Thursday, October 8, 2026

అంగర వెంకట కృష్ణారావు కథ ‘తొగరు చెట్టు’



అంగర వెంకట కృష్ణారావు 

అంగర వెంకట కృష్ణారావు కథ ‘తొగరు చెట్టు’కు సంక్షిప్త రూపం ఇది. 1959లో ప్రచురితమైంది. ఉత్తరాంధ్రకు చెందిన అంగర– కథకుడు, నవలారచయిత. తెలుగులో సైన్యం నేపథ్యంలో సాహిత్య సృజన చేసిన అతి తక్కువమంది రచయితల్లో అంగర(1920–74) ఒకరు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన సైన్యంలో పనిచేశారు. ఆ అనుభవాలతో ‘విరామం’ నవల రాశారు. పెద్ద మనిషి, పోయిన పుటలు ఆయన కథల్లో కొన్ని.

––––

నవ్విన చెట్టు


జిల్లా ట్రెజరీ హెడ్‌ అకౌంటెంటు చిట్టి వెంకట్రామయ్య గారు అవాళ సాయంత్రం గడియారం టంగు టంగున ఐదుకొట్టగానే టక్కున ఇంటికి వెడిపోయారు. ఏం చెప్మా అనుకున్నారు పెద్ద గుమస్తా అంతా. ఇవాళైనా వెలుగులో భార్యబిడ్డల మొహాలు చూస్తామనుకున్నారు టైపిస్టులూ, అటెండర్లూ.

అయితే, గత పన్నెండు సంవత్సరాలలో యిలాంటి విపరీతం జరగలేదు. ఇది జనన తేదీలు అజాయించేపట్ల మనవాళ్లు భూతకాలంలోని తుఫానులు, భూకంపాలు మొదలైనవి వుటంకించినట్లు చెప్పుకోతగ్గది.

చిట్టి వెంకట్రామయ్య గారు పన్నెండేళ్ల కిందట ఆ జిల్లా ట్రెజరీకి హెడ్‌ అకౌంటెంటుగా వచ్చేరు. అప్పటికీ యిప్పటికీ ఆయన హోదాలోగాని, ప్రవర్తనలోగాని మార్పు లేదు. ఉదయం పదకొండింటికి వచ్చి సాయంత్రం ఏడున్నరకు లేచేవారు. ఎప్పుడూ నవ్వకపోయినా యేడుపుముఖం పెట్టలేదు. ఎవర్ని యెన్ని తిట్టినా పై అధికారితో చెప్పి అపకారం చేయించలేదు. ఆయన్ని అర్థం చేసుకున్నామనుకున్నవాళ్లు గత్యంతరం లేక సమాధానపడ్డారు.

పోతే, అవాళ సాయంత్రం ఐదింటికి అకస్మాత్తుగా ఆయన యెందుకు లేచి వెడిపోయారో యెవ్వరికీ తెలీదు. చివరికి ఆయన ప్రైవేట్‌ సెక్రటరీలాంటి బంట్రోతు అహమ్మదుకు కూడా. అసలాయనికి ప్రైవేటు జీవితం లేదనే అందరి అభిప్రాయం. ఆయన భార్య సుమారు ముప్పై యేళ్ల కిందట పెళ్లి అయిన కొద్ది నెలలలోనే పోయిందని కొందరికి తెలుసు. ఇంకా లోతైన విషయాలు అహమ్మదుకీ, కనీసం పన్నెండేళ్లనుంచీ వంట చేస్తున్న నరసింహానికీ కూడా తెలీవు.

సూర్యుడికంటే ముందు లేచి స్నానం చేసి, సంధ్య వార్చి, ఆఫీసు కాగితాలు చూసుకుని, తొమ్మిది గంటలకి వేడి వేడి పెసరట్టూ, వుడికించిన కూర, పెరుగూ అన్నం తిని ఆఫీసుకు వెళ్లడం, సాయంత్రం సుమా రెనిమిదింటికి యిల్లు చేరి మడి కట్టుకుని భోంచేసి, రాత్రి సుమారు పదకొండు వరకూ తిరిగి ఆఫీసు కాగితాలు చూసుకుని పడుకోవడం ఆయన దినచర్య. దీనిలో యెన్నడూ యేమీ మార్పుండదు.

ఆయన యెప్పుడూ సినీమాలూ నాటకాలూ చూడరు. ఎప్పుడైనా వాళ్ల బంధువులెవరైనా ఆ వూరు వస్తే వాళ్లింట్లోనే దిగేవారు. దూరపు అన్నదమ్ములు, రెండువేళ్లు విడిచిన మేనమామ మనవరాళూ, స్నేహితులు, స్నేహితుల స్నేహితులు యిత్యాది. కారణం ఆయనమీద అభిమానం అనుకోవడం సత్యానికి చాలా దూరం; ఆయన కలిగినవాడని, ఖర్చు లేనివాడని. అయితే ఆయన యెవ్వరితోటీ ఆట్టే మాట్లాడేవారు కారు. చుట్టపక్కాలున్నప్పుడు కూడా ఆయన మేడమీద తన గదిలోంచి బైటికి వచ్చేవారు కారు. అంచేత ఆ వచ్చినవాళ్లు కూడా ఆనవాయితుకు ‘బాబాయీ బాగున్నావా’ అనో, ‘అన్నయ్యా యెన్నాళ్లయింది నిన్ను చూసి’ అనో పలకరించినా, ఆ యింటిని సుమారొక విశ్రాంతి గృహంగానే భావించేవారు, చార్జీలు మినహా.

చిట్టి వెంకట్రామయ్య గారి ‘గది’ మేడమీదుంది. మేడమీదున్న గది అదొక్కటే. ఆ గదికి వుత్తరం వేపున్న కిటికీ గుండా పెరట్లో వున్న తొగరుచెట్టు పైభాగం సూటిగా అగుపిస్తుంది. తీరికగా వున్నప్పుడల్లా ఆయన దానివేపు చూసేవారు. ఆయన యెరికని ఆ చెట్టు యెప్పుడూ అలాగేవుంది, ఆకులు లేకుండా మోడులా. దానిని చూస్తున్నంతసేపూ ఆయన మనసు శాంతియుతంగా వుండేది.

అవాళ ఆయన సాయంత్రం ఐదు గంటలకి టక్కున లేచి ఆఫీసు నుంచి వెళ్లిపోవడం లగాయతు, ఆర్నెళ్లపాటు ఆయన ఆఫీసు జీవితంలో వింతమార్పు వచ్చింది. ఉన్నంతసేపూ అందరిమీదా రుసరుసలాడ్డం, తిట్టడం, ట్రెజరీ ఆఫీసు మీదే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ విసుక్కోవడం. ఎంత గొడవ చేసినా ఐదింటికల్లా డ్రాయర్లు మూసి వెడిపోవడం. ఆయన్ని యెవరూ యేమీ అనేవారు కారు. కారణం ఆయనకి అప్పుడే చాలా సర్వీసు అయిపోయింది. పైగా ఆయన వయసు యాభైలోపైనా, పళ్లూడిపోయి, దిగజారిపోయి అరవై యేళ్ల వాడిలా అగుపించేవాడు.

డిశంబరు నెల నడుస్తూంది. హేమంతుడి ప్రతాపానికి తట్టుకోలేక పృథకి శియ్యలు ఏకశియ్యలౌతున్నాయి. చిట్టి వెంకట్రామయ్య వొక్క నిద్ర తీసేరు. ఈదురుగాలికి తెలివి వచ్చింది. పెరటి వైపు కిటికీ మూసివేద్దామని లేచారు.

కిటికీ దగ్గరికి వెళ్లగానే తొగరుచెట్టు మొండికొమ్మల్లోంచి వొక దృశ్యం అగుపించింది. అవతల వీధి మేడగది కిటికీ తెరిచివుంది. ఎలట్రి దీపం కాంతి చక్కగావుంది. ఒక యువకుడు వొక యువతి– నిటారుగా, నగ్నంగా, గాఢాలింగంలో పెనవేచుకుపోయేరు, చెట్టుతీగలా. చిట్టి వెంకట్రామయ్య హృదయం వేగంగా కొట్టుకుంది. వెంటనే చలి పటాపంచలై ఆపాదమస్తకం వేడెక్కింది.

కిటికీ మూసి వెడిపోదామా అనిపించింది. కాని అలా చెయ్యలేకపోయేరు. తను చీకట్లో వున్నారు. వాళ్లు లోకానికి మటుకే చీకట్లో వున్నారు. వాళ్లు నూతన దంపతులై వుంటారు. నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్లజ్జగా, రక్తమాంసాస్తి నరాలకు పంచభక్ష్య పరమాన్నాలతో విందుగా ప్రవర్తిస్తున్నారు. చిట్టి వెంకట్రామయ్య శరీరం విపరీతంగా కంపిస్తూంది. నిత్య శిశిర జీవితం గడుపుతూన్న ఆ నిర్భాగ్యపు తొగరుచెట్టు అవతలి, జీవిత పరిణాహంలో మహోద్రేక పూరితమైన యీ ఘట్టపు విశ్వరూపం యిలా ఆ హేమంత నిశామధ్యంలో ప్రత్యక్షం అవుతుందని ఆయన కలలో కూడ అనుకోలేదు. ఆ సన్నివేశం ఆయన ప్రవృత్తిని పునాదులతో కుదిపింది.

ఆఫీసులో అంత అలజడి ఆ మర్నాడే జరిగింది. కిటికీలో నాటకం ఆరంభం ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకే. దానికి చివరి అంకం భరతవాక్యం వుంటాయని చిట్టి వెంకట్రామయ్య గారు అనుకోలేదు.

కాలచక్రం తిరుగుతూంది. మార్చి నెల ప్రవేశించింది. హటాత్తుగా పెరట్లో తొగరు చెట్టు చిగిర్చింది పన్నెండేళ్ల తరవాత. చూస్తుండగా చెట్టంతా గుబురై, పచ్చటి ఆకులు నిండింది. తొగరుపూల పరిమళాలు చిట్టి వెంకట్రామయ్య గది మీద, కాదు గుండెల మీద దాడి తీస్తున్నాయి. ఏం లాభం? కిటికీ కనుపించడం లేదు. ఆయనకి చిర్రెత్తింది. వెర్రెత్తింది. నిద్ర ఇదివరకే లేదు. కాని ఇప్పుడు నిద్రలేని సుఖం కూడా లేదు.

ఒకనాడు ఆఫీసుకు వస్తూనే అహమ్మదుతో చెప్పేడు ‘సాయిబూ, మన పెరట్లో తొగరు చెట్టు నరికించీ... వెధవ చెట్టు’. సాయిబు హడలిపోయేడు. ‘అదేం అయ్యగోరూ– పాపం ఆ సెట్టు యెన్నాల్లకో ముచ్చటగా సిగిర్పింది. దాన్నెందుకు నరకాలి?’

‘నీకు తెలీదు– సాయంత్రానికి నరికించీ’. అహమ్మద్‌ గొణుక్కుంటూ వెడిపోయేడు.

ఒంటిగంటకి ఆఫీసుకి ఒక యువకుడొచ్చాడు చిట్టి వెంకట్రామయ్య గారి కోసం. ఆయనకి సరిగా గుర్తురాలేదు.

‘మరేం లేదు. మీ యింట్లో క్రింద భాగములో చాలా గదులున్నాయిట. నాకో గది అద్దెకిస్తారేమో అని అడుగుదామని వచ్చా.’

‘నేనెప్పుడూ యెవరికీ అద్దెకివ్వలేదే... అయినా మీ రెక్కడుంటున్నారు?’

‘ఇక్కడే... అంటే ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. మీ యింటి దగ్గిరసానే వుంటున్నా. మా మేడమీంచి మీ పెరట్లో తొగరుచెట్టు అగుపిస్తుంది.’

చిట్టి వెంకట్రామయ్య అదిరిపడ్డాడు. ఇప్పుడు పోల్తి అందింది. కొంచెం సర్దుకుని అడిగారు, ‘మీరు బాచిలరా?’

అతడు సిగ్గుతో అన్నాడు, ‘కాదండీ... మా ఆవిడ పుట్టింటికి వెడుతూంది. మరేం... పురిటికి... ఈలోగా నాకెందుకు అంత యిల్లని... మీ యింట్లో ఏదో వొకగది ఇస్తే చాలు...’

చిట్టి వెంకట్రామయ్య మనసులో ఒక పెద్ద అల్లకల్లోలం లేచి క్రమేణా చల్లబడింది. అది వొక పెద్ద శస్త్రచికిత్స! యువకుడిని మర్నాడు మంచిరోజని తన యింట్లో దిగిపొమ్మన్నాడు.

‘అహమ్మదూ...’

‘అయ్యగోరూ...’

‘తొగరుచెట్టు నరకొద్దురా...’

‘ఏం అయ్యగోరూ...’

‘తొగరుచెట్టు చిగిర్పిందిరా...’ చిరునవ్వుతో అన్నారు. అహమ్మద్‌తో సహా ఆఫీసంతా మూర్ఛపోయింది.


(సాక్షి సాహిత్యం; 3 ఫిబ్రవరి 2020)

Monday, October 5, 2026

అజయ్‌ ప్రసాద్‌ కథలు





దాదాపుగా సమగ్ర సాహిత్యం అనదగ్గ కథల పుస్తకాన్ని అజయ్‌ ప్రసాద్‌ తెచ్చేశాడు. కాకపోతే ఎంపిక చేసిన 34 కథలున్నాయిందులో. ఈ ఇరవై ఏళ్లలో అజయ్‌ ఏం చేశాడంటే ఈ పుస్తకాన్ని చూపించొచ్చు. ఇది బి.అజయ్‌ ప్రసాద్‌ ఐడెంటిటీ.


అజయ్‌ ప్రసాద్‌ కథలు; గుండ్లకమ్మ ప్రచురణలు; పేజీలు: 440 (హార్డ్‌బౌండ్‌); వెల: 300; ప్రతులకు: నవోదయ బుక్‌ హౌజ్‌


------------------------------
అజయ్‌ ప్రసాద్‌ ‘లోయ’ కథల సంపుటికి నేను రాసిన బ్యాక్‌ కవర్‌ రైటప్‌:

తెల్లటి పలుచటి తడిబట్టను ముఖంమీద కప్పుకుని లోకాన్ని చూసినట్టుగా ఉంటుంది అజయ్‌ప్రసాద్‌ కథలు చదివితే. అంతా కనబడుతూ వుంటుంది; ఇంకా కనబడనిది ఏదో వుందని కూడా తెలుస్తూవుంటుంది. స్పష్టాస్పష్టం. అజయ్‌ మానసిక ప్రపంచంలోని మనుషులు ఒక దారప్పోగు లాంటి బలహీన బంధాన్ని మాత్రం ఉంచుకుని సంచరించే జీవులు. అయినా వీరందరిలోనూ ఏదో తెలియని దుఃఖం. అది పొగిలి ఏడ్చేదీ కాదు; బయటికి వ్యక్తం చేయగలిగేదీ కాదు. మొత్తంగా శరీరమంతా జీవితమంత లోతుగా వ్యాపించివున్న దిగులు. ఎక్కడో దూరంగా ఏ బైరాగో తన మొత్తం అనుభవసారాన్నంతా గొంతెత్తి తనలో తానే ఏ తత్వంగానో పాడుతూవుంటే మనకు తెలియకుండానే దానిలో లీనమై అంగీకారంగా తలవూగుతూ వుండగా కనీకనబడని చెమ్మతో కళ్లు మసకబారే పఠనానుభవం.

(29.7.2017)

Friday, October 2, 2026

సృష్టికర్తల సృష్టికర్త రవివర్మ


రవివర్మ

29 Apr 1848 - 2 Oct 1906

 

సృష్టికర్తల సృష్టికర్త



దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినట్టయితే, మరి ఆ దేవుణ్ని ఎవరు సృష్టించినట్టు? నిరాకారుడైన దేవుడిని ఎలా పోల్చుకోవాలి?

భావవాద, భౌతికవాదాల మధ్య జరిగే చర్చల్లో పుట్టే ప్రశ్నలు సాధారణంగా ఇలా ఉంటాయి.
దేవుడి ‘ఉనికి’ని ఒప్పుకుంటే గనక, ‘నిరాకారుడైన’ దేవుడికి రూపం ఇవ్వడమనేది మనిషి సృజనశక్తితో సంభవించింది. ఇంకా చెప్పాలంటే, రవివర్మలాంటివాళ్లవల్లే సాధ్యమైంది.

ఊహలకు ఒక సాధికార రూపమిచ్చాడు రవివర్మ. దేవుళ్లకు ఒక ఫ్రేమ్‌ కట్టాడు. ఇక, సరస్వతి అంటే ప్రశాంత చిత్తంతో వీణను మీటుతూ కూర్చున్న నాలుగు చేతుల తల్లే! లక్ష్మి అంటే, ఏనుగులు తొండమెత్తి కొలుస్తుండగా అన్నే చేతులతో తామరపువ్వుమీద నిలబడిన అమ్మే!

రాజా రవివర్మ (1848–1906) ఇప్పటి కేరళలో భాగంగావున్న ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబంలో జన్మించాడు. పసితనంలో తను చూసిన పశువులు, రోజువారీ జీవిత వ్యవహారాల్ని గోడల మీద చిత్రించేవాడు. పాత గాథల్నీ, వాటిల్లో ఇమిడివున్న అంతరార్థాన్నీ ఆకళింపుచేసుకుని తన చిత్రాలకు ముడిసరుకును కూర్చుకునేవాడు.

నల– దమయంతి, శంతను–మత్య్యగంధ, శంతను–గంగ, రాధామాధవులు, కంస మాయ, సుభద్రార్జునుల ప్రణయం, ద్రౌపదీ వస్త్రాపహరణం, హరిశ్చంద్రుడి జీవితంలోని విషాదఘట్టం, మేనక –విశ్వామిత్ర, శ్రీకృష్ణ జననం, కృష్ణ రాయబారం, సీతా స్వయంవరం, శ్రీరామ పట్టాభిషేకం, శివపార్వతులతో వినాయకుడు, సింహం పిల్లతో భరతుడు, కీచకుడు సైరంధ్రి, జటాయు వధ, శకుంతల, హంస రాయబారం; ఇలా రామాయణ, మహాభారత ఇతిహాసాలూ, కాళిదాసు కావ్యాలూ ఆయనకు కుంచెనిండా పని కల్పించాయి. పాత్రని మలిచిన మృదుత్వం, ముఖంలో పలికే భావం, సున్నిత శృంగారం, స్కిన్‌ టోన్, వస్త్రాలు అమర్చిన తీరు, అవయవాల పొందిక, ఆభరణాల సొగసు, రంగుల మేళవింపు, వెలుతురు జాడలు, డీటెయిల్స్, చిత్రాన్ని చూడటానికి కావాల్సిన మూడ్‌... అన్నీ కుదిరాయి కాబట్టే, భారతీయ చిత్రకళకు రవివర్మ ఆద్యుడు కాగలిగాడు. భారతీయ రంగస్థలం, అటుపైన సినిమా రంగం కూడా ఆయన చిత్రాలు ఇచ్చిన ప్రేరణతో తమ పాత్రల్ని మలుచుకున్నాయి.

కొత్త అనుభవం, కొత్త అనుభూతుల కోసం రవివర్మ దేశం మొత్తాన్నీ చుట్టివచ్చాడు. భిన్న నేపథ్యాల్లోంచి వచ్చిన ఎందరో స్త్రీలను ప్రత్యేకంగా గీశాడు. పిల్లాడికి పాలిస్తున్న తల్లి, భర్తకోసం ఎదురుచూస్తున్న భార్య, దీర్ఘాలోచనలో ఉన్న మహిళ, అప్పుడే స్నానంచేసిన మగువ, ఏకాగ్రతతో చదువుతున్న విద్యార్థి, సంగీత కారులు, భిక్షగాళ్ల కుటుంబం... మనదేశం వరకూ లైవ్‌ మోడల్స్‌ను వాడటం కూడా ఆయనతోనే ప్రారంభమైంది.

అందమైన స్త్రీకి కొలమానం కూడా ఆయన సెట్‌చేశాడు. రవివర్మ చిత్రంలా ఉందనడమే ఒక విశేషణం కదా!

బ్రిటిష్‌వాళ్లు కూడా ఆయనతో తమ పొర్ట్రెయిట్స్‌ గీయించుకునేవారు. చిత్రాలు గీయించుకోవాలన్న విజ్ఞాపనలు ఎక్కువవడంతో ఒక సమయంలో ఆయనకోసం వాళ్ల ఊరిలో కొత్త తపాలా శాఖను ప్రారంభించాల్సివచ్చింది!

చిత్రంలో స్వేచ్ఛకూ, వ్యక్తీకరణకూ పెద్దపీట వేసే ఆధునిక విమర్శకులు ‘క్యాలెండర్‌ ఆర్ట్‌’ అనీ, ‘ఎకాడమిక్‌ స్టైల్‌’ అనీ రవివర్మను నిరసిస్తారు. అదే సమయంలో, ఆయన గీసిన గరిష్ట హద్దును దాటినవాళ్లు ఇంతదాకా లేరని ప్రశంసించేవాళ్లు కూడా ఉన్నారు. అయితే, భారతీయ సంప్రదాయానికి ఐరోపీయ టెక్నిక్‌ను అద్దిన అద్భుతమైన సంగమంగా మాత్రం ఆయన్ని అందరూ ఒప్పుకుంటారు. అందుకే ఆయన పాతవాళ్లలో కొత్తవాడు; కొత్తవాళ్లలో పాతవాడు.

ఖరీదైన బెడ్రూముల గోడలు దాటిరాని స్వేచ్ఛాయుత పెయింటింగ్స్‌కంటే, మామూలు ఇళ్లల్లోకి కూడా వెళ్లగలిగిన రవివర్మ చిత్రాలు నిక్కమైన మన జాతీయ సంపద!

(సాక్షి ఫన్‌డే; 27 ఏప్రిల్‌ 2014)
––––––––––––––––––––––

Tuesday, September 29, 2026

వట్టికోట ‘పతితుని హృదయం’


వట్టికోట ఆళ్వారు స్వామి

వట్టికోట ఆళ్వారు స్వామి (1915–1960) కథ ‘పతితుని హృదయం’ ఇది. 1952 నాటి ఆయన జైలు కథల్లో సంకలనమైంది. ఉరితీసే శిక్ష్మాస్మృతి స్వభావాన్ని ప్రశ్నించే కథ. తెలంగాణ వైతాళికుడు వట్టికోట. నైజాం పాలనను వ్యతిరేకించి జైలు జీవితం గడిపినవారు. దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. ప్రజల మనిషి, గంగు ఆయన ప్రసిద్ధ నవలలు.

––––––––––––––––––––


చదువుకున్నవాళ్ల మేధావితనం


‘‘అంతా వచ్చారా? ఏం, మగ్గాల చప్పుడు కావడం లేదే’’ అంటూ అధికార ధ్వనిలో డఫేదారు తిరుపతయ్య నేతశాలలో ప్రవేశించి లోపలనున్న ఖైదీలను లెక్కించసాగాడు.

అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు కూడి, ఆనాడు ఉదయం ఉరి తీయబడ్డ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్న ఖైదీలు తిరుపతయ్య రాగానే తమ స్థానాలలోకి వెళ్లి కూర్చున్నారు.

‘‘గండయ్య రానట్టుందే?’’ తిరుపతయ్య ప్రశ్నించాడు.

‘‘రాలేదు సార్‌’’ ఒక ఖైదీ జవాబిచ్చాడు.

‘‘ఎంత చెప్పినా వాడికి బుద్ధి రాదు; ఎప్పుడూ ఎక్కడో తిరుగుతుంటాడు. ఎక్కువ శిక్షవాడని నేను కొంచెం చనువుగా మెదులుతుంటుంటే అధికారులతో నాకు మాట తెచ్చే లాగున్నాడు,’’ అంటూ నేతశాల వదిలి ‘‘మగ్గాలు ఆడనివ్వండి’’ అని ఆజ్ఞాపించి గండయ్య కొరకు బయలుదేరాడు తిరుపతయ్య.

తిరుపతయ్య అటుపోగానే ఖైదీలు మళ్లీ మాటల్లో పడ్డారు.

‘‘చూచావుర! తిరుపతయ్య ముఖంలో ఇంతన్నా విచారముందో!’’

‘‘విచార మెందుకుర? వాడెవడు, వీడెవడు?’’

‘‘పాపము! ఉరితీసిన సంగతి అతని వాండ్లకు తెలుపుతారో, లేదో’’

‘‘తెలిసికొని మాత్రము ఎవరు ఏం చేస్తారు? వచ్చిన దగ్గరకు చేరుకున్నాడు.’’

‘‘అది కాదు కాని, ఓ మనిషిని ఇంకో మనిషి చేతులు కట్టి, ఉరిపెట్టి వ్రేలాడతీస్తే చచ్చిందాక గుడ్లు మిటకరిస్తూ చూడటానికి అక్కడ నిలుచున్న వాండ్లకెట్లా మనసొప్పిందో? నాకైతే అతని పీనిగెను చూడటానికి కూడ మనసొప్పలేదురా!’’

‘‘ఏమి వగలమారి మొగోడివిరా. రేపు నీకు జవాను కొలువిచ్చి ఉరి తీయమంటె తీయక ఏం చేస్తావు? ఖానూను ప్రకారం ఎవరైనా చేయాల్సి వస్తుందోయ్‌. ఖానూనంటే ఏం పిలకాయలాటనుకున్నావా?’’

ఈ విధంగా ఖైదీలు చర్చించుకుంటుండగా తిరుపతయ్య గండయ్యను వెంటబెట్టుకొని నేతశాలకు వచ్చి, మగ్గాల పని ఆగి ఉండుటను చూచి ‘‘మీకేమైంది ఈరోజు పని బొత్తిగా చేయడం లేదు. చెప్తున్నాను బాగా వినండి, మీ అందరిని దొర దగ్గరకు తీసికెళ్లి నిలబెడ్త,’’ హెచ్చరించాడు తిరుపతయ్య.

తిరుపతయ్య వెనుక నిలబడి విచారంతో తల నేలకు వేసివున్న గండయ్య ‘‘దొర దగ్గరికెందుకు? ఉరి దగ్గరికి తీసుకెళ్లరాదు?’’ అంటూ కండ్లనీరు తుడుచుకున్నాడు.

గండయ్య కంటినీరు చూడగానే తిరుపతయ్య చలించిపోయాడు. ‘‘ఈవాళ గండయ్య నాటక మాడుతున్నాడే. ఆడదానిలాగ ఏడ్వటం మొదలుపెట్టాడు. ఒకసారైనా వాడి ముఖం చూచావో లేదో వాడు చస్తే చుట్టం చచ్చినట్టు ఏడుస్తావెందుకు?’’ తిరుపతయ్య టోపి క్రిందబెట్టి బీడీ కాలుస్తూ అడిగాడు.

‘‘మా ఖైదీలకు చుట్టాలము మేము కాకపోతే నీవవుతావా? తిరుపతయ్య, పిల్లలు గలవాడివి, సంసారం చేస్తున్నావు కూడా. 25 ఏండ్ల వయసు కుర్రోడ్ని పెండ్లికొడుకోలె పట్టుకెళ్లి స్తంభాని కేలాడదీయడానికి నీకు చేతులెట్లా వచ్చాయి? నీకు కోపమొస్తె మానెగాని నీవు మనిషివి కావయ్యా!’’ అని గండయ్య గంభీరంగా అన్నాడు.

‘‘పిచ్చోడా, నేను కాకపోతే ఇంకోడు తయారవుతాడు ఈ పనికి. ఉరితీయడానికి మనుషులు లేక ఉరితీయడం ఆగిపోతుందనుకున్నావా?’’ తిరుపతయ్య నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు ముసిముసిగా నవ్వుతూ.

‘‘నీ సంగతే కాదు నేను అనేది, ఉరితీసే వాండ్ల గురించే అడుగుతున్నాననుకో. ఎవడు తీశాడో ఈ పద్ధతిగాని ఉరి తీసిందానికంటే 50 ఏండ్లో 60 ఏండ్లో జైల్లో ఉంచింది మంచిది,’’ గండయ్య అన్నాడు.

‘‘లేకుంటే నీ పద్ధతి అంటే, నీ గ్యాంగు పద్ధతితో చేస్తే యింకా బాగుంటుందిరా?’’ అంటూ హేళనగా నవ్వాడు తిరుపతయ్య.

‘‘తిరుపతయ్య సార్‌! మాకంటే నీవు మెరుగని సంతోషిస్తున్నావ్‌. నీవేమైనా అనుకో, మనసు మండి అనేస్తున్నాను. మేము తప్పు చేస్తే జైలుశిక్ష వేసిన వాండ్లు ఒక మనిషిని ఉరి తీసినవాడికి కూడా కఠినశిక్ష వేస్తే బాగుంటుంది’’ గండయ్య కోపంతో అన్నాడు.

‘‘నేను ఖానూను ప్రకారము ప్రభుత్వ ఆజ్ఞతో ఉరితీశాను తెలుసా! నన్నెవరు శిక్షిస్తారు? సరే కాని, మాటలు చాలా అయినవి. యిక పోయి మగ్గము మీద కూర్చోపో. దొర వచ్చే వేళైంది,’’ అంటూ తిరుపతయ్య డ్రెస్‌ సదురుకొంటూ గేటు వద్ద నిలుచున్నాడు.

‘‘నేను ఇవాళ దొరను కూడా అడుగుతా, ఏమైనాగాని ఇంత అన్యాయంగా ఉరి తీయడం బాగాలేదని,’’ అని గండయ్య కూడా తిరుపతయ్య పక్కన నిలుచున్నాడు.

తిరుపతయ్య కోపంగా నటిస్తూ ‘‘ఒరే! నీకు సిగ్గెందుకు లేదు? నీవు, మీ గ్యాంగువాళ్లు కలిసి ఎంతమంది ప్రాణాలు తీసారురా? ఎంతమంది పెండ్లిండ్లను ఎత్తగొట్టారురా? ఎన్ని కొంపల్ను నాశనం చేశారురా? అటువంటి నీవు ఎవరినో ఉరి తీసినందుకు ఏడుస్తున్నావు? ఏమేమో వాదిస్తున్నావా? పైగా దొరను అడుగుతాడట దొరను. ఎప్పుడైతివి పత్తిత్తువు’’ అని గట్టిగా మందలించాడు తిరుపతయ్య.

గండయ్య కడుపులోని దుఃఖము ఇప్పుడు రౌద్ర రూపము దాల్చింది. తానొక ఖైదీనని, అధికార సిబ్బందిలోని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాననే సంగతే మరిచిపోయాడు. ఉగ్రుడై ‘‘మాటిమాటికి మాతో పోల్చుకోవడానికి నీకు నోరెట్లా వస్తుంది. తప్ప త్రాగి, ఉడికీ ఉడకని మాంసము తిని, బజారు ముండలతో కాలము గడిపే మేము ఒళ్లు మరిచి ప్రాణాలు తీశాం. దార్లు కొట్టి పెండ్లి పిల్లలపై నగలు అపహరించాం, ఇండ్లలో జొరబడి దోచుకున్నాం, మత్తు దిగిం తర్వాత ఒక్కొక్కప్పుడు మా చేష్టలకు మేమే పశ్చాత్తాప పడ్తాం. మేము చదువురాని మొద్దులం, మాలో చదివినోడుగాని, మంచి చెడ్డ తెలిసినోడుగాని ఒకడుండడు. చిన్నప్పటి నుండి దొంగల సావాసంలో పెరిగాం, వాండ్లలో తిరిగాం, అవే బుద్ధులు, అదే బతుకు.

ఇప్పటికైనా మమ్ముల ఈ పనినుండి మాన్పించి, మంచి విద్యావంతులుగా బుద్ధిమంతులుగా తయారు చేయడానికెవరైనా ముందుకొస్తే మా గ్యాంగు మాటేమోగాని నా వరకు నేను సిద్ధంగా ఉన్నాను.

మరి నీ సంగతేమంటావు? ఏదో ఖానూను ప్రకారమని అన్నావే. చదువుకున్న పెద్దలు, మావంటి వాండ్లను జేల్లో పెట్టి బాగు చేయ తలచుకున్న పెద్దలు, మనిషిని చంపేదానికి ఖానూను వ్రాస్తే వాండ్ల నుండి మావంటి వాండ్లు ఏం నేర్చుకోవాలె? ఒకడు మనిషిని చంపడమే తప్పు అంటున్న ఖానూను, ఇంకొకడిని ఉరితీసి చంపమని ఎట్లా అంటుంది? తిరుపతయ్య సార్‌!’’ గండయ్య గుడ్లెర్రజేసి గట్టిగా అడిగాడు.

తిరుపతయ్య వింతగా గండయ్య వైపు చూస్తూ, ‘‘ఒరే! నీకు పిచ్చి లేసేటట్టున్నదిరా పో! లోపలికి పో! దొర వస్తున్నాడు’’ అంటూ తిరుపతయ్య క్రమశిక్షణతో నించున్నాడు. గండయ్య కూడా దూరంగా నిలుచొని జేలరు వచ్చే వైపు చూస్తున్నాడు.

జేలర్, జేలర్‌ వెంట జమేదార్‌ గేటు లోపలికి ప్రవేశించగానే జమేదారు రౌద్రముతో గండయ్య నుద్దేశించి, ‘‘ఏమిరా? నీవు ఈ రోజు గంజి తీసుకోలేదేం?’’

గండయ్య జేలరుకు దండం పెట్టి ‘‘అయ్యా! ఉరితీసినప్పటి నుండి నాకు కడుపులో ఎట్లాగో వుంది. నాకెటు తోచడం లేదు. మీరు చదువుకున్నోరు కూడా ఇటువంటి పనులు చేస్తే ఇక మా సంగతి ఎవరు అడుగాలె’’ అని గండయ్య ప్రశ్నించాడు.

జమేదారు అధికార ధ్వనితో ‘‘నీవు గంజి త్రాగుతావా లేదా?’’ అని గర్జించుచూ ఓరకంటితో జేలరు వైపు చూచాడు.

జేలర్‌ అయోమయ స్థితిలో కపట బింకంతో తలనాడించాడు.

‘‘తాగను సార్‌!’’ గండయ్య నిర్భయంగా జవాబిచ్చాడు.

‘‘ఒంటిగదిలో మూసేసి తర్వాత నా వద్దకు తీసుకొని రండి. వాడికి మంచి బుద్ధి చెప్పితే రోగం కుదురుతుంది. గంజి తాగుతాడు. చదువుకున్నోళ్ల సంగతి తెలుస్తుంది’’ అంటూ వెళ్లిపోయాడు జేలరు.

(సాక్షి సాహిత్యం; 25 మే 2020)


Friday, September 25, 2026

‘సారీలో బడ్డాడు గార్డు’


కవికొండల వెంకటరావు 

కవికొండల వెంకటరావు కథ ‘సారీలో బడ్డాడు గార్డు’ ఇది. కవికొండల(20 జూలై 1892 – 4 జూలై 1969) రాజమండ్రి దగ్గరి శ్రీరంగపట్నంలో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది. కౌమారంలోనే సాహిత్యం పట్ల ఆసక్తివున్న కవికొండల మొదట్లో తన రచనలు ఆంగ్లంలో చేసేవారు. అయితే, ఆయన ప్రతిభను గుర్తించిన కాలేజీ ప్రిన్సిపాల్‌ అయిన ఆంగ్లేయుడు ఒ.జె.కూల్డ్రె, మాతృభాషలో రాయమని సలహా ఇచ్చారట. అట్లా తెలుగులో రాయడం మొదలుపెట్టారు. కథలు, గేయాలు, వ్యాసాలు, నవలలు, ఖండ కావ్యాలు, నాటకాలు, శతకాలు, ఇలా విస్తారంగా రాశారు. కథలే మూడు వందల వరకూ ఉన్నాయి. ఈయన రచనలు 1929 నుంచీ పుస్తకాలుగా వచ్చాయి. ఇనుప కోట(నవల), విజన సదనము(నవల), కుమార కంఠము, నెలబాలుడు, చదువుల దుత్త, చిట్టి కైత(బాలల కోసం ఖండ కావ్యాలు), మాతృదేశ సంకీర్తనము(గేయాలు), జంటలు(వ్యాసాలు) ఆయన పుస్తకాల్లో కొన్ని. తనను ప్రభావితం చేసిన కవి కవికొండల అని శ్రీశ్రీ చెప్పుకున్నారు.

––––

సారీలో బడ్డాడు గార్డు


తెనుగువాళ్లకు ఇతర భాషలు అబ్బవు కాని, ఇతరులకు తెనుగు భాష సుళువుగా యబ్బేటట్టు కనబడుతుంది.

అయినా తెనుగువాళ్లు పక్కా తెనుగు మాట్లాడ్డం గాని వ్రాయడం గాని యరుదు. ఏదో ఇతర భాషల సాంకర్యం వుండక తప్పదు.

’ ’ ’

వానికి ‘‘ట్రేడ్‌లో బలే నేక్‌ వుంది’’ యన్నాడు బస్సులో కూర్చుని వొక కోమటి.

చూడండి: ఇంగ్లీషు మాటలు రెండు ఆ కోమటి గొంతుగ్గుండా గాలిలోకి దొర్లింపబడ్డాయి.

ఇలాగ్గానే హిందీ పదాలు. ప్రతీ నిత్యం కిస్మత్, ఔర, దున్యా ఇత్యాదులు గుండెలు చీల్చుకు వచ్చేస్తుంటాయి ఆంధ్రుని నోట.

అరవం యరచేతిలోని ఉసిరిక ఆంధ్రులకు. ఎన్న, ఇల్లె, కత్తిరికాయ, ములహప్పొడి ఇత్యాదులు కొల్లలు ఉభయ గోదావరీ మండలాల్లోనూ.

మఱి హిందూస్థానీ మాట్లాడ్డానికి తెనుగువాండ్లే మిన్నగాండ్లు. కబడ్డార్, ఖడేరావ్, ఇవన్నీ ఎప్పటికప్పుడు రోడ్డు దుమ్ములా ఎగిరి ఎదరవాణ్ణి దుమ్మెత్తి పోస్తూనే ఉంటాయి.

కాని వొక్క భాషలోనూ యచ్చంగా స్వచ్ఛంగా జటిలంగా శాస్త్రకట్టుగా సంపూర్ణ ప్రజ్ఞ యలవరచుకొన్నది కానరాదు. అలవరుచుకోడు ఆంధ్రుడు.

తన భాషే తనకు రానివాడు మరో భాషలో మాత్రం ప్రవీణుడు కాగలడా? కాలేడు సరిగదా ఎవర్నైనా కుదురైన జాను తెనుగు మాట్లాడేవాణ్ణి చూస్తే ఈసడింపు కూడాను, ఈ రోజుల్లో కూడా ఇంకా వెధవ తెనుగేనా అని.

అంచేత ఈ కథయొక్క మకుటంలోనే రెండు ఇంగ్లీషు మాటలు వాడేశాను. ‘‘సారీ’’ అని, ‘‘గార్డు’’ అని.

‘‘గార్డు’’ యన్నది పూర్తిగా తెనుగుపదం అయిపోయింది యని యనుకోవచ్చు. లోగడ వదినె పాటల్లో ‘‘గార్డు దొర’’ శృంగార నాయకునిగా ప్రవర్తించిన జ్ఞాపకం. అయితే ‘‘క్విట్‌ ఇండియా’’వచ్చాక ‘‘దొర’’ శబ్దం పోక తప్పదు. కాబట్టి కథలో ‘‘గార్డు’’ అనే వాడాను. సింపిల్‌ గార్డు!

దొర– గార్డు అయినా దొర–కాని– గార్డు అయినా ప్రతీ రైలు గార్డూ స్యూట్‌ మీద ట్రిమ్‌గా ఉండక తప్పదు. అందులోనూ మైయిల్‌ గాడీ గార్డు ఈ ‘‘వరల్డు’’ మనిషిలా కనబడడు.

ప్లాట్‌ఫారమ్‌ సిమెంటుదైనా రబ్బర్‌ మీద నడిచినట్టుగా ఎగిరెగిరి పడుతూ నడుస్తాడు. బండి ఆగిన పది నిమిషాలు డైనింగు కార్‌ నుండి కోలింగు ప్లాంకు దాకా, కోలింగు ప్లాంకు నుండి డైనింగు కార్‌ దాకా!

మధ్యే మధ్యే తేనీరుచ్చుకుంటాడు.

మరిన్నీ స్టేషన్‌ మాస్టర్ను మన్నిస్తూ మన్నన లందుకుంటాడు. గడియారం ముళ్లూ కనురెప్పలూ ఏకమయ్యేటట్టు రిస్టువాచ్‌ గమనిస్తూ యుంటాడు.

పచ్చజండా విప్పుతూ ఉంటాడు. చుడుతూ యుంటాడు. అంతా ఎక్కారో లేదో కంటూ వుంటాడు.

బ్రేక్‌వాన్‌లో సామాను లెక్క చూచుకుంటాడు. సహవాసుల్ని చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటాడు. వాళ్ల సౌకర్యాలను గురించి సెంట్‌ పెర్సెంట్‌ యోజిస్తాడు.

ఒక్క ‘‘వర్డు’’లో మెయిల్‌ గాడీ గార్డు ఫుట్‌బాల్‌ గేమ్‌లోని ‘‘ఫార్వార్డు’’ అనుకోండి.

’ ’ ’

గంట కొట్టారు. ఎంజిన్‌ వాటరు తాగి కోల్‌ తిని తయారీలో విసిల్‌ వేసింది. గార్డు పచ్చజండా ఊపడమే తరువాయి. అవితే గార్డు ఎవరికోసమో యన్నట్టు ఇటూ యటూ త్రచ్చాడుతూ పచ్చజండా ఊపడాయిరి. అంతా కిటికీల గుండా గుమ్మాల గుండా బండీ నుండి తొంగి చూస్తూ వున్నారు.

ఒక ప్రయాణీకురాలు– చక్కని చీర కట్టుకు రెండో తరగతి లేడీస్‌ కంపార్టుమెంటు వద్ద ఎక్కకుండా నిలబడివుంది, ప్లాట్‌ఫారమ్‌ మీదనే– గార్డు తన హడావిడిలో ఆమెను చూచాడో లేదో, ఆమె చీర తగిలాడు. తగుల్తూ వెంటనే ‘‘సారీ’’ అన్నాడు.

ప్రేక్షకుల్లో కొందఱు ‘‘మరి గార్డు ‘సారీ’లో బడ్డాడు. మెయిలు వెళ్లినట్లే!’’ అన్నారు.

కొందరు ‘‘గార్డు లోబడ్డాక ‘సారీ’ ఏం? జోలీ గుడ్‌ కంపెనీ’’ అన్నారు.

ఇంగ్లీషు ‘‘సారీ’’కి తెనుగులో రెండర్థాలు. ‘చీర’ అని వొకటి. విచారకరమని వొకటి. కాని ఆ భాషలో వర్ణక్రమం వేఱు– వ్రాయడమంటూ వస్తే.

ఆమె– ఆ స్త్రీ– ‘‘నో మేటర్‌! ఇందులోనేనా కూర్చునేది’’ యని అడిగింది.

గార్డు ‘‘మీ కోసమే చూస్తూ యున్నది’’ అని ఆమెను నఖ శిఖ పర్యంతం చూస్తూ ‘‘చీర కట్టేరే! పోల్చలేకపోయినాను! గెట్‌ ఇన్‌ ప్లీజ్‌! గెట్‌ ఇన్‌!’’ అన్నాడు.

గట్టిగా ఈలేశాడు. పచ్చజండా రంయిని విప్పి వూపాడు. బండీ నడుస్తూయుంటేనే గార్డు తన రేక్‌లోకి, ఎగిరి ఎక్కినట్టు ఎక్కేశాడు.

మహాచెడ్డ నవ్వు నవ్వేశాడు.

’ ’ ’

అయితే వొక సందేహంలో పడ్డాడు. ‘‘ఆ దొరసాని చీరకట్టి తల్లో పువ్వులు కూడా పెట్టుకుందా? లేదా?’’ అని.

అందుకోసం ఆమె తలకట్టెన్ని మాట్లు చూద్దామన్నా గార్డుతో ఆమె ముఖాముఖి మాట్లాడ్డమేగానీ తలకట్టు చూపింది కాదు.

‘‘చీర కట్టుకుంటే ఈ భారతీయులు మమ్మల్ని ఉండనిస్తారనుకుంటాను ఇండియాలో’’ యంది ఓ చోట గార్డుతో.

‘‘చీర కట్టుకుంటే చాలదు. పువ్వులు కూడా పెట్టుకోవాలి’’ అన్నాడు గార్డు.

ఆమె ‘‘అవీ పెట్టుకున్నాను. అదిగో చూడు నా తలకట్టు’’ యని చూపించింది తల్లో పువ్వులు.

‘‘సారీ’’ అన్నాడు గార్డు.

‘‘ఏం?’’ అంది ఆమె.

‘‘ఫువ్వులు డాఫోడిల్సు లాగున్నాయి. డాఫోడిల్సు బిలాంగ్‌ టు ఇంగ్లండు’’ అన్నాడు గార్డు.

‘‘ఐ కాంట్‌ హెల్ప్‌ ఇట్‌. ఆఫ్‌టరాల్‌ వి ఆర్‌ ఏంగ్లో ఇండియన్సు. అవీ పెట్టుకుంటాం. ఇవీ పెట్టుకుంటాం. అన్నీ పెట్టుకుంటాం’’ యంది ఆమె. 

‘‘సారీలో గౌను లేదు కదా?’’యని అడిగాడు గార్డు.

ఆమె చిరునవ్వు నవ్వింది.

‘‘ఇండీడ్‌. ఎవెరీ సారీ ప్రోబ్లెమ్‌. దిస్‌ క్విట్‌ ఇండియా ప్రోబ్లెమ్‌. యు సీ. బ్లడ్‌ ఈస్‌ థిక్కర్‌ దాన్‌ వాటర్‌. బట్‌ వాటర్‌ ఈస్‌ ఎస్సెన్షియల్‌ ఫర్‌ మై ఎంజిన్‌. ఐ కాంట్‌ లీవ్‌ దిస్‌ ఎంజిన్‌. ది ఇంగ్లీష్‌మన్‌ కాంట్‌ లీవ్‌ యు’’ యన్నాడు గార్డు. అంటూ ఆమె సారీకేసి మరోసారి చూచాడు.

ఆమె ‘సారీ’ అంది.

(సాక్షి సాహిత్యం; జూన్‌ 1, 2020)

 

Monday, September 21, 2026

‘నిద్ర రావడం లేదు’

 


త్రిపుర

అరుదైన కథకుడు త్రిపుర ‘నిద్ర రావడం లేదు’ పూర్తిపాఠం ఇది. ఆయన కథల సంపుటిలో లేని ఈ కథ రచనాకాలం 1988.

–––

గొర్రె దారి గొర్రెదే

బుర్ర దారి బుర్రదే


రైళ్లు కుడి చెవిలోంచి దూరి ఎడమ చెవిలోంచి పైకి పోతున్నట్లు, ఎడమవేపు తిరిగి పడుకుంటే ఎవరో ఎర్రటి గోళ్లతో మెడపట్టుకుని చీరుతున్నట్టు, కుడివేపు తిరిగితే డేల్మేషన్‌ కుక్క, ఎలుగుబంటి లాంటిది, ఆకురాయిలాంటి నాలికతో పరపర నాకుతున్నట్లు...

లేచి, అద్దంలో చూసుకుంటే కళ్లల్లో ఒక్క అయోటా అయినా నిద్ర కనిపించదు. రిస్ట్‌వాచ్‌లో కాలం ఘోరంగా ముందుకు రాత్రిలోంచి తోసుకుంటూ... రెండు గంటల యిరవయి నిమిషాల పదహారు సెకండ్ల... పదిహేడు...

జగ్‌లోంచి మెల్లగా గ్లాస్‌లో నీళ్లు పోసి మె..ల్ల..గా తాగి, ఆవులించి, పక్కమీద మల్లెపువ్వులాంటి షీట్‌మీద ఒళ్లు విరుచుకుంటూ పడుకుని– నటన– మళ్లీ ఆవులిస్తూ, కళ్లు మూసుకుని, ఆ క్షణంలో నిద్రపోయేవాడిలా– అంతా నటన– ఒళ్లు కొంచెం ముడుచుకుని– అంతా ఎంత నటన– మిల్లులో నలిగి అలిసిపోయిన పెద్ద కూలీలాగ... ఏవో కలలొస్తున్నట్లు ఊహించుకోబోతూ వుంటే... డేల్మేషన్‌ గుర్రుమంటూ నాలికతో... ఈసారి ఎముకల్ని గీరుతున్నట్లు. ఆ ఎవరివో గోళ్లు, పారల్లాంటి గోళ్లు, మెడలో గుచ్చుకుంటున్నాయి.

‘‘పాత విషయాలు, తియ్యటివి, ఏవో జ్ఞాపకం తెచ్చుకుంటూ పడుకో’’ అని ఎప్పుడో అన్నాడు భుజంగం ది సైకో అనలిస్ట్‌... పెన్సిల్‌ చెక్కుతూ దోసకాయ తరిగినట్లు తరగబడిన ఎడమచేతి చూపుడు వేలూ, అమాయకంగా పుస్తకం తీసి దుమ్ము దులుపుతుంటే క్రూరంగా కుట్టిన ఎర్రతేలూ, పరధ్యాన్నంగా ఎదురింటివేపు చూస్తుంటే తన వేపే ఎప్పుడూ కళ్లప్పజెప్పి చూస్తుంటాడని భర్తతో రిపోర్ట్‌ చేసిన మహా యిల్లాలూ, కటకటాల్లో ఏమీ తోచక పెడితే మళ్లీ తిరిగి రాదనుకున్న కుడికాలూ, ఆకాశం అంత న్యూస్‌పేపర్‌ పేజీలో బొక్కిపన్నులాగ నా నంబరే లేని పరీక్షా ఫలితాలూ...

యివీ.

ఎవరివో ఆ గోళ్లు జాగ్యులర్‌ రక్తనాళంలోకి గుచ్చుకుని...

డేల్మేషన్‌ స్థిరంగా కూచుని ఎముక చుట్టూ మిగిలిన మాంసాన్ని చీకుతూ...

‘‘అది కూడా పని చెయ్యకపోతే గొర్రెల్ని లెక్కపెట్టు. వెస్టర్నర్స్‌ అలాగే చేస్తారు’’ అన్నాడు ఈ మధ్యనే భుజంగం ది సైకో. భుజంగానికి క్లయింట్స్‌ లేరు. సెల్ఫ్‌ మీదనే ప్రయోగాలు. దారిన పోతూంటే నేనొకణ్ణి దొరికాను. మొత్తం ఇద్దరు.

... తొమ్మిది వందల తొంభయి ఆరు... తొమ్మిది వందల తొంభయి ఏడు... ఎన్నో వందల నలభయి ఎనిమిది... ఎన్నో వందల నలభయి తొమ్మిది...

గొర్రెల్ని దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. చూసినట్లు జ్ఞాపకం లేదు. చాలాకాలం నుంచీ నాలో ఒక ఊహ. పల్లెటూర్లో నాకో ఇల్లు. గజపతి నగరంలో? కారంపూడిలో? తాడి, దువ్వాడ, బండ మీద? కమ్మ పల్లె? నాకో పెద్ద పొలం. ‘‘మాగాణి’’. నాకో రైతు. వెంకయ్య? ఈరినాయుడు? గురప్ప? రొబ్బి సోమన్న? సోమన్నే. వాడి పాకలో గొర్రెలు, మేకలు, ఆబోతులు. కొట్టాం. నేనక్కడికి సమ్మర్‌లో శిస్తులు వసూలికి. చిన్నస్టేషన్‌ దిగి ఎద్దుబండి. రామినాయుడు, కాదు సోమన్న వంగి వంగి దండాలు. డబ్బు, నలిగిన నోట్లు. వేడిగా పాలు కంచుగ్లాసులో. ఇంటి వెనక గొర్రెలు. గొర్రెలెలా వుంటాయి? మేకల్లాగ వుంటాయా? అసలు మేకలెలా వుంటాయి? ఇంకా అసలుకి వస్తే మేకలంటే ఏమిటి? గొర్రెలకీ, మేకలకీ భేదం?

... ఏభయి వేల తొంభయి నాలుగు... ఏభయి వేల తొంభయి ఆరు... తొంభయి వేల తొమ్మిది వందల ముప్పయి నాలుగు...

ఈ గొర్రెలు పెరట్లో కంచెమీంచి గెంతుతున్నాయి. గెంతుతుంటే నా లెక్క.

పక్కింటి ‘‘బుగత’’ కిష్టయ్య కూతురొచ్చి వీధిలో నిలబడి అరుస్తూంది. తలుపు రెండంగుళాలు తెరిచి ‘‘ఎందుకు?’’ అన్నాను.

‘‘మీ గొర్రెలు మా చేన్లోపడి పెసలన్నీ తినేస్తున్నాయి.’’

ఎడ్మినిస్ట్రేటివ్‌ ప్రాబ్లమ్‌. డెసిషన్‌ తీసుకోవాలి చప్పున. సోమన్నని పిలిచి ‘‘చూడు. ఏదో చెయ్యి’’ అన్నాను. సోమన్న ఒక కర్ర– లావుగా, గుణుపులతో?– పట్టుకుని పంచ పైకెగ్గట్టి దూకేడు కిష్టయ్య చేన్లోకి. కర్రతో సాము చెయ్యడం మొదలు పెట్టేడు. గొర్రెలు రూట్‌ మార్చి వెనక్కి తిరిగి గెంతుతున్నాయి.

... తొంభయి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పయి అయిదు... తొంభయి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పయి ఆరు... తొంభయి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పయి ఏడు...

గొర్రెల కాళ్లు విరుగుతున్నాయి. పుర్రెలెగుర్తున్నాయి. చెవులు, గొర్రెకి చెవులుంటాయా?– చెవులు తెగుతున్నాయి. నిండుగా, అన్ని అవయవాల్తోనూ లేవు గొర్రెలు.

... ఎన్నో వేల ఎన్నో వందల ముప్పయి ఆరూ డెసిమల్‌ రెండూ... డెసిమల్‌ మూడూ... పాయింట్‌ నాలుగూ... డెసిమల్‌ అయిదూ... ఎన్నో వేల ఎన్నో వందల ముప్పయి ఒకటీ పాయింట్‌ ఆరూ...

సోమన్నేడీ? గెంతే గొర్రెనొక(డి)ని? నొక(ర్తి)ని? పట్టుకుని, విప్పిచూస్తే పళ్లు రక్తమయం. సోమన్నేడీ? చేనంతా వెతికితే ఓ మూలన సోమన్న– ఉత్త ఎముకలతో సోమన్న– గొర్రెలు తినేశాయి సోమన్నని.

ఇంకో ప్రాబ్లమ్‌. ఊరి చివర పోలీస్‌ ఠాణా. కేసులు ఏమీ లేక, ఏమీ తోచక, ఠాణా కాంపౌండ్‌లో బంతి మొక్కలు పెంచుతున్న రేలంగి లాంటి కాన్‌స్టబుల్‌తో ‘‘సోమన్నని గొర్రెలు తినేశాయి. రాసుకోండి’’ అని చెప్పి, వెనక్కి తిరిగి రాబోతూంటే, చెయ్యి పట్టుకులాగి, బఱ బఱ వీధిలోకి లాక్కొచ్చి, టౌనుకు పోయే ఒక లారీ ఎక్కించి, నాతోనూ తనూ వచ్చి, భుజంగం ఇంటికి తీసుకు వచ్చి తలుపు తట్టేడు రేలంగి.

భుజంగం తలుపు తీస్తుంటే పై నుంచి, అంటే తలుపు మీదనే పెట్టివుంచిన ఒక బకెట్‌ నీళ్లు పడ్డాయి ముగ్గురి మీదా.

‘‘బకెట్‌ కాంప్లెక్స్‌. ఓల్డ్‌ జోక్‌. లారెల్‌ అండ్‌ హార్డీ. జడవకండి. తడిపినా వణక్కండి. బెదరక లోనికి రండి’’ అన్నాడు. లోపలికి తీసుకు వెళ్లేడు.

‘‘ఎన్ని?’’ అన్నాడు.

‘‘ఎన్నో వేల ఎన్నో వందల ముప్పయి మూడూ’’ అన్నాను తడుముకోకుండా.

నోట్‌ చేసుకున్నాడు నల్లటి డైరీలో.

రేలండి అడిగేడు. ‘‘నన్ను కూడా నోట్‌ చేసుకోమంటారా?’’

‘‘వీడెవ’’డన్నాడు భుజంగం.

‘‘వీడో బంతి మొక్క. వీడి కడ నిలచి, చివాలున వంచి...’’

‘‘బంతి మొక్కయితే వెళ్లి బంతి పువ్వులు పూయమను. ఎర్రటోపీ పూస్తాడెందుకూ?’’

‘‘అదొక ఎబరేషన్‌’’ అన్నాను సంజాయిషీగా.

రేలంగి ఒక విలన్‌ నవ్వు నవ్వి, ‘‘నాకన్నీ తెలుసు. ఫ్రాయిడ్, యుంగ్,..., ఆల్బర్ట్‌ కామూ నేను చదవలేదనుకున్నారా. అదంతా మా ట్రెయినింగ్‌లో వుంది. అంతా కొట్టిన పిండే మాకు. అయినా, అంతగా మీరు యిదవుతుంటే...’’ అంటూ బంతిమొక్కగా మెల్లగా మారుకుంటూ అలాగే నడుస్తూ పైకి వెళ్లిపోయాడు.

భుజంగం చెక్కిన పెన్సిల్‌ ముల్లుని కసిగా నోట్లో పెట్టుకుని నములుతూ ‘‘ఇదిగో. నేనొక టెస్ట్‌ చేస్తాను’’ అని టేబుల్‌ కింద దూరి, ఏదో తీసి, పైకి లేచి చేత్తో ఒక చాకు చూపించి,

‘‘దీన్ని చూస్తే నీకు తట్టే మాటేమిటి??’’ అని అడిగేడు.

‘‘మళ్లీ’’ అన్నాను.

బోధపడలేదు భుజంగానికి. ‘‘ఏమిటి?’’ అన్నాడు.

‘‘మళ్లీ టేబుల్‌ కింద దూరి అది తియ్యి’’ అన్నాను. ‘‘అప్పుడేదో మాట తట్టుతుంది.’’

పేరు భుజంగం అయినా మనిషి భల్లూకం. మళ్లీ కింద దూరి వగరుస్తూ పైకి లేచి ‘‘ఇప్పుడూ?’’ అన్నాడు ఆయాసపడుతూ.

‘‘యథార్థం.’’

‘‘మరీ ఆబ్వియస్‌. ఇంకో టెస్ట్‌.’’ టేబుల్‌ డ్రాయర్‌ లోంచి ఏదో తీసి చూపించకుండా, ‘‘ఇదేమిటో చెప్పు’’ అన్నాడు.

‘‘ఖడ్గమృగం తోలుతో తయారుచేసిన ఏష్‌ ట్రే. దీనిని పలు విధముల ఉపయోగించవచ్చు. ఒకటి...’’

‘‘నక్కలాంటి వాడివి. జిత్తులమారి. కలా లేదూ, పాడూ లేదూ, కాంప్లెక్సూ లేదూ. పో’’ అని లోపలికి పాములాగ జరజర పాకిపోయాడు.

తిరిగి వస్తుంటే సోమన్న ఎదురుపడ్డాడు. ‘‘బెంబేలు పడకండి. నేను సోమన్ననే. గొర్రెలు తినేసింది కిష్టయ్యని’’ అన్నాడు.

‘‘అయితే, కోర్టులో ఎలా’’ అన్నాను వర్రీడ్‌గా.

... ‘‘సోమన్నని గొర్రెలు తినేశాయా? గొర్రెల్ని సోమన్న తినేశాడా? సదరు సోమన్న బతికే ఉన్నాడా? సదరు గొర్రెలు, సదరు కిష్టయ్య... యివన్నీ చాలా భారీ విషయాలు. జ్యూరీ వారు సావకాశంగా ఆలోచించి నిర్ణయానికి రండి’’ అన్నారు జడ్జ్‌.

‘‘నాట్‌ గిల్టీ’’ అన్నారు జ్యూరీ ఒక్క గొంతుకతో, ఆ క్షణంలోనే.

‘‘ఎవరు నాట్‌ గిల్టీ? ఏమిటి మీ వాగుడు’’ కోపంగా జడ్జ్‌.

‘‘మాకేం పని లేదా? మీ ప్రశ్నలకి జవాబులివ్వడానికి. పొలాలు దున్నుకోవాలి. నార్లు పాతాలి. ఏతాం కిర్రు. జనప... కలప... అంటు మామిడి గెలలు... గెత్తాం... కవులుకి...’’ అంటూ జ్యూరీ కండువాలు దులుపుకుంటూ పైకి గొర్రెల మందలాగ వెళ్లిపోతూ వుంటే...

ఎన్నో లక్షల, యిన్ని వేల, అన్ని వందల నలభయి ఆరో గొర్రె కిష్టయ్య చేన్లోంచి పక్కనున్న మిషనరీ కాంపౌండ్‌ గోడ మీంచి గెంతుతూంది. గోడ గడియారం ఐదు కొట్టింది. ఐదు కొట్టిందా? ఒంటిగంట ఐదుసార్లు కొట్టిందా?

(సాక్షి సాహిత్యం; 11 ఫిబ్రవరి 2019)


Thursday, September 17, 2026

ఇదే భాగ్యనగర్‌ కథ


శొంఠి కృష్ణమూర్తి

శొంఠి కృష్ణమూర్తి రచన ‘భాగ్యనగర్‌’ ఇది. తెలంగాణ మలితరం కథకుల్లో ఒకరు. 1924 నవంబరులో తూర్పు గోదావరి జిల్లాలోని సోమేశ్వరంలో జన్మించారు. ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డారు. ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. 1990 జూన్‌లో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఈయన కథల్ని ‘నవచేతన’ పునర్ముద్రించింది. కథలు రాయడమెలా అనే పుస్తకాన్ని కూడా కృష్ణమూర్తి రాశారు. 

----

 ఇదే ఇదే భాగ్యనగర్‌


ఎర్రటి నీరెండలు లోకాన్ని అరుణకాంతితో నింపుతున్నాయి.

దూరాన్నుండి అతివేగంతో, తన గర్భంలో యెన్నో గత చరిత్రల్ని దాచుకున్న కాలిబాట దుమ్ముని రేగకొడుతో వస్తున్న గుర్రం డెక్కల చప్పుడు అకస్మాత్తుగా ఆగింది.

అది మూసీ నదీతీరంలో వున్న పల్లెటూరు. పెద్ద పూలవనం. చుట్టూ ముళ్లకంచె. ఆ తోటలో పద్దెనిమిదేళ్ల అమ్మాయి. పూలు తెంపుతో పాడుకుంటూ వుంది.

మరుక్షణంలో గుర్రాన్ని వెనక్కి నాలుగడుగులు నడిపించి, ఆ రౌతు కంచెను దాటించి, ఆ అమ్మాయి వద్ద ఆపాడు. ఆవిడ భయపడి పూలసెజ్జని కింద వొదిలేసింది.

అతడు గుర్రం దిగి పూలసెజ్జను అందించబోయాడు. ప్రేమ ధారలు కురిపిస్తో ‘‘ఎవరు నువ్వు?’’ తీయని కంఠస్వరంతో అన్నాడు.

ఆ అమ్మాయికి కోపం వచ్చింది. తన తోటలోకి వచ్చి, తననే యెదురు ప్రశ్నిస్తున్నాడు.

‘‘నువ్వెవరు?’’ అంది.

‘‘మహారాజుని’’

మళ్లీ మొహంలోకి చూసింది. ‘‘ఇక్కడేం పని?’’ అంది, వీడని ధైర్యంతో.

‘‘వేటకోసం బయలుదేరాను. వొఠ్ఠి చేతుల్తో తిరిగిపోవడం ఇష్టంలేక...’’

పచ్చగడ్డి మీద చతికిలబడ్డాడు. గుర్రం తోచక సకిలించింది.

‘‘పల్లెల్లో ఏం వేట? అడవికి వెళ్లండి’’ అంది.

‘‘అడవిలో ఏదీ దొరక్కే ఇక్కడికి వచ్చా.’’

‘‘దయచేసి అవతలకు దయచెయ్యండి.’’

‘‘ప్రణయంలోనూ, రణంలోనూ వెనుకాడ్డం రాజలక్షణం గాదు’’ అన్నాడు, నోటితో గడ్డిపరకను కదిలిస్తో. ‘‘ఒకసారి మొహమెత్తి ఇటుచూడు... నా హృదయేశ్వరివి.’’

ఆ అమ్మాయి ఉక్కిరి బిక్కిరయింది.

అతనో గులాబీ పువ్వుని తెంచుకొచ్చాడు. ‘‘చూడు! అందమైన గులాబీ చెట్టుకీ ముళ్లున్నాయి; నీకూ ముక్కున కోపం ఉంది. అదే దేవుడి సృష్టిలో వింత అనుకుంటాను’’ అన్నాడు.

ఓరగా చూసింది. ‘‘ఆ ముళ్లు చేరేవాళ్ల తెలివిని బట్టి బాధించవు.’’

అతని కళ్లల్లో సంతృప్తి తాండవించింది. ‘‘నీ సౌందర్యాన్ని చూసి ముగ్ధుణ్ణయ్యాను. నీ పాదాల చెంతకు వచ్చి ప్రేమభిక్ష కోరాను.’’

ఆ అమ్మాయి మాట్లాడలేదు.

‘‘మాట్లాడవేం?’’ అని చేతులు పట్టుకున్నాడు.

అంతలోకి ‘‘భాగ్యం; భాగ్యం’’ అని అరుపులు వినపడ్డాయి.

‘‘మా నాన్న! నేను పోవాలి’’ అంది కంగారుగా.

‘‘నీ పేరు?’’

‘‘భాగ్యమతి’’


2

క్షణికమాత్రపు నిర్ణయాలెన్నో చరిత్ర రీతుల్నీ, తీరుల్నీ మార్చిన సందర్భాలున్నాయి. 

క్రమంగా భాగ్యమతికి ఆ నూతన యువకునితో పరిచయం ఎక్కువైంది. రహస్య సమావేశాలు, ప్రణయ కలాపాలు ఎక్కువయ్యాయి. భాగ్యమతి అతన్ని చూడందే ఒక్కరోజూ గడపలేకపోయేది. అతనూ అంతే! భాగ్యమతి సందర్శనా భాగ్యరహితుడై మనలేకపోయేవాడు.

అది వర్షాకాలం. ఉదయం మొదలు ఎడతెగని వర్షం కురుస్తోంది. కారు మేఘాలు క్రమ్మటం వల్ల సాయంత్రమే చీకటి పడినట్టుగా ఉంది. మూసీనది, వర్షపు నీరు చేరడం వల్ల వెల్లువలై పారుతోంది. ఆకాశంలో మెరుపులూ ఉరుములూ ఏదో ప్రళయం రాబోతున్నట్టుగా సూచిస్తూ వున్నాయి.

‘‘చలో, చలో’’ అంటూ కొరడాతో గుర్రాన్ని అదిలిస్తూ మన పరిచయస్థుడు ఏటికి అడ్డంగా ఈదసాగాడు. అతి కష్టం మీద అరగంట తర్వాత నాలుగు ఫర్లాంగుల దిగువన గట్టు చేరుకున్నాడు. అలసిపోయిన గుర్రం నురగలు గ్రక్కుతోంది.

పాకలో నుండి– ‘‘వచ్చారా?’’

‘‘ఎందుకు రాను?’’

‘‘ఇంత వర్షంలో...’’

‘‘నువ్వు మాత్రం యెందుకు నిరీక్షిస్తున్నావ్‌?’’

అతనామెను కౌగిట్లోకి తీసుకున్నాడు. ఇద్దరు కొన్ని క్షణాలు మాట్లాడలేదు.

‘‘మీరు ఇట్లాంటి దారుణానికి తయారైతే ఎలా? తుఫానులో వొస్తే వొప్పుకునేది లేదు.’’

‘‘రాణి గారి ఆజ్ఞ అనుసరించక తప్పుతుందా?’’

కొంతసేపు గడిచింది. బుగ్గమీద మీటి గుర్రాన్ని ఎక్కి వెళ్లిపోయాడు. ఎక్కడో దూరంగా పిడుగు పడినట్టయింది. భాగ్యమతి గుండెల్లో రాయిపడింది.


3

పదిహేను రోజుల వరకూ భాగ్యమతి ప్రియుని కోసం వృథాగా ఎదురు చూసింది.

పై సంఘటన జరిగిన రెండు రోజుల్లోనే మూసీనది వద్ద వంతెన నిర్మాణం ప్రారంభమైందని వింది.

గోల్కొండ నవాబ్‌ సుల్తాన్‌ ఇబ్రహీం కుతుబ్‌షా గారికి యువరాజు మహమ్మద్‌ మూసీనదిని దాటి జ్వరం పడ్డాడనే వార్త విచారాన్ని కలిగించింది. వెంటనే హకీముల్ని పిలిపించి వైద్యం చేయించసాగాడు. తన వజీర్‌ సాహెబ్‌కు తక్షణం మూసీనదిపై నెల లోపల వంతెన నిర్మించాలని ఫర్మానా జారీ చేశాడు.

ఇబ్రహీం కుతుబ్‌షా 1550 నుండి 1580 వరకు గోల్కొండ ఆంధ్రసామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప విద్వాంసుడు. అప్పుడు రాజ్యం ఒరిస్సా నుండి పెన్న వరకు విస్తరించి వుండేది. టర్కీ, అరేబియా, పర్షియా వరకు వర్తక వ్యాపారాలుండేవి. ఎంతోమంది తెలుగు కవులను పోషించాడు. ‘మల్కిభరాం’ పేరుతో ఆయన్ని తెలుగు కవులు కీర్తించారు. 

యువరాజు పది రోజుల వరకూ మూసిన కన్ను తెరవలేదు. అన్నాళ్లూ ఏదో కలవరిస్తూనే ఉన్నాడు. కాని వివరాలు ఎవరికీ తెలీలేదు. వైద్యులు మాత్రం యువరాజు ఏదో మనోవ్యధతో బాధపడుతున్నారని కనుగొన్నారు.

మహమ్మద్‌ కొంచెం కోలుకోగానే ‘‘భాగ్యమతీ, భాగ్యమతీ!’’ అని పలవరించసాగాడు. ఈ వార్తను విన్న సుల్తాన్‌ కొడుకును చూడ్డానికి వచ్చాడు. అప్పటికి అందరికీ తెలిసింది. యువరాజు పడిన ప్రణయమే ఇంత ప్రళయాన్ని కొని తెచ్చిందని.


4

మరో నెల రోజులు గడిస్తేనేగానీ యువరాజు పూర్తిగా ఆరోగ్యవంతుడు కాలేడు. అప్పుడు సుల్తాన్‌ యువరాజును ‘బాలా హిస్సార్‌’నకు పిలిపించాడు.

మహమ్మద్‌ కొంచెం బలం చేరినప్పట్నుంచీ కూడా న్యాయశాలపై డాబా మీదికి పోయి, సాయంత్రం వేళలందు మూసీనది వైపూ, మూసీనదికి ఆవలవున్న పల్లెవైపూ శూన్యదృక్కుల్ని ప్రసరిస్తుండేవాడు. అక్కడి నుంచీ చూస్తే ముప్పై మైళ్ల వరకూ కనబడతుంది.

ఒకనాడు అలాగే భాగ్యమతిని తల్చుకుంటూ వుంటే సుల్తాన్‌ వారి కబురు వచ్చింది. వెంటనే వెళ్లాడు. 

‘‘భాగ్యమతి ఎవరు?’’ అని నవ్వుతో ప్రశ్నించాడు. యువరాజు నుంచునే సిగ్గుతో తలవంచుకున్నాడు.

‘‘గొప్ప గొప్ప వజీర్లు, సర్దారులు కోట్ల కొలది హొన్నులతో తమ అపురూప సుందరులైన కన్యల్ని ఇస్తామంటుంటే ఇదేమిటి?’’

‘‘నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను.’’

‘‘మన ఇస్లాం మతం?’’

‘‘మీరు అన్నీ తెలిసినవారు. హిందూ, మహమ్మదీయ సఖ్యతకు పాటుపడేవారు.’’

‘‘నీ ఇష్టం. ఆలోచించు. నువ్వు కాబోయే సుల్తాన్‌వని గుర్తుంచుకో.’’


5

కాలచక్రం దొర్లిపోయింది. ఇబ్రహీంషా మరణించడం, మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా 1580లో రాజ్యాభిషిక్తుడవడం జరిగింది. భాగ్యమతి పట్టమహిషి అయింది. సిలాఖానా దక్షిణముగా ఆవిడకై ప్రత్యేక భవనం నిర్మించారు. అంబర్‌ ఖానాకు సమీపంలోనున్న గుహలో ఒక దేవాలయం నిర్మించారు. భాగ్యమతి అక్కడే రోజూ దేవి పూజ కావించుకునేది.

మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా సుల్తాన్‌గా వున్నప్పటికి దాదాపు ఆంధ్రదేశమంతా గోల్కొండ నవాబుల పాలనలోకి వచ్చింది.

రాజ్యానికి వచ్చిన పది సంవత్సరాల తర్వాత 1589లో గోల్కొండ సుల్తాన్‌ సతీ సపరివారంగా తాము కట్టించిన చార్‌మినార్‌ చూడ్డానికి వెళ్లారు. పక్కనే జుమ్మా మసీదు గొప్ప నేత్రానందాన్ని కలిగిస్తోంది. లెక్కలేనన్ని పావురాలు మసీదు మీద నివాసం చేసుకున్నాయి.

మూసీనది కిరువైపులా పూర్వపు పల్లెటూరు పెద్ద బస్తీగా మారిపోయింది. చార్‌మినార్‌ చుట్టూ చార్‌ కమాన్లు నిర్మించబడ్డాయి. విదేశీ వ్యాపారస్థులందరూ ఇక్కడే నివాసాలు ఏర్పర్చుకొని, అవసరమున్నప్పుడు దుర్గానికి వెళ్లి వస్తోవుండేవారు. విదేశీ రాయబారుల నివాసాలు కూడా ఇక్కడేవుండేవి.

భాగ్యమతితోపాటు సుల్తాన్‌ చార్‌మినార్‌ ఎక్కారు. మూసీనదిని, మరొక పక్క గోల్కొండ ఖిల్లాను చూసి భార్యాభర్తలు ముగ్ధులైపోయారు. మరొక పక్క మూసీనదికి ఆవలగా అల్లంత దూరంలో పూలతోట.

‘‘భాగ్యమతీ!’’ అన్నాడు సుల్తాన్‌.

‘‘ఏం ప్రభూ!’’

‘‘అక్కడ చూడు, ఆ పుష్పవనం! ఈ భాగ్యమతి, నా పాలిటి భాగ్యదేవత, ప్రథమ సందర్శనా భాగ్యాన్ని కలిగించిన పూదోట అదిగో.’’

భాగ్యమతి ముఖం మీది పల్చని తెరచాటు నుంచి, పొంచి చూసే చంద్రబింబంలా పటాన్ని తిలకిస్తోంది. 

‘‘నువ్వు నా పాలిటి భాగ్యదేవతవే కాదు, గోల్కొండ సామ్రాజ్యపు భాగ్యలక్ష్మివి. నీ పేరు మీదుగా, కలకాలం మన ప్రేమ ఈ లోకంలో నిలిచివుండేలా ఈ నగరానికి నేటి నుండి భాగ్యనగర్‌ అని పేరు పెడుతున్నాను.’’

‘‘ధన్యురాల్ని ప్రభూ. ప్రభువులు అన్నిటికీ సమర్థులు.’’ భాగ్యమతి హృదయం పొంగిపోయింది.

’

ఆ భాగ్యనగరే నేటికీ భోగ, భాగ్యాలతో విలసిల్లుతున్న హైదరాబాద్‌!


(సాక్షి సాహిత్యం; 2020 సెప్టెంబర్‌ 14)


Sunday, September 13, 2026

మనసు కవి


ఆచార్య ఆత్రేయ
7 May 1921 - 13 Sep 1989

 మనసు కవి

ఆత్రేయ అంటే అర్థం చంద్రుడు. సినీవినీలాకాశంలో ఆయన కాచిన పున్నమి వెన్నెళ్లు ఎన్నని! ‘మనసు మూగదేకాని బాసుంటది దానికి/ చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇదీ’. ‘నేనొక ప్రేమ పిపాసిని/ నీవొక ఆశ్రమవాసివి’. మనసంత సున్నితమైన మాటలు అల్లినవాడూ, మనసు మర్మాన్ని ఎరిగినవాడూ, మనసయ్యేలా రాసినవాడూ కాబట్టే ఆత్రేయ ‘మనసు కవి’ అయ్యాడు.

ఆత్రేయ అన్న గోత్రనామాన్నే కలంపేరుగా చేసుకున్న కిళాంబి వెంకట నరసింహాచార్యులు... కప్పలు, ఈనాడు, ఎన్జీవో, విశ్వశాంతి లాంటి నాటకాలతో ప్రజాదరణ పొంది సినీరంగంలోకి వచ్చాడు. ‘ఈ భూమి తిరిగేది రూపాయిచుట్టూ’ అని ఆయనకు తెలుసు. ‘కాటికెళ్లితే అందరూ ఒకటే అనుకోబోకు/ అక్కడ కూడా తేడాలున్నాయి కాలేవరకు’ అనీ తెలుసు. కాబట్టే, సమసమాజం ఆదర్శంగా రచనలు చేశాడు. ‘మన భూమి వేదభూమిరా తమ్ముడూ/ మన కీర్తి మంచుకొండరా’ అని పనికిరాని గతాన్ని ఎద్దేవా చేశాడు. ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిచాన (ను) బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా’ అని ప్రశ్నించాడు.

అంతులేని కథ, అభినందన, అర్ధాంగి, ఆరాధన, జయభేరి, డాక్టర్‌ చక్రవర్తి, దసరా బుల్లోడు, నీరాజనం, ప్రేమనగర్, సెక్రటరీ, వెలుగు నీడలు లాంటి సుమారు రెండు వందల చిత్రాలకు మాటలూ, రెండు వేల వరకు పాటలూ రాశాడు ఆత్రేయ. మాటలతో దుఃఖపెట్టాడు. ‘మనిషికి చాలా కాలం బ్రతుకుతాడన్న అబద్ధం కంటే, నేడో రేపో చచ్చిపోతాడన్న నిజం తెలియడం చాలా మంచిది. చేయదల్చుకున్న మంచి ఏదైనా ఉంటే అప్పుడే చేస్తాడు’: వెలుగు నీడలు. పాటలతో సంతోషపెట్టాడు. ‘పెళ్లంటే– పందిళ్లు సందళ్లు/ తప్పట్లు తాళాలు తలంబ్రాలు/ మూడే ముళ్లు ఏడే అడుగులు/ మొత్తం కలిపి నూరేళ్లు’: త్రిశూలం.

‘అమ్మంటే అమ్మ/ ఈ అనంతసృష్టికి ఆమె అసలు బ్రహ్మ’ అన్న ఆత్రేయ చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు. ప్రేమించిన ప్రియురాలి చేయిని అందుకోలేకపోయాడు. ‘అనుకున్నామని జరగవు అన్ని/ అనుకోలేదని ఆగవు కొన్ని/ జరిగేవన్నీ మంచికని/ అనుకోవడమే మనిషి పని’ అంటాడో చోట. జీవితం పట్లా, పొందలేనిదాని పట్లా సమాధానం పడటానికి పడే తపన కావొచ్చది. తన యౌవనంలో ఇష్టపడ్డ ‘బాణం అనే అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయిన నలుగుబాటు ఆయన్ని జీవితాంతం వెంటాడింది. ‘నిన్ను ఏమీ సుఖపెట్టలేకపోయాను, నేనూ సుఖపడ్డదీ లేదు,’ అని భార్య పద్మావతికి రాసిన ఉత్తరంలో ఆయన పడిన క్షోభ తెలుస్తుంది.

మనసున్నవాడికి మథనమే మిగిలేది! అది లేకపోవడమే ఒక్కోసారి మేలేమో! ‘తీపి మాటలు గొంతు కోతలు/ నరులకు మాకే సొంతం’ అన్నట్టుగా చరించే మనుషుల మధ్య, మనసనే మధుకలశంలో విషపుచుక్కలు జార్చే కఠిన పాషాణుల మధ్య మనసున్నవాడుగా బతకడం కష్టం. ఆ నిష్టూరంలోంచే కాబోలు, ‘మనసు గతి యింతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికీ సుఖము లేదంతే’ అన్నాడు. ‘బ్రతికుండగా నిన్ను ఏడిపించినోళ్లు/ నువ్వు చస్తే ఏడుత్తారు దొంగనాయాళ్లు’ అని వెక్కిరించాడు. ‘మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా/ తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా’ అని హితవు పలికాడు.

‘మగువ మనసు సగం చదివితే మగవాడప్పుడు డాక్టరాఫ్‌ రొమాన్స్‌’ అన్నాడేగానీ తప్పనిసరైన భోగంపాటలకు ఆత్రేయ నొచ్చుకున్నట్టే కనబడతాడు. ‘సినిమా కవి బ్రతుకు అనేకానేక అభిరుచులుగల విటులను సంతృప్తి పరచవలసిన పడుపు వృత్తి’ అన్న నిరసన బహుశా ఆయన మీద పడిన ‘బూత్రేయ’ ముద్రకు ఒక సంజాయిషీ అనుకోవాలి. 

ఇలాంటి వేదనలో మనిషికి నిద్ర ఎలా పడుతుంది? ‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది/ కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది’. అన్నింటికీ నిద్రే మందు మరి. ఒక్కోసారి అది శాశ్వత నిద్రయినా కావొచ్చు.
 
అంతేగా, కాలం పాపమని దేన్నీ ఆపదు. ‘నేడు నిన్నౌతుంది/ రేపు నేడౌతుంది/ ఆ రేపుకూడా నిన్నగా మారుతుంది’. ఆత్రేయ అయినా అంతే! ‘మట్టి బొమ్మలే మనమంతాను/ గిట్టిపోవలె మట్టిలోపలే’.
 
కాకపోతే ఉన్నన్నాళ్లూ, ‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ/ నవ్వుతూ చావాలిరా’!

(సాక్షి ఫన్‌డే; మే 4, 2014)

Friday, September 11, 2026

కొన్ని ఇన్నర్‌వ్యూ ఫొటోలు


న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌తో (22–6–2012)





నిర్మాత కె.రాఘవతో (26–7–2012)





సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో (20–4–2012)


సాక్షి ఫన్‌డే కోసం కొన్నేళ్ల కింద ఇన్నర్‌వ్యూ పేరుతో కొంతమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. కానీ ఎప్పుడూ ఫొటోలు దిగలేదు. నేను అడగలేదు. అది నా స్వభావం కాదు. ఏదో అడ్డంపడుతుంది. కానీ నా వెంబడి వచ్చిన ఫొటోగ్రాఫర్లు చొరవగా తీసిన ఈ ఫొటోలు మాత్రం ఇప్పుడు  జ్ఞాపకంగా మిగిలాయి.

Sunday, September 6, 2026

వెండితెర చక్రవర్తి కురొసావా


అకీరా కురొసావా 
23 March 1910 - 6 Sep 1998

వెండితెర చక్రవర్తి


ఒకసారి దర్శకుడు అకిరా కురసోవాకు ఈ ప్రశ్న ఎదురైంది: ‘‘మీరు ‘రాన్‌’లోని ఆ ఫ్రేమ్‌లో కెమెరా అలా ఎందుకు పెట్టారు?’’
దానికి కురసోవా ఇచ్చిన జవాబు: ‘‘నేను ఒక్క అంగుళం ఎడమకు ప్యాన్‌ చేసినా సోనీ ఫ్యాక్టరీ కనబడుతుంది, అదే ఒక్క అంగుళం కుడికి జరిపితే ఎయిర్‌పోర్టు కనబడుతుంది. పీరియడ్‌ సినిమాకు ఆ రెండూ అనవసరం’’.
కురసోవా అంత పర్ఫెక్షనిస్టు! సినిమా కోసం ప్రాణం పెట్టేవాడు.

1948తో మొదలై నాలుగు దశాబ్దాలపాటు సాగిన ఆయన కెరీర్లో... రషోమన్, ఇకిరు, సెవెన్‌ సమురాయ్, యొజింబో, థ్రోన్‌ ఆఫ్‌ బ్లడ్, దెర్సు ఉజాలా, ద లోయర్‌ డెప్త్స్, హై అండ్‌ లో, డ్రీమ్స్, రప్సోడీ ఇన్‌ ఆగస్ట్‌... ఒక్కో సినిమా ఒక్కో చరిత్ర!

సినిమా మాస్టర్లు అనిపించుకున్న దర్శకులు ఇన్‌మార్‌ బెర్గ్‌మన్, ఫ్రెడరికో ఫెల్లిని, సత్యజిత్‌ రే, రోమన్‌ పోలన్‌స్కీ, జార్జ్‌ లుకాస్, ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొప్పోలా, మార్టిన్‌ సోర్సెసె, స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌లాంటివాళ్లు కూడా కురసోవా వల్ల ప్రభావితమయ్యారు. అందుకే ఆయన్ని విమర్శకులు గౌరవంగా ‘ఎంపరర్‌ ఆఫ్‌ ద సెల్యులాయిడ్‌’ అంటారు.

జపాన్‌ ‘సమురాయ్‌’(సైనిక) కుటుంబంలో జన్మించిన అకిరా సినిమాలు మాత్రమే తన ఉనికిగా బతికాడు. యుద్ధ సన్నివేశాలను చిత్రించడంలో, రిస్కు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి! నటీనటులకు అలవాటు కావడానికి, తద్వారా సహజత్వం కోసం సినిమా కాస్ట్యూమ్స్‌తో వాళ్లను కొంతకాలం గపడపమనేవాడు. ఏరోజు రషెస్‌ ఆరోజు స్వయంగా ఎడిట్‌ చేసుకునేవాడు.

‘‘ఆలోచనలు సహజంగా వస్తాయి, కథ ఆ క్యారెక్టర్‌ వెంట సాగిపోతుంది’’ అని తను సినిమా తీసే విధానం గురించి చెప్పేవాడు కురసోవా. స్టోరీబోర్డ్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. సినిమాకు ఫండింగ్‌ దొరకని విరామ సమయాల్లో తన సీన్లన్నింటినీ బొమ్మలుగా గీసుకునేవాడు. ఆయన స్వయంగా పెయింటర్‌ కూడా! సినిమాల్లోకి రాకముందు కమర్షియల్‌ ఆర్టిస్టుగా పనిచేశాడు. ‘‘నిజంగా డైరెక్టర్‌ కావాలనుకుంటే ముందు స్క్రీన్‌ప్లేలు రాయండి. రాయడం ద్వారానే సినిమా స్ట్రక్చర్‌ అర్థమవుతుంది, అసలు సినిమా ఏంటో కూడా అర్థమవుతుంది’’ అని ఔత్సాహిక దర్శకులకు సలహా ఇచ్చేవాడు. ‘‘నీలోపల ఎంతో రిజర్వు ఉంటేతప్ప, నువ్వు ఏదీ సృష్టించలేవు. జ్ఞాపకమే సృష్టికి మూలం. శూన్యం నుంచి దేన్నీ సృష్టించలేం’’. అందుకని చదవడం చాలా ముఖ్యమనేవాడు. ‘‘అయితే, చదవడం వల్లగానీ, నీ జీవితానుభవం వల్లగానీ వచ్చినదానికి జోడించగలిగేదేదో నీలోపల లేకపోతే నువ్వు ఏదీ సృజించలేవు’’ అనేవాడు.

ఆయన సినిమాలన్నీ ‘లార్జర్‌ దన్‌ లైఫ్‌’గా కనబడినా, ఆయన మాట్లాడిందంతా జీవితం గురించే! మనిషి ఎప్పుడూ తప్పకూడని నీతినీ, ఎప్పుడూ పాటించవలసిన మానవీయ విలువనీ ఆయన చిత్రాలు  ప్రతిబింబించాయి. మనిషి బతకడం కోసం చేసే పోరాటాన్నీ, మనిషిగా నిలబడటం కోసం పడే ఆరాటాన్నీ, సమూహంతో కలిసిసాగే సంతోషపు వెతుకులాటనూ ఆయన చిత్రించాడు. అయితే, జీవితం ఎంత సంక్లిష్టమైందో ఆయన సినిమాలు కూడా అంతే సంక్లిష్టమైనవి. అందుకే కురసోవా తన సినిమాల్లో ‘ఫలానాది వెల్లడించాడు’ అనడం తప్పుడు విశ్లేషణే అవుతుంది.
‘‘నా సినిమా ఏం చెబుతుందో నేనేగనక వివరించగలిగితే అందరికీ వెళ్లి అదే చెప్తానుగానీ, అంత కష్టపడి సినిమా ఎందుకు తీస్తాను?’’ అన్నాడాయన. సినిమాను అర్థం చేసుకోవడంలో మెదడుకంటే హృదయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వమనేవాడు. ఆయన చిత్రరాజాలు మాత్రం మెదడునూ, హృదయాన్నీ రెంటినీ సంతృప్తిపరుస్తాయి.

(సాక్షి ఫన్‌డే; 23 మార్చ్‌ 2014)
––––––––––––––––––––––

Thursday, September 3, 2026

అల్లం శేషగిరిరావు ‘నరమేధం’


అల్లం శేషగిరిరావు 

అల్లం శేషగిరిరావు (1934–2000) ‘నరమేధం’ సంక్షిప్తరూపం ఇది. 1979లో ప్రచురితమైంది. ఒరిస్సాలో జన్మించి, రైల్వేలో పనిచేసిన శేషగిరిరావు ‘మంచి ముత్యాలు’, ‘అరణ్య ఘోష’ కథాసంకలనాలు వెలువరించారు.

––––––––––

ఒక్కరోజు చావు


ఛత్ర చామరాలతో అలంకరించిన ముఖద్వారం, కొబ్బరాకులతో అల్లిన పూజా మంటపం, రథం అగ్రభాగాన పరుగులు తీస్తున్న శ్వేతాశ్వాలు నేత్రానందకరంగా ఉన్నాయి. జనం గంపులు గుంపులుగా వస్తున్నారు జాతరని చూడ్డానికి.

గంగరాజు సిల్కు లాల్చీ తొడుక్కుని పట్టపంచ కట్టుకున్నాడు. బొద్దు మీసాలతో, సన్నంగా, పొడవుగా, వెండి తీగెలా ఉన్నాడు. రథయాత్రా కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు.

‘‘టైమయింది, గంగరాజుగారూ’’ అని పూజారి మంత్రజలం చల్లి గంగరాజు మెడలో పూలదండ వేసి కొబ్బరికాయ చేతికి అందించేడు. రాజు ‘‘జై జగన్నాథ్‌!’’ అని టెంకాయని మూడుసార్లు దిష్టితీసి బలంపూర్తిగా కొట్టేడు. కుర్రాళ్లు కొబ్బరి ముక్కల కోసం ఎగబడిపోతున్నారు.

‘‘జగన్నాథ మహాప్రభూకి జై’’ ‘‘గంగరాజు బాబుకీ జై’’. రథం బయలుదేరింది. నీలమాధవుడు జగన్నాథరూపంలో బలరామదేవునితోనూ, చెల్లెలు సుభద్రాదేవితోనూ విజయుని సారథ్యంలో ఊరేగుతున్నాడు. ప్రతి ఏటా ఆషాఢంలో నిజమందిరాన్ని విడిచి, విడిది మందిరం ‘‘గుడిసెన్న గుడికి’’ రథయాత్ర సాగిస్తాడు.

ధర్మకర్తృత్వం వంశపారంపర్యంగా గంగరాజుకి సంక్రమించింది. ఆ అధికారాన్ని సవాల్‌ చేస్తూ ప్రత్యర్థి వెంకునాయుడు కోర్టులో కేసు పెట్టేడు. రెండేళ్లుగా రథయాత్ర జరక్కుండా కోర్టు నుంచి ఇంజంక్షన్‌ ఆర్డరు తెప్పించి ఆపుచేస్తూ వచ్చాడు. చివరికి గంగరాజే గెలిచాడు. కోర్టులో గెలిచిన విజయోత్సాహంతోనూ, వెంకునాయుడి మీద కసితోనూ భోగరాగాలు అన్నీ గంగరాజే చూసుకుంటున్నాడు. ఎల్లక్షన్లు అతి దగ్గరలో ఉన్నాయి.

రథం మీద పూజారులు జనం అందిస్తున్న కొబ్బరికాయలు కొడుతున్నారు. పూలమాలల్ని విగ్రహాల పాదాల దగ్గరికి విసురుతున్నారు.

‘‘గంగరాజు బాబూ, మనం కాస్త జాగ్రత్తగా వుండాలి. ఎగస్పార్టీ వోళ్లు మనలో కలిసే తిరుగుతున్నారు. చూశారా ఆ గళ్ల చొక్కావోడు.’’

‘‘ఒరే సాంబా! కొండంత మనిషివి నువ్వుండగా, జగన్నాథుడు మన పార్టీ అయివుండగా ఎంకునాయుడు ఎవడ్రా? ఝూటాగాడు.’’

‘‘తగవుకి దిగితే తల తీసేస్తాను గాని, రాజుబాబు, రెండు రోజుల్నించి ఎంకునాయుడు ఇటు ఢిల్లీకి అటు హైదరాబాదుకి తెగ ఫోన్లు కొడుతున్నాడట. ఎవడో నాయకుణ్ని తెప్పించి మీటింగు పెడతాడట’’.

‘‘పెట్టనీరా, జనం బఠానీలు నవులుతూ వింటారు. తరువాత ఇళ్లకి పోతారు. మనం కూడా మలి రథయాత్ర నాడు అన్న సంతర్పణ చేయిస్తున్నాం. ఊరు ఊరంతా రావాలి. పూరీ నుంచి జగన్నాథ ప్రసాదాన్ని కుండల్లో తెప్పించి అందులో కలిపాం అందాం. వస్త్రదానం కూడా చేద్దాం. మరో రెండు వేలు ఖర్చు అవనీ. ప్రసాదం తిని మోసం చేస్తే కళ్లు పోవూ?’’

సాంబడు వెనకాల రథం దగ్గర గోలగా వుంటే అక్కడికి పరుగున వెళ్లేడు. ‘‘తొయ్యండ్రా, తొయ్యండెహే. జోర్సే.’’ రథచక్రాలు క్రీచుక్రీచుమంటూ నేలని రాసుకుంటూ కదలడం లేదు. అప్పటికే వడ్రంగి యినప చట్రాల్ని సుత్తితో కొడుతూ సరిచేస్తున్నాడు. ‘‘ఆవదం బాగా పొయ్యండ్రా’’ సాంబడు. ‘‘ఆదిలోనే ఏమిటీ అవాంతరం?’’ గంగరాజు.

‘‘నాయనా, రాజుబాబూ! ఢక్కువాడు రథం మీద కనిపించడం లేదు. దేవుడికి దిష్టి తగిలిందేమో’’ పక్కనే నిల్చున్న ముసలాయన. ఢక్కువాడి పేరు వినగానే చిన్న సంచలనం బయలుదేరింది. రథం మీద బూతు పాటలు పాడేవాణ్ని ఢక్కువాడు అంటారు. ఆ పాటలన్నీ ఒరియా భాషలో ఉంటాయి. రెండేళ్లుగా జాతర లేకపోవడంతో ఢక్కువాడి సంగతే మరిచిపోయాడు పూజారి. వెంటనే ఒక కుర్రాడు ఢక్కువాడి కోసం గాలిలా పరుగెత్తాడు.

‘‘బాబూ, ఢక్కువాడు రానంటున్నాడు. బ్లడీ భంచోత్‌. దేవుడి తరఫున నువ్వు వస్తావుట్రా, లింగులింగుమంటూ అని గసిరేశాడండి.’’

‘‘ఈ జాతి తక్కువ నా కొడుకుని నేను వెళ్లి బ్రతిమాలాలి కాబోలు’’ గంగరాజు.

‘‘వాళ్లు అలగడం, ధర్మకర్తలు వెళ్లి బ్రతిమాలి తీసుకురావడం ఆచారం’’ అన్నాడు పూజారి.

‘‘ఢక్కువాడికి కొత్తబట్టలు కుర్రాడిని పంపించి తెప్పించండి’’ జేబులో డబ్బు తీసి ఇచ్చాడు గంగరాజు.

’

ఢక్కువాడి పూరి గుడిసె ఊరవతల ఉంది. ఇంటి చుట్టూ కుళ్లు కాలవల కంపు. వైద్య విద్యార్థుల ముందు శవం ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు, ఏడాదికొకసారి ఢక్కువాడికి ప్రాముఖ్యం లభిస్తుంది. 

‘‘ఢక్కువా ఢక్కువా, పద పదరా రథం ఆగిపోయింది’’ హెచ్చరించేడు గంగరాజు. ఈ అలికిడికి పెరట్లో పనిచేసుకుంటున్న ఢక్కువాడి పెళ్లాం ఆదెమ్మ గబగబ వచ్చి ‘‘దండాలు బాబుగారు, ప్రొద్దుట్నుంచీ తెగ తాగేసి తిరుగుతున్నాడు. తిండి మానేసి కొడుకుని తల్చుకుంటూ తిరుగుతున్నాడు. ఇదిగో ఇనుకో, బాబులొచ్చారు, జాతరకెళ్లెల్లు’’ మొగుడ్ని కుదుపుతూ అంది.

‘‘జాత్తర? నెల రోజుల క్రితం నా కొడుక్కి శ్మశానంలో పెద్ద జాతర చేశాను. ఈ రోజు దేవుడికి జాతర పట్టిస్తాను.’’

‘‘ఏటి బాబులొస్తే మరియాద లేకుండా?’’

‘‘రెండేళ్ల నించి నేను సచ్చానో వున్నానో పట్టించుకోని బాబులు ఈయేళ ఎందుకొచ్చారే?’’

‘‘ఒరే ఢక్కువా, కొత్తబట్టలు తెచ్చేడు. కట్టుకొని బయలుదేర్రా’’ పూజారి గర్జించేడు.

‘‘ఓల్‌రైట్‌’’ కుర్రాడు తెచ్చిన బట్టల్ని అందుకున్నాడు. ‘‘మరి కట్నం?’’

‘‘ఇదుగో ఇరవై’’ చేతిలో పెట్టబోయాడు గంగరాజు.

‘‘నో నో ఫిఫ్టీ డాలర్స్‌. ఏభై లేకపోతే నేను రానెహోయ్‌’’ 

మిగతా ముప్పై కలిపి చేతిలో పెట్టాడు గంగరాజు. తూలుతున్న ఢక్కువాడి జబ్బ పట్టుకుని పెరట్లోకి తీసుకెళ్లింది ఆదెమ్మ. గిన్నెడు తరవాణి తాగించింది. ఆ పులుపుకి మొగమంతా వికృతంగా చిట్లించుకుంటూ బ్రేవ్‌మని తేన్చాడు. ‘‘ఇక్కడ కాదు, నా కొడుకు శవాన్ని స్నానం చేయించిన దగ్గరే నాకూ నీళ్లు పొయ్యి’’ తడబడుతూ వెళ్లి కూర్చున్నాడు.

‘‘ఏభై రూపాయలు ఇలా తే. మనం తిన్నా తినకపోయినా ముందు అప్పులోళ్ల సంగతి చూడు, బజార్లో పట్టుకుని నానా తిట్లు తిడతన్నారు.’’

‘‘అప్పులు చెయ్యడం, తిట్లు తినడం, పస్తులుండటం మనకలవాటేనే. ఈ అప్పు తీరిస్తే మళ్లీ మరో అప్పు. అప్పుడెక్కడ్నుంచి వస్తయి పైసలు. ఈరోజు నేను రాజా. ఈరోజు పోతే రేపు మరి నాకు లేదు. ఫుల్‌గా పఠాసు కొట్తేస్తాను.’’

‘‘తిండికి లేక సస్తుంటే తాగుతానంటా వేంటీ?’’

దూరంగా బాజాల మ్రోత. సన్నాయి మేళం, జేగంటలు దగ్గరవుతూ ఢక్కువాడి ఇంటి ముందర ఆగాయి. ఆదెమ్మ ఒళ్లంతా తుడిచి కొత్తబట్టలు కట్టించింది. కొత్త పంచ, కొత్త తలపాగా. కండువా నడుంకి. చేతి కర్రకి రంగు గావంచ యెత్తి పట్టుకుని వాకిట్లో నిల్చున్నాడు ఢక్కువాడు. గంగరాజు స్వయంగా కాళ్లు కడిగి పూలదండ వేసి నమస్కరించాడు. ఢక్కువాడు రథయాత్రకి  బయలుదేరాడు.

‘‘ఢక్కువాడొచ్చేడు! ఢక్కువాడొచ్చేడు’’ అంటూ జనం చుట్టుముట్టేరు. వాళ్లందర్నీ పక్కుకు నెడుతూ నిచ్చెన వేసి వాడ్ని రథం మీదకు ఎక్కించేరు. తండ్రులు పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుని ఢక్కువాడ్ని చూపిస్తున్నారు.

‘‘తైతైతైతై తైతైతైతై’’ అంటూ సంకీర్తన మేలగాళ్లని గొడుగు కర్రని ఆడిస్తూ హెచ్చరించేడు. ‘‘ఢింఢిం తకఢింఢిం’’ ‘‘ఢైంయ్‌ ఢైంయ్‌’’ ‘‘రొధొ ఢీకొ ఢీకొయిలా! మహాప్రాంకొరొ కొండియా నపాయిలా తైతైతై’’ వలయాకారంగా నడ్డి తిప్పుకుంటూ రథం మీద గెంతుతున్నాడు ఢక్కువాడు. బూతు పేలింది. రథచక్రాలు కదిలేయి. ఆ పాటకి అర్థం యేమిటన్నట్లు పూజారికి సంజ్ఞ చేశాడు గంగరాజు. ఒరియా తెలిసిన పూజారి గంగరాజు చెవిలో గొణిగాడు. ముసిముసి నవ్వుకుంటూ సంబరంతో పాటు నడుస్తున్నాడు గంగరాజు. ఢక్కువాడు మరో పాట అందుకున్నాడు. రకరకాలుగా గెంతుతున్నాడు. కోతిలా యెగురుతున్నాడు.

రథం దగ్గర చిన్న గందరగోళం మొదలైంది. గళ్లచొక్కావాడు ‘‘కొబ్బరికాయలు అందిస్తున్న ఆడవాళ్ల చేతులు పట్టుకుంటావా?’’ అని పూజారి పెద్దకొడుకు చొక్కా పట్టుకున్నాడు. ‘‘రౌడీవెధవ, నువ్వు చూశావురా?’’

సాంబడు రథస్తంభం పట్టుకుని ఎగిరి గళ్ల చొక్కావాణ్ని జుత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు. ‘‘సంబరం భగ్నం చేయడానికి పితూరీ లేవదీస్తున్నావా? ఎంకునాయుడు ఎంగిలి కూడు కతికి జగడానికి వస్తావా?’’ క్రిందపడేసి ఈడ్చి ఈడ్చి తంతున్నారు. వాడి పార్టీ వాళ్లు బలం చాలక జారుకున్నారు.

బాజాలు మ్రోగుతున్నాయి. ఈ సందడిలో ఢక్కువాడు దిగిపోయేడు. సీసా తీసి డగ్‌ డగ్‌ మని గుటకలు వేసి మూతి తుడుచుకున్నాడు. ‘‘నేను దరిద్రపు నా కొడుకుని. నా బాబూ తాతలందరూ దరిద్రంతో బతికి ఆకలితో సచ్చారు. తరతరాల నుంచి మా బూతులు యింటూ కులాసా పడిపోతున్న దేవుడు మా ఆకలి తీర్చాడా? నా కొడుకును రచ్చించాడా?’’ ఢక్కువాడి కంఠం రుద్దం అవుతోంది. ‘‘నా కొడుకు పోయాడు నాయనా, ఆరు నెలలు రోగంతో తీసుకుని మందుల్లేక తిండిలేక తడపలా అయిపోయి, బిళ్ల బిళ్లలు రకతం కక్కుకుంటూ సచ్చిపోయేడు. నా పద్దెనిమిదేళ్ల కొడుకు ఎలిపోయాడు నాయనా’’ గొల్లున ఏడుస్తూ కూలిపోయాడు. సాంబడు వాడ్ని ఓదారుస్తూ రథం యెక్కించి వెనకాల ఎవరికీ కనబడకుండా పడుకోబెట్టాడు.

చీకటి పడింది. గేస్‌లైట్లు, దివిటీలు వెలిగించారు. గుడిసెన్న గుడి దగ్గర పడుతుందనగా ధన్‌మని సోడాబుడ్డి పేలింది. నలువైపుల నుంచి రాళ్లవర్షం. జనంలో గోల. గళ్ల చొక్కావాడు సైకిల్‌ చెయిన్‌తో సాంబడ్ని కొట్టాడు. చెట్టులా పడిపోయేడు సాంబడు. పూజారులు గెంతేసి పరుగు లంకించుకున్నారు. ‘‘ఎలక్షన్‌ కార్యాలయానికి నిప్పింటించేరు’’ అరిచేడు జనంలోంచి వెంకునాయుడు పార్టీవాడు. క్షణంలా వూరంతా పాకిపోయింది వార్త. కొన్ని యిళ్లు తగలబడుతున్నాయి. గళ్లచొక్కావాడిని ఎవరో కత్తితో పొడిచేరు. ధన్‌ ధన్‌ ధన్‌– గాలిలో తుపాకుల కాల్పులు. పోలీసులు పోలీసులు. అరగంటలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గంగరాజునీ, వెంకునాయుణ్నీ అరెస్టు చేశారు. కరెంట్‌ కట్‌ చేశారు. కర్ఫ్యూ విధించారు. 

రథాన్ని గుడిసెన్న గుడికి తీసుకురావడానికి పోలీసుల బలగం బయలుదేరింది. పోలీసుల్ని పురమాయిస్తూ ఇన్‌స్పెక్టరు రథం మీదికి టార్చిలైటు వేశాడు. ఒక మానవ కళేబరం రథానికి వేలాడుతోంది. ఢక్కువాడు కొత్త కండువాతో ఉరిపోసుకున్నాడు.

’

తరువాతి కథ: గంగరాజు, వెంకునాయుడు తిరిగి జనాల్లోకి వచ్చారు. ప్రతీ సంవత్సరం వైభవంగా రథయాత్ర జరుగుతూనే ఉంది. వెంకునాయుడు, గంగరాజు రొటేషన్‌ పద్ధతిలో ఎంఎల్‌ఏలు అవుతూనే ఉన్నారు. పాత రథం స్థానే కొత్త రథం వచ్చింది. ఢక్కువాడి పీనుగుతో మైలపడిన పాత రథాన్ని ఊరవతల పడేశారు. చుట్టుపక్కల వాళ్లకి అప్పుడప్పుడూ ఊరవతల నించి అర్ధరాత్రివేళ స్పష్టాస్పష్టంగా ఏవో పాటలు, ఏడుపులు వినిపిస్తుంటాయట! 


(సాక్షి సాహిత్యం; 24 సెప్టెంబర్‌ 2018)

Monday, August 31, 2026

6ద్ర


ఆరుద్ర
31 Aug 1925 - 4 June 1998


6ద్ర

ఆగస్టు 31న ఆరుద్ర జయంతి
-------------------------------------

ఆరుద్రకు ఒక ‘నేమ్‌ప్లేట్‌’ చేయించాలంటే, ఆయన పేరుముందు ఏం చెక్కించాలి? బహుముఖ ప్రజ్ఞాశాలి అనేయొచ్చు సింపుల్‌గా. కానీ ఆ ప్రజ్ఞ  ఎన్నిరకాలు?

కవి, కథకుడు, డిటెక్టివ్‌ నవలా రచయిత(నెలకొకటి చొప్పున రాస్తానని అలాగే రాయడం ఆయన చేసిన ఆరుద్రశపథం), గేయకర్త, గేయనాటకకర్త, వ్యాసకర్త, గడీనుడీకారుడు, సంపాదకుడు, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, అభ్యుదయ రచయితల సంఘం– అరసం వ్యవస్థాపకుల్లో ఒకరు(సంఘాల గొడుగు ఎందుకు? అంటే, వానపడకుండా ఉండటానికంటాడు!), చివరగా సినిమా రచయిత. అనగా, పాటలూ మాటలూ అనువాదాలూ.
 
రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా(గోరంతదీపం); అమ్మకడుపు చల్లగా (సాక్షి); కొండగాలి తిరిగింది (ఉయ్యాల జంపాల); వేదంలా ప్రవహించే గోదావరి (ఆంధ్రకేసరి); ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం (ఎంఎల్‌ఏ); ఎదగడానికెందుకురా తొందర (అందాల రాముడు); ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ (ముత్యాలముగ్గు); శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది (పెళ్లిపుస్తకం)...  ఆరుద్రను ఇలాంటి ఏ కొన్ని పాటలతోనైనా పరిచయం చేయొచ్చు; లేదా, ఒకే ఒక్క వాక్యంతోనూ ఆయన్ని స్ఫురణకు తేవొచ్చు. ‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’.

భాగవతుల సదా శివశంకరశాస్త్రిగా జన్మించి, జన్మనక్షత్రం పేరిట తన కలంపేరును స్వీకరించిన ఆరుద్ర– కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అని చాటుకున్నాడు. ‘నాకోసం నేను రాసుకోను. అందరికోసం నేను రాస్తాను. అందరూ నావాళ్లే కాబట్టి, నాకోసం రాసింది అందరికోసం రాసిందే’ అంటాడు.

తెలంగాణ పోరాట ఇతివృత్తంతో ఆరుద్ర రాసిన ‘త్వమేవాహం’ చదివి, ఇక నేను పద్యాలు రాయకపోయినా పరవాలేదు, అని ఆనందపడ్డాడట ఆరుద్రకు మేనమామైన శ్రీశ్రీ. ఇందులో ఆరుద్ర– సమాజాన్ని గడియారంతోనూ, ధనికుల్ని గంటల ముల్లుతోనూ, మధ్యతరగతివాళ్లని నిమిషాలముల్లుతోనూ, పేదల్ని సెకన్లముల్లుతోనూ, ‘కీ’ని విప్లవగొంతుకగానూ ప్రతీకిస్తాడు.

అంత్యప్రాసల ముద్ర–ఆరుద్ర అనిపించుకున్న ఈ ‘సన్యాసి రూప’ కవి... ‘ఛందస్సులతో అడ్డమైన చాకిరీ అందంగా చేయించుకోగలడు’. శ్లేషలు, చమత్కారాలతో మురిపిస్తాడు. చెరిషించి, పెరిషించి లాంటి తెలుగు ఇంగ్లీషు పదాల కాక్‌టెయిల్‌ సృష్టిస్తాడు. ‘ఆ/ మెన్‌/ ఆమెన్‌/ చెరపట్టన్‌/ మ్రోగెన్‌/ నీగన్‌/ నా/ పెన్‌/ ఆపెన్‌’... లాంటి పదాల గారడీలో వస్తువుకు ఔచిత్యభంగం వాటిల్లుతోందా? అనే మీమాంస ఒకటి కలిగినప్పటికీ!

‘చిన్ని పాదములందు/చివరి ప్రాసల చిందు/ చేయు వీనులవిందు/ ఓ కూనలమ్మా’ అంటూ కూనలమ్మ పదాలు ప్రారంభించాడు ఆరుద్ర. ‘ఆలి కొన్నది కోక/ అంతరిక్షపు నౌక/ అంతకన్నను చౌక/ ఓ కూనలమ్మా’ అని నవ్విస్తూనే, ‘కోర్టుకెక్కినవాడు/ కొండకెక్కినవాడు/ వడివడిగ దిగిరాడు’ అన్న సత్యాన్నీ చెబుతాడు. ‘అంతుచూసేవరకు/ అకట ఆంధ్రుల చురుకు/ నిలువ ఉండని సరుకు’ అని తెలుగువారి ఆరంభశూరత్వాన్ని వెక్కిరిస్తాడు. ‘అణువు గుండెను చీల్చి/ అమితశక్తిని పేల్చి/ నరుడు తన్నును బాల్చి’... చిన్న పదాల్లో పెద్ద భావాన్ని ఇముడుస్తాడు. ‘పరుల మేలును కోరి/ పదములల్లెడు వారి/ పథము చక్కని దారి’ అనిపిస్తాడు.

ప్రయోగశీలత ఆయన కథల్లోనూ కనిపిస్తుంది. ‘సుబ్బారావున్నరగంటలసేపు’ అంటాడొకచోట. తన పురుషుడిని తన పూర్తి ప్రపంచంగా మలచుకున్న స్త్రీ హృదయానికి ఈ కొలత సులభంగా అర్థమవుతుంది!

‘రాముడికి సీత ఏమౌతుంది?’ లాంటి ఆకస్తికర శీర్షికతో సకల రామాయణాల్ని తవ్విపోశాడాయన. శ్రీకృష్ణుడు అసలుసిసలు ఆంధ్రుడనీ, ఏకలవ్యుడు కుంతీదేవి అక్క కొడుకనీ, పుత్రికకూ కుమార్తెకూ భేదముందనీ, పుత్రిక అంటే సహోదరులు లేనిదనీ, కుమార్తె అంటే తోడబుట్టినవారిని కలిగినదనీ తేల్చిచెప్పాడు.

‘సినీవాలి’, ‘ఇంటింటి పజ్యాలు’, ‘గాయాలు–గేయాలు’, ‘పైలాపచ్చీసు’, ‘శుద్ధ మధ్యాక్కరలు’, ‘గుడిలో సెక్స్‌’, ‘వేమన్న వాదం’, ‘తిరుక్కురళ్‌’అనువాదం, చదరంగ పుస్తకం, ‘సినీ మినీ కబుర్లు’... ఇక, రాయడం అటుండనీ, చదవడానికే జీవితకాలం చాలదనిపించే బృహత్తరమైన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ ఆయన పరిశోధనాశక్తికి పరాకాష్ట! సంస్థలుగా మాత్రమే చేయగలిగిన పనిని ఒక్కడే పూనిక వహించి పూర్తిచేశాడు. ‘నాకు స్పష్టంగా తెలుసు అనుకున్నదాన్ని పాఠకులకు స్పష్టంగా’ చెప్పదలిచాడు. చాళుక్యులు నుండి ఆధునిక కాలం వరకు ‘ఆర్థికసంబంధాల ప్రాతిపదికన యుగవిభజన’ చేసిన ఈ పుస్తకం కోసం– ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. మధుమేహం పెరిగి మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. కంటిచూపు తగ్గిపోయింది. అయినా అన్ని కష్టాలనూ ఓర్చి వెయ్యేళ్ల చరిత్రను తెలుగువాళ్లకు అందించగలిగాడు. ‘సాహిత్యం అర్ణవమైతే, ఆరుద్ర మథించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు. అతడు పట్టి బంగారం చేయని సాహిత్య శాఖ లేదు; ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు’.

(సాక్షి ఫన్‌డే; 31 ఆగస్ట్‌ 2014)
––––––––––––––––––––––

Thursday, August 27, 2026

ఏబది వేల బేరము


కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు(1877–1923) కథ ‘ఏబది వేల బేరము’కు సంక్షిప్త రూపం. కె.రామానుజరావు అనే కలంపేరుతో రాశారు. ఆంధ్రపత్రికలో1910లో ప్రచురితం. సౌజన్యం: వికీపీడియా. కొమర్రాజు తెలుగు, మరాఠీ భాషల్లో సమాన పండితుడు. సంస్కృతం, హిందీ, బెంగాలీ, గుజరాతీ భాషల మీదా పట్టుంది. శివాజీ చరిత్ర, హిందూ మహాయుగము, ముస్లిం మహాయుగము రాశారు. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం మూడు సంపుటాలు వెలువరించారు. వ్యక్తి కాదు, సంస్థ అనిపించుకున్నారు. అనారోగ్యంతో 46 ఏళ్లకే మరణించారు. తొలి తెలుగు కథారచయిత్రి భండారు అచ్చమాంబ ఈయన అక్క.

–––

కంగారు ఆభరణాలు


చెన్న పట్టణమందలి షాహుకారుపేట లక్ష్మికి నివాస స్థలము.

ఒకనాడుదయము జగజీవన్‌ లాల్‌ నాలుగంతస్థుల మేడ యెదుట రెండు గుఱ<ముల కోచి బండి నిలచెను. బండిలో వెనుక ప్రక్కనొక పురుషుడును, అతని భార్యయు గూర్చుండియండిరి. వారికి నెదుట నైదారు నెలల పిల్లవాని నెత్తుకొని యొక దాసి కూర్చుండి యుండెను. బండి వెనుక చిత్రమైన దుస్తులు ధరించిన గుఱ<పు వాండ్రిద్దరు నిలిచి యుండిరి. బండికి ముందు భాగమున నెత్తుగనున్న యాసనముపై కోచిమన్, వాని ప్రక్కన మరియొక సేవకుడును గూర్చుండియుండిరి. యజమానుడు తన జేబులో నుండి విజిటింగ్‌ కార్డు నొకదానిని తీసిచ్చెను. జగజీవన్‌ లాల్‌ ఆ కార్డును చూచుకొని రాజా ఆఫ్‌ నర్సాపూర్‌ అని చదివి తత్తరపాటుతో బండియొద్దకు వచ్చెను.

ఈ వర్తకుడు రవ్వలు, కెంపులు, పచ్చలు, వైఢూర్యముల వర్తకమే చేయుచుండును. పుష్యరాగముల వంటి తక్కువ వెలగల రాళ్ళనుగాని, వెండి బంగారములను గాని ముట్టనే ముట్టడు. ఆతని పద్దులన్నియు వేలు లక్షలు. రాజులు, మహరాజులితని వద్ద లక్షల కొద్ది వెల గల రాళ్ళను తీసికొని పోవుచుండిరి. ఆతడు బండి సమీపమునకు వచ్చిన తోడనే, సేవకుడు బండి తలుపుల దీసెను. బండిలో నుండి జమీందారు దిగి, షాహుకారుతో షేక్‌ హాండు చేసి ‘మీరేనా జగజీవనలాలు షేట్జీగారు’ అని యడిగెను. ‘కుబేరుని తరువాత తామే కుబేరులని వినియున్నాను’.

‘మీ వంటి రాజాధిరాజుల యనుగ్రహముండ నేను కుబేరుడనే, దయచేయుడు’ అని మాట్లాడుకొనుచు వారిద్దరును లోనికి పోయిరి. జమీందారు భార్యయు, పిల్లను నెత్తుకొన్న దాసియు లోనికి బ్రవేశించిరి. ఈ జమీందారుడు ఇంగ్లీషు ఫ్యాషన్‌ గలవాడగుటచే తన భార్యకు ఘోషా లేకుండజేసినట్లు కానవచ్చుచున్నది. ఘోషా లేదుకాని, యీమెకు వంటిమీద నగలు మాత్రము పరిమితముగా నుండెను. మెడలోనున్న సూర్యహారమే యొక పదివేలు, చంద్రహారమే పదియైదు వేలు చేయవచ్చును. కాళ్ళకున్న బంగారు పాంజేవులు అయిదువేలయిన ఖరీదు చేయవో? దాసి భుజముపై నిద్రించుచున్న బాలునికి మిక్కిలి విలువగల నగలు పెట్టబడెను.

మేడమీద గొప్ప గొప్ప రాజుల కొఱకై అలంకరించబడిన హాలులోనికి దీసికొనిపోయి జమీందారు నొక కుర్చీమీద కూర్చుండబెట్టి అతని భార్యకు కొంచెము చాటుననున్న యొక స్థలమును చూపించెను. 

జగ: ‘అయ్యా, తమ రాజధాని ఏ జిల్లాలోదండి.’

జమీం: ‘మా సంస్థానము గోదావరి జిల్లాలోనున్నది. మేము కలక్టరును చూచుటకు వెళ్ళినపుడు పదిహేను ఫిరంగులు కాల్చెదరు. వెండి కుర్చీల మీదగాని మేము కూర్చుండము. కాని నేనింగ్లీషు యెడ్యుకేటెడ్‌ జంటిల్‌మన్‌ అయినందున ఈ పిచ్చి ఆచారములు పాటింపను. టట్‌ నాన్సెన్సు అని మా ఆడవారి ఘోషా కూడ తీసివేసితిని. ఈ సంగతులకేమి గాని నిన్నటిదినము జయపురము మహారాజు మీవద్ద కొన్న లక్ష రూపాయల జవాహిరి చూచితిని. వారికి నాకు మిక్కిలి స్నేహము.’

జగ: ‘చిత్తము, మహారాజులంగారికి నాయందు మిక్కిలి అనుగ్రహము.’

జమీం: ‘రవ్వలంటే మీ వద్దనే రవ్వలు, ఏమి ఆ కాంతి? ఇంకను అట్టి రవ్వలు గలవా?’

జగ: ‘కొనువారుండిన రవ్వలకేమి తక్కువ. తెప్పించెదనా?’ అని అడిగి, లేచి లోనికి బోయి సేవకునిచే నొక పెద్ద ట్రంకు పెట్టెను పట్టించుకొని వచ్చి బల్లమీద పెట్టి దానిందెఱిచి రవ్వల పొట్లము నొకటి వెనుక నొకటి తీయుచు జమీందారు గారికి చూపదొడగెను. ఇవి బాగున్నదని బాగుండ లేదనియు జెప్పుచు, దీని వెల యెంత దాని వెల యెంత అని అడుగుచు ‘మీరు మిక్కిలి సత్యసంధులని జయపుర మహారాజా గారు నాతో చెప్పినంతనే వచ్చితిని. క్రమమైన వెల జెప్పవలయును సుమా’యని నడుమ నడుమ ననుచు తనకు చక్కగ గానుపించిన వానిని భార్య వద్దకి తీసుకొనివెళ్ళి చూపుచు మరల దెచ్చును. గంట వఱకు బేరము చేసెను. తుద కేబది వేల రవ్వలను బేరము చేసి విడిగా తీయించెను. షాహుకారు జమీందారు రత్నపరీక్ష జ్ఞానమునకు యాశ్చర్యమందుచు నడుమ నడుమ అతనిని పొగడుచుండెను.

ఇట్లు సిసలు పఱిచిన రవలనన్నింటిని చిన్న చిన్న పొట్లములుగా గట్టి ఆ పొట్లముల నన్నింటిని జమీందారు తనయొద్దనున్న పెద్ద మనీగాన్‌లో పెట్టి దానిని తన జేబులో నుంచుకొని షాహుకారుతో నిట్లనియె.

‘అయ్యా, అప్పనగా నాకు చీదఱ. కొన్న సరుకులకు వెలవెంటనే ఇయ్యవలయునని నా తాత్పర్యము. ఇంటి నుండి బయలుదేరునప్పుడు మీవద్దకు రావలెనని యనుకొనలేదు. ఈ త్రోవన మఱియొక చోటికి పోవుచుండగా నదియే మీ యిల్లని మా బండివాడు చెప్పెను. మిమ్ముల చుడవలెనని యాగితిమి. చూచినందుకు లాభమేయైనది. నిచ్చటికి వచ్చెదమని తలంపనందున పైకము తేలేదు. నేను యింటికి వెళ్ళి పైకము తీసుకొని వచ్చెదను. అంతవఱకు మన వాండ్రిక్కడనే యుండెదరు. తండియార్పేట వఱకు మనవాళ్లను తీసుకొని వెళ్ళవలసిన పనివున్నది. కావున ఇప్పుడు వీని నింటికి తీసుకొని పోవుట యెందుకు’ అని చెప్పి యాతడు లేచి భార్యతో నే వచ్చువఱకు నీ విక్కడనే యుండుమని చెప్పి కోచిబండి నెక్కి వెళ్ళిపోయెను.

భార్యాపుత్రులను యుంచి వెళ్ళుటకు జమీందారు గారొక కారణము చెప్పినను, జగజీవనలాలు మాత్రమా కారణమును నమ్మక, జమీందారు మిక్కిలి మర్యాదగల వాడగుటచే, తన నమ్మకమునకై వారిని తన ఇంట దించిపోయెనని తలచి, సంతసించెను.

జమీందారు వెళ్ళి అరఘంటయిన తరువాత సేవకుడు పరుగెత్తుకొని వచ్చి ‘దొరసానిగారూ? ఖజానా తాళపుచేతుల గుత్తి మీవద్దనే యున్నదట, దొరగారు మఱచి వెళ్ళినారు. తొందరగా తీసుకొని రమ్మని నన్ను పంపినారు. ప్రొద్దెక్కుచున్నది. పైకము తెచ్చి షాహుకారుగారికిచ్చి మనము తండియార్పేట వెళ్ళవలసి యున్నది’ అని పలికెను. అంతనామె తాళపు చేతుల గుత్తి వానిపై వేసి తొందరగా పొమ్మని యాజ్ఞాపించెను. వాడు పదియడుగులు వేయగా మఱల వానిని బిలిచి ఏమో యాలోచించి ‘గుత్తి నిటుతే’యని, ‘దినములు మంచివి కావు. లక్షల కొలది ధనమున్న ఖజానా తాళపుచేతులు వీనికిచ్చి పంపిన వీడేమి చేయునో? వీడు నమ్మిక కలవాడే గాని ధనముజూచిన ఎట్టి వారికి దుర్బుద్ధి పుట్టకమానదు. ఏమండీ షాహుకారుగారూ నిజమేనా?’ అని యడుగగా నాతడు ‘నిజమే నిజమే. డబ్బునెడల బహు జాగ్రత్తగా నుండవలెను’ అని తల యూపెను. ‘అట్లయిన నేనే తాళపుచెవుల గుత్తిని తీసుకొని వెళ్ళి పైకము తీసుకొని మేమిద్దఱము వచ్చెదము. నేను వచ్చు వఱకు అబ్బాయి పాలకేడ్చునేమో కావున కొంచెము పాలిచ్చి వెళ్ళెదనని ‘సీతా సీతా’యని దాసిని పిలిచెను.

దాసి పిల్లవానిని జోలపాడి నిద్రబుచ్చుచు మేడ క్రింద నొంటరిగా నుండెను. దాని జోల పాట మాత్రము పైకి వినబడుచుండెను. పిలిచిన తోడనేయది పిల్లవానిందీసికొని యజమానురాలి వద్దకు వచ్చెను. పిల్లవాని శరీరమంతయు నగలతో నిండియుండెను. రవ్వల, కెంపుల, పచ్చల పతకములు వ్రేలాడుచు ముఖమును కప్పివేసి యుండెను. యామె వానికి పాలిచ్చి యొక చిన్న పరుపు దెప్పించి వానినచ్చట బరుండబెట్టి భద్రమని దాసికి జెప్పి తన శరీరము మీది యేబది యరువది వేల విలువగల నగలను తీసి యాపిల్లవాని ప్రక్కనే యుంచి ‘మీ నమ్మిక కొఱకు వీనినిక్కడ నుంచుచున్నానని’ షావుకారుతో చెప్పెను. ‘కోటి వెలగల మీ కుమారునే ఇచ్చట నుంచుచున్నపుడు వేరే నగలుంచవలయునా? ఒకరిపై నొకరికి నమ్మిక లేని యెడల కలియుగ మెట్లుసాగు’నని, ‘మీరు వెళ్ళుటకు నా కోచిబండిని తెప్పింతునా’ అని యడిగెను. అచటనున్న సేవకుడు ‘అక్కర లేదు. నేను నడచి వచ్చిన తాళపు చేతి గుత్తి తీసికొని వచ్చుట కాలస్యమగునని నా యజమానుడు నన్ను కోచిబండి మీదనే పంపెను’ అని చెప్పెను. 

యజమానురాలు వెడలిన కొంతసేపటికి దాసి షాహుకారు వద్దకు వచ్చి ‘అయ్యా బీదదానిని. మా దొరవారు మీ యొద్దనెన్నో రాళ్ళు కొన్నారు. మీకింత లాభమైనప్పుడు నాకు కొంచెము యీనామియ్యకూడదా? దొరసానితో చెప్పి యింకా రాళ్ళు కొనునట్లు చేసెదను’ అని పెక్కు మాటలు చెప్పి ఎప్పుడెవ్వరి కేమియు నియ్యని లుబ్ధాగ్రేసర చక్రవర్తియగు జగజీవనలాలు యొద్దనుండి యొక రూపాయి బహుమానము వడసెను. రూపాయి చేతిలో పడగానే ‘అయ్యా, కల్లుగాని సారాగాని త్రాగనిది యుండలేము. మా దొరగారికి దొరసాని గారికీ పేరన్న గిట్టదు. నెలదినముల నుండి లేక చచ్చిపోవుచున్నాను. వారు వచ్చువఱకు ఈ ప్రక్క యంగడిలోనికి పోయి పావులా సారా తాగి వచ్చెదను. నిముసములో వచ్చెదను. అంతవఱకు చిన్నదొరగారికి కొంచెము చూచుచుండుడి. నిద్రలో ఏడ్చెనేని కొంచెము జోకొట్టుడి’ అని చెప్పి వెడలిపోయెను.

పది ఘంటలాయెను. పదునొకండు ఘంటలాయెను. పండ్రెండు ఘంటల సమయమై ‘ధమ్మ’ని ఫిరంగి మ్రోత వినబడెను. షాహుకారుకు సంశయము పుట్టదొడగెను. కడుపున పుట్టిన బిడ్డను, ఇంత ధనముని విడిచి వారేల పోయెదరని సమాధానము చేసికొనెను. నొంటిగంటయ్యె. అప్పటికైనను, ఎవ్వరు తిరిగి రాలేదు. నిద్రబోవుచున్న పిల్లడైనను యేడువలేదు. ఆహారము లేక సొమ్మసిల్లెనేమోయని షాహుకారు పిల్లవాని యొద్దకుపోయి నెత్తుకొని చూడ యాశ్చర్యము! అది పిల్లవాని యంతయాకారము గల యొక జాతి బొమ్మ!! షాహుకారు సేవకులనందఱిని పిలిచి చూపెను. వారందఱును అదియొక మోసమని తెలిసికొని ‘మోసమైన మనకేమి, మనరాళ్ళ వెలకంటె మించిన నగలున్నవి’ యని నగలకు మదింపు వేయసాగిరి. ఒక్కోనగ తీసి చూచిన కొలదిని అవి గిల్టు నగలేకాని నిజమైనవి కావని స్థిరపడెను. నగలన్నియు నూరు రూపాయల కంటె వెలచేయవు.

పోలీసు వారికీ సమాచారమును తెలిపిరి. పోలీసువారు కొందఱును జగజీవనులాలు సేవకులు కొందఱును మాఱు వేషములతో నర్సాపురము వెళ్ళి విచారించి, నర్సాపురపు జమీందారీ సృష్టియందెచ్చటను లేదని తిరిగివచ్చిరి.

ఎంతమంది జమీందారులనో మోసపుచ్చిన తనను ఈ బూటకపు జమీందారు మోసపుచ్చె గదాయని చింతించుట తక్క జగజీవనలాలుకు మఱియేమి యుపాయమును లేకపోయెను.


(సాక్షి సాహిత్యం; 12 ఆగస్ట్‌ 2019)

Monday, August 24, 2026

చదువరి బోర్హెస్‌


జార్జ్‌ లూయీ బోర్హెస్‌


చదువరి, రాయరి

ఆగస్టు 24న జార్జ్‌ లూయీ బోర్హెస్‌ జయంతి
-----------------------------------------------------

బోర్హెస్‌ను పట్టించే రెండే పదాల్ని చెప్పమంటే, తడుముకోకుండా ఎంచుకోగలిగేవి: చదవడం, రాయడం!

చిన్నతనంలోనే వాళ్ల నాన్న తన గ్రంథాలయాన్ని బోర్హెస్‌కు పరిచయం చేశాడట. ‘అందులో ఏం కావలిస్తే అది చదువుకో’మన్నాడట. ‘కాని ఏదైనా విసిగిస్తే వెంటనే దాన్ని పక్కన పెట్టేయమన్నాడు. అంటే నిర్బంధ పఠనానికి వ్యతిరేకం అన్నమాట. పఠనమంటే ఆనందం కలిగించేదిగా వుండాలి.’

తన పఠనాన్ని బోర్హెస్‌ ఎంత ఆనందమయం చేసుకున్నాడంటే, స్వర్గం కూడా గ్రంథాలయంలా ఉండింటే బాగుండేదని తలపోశాడు.

అయితే, ముప్పై ఏళ్లవరకూ తనను తాను నిరర్థకమైన జీవిగానే భావించుకున్నాడాయన. గంభీరమైన చరిత్రగల కుటంబంలో అర్జెంటీనాలో జన్మించిన బోర్హెస్‌(1899–1986) తాతలు యుద్ధాల్లో పాల్గొన్నవారు! తనకు రోజూ పొద్దునే గడ్డం గీసుకోవడానికి ఉపకరించే రెమింగ్టన్‌ కంపెనీయే తన తాతయ్య మరణానికి కారణమైన రైఫిళ్లను ఉత్పత్తి చేసిందన్న నిజం ఆయనకు చిత్రమైన గగుర్పాటు కలిగించేదట. సాహసాలతో నిండి సుసంపన్నంగా కనిపించే తన పూర్వీకుల జీవితంతో పోల్చుకుంటే ఆయనకు న్యూనత కలిగేదట. కార్యశూరత లేని ‘ఒక పాఠకుని జీవితం, అప్పుడప్పుడు తీవ్రంగా, ఒక పేద జీవితమని అనిపించే’దట.
 
కాని దాన్నుంచి ఆయన బయటపడగలిగాడు. ‘ఒక పాఠకుని జీవితం కూడా వేరే ఏ జీవితంతోనైనా సమానంగా సమృద్ధమైనదే’ అని మనస్ఫూర్తిగా తెలుసుకున్నాడు. ‘అందరూ తాము రాసిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటారు. కాని నేను చదివిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటాను. నేను మంచి రచయితను అవునో కాదో నాకు తెలియదుగాని నేను చాలా మంచి పాఠకుణ్ని,’ అని గర్వంగా చాటుకున్నాడు.

తర్వాత ఎన్ని ముద్రణలు వెలువడినప్పటికీ, తను చదివిన ఆ పాత పుస్తకం, దాని అట్ట, అందులోని అక్షరదోషాలు,  గీసుకున్న గీతలున్నదే అసలైన ‘డాన్‌ కిహోటి’గా భావించడం ఆయన వేలాది పఠనానుభవాల్లో ఒకటి!

తన మాతృభాష స్పానిష్‌ సాహిత్యంతో మొదలుకొని, జర్మన్‌ సాహిత్యం (ఎంతో ఉన్నతమైన సాహిత్యాన్ని అందించిన జర్మన్, ఆ సాహిత్యకంటే అందమైన భాషంటాడు!), ఫ్రెంచ్‌ సాహిత్యం (ఎంతో శ్రేష్టమైన సాహిత్యాన్ని అందించిన ఫ్రెంచ్, ఆయనకు వికారంగా తోచిందట!), ఆంగ్ల సాహిత్యం (ఆయన్ని షేక్‌స్పియర్‌ ముగ్ధుణ్ని చేయలేదు; ఆంగ్లాన్ని మాత్రం సొంతభాషలా ప్రేమించాడు.), ఇంకా, చరిత్ర, తత్వశాస్త్రం, గణితం, భూగోళం, మతగ్రంథాలు... ఎంత చదవాలో అంత చదివాడు; తిరిగి, వాటి గురించి ఎంత రాయాలో అంత రాశాడు. ‘కవి, కథకుడు, ఆలోచనాపరుడు, విమర్శకుడు, మేజిక్‌ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకు ఆద్యుడు’గా నిలిచాడు. ‘ఫిక్షన్స్‌’ ‘ది అలెఫ్‌’ కథాసంకలనాలు ఆయనకు విశ్వవిఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

ఆయన తండ్రి జార్జ్‌ గిలెర్మో బోర్హెస్‌ ఒక విఫల రచయిత! తండ్రి సాధించలేని చోట, తను కృతకృత్యుడవ్వాలన్న నైతిక ఒత్తిడి కూడా ఆయన్ని రాయడానికి పురిగొల్పింది. తొమ్మిదేళ్లప్పుడే ఆస్కార్‌ వైల్డ్‌ ‘ద హాపీ ప్రిన్స్‌’ను స్పానిష్‌లోకి అనువదించాడు; కానీ అది వాళ్ల నాన్న చేశాడనుకున్నారట. అయితే, తరువాతి రెండు దశాబ్దాలపాటు ఆయన ఎన్నో పుస్తకాలు రాసినప్పటికీ, వాటిలో కొన్ని అచ్చువేసినప్పటికీ వాటన్నింటినీ తన ‘ప్రాక్టీస్‌’గా మాత్రమే పరిగణించాడు. ఆడంబర గుణంలోంచి జనించే ‘మేలిమి రచన’కన్నా, ఏ అవాంతరాలూ లేకుండా సాఫీగా సాగే మంచి రచనే ఉత్తమమైనదిగా పేర్కొన్నాడు. ఎవరైనా తనని విమర్శిస్తూ సమీక్షించినప్పుడు, వాళ్లకన్నా తనే మారుపేరుతో మరింత పదునుగా విమర్శ చేసుకోగలనన్నాడు!

తొమ్మిదేళ్లపాటు బోర్హెస్‌ లైబ్రరీలో పనిచేశాడు. గొప్ప పాఠకుడికి తగిన చోటు! మరోవైపు రచయితగానూ ఆయన పేరు మార్మోగుతోంది. అలాంటి రోజుల్లో ఆయన సహోద్యోగి ఒకరు, ‘జార్జ్‌ లూయీ బోర్హెస్‌’ అనే రచయిత పేరూ, ఇతడి పేరూ ఒకటేకావడం; పైగా ఇద్దరికీ ఒకే పుట్టినరోజు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట! తనపక్కనుండి బుద్దిగా పుస్తకాలు సర్దుతుండే ఈ యువకుడే అంతటి కథకుడని ఆ సహోద్యోగి ఎలా నమ్మగలడు!

55 ఏళ్ల వయసులో బోర్హెస్‌కు చూపు పోయింది. అటు ఎనిమిది లక్షల పుస్తకాల వరాన్నీ ఇచ్చి, ఇటు అంధత్వాన్నీ శాపించిన దేవుణ్ని ఆయన నిందించాడు. అయితే, ఒక కళాకారునికి సంభవించే ప్రతిదీ అతని కళకు కావాల్సిన ముడిసరుకేననీ, తనకు ప్రాప్తించే ప్రతీ వేదననీ మూసలోకి మలిచేందుకు పనికొచ్చే మన్నుగానే భావించాలనీ ఆయన చెప్పినట్టుగానే... క్రూరమైన అంధత్వాన్ని కూడా తన జీవితానికి దక్కిన బహుమతిగానే స్వీకరించాడు. డిక్టేషన్‌ చెబుతూ రచనలు చేశాడు; అడాల్ఫో బోయ్‌ కాసరస్‌ లాంటివారితో జతగానూ రాశాడు; ఎన్నో దేశాల్లో పర్యటించాడు; విశ్వవిద్యాలయాల్లో రచన కళ గురించి ఉపన్యసించాడు; పాఠకుడిగానూ, రచయితగానూ రెండు జీవితాల్నీ సంపూర్ణంగా జీవించి నిష్క్రమించాడు!

(సాక్షి ఫన్‌డే; 24 ఆగస్ట్‌ 2014)

Wednesday, August 19, 2026

You’re in a terrible situation either way.



Yan Lianke

 

INTERVIEWER

You talk about the lure of the city, but don’t The Explosion Chronicles and The Family Plot suggest that, as rural villages expand and become wealthier, their inhabitants tend to lose their moral compasses?

YAN LIANKE

I’ve written about all the problems wealth brings, but also about the difficulties of being poor. Humankind lives in an eternal dilemma. You’re in a terrible situation either way.


INTERVIEWER

Could we say that your real subject is power, then? People are powerless when they’re poor, and after gaining power, they use it to oppress others.

YAN

Gaining the power to control others is a terrifying business. I’m currently writing a novel that includes all the revolutionaries who emerged after the Qing dynasty⁠—Sun Yat-Sen, Chiang Kai-Shek, Mao Zedong, Zhou Enlai, Deng Xiaoping, and so on, along with fictional characters from other people’s work, as well as Lu Xun, Hu Shih, and virtually every other Modernist writer. And the writers who killed themselves during the Cultural Revolution, like Lao She and Fu Lei. Obviously, the novel is unpublishable, but I’m strongly drawn to writing it. If only there were no such heroes and we could all calmly live our lives. In any case, I won’t discuss the plot in this interview. Let’s just say that I’m writing a book that I plan never to publish. I’ll leave it to my son, and maybe he’ll pass it on to his children. Maybe, far in the future, people will read it and know that their ancestors once thought and wrote in this way.


(The Paris Review: Yan Lianke, The Art of Fiction  No. 269)

Saturday, August 15, 2026

‘దేశభక్తుల్లో రాజకుమారుడు’


సుభాష్‌చంద్రబోస్‌



‘దేశభక్తుల్లో రాజకుమారుడు’


‘‘భారతదేశ విముక్తి కోసం, 38 కోట్ల నా సాటి భారతీయుల విముక్తి కోసం, దేవుడి పేరుమీద నేను ఈ పవిత్ర ప్రతిన బూనుతున్నాను. సుభాష్‌ చంద్రబోస్‌ అనబడే నేను, నా చివరి శ్వాస వరకూ స్వతంత్రం కోసం పవిత్రయుద్ధం చేస్తాను.’’
బ్రిటిష్‌వారితో పోరాటానికి దిగడానికి, తన 30,000 బలగంతో కూడిన ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ను అధికారికంగా ప్రకటిస్తూ నేతాజీ తనను తాను అంకితం చేసుకున్న తీరు ఇది. ప్రాణాలు అర్పిస్తానని మాటవరసకు చేసిన ఉత్తుత్తి ప్రతిజ్ఞ కాదది. ఉపనిషత్తుల్లో చెప్పిన త్యాగగుణాన్ని నేతాజీ తన రక్తంలో ఇంకించుకున్నాడు. అందుకే ప్రాపంచిక విలాసాలను సమకూర్చగలిగే సివిల్‌ సర్వీసు ఉద్యోగాన్ని ఒక మహోన్నత లక్ష్యం కోసం అట్టే వదిలేయగలిగాడు. 11 సార్లు జైలుకు పోయివచ్చాడు. అంతిమగమ్యం చేరేలోగా మధ్యమార్గంలో ప్రాణం పోయినా ఫర్వాలేదన్నది తనకు తాను ఇచ్చుకున్న తర్ఫీదు.

బేసిగ్గా నేతాజీ కార్యవాది. ఉడుకు నెత్తురు. అందుకే, నూరేళ్ల చరిత్ర ఉన్న ప్రెసిడెన్సీ కాలేజీలో... ‘‘చూడు, అధికులదే ఎప్పుడూ అధికారం. ఇండియన్స్‌ కన్నా బ్రిటిషర్లు మోరల్లీ సుపీరియర్స్‌. ఇది వాస్తవం. దీన్ని అంగీకరించకుండా ఎన్నాళ్లని నినాదాలిస్తారు?’’ అని ‘పేలిన’ ప్రొఫెసర్‌ ఆటెన్‌ మీద ‘చేయిచేసుకున్న’ బీఏ ఫస్టియర్‌ విద్యార్థుల్లో మొదటగా సుభాషుడి పేరే వినిపించింది.

గాంధీజీ ప్రవచించే అహింసా సిద్ధాంతం మీద నేతాజీకి విముఖతకన్నా తనదైన ఒక స్పష్టత ఉంది. తొలిఅడుగు కూడా అహింసతో పడాలనేది మహాత్ముడి ఆలోచన. బ్రిటిష్‌వాడి మెడలు వంచేదాకా దాని అవసరం లేదన్నది సుభాషుడి ప్రతిపాదన. ఆ విభేదం వల్లే, ఆయన ఆల్‌ ఇండియా నేషనల్‌ కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చాడు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ స్థాపించాడు. స్వాతంత్య్రం అనేది బ్రిటిష్‌ వారు తాంబూలంలో పెట్టి సమర్పించే కానుక కాదన్నాడు. దశలవారీ స్వాతంత్య్రాన్ని నిరాకరించాడు. ‘పూర్ణ స్వరాజ్‌’ మాత్రమే అంగీకారమన్నాడు. ‘నాకు రక్తాన్ని ఇవ్వండి; నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ అని పలికాడు.

యుద్ధక్షేత్రంలో వ్యూహాలు పన్నడమే కాదు, స్వాతంత్య్రం సిద్ధించాక ఆచరించాల్సిన కార్యాచరణ నిమిత్తం ప్రణాళికలు కూడా లిఖించాడు.

భూస్వామ్య వ్యవస్థ ఉండకూడదు. కులాంతర వివాహాలు జరగాలి. గాంధీ అయిష్టత కనబరిచినా నెహ్రూ సంపూర్ణ మద్దతునిచ్చే భారీ పరిశ్రమల స్థాపన జరగాలి. దేశాన్ని కాపాడుకోగలిగే ఆయుధ సంపత్తి మనమే తయారుచేసుకోవాలి. ఉద్యోగి జీవితం యజమాని దయమీద ఆధారపడి ఉండకూడదు. కార్మికులను యధేచ్చగా వీధుల్లోకి తోసేసి ఆకలికి మాడ్చడం కుదరని పని. అందరికీ ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. దేశంలో అసమానతలు తొలగిపోవాలంటే, రష్యా, టర్కీల్లోలాగా ‘సోషలిస్ట్‌ అథారిటేరియనిజం’ ఉండాలి. అలాగని, ప్రభుత్వం యజమాని, ప్రజలు బానిసలు కావడానికి వ్యతిరేకం.

భగవద్గీతను గాఢంగా అభిమానించినప్పటికీ మతం అనేది నేతాజీకి వ్యక్తిగత వ్యవహారమే. దానికి రాజ్యంతో సంబంధం లేదు. దేశమాత సంకెళ్లను తెంచడానికి పనికొచ్చే ప్రతివ్యక్తీ ఆయనకు ఆత్మీయుడే. వాళ్లు మసీదులో ప్రార్థిస్తారని తప్ప ఇంకేవిధంగానూ ముస్లింలు భిన్నమని నాకెన్నడూ తోచలేదన్నాడు. అందుకే ఆయన సైన్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరూ ఉన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి. తుపాకీ కాల్చడానికి కూడా వెనుకంజ వేయకూడదనేవాడు. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్‌’ను ఏర్పాటుచేసి యువతులనూ సైన్యంలో భర్తీ చేసుకున్నాడు. అమెరికా, ఇటలీ, చెకొస్లొవేకియా, ఐర్లాండ్‌ దేశాల స్వాతంత్య్ర పోరాటాల తీరును పరిశీలించాడు. ఎన్ని విమర్శలు వచ్చినా జర్మనీ, జపాన్, ఇటలీ దేశాల సాయం కోరాడు. ముల్లును తీయడానికి మరో ముల్లును ఆయుధంగా చేసుకోవాలనుకున్నాడు. స్వాతంత్య్రం లభించాక, ఢిల్లీ గద్దె మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాక, అప్పుడు, ‘గురుదేవా! ఇప్పుడిక దేశానికి నీ అహింసే కావాలి’ అని ఎలుగెత్తి చాటాలనుకున్నాడు. పవిత్ర గంగాజలంతో హింసను శుభ్రపరచాలనుకున్నాడు.
కానీ, ఆకాశమంతటి నాయకుణ్ని ఆ ఆకాశం విమానం సహా మాయం చేసింది. కాయం దొరక్కపోయినా ఆ తేజం అంతటా వ్యాపించింది. అది ఎవరినైనా కదిలించింది. గాంధీజీ ఆయన్ని ఇలా కొనియాడారు: ‘దేశభక్తుల్లో రాజకుమారుడు.’

(సాక్షి ఫన్‌డే; 19 జనవరి 2014)
––––––––––––––––––––––