యను దగ్గరకు తీసుకుని చాలాసేపు ముద్దాడాడు.

‘‘మనం అయితే ఒకరికొకరం బానేవున్నాం.’’

‘‘నీకు ఏడవాలనిపిస్తోందా?’’ అడిగాడు అతను.

‘‘అట్లేం లేదు.’’

వాళ్లు ఇంట్లోకి వెళ్లి, తలుపులు వేసి, లైట్లన్నీ ఆర్పి, పడకగదిలోకి వెళ్లారు.

‘‘నేను అలిసిపోయాను.’’

‘‘ఇద్దరం అలిసిపోయాం.’’

ఇద్దరూ మంచంలోకి ఎక్కి అట్లా ఒరిగారు. ‘‘ఇప్పుడే వస్తా,’’ అంటూ ఆమె లేచింది.

ఆమె ఇంటివెనగ్గా వెళ్లడమూ, తరుపు తెరుచుకోవడమూ అతడికి వినబడింది. క్షణంలో ఆమె తిరిగొచ్చింది. ‘‘కిచెన్లో నల్లా మరిచిపోయినట్టు ఉన్నాను, ఆపేసి వచ్చాను,’’ అంది.

అదెందుకో తమాషాగా కనబడి అతడికి నవ్వొచ్చింది.

ఆమెక్కూడా తను చేసిన పని చిత్రంగా అనిపించి, ఆ నవ్వుతో జత కలిపింది.

కాసేపటికి ఇద్దరూ నవ్వడం ఆపేసి, తలలు దగ్గరగా జరిపి, ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని, విశ్రాంతిగా పడుకున్నారు.

కాసేపటికి, ‘‘గుడ్‌ నైట్‌’’ అన్నాడతను.

ఆమె ‘‘గుడ్‌ నైట్‌’’ అని, దానికి మృదువుగా ‘‘డియర్‌’’ అని చేర్చింది.


(సాక్షి సాహిత్యం; 13 ఏప్రిల్‌ 2020)


Tuesday, June 30, 2026

ద లిటిల్‌ మాచ్‌స్టిక్‌ గర్ల్‌


హాన్స్‌ క్రిస్టియన్‌ యాండెర్సెన్‌

హాన్స్‌ క్రిస్టియన్‌ యాండెర్సెన్‌ (1805–75) రాసిన ‘ద లిటిల్‌ మాచ్‌స్టిక్‌ గర్ల్‌’ కథకు ఇది అనువాదం. రచనాకాలం: 1845. మనుషుల్లో ఉండవలసిన కరుణను ప్రధాన వస్తువుగా చేసుకున్న ఈ ఫెయిర్‌ టేల్‌ ప్రపంచవ్యాప్తంగా ఎందరో కళాకారులను ఇప్పటికీ ఆకర్షిస్తూనేవుంది; ఎన్నోసార్లు వివిధ రూపాల్లో తెరకెక్కుతూనేవుంది. అదే కారణంగా ఎన్నో క్రిస్‌మస్‌ కథా సంకలనాల్లోనూ చోటు చేసుకుంది. డెన్మార్క్‌కు చెందిన యాండెర్సెన్‌ కవి, నవలాకారుడు, నాటక రచయిత అయినప్పటికీ ఆయన పేరు ఫెయిర్‌ టేల్స్‌తోనే ముడిపడిపోయింది. మూడు వేలకుపైనే ఇలాంటివి రాశాడంటారు. పిల్లలకోసం ఉద్దేశించినా పెద్దలూ చదివారు. పాశ్చాత్య ప్రపంచపు ఉమ్మడి చైతన్యాన్ని రూపొందించిన కథలుగా వీటిని పరిగణిస్తారు. అందువల్లేనేమో ఎన్నో దేశాల్లో ఆయన విగ్రహాలు కనబడతాయి. 


వెలుగులనమ్మే చిన్నారి


––––––––

సంవత్సరం చివరి రోజున జరిగే కథ.

సంవత్సరంలో ఏరోజూ జరగకూడని కథ.

––––––––––


చలి మరీ తీవ్రంగా ఉంది; మంచు కురిసింది; చీకటి కూడా పడుతోంది. అది సాయంత్రం, ఆ సంవత్సరపు చివరి సాయంత్రం. ఇట్లాంటి చలిలో, చీకటిలో ఒక పేద బాలిక నడుస్తూవుంది;  తలకు కట్టయినా, కాళ్లకు చెప్పులయినా లేకుండా. ఇల్లు వదిలినప్పుడు ఆమె కాళ్లకు చెప్పులున్న మాట వాస్తవం; కానీ ఏం లాభం? అవి ఆమె కాళ్లకు చాలా పెద్దవైనాయి; అంతకుముందు వాళ్లమ్మ వేసుకున్నవాయె. పోనీ అవైనా ఉన్నాయనుకుంటే, ఆ వీధిలోంచి భయంకరమైన వేగంతో వెళ్లిన రెండు గుర్రపుబళ్లకు భయపడి పరుగెత్తడంలో అవెక్కడో జారిపోయినై.

ఒక చెప్పు ఎక్కడా కనబడనేలేదు; కనబడిన రెండోదాన్ని ఎవరో పేద తుంటరి పిల్లాడు ఎత్తుకొని పరుగెత్తాడు; వాడికి ఎప్పటికైనా పిల్లలు పుడితే కొనవలసిన ఊయలకు పెట్టుబడిగా పనికి వస్తుందనేమో. ఇంక ఈ చిన్నారి తల్లి తన చిన్న కాళ్లతోనే నడుచుకుంటూ పోయింది. చలికి ఆమె ఎర్రటి పాదాలు నీలంరంగులోకి మారుతున్నాయి. ఆమె వేసుకున్న పాత ఏప్రానులో కొన్ని అగ్గిపుల్లలున్నాయి; ఇంకో కట్టేమో ఆమె చేతిలో ఉంది. పొద్దుటినుంచీ అందులోంచి ఒక్కటైనా ఎవరూ కొనలేదు, ఒక్క ‘ఫార్తింగ్‌’ అయినా ఇవ్వలేదు.

పాపం ఆ చిన్నారి అట్లానే ఆ చలికి వణుకుతూ, ఆకలికి మాడుతూ, కాళ్లను ఈడ్చుకుంటూ పోయింది. ఎంత హృదయ విదారక దృశ్యం!

ఆమె మెడచుట్టూ అందంగా జాలువారిన ఆమె పొడవాటి జుట్టు మంచు ముద్దలతో నిండిపోయింది. కానీ ఆమె దానిగురించి ఒక్కసారైనా ఆలోచించలేదు. అన్ని కిటికీల్లోనూ కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, రుచికరమైన బాతు మాంసం వాసన వేస్తోంది. అది కొత్త సంవత్సరపు వేడుక. దీని గురించైతే ఆమె ఆలోచించకుండా ఉండలేకపోయింది.

రెండు ఇళ్ల మధ్య ఏర్పడిన మూలలో– అందులోంచి ఒక ఇల్లు కొంచెం ఎక్కువ పొడుచుకు వచ్చినట్టుగా ముందుకు వచ్చింది– ఆ చిన్నారి చేతులు ముడుచుకుని కూర్చుంది; తన కాళ్లను మరింత, మరింత దగ్గరకు లాక్కుంది; అయినా చలికి ఇంకా, ఇంకా వణుకుతూనేవుంది. అయినప్పటికీ ఇంటికి తిరిగివెళ్లడానికి ధైర్యం చాల్లేదు; ఒక్క అగ్గిపుల్లయినా అమ్మలేదాయె, చేతిలోకి ఒక్క ఫార్తింగ్‌ అయినా రాలేదాయె, ఇంటికి వెళ్తే నాన్న నుంచి దెబ్బలు తప్పవాయె. పోనీ ఇంటికి వెళ్లినా అక్కడా చలి తప్పదాయె; ఇంటికి పైకప్పు తప్ప ఏమీలేదాయె. పెద్ద పెద్ద పర్రెలను గడ్డితోనూ పాతబట్టలతోనూ కప్పినప్పటికీ గాలి ఇంకా ఈల వేస్తూనేవుంటుంది.

ఆమె చిన్న చేతులు చలికి దాదాపుగా మొద్దుబారిపోయినై. అయ్యో! కట్టలోని ఒక్క అగ్గిపుల్ల వెలిగించగలిగినా ఆమెకు కొంత ఉపశమనమైనా దొరుకునే! ఆ కట్టలోంచి తీయడానికి ధైర్యం చేసి, దాన్ని ఆ గోడకు గీకి, ఆ మంటకు తన వేళ్లను కాపుకోగలిగితే బాగుండు! ఆ, ఆమె ఒకటి బయటికి తీసింది. ‘సుర్‌ర్‌!’ ఎలా వెలిగింది, ఎలా మండింది! కొవ్వొత్తిలాగా వెచ్చటి, ప్రకాశవంతమైన మంట. దాని మీద ఆమె వేళ్లను ఉంచింది. ఎంత బాగుంది! మెరుగుపెట్టిన ఇత్తడి కాళ్లతో ఉండే ఒక పెద్ద ఇనుప పొయ్యి ముందు కూర్చున్నట్టుగా అనిపించింది. ఎంత అందమైన మంట! చిన్నారి తన పాదాలను కూడా ఆ వేడి తగిలేట్టుగా చాపింది; కానీ ఇంతలోనే ఆ బుల్లి మంట ఆరిపోయింది; పొయ్యి మాయమైంది. ఆమె చేతిలో కాలిపోయిన పుల్ల తప్ప ఇంకేమీ లేదు.

మరొక్కదాన్ని గోడకు వ్యతిరేకంగా గీకింది; ప్రకాశంగా అది మండింది; గోడ మీద ఎక్కడైతే వెలుతురు పడిందో ఉన్నట్టుండి అది పారదర్శకమైన తెరలా మారిపోయింది; లోపల గది అంతా ఆమెకు కనబడుతోంది. టేబుల్‌ మీద మంచులాంటి తెల్లటి బట్ట పరిచివుంది; దానిమీద అందమైన పింగాణీ పాత్రలు అమర్చివున్నాయి; యాపిల్‌ ముక్కలు, ఎండు రేగుపళ్లతో గొప్పగా గార్నిష్‌ చేసిన కాల్చిన బాతులోంచి ఉడుకు పొగలు వస్తున్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం, ఛాతీకి కత్తి, ఫోర్కులను గుచ్చివున్న ఆ బాతు ఆ పాత్రలోంచి గెంతి, నేరుగా ఆ చిన్నారి దగ్గరకే నడుచుకుంటూ వచ్చేలోగా ఆ అగ్గిపుల్ల ఆరిపోయింది; మందపు, చల్లటి, తడిసిన గోడ తప్ప అక్కడ ఇంకేమీ లేదు. ఆమె ఇంకోటి వెలిగించింది. ఇప్పుడు ఆమె ఒక బ్రహ్మాండమైన క్రిస్‌మస్‌ ట్రీ కింద కూర్చునివుంది; గాజు తలుపులోంచి ధనిక వ్యాపారి ఇంట్లో తను చూసినదానికన్నా పెద్దది; అంతకంటే దివ్యమైన అలంకరణ చేసినది!

దాని ఆకుపచ్చ కొమ్మల మీద వేలాది దివ్వెలు వెలుగుతున్నాయి, గొప్ప రంగుల బొమ్మలు మెరుస్తున్నాయి, దుకాణాల్లో చూసి ఎప్పటికీ కొనలేనని తను అనుకున్నలాంటివి. వాటిని అందుకోవడానికి చేతులు సాచేలోగా అగ్గిపుల్ల ఆరిపోయింది. క్రిస్‌మస్‌ ట్రీలోని దివ్వెలు పైకి, ఇంకా పైకి లేచాయి; అవిప్పుడు స్వర్గంలోని నక్షత్రాల్లా ఆమెకు కనబడుతున్నాయి; అందులోంచి ఒక తార రాలిపోయింది, ఒక పెద్ద మంటతో.

‘‘ఇప్పుడే ఎవరో చనిపోయారు!’’ అని చెప్పింది, వాళ్ల నానమ్మతో. ఆమెను ముద్దుచేసిన ఏకైక వ్యక్తి ఇప్పుడు లేని ఈ నానమ్మ. ఒక తార రాలిందంటే ఒక ఆత్మ దేవుడి దగ్గరకు చేరుకున్నట్టని చెప్పిందావిడ.

ఆ గోడకు మరో అగ్గిపుల్ల వెలిగింది; మళ్లీ దివ్యమైన వెలుగు; అందులో ముసలి నానమ్మ నిలుచునివుంది, ఒళ్లంతా కాంతులీనుతూ, ముఖం నిండా శాంతితో, ప్రేమతో.

‘‘నానమ్మా!’’ అని కేకేసింది పాప. ‘‘నీతో నన్ను తీసుకెళ్లు. అగ్గిపుల్ల ఆరిపోగానే నువ్వు వెళ్లిపోతావు, మాయమైపోతావు– వెచ్చటి పొయ్యిలా, రుచికరమైన బాతులా, బ్రహ్మాండమైన క్రిస్‌మస్‌ ట్రీలా నువ్వు కనబడకుండా పోతావు!’’ వెంటనే తన దగ్గరున్న మొత్తం అగ్గిపుల్లల్ని ఆ గోడకు గీకి వెలిగించింది, నాన్నమ్మను తన దగ్గరే ఉంచుకోవాలన్న కృత నిశ్చయంతో. ఆ అగ్గిపుల్లలు ఎంత గొప్పగా వెలిగినాయంటే పట్టపగలు కాంతి కూడా వాటిముందు వెలవెలబోతుంది. అంతకుముందెప్పుడు నాన్నమ్మ అంత పొడుగ్గా, అంత అందంగా కనబడలేదు. ఆమె ఆ చిన్నారి బాలికను తన చేతిలోకి తీసుకుంది; ఆ వెలుగులో, ఆ సంతోషంలో ఇరువురూ పైకి, ఎంతో ఎత్తుకి ఎగిరిపోయారు. ఇంక అక్కడ చలి లేదు, ఆకలి లేదు, వేదన లేదు– వాళ్లు దేవుడితో ఉన్నారు.

కానీ ఆ మూలకు, ఆ సాయంత్రపు చలి వేళలో, గోడకు ఆనుకుని కూర్చున్న ఆ గులాబీ చెక్కిళ్ల నవ్వు ముఖపు చిన్నారి పాప మంచుకు గడ్డ కట్టుకుపోయింది, ఆ ఏడాది చివరి రోజున. బొమ్మలా, కదలకుండా తన అగ్గిపుల్లలతో కూర్చుంది ఆ చిన్నారి; ఆ అగ్గిపుల్లల్లో ఒక కట్ట కాలిపోయివుంది. ‘‘తనను తాను వెచ్చగా కాపుకోవాలనుకుంది పాపం,’’ అన్నారు జనం. కానీ ఏ ఒక్కరికైనా ఇంత కూడా అనిపించలేదు, కలలో కూడా వాళ్లు తలిచివుండరు; ఎంత అందమైన వాటిని తను చూసివుంటుంది! ఎంత తేజస్సుతో ఆమె తన నానమ్మతో కలిసి కొత్త సంవత్సరపు సంరంభంలోకి అడుగిడివుంటుంది!


(30 డిసెంబర్‌ 2019)


Saturday, June 27, 2026

లేదు క్షమాపణ


ఓర్కెనీ ఇస్త్వాన్‌

ఓర్కెనీ ఇస్త్వాన్‌ కథ ‘నో పాడన్‌’ కథకు ఇది అనువాదం. పొడి స్వరంలో చెప్పబడిన, మన హాస్పిటళ్లలో జరిగినట్టు అనిపించే హంగరీ కథ. ఓర్కెనీ(1912–1979) ఇరవయ్యో శతాబ్దపు ప్రసిద్ధ హంగరీ కథా, నాటక రచయిత. ఒక చిన్న సందర్భంలోంచే గొప్ప సత్యాలను వెలికితీసే రచయితగా పేరొందారు. ‘వన్‌ మినట్‌ స్టోరీస్‌’ పేరుతో తన కథలు ప్రచురించారు. తొలినాళ్లలో వీర కమ్యూనిస్టుగా ఉండి, అటుపై తప్పుదోవ పట్టానని బహిరంగంగా ఒప్పుకున్నారు. ద తోథ్‌ ఫ్యామిలీ, ద క్యాట్స్‌ ప్లే ఆయన పేరొందిన నాటకాలు.


లేదు క్షమాపణ


ఆయన్ని స్ట్రెచర్‌ మీద కిందికి మెట్లగుండా ఆంబులెన్స్‌ కారు దాకా మోసుకెళ్లిన ఇద్దరు మగ నర్సులకు ఇరవై ఫోరింట్స్‌ ఇచ్చాను. క్లినిక్‌ దగ్గర కూడా వార్డుల్లో పగలు, రాత్రి షిఫ్టుల్లో ఉన్న నర్సులిద్దరికీ చెరో ఇరవై ఫోరింట్స్‌ ఇచ్చి, ఆయన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పాను. పేషెంట్‌ను అరగంటకోసారి వచ్చి చూసుకుంటామని వాళ్లు నాకు భరోసా ఇచ్చారు, అదృష్టవశాత్తూ ఆయన ఇంకా స్పృహలోనే ఉన్నప్పటికీ. తరువాయి రోజు ఆదివారం, నేను ఆయన్ని వెళ్లి చూసే వీలుండే రోజు. ఆయన స్పృహలోనే ఉన్నారు, కానీ తక్కువ మాట్లాడారు. ఆయన పక్క మంచం మీద ఉన్న ఇంకో పేషెంటు వల్ల తెలిసిందేమంటే– ఆ ఇద్దరు నర్సులు ఒక్కసారైనా వచ్చి చూసిన పాపాన పోలేదు; అదేమంత ఆశ్చర్యం కలిగించలేదు, వాళ్లు కనీసం నూటాడెబ్బై మందిని చూసుకోవాలి; కనీసం డాక్టర్లన్నా వచ్చి ఆయన్ని పరీక్షేమీ చేయలేదు, అన్నిరకాలుగా సోమవారం చెకప్‌ చేస్తామని చెప్పి. శనివారం పొద్దున తెచ్చినవాళ్ల పరిస్థితి ఎప్పుడూ ఇంతేనని చెప్పాడు ఆ పక్క బెడ్డాయన.

నర్సు కోసం నేను నడవలోకి వెళ్లాను, అంతుకుముందు రోజు వాళ్లెవరూ కనబడలేదు. చాలాసేపు గాలించాక ఆదివారం డ్యూటీలో ఉన్న నర్సును కనిపెట్టగలిగాను; ఆమెకు కూడా ఇరవై ఫోరింట్స్‌ ఇచ్చి కొంచెం మా నాన్నను కనిపెట్టుకుని ఉండమన్నాను. నాకు డాక్టర్‌తో కూడా మాట్లాడాలనుంది, దానికోసం ఇంటి దగ్గర ఎన్వెలప్‌లో ఓ వంద ఫోరింట్‌ నోటు పెట్టుకునొచ్చాను, కానీ డాక్టర్‌ మహిళల వార్డుకు వెళ్లాల్సివచ్చిందనీ, అక్కడ ఒకరికి రక్తం ఎక్కిస్తున్నారనీ, మీకేం టెన్షన్‌ లేదు, నేను ఆయనతో మాట్లాడుతాననీ చెప్పిందామె. నేను మళ్లీ పేషెంట్ల రూమ్‌కు వెళ్లాను, అక్కడ మా నాన్న పక్కబెడ్డాయన పేషెంట్లను చూడ్డానికి డాక్టరుకు ఎటూ టైముండదని కచ్చితంగా చెప్పడంతో ఆయనకు ఇక డబ్బులు ఇచ్చే వీలు లేనట్టయింది. రేపు వార్డు డాక్టర్లు వచ్చినప్పుడే మా నాన్నను చూడటానికి టైముంటుంది.

‘‘నీకేమైనా కావాలా?’’ మా నాన్నను అడిగాను.

‘‘ఏంవొద్దు, థాంక్స్‌.’’

‘‘కొన్ని ఆపిల్స్‌ తెచ్చాను.’’

‘‘థాంక్యూ, నాకేం ఆకలిగా లేదు.’’

మంచం పక్కనే ఇంకో గంటసేపు కూర్చున్నాను. నాకు ఇంకా ఏమైనా మాట్లాడాలని వుందిగానీ మాట్లాడుకునే అంశాలేమీ దొరకలేదు. కొద్దిసేపయ్యాక, ఏమైనా నొప్పిగా ఉందా అని అడిగాను, లేదని చెప్పాడు, ఇంక దాని గురించి మరిన్ని ప్రశ్నలు వేసే వీలులేకపోయింది. నిశ్శబ్దంగా ఉండిపోయాం. మేమిద్దరమూ ఎప్పుడూ పెద్ద కలుపుగోలుగా మాట్లాడుకున్నది లేదు, మాట్లాడుకున్నవి ఏమైనా ఉన్నాయీ అంటే అవి జరుగుతున్న సంగతుల గురించే, నిన్న ఉనికిలోకి వచ్చి ఇవ్వాళ ప్రాధాన్యత కోల్పోయి శూన్యంలోకి క్షయించిపోయేవి. ఉద్వేగాల గురించి మేము ఎప్పుడూ సంభాషించుకోలేదు.

‘‘అయితే మరి నేను బయల్దేరుతా,’’ కాసేపయ్యాక అన్నాను.

‘‘సరే.’’

‘‘రేపొచ్చి డాక్టరును కలుస్తాను.’’

‘‘అలాగే.’’

‘‘వార్డు డాక్టరు రేప్పొద్దటికంటే ముందేమీ రాడు.’’

‘‘అంత అర్జెంటేం లేదు,’’ అన్నాడాయన, తన చూపుతో నన్ను తలుపుదాకా అనుసరిస్తూ.

తెల్లారి ఉదయం ఏడింటికి వాళ్లు ఫోన్‌ చేశారు, రాత్రి ఆయన చనిపోయారని. నేను మళ్లీ 217 నంబరు గదికి వెళ్లేసరికి ఆ బెడ్డులో అప్పటికే ఇంకో పేషెంటును ఉంచారు. మా నాన్న పోయేముందు పెద్ద ఇబ్బందేమీ పడలేదనీ, కొంచెం ఎగశ్వాస మాత్రం తీసుకున్నాడనీ పక్కబెడ్డాయన నిశ్చయంగా చెప్పాడు. కానీ ఎందుకో ఈ మనిషి నిజం చెప్పట్లేదని నాకు అనుమానం కలిగింది, కానీ ఆయన స్థానంలో నేనున్నా అవే మాటల్ని అదేలాగా చెప్పేవాడిని అనిపించింది. ఇంక నేను ఈయన నన్నేమీ మోసం చేయట్లేదనీ, మా నాన్న నిజంగానే ఏ నొప్పీ లేకుండా ప్రశాంతంగా చనిపోయాడనీ నన్ను నేను నమ్మించుకున్నాను.

ఎన్నో లాంఛనాలు పరిష్కారం చేసుకోవాల్సి ఉంది. హాస్పిటల్‌ రిసెప్షన్‌లో నన్నో నర్సు కలిసి (శనివారం డ్యూటీలోగానీ, ఆదివారం డ్యూటీలోగానీ లేని నేను అంతకుముందు చూడని కొత్తావిడ) ఆయన బంగారు వాచీ, ఆయన కళ్లద్దాలు, ఆయన పర్సు, ఆయన సిగరెట్‌ లైటరు, ఆపిల్‌ పళ్ల కాగితపు సంచీ ఇచ్చింది. ఆమెకు ఇరవై ఫోరింట్స్‌ ఇచ్చాను, తరువాయి చేయవలసిన కార్యక్రమం గురించి ఆమె వివరించింది. దాని తర్వాత తోలు టోపీ పెట్టుకున్న ఒకతను వచ్చి బాడీని శుభ్రం చేసి, షేవ్‌ చేసి, బట్టలు వేస్తానన్నాడు. అయితే బాడీ అన్నప్పుడు తన ఉద్దేశం ఏమనిపించిందంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ల గురించీ అని; ఆయన ఇంకా బతికి లేకపోయినప్పటికీ, శుభ్రం చేయలేదూ బట్టలు వేయలేదూ కాబట్టి, అది శవం కూడా పూర్తిగా అప్పటికి అవ్వలేదని.

వంద ఫోరింట్‌ నోట్‌ పెట్టి అతికించిన ఎన్వెలప్‌ ఇంకా నా దగ్గర అలాగే ఉంది, దాన్ని అతనికిచ్చేశాను. దాన్ని అతడు చించి, లోపలికి చూసి, కొట్టినట్టుగా నెత్తిమీదున్న టోపీ తీశాడు, మళ్లీ నా సమక్షంలో ఆ టోపీని పెట్టుకోలేదు. అన్నింటినీ సరిగ్గా చూసుకుంటాననీ, నేను ఒక శుభ్రమైన బట్ట మాత్రం పంపగలిగితే చాలనీ అన్నాడు, నేను కచ్చితంగా తృప్తిపడతానని నమ్మకంగా ఉన్నాడు. నేను మధ్యాహ్నం ఆ బట్ట తెస్తాననీ, దానితోపాటు ఒక ముదురు రంగు సూట్‌ కూడా తెస్తాననీ, కానీ ఇప్పుడు ఆయన్నోసారి చూడాలనుందనీ చెప్పాను.

‘‘ఏంటీ, మీకు బాడీని చూడాలనుందా?’’ నమ్మలేనట్టుగా అడిగాడు.

‘‘అవును,’’ అని చెప్పాను.

‘‘కాని తరువాత చూస్తే మంచిదేమో,’’ అని సూచించాడు.

‘‘నాకు ఇప్పుడే చూడాలనుంది, ఆయన పోయినప్పుడు నేను పక్కన లేకపోయాను,’’ అన్నాను.

అయిష్టంగానే నన్ను మార్చురీకి తీసుకెళ్లాడు, క్లినిక్‌ గార్డెన్‌ మధ్యలో ఉన్న విడి భవనం అది. సెల్లార్‌లో దట్టమైన బల్బు వెలుగుతూ ఉంది. కొన్ని కాంక్రీట్‌ మెట్లు దిగాం, ఆ మెట్లు దిగీ దిగంగానే ఆ కాంక్రీట్‌ ఫ్లోర్‌ మీద వెల్లకిలా పడుకుని ఉన్న మా నాన్న కనిపించాడు. ఆయన మెకాళ్లు పైకెత్తి, కాళ్లు వెడల్పుగా చేసుకుని ఉన్నాడు– సైనికులు యుద్ధంలో చనిపోయినట్టు, పెయింటింగ్స్‌లో వాళ్లను చిత్రించినట్టు. కాకపోతే ఆయనకు బట్టలేవీ లేవు; ఏదో చిన్న దూది ఉండ ఒకటి ఒక ముక్కురంధ్రంలోంచి బయటికి వేలాడుతూ ఉంది. ఇంకొంచెం దూది ఆయన ఎడమ తొడకు అతికించివుంది, కచ్చితంగా చివరి పోటు పొడిచిన స్థానం అయివుండాలి.

‘‘మీరప్పుడే ఏమీ చూళ్లేరు,’’ తోలు టోపీ అతను క్షమించమన్నట్టుగా అన్నాడు. అంత చలిగా ఉన్న సెల్లార్‌లో కూడా అతను ఏమీ వేసుకోకుండా నిలుచున్నాడు. ‘‘కానీ ఆయనకు డ్రెస్‌ చేశాక ఎలా కనబడుతాడో మీరే చూద్దురు.’’

నేను ఏమీ మాట్లాడలేదు.

‘‘ఆయనకు చాలా రోజులుగా ఆరోగ్యం బాగాలేదా?’’ కాసేపయ్యాక అడిగాడు అతను.

‘‘అవును, చాలా రోజులుగా,’’ అని బదులిచ్చాను.

‘‘నాకు ఏం చేయాలో తెలుసు,’’ అన్నాడతను, ‘‘కొద్దిగా జుట్టు క్షవరం చేస్తాను. అది చాలా తేడా చూపెడుతుంది.’’

‘‘నీకు ఎలా అనిపిస్తే అలా,’’ అన్నాను.

‘‘అతడు జుట్టును పక్కకు దువ్వుకునేవాడా?’’

‘‘అవును, అదే.’’

అతడు మాట్లాడటం ఆపేశాడు. నేనూ ఏమీ చెప్పలేదు. మా నాన్న గురించి నేను చెప్పవలసిందిగానీ, చేయవలసిందిగానీ ఇంకేమీ లేకపోయింది. అలాగే నేను డబ్బులు ఇవ్వాల్సినవాళ్లు కూడా ఇంకెవరూ లేరు. ఇక నన్ను నేను దిద్దుకోవడానికి ఏ దారీ లేదు, ఆయనతో పాటు నన్ను కూడా పూడ్చిపెట్టినా.


(సాక్షి సాహిత్యం; 17 ఫిబ్రవరి 2020)



 

Friday, June 12, 2026

ఒక వృద్ధుడు మరియు ఒక భారీ వాహనం


ఓర్కెనీ ఇస్త్వాన్‌

ఓర్కెనీ ఇస్త్వాన్‌ కథ ‘ది ఓల్డ్‌మాన్‌ అండ్‌ ద గ్రేట్‌ బిగ్‌ ఆటోమొబైల్‌’కు అనువాదం ఇది.. ఓర్కెనీ(1912–1979) ఇరవయ్యో శతాబ్దపు ప్రసిద్ధ హంగరీ రచయితల్లో ఒకరు. కథలు, నాటకాలు రాశారు. ఒక చిన్న సందర్భంలోంచే గొప్ప సత్యాలను వెలికితీసే రచయితగా పేరొందారు. ‘వన్‌ మినట్‌ స్టోరీస్‌’ పేరుతో ఆయన తన కథలు ప్రచురించారు. ఇవి చదవటానికి ఒక్క నిమిషమో, రెండు నిమిషాలో పట్టొచ్చుగానీ ఇవి నిమిషాల్లో మరిచిపోయే కథలు మాత్రం కావు. ద తోథ్‌ ఫ్యామిలీ, ద క్యాట్స్‌ ప్లే ఆయన పేరొందిన నాటకాలు.

ప్రపంచం తలకిందులైపోవడం అంటారే, అలాంటి అనుభవాల్ని కనీసం రెండు సార్లు భరించాడు ఓర్కెనీ. హంగరీ రాజధాని బుడపెస్ట్‌లో ఓ యూదు కుటుంబంలో జన్మించిన ఓర్కెనీ, యుద్ధంలో సైనికుడిగా రష్యాలో పట్టుబడి, నిర్బంధ కార్మిక శిబిరంలో కొంతకాలం పాటు బంధించబడినారు. అలాగే, 1956 హంగరీ ‘విప్లవం’ తర్వాత ప్రచురించకుండా ప్రభుత్వం ఆయన మీద నిషేధం విధించింది. 1960ల్లో తిరిగి ఓర్కెనీ రాయడం ఆరంభించారు. కనీసం రెండు పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. తొలినాళ్లలో వీర కమ్యూనిస్టుగా ఉండి, అటుపై తప్పుదోవ పట్టానని బహిరంగంగా ఒప్పుకున్నారు. జర్మన్‌ రచయిత ఫ్రాంజ్‌ కాఫ్కా, మరో ప్రసిద్ధ హంగరీ రచయిత డెజో కొస్తొలాన్యీ అంటే అభిమానం. 2004లో ఒక థియేటర్‌కు అధికారికంగా ఆయన పేరు మీదుగా ఓర్కెనీ థియేటర్‌ అని నామకరణం చేసింది అక్కడి ప్రభుత్వం.


ఒక్క నిమిషంలో చదివే కథ

ఒక వృద్ధుడు మరియు ఒక భారీ వాహనం


ఇప్పుడు చెప్పబోయే కథ నిజం కాకపోవచ్చు, కానీ నిజం కాని కథల పట్ల కూడా మనం గొప్ప ఆసక్తిని కలిగుండాలి, ఎందుకంటే ఆ కథలు చెప్పే విధానం వల్ల ఒక గొప్ప వెలుగు మనలోకి ప్రసరించవచ్చు. ఎవరైనా ఇదే కథను ఒక ఐదేళ్ల కింద గనక చెప్పివుంటే దాన్ని ఈ విధంగా చెప్పేవాళ్లు:

కాళ్లకు కనీసం చెప్పులైనా లేని, చింపిరిగుడ్డలు వేసుకున్న ఒక ముసలాయన బాలటాన్‌(హంగరీలోని ప్రసిద్ధ సరస్సు) నుంచి రోడ్డు మీద నడుస్తున్నాడు. కాసేపైన తర్వాత ఉన్నట్టుండి అతడు తన చేయిని ఆపమన్నట్టుగా ఊపడం మొదలుపెట్టాడు. అదే తోవలో దూరంగా ఒక భారీ వాహనమేదో వస్తూ కనబడింది. దగ్గరికి వస్తూనే ఆ భారీ వాహనం ఆగుతుంది, డ్రైవరు డోర్‌ తీస్తాడు.

‘‘కామ్రేడ్‌(మిత్రుడు/సహచరుడు), ఎందుకు బండిని ఆపావు?’’ అడిగాడు అతను.

‘‘ఎందాకా మీ ప్రయాణం?’’ ముసలాయన వాకబు చేశాడు.

‘‘మేము దగ్గర దగ్గర బుడపెస్ట్‌ దాకా వెళ్లాలి, కామ్రేడ్‌.’’

‘‘దయచేసి నన్ను అందులో కొంచెం ఎక్కించుకుంటారా?’’ అడిగాడు ముసలాయన.

‘‘కానీ లోపల జాగా లేదు, కామ్రేడ్,’’ డ్రైవర్‌ జవాబిచ్చి, డోర్‌ మూసి, గేరు మార్చాడు.

ఈపాటికల్లా కొంత ఎండ వచ్చింది, ఆ ఎండలో నీలిరంగు సరస్సు తళుకులీనుతోంది. పొద్దుపోవడానికి మనకు మనం ఎన్నో గొప్ప కథలు చెప్పుకుంటున్నాం. ఈ కథ కూడా మళ్లీ మన మధ్యకు వచ్చింది, కాకపోతే కొత్త రూపంలో:

కాళ్లకు కనీసం చెప్పులైనా లేని, చింపిరిగుడ్డలు వేసుకున్న ఒక ముసలాయన బాలటాన్‌ నుంచి రోడ్డు మీద నడుస్తుండగా, అదే తోవలో ఒక భారీ వాహనమేదో వస్తూ కనబడింది. వృద్ధుడిని సమీపించగానే ఆ భారీ వాహనం ఆగుతుంది, డ్రైవర్‌ డోర్‌ తెరుస్తాడు.

‘‘ఓ పెద్దాయనా, బుడపెస్ట్‌ దిక్కేనా నువ్వు పోవడం?’’ అడిగాడు అతను.

‘‘ఔను,’’ జవాబిచ్చాడు వృద్ధుడు.

‘‘దా, ఎక్కు, నిన్ను అక్కడ దిగబెడతాం,’’ స్నేహపూర్వకమైన నవ్వుతో అన్నాడు డ్రైవర్‌.

ముసలాయన లోపలికి ఎక్కి, కిటికీకి తల ఆనించి, నిదానంగా అడుగుతాడు:

‘‘లోపల రేడియో ఏమీ లేదా?’’

రెండు కథలూ బానేవున్నాయి, కానీ రెండూ నిజం కాదు. నిజం ఎంతవరకూ అంటే, ఆ కాళ్లకు కనీసం చెప్పులైనా లేని, చింపిరిగుడ్డలు వేసుకున్న ముసలయాన రోడ్డు మీద నడుస్తుండగా అదే తోవన ఒక భారీ వాహనం ఏదో వస్తూ కనిపించడం. కానీ దానివైపు చెయ్యెత్తి ఆపాలని ఎప్పటికీ ఆ ముసలాయనకు తోచదు, ఆ పెద్దాయన్ని చూడగానే ఆపాలని ఆ డ్రైవరుకు ఏనాటికీ  అనిపించదు.

ఇదీ నిజమైన కథ. కానీ మనలో మన మాట, ఈ కథ ఆ రెండింటికంటే పెద్ద గొప్పగా ఏం లేదు.


(సాక్షి సాహిత్యం; 9 డిసెంబర్‌ 2019)


 

Saturday, June 6, 2026

ద స్కూల్‌

 


డోనాల్డ్‌ బార్తెల్మె

సుప్రసిద్ధ అమెరికన్‌ కథకుడు, నవలాకారుడు డోనాల్డ్‌ బార్తెల్మె (1931–1989) రాసిన ‘ద స్కూల్‌’ కథకు ఇది సంక్షిప్త స్వేచ్ఛానువాదం:. 1974లో న్యూయార్కర్‌లో ప్రచురించబడింది. నిరాశామయ, విధ్వంసకర ప్రపంచంలో ఇంకా ప్రేమ అనే ఆశ ఉందని ప్రతీకాత్మకంగా చెప్పిన కథ. ముగింపు అసభ్యకరంగా ఉందని విమర్శించినవాళ్లున్నారు. అయినప్పటికీ క్లాసిక్‌గా గుర్తింపు వచ్చింది. 


ప్రేమే సృష్టి


సరే, పిల్లలంతా ఆరుబయట చెట్లు నాటారు, మేము అనుకునేదేమంటే, ఇదంతా కూడాను చదువులో భాగమే, వాటి వేర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం, అలాగే ఒకదాని గురించి బాధ్యతగా ఉండటం, ఒకదాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. చెట్లు అన్నీ చచ్చిపోయాయి. అవి ఆరెంజ్‌ చెట్లు. అవి ఎందుకు చనిపోయాయో నాకు తెలీదు, కానీ చనిపోయినై. భూమి మట్టితోనే ఏదైనా సమస్య ఉందో, నర్సరీలోంచి వచ్చినవే మంచివి కాదో. దాని గురించి ఫిర్యాదైతే చేశాం. మొత్తం ముప్పై మంది పిల్లలున్నారు, ప్రతి చిన్నారి ఒక్కో మొక్క నాటాలి, చూస్తే ముప్పై చెట్లూ చనిపోయినై. ఆ ఎండిపోయిన కట్టెలను పిల్లలు చూస్తూవుంటే, డిప్రెసింగ్‌గా ఉండింది.

మరీ అంత బాధేం ఉండేది కాదుగానీ, ఈ చెట్ల వ్యవహారం జరగడానికి కొన్ని వారాల ముందు పాములన్నీ చచ్చిపోయినై. కనీసం అవి చనిపోవడానికి ఓ కారణం అయితే కనబడింది, బాయిలర్‌ నాలుగు రోజులు ఆగిపోయింది సమ్మె వల్ల. కనీసం ఇదీ అని పిల్లలకు వివరించి చెప్పొచ్చు. అందుకే పరిస్థితులు మామూలైన తర్వాత పాములను చూసినప్పుడు పిల్లలు మరీ కలత చెందలేదు.

ఔషధ మొక్కల గార్డెన్‌ విషయంలో అయితే అది నీళ్లు మరీ ఎక్కువ పెట్టడం అయివుండాలి, కనీసం పిల్లలకు ఇప్పుడు తెలుసు నీళ్లు ఎక్కువ పోయకూడదని. పిల్లలు ఆ గార్డెన్‌ మీద మరీ ఎక్కువ పట్టింపుతో ఉండి, అందులో ఎవరైనా మేము చూడనప్పుడు కొన్ని నీళ్లు ఎక్కువ పోసివుంటారు. అనుకోగూడదుగానీ ఎవరైనా కావాలని చేసిందా అన్న ఆలోచన కూడా మాకు రాకపోలేదు. అలా ఎందుకు అనుకున్నామంటే, దీనికంటే ముందు ఎడారి ఎలుకలు చనిపోయినై, తెల్ల చిట్టెలుకలు చనిపోయినై, నలికండ్లపాములు చనిపోయినై... సరే, ఇప్పుడు వాళ్లకు తెలుసు వాటిని ప్లాస్టిక్‌ బ్యాగుల్లో తీసుకుపోవద్దని.

ఉష్ణమండల చేపలు చనిపోతాయని మాత్రం ఊహించాం, అదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. పెద్ద సంఖ్యలో, ఉపరితలానికి వచ్చి, మెలి తిరిగి వెల్లకిలా పడిపోయినాయి. ఆ సమయంలోనే మా పాఠ్య ప్రణాళికలో ఉష్ణమండల చేపలు చూపాలని ఉండింది, కానీ మేము ఏమీ చేయలేకపోయాం.

మేము కనీసం ఓ కుక్కపిల్లను ఉంచుకునే వీలు లేకపోయింది.

అది చిన్న కుక్కపిల్ల, దాన్ని మర్డోక్‌ చిన్నారి గ్రిస్టెడె ట్రక్కు కింద చూసింది, ఆ డ్రైవరు అప్పుడే డెలివరీ పూర్తిచేసుకున్నాడు, ఆ ట్రక్కు దాని మీద ఎక్కడ ఎక్కేస్తుందేమో అని తెగ భయపడిందట, వెంటనే దాన్ని తన బ్యాగులో పెట్టుకుని స్కూలుకు తెచ్చేసింది. కానీ దాన్ని చూసిన మరుక్షణం, దేవుడా, అది రెండు వారాలకు మించి బతకదేమో అని అనిపించింది... చివరకు అదే జరిగింది. నిజానికి అది తరగతి గదిలో ఉండకూడదు కూడా, అట్లా అని పాఠశాల నిబంధనలు ఏవో ఉండినాయి, కానీ పిల్లలతో మీరు కుక్కపిల్లను క్లాసులోకి తేవొద్దని చెప్పలేరు, అది అప్పటికే వచ్చి మీ కళ్లముందు కనబడుతూ, ఈ మూల నుంచి ఆ మూలకు గెంతుతూ కుయ్యికుయ్యిమంటూ ఉన్నప్పుడు. దానికి వాళ్లు ఎడ్గర్‌ అని పేరు పెట్టారు, నా పేరు మీదుగానే! ఇంక చూడండి, దానితో వాళ్లు చేసే తమాషా, ‘బాగుంది ఎడ్గర్‌!’, ‘ఇటు చూడు ఎడ్గర్‌!’ అంటూ ఒకటే అరవడం, ఒకటే నవ్వడం. నేను కూడా సంతోషపడ్డాను, నన్ను ఆటపట్టిస్తుంటే నాకు బానేవుంటుంది. వాళ్లు సామానుల గదిలో దానికో చిన్న ఇల్లు అదీ  కూడా కట్టారు. అదెందుకు చనిపోయిందో అంతుపట్టలేదు, కుక్కలకు తగిలే ఏదైనా అంటువ్యాధి అయివుండాలి. బహుశా దానికి టీకాలు వేయించివుండరు. పిల్లలు స్కూలుకు వచ్చేలోపలే దాన్ని తీయించేశాను. ప్రతిరోజు పొద్దుటే నేను ఆ సామాన్ల గదిని చూస్తూ వచ్చాను, ఓ దినచర్యలాగా, ఏం జరిగే ప్రమాదముందో ఒక అంచనావుంది కాబట్టి. దాన్ని కస్టోడియన్‌కు అప్పగించాను.

ఆ తర్వాత ఈ కొరియన్‌ అనాథ , హెల్ప్‌ ద చిల్డ్రెన్‌ కార్యక్రమంలో భాగంగా క్లాస్‌ తరఫున దత్తత తీసుకున్నాం, ప్రతి చిన్నారీ నెలకో పావలా డాలర్‌ చొప్పన ఇవ్వాలనేది ఆలోచన. ఆ పిల్లాడి పేరు కిమ్, మేము దత్తత తీసుకోవడమే ఆలస్యమైందో ఏమోగానీ దురదృష్టకరమైన సంగతి. అతడి మరణానికి కారణం ఏమిటో మాకు వచ్చిన ఉత్తరంలో పేర్కొనలేదు, కానీ మేము ఇంకో దత్తతకు వెళ్లమని సలహా అయితే ఇచ్చారు, కొన్ని ఆసక్తికరమైన కేసు హిస్టరీలు కూడా పంపారు, కానీ మాకు అప్పటికే గుండెలు జారివున్నాయి. అందరూ మరీ డీలా పడిపోయారు, నాతో ఎవరూ నేరుగా ప్రస్తావించలేదుగానీ, అసలు స్కూలులోనే ఏదో దోషం ఉందని అనుకోసాగారు. నాకేమీ ప్రత్యేకంగా స్కూలులో ఏదో దోషం ఉన్నట్టు కనిపించలేదు, నేను మంచి చూసినవాణ్ని, చెడు చూసినవాణ్ని. ఏదో అదృష్టం బాగాలేదంతే. చాలామంది పిల్లల తల్లిదండ్రులు కూడా చనిపోయారు, ఆ మాటకొస్తే. రెండు గుండెపోట్లు, రెండు ఆత్మహత్యలు, ఒకరు నీటమునిగి, ఇంకో నలుగురు కారు ప్రమాదంలో. ఒకరికి స్ట్రోక్‌ వచ్చింది. ప్రతి ఏడాదీ తాతలు, బామ్మల మరణాలు మామూలుగానే ఎక్కువే సంభవిస్తుంటాయి, ఈ సంవత్సరం మరీ ఎక్కువున్నట్టున్నాయి. చివరకేమో ఈ దారుణం.

దారుణం ఎలా జరిగిందంటే– ఈ మాథ్యూ వెయిన్, టోనీ మావ్‌రోగార్డో ఇద్దరూ ప్రభుత్వ కార్యాలయ భవనం కోసం తవ్వుతున్న పునాదుల దగ్గర అడుకుంటున్నారు. అక్కడే పెద్ద పెద్ద దూలాలు కుప్పవేసి వున్నాయి. వాటిని సరిగ్గా పెట్టలేదని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు, దానిమీద కోర్టు కేసు అయితే రానుంది. ఏది సత్యమో ఏది కాదో నాకైతే తెలీదు, కానీ ఈ సంవత్సరం మాత్రం బాలేదు.

ఇంకోటి మరిచిపోయాను, బిల్లీ బ్రాంట్‌ వాళ్ల నాన్నను ఎవడో ముసుగు తొడుక్కున్న అగంతకుడు కత్తితో దారుణంగా పొడిచాడు, ఇంట్లో జొరబడినప్పుడు వాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు.

ఒకరోజు క్లాసులో చర్చ జరిగింది. ఇవన్నీ ఎటు పోయాయని వాళ్లు ప్రశ్నించారు, ఆ చెట్లు, ఆ నలికండ్లపాములు, ఆ ఉష్ణమండల చేపలు, ఎడ్గర్, నాన్నలు, అమ్మలు? మాథ్యూ, టోనీ, వీళ్లు ఎటు పోయారు? నాకు తెలీదు, తెలీదు అని జవాబిచ్చాను. మరి ఎవరికి తెలుసని అడిగారు. ఎవరికీ తెలియదని జవాబిచ్చాను. అప్పుడు వాళ్లు, అంటే ఈ జీవితానికి అర్థాన్ని ఇచ్చేది ఈ మరణమా అని అడిగారు. లేదు, లేదు, జీవితానికి అర్థం కల్పించేది జీవితం మాత్రమే అని చెప్పాను. తర్వాత వాళ్లు ఏమన్నారంటే, కానీ ఈ చావు అనేది లౌకిక ప్రపంచంలో రోజువారీ భరించి తీరవలసిన రొష్టును అధిగమించే దిశలో మనని కొనిపోయే మూలసూత్రంగా పరిగణిస్తారు కదా––

అవును, కావొచ్చు, అన్నాను.

మాకు నచ్చలేదు, అన్నారు వాళ్లు.

ఊమ్‌ బాగుంది, అన్నాను.

ఎంత సిగ్గుమాలిన విషయం, అన్నారు.

ఒప్పుకున్నాను.

అయితే మీరు ఇప్పుడు హెలెన్‌(మా టీచింగ్‌ అసిస్టెంట్‌)ను మా ముందు ప్రేమించండి, ఎలా చేయాలో మేము చూస్తాం. మాకు తెలుసు మీకు హెలెన్‌ అంటే ఇష్టమని అన్నారు వాళ్లు.

నాకు హెలెన్‌ అంటే ఇష్టమే, కానీ అలా చేయలేనని చెప్పాను.

మేము దాని గురించి చాలా విన్నాం, కానీ మేము ఎప్పుడూ చూడలేదు అన్నారు వాళ్లు.

నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు, పైగా అది ఎవరూ, ఎక్కడా ఇంతకుముందు ప్రదర్శించి చూపలేదని చెప్పాను. హెలెన్‌ కిటికీలోంచి చూసింది.

ప్లీజ్‌ ప్లీజ్, మీరు హెలెన్‌ను ప్రేమించండి, మాకో విలువ ఉందని నమ్మకం కలిగించండి, మాకు భయమేస్తోంది, అన్నారు వాళ్లు.

ఆ విలువ అంతటా ఉందనీ, (నాకూ భయమేస్తున్నప్పటికీ) మీరు భయపడనవసరం లేదనీ చెప్పాను. హెలెన్‌ వచ్చి నన్ను కౌగిలించుకుంది. ఆమె కనుబొమ్మలను నేను కొన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాను. పిల్లలు కేరింతలు కొట్టారు. ఇంతలో తలుపు దగ్గర ఏదో చప్పుడైంది, వెళ్లి తీశాను, కొత్త ఎడారి ఎలుక లోనికి వచ్చింది. పిల్లలు ఆనందంతో అరిచారు.

(సాక్షి సాహిత్యం; 28 జనవరి 2019)

Wednesday, June 3, 2026

ద లాటరీ

 


 షిర్లీ జాక్సన్‌

అమెరికన్‌ రచయిత్రి షిర్లీ జాక్సన్‌(1916–1965) కథ ‘ద లాటరీ’కి సంక్షిప్త రూపం ఇది. 1948లో ‘న్యూయార్కర్‌’లో దీన్ని ప్రచురించినప్పుడు వేలాదిమంది పాఠకులు తిట్టిపోస్తూ ఉత్తరాలు రాశారు. ఆ పత్రిక చరిత్రలోనే ఇంత స్పందన మరే కథకూ రాలేదు. అయితే, మూక మనస్తత్వాన్నీ, హేతువిరుద్ధంగా ఆచారాలను పాటించే తీరునూ శక్తిమంతమైన సంకేతాలతో చిత్రించిన కథగా విమర్శకులు దీన్ని తర్వాత ప్రశంసించారు. 


మందడుగు


జూన్‌ 27. వాతావరణం తేటగా, పొడిగా ఉంది. పదింటి ప్రాంతంలో గ్రామస్థులు పోస్టాఫీసుకూ బ్యాంకుకూ మధ్యనున్న స్థలంలో గుమిగూడసాగారు. వేరే పట్టణాల్లో అయితే ఈ లాటరీ తీయడానికి కనీసం రెండు రోజులు పడుతుంది. అందుకే వ్యవహారం జూన్‌ 20 కల్లా మొదలైపోతుంది. ఈ గ్రామంలో మహా అయితే ఉన్నది మూడువందల మంది. రెండు గంటల్లోపే లాటరీ తీయడం అయిపోతుంది. పదింటికి మొదలుపెట్టినా మధ్యాహ్న భోజనానికి ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోవచ్చు.

సహజంగానే పిల్లలు ముందు పోగయ్యారు. ఈమధ్యే వారికి ఎండాకాలం సెలవులు ప్రకటించారు. ఆ స్వేచ్ఛ వారిని నిలువనీయడం లేదు. బాబీ మార్టిన్‌ అప్పుడే జేబుల్లో రాళ్లను నింపేసుకున్నాడు. మిగిలినవాళ్లు కూడా వాడిని అనుసరిస్తూ గుండ్రటి, నున్నటి రాళ్లను ఏరుతున్నారు. బాబీ, హారీ జోన్స్, డికీ డెలాక్రాయ్‌ ఒక మూలన రాళ్లు పోగేసి, వాటిని ఎవరూ ఎత్తుకుపోకుండా ఓ కన్నేసి ఉంచారు. ఆడపిల్లలు మరో పక్కన నిల్చుని మాట్లాడుతున్నారు.

తర్వాత మగవాళ్లు రావడం మొదలైంది. పిల్లల్ని ఓ కంట గమనిస్తూ విత్తనాలు, వానలు, ట్రాక్టర్లు, పన్నుల గురించి సంభాషిస్తున్నారు. అనంతరం వెలిసిపోయిన బట్టల్లో గృహిణులు వచ్చారు. ఒకరినొకరు పలకరించుకుని, తమ భర్తల వెనకాల వెళ్లి నిలుచుండి, పిల్లల్ని కేకేశారు. నాలుగైదు సార్లు పిలిచాకగానీ వాళ్లు తల్లుల దగ్గరికి రాలేదు.

గ్రామంలో ఆటపాటలు నిర్వహించినట్టుగానే ఈ లాటరీ బాధ్యతను కూడా మిస్టర్‌ సమ్మర్స్‌ చూసుకుంటాడు. ఆయన బ్లూ జీన్స్, తెల్ల చొక్కా వేసుకున్నాడు. బొగ్గు వ్యాపారంలో ఉన్నాడు. పిల్లలు లేరు. సమయాన్నీ శక్తినీ వెచ్చించే వెసులుబాటు ఆయనకు ఉంది. ఆయన చేతిలోని నల్లటి చెక్కపెట్టెను చూడగానే గ్రామస్థుల్లో గుసగుసలు మొదలైనాయి. సమ్మర్స్‌ వెనకాలే పోస్ట్‌మాస్టర్‌ మిస్టర్‌ గ్రేవ్స్‌ ముక్కాలి స్టూల్‌ను తెచ్చి వేయగానే దానిమీద చెక్కపెట్టెను ఉంచాడు సమ్మర్స్‌. ఎవరైనా సాయం చేయమని సమ్మర్స్‌ అనగానే మార్టిన్, ఆయన పెద్దకొడుకు బాక్స్‌టర్‌ వెళ్లి కదలకుండా స్టూలును పట్టుకున్నారు. లోపలి చీటీలను సమ్మర్స్‌ కలియబెట్టాడు.

లాటరీకి సంబంధించిన అసలైన సరంజామా ఎప్పుడో పోయింది. ఈ నల్లపెట్టె కూడా ఊరిలోని కురువృద్ధుడు వార్నర్‌ పుట్టకముందునుంచీ ఉంటున్నది. ఇంకో కొత్తపెట్టె చేయించడం గురించి సమ్మర్స్‌ చాలాసార్లు గ్రామస్థులతో తలపోశాడు. కానీ సంప్రదాయానికి ప్రాతినిధ్యంగా ఉన్న ఈ నల్లపెట్టెని మార్చడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఊళ్లో చెప్పుకునే కథ ఏమిటంటే, ఈ పెట్టె తయారీలో దీనికి పూర్వం వాడుకలో ఉన్న పెట్టెలోని కొన్ని చెక్కలను కలిపారు; ఆ పాతపెట్టెను గ్రామంలో తొలిగా స్థిరపడిన పెద్దలు నిర్మించారు. కాలక్రమంలో ఆచారంలోని చాలాభాగం మరిచిపోవడమో వదిలివేయడమో జరిగింది. తరాలుగా వాడుకలో ఉన్న చెక్క పలకల స్థానంలో కాగితాలను ప్రవేశపెట్టడంలో మాత్రం సమ్మర్స్‌ విజయవంతం అయ్యాడు. జనాభా తక్కువున్నప్పుడు ఆ చెక్క పలకలను నల్లపెట్టెలో వేయడం సులభమయ్యింది. జనం పెరిగాక ఆ పెట్టెలో సులభంగా పట్టేవి కావాలని ఆయన వాదించాడు. లాటరీకి ముందురోజు రాత్రి సమ్మర్స్, గ్రేవ్స్‌ ఇద్దరూ ఈ చీటీలు సిద్ధం చేసి పెట్టెలో వేసి, తెల్లారి ఇక్కడికి తెచ్చేదాకా సమ్మర్స్‌ బొగ్గు కంపెనీలో నిలిపి తాళం వేసి ఉంచుతారు. మిగిలిన ఏడాదంతా పెట్టె ఎక్కడో దగ్గర పడివుంటుంది.

ఈ లాటరీ ప్రారంభించడానికి ముందు బానే హడావుడి జరుగుతుంది. ముందు వంశ పెద్దల జాబితా సిద్ధం చేయాలి, తర్వాత కుటుంబ పెద్దల జాబితా, అటుపై కుటుంబంలోని జాబితా.  ఈ లాటరీ నిర్వహణ బాధ్యతను సమ్మర్స్‌కు అప్పగిస్తున్నట్టు గ్రేవ్స్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఈ సందర్భానికి తగిన పాటేదో ఉండేది.

ఇంతలో హడావుడి పడుతూ శ్రీమతి హచిన్‌సన్‌ పరుగెత్తుకొచ్చింది. శ్రీమతి డెలాక్రాయ్‌తో ‘మా ఆయన కట్టెల కోసం పోయాడేమో అనుకున్నా, తీరా కిటికీలోంచి చూస్తే పిల్లలూ లేరు, అప్పుడు గుర్తొచ్చింది ఇవ్వాళ ఇరవై ఏడని, వెంటనే పరుగెత్తుకొచ్చాను’ అంది. నువ్వు సమయానికే వచ్చావని శ్రీమతి డెలాక్రాయ్‌ సమాధానమిచ్చింది.

అందరూ ఉన్నట్టేనా? అని సమ్మర్స్‌ అడిగాడు. జనం ‘డన్‌బార్‌. డన్‌బార్‌’ అని అరిచారు. ‘అవునుగదా, క్లైడ్‌ డన్‌బార్‌ కాలు విరిగింది. ఆయన బదులుగా ఎవరు చీటీ తీస్తారు?’

నేను తీస్తానంటూ ఒక మహిళ జవాబిచ్చింది. భర్తకు బదులుగా భార్య, ఇంట్లో వయసుకొచ్చిన మగపిల్లలు లేరా జేనీ? అని సమ్మర్స్‌ అడిగాడు. ఈ విషయం ఊరందరికీ తెలిసినా లాటరీ పెద్దగా ఈ ప్రశ్నలు వేయడం ఆనవాయితీ. హొరేస్‌ ఉన్నాడుగానీ ఇంకా పదహారేళ్లు నిండలేదని పశ్చాత్తాపంగా జవాబిచ్చింది శ్రీమతి డన్‌బార్‌. 

‘వాట్సన్‌ బాయ్‌ ఈసారి కూడా తీస్తున్నాడా?’ 

అవును, మా అమ్మా నా తరఫున నేను తీస్తానంటూ గుంపులోంచి ఓ పొడుగాటి యువకుడు చేయెత్తాడు. అందివచ్చిన కొడుకు ఉన్నాడని గుంపులోని కొన్ని గొంతులు మాట్లాడుకున్నాయి.

‘ఇప్పుడు నేను ముందుగా వంశపెద్దల పేర్లను పిలుస్తాను, ఒక్కొక్కరూ వచ్చి పెట్టెలోని చీటీ తీసుకోండి. ప్రతి ఒక్కరూ తీసుకునేదాకా మడత విప్పకూడదు. సరేనా?’ అని ప్రశ్నించాడు సమ్మర్స్‌.

ప్రతిసారీ జరిగే తంతే కాబట్టి, సగం సగం విన్నారు జనం. ‘ఆడమ్స్‌’. గుంపులోంచి ఒక మనిషి ముందుకు వెళ్లాడు. ‘హాయ్‌ స్టీవ్‌’ అని పలకరించాడు సమ్మర్స్‌. ‘హాయ్‌ జో’ అని బదులిచ్చాడు  ఆడమ్స్‌. తర్వాత పెట్టెదగ్గరికి వెళ్లి, ఒక చీటీ తీసుకుని తన స్థానంలోకి వచ్చి నిలుచున్నాడు. 

‘ఆల్లెన్‌’. 

‘ఆండర్‌సన్‌’. 

‘బెంథామ్‌’.

మిస్టర్‌ గ్రేవ్స్‌ కూడా చీటీ తీసుకున్నాడు. సమ్మర్స్‌ తన పేరు తానే పిలుచుకుని తనూ ఓ చీటీ తీసుకున్నాడు. అందరూ అయ్యాక, తమ చేతిల్లో ఉన్న చీటీలను తెరిచి చూసుకున్నారు. వెంటనే జనంలో కోలాహలం మొదలైంది. ‘ఎవరు?’ ‘ఎవరికొచ్చింది?’ ‘హచిన్‌సన్‌’ ‘బిల్‌ హచిన్‌సన్‌కు వచ్చింది.’ తండ్రికి విషయం చెప్పిరమ్మని పెద్దకొడుకును ఇంటికి పరుగెత్తించింది శ్రీమతి డన్‌బార్‌.

హచిన్‌సన్‌ ఎక్కడున్నాడని జనం వెతికారు. బిల్‌ హచిన్‌సన్‌ తన కాగితం చూసుకుంటూ మౌనంగా నిలుచున్నాడు. వెంటనే బిగ్గరగా టెస్సీ హచిన్‌సన్‌ అరవసాగింది. ‘సమ్మర్స్, ఆయనకు కావాల్సిన కాగితాన్ని తీసుకునే సమయం నువ్వు ఇవ్వలేదు, నేను చూశాను, ఇదేం బాగాలేదు’.

‘నోర్మూసుకో టెస్సీ’ అని బిల్‌ హచిన్‌సన్‌ అన్నాడు.

‘బిల్, నువ్వు హచిన్‌సన్‌ వంశానికి చీటీ తీశావు. హచిన్‌సన్‌ వంశంలో ఎన్ని కుటుంబాలున్నాయి?’

కూతుళ్లు డాన్, ఈవా పేర్లు చెబుతుంది టెస్సీ. వాళ్లను వాళ్ల భర్తల కుటుంబాలతో లెక్కిస్తారు, అది నీకూ తెలుసని జవాబిస్తాడు సమ్మర్స్‌. తర్వాతి చీటీ, కుటుంబ పెద్ద ఎవరో తెలియడం కోసం తీస్తారు. హచిన్‌సన్‌ ఇంట్లో పెళ్లయినవాళ్లుపోగా బిల్‌ జూనియర్, నాన్సీ, డేవ్‌ ఉన్నారు. అంటే వంశ పెద్దగానూ, కుటుంబపెద్దగానూ రెండింటికీ బిల్‌ హచిన్‌సన్‌ చీటీ తీసినట్టు! ఒకేసారి రెండు రౌండ్లు ముగిసినట్టు. ఇక మూడో రౌండులో బిల్, టెస్సీతో కలిపి ఈ ఐదుగురి పేర్లను రాసిన చీటీలను తీయాలి. అయితే డేవ్‌ పసివాడు కాబట్టి వాడి చీటి విషయంలో సాయపడవలిసిందిగా హారీని కోరాడు సమ్మర్స్‌. అప్పటికీ టెస్సీ ఇది అన్యాయమని అరుస్తూనేవుంది. మళ్లీ మొదలుపెడదామని డిమాండు చేస్తూనేవుంది. ఆమె మాటల్ని ఎవరూ ఖాతరు చేయలేదు.

ఐదుగురూ ఒక్కొక్కరూ వచ్చి చీటీలను తీసుకున్నారు. డేవ్‌కు హారీ సాయపడ్డాడు. నాన్సీకి రాకూడదని ఆమె స్నేహితురాలు కోరుకుంది. ఐదుగురూ తీసుకున్నాక, చీటీలను తెరిచారు. ఎత్తిపట్టి జనానికి చూపించారు. ఖాళీ. బిల్‌ నీది? అదీ ఖాళీ. టెస్సీ నీది? టెస్సీ చూపించలేదు. బిల్‌ భార్యను కోప్పడి, బలవంతంగా తెరిచాడు. నల్లమచ్చ! టెస్సీ చేతికి వచ్చిన కాగితంలో నల్లమచ్చ. జనంలో కదలిక మొదలైంది.

‘జనులారా, త్వరగా ముగించేద్దాం’ అన్నాడు సమ్మర్స్‌.

పెద్దరాయిని రెండు చేతులతో ఎత్తింది శ్రీమతి డెలాక్రాయ్‌. డన్‌బార్‌ రెండుచేతుల్లోకీ రాళ్లను తీసుకున్నాడు. పిల్లలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఎవరో డేవ్‌ చేతికి కూడా కొన్ని గులకరాళ్లు ఇచ్చారు. వార్నర్‌ ఉత్తేజ పరుస్తున్నాడు. ఆడమ్స్, గ్రేవ్స్‌ కూడా రెడీ.

టెస్సీ హచిన్‌సన్‌ జనం మధ్యలో నిలబడివుంది. మొదటి రాయి వచ్చి ఆమె తలకు తగిలింది.


(సాక్షి సాహిత్యం; 21 జనవరి 2019)

Saturday, May 30, 2026

బూఢీ కాకి

 


ప్రేమ్‌చంద్‌


ప్రేమ్‌చంద్‌ కథ ‘బూఢీ కాకి’ సంక్షిప్త రూపం ఇది. 1920లో ప్రచురితమైంది. ఇరవయ్యో శతాబ్దపు అత్యుత్తమ హిందీ రచయితల్లో అగ్రగణ్యులు ప్రేమ్‌చంద్‌(1880–1936). నవలా చక్రవర్తి అంటారు. గోదాన్, సేవాసదన్, రంగభూమి, కర్మభూమి లాంటి నవలలూ సుమారు 250 కథలూ రాశారు.


ఆకలి శాపం


ముసలితనం అంటే బాల్యం మళ్లీ తిరిగిరావడమే. నాలుక తప్ప మిగిలిన అన్ని జ్ఞానేంద్రియాల శక్తి కోల్పోయింది చిన్నమ్మ. తనవైపు దృష్టి మరల్చుకోవాలంటే ఏడవటం తప్ప ఆమెకు ఇంకో దారి తెలియదు. ఆమె కాళ్లు, చేతులు, కళ్లు అన్నీ ఉడిగిపోయినై. ఇంట్లోవాళ్లు ఆమెకు వేళకు భోజనం పెట్టకపోయినా, చాలినంత పెట్టకపోయినా ఇల్లు అదిరేలా ఏడుస్తుంది.

ఆమె భర్త పోయి చాలా కాలమైంది. ఆమె కొడుకు కూడా తరుణప్రాయంలోనే చనిపోయాడు. చెల్లెలి కొడుకు పండిత్‌ బుద్ధిరామ్‌ తప్ప ఆమెకు ఎవరూ లేరు. అతడి దగ్గరే ఉంటోంది. ఆమెకున్న ఆస్తినంతా అతడి పేర రాసింది. రాసేముందు అతడు పెద్ద వాగ్దానాలే చేశాడుగానీ అన్నీ కల్లలైపోయాయి. ఆమె ఆస్తి వల్ల ఏడాదికి రెండు వందల రూపాయలకు తక్కువ ఆదాయం రాదు. అయినా ఆమెకు కడుపునిండా తిండే పెట్టరు. దీనికి బుద్ధిరామ్‌ను నిందించాలా, ఆయన భార్య రూపనా అన్నది అర్థం కాదు. బుద్ధిరామ్‌ నిజానికి బుద్ధిమంతుడే, డబ్బులను ఖర్చు పెట్టాల్సిన అవసరం రానంతవరకు. రూపకు ముక్కుమీదే కోపం. కానీ దైవభీతి పరురాలు.

మొత్తం కుటుంబంలో చిన్నమ్మకు ఎవరిమీదైనా ప్రేమ ఉందంటే అది లాడ్లీ. బుద్ధిరామ్‌ ముగ్గురు పిల్లల్లోకీ చిన్నది. మొదటి ఇద్దరు మగవాళ్లు. తల్లిదండ్రులను బట్టే పిల్లల ప్రవర్తన ఉన్నట్టు ఈ ఇద్దరూ ముసలామెను ప్రతిదానికీ ఏడిపిస్తారు. ఒకడు గిచ్చి పరుగెడతాడు, ఇంకొకడు నీళ్లు జల్లుతాడు. ఇంట్లో ఏదైనా మిఠాయి చేసినప్పుడు అన్నలు గుంజుకుంటారని తన భాగాన్ని అమ్మమ్మ గదిలోకి వెళ్లి తింటుంది లాడ్లీ, తినుబండారాలు అంటే పడిచచ్చే అమ్మమ్మ తన మిఠాయిలో వాటా కోరుతుందని తెలిసీ. కానీ రౌడీ అన్నలు లాక్కునేదానితో పోలిస్తే అమ్మమ్మకు పోయేది తక్కువే కాబట్టి ఏం ఫరవాలేదు.


2

రాత్రి వేళ. బుద్ధిరామ్‌ ఇంట్లో షెహనాయ్‌ వినిపిస్తోంది. ఊళ్లోని పిల్లలు కళ్లు పెద్దవి చేసుకుని దాన్ని ఆనందిస్తున్నారు. అతిథులకు క్షురకుడు మర్దన చేస్తున్నాడు. ఒక కవిగాయకుడు కవిత్వాన్ని వినిపిస్తుంటే, అతిథులు ‘వహ్వా’ ‘వహ్వా’ అంటున్నారు. ఇంగ్లీషు చదువుకున్న యువకులు ఈ మూర్ఖులతో కలవడం తమ స్థాయికి తగదని దూరంగా నిలుచున్నారు.

ఈరోజు బుద్ధిరామ్‌ పెద్దకుమారుడు సుఖ్‌రామ్‌కు వరపూజ జరుగుతోంది.రూప విందు పనుల్లో హడావుడిగా ఉంది. మట్టిపొయ్యిల మీద పెద్ద మూకుళ్లు పెట్టారు. ఒకదాన్లో పూరీ, కచోరీ, ఇంకోదాన్లో రుచికరమైన కూరలు తయారవుతున్నాయి. నెయ్యి వాసన గాలితో వ్యాపిస్తోంది.

తన గదిలో ఉన్న చిన్నమ్మకు ఈ వాసన సోకి ప్రాణం పోతోంది. నాకు కచ్చితంగా ఈ పూరీలు తేరు, అందరూ తినేసివుంటారు, నాకేమీ ఉంచరు అని తలుచుకుని ఆమె నీరయింది. ఏడుపొచ్చినా ఇంటికి అశుభమని దిగమింగుకుంది.

అబ్బా, ఏం ఘుమఘుమ! నా గురించి ఎవరికి పట్టింది? ఎండిపోయిన రొట్టెలు పెట్టడానికే వాళ్లకు చేతులు రావు, ఈ తీపి పూరీలు నాకు వడ్డిస్తారా? లాడ్లీ ఇవ్వాళ ఇటువైపు రాలేదు. ఇద్దరు మగవాళ్లు మామూలుగానే రారు. అసలు ఇంకా ఏమేం వండుతున్నారో తెలిస్తే బాగుండు.

పూరీలను తలుచుకోగానే చిన్నమ్మ నోట్లో నీళ్లూరినై. ఆమె ఊహలకు రెక్కలు వచ్చినై. బంగారు రంగులో కాలి, మృదువుగా తుంచుకోగలిగే పూరీలు ఆమె కళ్ల ముందు నర్తించినై. చిన్నమ్మకు వెళ్లి మూకుడు ముందు కూర్చోబుద్ధయింది. చేతులు నేలకు ఆన్చి, పాక్కుంటూ గడపదాటి బయటకు వచ్చి, మూకుడు ముందుకు చేరింది.

రూప ఆ సమయంలో ఆత్రంగా ఒక గది నుంచి ఇంకో గదికీ, మూకుళ్ల దగ్గరికీ, భోజనసామగ్రి పెట్టినచోటుకీ  తిరుగుతోంది. ఎవరో వస్తారు, బుద్ధిరామ్‌ సాబ్‌ లస్సీ తెమ్మంటున్నాడని చెబుతారు. మరెవరో వస్తారు, ఇంకేదో ఇమ్మంటారు. ఈలోపు ఒకరు వచ్చి, ఇంకా భోజనాలకు ఎంత సమయం పడుతుందని అడుగుతారు. ఎవరి మీదా అరవడానికి లేదు. అరిచామా ఈ మాత్రం పనులు వెళ్లదీసుకోలేక పోయిందని బంధువులు దెప్పుతారు. దాహంతో ఆమె గొంతు తడారిపోతోంది. మూకుళ్ల వేడి ఒంటిని మాడుస్తోంది. గుక్కెడు నీళ్లు తాగడానికిగానీ విసనకర్రతో ఊపుకోవడానికిగానీ ఆమెకు తీరుబడి లేదు. ఆ సమయంలో ముసలామె మూకుడు ముందు కూర్చోవడం రూప కంటబడింది. ఆమె కోపం నాషాళానికి ఎక్కింది. ‘అప్పుడే నీ కడుపు కాలిపోతోందా? అది కడుపా, కయ్యా? కదలకుండా నీ గదిలో కూర్చోలేవా? ఇంకా చుట్టాలకే పెట్టలేదు, దేవుడికి పెట్టలేదు, ఈమె తయారయ్యింది. నీ నాలుక పడిపోను. ఒకరోజు తిండి పెట్టలేదంటే వేరేవాళ్ల ఇండ్ల మీద పడుతుంది. అందరూ ఈమెకు భోజనం పెట్టక మాడుస్తున్నామని అనుకుంటారు. ప్రాణమైనా పోదు, పాతకి!’

ముసలామె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా పాక్కుంటూ వెనక్కి తన గదిలోకి పోయింది.


3

భోజనాలు సిద్ధమైనాయి. విస్తళ్లు వేశారు. వడ్డనలు జరుగుతున్నాయి. పనివాళ్లు కూడా భోజనానికి వచ్చారు. కాకపోతే బంతితో కాకుండా దూరంగా కూర్చున్నారు. అందరి తినడమూ పూర్తయ్యేదాకా ఎవరూ బంతిలోంచి లేవకుండా ఉండటం మర్యాద. పనివాళ్లు తినడానికి ఎక్కువసేపు తీసుకుంటున్నారని ఒకరిద్దరు చదువుకున్న అతిథులు విసుక్కుంటున్నారు. ఇట్లా ఎంగిలి చేత్తో ఊరికే కూర్చోవడంలో అర్థం లేదని వాళ్ల ఉద్దేశం.

తను చేసిన పనికి ముసలామె సిగ్గుపడింది. రూపమీద ఆమెకు కోపం రాలేదు. కోడలు నిజమే మాట్లాడింది– అతిథులు తినకుండా ఇంట్లోవాళ్లు ఎలా భోంచేస్తారు? ఎవరైనా పిలిచేదాకా ఈ గదిలోంచి బయటకు వెళ్లకూడదనుకుంది. కానీ గాలిలో కలిసి వస్తున్న నెయ్యి వాసన ఆమె ఓపికను పరీక్షిస్తోంది. ఒక్కో క్షణం ఒక యుగంలా గడుస్తోంది. నోట్లో ఏదో పాడుకోవడానికి ప్రయత్నించింది. ఇంతసేపు తింటున్నారా అతిథులు? ఆమెకు ఏ శబ్దమూ వినపడలేదు. అందరూ తినేసి వెళ్లిపోయివుంటారు. నన్ను పిలవడానికి ఎవరూ రాలేదు. రూప కోపంతో ఉంది, ఆమె పిలవకపోవచ్చు. నేనే వస్తానని ఆమె అనుకుంటూండవచ్చు. నేనేమైనా బంధువునా ఆమె వచ్చి పిలుచుకుపోవడానికి. తనే వెళ్లడానికి సిద్ధపడింది వృద్ధురాలు. పూరీలు, కచోరీల తలంపు ఆమెను చక్కలిగింతలు పెట్టింది. చాలారోజుల తర్వాత ఇంట్లో పూరీలు చేశారు. కడుపారా తినేయాలని నిశ్చయించుకుంది. జిహ్వ చాపల్యమని ఎవరు అనుకున్నా సరే లెక్క చేయకూడదనుకుంది.

నెమ్మదిగా చేతులు నేల మీద ఆన్చి, పాక్కుంటూ అరుగు మీదికి వెళ్లింది. కానీ అదృష్టం బాగాలేదు. ఆమె ఓపికలేని మనసు వేసిన లెక్క తప్పింది. అతిథులు ఇంకా తింటున్నారు. అప్పుడే తిన్నవాళ్లు వేళ్లు నాక్కుంటున్నారు. మిగిలిపోయిన పూరీలు ఎలా తీసుకెళ్లాలా అని కొందరు ఆలోచిస్తున్నారు. పెరుగు కానిచ్చి, మారు అడగటానికి మొహమాటపడుతున్నవాళ్లు కొందరు. సరిగ్గా ఈ సమయంలో వాళ్ల మధ్యకు వెళ్లింది. కొందరు ఉలిక్కిపడ్డారు. ఈ ముసల్ది ఎక్కడినుంచి ఊడిపడిందని కొందరు ఆశ్చర్యపోయారు. ఏమీ తాకకుండా చూడండని కొందరు అరిచారు.

చిన్నమ్మను చూడగానే పండిత్‌ బుద్ధిరామ్‌కు మండిపోయింది. ఆమె అప్పటికే పూరీల పళ్లెం పట్టుకుంది. దాన్ని నేల మీదికి విసిరికొట్టాడు. అప్పు చెల్లించకుండా పారిపోతున్నవాణ్ని కఠినమైన వడ్డీ వ్యాపారి ఎలా పట్టుకుంటాడో అలా ఆమెను గదిలోకి లాక్కెళ్లాడు. వృద్ధురాలి కల క్షణంలో కరిగిపోయింది.

అతిథులు తినడం పూర్తయింది. ఇంట్లోవాళ్లందరూ తిన్నారు. వాద్యకారులు, పనివాళ్లు కూడా తినడం అయింది. కానీ ముసలామెను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆమె చేసిన సిగ్గుమాలినపనికి ఈమాత్రం శిక్ష పడవలసిందే అనుకున్నారు బుద్ధిరామ్, రూప. ఎవరూ ఆమె వయసు మీద దయచూపలేదు. ఆమె నిస్సహాయతను పరిగణనలోకి తీసుకోలేదు. లాడ్లీకి తప్ప ఎవరికీ ఆమె మీద ప్రాణం కొట్టుకోలేదు.

తల్లి, తండ్రి ఇద్దరూ నాన్నమ్మను అలా అనడం ఆ చిట్టితల్లికి ఏడుపు తెప్పించింది. ఆమెకు చేతినిండా పూరీలు ఇస్తే ఏం పోతుంది? అతిథులకన్నా ఆమె ముందు తింటే ఆకాశం భూమ్మీద కూలిపోతుందా? గదిలోకి పోయి ఓదార్చుదామనుకుందిగానీ వాళ్లమ్మకు భయపడి ఊరుకుంది. తనకు వడ్డించిన పూరీల్ని తన బొమ్మపెట్టెలో దాచుకుంది.


4

రాత్రి పదకొండయ్యింది. రూప అరుగు మీద పడుకుంది. పూరీలు తింటున్నప్పుడు నానమ్మ కళ్లల్లో కనబడే సంతోషాన్ని తలుచుకుని లాడ్లీకి నిద్ర పట్టలేదు. అమ్మ నిద్రపోగానే నానమ్మ దగ్గరకు పోవాలనుకుంది. కానీ బయట చీకటిగా ఉంది. మట్టిపొయ్యిల్లోని నిప్పులు మాత్రమే వెలుగుతున్నాయి. అక్కడో కుక్క కూర్చునివుంది. తలుపు వెనకాల నిమ్మచెట్టు మీద లాడ్లీ చూపు పడింది. దానిమీద హనుమంతుడు కూర్చున్నట్టుగా అనిపించింది. తోక, గద స్పష్టంగా కనబడుతున్నాయి. భయంతో కళ్లు మూసుకుంది. అప్పుడే కుక్క లేచి నిలబడింది. అది లాడ్లీకి ధైర్యాన్నిచ్చింది. పడుకునివున్న మనుషులకన్నా నిద్రలేచిన కుక్కే ఆమెకు ఎక్కువ ధైర్యాన్నిచ్చింది. తన బొమ్మపెట్టెను తీసుకుని నానమ్మ గదిలోకి వెళ్లింది.


5

కొండమీదకు ఎవరో లాక్కుపోతున్నట్టుగా కల కంటున్న వృద్ధురాలు ఉన్నట్టుండి మేల్కొంది. అతిథులంతా వెళ్లిపోయుంటారు. దేవుడా, తిండి లేకుండా ఈ రాత్రి ఎలా గడపడం? నాకు పూరీలు ఇస్తే వాళ్ల సంపదేమైనా తరిగిపోతుందా? ‘నాన్నమ్మ, లే’ అంటున్న లాడ్లీ గొంతు విని హుషారుగా లేచి కూర్చుంది. లాడ్లీని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. లాడ్లీ పూరీలు చేతికిచ్చింది. ‘మీ అమ్మ ఇచ్చిందా?’ ‘కాదు, ఇవి నా వాటా’. ఐదు నిమిషాల్లో పూరీలు తినేసింది. కొద్దిపాటి వాన భూమ్మీది తాపాన్ని తగ్గించకపోగా వృద్ధి చేసినట్టు ఆ పూరీలు ముసలామె ఆకలిని మరింత పెంచాయి. ఇంకొన్ని తెమ్మని పాపను అడిగింది. అమ్మ కొడుతుందని భయపడింది చిన్నది.  మిగిలిపోయిన తునకలు కూడా తిని, వేళ్లు నాక్కుంది ముసలామె. ఆకలి మరింత ఉధృతమైంది. విచక్షణ కోల్పోయేట్టు చేసింది. అతిథులు తిన్నచోటుకు పట్టుకెళ్లమని పాపను కోరింది.

దేవుడా! అతిథుల ఎంగిలి విస్తళ్లలో మిగిలిపోయిన పూరీ ముక్కలను తీసుకుని తినసాగింది ఆ దీన హీన వృద్ధురాలు! వృద్ధాప్యం, శాపం.

కళ్లు తెరిచిన రూపకు లాడ్లీ కనబడలేదు. ఆందోళనతో లేవగానే కనబడిన దృశ్యం ఆమెను స్తంభింపజేసింది. తన గొంతు కోస్తున్నప్పుడు ఆవు అనుభవించే లాంటి క్షోభను ఆమె అనుభూతించింది. ఎంగిలి విస్తళ్లలో చేయిపెట్టే ఖర్మానికి ఈ వృద్ధురాలిని తీసుకొచ్చానే! అయ్యో, ఈ ప్రపంచానికి ఏ విపత్తు రానున్నది? దయ, భయం ఆమె కళ్లల్లోంచి నీళ్లుగా జారినై. ఈ అధర్మానికి బాధ్యులెవరు? దేవుడా, నా బిడ్డల మీద దయ చూపించు. నేను చేసిన పాపానికి నన్ను శిక్షించకు. అయ్యో అయ్యో, ఇవ్వాళే నా పెద్దబిడ్డకు శుభకార్యం జరిగింది. వందల మంది భోంచేసి వెళ్లారు. ఎవరి ఆస్తినైతే మేము అనుభవిస్తున్నామో, ఆమెనే బిచ్చగత్తెను చేశామే! 

రూప దీపం వెలిగించింది. పళ్లెంలో పూరీలు నిండుగా పెట్టుకుంది. వృద్ధురాలి ముందు నిలబడి గద్గద స్వరంతో క్షమించమని ప్రార్థించింది.


(సాక్షి సాహిత్యం; 2018 జూలై 9)


Wednesday, May 27, 2026

ద బెట్‌


ఆంటన్‌ చెహోవ్‌


ఆంటన్‌ చెహోవ్‌ (1860–1904) రష్యన్‌ కథ ‘ద బెట్‌’ సంక్షిప్త రూపం ఇది. ప్రపంచంలోని గొప్ప కథకుల్లో చెహోవ్‌ ఒకరు.


అబద్ధం నిజం


పదిహేనేళ్ల క్రితం తాను ఇచ్చిన ఒక విందు గురించి ఆలోచిస్తున్నాడు ముసలి బ్యాంకర్‌. ఆ విందులో ఆసక్తికరమైన సంభాషణ సాగింది. అంశం మరణశిక్ష మీదకు మళ్లింది. అతిథుల్లోని చాలామంది పండితులు, పాత్రికేయులు మరణశిక్షను నీతిబాహ్యమైనదిగా నిరసించారు. దానికి బదులుగా యావజ్జీవ కారాగారశిక్షను అమలు చేయాలన్నారు.

‘నేను మీతో ఏకీభవించను,’ అన్నాడు బ్యాంకర్‌. ‘నేను మరణశిక్షనుగానీ యావజ్జీవాన్నిగానీ అనుభవించనప్పటికీ, నా ఉద్దేశంలో మరణదండనే నీతివంతమైనదీ మానవీయమైనదీ కూడా. అది ఒకేసారి చంపేస్తుంది, యావజ్జీవం దశలవారీగా ప్రాణం తీస్తుంది. ఏది మానవీయం?’

‘రెండూ సమానంగా నీతిబాహ్యమైనవే’ అన్నాడు ఒక అతిథి. ‘వాటి లక్ష్యం ఒకటే, ప్రాణాన్ని తీయడం. ప్రభుత్వమేమీ దేవుడు కాదు, అది ఇవ్వలేని జీవితాన్ని తీసుకునే హక్కు దానికి లేదు’.

అతిథుల్లో ఒక పాతికేళ్ల న్యాయవాది కూడా ఉన్నాడు. అతడి స్పందన ఏమిటా అని అడిగినప్పుడు, ‘రెండూ కూడా సమానంగా అధర్మమైనవే. కానీ అవకాశం ఉంటే గనుక నేను యావజ్జీవాన్నే ఎంచుకుంటాను. చనిపోవడం కన్నా ఏదో విధంగా బతికివుండటం నయం కదా’ అన్నాడు.

బ్యాంకర్‌కు అసహనం పెరిగింది. టేబుల్‌ మీద గుద్దుతూ, ‘అది అబద్ధం. ఐదేళ్లు కూడా నువ్వు జైల్లో ఉండలేవని ఇరవై లక్షల పందెం’ అన్నాడు.

‘మీరు సీరియస్‌గానే అంటున్నారంటే, ఐదు కాదు పదిహేనేళ్లుంటాను’ బదులిచ్చాడు లాయర్‌.

‘పదిహేనా! సరే!’ అరిచాడు బ్యాంకర్‌. ‘నా పందెం ఇరవై లక్షలు’.

‘ఒప్పుకుంటున్నా. మీ పందెం ఇరవై లక్షలు, నా పందెం నా స్వతంత్రం’.

అట్లా ఈ అర్థం లేని పందెం అమలులోకొచ్చింది. భోజనం సమయంలో న్యాయవాదితో, ‘ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, నాకు ఇరవై లక్షలతో పోయిందేమీ లేదు, నువ్వు అనవసరంగా నీ జీవితంలోని విలువైన నాలుగైదేళ్లను కోల్పోతావు’ అని హెచ్చరించాడు. ‘మూడు నాలుగు అని ఎందుకంటున్నానంటే నువ్వు అంతకంటే ఎక్కువకాలం ఉండలేవు. తప్పనిసరైతే సరే, కానీ ఐచ్ఛిక శిక్షను భరించలేవు. ఎప్పుడంటే అప్పుడే స్వేచ్ఛను పొందగలనన్న స్పృహ నీ ఖైదుకాలాన్ని విషతుల్యం చేస్తుంది’.

అప్పటి పందెం గురించి బ్యాంకర్‌ తలపోస్తూ ఇంట్లో పచార్లు చేస్తున్నాడు. ‘ఆ పందెం నేను ఎందుకు కాసినట్టు? దానివల్ల జరిగే మేలేమిటి? ఆ లాయర్‌ తన జీవితంలో పదిహేనేళ్లు కోల్పోతాడు, నేను నా ఇరవై లక్షలు తగలేస్తాను. దీనివల్ల యావజ్జీవం మరణదండనకన్నా మెరుగనో, హీనమనో ఏమైనా తేలుతుందా? డబ్బు కొవ్వున్నవాడి చపలచిత్తం నాదైతే, డబ్బు మీది దురాశ ఆ లాయర్‌ది’.

ఆ విందు తర్వాత న్యాయవాదిని బ్యాంకర్‌ పెరటింటిలో ఖైదు చేయాలని నిశ్చయించారు. అతడు తన ఖైదుకాలంలో గడప దాటి బయటకు రాకూడదు, మనుషులను చూడకూడదు, వారి గొంతు వినకూడదు, ఉత్తరాలు స్వీకరించకూడదు, వార్తాపత్రికలు తెప్పించుకోకూడదు. సంగీత వాద్యం ఉంచుకోవచ్చు, పుస్తకాలు చదవొచ్చు, లేఖలు రాయొచ్చు, మద్యం, పొగ తాగొచ్చు. వీటిల్లో ఏది కావాలన్నా ప్రత్యేకంగా నిర్మించిన గది కిటికీ గుండా చిన్న నోట్‌ పంపొచ్చు. అన్ని సూక్ష్మ వివరాలతో సహా ఒప్పందం రాయబడింది. నవంబర్‌ 14, 1870 పన్నెండు గంటల నుంచి నవంబర్‌ 14, 1885 పన్నెండింటిదాకా సరిగ్గా పదిహేనేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లోవుంటుంది. దీన్ని కనీసం రెండు నిమిషాల ముందు ఉల్లంఘించినా బ్యాంకర్‌  ఇరవై లక్షలు చెల్లించనక్కర్లేదు.

అతడు పంపిన చిన్న నోట్సుల ఆధారంగా తెలిసింది ఏమంటే, మొదటి సంవత్సరపు ఖైదులో లాయర్‌ తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యాడు. ఆ గదిలోంచి రాత్రీ పగలని లేకుండా పియానో శబ్దాలు వినబడేవి. అతడు మద్యాన్నీ పొగనూ నిరాకరించాడు. ‘మద్యం కోరికలను రగిలిస్తుంది. ఖైదీకి ముఖ్య శత్రువులు కోరికలు’ అని రాశాడు. గదిలోని వాతావరణాన్ని పాడు చేస్తుందని పొగ కూడా తాగలేదు. మలుపులున్న ప్రేమ, క్రైమ్, ఫాంటసీ, కామెడీ వంటి చౌకబారు పుస్తకాలను తెప్పించుకున్నాడు.

రెండో ఏడాదిలో పియానో శబ్దాలు అసలు వినబడలేదు. క్లాసిక్‌ రచనలు మాత్రమే కోరుకున్నాడు. మళ్లీ ఐదో ఏడాదిలో ఆ గదిలోంచి సంగీతం వినబడింది. మద్యం కూడా కావాలని కోరాడు. ఆ సంవత్సరమంతా అతడు తినడం, తాగడం, తన మంచం మీద పడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేదు. తరచూ ఆవలించేవాడు. తనలో తాను కోపంగా మాట్లాడుకునేవాడు. చాలాసేపు ఏదో రాసుకునేవాడు, దాన్ని మళ్లీ తెల్లారి మొత్తం చించేసేవాడు. చాలాసార్లు ఏడ్చేవాడు.

ఆరో సంవత్సర ద్వితీయార్థంలో భాషాశాస్త్రాలు, తత్వశాస్త్రం, చరిత్ర ఉత్సాహంగా చదివాడు. ఎంత ఆబగా చదివాడంటే అతడు కావాల్సిన పుస్తకాలను తెప్పించడానికి బ్యాంకర్‌కు సమయం చాలేది కాదు. నాలుగేళ్ల కాలంలో ఆరువందల ఉద్గ్రంథాలను కొనాల్సివచ్చింది. ఆ తీవ్రోత్సాహంలో ఉన్నప్పుడే లాయర్‌నుంచి బ్యాంకర్‌కు ఓ లేఖ వచ్చింది. ‘నా ప్రియమైన జైలర్, నేను ఈ వాక్యాలను ఆరు భాషల్లో రాస్తున్నాను. వాటిని నిపుణులకు చూపించండి. అందులో గనక ఒక్క తప్పూ లేకపోతే దయచేసి పెరట్లో ఒకసారి తుపాకిని కాల్పించండి. ఆ శబ్దం వల్ల నా ప్రయత్నం విఫలం కాలేదని తెలుస్తుంది. భిన్న దేశాల్లోని భిన్న తరాల మేధావులు  భిన్న భాషల్లో మాట్లాడినప్పటికీ వాళ్లందరిలోనూ వెలిగే జ్యోతి ఒక్కటే. వాళ్లందరినీ అర్థం చేసుకోగలిన నా పరమానందాన్ని ఏమని వర్ణించను!’ అతడి కోరిక నెరవేరింది. బ్యాంకర్‌ ఆదేశం మీద రెండుసార్లు పెరట్లో తుపాకి పేలింది.

పదో ఏడాది తర్వాత లాయర్‌ తన టేబుల్‌ మీద నిశ్చలంగా కూర్చుని న్యూ టెస్టమెంట్‌ చదివాడు. నాలుగేళ్లలో ఆరు వందల పాండిత్య గ్రంథాల్ని చదివినవాడు ఈ సన్నటి, తేలికగా అర్థమయ్యే పుస్తకాన్ని సుమారు ఏడాదికాలం చదవడం బ్యాంకర్‌ను ఆశ్చర్యగొలిపింది. తర్వాత లాయర్‌ మత చరిత్రలు, వేదాంతం కోరుకున్నాడు.

చివరి రెండేళ్లు లెక్కాపత్రం లేకుండా చదివాడు. ప్రకృతి శాస్త్రాలు, బైరన్, షేక్‌స్పియర్, ఒకసారి రసాయన శాస్త్రం కోరేవాడు, మరోసారి వైద్యశాస్త్రం, నవల, తత్వశాస్త్రం మీద సిద్ధాంత గ్రంథం... సముద్ర ప్రయాణంలో ప్రమాదానికి గురైన నౌకలోనివాడు దొరికిన చెక్కనల్లా పట్టుకుని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినట్టుగా ఒక్కో పుస్తకం చదివాడు.

’ ’ ’

ఇక రేపు పన్నెండు గంటలైతే పందెం పూర్తవుతుంది. ‘నేను అతడికి ఇరవై లక్షలు చెల్లించాల్సి వుంటుంది’ అని గుర్తుచేసుకున్నాడు బ్యాంకర్‌. ‘చెల్లిస్తే గనక నేను దివాళా తీసినట్టే’.

పదిహేనేళ్ల క్రితం బ్యాంకర్‌ దగ్గర లక్షలు మూలిగాయి. కానీ ఇప్పుడు ఆస్తులకంటే అప్పులు అధికం. స్టాకు మార్కెట్లతో ఆడిన జూదం, జాగ్రత్తపడలేనితనం అతన్ని నిండా ముంచాయి. అతడి పూర్వపు ఆత్మవిశ్వాసం పోయింది. ‘శాపం లాంటి పందెం’ అనుకున్నాడు. ‘అతడెందుకు చావలేదు? మహా అయితే అతడికి నలబై ఏళ్లు. నా చివరి రూపాయి కూడా తీసుకుని వెళ్లిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు, జూదం ఆడతాడు. నేనేమో బిచ్చగాడిలా దీనంగా నిలబడితే అతడు ‘నేనేమైనా మీకు సాయం చేయగలనా’ అని అడుగుతాడు. ఇది నేను భరించలేను. దీన్ని తప్పించుకోవాలంటే అతడు చావడం ఒకటే మార్గం’.

గడియారం మూడు కొట్టింది. ఇంట్లో అందరూ పడుకున్నారు. నిశ్శబ్దంగా అతడు ఇనప్పెట్టెలోంచి ఆ పదిహేనేళ్ల పాటు తెరవని గది తాళంచెవి తీసుకున్నాడు. పెరడంతా చీకటిగావుంది. వర్షం కురుస్తోంది. వాచ్‌మన్‌ వానకు ఎక్కడో పడుకున్నట్టున్నాడు. పిలిస్తే బదులు రాలేదు. ‘నేను అనుకున్న పని ధైర్యంగా చేయగలిగితే అనుమానం వాచ్‌మన్‌ మీదికి పోతుంది’ అనుకున్నాడు. బందీ ఉన్న గది దగ్గరికి వెళ్లి కిటికీ లోంచి లోపలికి చూశాడు. క్యాండిల్‌ వెలుగుతోంది. బందీ టేబుల్‌ ముందు కూర్చున్నాడు. కిటికీ మీద చిన్నగా తట్టాడు. బందీ కదలలేదు. బ్యాంకర్‌ జాగ్రత్తగా తాళం మీది సీల్‌ చించి, చెవితో తాళం తీశాడు. త్రుప్పు పట్టిన తాళం చప్పుడు చేస్తూ తెరుచుకుంది. లోపలినుంచి ఒక పెద్ద ఆశ్చర్యాన్ని ఊహించాడు. కానీ పదిహేనేళ్ల బందీఖానా లాయర్‌ను కదలకుండా కూర్చోవడం నేర్పింది. బ్యాంకర్‌ లోపలికి పోదామని నిశ్చయించుకున్నాడు.

ఒక అస్థిపంజరంలాంటి శరీరం కూర్చునివుంది. పొడవైన వెంట్రుకలు. అవీ తెల్లబడుతున్నాయి. పసుపు పచ్చటి ముఖం. నలబై ఏళ్లవాడంటే ఎవరూ నమ్మరు. టేబుల్‌ మీద ఏదో రాసిన కాగితం ఉంది. ‘లక్షలు వస్తాయని కలగంటున్నట్టున్నాడు, మంచం మీదకు తోసి దిండుతో అదిమానంటే ఈ సగంప్రాణి పూర్తిగా చస్తుంది’ అనుకున్నాడు బ్యాంకర్‌. ‘ముందైతే ఏం రాశాడో చదువుదాం’.

‘రేపు అర్ధరాత్రి పన్నెండుకు నా స్వతంత్రం నాకు వెనక్కి వస్తుంది. కానీ ఈ గదిని వదిలి, సూర్యుణ్ని చూడటానికి ముందు కొన్ని మాటలు పంచుకోవాలి. నా స్వతంత్రాన్నీ, నా జీవితాన్నీ, నా ఆరోగ్యాన్నీ, మీ పుస్తకాలు ప్రపంచ భాగ్యాలని వర్ణించేవన్నింటినీ నా ఆత్మసాక్షిగా అసహ్యించుకుంటున్నాను. ఎండమావి లాగా ప్రతిదీ శూన్యంగా, మిధ్యగా కనబడుతోంది. అందం, తెలివితేటలు ఎన్నివున్నా మృత్యువు తప్పదు. మేధావుల అమరత్వం కూడా నశించిపోయేదే. మీరు తప్పుదోవలో పయనిస్తున్నారు. అబద్ధాన్ని నిజంగా, వికారాన్ని అందంగా భావిస్తున్నారు. మీరు దేనికోసమైతే జీవిస్తున్నారో దాని పట్ల నాకున్న తిరస్కారాన్ని తెలియజేసేందుకు నేను ఒకప్పుడు స్వర్గసమానంగా భావించిన ఇరవై లక్షలను  వదులుకుంటాను. సరిగ్గా రేపు ఐదు నిమిషాల ముందు గదిలోంచి వెళ్లిపోయి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తాను’.

చదవగానే బ్యాంకర్‌ అతడి తలను ముద్దాడి, ఏడుస్తూ తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయాడు. జీవితంలో ఏనాడూ తన పట్ల తనకు ఇంత అసహ్యం కలగలేదు. 

తెల్లారి, ఆ మనిషి గది కిటికీ ఎక్కి వచ్చి, గేట్లోంచి అదృశ్యమయ్యాడని పరుగెత్తుతూ వచ్చి చెప్పాడు వాచ్‌మన్‌. బ్యాంకర్‌ ఆ విషయాన్ని ధృవపరుచుకుని, అనవసరమైన పుకార్లు రాకుండా, ఇరవై లక్షలపై తన హక్కును వదులుకుంటున్నట్టుగా లాయర్‌ రాసిన కాగితాన్ని ఇనప్పెట్టెలో భద్రపరిచాడు.

(సాక్షి సాహిత్యం; 2018 మే 21)


Sunday, May 24, 2026

ద షాట్‌


అలెగ్జాండర్‌ పుష్కిన్‌

అలెగ్జాండర్‌ పుష్కిన్‌ 1831లో రాసిన ‘ద షాట్‌’ కథాసారం ఇది. రష్యన్‌ ఆధునిక సాహిత్యానికి పుష్కిన్‌ మార్గదర్శి అంటారు.


ఛాలెంజ్‌


ఈ కథను మనం కథకుడి నోటి నుంచి వింటాం. అతడు సైన్యంలో పనిచేస్తుంటాడు. వాళ్లు ‘ఎన్‌...’ అనే చిన్న పట్టణంలో ఉన్నారప్పుడు. ఆర్మీ అంటే డ్రిల్లు, డిన్నరు, పేక; ఇదే జీవితం. యూనిఫారాలు తప్ప మరొకటి కనబడవు.

సైనికులు తమ బృందంతో కలవనిచ్చే వేరే వ్యక్తి ఒక్కడే. ఆయన వయసు ముప్పై ఐదు ఉండొచ్చు. ఈ కుర్రాళ్ల మధ్య అతడు పెద్దమనిషి కిందే లెక్క. అతడు ఎక్కువ మాట్లాడడు. మాట్లాడినా కోసినట్టుగా ఉంటుంది మాట. చూడ్డానికి రష్యన్‌లా కనబడినా పేరు విదేశీలా ధ్వనిస్తుంది. కుర్రాళ్లందరికీ సిల్వియో అంటే ఒక ఇది ఉంటుంది. అతడు అంతకుముందు అశ్వికదళంలో పనిచేశాడు. మరి ఎందుకు అందులోంచి రిటైర్‌ అయ్యాడో, ఎందుకు ఈ పాడుబడిన ఊళ్లో ఉంటున్నాడో ఎవరికీ తెలీదు. సిల్వియో సైనికుల గుంపుతో కలిసి షాంపేన్‌ తాగుతాడు. వాళ్లు అడిగితే తన దగ్గరున్న పుస్తకాలు ఇస్తాడు. అవి ఎక్కువగా సైన్యం గురించినవే అయివుంటాయి. సిల్వియోకు ఎక్కువ వినోదకరమైంది మాత్రం షూటింగ్‌. బుల్లెట్లు తగిలి అతడి ఇంటి గోడలు తేనెపట్టు రంధ్రాలైనాయి. సిల్వియో గురి ఎంత గొప్పదంటే, నీ టోపీ మీదున్న పండును కొడతానని గనక అతడంటే, దాన్ని నెత్తిన పెట్టుకోవడానికి ఏ ఒక్క సైనికుడు కూడా జంకడు.

సైనికుల సంభాషణ తరచూ ద్వంద్వయుద్ధాల మీదకు మళ్లేది. ఆ రోజుల్లో ఇద్దరు మనుషుల మధ్య తేడా వచ్చిందంటే ద్వంద్వయుద్ధానికి సవాల్‌ విసరడం మామూలే. కానీ వాటిలో సిల్వియో జోక్యం చేసుకునేవాడు కాదు. బదులిచ్చినా పొడిగానే. అయినా సిల్వియో పిరికివాడై ఉంటాడన్న ఆలోచన కూడా ఎవరి తలలోకి దూరేది కాదు. కానీ ఒక సంఘటన కథకుడిని విస్తుపోయేలా చేసింది. 

ఒకరోజు ఓ పదిమంది సిల్వియోతో విందు చేసుకున్నారు. అనంతరం సైనికులు అడిగిన మీదట బలవంతంగా పేక ఆడటానికి ఒప్పుకున్నాడు సిల్వియో. అయితే, స్కోర్‌ దగ్గర చిన్న తేడా జరిగింది. ఎక్కువ మాట్లాడని సిల్వియో దాన్ని చాక్‌పీస్‌తో సరిదిద్దే ప్రయత్నం చేశాడు. దీనిలోనే మాటలు పెరిగాయి. కొత్తగా ఆ రెజిమెంటుకు వచ్చిన కుర్ర లెఫ్ట్‌నెంట్‌ కోపంగా సిల్వియో మీదకు టేబుల్‌ మీదున్న ఇత్తడి దీపపు సెమ్మె విసిరేశాడు. జరిగినదానికి మిగతా సైనికులు భీతిల్లారు. వీడింక చచ్చాడే అనుకున్నారు. అయినా కాసేపు ఆట మౌనంగా కొనసాగింది. సిల్వియోకు ఆసక్తి పోయిందని గ్రహించి ఒక్కొక్కరూ బయటికి నడిచారు.

తెల్లారి గుర్రపు స్వారీల దగ్గర ఆ లెఫ్ట్‌నెంట్‌ ఇంకా బతికేవున్నాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. సిల్వియో ద్వంద్వయుద్ధానికి సవాల్‌ విసరలేదా? ఇది కుర్రాళ్ల దృష్టిలో సిల్వియోను పలుచన చేసింది. మనిషి గుణాలన్నింటిలోకీ శ్రేష్ఠమైందని యువకులు తలిచే ధైర్యం లేకపోవడాన్ని వాళ్లు క్షమించలేరు. అందరికన్నా సిల్వియోతో ఎక్కువ దగ్గరితనం ఉన్న కథకుడు కూడా సిల్వియో కళ్లలోకి చూడటానికి ఇష్టపడలేదు.

ఒకరోజు ఒక ఉత్తరం వచ్చింది. దాన్ని చదవగానే సిల్వియో కళ్లు మెరిశాయి. తను ఇక నిష్క్రమించాల్సిన తరుణం వచ్చిందనీ, వెళ్లేలోగా చివరిసారి రాత్రికి తనతో భోజనం చేయమనీ కుర్రాళ్లను ఆహ్వానించాడు. ప్రత్యేకించి కథకుడికి మరీ మరీ చెప్పాడు. విందు బాగా జరిగింది. అందరూ సిల్వియోకు వీడ్కోలు చెప్పి బయలుదేరారు. కథకుడు కూడా బయలుదేరుతుండగా చేయి పట్టి ఆపాడు సిల్వియో. ఇద్దరూ మౌనంగా కాసేపు పైపులు కాల్చారు. ‘ఇంక మనం మళ్లీ ఎప్పటికీ కలవలేకపోవచ్చు. వెళ్లేముందు నేను నీకో వివరణ ఇవ్వాల్సివుంది’ అన్నాడు సిల్వియో. ‘నా మీద ఉన్న చెడు తలంపును దూరం చేయకపోతే అది నన్ను జీవితకాలం వెంటాడుతుంది’ అని చెప్పి, ఆ రోజు ఆ తాగుబోతు ‘ఆర్‌...’ను వదిలేయడానికి తన ఔదార్యం మాత్రమే కారణం కాదనీ, వాడిని పిస్టల్‌తో కాల్చడంలో తనకో స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ, ఆయుధాల ఆటలో తన జీవితం కూడా ప్రమాదంలో పడే వీలుందనీ చెప్పాడు సిల్వియో. ఈ వివరణ కథకుడిని మరింత స్తంభించేలా చేసింది. మృత్యువు అంచుకు వెళ్లే హక్కు తనకు లేదంటాడు సిల్వియో. దానిక్కారణం ఆరేళ్లుగా అతడు తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న ఒక ప్రతీకారం. తనను దెబ్బ కొట్టిన శత్రువు ఇంకా బతికేవున్నాడు. ఆ గతానికి గుర్తుగా పెట్టెలోంచి తీసి బుల్లెట్‌ దిగిన ఒక టోపీని చూపించాడు.

సిల్వియో అశ్వికదళంలో పనిచేసే రోజుల్లో అసాధారణ వీరుడిగా పేరొచ్చింది. ద్వంద్వయుద్ధాల్లో అతడికి సాటి లేరు. అలాంటి రోజుల్లో వాళ్ల రెజిమెంటుకు కొత్త ఆఫీసర్‌ వస్తాడు. అతడు ధనవంతుడు, అందగాడు, దేన్నీ లెక్కచేయని ధైర్యవంతుడు, మాటకు మాటను తెలివిగా విసురుతాడు. తనను సవాల్‌ చేసేవాడే లేడనుకున్న తరుణంలో వచ్చిన ఈ కొత్త ఆఫీసర్‌ సిల్వియోలో ఈర్శ్య పుట్టిస్తాడు. చివరికి ఒకరోజు ఒక విందునాట్యంలో అతడిని పరుషమైన మాటంటాడు సిల్వియో. బదులుగా అతడు  సిల్వియో ముఖం మీద కొడతాడు. ఇద్దరూ కత్తులు దూసుకుంటారు. పెద్ద గందరగోళం జరుగుతుంది. ఆ రాత్రే వాళ్లు ద్వంద్వయుద్ధానికి సవాల్‌ విసురుకుంటారు.

తెల్లవారుతుంది. నిర్దేశిత స్థలంలో సిల్వియో అసహనంగా ఎదురుచూస్తుంటాడు. వెంబడి ముగ్గురు సహాయకులుంటారు. కొత్త ఆఫీసర్‌ తాపీగా నడుచుకుంటూ వస్తాడు. తన క్యాపులో చెర్రీపళ్లు ఉంటాయి. వెంట ఒక్కడే సహాయకుడు. సహాయకులు ఇద్దరి మధ్యా పన్నెండు అంగల దూరం కొలుస్తారు. ముందు ఎవరు కాల్చాలి? సిల్వియో చేయి వణుకుతుంది. తనకు తాను ఆ నిశ్చలత ఇచ్చుకోవడానికి వీలుగా ఆఫీసర్‌కు మొదటి షాట్‌ ఆఫర్‌ ఇవ్వబోతాడు సిల్వియో. కానీ సహాయకులు వారించి పాచిక వేస్తారు. ఆఫీసర్‌ చెప్పిన అంకె పడుతుంది. అతడు గురిపెట్టి మొదటి షాట్‌ కాలుస్తాడు. సరిగ్గా సిల్వియో నుదురు పైన అంగుళం దూరం నుంచి క్యాపుగుండా వెళ్తుంది బుల్లెట్‌. 

ఇప్పుడు సిల్వియో వంతు. గురి చూసి కొట్టడంలో మొనగాడైన సిల్వియో చేతుల్లో ఆఫీసర్‌ ప్రాణం ఉంది. సిల్వియో పిస్టల్‌ గురి పెడతాడు. అతడిలో ఏమైనా భయం జాడ ఉన్నదా? ఊహు. తాపీగా టోపీలోంచి విరగబండిన చెర్రీపళ్లను తీసుకు తింటూ, వాటి గింజలు నోట్లోంచి దూరంగా సిల్వియో కాళ్ల దగ్గర వచ్చి పడేలా ఊస్తూ నిలబడతాడు. ఇది సిల్వియోను కలవరపరుస్తుంది. ఎవడైనా భయపడితే వాడి బతుకును లాక్కోవచ్చు. ఇట్లాంటివాడిని చంపితే ఎంత, చంపకపోతే ఎంత?

పిస్టల్‌ దించి, నువ్వింకా చావడానికి సిద్ధంగా లేనట్టున్నావు, నీ బ్రేక్‌ఫాస్ట్‌ కానీ, నేను అడ్డురానంటాడు సిల్వియో. అడ్డు వస్తున్నావని ఎవరన్నారు? కాల్చుకో, షాట్‌ నీది, నేను ఎప్పుడైనా సిద్ధం అంటాడు అతను. సహాయకులతో తన షాట్‌ను ఈ రోజు తీసుకోనని సిల్వియో చెప్పడంతో ఆ ద్వంద్వయుద్ధం ఆగిపోతుంది.

తర్వాత సిల్వియో ఈ ఊరికి వచ్చి, ఇక్కడ స్థిరపడ్డాడు. తన ప్రతీకారం గురించి అతడు ఆలోచించని రోజంటూ లేదు. అనుకోకుండా సిల్వియో ఏజెంట్‌ మాస్కో నుంచి రాసిన ఆ ఉత్తరంలో ‘ఒకానొక వ్యక్తి’ ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని రాశాడు. ఈ కథంతా సిల్వియో కథకుడికి చెప్పి, ఆ ఒకానొక వ్యక్తి ఎవరో నీకు అర్థమైందనుకుంటాను, అని అడుగుతాడు. ఆ రోజు మృత్యువు ముఖంలోకి చెర్రీపళ్లు తింటూ చూసినట్టుగానే ఈ వివాహ వేడుక సందర్భంగా కూడా చూస్తాడా? సిల్వియో తన సామగ్రి సిద్ధం చేసుకుని, బోనులోంచి బయటపడిన పులిలా ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. అతడి కోసం గుర్రాల బండి సిద్ధంగా ఉంది.

’ ’ ’

చాలా ఏళ్లు గడిచాయి. కుటుంబ పరిస్థితులు మన కథకుడిని ‘ఎమ్‌...’ అనే ఊళ్లో స్థిరపడేలా చేశాయి. ఊళ్లో ప్రత్యేకించి ఏమీ జరగదు. ఒక్క విశేషం ఉంటే దాని గురించి రెండు నెలలు చెప్పుకుంటారు గ్రామస్థులు. కథకుడి ఇంటికి నాలుగు వర్స్‌›్టల దూరం(1 వర్స్‌›్ట= 1.1 కిలోమీటర్‌)లో దొరసాని బి... ఎస్టేట్‌ ఉంది. అది ఎ... అనే గ్రామం కిందికి వస్తుంది. ఎస్టేట్‌లో పర్యవేక్షకుడు తప్ప ఎవరూ ఉండరు. ఆమెకు పెళ్లయిన తొలి ఏడాది ఓసారి ఇక్కడికి వచ్చి వెళ్లిందట. మళ్లీ ఆమె భర్తతో సహా ఎస్టేట్‌కు వస్తున్నారని తెలిసి కథకుడు ఉత్సాహపడతాడు. ఊళ్లల్లో జరగ్గలిగే విశేషాలు అంతకంటే ఏముంటాయి?

జమీందారు, అతడి భార్య వచ్చారని తెలిశాక వచ్చిన మొదటి ఆదివారం కథకుడు తన వందనాలు తెలియజేయడానికి వెళ్లాడు. భవంతి అత్యంత విలాసవంతంగా ఉంది. పుస్తకాలు, కంచు ప్రతిమలు, తివాచీలు, పెద్ద అద్దం... ఒక పనివాడు ఈయన వచ్చినట్టు చెప్పడానికి లోపలికి వెళ్లాడు. ఇంత సంపద ఎప్పుడూ చూసివుండని కథకుడిలో కొంత వణుకు పుట్టిన మాట నిజం. కానీ అందమైన ముప్పై రెండేళ్ల వరకు వయసుండే జమీందారు వచ్చీరావడంతోనే స్నేహంగా పలకరించాడు. ఈ లోపల దొరసాని కూడా వచ్చింది. ఆమె ఇంకా అందగత్తె. కథకుడి బిడియం పోయేలా ఇద్దరూ మామూలుగా మాట్లాడసాగారు. ఆ గదిలో ఉన్న ఒక పెయింటింగ్, అది స్విట్జర్లాండ్‌లోని ఒక దృశ్యం, కథకుడిని ఆకర్షించింది. దానిమీద సరిగ్గా ఒక దానిమీద ఒకటి తగిలిన రెండు బుల్లెట్‌ గుర్తులున్నాయి. ‘మంచి షాట్‌’ అన్నాడు కథకుడు. ‘అవును, అసాధారణమైన షాట్‌’ అని బదులిచ్చాడు జమీందారు. అట్లా మాటల్లో ముప్పై అంగల దూరం నుంచి గురి తప్పకుండా కాల్చగలనని చెప్పాడు కథకుడు. నువ్వు కూడా అలా కాల్చగలవా డియర్, అని అడిగింది దొరసాని. ఏదో ఒక రోజు నేనూ కాల్చగలనన్నాడు జమీందారు. నాకు తెలిసిన ఒకతను ఉండేవాడు, గోడ మీద ఈగ కనబడితే పిస్టల్‌ తెమ్మని కేకేసేవాడు, ఢాం, అదీ అతడి గురి అని చెప్పాడు కథకుడు. ఎవరాయన? అడిగాడు జమీందారు. ‘సిల్వియో అని...’ ‘సిల్వియో!’ అరిచినంత పనిచేశాడు జమీందారు. దీంతో ఆ పాత కథంతా తవ్వుకోవాల్సి వస్తుంది.

జమీందారుకు పెళ్లయి నెలే అయిందప్పుడు. ఆరోజు కొత్త దంపతులు గుర్రపు స్వారీకి వెళ్లారు. దొరసాని గుర్రం ఆ రోజు మాట వినకపోతే ఆమె దిగి నడుచుకుంటూ వస్తానంది. జమీందారు ముందు ఇల్లు చేరాడు. వచ్చేసరికి సిల్వియో ఉన్నాడు. అతణ్ని చూడగానే జమీందారు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. బాకీ తీర్చమని అడిగాడు సిల్వియో. జమీందారు సిద్ధమయ్యాడు. భార్య వచ్చేలోగా కాల్చమని కోరాడు. మళ్లీ సిల్వియో సందేహపడ్డాడు. ఇలా కాల్చడం మర్డర్‌ చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని మళ్లీ చీటీలు వేశారు. ఈసారీ జమీందారుకే తొలి ఛాన్స్‌ వచ్చింది. మహాచెడ్డ అదృష్టవంతుడు. జమీందారు కాల్చిన షాట్‌ మిస్‌ అయి ఆ పెయింటింగుకు తగిలింది. ఇప్పుడు కాల్చడం సిల్వియో వంతు. పిస్టల్‌ గురి పెట్టాడు. అప్పుడే దొరసాని ఆ గదిలోకి వచ్చింది. కాల్చవద్దని సిల్వియో కాళ్లదగ్గర పడింది. ‘మాషా, ఇది నీకు సిగ్గుగా లేదూ!’ అని జమీందారు వారించాడు.

అదిగో, అప్పుడు సిల్వియో వదిలేసి వెళ్లాడు. వెళ్తూ, గురి కూడా చూడకుండా జమీందారు కాల్చిన పెయింటింగును అదే స్థానంలో కాల్చాడు. తనకు అంతకుముందు తెలిసినదానికి జమీందారు చెప్పినదానితో కలిపి కథకుడు కథ పూర్తి చేస్తాడు. 

తర్వాత చాలా ఏళ్లకు అలెగ్జాండర్‌ ఇప్సిలాంటి నేతృత్వంలోని తిరుగుబాటులో సిల్వియో పాల్గొని స్కౌలానా యుద్ధంలో మరణించినట్టు కథకుడికి తెలుస్తుంది.


(సాక్షి సాహిత్యం; 2018 జూలై 23)

Thursday, May 21, 2026

బ్రేకింగ్‌ ద పిగ్‌


ఎట్గార్‌ కెరెట్‌

ఎట్గార్‌ కెరెట్‌ హీబ్రూ కథ ‘బ్రేకింగ్‌ ద పిగ్‌’ సారం ఇది. కెరెట్‌ 1967లో ఇజ్రాయిల్‌లో జన్మించారు. కథలూ, గ్రాఫిక్‌ నవలలూ, సినిమాలూ, టీవీకి స్క్రిప్టులూ రాస్తారు.


పందిపిల్ల బాధపడిన రోజు


నాన్న, బార్ట్‌ సింప్సన్‌ బొమ్మ కొనడు. అమ్మ నిజానికి కొందామనే అంది. కానీ అలా కొనిస్తే చెడిపోతానట. ఎందుకు కొనాలసలు? వాడేదో ఏడుపు మొదలుపెట్టగానే నువ్వు ఠకీమని ఒప్పేసుకుంటావని అమ్మను కోప్పడ్డాడు కూడా. వాడికి డబ్బు విలువ తెలియట్లేదన్నాడు. చిన్నతనంలో కాక పొదుపు గురించి మరెప్పుడు నేర్చుకుంటాడన్నాడు. అడగ్గానే బార్ట్‌ సింప్సన్‌ బొమ్మ అతిసులభంగా పొందిన పిల్లలు పెద్దయ్యాక మొద్దులుగా తయారవుతారని ఆయన ఉద్దేశం. ఇలాంటివాళ్లే ఏటీఎం మిషన్ల నుంచి డబ్బులు ఎత్తుకెళ్లే బాపతుగా తయారవుతారట. అందువల్ల బార్ట్‌ సింప్సన్‌ బొమ్మ బదులుగా నాకు ఒక వికారమైన చైనా పంది బొమ్మ తెచ్చాడు. దాని వెనుక భాగంలో ఒక రంధ్రం ఉంది. ఇలా అయితే నేను మొద్దును కానన్నమాట!

ప్రతిరోజూ నేను కప్పు కోకో తాగాలి, అదంటే నాకు అసహ్యమైనప్పటికీ. తొక్కతో కోకో తాగితే ఒక షెకెల్‌(ఇజ్రాయిల్‌ నాణెం) ఇస్తారు. తొక్కలేనిదైతే అర షెకెల్‌. దాన్ని అట్లానే తీసి పారబోస్తే ఏమీ ఇవ్వరు! ఆ ఇచ్చిన నాణేల్ని పంది వెనకాలి రంధ్రంలో వేయాలి. ఆ బొమ్మను ఊపితే గలగలమని శబ్దం వస్తుంది. పంది ఎప్పుడైతే నిండుతుందో దాన్ని ఊపినప్పుడు గలగలమని శబ్దం రాదు. అప్పుడు స్కేట్‌బోర్డ్‌ మీద ఉన్న సింప్సన్‌ బొమ్మ కొంటాడు నాన్న. ఆ విధంగా నేను పొదుపు పాఠాలు నేర్చుకుంటున్నాను.

నిజానికి పంది బొమ్మ చూడముచ్చటగా ఉంది. దాని ముక్కును తాకితే చల్లగా ఉంటుంది. దాని వెనుక నాణేన్ని వేసినప్పుడల్లా అది నవ్వుతుంది. అర్ధనాణేన్ని వేసినా కూడా అలాగే నవ్వుతుంది. ఇంకో మంచి విషయమేమిటంటే, అసలు ఏ నాణేన్ని అందులో వేయకపోయినా కూడా అది అలాగే నవ్వుతుంది. నేను దానికి పెసాచ్సన్‌ అని పేరు పెట్టాను. ఈ పెసాచ్సన్‌ ఎవరంటే ఒకప్పుడు మేమున్న ఇంట్లో ఉండేవాడు. ఆయన పేరున్న లేబుల్‌ను మెయిల్‌ బాక్స్‌ మీదినుంచి ఎంత పీకేయడానికి నాన్న ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పెసాచ్సన్‌ మిగతా బొమ్మల మాదిరిగా ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. దాన్లో లైట్లూ, స్ప్రింగులూ, లీకయ్యే బ్యాటరీలూ లేవు. అయితే, అది టేబుల్‌ మీద నుండి కిందకు దూకకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అది నేలవైపు వంగి కిందకు చూసినప్పుడు, ‘జాగ్రత్త పెసాచ్సన్‌! నువ్వు పింగాణీ తయారీవి’ అని చెబుతాను. అప్పుడు అది నా వైపు చూసి నవ్వుతుంది. నేను నా చేతిలోకి తీసుకునేంత వరకూ ఓపిగ్గా వేచి ఉంటుంది. పెసాచ్సన్‌ నన్ను చూసి నవ్వితే నేను వెర్రెత్తిపోతాను. కేవలం ఆ నవ్వు కోసమే నేను ప్రతి ఉదయం నాకిష్టం లేకపోయినా తొక్కతో ఉన్న కోకో తాగుతాను. దాని వెనకాల వున్న రంధ్రంలో నాణేన్ని వేసి దాని నవ్వు ఇంతకూడా ఎందుకు మారదో చూస్తాను. తర్వాత, ‘ఐ లవ్యూ పెసాచ్సన్‌’ అని చెబుతాను. ‘నిజంగా చెబుతున్నాను, అమ్మానాన్న కన్నా కూడా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఏటీఎంలను పగలగొట్టినా సరే , ఎల్లప్పుడూ నిన్ను ఇలాగే ప్రేమిస్తాను. కానీ ఒకటి, టేబుల్‌ మీది నుంచి దూకాలని మాత్రం కనీసం ఆలోచన కూడా నీవు చేయొద్దు’.

నిన్న నాన్న వచ్చాడు. టేబుల్‌ మీదున్న పెసాచ్సన్‌ను పైకెత్తి కిందికీ మీదికీ గట్టిగా ఊపడం మొదలుపెట్టాడు. 

‘నాన్నా, జాగ్రత్త. నువ్వు పెసాచ్సన్‌కు కడుపునొప్పి తెప్పించేట్టున్నావు’ అన్నాను. కానీ నాన్న వినలేదు. ఇంకా అలాగే ఊపుతూ, ‘ఇందులోంచి శబ్దం రావడం లేదు. దీనర్థం నీకు తెలుసుకదా యోవి? నీకు రేపే స్కేట్‌బోర్డ్‌ మీదుండే సింప్సన్‌ బొమ్మ కొనిస్తాను’ చెప్పాడు నాన్న.

‘అద్భుతం నాన్నా. సింప్సన్‌ బొమ్మా? అద్భుతం. కానీ పెసాచ్సన్‌ను మాత్రం ఊపడం ఆపు. ప్లీజ్‌ దానికి నొప్పెడుతుంది’ అన్నాను. నాన్న పెసాచ్సన్‌ను తిరిగి టేబుల్‌ మీద పెట్టాడు. అమ్మ దగ్గరికి వెళ్లాడు. ఒక నిమిషం తర్వాత అమ్మను చేత్తో పట్టుకొని లాగినట్టుగా తోడ్కొని వచ్చాడు. ఇంకో చేతిలో సుత్తి వుంది. ‘చూశావా, నేనూహించినట్లుగానే జరిగింది’ చెప్పాడు నాన్న. ‘వస్తువుల విలువ ఏమిటో ఇప్పుడు వాడికి తెలుసు. కదా యువీ?’ ‘కచ్చితంగా తెలిసింది నాన్నా. అదిసరేగానీ సుత్తి ఎందుకు తెచ్చినట్టు?’ అని నేను అడిగాను. ‘నీ కోసమే’ అంటూ సుత్తిని నా చేతిలో పెట్టాడు. ‘జాగ్రత్త సుమా!’ అన్నాడు. ‘నేను జాగ్రత్తగానే ఉంటాను’ అన్నాను. నేను నిజంగానే జాగ్రత్తగా ఉన్నాను. కొన్ని నిమిషాలు వేచి చూశాక, నాన్న విసిగిపోయాడు. ‘కానివ్వురా, ఆ పందిని పగలగొట్టు’ అన్నాడు. ‘య్యేమిటీ?’ నేను అరిచాను, ‘పెసాచ్సన్‌ను పగలగొట్టాలా?’ ‘అవునవును, పెసాచ్సనే’ చెప్పాడు నాన్న, ‘కానీ, పగలగొట్టెయ్‌. నువ్వు చాలా కష్టపడ్డావు. బార్ట్‌ సింప్సన్‌ బొమ్మ కొనివ్వడానికి అర్హత సంపాదించావు’.

తన అంతిమ క్షణాలు వచ్చాయని తెలిసిపోయిన చైనా పందిలాగా పెసాచ్సన్‌ నావైపు చూసి దీనంగా నవ్వింది. సింప్సన్‌ బొమ్మ లేకపోతే పోయే! నేను నా ఫ్రెండు తల మీద సుత్తితో కొట్టడమా? ‘నాకు సింప్సన్‌ బొమ్మ వద్దు. ఈ పెసాచ్సన్‌ చాలు’ అని సుత్తిని నాన్నకు వెనక్కి ఇచ్చేశాను. ‘నీకు అర్థం కాలేదన్నమాట’ అన్నాడు నాన్న. ‘ఏం ఫర్లేదు. నన్ను చూసి నేర్చుకో. నీ కోసం నేనే పగలగొడతాను’. నాన్న అప్పటికే సుత్తిని పైకెత్తాడు. అమ్మ కళ్లు మూసుకుంది. పెసాచ్సన్‌ అలసిపోయినట్టుగా నవ్వుతున్నాడు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి. నేను ఏమీ చేయలేదంటే పెసాచ్సన్‌ చచ్చిపోయినట్టే! ‘నా...న్నా...’ అని గట్టిగా నాన్న కాళ్లను పట్టుకున్నాను. ‘ఏం, యువీ?’ అడిగాడు నాన్న. చేతిలోని సుత్తి ఇంకా గాల్లోనే లేచివుంది. ‘నాన్నా! నాకింకో షెకెల్‌ కావాలి, ప్లీజ్‌. రేపు కోకో తాగిన తర్వాత అందులో వేయడానికి. రేపు దాన్ని నేనే పగలగొడతాను, తప్పకుండా’ అన్నాను. ‘ఇంకో షెకెలా?’ నాన్న నవ్వుతూ సుత్తిని టేబుల్‌ మీద పెట్టాడు, ‘చూశావా? వాడిలో ఎంత అవగాహన పెరిగేట్టు చేశానో’. ‘రేపు’. అప్పటికే నా గొంతు పూడుకుపోయింది.

అందరూ గదిలోంచి బయటికి వెళ్లిన తరువాత పెసాచ్సన్‌ను గట్టిగా హత్తుకున్నాను. ఒక్కసారిగా బయటికి ఏడ్చాను. పెసాచ్సన్‌ ఏమీ మాట్లాడలేదు. నా చేతుల్లో నిశ్శబ్దంగా వణికింది. ‘బాధ పడకు’ తన చెవిలో గుసగుసగా చెప్పాను, ‘నేను నిన్ను కాపాడుతాను’.

రాత్రి నాన్న ముందుగదిలో టీవీ చూడటం ముగించి, నిద్రకు ఉపక్రమించే వరకూ వేచివున్నాను. నెమ్మదిగా మంచం మీదినుంచి లేచి, పెసాచ్సన్‌ను పట్టుకుని బయటికి వచ్చాను. చాలాసేపు మేమిద్దరమూ చీకట్లో నడిచాం. చివరకు ముళ్లపొదలున్న ఒక పొలాన్ని చేరుకున్నాం. ‘పందులకు ముళ్లపొదలున్న పొలాలంటే చాలా ఇష్టం’ అని పెసాచ్సన్‌ను నేల మీద పెడుతూ చెప్పాను, ‘నీకు ఇక్కడ నచ్చుతుంది’. జవాబు కోసం ఎదురుచూశానుగానీ పెసాచ్సన్‌ ఏమీ అనలేదు. దానికి గుడ్‌బై చెప్పడానికి ముక్కు మీద తాకినప్పుడు మాత్రం విషాదంగా చూసింది. మరి నన్ను మళ్లీ ఎప్పటికీ చూడలేనని తనకు తెలుసుకదా!

(సాక్షి సాహిత్యం; 2018 మార్చ్‌ 19)




 

Monday, May 18, 2026

మై ఈడిపస్‌ క్లాంప్లెక్స్‌



ఫ్రాంక్‌ ఓ కానర్‌

 

ఫ్రాంక్‌ ఓ కానర్‌(1903–1966) ఐరిష్‌ కథ ‘మై ఈడిపస్‌ క్లాంప్లెక్స్‌’ సారాంశం ఇది. ఐర్లాండ్‌కు చెందిన ఓ కానర్‌ సుప్రసిద్ధ కథకుడు, కవి. ‘గెస్ట్స్‌ ఆఫ్‌ ద నేషన్‌’, ‘బోన్స్‌ ఆఫ్‌ కంటెన్షన్‌’, ‘క్రాబ్‌ ఆపిల్‌ జెల్లీ’, ‘ట్రావెలర్స్‌ శాంపిల్స్‌’ ఆయన కథాసంకలనాల్లో కొన్ని.


నాన్న నా శత్రువు


తండ్రి యుద్ధంలో ఉన్నాడు. పిల్లాడు ఎప్పుడోగానీ తండ్రిని చూడలేదు. బూట్ల చప్పుడు చేస్తూ వచ్చే ఖాకీ దుస్తుల శాల్తీలాగే ఆయన జ్ఞాపకం. శాంతా క్లాజ్‌లాగా ఇలా ఇంటికి వచ్చి అలా మాయమయ్యేవాడు.

ఆ వచ్చినప్పుడు ఆయన అమ్మను దగ్గరికి తీసుకోవడం వాడికి అసౌకర్యంగా ఉండేది. ఆయన పొగతాగేవాడు. అంతకుమించిన పనిలేదన్నంత శ్రద్ధగా గడ్డం గీసుకునేవాడు. ఆయన పోయినప్పుడు వదలిపోయిన కత్తులు, బుల్లెట్‌ కేసుల లాంటి మిలిటరీ సామగ్రి అంతా బీరువా మీది పొడువైన పెట్టెలో ఉంచేది అమ్మ. ఆయనకు ఏదైనా అందుబాటులో ఉండాలి.

పిల్లాడు తొలి కిరణాలు పడేవేళకు నిద్ర లేచేవాడు. మంచం మీంచి రెండు కాళ్లను కింద పెట్టేవాడు. మిసెస్‌ లెఫ్ట్, మిసెస్‌ రైట్‌ అని వాటికి పేర్లు పెట్టుకున్నాడు. అమ్మ, పిల్లాడు ఆ రోజు ఏమేం చేయాలో అవి చర్చిస్తాయి– ఇంటిని ఎలా అలంకరించాలి, క్రిస్‌మస్‌కు శాంతా క్లాజ్‌ ఏ ఇంట్లో ఏ బహుమతి ఇవ్వాలి లాంటివి. ఒక్కోసారి పాప సంగతి కూడా. అక్కడ కొత్త పాప లేని ఇల్లు వీళ్లదొక్కటే. పాపంటే మళ్లీ పదిహేడు షిల్లింగుల ఆరు పెన్నీల ఖర్చు అవుతుంది, నాన్న యుద్ధం నుంచి తిరిగొచ్చేవరకూ అంత ఖర్చు భరించలేము అంటుంది అమ్మ. కానీ రోడ్డు పై వైపు ఉండే జీనీ వాళ్ల ఇంట్లో ఒక పాప ఉంది. అందరికీ తెలుసు వాళ్ల దగ్గర కచ్చితంగా 17/6 లేవు. అది చవక పాప అయివుండాలి, అమ్మకు మంచి పాప కావాలేమో. జీనీ వాళ్లలాంటి పాప అయినాకూడా బానేవుంటుందిగా!

బ్రేక్‌ఫాస్ట్‌ అయిన తర్వాత అమ్మ, వాడు టౌనులోకి వెళ్లారు. సెయింట్‌ ఆగస్టీన్‌ చర్చిలో ప్రార్థన చేశారు. నాన్నను యుద్ధం నుంచి క్షేమంగా ఇంటికి పంపమని దేవుణ్ని కోరుకుంది అమ్మ. 

ఒక ఉదయాన నాన్న రానేవచ్చాడు. అమ్మ ముఖం వెలిగిపోయింది. అంత సంబరపడాల్సింది ఏముందందులో? దేవుడు మన ప్రార్థనలు విన్నాడంది అమ్మ. ఇంకా అన్యాయం ఏమిటంటే, నాన్న ఏదో ఒకటి అమ్మతో మాట్లాడుతూనేవున్నాడు. వీడు వాళ్ల మాటలకు అడ్డు తగిలాడు. ‘లారీ, ఒక్క నిమిషం’ అంది అమ్మ. అనాసక్తి కలిగించే చుట్టుపక్కలవాళ్లు ఎవరైనా వచ్చినప్పుడు ఆమె ఇలా అంటుంది. అందుకే దానికి అంత ప్రాధాన్యత ఇవ్వక మళ్లీ ఏదో మాట్లాడబోయాడు. ‘లారీ, నిశ్శబ్దంగా ఉండు. నేను నాన్నతో మాట్లాడుతున్నా, నీకు వినబడట్లేదా?’

ఇదే మొదటిసారి వాడు ఇలాంటి ‘అశుభకరమైన మాటలు’ వినడం. ‘నాన్నతో మాట్లాడుతున్నా’. అయితే ఏమిటట! దేవుడు ఇలాగేనా ప్రార్థన విన్నది! అయితే ఆయన శ్రద్ధగా విన్నట్టు లేదు.

‘నాన్నతో ఎందుకు మాట్లాడుతున్నావు?’

‘నాన్నా నేనూ మాట్లాడాల్సిన విషయాలున్నాయి. మళ్లీ అడ్డుపడకు’.

మధ్యాహ్నం భార్య కోరిన మీదట వీడిని నడకకు తీసుకెళ్లాడు తండ్రి. నడక విషయంలో నాన్నకూ వాడికీ భేదాభిప్రాయాలున్నాయి. ట్రాములు, ఓడలు, గుర్రాలు ఇవేవీ ఆయనకు ఆసక్తి కలిగించవు. ఆయనంత వయసు వాళ్లు ఎదురైనప్పుడు మాత్రం మాట్లాడుతూ గోడకు చేరగిలబడతాడు. ఇక కదలడు. రెండోసారి అట్లా ఆగినప్పుడు పిల్లాడికి చిర్రెత్తుకొచ్చింది. కోటు, ప్యాంటు పట్టుకుని లాగాడు. కానీ నాన్నకు తిక్క రేగిందంటే, అమ్మలా కాదు, ‘లారీ, ఇలా విసిగించావనుకో, దెబ్బ పడుతుంది’ అన్నాడు. ఏడుపొచ్చినంత పనైంది. కానీ ఏడ్చినా ఆయన పట్టించుకుంటాడన్న నమ్మకం కలగలేదు. ఒక కొండరాయితో వాకింగ్‌ చేస్తున్నట్టే ఉంది.

ఇక సాయంత్రం టీ సమయంలో మళ్లీ ‘నాన్నతో మాట్లాడుతున్నా’ కార్యక్రమం మొదలవుతుంది. ఈవ్‌నింగ్‌ పేపర్‌ దాన్ని మరింత సంక్లిష్టం చేస్తుంది. పేపర్‌లో నాన్న కాసేపు తల పెడతాడు. దాన్ని కిందపెట్టి అందులోంచి ఏదో కొత్త విషయం అమ్మకు చెబుతాడు. ఇది కచ్చితంగా నాటకం. అమ్మ తలను తిప్పించుకోవడంలో వాడు నాన్నతో పోటీ పడగలడు. కానీ ఈ పేపర్‌వాళ్లు అందరూ ఆయనకు సహకరిస్తుంటే ఇంకేం చేయగలడు! అయినా విఫలయత్నం చేశాడు. ‘నాన్న పేపర్‌ చదువుతున్నప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి’ అంది అమ్మ అసహనంగా.

నిజంగానే అమ్మకు నాకన్నా కూడా ఆయనతో మాట్లాడటం ఎక్కువ ఇష్టం ఉండాలి, లేదా  నిజాన్ని ఒప్పుకోవడానికి భయం అయినా కావాలని తలపోశాడు వాడు. ఆ రాత్రి అడిగాడు. ‘అమ్మా, నేను దేవుణ్ని ప్రార్థిస్తే నాన్నను మళ్లీ యుద్ధానికి పంపుతాడా?’

‘పంపుతాడనుకోను’ నవ్వుతూ చెప్పింది అమ్మ.

‘ఎందుకమ్మా?’

‘ఎందుకంటే యుద్ధం లేదు కాబట్టి.’

‘కానీ ఆయన తలుచుకుంటే ఇంకో యుద్ధం సృష్టించలేడా?’

‘ఆయనకు ఇష్టం ఉండదు. అయినా యుద్ధాన్ని దేవుడు తేడు నాన్నా, చెడ్డ మనుషులు తెస్తారు’.

తెల్లారి వాడు నిద్ర లేచి, పెద్ద మంచం మీదికి వెళ్లాడు. అమ్మ పక్కలో ఖాళీ లేదు. మధ్యలో దూరాడు. నాన్న తన మంచం కన్నా ఎక్కువ ఆక్రమించుకున్నాడు. అందుకని వీడు కాళ్లతో తన్నాడు. నాన్న అటు జరిగి పడుకున్నాడు. వీడు నోట్లో వేలు వేసుకుని సౌకర్యంగా, ‘అమ్మా’ అని పిలవబోయాడు. ‘ష్, నాన్నను నిద్ర లేపకు’ గుసగుసగా చెప్పింది అమ్మ. ఇది కొత్త పరిణామం. ‘నాన్నతో మాట్లాడుతున్నా’ కన్నా ఇది మరింత ప్రమాదకరంగా కనబడింది.

‘ఎందుకు?’

‘పాపం నాన్న ఆలసిపోయాడు’

పాపం నాన్న. ఈ మాట అసలు నచ్చలేదు వాడికి. ఈ రోజు చేయాల్సిన ఎన్నో ఆలోచనలతో వచ్చాడు. ‘కొత్త వలతో చేపలు పట్టడానికి వెళ్లాలి’...

అమ్మ మాట్లాడకుమని చెబుతూనేవుంది. నాన్నకు మెలకువ వచ్చింది. అమ్మ చిత్రమైన గొంతుతో ‘టీ తాగుతారా?’ అంది. పిల్లాడు ఇంకేదో చెప్పబోయాడు. ‘నువ్వు పడుకో’ అంది అమ్మ.

ఇక లాభం లేదు. అమ్మకు తాను దూరమవుతున్నాడు. ఇంతకుముందు తనకు విడి మంచం వేసినప్పడు, ఒక్క మంచం మీద పడుకునేదానికి వేరేది ఎందుకని అడిగితేనేమో, అది ఆరోగ్యకరం అని చెప్పింది. అలాంటిది ఈ కొత్త మనిషి వచ్చి అమ్మ ఆరోగ్యం పట్ల ఏ పట్టింపు లేకుండా ఇక్కడే పడుకుంటున్నాడు. కానీ అమ్మేమో అదో విషయంగా పట్టించుకోకపోగా, తననే మాట్లాడొద్దని చెబుతోంది. ఏమంటే, పాపం నాన్న ఆలసిపోయాడు. ఏమంటే, ఆయన బయటికి వెళ్లి డబ్బులు సంపాదించాలి. ఏమంటే, అలా సంపాదించకపోతే మనకు తినడానికి ఏమీవుండదు. అలా ఏమీలేకపోతే అడుక్కుతినాలి.

కానీ ఇదేం బాగోలేదు. తన ప్రాధాన్యత తగ్గిపోయింది. అమ్మతో తన ఉషోదయపు చర్చలు ఆగిపోయినై. ఈ అన్యాయాన్ని సహించడానికి వీలు లేదు. మంచంలో అటూయిటూ కదిలాడు. కాళ్లూ చేతులూ గట్టిగా విదిలించాడు. నాన్న నిద్ర లేవనే లేచాడు. ‘ఈ పిల్ల రాకాసి నిద్రే పోడా?’ అన్నాడాయన లేస్తూ. ‘అది వాడికి అలవాటు... చూశావా లారీ, నువ్వు నాన్నను లేపావు, వెళ్లు నీ మంచం మీదికి’ అరిచింది అమ్మ. ‘అయితే ఆ అలవాటును వదిలించాలి’ అన్నాడాయన.

‘నోర్మూసుకో’ అన్నాడు వీడు.

ఒక్క ఉదుటున మంచం మీంచి లేస్తూ, ‘ఏమన్నావురా పిల్లకాకి’ అన్నాడాయన.

‘మిక్‌ మిక్‌’ సముదాయించింది భార్య. ‘వాడికి నువ్వింకా అలవాటు కాలేదు’.

‘దెబ్బ పడితేగానీ అర్థం కాదు, చెడ్డీ పగలాలి’ అన్నాడాయన.

‘నువ్వే కొట్టుకో’

ఆయన సహనం కోల్పోయి ఒక దెబ్బ వేశాడు. అదేమీ గట్టిగా కొట్టిన దెబ్బ కాదు, అలా వేశాడంతే. కానీ వాడి గౌరవం మంట గలిసింది. ఆ క్షణం నుంచీ తండ్రీ కొడుకులిద్దరూ శత్రువులుగా మిగిలిపోయారు. 

తల్లీతండ్రీ మాట్లాడుకుంటున్నప్పుడు వీడు తన బొమ్మలతో ఆడుకునేవాడు, వాళ్లను పట్టించుకోనట్టుగా. వాడికి అర్థం కానిదేమిటంటే, అమ్మను ఆయనవైపు అంత ఆకర్షితురాలిని చేస్తున్న అంశం ఏమిటి? మొత్తం అంతా ఆ న్యూస్‌పేపర్లోనే ఉందా? అందుకని వాడు కూడా కూడబలుక్కుని అమ్మకు చదివి వినిపించడానికి ప్రయత్నించేవాడు. చివరికి ఒకరోజు అన్నాడు, ‘అమ్మ, నేను పెద్దయ్యాక ఏం చేస్తానో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకుంటా’. ఆమె నవ్వింది. తండ్రి ఓసారి తల తిప్పి చూశాడుగానీ పట్టించుకోలేదు. అది నటన అనుకున్నాడు వాడు. ‘మనకు చాలామంది పాపలు వస్తారు’ అని కొనసాగించాడు.

‘అది సరేగానీ ముందైతే మనకో పాప వస్తుంది. నీతో ఆడుకుంటుంది’ చెప్పింది అమ్మ.

ఇక ఆమె పూర్తిగా ఇంటిపట్టునే ఉండటం మొదలైంది. వాడిని నడకకు తీసుకెళ్లడం మానేసింది.  తండ్రి ఎక్కడ 17/6 సంపాదిస్తున్నాడో. సాయంత్రాలు ఇంట్లో కనబడేవాడు కాదు.

ఎట్టకేలకు ఇంట్లోకి సానీ వచ్చాడు. వీడింకా ఘోరం. ఎప్పుడూ ఏడుస్తాడు. ఎప్పుడూ పడుకునే వుంటాడు. అమ్మ వెన్నంటే ఉండాలి. వాడు నిద్రలేవకూడదంటే మునిగాళ్ల మీద నడవాలి. వాణ్ని ఊయల ఊపాలి. ‘పాపం నాన్నను నిద్ర లేపొద్దు’ అనేది పోయి, ‘సానీని లేపొద్దు’ అనేది ఇంట్లో మాటైపోయింది. 

ఒకరోజు లారీ పక్కన ఎవరో పడుకున్నట్టు అనిపించింది. ముందు అమ్మ అనుకున్నాడు, కానీ నాన్న. అమ్మ మొత్తం శ్రద్ధ ఇప్పుడు సానీ మీదే. వాడు ఏడుస్తుంటే ఊరడిస్తోంది. అందుకే నాన్న ఇటు వచ్చాడు. తండ్రి మీద వాడికి జాలేసింది. ఇది వాడికి అనుభవమే కదా! తండ్రిని ఓదార్చుతున్నట్టుగా ఆయన చేతిని తన మీద వేసుకున్నాడు.

(సాక్షి సాహిత్యం; 2018 జూన్‌ 4)

Friday, May 15, 2026

ఖోల్‌ దో

 


సాదత్‌ హసన్‌ మంటో

సాదత్‌ హసన్‌ మంటో(1912–55) ఉర్దూ కథ ‘ఖోల్‌ దో’ అనువాదం ఇది. 20వ శతాబ్దపు అత్యుత్తమ ఉర్దూ రచయితల్లో ఒకడిగా పేరొందిన మంటో అవిభాజ్య భారత్‌లో జన్మించి, తన 42వ యేట పాకిస్తాన్‌లో మరణించాడు. దేశవిభజన సమయంలో జరిగిన మానవ హననం ప్రపంచ చరిత్రలోనే అత్యంత పాపపంకిళమైన ఘట్టం. ఆ నేపథ్యంలోనేగాక, చీకటి జీవితాలను గురించి తీవ్రమైన స్వరంతో కథలు రాశాడు మంటో. ఏ మతాన్నీ వెనకేసుకు రాకపోవడం ఈ కథలోని గొప్పదనం.


చావు మళ్లీ చచ్చినప్పుడు...


అమృత్‌సర్‌ నుంచి మధ్యాహ్నం రెండింటికి బయలుదేరిన ప్రత్యేక రైలు ఎనిమిది గంటల తర్వాత ముఘల్‌పురా చేరుకుంది. దారిలో చాలామంది చనిపోయారు, ఎందరో గాయపడ్డారు, ఇంకొంతమంది ఎటో చెల్లాచెదురయ్యారు.

పొద్దున పదింటికి క్యాంపులోని చల్లటి నేల మీద సిరాజుద్దీన్‌ కళ్లు తెరిచేప్పటికి నలువైపులా పోటెత్తుతున్న సముద్రంలా మగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లలు కనబడేసరికి అతడి ఆలోచనాశక్తి మరింత మందగించింది. అతడు ఆలాగే చీకటిగావున్న ఆకాశం వంక చూస్తూవున్నాడు. అంతటి కల్లోలం కూడా వినబడనంతగా వృద్ధుడైన సిరాజుద్దీన్‌ చెవులు మూసుకుపోయినై. ఎవరైనా చూస్తే అతడు దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిలువెల్లా స్తబ్ధత అతడిని ఆవరించింది. అతడి అస్తిత్వం మొత్తం శూన్యంలో వేలాడుతోంది.

దట్టంగా ఉన్న ఆకాశం వైపే చూస్తున్న సిరాజుద్దీన్‌ చూపు సూర్యుడిని ఢీకొట్టడంతో ఆ తీవ్రమైన కాంతికి అతడి నరనరమూ కదలడంతో మేల్కొన్నాడు. అతడి మస్తిష్కంలో దృశ్య పరంపర కదలాడింది– దోపిడి, మంటలు, తొక్కిసలాట, స్టేషన్, బుల్లెట్లు, రాత్రి, సకీనా... సిరాజుద్దీన్‌ ఒక్కసారిగా లేచి నిలబడి నలుదిశల్లోని జనప్రవాహాన్ని పిచ్చివాడిలా తేరిపారా చూశాడు.

మూడు గంటల పాటు ‘సకీనా, సకీనా’ అంటూ క్యాంపు మొత్తం గాలించినా అతడి ఒక్కగానొక్క కౌమార కూతురి జాడ దొరకలేదు. ఆ ప్రదేశమంతటా చెవులు చిల్లులుపడేలా శబ్దాలు. ఒకరు, వాళ్ల పిల్లాడి కోసం వెతుకుతున్నారు, మరొకరు భార్య కోసం, ఇంకొకరు కుమార్తె కోసం. సిరాజుద్దీన్‌ అలసిపోయి ఒకచోట కూలబడి, సకీనా ఎప్పుడు, ఎలా తనతో విడిపడిందో గుర్తు చేసుకోవడం కోసం మెదడు మీద ఒత్తిడి పెట్టాడు. కానీ అతడి ప్రతి ఆలోచనా చివరకు పేగులు బయటికొచ్చేట్టుగా నరకబడిన భార్య శవం దగ్గర అంతం కాసాగింది.

సకీనా వాళ్లమ్మ చచ్చిపోయింది. ఆమె సిరాజుద్దీన్‌ కళ్లముందే తుదిశ్వాస విడిచింది. కానీ సకీనా ఎక్కడ? ఆమె చనిపోతూ, ‘నన్ను వదిలెయ్, త్వరగా సకీనాను తీసుకొని ఇక్కణ్నుంచి పారిపో’ అని చెప్పింది.

సకీనా అతడి వెంటే ఉండింది. ఇద్దరూ చెప్పుల్లేని కాళ్లతో పరుగెత్తారు. ఆమె దుపట్టా కింద పడిపోయింది. అతడు ఆగి దాన్ని తీసుకోబోతుంటే, ‘అబ్బాజీ, వదిలెయ్‌’ అని సకీనా అరిచింది. అప్పటికే అతడు దాన్ని తీసేసుకున్నాడు. దాని గురించే ఆలోచిస్తూ తన ఉబ్బెత్తుగా ఉన్న కోటు జేబువైపు చూపు సారించాడు. జేబులో చేయి పెట్టి అందులోంచి ఒక బట్టను బయటికి తీశాడు. అది సకీనా దుపట్టా. కానీ సకీనా ఎక్కడుంది?

సిరాజుద్దీన్‌ ఎంత ఆలోచించినా ఫలితం లేకపోయింది. సకీనాను వెంటబెట్టుకొని అతడు స్టేషన్‌ దాకా వచ్చాడా? ఆమె తన వెంటే రైల్లో ప్రయాణించిందా? దారిలో అల్లరిమూకలు

బండిని ఆపించి లోపలికి జొరబడినప్పుడు తాను స్పృహలోనే ఉన్నాడా? అప్పుడుగానీ వాళ్లు ఆమెను ఎత్తుకెళ్లారా?

సిరాజుద్దీన్‌ లోపల ప్రశ్నల మీద ప్రశ్నలు, కానీ ఏ ఒక్కదానికీ జవాబు లేదు. అతడు సానుభూతి కోరుకున్నాడు, కానీ తన చుట్టుపక్కల ఉన్నవాళ్లందరికీ అదే కావాలి. అతడికి ఏడవాలనిపించింది, కానీ కళ్లు సహకరించలేదు. కన్నీళ్లు ఎప్పుడు ఇంకిపోయినాయో!

ఆరు రోజుల తర్వాత, కొంచెం కోలుకున్నాక, సిరాజుద్దీన్‌ తనకు సాయపడటానికి సిద్ధంగా ఉన్న మనుషులను కలుసుకున్నాడు. మొత్తం ఎనమండుగురు యువకులు. వాళ్ల చేతుల్లో లాఠీలు, ఆయుధాలు ఉన్నాయి. సిరాజుద్దీన్‌ వాళ్లకు శుభవచనాలు పలికి, సకీనా రూపురేఖలు వివరించాడు. ‘ఆమెది ఎర్రటి రంగు, అందంగా ఉంటుంది... నాలాగా కాదు, వాళ్లమ్మను పోలింది... పదిహేడేళ్లు వస్తాయి... కళ్లు పెద్దవి... నల్లటి వెంట్రుకలు, కుడి చెంప మీద పెద్ద పుట్టుమచ్చ. ఆమె నా ఒక్కగానొక్క బిడ్డ. దయచేసి వెతికిపెట్టండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు’.

స్వచ్ఛంద సేవకులైన ఆ నవయువకులు ఆవేశంతో, ‘ఒకవేళ మీ కూతురుగానీ బతికివుంటే కొద్ది రోజుల్లోనే మీ దగ్గర ఉంటుం’దని వృద్ధుడైన సిరాజుద్దీన్‌కు అభయం ఇచ్చారు. ఎనిమిదిమంది యువకులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రాణాలకు తెగించి వాళ్లు అమృత్‌సర్‌ వెళ్లారు. ఎంతోమంది ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలను కాపాడి వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కానీ పదిరోజులైనా సకీనా జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు.

ఒకరోజు ఇదే పనిమీద వాళ్లు లారీలో అమృత్‌సర్‌ వెళ్తుండగా ఛహ్‌రరా దగ్గర రోడ్డు మీద ఒకమ్మాయి భారంగా నడుస్తూ కనబడింది. లారీ శబ్దం వినగానే అమ్మాయి భీతిల్లి పరుగెత్తడం మొదలుపెట్టింది. స్వచ్ఛంద సేవకులు బండిని ఆపించి ఆమె వెంటబడి పరుగెత్తారు. ఒక పొలంలో ఆమెను దొరికించుకున్నారు. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. కుడిచెంప మీద పెద్ద పుట్టుమచ్చ. ఒక యువకుడు ఆమెను భయపడొద్దని చెప్పి, ‘నీ పేరు సకీనానా?’ అని అడిగాడు.

ఆమె ముఖం పాలిపోయింది. ఏమీ మాట్లాడలేదు. కానీ యువకులు నమ్మకం కలిగించాక ఆమె భయంపోయింది. సిరాజుద్దీన్‌ కూతురు ఈమేనని వాళ్లకు అర్థమైంది.

ఆ యువకులందరూ ఆమెకు సాంత్వన కలిగించేందుకు ప్రయత్నించారు. ఆమెకు తినబెట్టారు, తాగడానికి పాలు ఇచ్చారు, ఆమె లారీలోకి ఎక్కడానికి సాయం చేశారు. దుపట్టా లేని కారణంగా ఆమె ఇబ్బందిగా తన ఛాతీని చేతులతో కప్పుకోవడానికి విఫలయత్నం చేస్తుండటం చూసిన ఒక యువకుడు తన కోటు విప్పి ఇచ్చాడు.

సకీనా గురించిన వార్త ఏమీ తెలియకుండానే సిరాజుద్దీన్‌ చాలా రోజులు గడిపాడు. బిడ్డను  జాడ తీయడానికి క్యాంపుల చుట్టూ, అధికారుల చుట్టూ నిష్ఫలంగా తిరుగుతూనే ఉన్నాడు. 

నీ కూతురు గనక బతికివుంటే కొద్ది రోజుల్లోనే వెతికి తెస్తామని అభయమిచ్చిన స్వచ్ఛంద సేవకుల క్షేమం కోసం అతడు రాత్రుళ్లు దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాడు.

ఒకరోజు ఆ స్వచ్ఛంద సేవకులను అతడు క్యాంపు దగ్గర చూశాడు. వాళ్లు లారీలో కూర్చునివున్నారు. లారీ అంతలో కదులుతుండటంతో సిరాజుద్దీన్‌ పరుగెత్తి, ‘‘నాయనా, సకీనా కనబడిందా?’’ అని అడిగాడు.

‘‘మేము కనిపెడతాం, కనిపెడతాం’’ అని ముక్తకంఠంతో వాళ్లు జవాబిచ్చారు. లారీ వెళ్లిపోయింది.

తన హృదయ భారం తొలగించిన ఆ యువకుల విజయం కోసం సిరాజుద్దీన్‌ మళ్లీ ప్రార్థించాడు.

ఆ సాయంత్రం అతడు కూర్చున్న చోటుకు దగ్గరే ఏదో గడబిడ వినబడింది. నలుగురు మనుషులు ఏదో మోసుకుని వస్తున్నారు. వాకబు చేస్తే ఎవరో అమ్మాయి రైలు పట్టాల దగ్గర స్పృహ లేకుండా పడివుంటే మోసుకొస్తున్నారని తెలిసింది. సిరాజుద్దీన్‌ వాళ్లనే అనుసరించాడు. ఆసుపత్రి సిబ్బందికి ఆమెను అప్పగించి వాళ్లు మరలిపోయారు.

కొద్దిసేపు అతడు అక్కడే ఆసుపత్రి బయట ఉన్న గుంజకు ఆనుకొని నిలబడ్డాడు. నెమ్మదిగా లోపలికి నడిచాడు. గదిలో ఎవరూ లేరు. ఆ శవాన్ని పడుకోబెట్టిన స్ట్రెచర్‌ తప్ప ఇంకేమీ కనబడలేదు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ సిరాజుద్దీన్‌ శవం వైపే నడిచాడు. గదిలోకి ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలుగు వచ్చింది. చనిపోయిన అమ్మాయి తెల్లటి ముఖం మీద తళుక్కుమన్న పుట్టుమచ్చను చూడగానే ‘‘సకీనా’’ అని అరిచాడు సిరాజుద్దీన్‌.

లైటు వేసిన డాక్టర్‌ ‘‘ఏమైంది?’’ అని ప్రశ్నించాడు.

‘‘నే... సర్, నేను ఆమె బాపు’’ సిరాజుద్దీన్‌ గొంతులోంచి మాటలు గరగరా వచ్చాయి.

మృతదేహపు నాడీని పరీక్షిస్తూనే, సిరాజుద్దీన్‌కు కిటికీని చూపిస్తూ, ‘‘తెరువు’’ అన్నాడు డాక్టర్‌.

స్ట్రెచర్‌ మీద ఉన్న శవం భయంతో కంపించింది, నిర్జీవమైన చేతులతోనే బొందులు విప్పి  షల్వార్‌ను కిందకు జార్చింది.

‘‘బతికేవుంది, నా బిడ్డ బతికేవుంది!’’ అంటూ ముసలి సిరాజుద్దీన్‌ ఆనందంతో కేకలు వేశాడు.

డాక్టర్‌ ఒళ్లు అపాదమస్తకం చెమటతో చల్లబడింది.


(సాక్షి సాహిత్యం; 2018 అక్టోబర్‌ 1)

Tuesday, December 3, 2024

ద సన్‌ ఫ్రమ్‌ అమెరికా



Isaac Bashevis Singer

 

నోబెల్‌ పురస్కారం పొందిన ఐజక్‌ బషేవిస్‌ సింగర్‌ కథ ‘ద సన్‌ ఫ్రమ్‌ అమెరికా’కు సంక్షిప్త రూపం. 1973లో ద న్యూయార్కర్‌ పత్రికలో ఈ కథ తొలిసారి ప్రచురితమైంది. ఇందులో పరుచుకునే ఉండే శాంతి నాకు బాగా నచ్చింది. దీన్ని కె.బి.గోపాలం గారు కూడా ‘అమెరికా కొడుకు’ పేరుతో తెలుగులోకి అనువదించారు.

–––––––

ద సన్‌ ఫ్రమ్‌ అమెరికా


అదొక చిన్న పల్లె. పేరు లెంట్షిన్‌. దాన్నిండా గుడిసెలు, పూరిపాకలు. మధ్యనే పొలాలు. అందులో కూరగాయలు పండిస్తారు. మేకలు పెంచుతారు.

ఒక చిన్న గుడిసెలో బెర్ల్‌ ఉంటాడు. ఆయన వయసు ఎనబై దాటింది. రష్యా నుండి తరిమివేయబడి పోలండ్‌కు వచ్చి స్థిరపడిన యూదు కుటుంబాల్లో వీరిదీ ఒకటి. బెర్ల్‌ పొట్టివాడు. గడ్డం తెల్లబడింది. ఏ కాలమైనా తలమీద గొర్రెచర్మం టోపీ పెట్టుకుంటాడు. ఆయనకో అర ఎకరం పొలం ఉంది. ఆవు, మేక, కొన్ని కోళ్లు కూడా ఉన్నాయి.

బెర్ల్‌ భార్య బెర్ల్‌చా. ఆమె ముఖం క్యాబేజీ ఆకులాగా ముడతలు పడివుంటుంది. సగం చెవుడు. ప్రతీ మాటను రెండుసార్లు చెప్పాలి.

బెర్ల్‌ దంపతులకు ఒక కొడుకు. పేరు శామ్యూల్‌. నలబై ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లాడు. అక్కడ లక్షలు సంపాదించాడని ఊళ్లో చెప్పుకుంటారు. పోస్ట్‌మాన్‌ బెర్ల్‌ ఇంటికి అప్పుడప్పుడు మనీయార్డర్, ఉత్తరం తెచ్చిస్తుంటాడు. ఆ ఉత్తరంలో చాలా మాటలు ఇంగ్లీషులో ఉంటాయి, కనుక ఎవరూ దాన్ని చదవలేరు.

శామ్యూల్‌ పంపించిన డబ్బును తండ్రి ఎక్కడ పెట్టాడన్నది ఎవరికీ పట్టదు. ఆ గుడిసెలోనే బల్ల, మాంసం అర, పాలవస్తువుల షెల్ఫ్, రెండు మంచాలు, మట్టి పొయ్యి ఉంటాయి. బయట చలిగా ఉంటే కోళ్లు పొయ్యి పక్కనే చేరతాయి. ఊళ్లో కలిగినవాళ్ల ఇంట్లో కిరోసిన్‌ దీపాలు ఉన్నాయి. బెర్ల్‌ వాళ్లకు కొత్త వస్తువులంటే నమ్మకం లేదు. సబ్బత్‌కు మాత్రం బెర్ల్‌చా కొవ్వొత్తులు కొంటుంది. 

దంపతులు సూర్యోదయంతో నిద్ర లేస్తారు. కోళ్లతో పాటు నిద్రకు ఉపక్రమిస్తారు. ఒక ఆవు దూడను ఈనింది, ఒక యువ జంటకు పెళ్లయింది లాంటి సంగతులు తప్ప లెంట్షిన్‌లో మరేమీ జరగవు.

శామ్యూల్‌కు కొడుకులు, కూతుళ్లు ఉన్నారు. వాళ్ల పేర్లన్నీ చిత్రంగా ఉంటాయి. అందుకే ముసలి దంపతులకు గుర్తుండవు. పేర్లలో ఏముంది? అమెరికా సముద్రానికి అటువైపు ఉంటుందట. అది ప్రపంచం అవతలి అంచు. ఊరికి వచ్చిన ఒక తాల్మూడ్‌ టీచర్, అమెరికా వాళ్లు బుర్ర నేలకు, కాళ్లు పైకి పెట్టి నడుస్తారని చెప్పాడు. అదెట్లా కుదురుతుంది? చెప్పింది టీచర్‌ కనుక అది నిజమే అయివుండాలి.

ఒక శుక్రవారం ఉదయాన బెర్ల్‌చా సబ్బత్‌ రొట్టెల కొరకు పిండి పిసుకుతోంది. అప్పుడు తలుపు తీసుకుని ఒక పెద్దమనిషి లోపలికి వచ్చాడు. పొడుగ్గా ఉన్నందున వంగి రావలసి వచ్చింది. వెంట వచ్చిన బండి మనిషి రెండు తోలు సూట్‌కేసులు తెచ్చాడు. బెల్‌చా ఆశ్చర్యంగా కళ్లెత్తింది. బండిమనిషికి అతను వెండి రూబుల్‌ అందిస్తూ, ఇద్దిష్‌లో ‘ఇక నువ్వు వెళ్లొచ్చు’ అన్నాడు. తర్వాత, ‘అమ్మా’ అని పిలిచాడు. ‘నేను శామ్యూల్‌ని. శాన్‌’. బెల్‌చా కాళ్లు మొద్దుబారాయి. పెద్దమనిషి ఆమెను కౌగిలించుకున్నాడు. నుదుటిని ముద్దాడాడు. బెల్‌చా కోడిపెట్టలాగా కిచకిచలాడింది. ‘మా బాబే’ అంది.

అప్పుడే బెర్ల్‌ కొట్టం నుండి లోపలికి వచ్చాడు. ఆయన చేతుల నిండా కట్టెలున్నాయి. వెంట మేక కూడా ఉంది. పెద్దమనిషిని చూసి బెర్ల్‌ కట్టెలు కింద పడేశాడు. ఆ పెద్దమనిషి బెల్‌చాను వదిలి బెర్ల్‌ను వాటేసుకున్నాడు. ‘నాన్నా!’ బెర్ల్‌కు నోటమాట రాలేదు. కాసేపటికి ‘నువ్వు శామ్యూల్‌వా?’ అని అడిగాడు. ‘అవును నాన్నా. నేను శామ్యూల్‌ని’. ‘చల్లగా బతుకు నాయనా’ అని కొడుకు చెయ్యి పట్టుకున్నాడు. అప్పటికీ ఆయనకు నమ్మకం కుదరడం లేదు. శామ్యూల్‌ ఈ మనిషంత పెద్దగా లేడు. అయితే అబ్బాయి అమెరికా వెళ్లినప్పుడు అతడి వయసు పదిహేనేళ్లని గుర్తొచ్చింది. ‘నువ్వొస్తున్నట్టు మాకు చెప్పనేలేదు’ అన్నాడు బెర్ల్‌.

‘నా కేబుల్‌ మీకు అందలేదా?’ అడిగాడు శామ్యూల్‌. అదేమిటో బెర్ల్‌కు అర్థంకాలేదు.

‘ఇదంతా చూసేవరకు నేను బతుకుతానని అనుకోలేదు. ఇప్పుడిక ఆనందంగా చస్తాను’ అన్నది బెర్ల్‌చా.

బెర్ల్‌ ఆశ్చర్యపోయాడు. సరిగ్గా ఈ మాటలే తానూ అనబోయాడు.

కాసేపైన తర్వాత బెర్ల్‌ ‘పేశ్చా, నువ్వు సబ్బత్‌ కొరకు మామూలు పులుసుతో పాటు మంచి డబుల్‌ ఫుడింగ్‌ కూడా చేయాలి సుమా’ అన్నాడు. బెర్ల్‌ తన భార్యను సొంతపేరుతో పిలిచి కొన్నేళ్లయి వుంటుంది. ఆమె కళ్ల నుంచి పసుపు నీళ్లు కారాయి. దృశ్యం అలుక్కుపోయింది. ‘ఇవ్వాళ శుక్రవారం. నేను సబ్బత్‌ కోసం తయారీలు చేయాలి’ అంది. ఆమె మళ్లీ రొట్టెల కోసం పిండి పిసకవలసివుంది. మరి ఇలాంటి చుట్టం వస్తే మరింత మంచి పులుసు కాయవలసి ఉంటుంది! మొదలే చలిరోజులు. చీకటి పడేలోగా పని జరగాలి.

అమెరికా నుంచి బెర్ల్‌ కొడుకు వచ్చాడన్న శుభవార్త ఇరుగుపొరుగుకు తెలిసింది. పలకరించడానికి వచ్చారు. గది నిండా మనుషులే. ఆడవాళ్లు బెర్ల్‌చాకు పనిలో సాయం పట్టారు. ఆమె కొవ్వొత్తులు ముట్టించింది. అప్పుడిక తండ్రి, కొడుకు వీధి అవతల ఉన్న చిన్న సినగాగ్‌కు బయల్దేరారు. కొడుకు పెద్ద అంగలుగా నడుస్తున్నాడు. ‘నెమ్మదిరా’ అంటూ బెర్ల్‌ హెచ్చరించాడు. ఊరంతా మంచు కప్పుకుని వుంది. కిటికీల్లోంచి కొవ్వొత్తుల వెలుగు కనిపిస్తోంది. ‘ఇక్కడ ఏమీ మారలేదు’ అన్నాడు శామ్యూల్‌.

వచ్చేసరికి బెర్ల్‌చా బియ్యంతో చికెన్‌ పులుసు చేసింది. చేపకూర వండింది. మాంసం, క్యారెట్‌ పులుసు సిద్ధం చేసింది. కుటుంబం కలిసి తాగారు, తిన్నారు. నిశ్శబ్దంలో చిమ్మెటల రొద వినబడుతోంది.

చివరి ప్రార్థన తర్వాత అడిగాడు శామ్యూల్‌: ‘నాన్నా, నేను పంపిన డబ్బంతా ఏం చేశావు?’

బెర్ల్‌ తన తెల్లటి కనుబొమ్మలను ఎగరేస్తూ, ‘ఇక్కడే వుంది’ అన్నాడు.

‘బ్యాంకులో వేయలేదా?’

‘లెంట్షిన్‌లో బ్యాంకు లేదు.’

‘మరి డబ్బులు ఎక్కడున్నాయి?’

బెర్ల్‌ తటపటాయించాడు. సబ్బత్‌లో డబ్బు తాకడం తప్పు. అయినా చూపిస్తానంటూ మంచం కిందకు వంగి బరువైనదేదో బయటికి లాగాడు. ఒక బూట్‌. దాంట్లో పైన గడ్డి కుక్కివుంది. అది తీసేశాడు. నిండా బంగారు నాణేలు!

‘నాన్నా బోలెడు సొమ్ము!’ 

‘సరే’

‘ఎందుకు ఖర్చు పెట్టలేదు?’

‘దేనికని? దేవుడి దయ. మాకు అన్నీ ఉన్నాయి.’

‘ఎక్కడికన్నా వెళ్లివుండవచ్చు కదా!’

‘ఎక్కడికి? ఇదే మన ఇల్లు’.

‘డబ్బు ఏమవుతుంది మరి?’

‘నువ్వే పట్టుకుపో.’

బెర్ల్‌ దంపతులకు నెమ్మదిగా కొడుకు అమెరికన్‌ యిద్దిష్‌ అలవాటవుతోంది. బెర్ల్‌చా కొడుకు మాటలు బాగా పోల్చుకుంటున్నది. ‘మనం ఇక్కడ ఒక పెద్ద సినగాగ్‌ కట్టొచ్చు’ అన్నాడతను. ‘ఉన్న సినగాగ్‌ పెద్దదే’ జవాబిచ్చాడు బెర్ల్‌.

‘ముసలివాళ్ల కొరకు ఒక ఇల్లు కడితే?’

‘ఎవరూ వీధుల్లో పడుకోవడం లేదు.’

మరుసటి రోజు సబ్బత్‌ భోజనం తర్వాత బెర్ల్‌ దంపతులు కాసేపు నడుం వాల్చారు. మేక కూడా కునికిపాట్లు పడుతున్నది. కొడుకు కోటు వేసుకుని, టోపీ పెట్టుకుని నడకకు బయల్దేరాడు. కోటు జేబులో చెక్‌బుక్, రుణపత్రాలు చేతికి తగిలాయి. అతడు ఏవో పెద్ద పథకాలు వేసుకుని వచ్చాడు. అమ్మానాన్నలకు సూట్‌కేస్‌ నిండా బహుమతులు తెచ్చాడు. ఊరివాళ్లకు ఏదైనా సాయం చేయాలనివుంది. న్యూయార్క్‌లోని లెంట్షిన్‌ సొసైటీ నుండి కూడా డబ్బు తెచ్చాడు. కానీ ఈ ఊరికి ఏదీ అవసరం లేదు. దూరంగా సినగాగ్‌లో ప్రార్థనలు వినబడుతున్నాయి. 


(సాక్షి సాహిత్యం; 2018 జనవరి 1)