Saturday, May 2, 2020

వచన కళా లోలుడు


ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి సాహిత్యం పేజీ వివిధలో ఏప్రిల్ 27, 2020న అచ్చయింది. కాకుమాని శ్రీనివాసరావు రాశారు. ఒక వ్యక్తి సాహిత్యాన్ని అంచనాగడుతూ వివిధలో వ్యాసం రావడమంటే అతడి కెరియర్లో ఒక బ్లాక్ బస్టర్ పడినట్టు:-)

దీన్ని ముందు ఎఫ్బీలో పంచుకున్నప్పుడు రాసిన కృతజ్ఞతా నోట్ ఇక్కడ:
దీన్ని షేర్ చేయడానికి ముందు నాలుగు మాటలేవో చెబుదామనుకున్నాను. కానీ ఇంకో తలంలో ఆలోచిస్తే అవన్నీ ఉత్త బోలు మాటల్లా తేలిపోతాయనిపించింది. అందుకే ఇక ఈ వ్యాసం ఇలా ఉనికిలోకి రావడానికి కారణమైన సహృదయులందరికీ థాంక్యూలతో సరిపెడుతున్నా.❤️



వ్యాస పాఠం:

.‘‘నియతి చేత విధించబడిన నియమాలను ఉల్లంఘించేదీ, ఆనందాన్ని ఇచ్చేదీ, పరతంత్రత లేనిదీ, నవరస రుచిరమైనదీ అయిన కవి వాక్కుకు జయము కలుగుగాక!’’
- ముమ్మటుడు

ఒక వ్యక్తి ఎందుకు సృజిస్తాడు? ఎక్కడో మారుమూల నర్శింగాపురం నుండీ హైదరాబాద్ నగరానికి చేరి, ఆ వీధుల్లో తిరిగే ఒకానొక ఎముకలగూడు, రక్తమాంసాల కూడిక, తన గడచిన జీవితం, తన అస్తిత్వానికి అర్థం ఏమిటని ప్రశ్నించుకుంటే పుట్టిన జవాబే రాజిరెడ్డి రచనలు. అతని లక్షణం తనకు చెందినదాన్ని పూర్తిగా వ్యక్తం చేసుకోవటం. అలా వ్యక్తం చేసుకొంటే వచ్చినవే ‘మధుపం’, ‘పలకా పెన్సిల్’, ‘రియాలిటీ చెక్’, ‘ఆజన్మం’, ‘చింతకింది మల్లయ్య ముచ్చట’, ఇంకొంత కవిత్వం.
తన రచనలకీ తనకీ ఉన్న సంబంధం దీపానికీ, కాంతికీ ఉన్న సంబంధం అంటాడు చలం. రాజిరెడ్డి తనలోని వైయక్తికం, సామాజికం, భౌతికం, అధిభౌతికం, రసాస్వాదన ప్రవృత్తి తన మొత్తం రచనల్లోకి వెల్లడించుకుని, తన అస్తిత్వాన్ని ప్రకటించుకుని, విముక్తుడయ్యాడు. రాగద్వేషాలకతీతంగా మంచీచెడులకు కారణమవుతున్న ‘మాయ’ను తెలుసుకుంటూ బైరాగి పదాల్ని సృష్టిస్తున్నాడు. సుఖదుఃఖాలను పూర్తిగా విచారించి తత్వాన్ని తెలుసుకోవటం వలన మనిషి వాటిని విడిచిపెట్టగలడు. ఇది ఆత్మవిద్య. ఇదొక స్వీయాత్మాభివ్యక్తీకరణ లాలస.

ఇంతకీ రాజిరెడ్డి రచనలు ఫిక్షనా? నాన్ ఫిక్షనా? అతడు జర్నలిస్టు కావటం చేత ఇవన్నీ రాసేడా? కాకపోతే రాసివుండేవాడు కాదా? ఒక సృజనకారుడు జర్నలిస్టు కావటం అతడు చేసిన నేరం, పాపం కాదు. ‘‘మనం పుస్తకం చదువుతున్నప్పుడు ఆ రచయిత మన వెనుకనే నుంచుంటాడు, అతనిని తెలుసుకొన్నాక అతడిని ప్రేమించటం మొదలుపెడతాం’’ అంటాడు రాజిరెడ్డి. రచయితలోని ఒకవిధమైన అమాయకత్వం, నిర్మలమైన నిజాయితీని పాఠకుడు ఇట్టే పసిగడతాడు. రాజిరెడ్డి ‘రియాలిటీ చెక్’ పుస్తకంలో ‘అడ్డాకూలీలతో కొన్ని మాటలూ, కొంత మౌనం’ రచనలో ‘‘ఇదిగో ఈ ఉదయంపూట నేను యూస్‌ఫగూడ చెక్ పోస్ట్ నుంచి బస్తీవైపు నడుస్తున్నాను.’’ అనే ప్రారంభ వాక్యాలను నేను ఒక పదిసార్లయినా చదివి ఉంటాను.

రాజిరెడ్డి తన రచనలకి ‘ఆఖ్యాయిక’ అని పేరుపెట్టుకోవచ్చు. నాయకుడే స్వయంగా తన వృత్తాంతాన్ని చెప్పటం ఆఖ్యాయిక. స్వయం దృష్టార్థ కథనం ఆఖ్యానమని మరోటి ఉంది. రియాలిటీ చెక్‌కి ‘ఆహ్నికం’ అనీ పేరుపెట్టుకుని ఉండవచ్చు. ‘‘ఆహ్నా నిర్వృత్తం ఆహ్నికం’’ అంటే ఒక దినంలో నిర్వర్తింపబడినది, రచింపబడినది, చదువదగినది.
రాజిరెడ్డిలోని రచయిత శిల్పశక్తులతో విజృంభించి రాసిన విస్తృత యాత్రాగ్రంథం ‘రియాలిటీ చెక్’. ఇది ఒక విధమైన సంచార సాహిత్యం. ఒక బాటసారి బైరాగి సృష్టించి యిచ్చిన లోక వృత్తాంత తాత్విక గ్రంథం. మొత్తం హైదరాబాద్ అంతా తిరిగినా దానిమీద ప్రేమ, ద్వేషం ఏర్పరచుకోని ఈ బైరాగి, మంచీ చెడూ రెండూ ‘మాయే’ చేయిస్తుందంటాడు.

‘రియాలిటీ చెక్’ని దశరూపకాల్లోని ‘వీథి’ ప్రక్రియలోనూ చేర్చవచ్చు. ఈ ‘వీథి’లో ఒక్కడే నాయకుడు, ఒకటే అంకముంటుంది. అతడు ఆకాశ భాషితాలకు ప్రతిభాషితాలు చేస్తూ ముందుకు సాగుతుంటాడు. క్రీడాభిరామం ప్రత్యేకంగా ‘వీథి’కి చెందుతుంది. మనుష్య, వృక్ష, ఫలభక్ష్యాలు, వార్తా, వైచిత్రీ, విశేషాలు, వీటితోపాటు జాతివర్ణనలు హంసవింశతి, క్రీడాభిరామం వంటి రచనల్లో కనిపిస్తాయి. ‘రియాలిటీ చెక్’లోని ‘చార్మినార్ను అల్లుకున్న బతుకు తీగలు’ రచన చూడండి: ‘‘మీసాలతో గడ్డం, మీసాలు లేని గడ్డం, పొట్టిగడ్డం, పొడుగు గడ్డం, పిల్లి గడ్డం... ఈ గడ్డమీద ఎన్ని గడ్డాలు!’’ అనుకుంటూ మన యాత్రికుడు ముందుకు సాగుతాడు. కన్నెపిల్లలు, పిల్లతల్లులు, ముద్దబంతులు, ముత్తయిదువలు, గాజులు వేసుకుంటూ చూసుకుంటున్నవాళ్ళ మురిపాలను మనకు చూపెడుతూ ముందుకు నడుస్తూ... ‘‘ఎన్ని దుకాణాలు! తాళాలు, కత్తులు, చెప్పులు, పుస్తకాలు, గిన్నెలు, గడియారాలు, చీరలు, బ్యాగులు, చికెన్, మటన్, బీఫ్, పువ్వులు, బిస్కెట్లు’’ అంటాడు. అదొక సంత. అక్కడ క్రయ విక్రయాలు ‘వీథి’ని గుర్తుకుతెస్తుంటాయి.

రచనావరణం మొదటి అడుగులోనే ఒక సింబల్ని పట్టుకొంటాడు రాజిరెడ్డి. దాన్ని ఇంతకుముందు చాలాసార్లు చూచి ఉంటాం. అది మనకలా కనిపించి ఉండదు. జూపార్క్‌కి వెళ్లినపుడు అతడికి మొదట్లోనే రెండు తాబేళ్ళు స్వాగతం పలికాయి. చిన్న మడుగులో చి.. న్న.. గా నడుస్తున్నాయి. ఇంత నెమ్మదిగా తిరిగితే తప్ప ఈ ‘జూ’ని ఆనందించలేమన్నట్లుందిది అంటాడు.సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆనాటి కావ్య ప్రబంధాలను, కథాకావ్యాలను ఆధారం చేసుకొని రాసినట్లు, ఒక 100-150 సంవత్సరాల తర్వాత హైదరాబాదీ సంస్కృతీ చరిత్రలను రాజిరెడ్డి రచనలను ఆధారం చేసుకొని ఏ పరి శోధకుడో ఒక అద్భుత గ్రంథం రాయవచ్చు.

స్త్రీ పురుషుల మధ్య ఒక తాత్త్విక అవగాహన కలిగించే ఒక వచనకావ్యం ‘మధుపం’. దీనికి ఆయన పెట్టుకున్న ట్యాగ్ ‘‘ఒక మగవాడి ఫీలింగ్స్’’. స్త్రీకి మగవాడు ఏకకాలంలో యజమాని, బానిస. ‘‘మగవాడు తాను స్త్రీని ఎంతగా ఆరాధిస్తున్నాడో, ఎంతగా ద్వేషిస్తున్నాడో చెప్పటంలోనే స్త్రీకన్నా అనితరమైనదీ అతీతమైనదీ తనకేదీ లేదని ఒప్పుకోవటం’’ వల్ల ఇద్దరి జీవితాల్లో మధువు నింపబడుతుంది అనే విషయాన్ని ‘మధుపం’ నిరూపిస్తుంది. దీన్ని తెలుసుకొన్నాక ఆమె చేతి గాజులు తన చేతులకి గొలుసులైపోతాయి.

‘పలక పెన్సిల్’ని పుస్తకంగా వేయాలనుకొన్నప్పుడు వీటన్ని టిని ఎందుకు పుస్తకం రూపంలో తీసుకురావాలి? అన్నది అతడు ఎదుర్కొన్న ప్రశ్న. ‘‘ఏ ఆదివారపు మధ్యాహ్నమో సోమరిగా కూర్చుని, ఫోటో ఆల్బమ్ తిరగేస్తుంటే, నిజంగా అప్పుడు మనం బాగుండేవాళ్ళుం అనిపిస్తుంది చూడండి’’ అలాంటి రాత ప్రయ త్నాల్లో బాగున్నవనుకున్నవన్నీ ఈ పుస్తక అవతారంలోకి వచ్చాయి. ఇతడికి రాయటం ఒక పెయిన్. కానీ రాయకుండా ఉండలేడు. తన అస్తిత్వాన్ని ప్రతిబింబించే తన రక్తనాళాలతో కుట్టిన ఈ పుస్తకానికి అతడు పెట్టుకొన్న ట్యాగ్ - ఒక మగవాడి డైరీ!

వీటన్నిటికంటే తన కొడుకుకి ఇచ్చిన ‘దర్శనం’ ఆసక్తిగా ఉం టుంది. ‘వెయ్యిప్రశ్నల ఉదయం’ శీర్షికలో తన ఐదేళ్ళ కొడుకు అడిగిన అమాయకపు ప్రశ్నల్ని వరుసగా ఒక రచనలాగా పేర్చి అందించాడు. అందులో ‘‘కుక్క చేతుల్తోటి ఎందుకు నడుత్తాది? మనం నోటి తోటి ఎట్ల మాట్లాడుతాం? మట్టికింద ఏముంటది? నానా! నేను నిన్ను పెళ్లిచేసుకోవన్నా?’’ లాంటి ప్రశ్నలుంటాయి.

లోకవృత్తంలోపడి తిరుగాడుతున్నపుడు మనిషిని ఆకర్షించని వస్తువు కవి కల్పనలోపడి సృజనగా మారాక దాంట్లో అంతకు ముందులేని అందం వచ్చి చేరుతుంది. దీన్నే రాజిరెడ్డి ఇలా అంటాడు: ‘‘మామూలుగా ఏ దృశ్యమైనా చాలా మామూలుగా ఉంటుంది. దాన్నే వాక్యంలోకి తర్జుమా చేసినప్పుడు కొత్త అందం వచ్చి చేరుతుంది’’.

రాజిరెడ్డి కథల సంపుటి ‘చింతకింది మల్లయ్య ముచ్చట’. ఒక ప్రక్రియకి కొన్ని లక్షణాలు ఉన్నాయి అని చేప్పే వాదం మీద ఈ రచయితకు వ్యంగ్యంతో కూడిన అసహనం ఉంది. ‘‘నీ కథల్లో కాల్పనికత ఏది?’’ అని అడిగిన వారికి ఊహించని అద్భుతమైన జవాబు అతడు రాసిన ‘రెక్కల పెళ్లాం’ కథ. మాంత్రిక వాస్తవికతతో జానపదరీతిలో సాగిన అత్యాధునిక కథ. స్త్రీ పురుషుల జీవితంలో కొరవడినది ఏది? కోరుకొన్నది ఏది? దొరుకుతున్నది ఏమిటి?... ఇలా వారిద్దరి మధ్యన నెలకొనాల్సిన మానవ సంబంధం గురించిన అత్యాధునిక కథ ఇది.రాజిరెడ్డి మొదటి కథ ‘నాలో(కి) నేను’ (2008). ‘నేను’కి సమూహంలో అర్థం ఏమిటి? ‘నేను’ని గుర్తించకపోతే సమూహానికి అర్థం ఉందా? జీవితాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లు తీసుకోవాలా, మార్చి స్వీకరించాలా? అన్న ప్రశ్నల అన్వేషణే ఈ కథ. అనేక వైరుధ్యాలమధ్య మనిషి జీవితం అణగారిపోతున్న విషాదాన్ని గురించిన కథ రెండవది ‘మరణ రేఖలు’. జీవితాన్ని నాటకీయంగా చూసే మూకుమ్మడి దృష్టి కాకుండా జీవితాన్ని జీవితంలా చూడాలి అనే కథ ‘చింతకింది మల్లయ్య ముచ్చట’.

కథకి సమకాలీన ఫార్ములా మీద వ్యంగ్యం కలిగి ఉన్న కథ ‘చినుకు రాలినది’. మృత్యువు మార్మికంగా మారి, అదే చిట్టచివరి వాస్తవం అయినపుడు దాంట్లో అతడు ఎదుర్కొన్న ఘర్షణ ‘తమ్ముడి మర ణం’లా ఒక విషాద జ్ఞాపకంగా మిగులుతుంది.రాజిరెడ్డికి అలంకారాలు అపృథక్ ప్రయత్నంతో సిద్ధించాయి. ‘ఎండలో ఒక మధ్యాహ్నం’ రచనలో సాయంత్రపు సూర్యుడ్ని చూస్తూ ‘‘దిన వృక్షానికి పండి జారిపడిన ఫలం’’ అంటాడు. దూరంగా చెట్టుకు చిక్కుకొన్న సూ ర్యుడు, చుట్టూ బంగారపు రంగు వెండి మబ్బులు, ఎర్రగా పండిన పండయ్యాడు, తొడిమను వీడినట్లుగా కిందకు జారిపోయాడు. ‘‘ఏ పిల్లాడికి దొరికాడో’’ అనుకుంటాడు రచయిత. అలాగే మరోచోట ‘‘సుదీర్ఘ రాత్రి విరహం తర్వాత, మేలిముసుగు ధరించిన భూ వధువు మంచుతెరలు తొలగిస్తూ.. యౌవన సూర్యుడు! తొలుత మబ్బుల్లోకి లేకుంకుమను కుమ్మరించాడు, తన తరుణి నుదుటన దాల్చడానికి’’ అని ఉదయకాల సూర్యుణ్ణి ఈ ఆధునిక ప్రబంధకవి వర్ణించాడు.

కావ్యం అంటే ఒక్క వాక్యం కూడా కావచ్చు. అయితే ఆ వాక్యం రసాత్మకమైపోవాలి. సాహిత్య దర్పణంలో దాన్నే కదా విశ్వనాథుడు ‘‘వాక్యం రసాత్మకం కావ్యమ్’’ అన్నది. ‘రియాలిటీ చెక్’లో ఇలాంటి వాక్యాలు చాలానే ఉన్నాయి. అడ్డాకూలీలతో కలిసి కొంత సంభాషణ, కొంత మౌనం జరిపాక, ‘‘కాళ్ళు నడువత్తలేవు. బొక్కల్ల సందులచ్చినయని డాక్టర్లు చెప్పిన్రు’’ అన్న ఆ వృద్ధుణ్ణి రచయిత అడిగాడు: ‘‘మరేం జేస్తున్నవు?’’
‘‘అడుక్కుంటున్న బాంచెను’’ అన్నాడు వృద్ధుడు.
‘‘ఎన్ని నిర్మాణాలు, ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అపార్ట్మెంట్లు, ఎన్ని భవనాలు, ఎన్ని రోడ్లు, ఎన్ని అద్భుతాలు వీళ్ల చేతులమీదుగా సాకారమైనై! చేతులు బిగించి పని చెయ్యటానికీ, చేతులు చాచి యాచించటానికీ మధ్యన దూరం ఇంత తక్కువ వుందా?’’ అంటాడు రచయిత. ఈ ఒక్క వాక్యం చాలు- ఆర్థికశాస్త్రం, చరిత్ర, ఆంథ్రోపాలజి ఇవేవీ అర్థంచేయించలేని భావాన్ని వినిపించి కంటతడి పెట్టించడానికి.

ఒక భావాన్ని చెప్పగల పదసముదాయం ఎంత ఉన్నప్పటికీ, చెప్పదలచిన భావాన్నంతా చెప్పటానికిగల ఏకైక పదమే శబ్దం. రచయిత అలాంటి శబ్దాలను ఏరుకోగలగాలి. అలాగే సహృదయునికి ఆహ్లాదాన్ని కలిగించే స్వభావం కలిగిన సుందర శబ్దమే అర్థం. ఈ రెండు శబ్దార్థాలూ కలిగి ఉండటం వలన రాజిరెడ్డి వాక్యం అనన్యసాధ్యంగా తయారైంది.

ఋగ్వేదంలో- మహాదేవుడైన శబ్దం వృషభం వలె మానవుడి కోరికలను వర్షించటం కోసం అతడిని ఆవహించి రంకె వేస్తుంది అని ఉంటుంది. ఈ రకమైన శబ్ద విచ్ఛిత్తికి ఏవో ప్రక్రియల పేర్లు పెట్టాలనుకోవడం అవివేకం. అది మానవుని (కళాకారుడిని) ఆవహించి అతడి ఉరము, కంఠం, శిరస్సు నుండీ ఘోషలాగా వెలువడుతుంది అని చెప్పడం వెనుక ఒక అసంకల్పిత పక్రియ దాగిఉన్నట్లు అనిపిస్తుంది. ఈ రకమైన ప్రాగ్రూప వాసనలతోటే బహుశా రాజిరెడ్డి ‘‘ప్రక్రియల మూసల్లో ఇమడని వాక్యం నాకిష్టం’’ అంటున్నాడు. గతకాలీనపు ప్రక్రియాగత స్వేచ్ఛ, వైవిధ్యం లోపించి సమకాలీన సాహిత్య ప్రక్రియలు ఘనీభవించాయి. సృజన స్వేచ్ఛ సంకుచితమైపోయింది. ఈ నేపథ్యంలో నిలబడి ‘‘ఏ రూపంలోనైనా నన్ను నేను వ్యక్తం చేసుకోవడం ఇష్టం. ‘ఇలాంటి పిల్లాడు కావాల’ని ఎలాగైతే సృష్టికార్యం ఆరంభించమో, ఇలాంటి ఆర్టికల్ రాయబోతున్నానని నాకూ తెలియదు, అలాంటి ‘డెలివరీ’ ఒక అద్భుతమైన అనుభవం’’ అంటున్నాడు రాజిరెడ్డి.

- కాకుమాని శ్రీనివాసరావు