Thursday, October 20, 2022

మనోధర్మ పరాగం: రచయిత ‘గొంతులు’ వినేముందు

మధురాంతకం నరేంద్ర గారి మనోధర్మ పరాగం నవల మీద నా అభిప్రాయం.

-

రవి వీరెల్లి గారు కోరడంతో ‘ఆటా’(అమెరికా తెలుగు అసోసియేషన్‌) నవలల పోటీకి నేను కూడా ఒక న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. నా మరో ముగ్గురు సహనిర్ణేతలు సాయి బ్రహ్మానందం గొర్తి, పి.సత్యవతి, శివకుమార్‌ తాడికొండ గార్లు. మొదటి బహుమతిని ఏకాభిప్రాయంతో మధురాంతకం నరేంద్ర గారి ‘మనోధర్మ పరాగం’కు ఇచ్చాం. అయితే నవలను అచ్చువేసేటప్పుడు మరెవరో ముందుమాట రాయడం కాకుండా, మా నలుగురినే మా అభిప్రాయాలను క్లుప్తంగానైనా రాసిమ్మని అడిగారు నరేంద్ర. అప్పుడు నేను రాసింది ఇది:


రచయిత ‘గొంతులు’ వినేముందు

పూడూరి రాజిరెడ్డి


ఈ నవల పీడీఎఫ్‌ నా చేతుల్లోకి వచ్చినప్పుడు ముందు దీని టైటిల్‌ భయపెట్టింది. పైగా కథను చెబుతున్నది ఎవరు? స్త్రీయా, పురుషుడా, లేక కాలమా అనేది స్పష్టత లేకపోవడం మరింత ఇబ్బంది పెట్టింది. కానీ దీన్ని పక్కన పెట్టనీయని ఏదో వెలుగు మాత్రం ఉందని తెలుస్తోంది. ఒక నవలల పోటీకి వచ్చిన రచనను పక్కన పెట్టే్ట ఆప్షన్‌ లేకపోయినా దాన్ని రాయడంలో రచయిత ఎఫర్ట్‌ ఎంత ఉంది, దాన్ని ఎంత సీరియస్‌గా చదవాలి అన్నది మనకు తెలుస్తూనే ఉంటుంది. రచయిత పేరు తెలియకుండా చదివిన ఈ నవల ఎవరో ‘రాయడం బాగా తెలిసినవాడు’ రాసినది అన్నది మాత్రం అర్థం అవుతోంది. ‘డు’ అనే ఎందుకు అంటే, ఇలాంటి సబ్జెక్టు ఒక మగ రచయితే రాయగలడు. భక్తిపారవశ్యంలో తేలి వచ్చే కీర్తనల్లో కూడా అంతఃగర్భితంగా వినబడే శృంగార భావనను ఒక మగ రచయితే పట్టుకోగలడని నా నమ్మకం.


పుస్తకం ముందుకు సాగకపోవడానికి మరో కారణం, దీని ఫార్మాట్‌. ఒక పాత్ర వచ్చి తన గురించి చెప్పుకుంటుంది, తర్వాత మరొక పాత్ర, తర్వాత మరో పాత్ర వచ్చి స్విచ్‌ వేసినట్టుగా తన తలపోత వినిపిస్తుంది. ఇది ఇక ఒక తంతుగా సాగుతున్నదే అనిపించేలోగానే నవల నూరు పేజీలకు చేరుకుంది. ఆ ఇద్దరు యువతులు ఒక తిరుగుబాటు చేద్దామని ఆ ఫొటో స్టూడియోకు వెళ్లే ఘట్టం ఎప్పుడైతే వచ్చిందో– అప్పటికే ఇది ఎవరినో మనసులో పెట్టుకుని రాస్తున్నాడని అస్పష్టంగా అనిపిస్తున్నది దీంతో స్పష్టమయ్యిందో– ఇక నవల ఎత్తుకుంది. చిత్రంగా అంతకు ముందటి అభిప్రాయాన్ని మార్చేస్తూ ఈ ఫార్మాటే దీనికి సరైనది అనిపించింది. ఇక్కడ నెరేటర్‌ పాత్రలకు పరిచితుడు కాదు. చారిత్రక ఆధారాలపై మాత్రమే కథనం ఆధారపడినప్పుడు ఈ ఇంటర్వ్యూ  తరహా దూరం తప్పదు. కానీ డీటెయిల్స్‌ను పూరించుకోవడంలో ఉన్నది రచయిత శక్తి. ప్రతి పాత్రా;  తంజావూరు, మధురై, మద్రాసు, కోయంబత్తూరుల్లోని ప్రతి వీధి  రచయితకు పరిచయం ఉన్నదే అనేంత దగ్గరికి వెళ్లగలిగాడు. అలాగే ఒక పాత్ర నుంచి మరో పాత్ర కథనానికి పాఠకుడిని సిద్ధం చేస్తున్న ప్రతిసారీ మధ్యలోకి నెరేటర్‌ను ప్రవేశపెట్టి, ఆ కాలపు సామాజిక రాజకీయ సాంస్కృతిక పరిణామాలను వివరించడం ఒక విరామంగానూ; ఆ పరిణామాల్లో ఈ పాత్ర ఎలా భాగంగా ఉందోనన్న అదనపు సమాచారం కోసమూ రచయిత వాడుకున్నాడు. అయితే ప్రదర్శన జరుగుతున్నప్పుడు చూడటం కాకుండా, జరిగిన అనంతరం దాని నెమరువేత శిల్పాన్ని ఎంచుకోవడం వల్ల కొన్ని సూక్ష్మ వివరాలను చెప్పడానికి అది బాగా కలిసొచ్చింది. అదే సమయంలో ఎక్కడైనా పెద్ద ఉద్వేగం వచ్చినప్పుడు అక్కడ కొంతసేపు నిలిచే అవకాశం లేకుండా పోయింది. మనకు తెలియని మనుషుల్ని అర్థం చేసుకోవడంలో, వాటి గురించిన సమాచార లభ్యతలో ఉన్న పరిమితే దానికి కారణం. కానీ ఈ ఫార్మాట్‌కు ఉన్న సానుకూలత ఏమిటంటే, మరిన్ని కొత్త ఆధారాలు బయటపడినప్పుడు మరో పాత్రని ప్రవేశపెట్టి ఆ వివరాలను కూడా రచయిత అందించగలడు. ఈ రచయిత ఎవరై ఉంటారన్న ప్రత్యేకమైన ఆసక్తి  నాకు ఎప్పుడు కలిగిందంటే– వాత్సాయన కామసూత్ర చదివితే  గొంతు మరింత విప్పారుతుందని అప్పుడప్పుడే ప్రసిద్ధురాలవుతున్న బ్రాహ్మణ గాయని కుంభకోణం మంగతాయారుకు ఒక పాతతరం దేవదాసీ గాయని సలహా ఇచ్చే సన్నివేశం ఎదురైనప్పుడు.


చిత్తూరు స్కంధ కుముదవల్లి, శ్రీరంగం అముదవల్లి, మధురై మోహనాంబ, తంజావూరు ధనకోటి, వేలూరు రామస్వామి పొన్న గాయత్రి– ఈ పాత్రలకు పెట్టిన పేర్లు నిండుగా నోటితో పలకాలి అనేంత బాగున్నాయి. ప్రధాన కథకు అంతగా సంబంధం లేకపోయినా వచ్చే సరళకుమారి లాంటి పాత్రలు రచయిత దృష్టి దేవదాసీ వ్యవస్థకు మాత్రమే పరిమితమై లేదనీ; మొత్తంగా భిన్న స్థాయుల్లోని స్త్రీ పురుష సంబంధాలను శృంగారంతో సహా వ్యాఖ్యానిస్తూ పరిధి విస్తరించుకున్నాడనీ అనిపించింది. పైగా 2020 సంవత్సరంలోనూ అలాంటి ‘పురుషాధిపత్య’ సమాజంలోనే ఉన్న సి.కె.నాగలక్ష్మి మునిమనవరాలిని కూడా కథనంలోకి తేవడం ద్వారా నవల రిలవెన్స్‌ మరింత పెరిగింది. రచయిత పూర్తి స్పృహతోనే ఇందులో ఏ ఒక్క మగ పాత్రకు గొంతు ఇవ్వలేదని కూడా నాకు అనిపించింది. నాగలక్ష్మి తమ్ముడు దండపాణిని వదిలేసి ఏ ప్రాముఖ్యతాలేని అతడి రెండో భార్య ద్వారా కథను నడపడం దీనికి నిదర్శనం. దీనివల్ల సి.కె.నాగలక్ష్మి యావజ్జీవితానికి సంబంధించిన ఎన్నో సమాధానాలను ఇవ్వగలిగే, ఎన్నో సందేహాలను తీర్చగలిగే విశ్వనాథన్‌ పాత్రను విస్మరించగలిగే సృజనాత్మక ఔచిత్యం ఏర్పడింది. ప్రశ్నలు రేపి, సమాధానాలు పూరించుకునేలా వదిలేయడంలోనే ఉంది రచయిత ప్రజ్ఞ.


(అక్టోబర్‌ 2020)




 

Tuesday, October 18, 2022

బాలసుబ్రహ్మణ్యం: అలవాటైన గొంతు

అలవాటైన గొంతు


నాకు సంగీతజ్ఞానం ఏమీ లేదు. అందరిలాగే నేను ఊరికే పాటలు వినేవాడిని అంతే. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా ఏం చెప్తాను, ఏం అభిప్రాయం ఉంది నాకు?

ఈ బాలసుబ్రహ్మణ్యం, చిరంజీవి లాంటి వాళ్లు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మన జీవితంలోకి వచ్చేశారో కూడా తెలియదు. మన అంటే 70, 80ల్లో జీవితాలు ప్రారంభించిన వాళ్ళని నా ఉద్దేశం. కొద్దిగా సినిమా అనే ఊహ తెలిసేనాటికే వాళ్ళు వాస్తవమై ఉన్నారక్కడ. చిరంజీవిని ఎందుకు కలిపి చెప్తున్నానంటే, నేను చిన్నప్పుడు ప్రతి సినిమాలోనూ చిరంజీవే ఉంటాడు అనుకునేవాణ్ణి. అట్లనే ప్రతి పాట బాలసుబ్రమణ్యం పాడతాడు అంతే. ఆ పేరు  తెలుసు అని కూడా కాదు, ఆ గొంతు తెలుసు. కాబట్టి వీళ్లు మనకు నచ్చడం, నచ్చకపోవడం అనే అవకాశమే లేదు. మనం ఎంపిక చేసుకోలేదు. సినిమా అనే మహత్తరమైన శక్తి మన కోసం ఎంపిక చేసి ఉంచిన  గొంతు బాలసుబ్రమణ్యం. అది ఎంతగా అలవాటైపోయింది అంటే, ఆ గొంతు ఒక స్టాండర్డ్‌. ఒక ప్రమాణం. అట్ల లేనిది ఇంకా గొంతు కాదు అనిపించేది. అబ్బా, ఈ బాలసుబ్రమణ్యం లేకపోతే ఈ పాటలన్నీ ఏమైపోయేవి అనిపించేది.

నాకు ఒకటి బాగా గుర్తుంది. జేసుదాసు గొంతు మొదటిసారి విన్నప్పుడు–  అది ఆస్తులు అంతస్తులో ఎర్రమందారమో– ఇదేంట్రా ఇట్లా ఉంది గొంతు అనుకున్నాను. నిజానికి అదొక అమృతధార అని తర్వాత, చాలా తర్వాత ఎప్పుడో తెలుసుకోగలిగాను. ఘంటసాలది కూడా అట్లనే. మరీ పాత పాటలు నేను చాలా ఆలస్యంగా విన్నాను. బాలును విన్న చెవులతో నాకు ఘంటసాలది కూడా ఆనలేదు. అదీ బాలు! అంతగా నా చెవులు, చేతన ఆక్రమించుకున్నాడు. అట్లా ఎన్నో ఏళ్లు మునిగి తేలి, మునిగి తేలిన తర్వాత బాలసుబ్రమణ్యం కాకపోతే చాలు ఆ పాట వినసొంపు అనేంతగా యాష్ట కూడా పెట్టాడు. చెవులకి ఎప్పుడూ ఒక కొత్త శబ్దం కావాలి మనకు. కొత్తదనమే అందం. కానీ అన్ని ఏండ్లు ఒక గొంతు ఉనికిలో ఉండగలగడం మాత్రం ఆశ్చర్యమే. తొందరగా గ్రహించగలగడం, గొంతు మార్చి పాడగలగడం ఇట్లా రకరకాల కారణాలు చెపుతారు. వాటన్నింటికీ అతీతమైనది ఏదో ఆయనకు ఆ స్థానం ఇచ్చి ఉంటుంది.

నాకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే నాకు ట్యూన్‌ ముఖ్యం. మంచి ట్యూన్‌ పడినప్పుడు దానిలో ఎవరు పాడినా ఒకటే అనిపిస్తుంది. ‘నవమి నాటి వెన్నెల నీవు’ బాలు కాకుండా మనో పాడితే దాని సొంపు తగ్గుతుందా? కొన్ని మంచి సినిమాలు ఉంటాయి. అందులో అందుబాటులో ఉన్న మంచి నటుడు ఎవరు నటించినా ఒకటే. యాక్టర్‌ కూడా ప్లస్‌ కావడం అనేది అరుదుగా జరుగుతుంది. అలాగే నేను మాటలకి కూడా పెద్ద ప్రాధాన్యత ఇవ్వను. వినడానికి బాగుండాలి. కాబట్టి కేవలం సంగీతం వల్ల నాకు నచ్చిన పాటలు బోలెడున్నాయి. ఒక్కోసారి దీనికి భిన్నమైన అభిప్రాయం కూడా ఉంటుంది. ఉదాహరణకు శుభసంకల్పం సినిమాలో ‘హరిపాదాన పుట్టావంటే గంగమ్మ’ పాట మధ్య ఒక లేడీ వాయిస్‌ వస్తుంది. అట్లాగే కిల్లర్‌ సినిమాలో ‘పిలిచే కుహు కుహు వయసే’ ముందు ఒక హమ్మింగ్‌ లాగా ఉంటుంది. టైటానిక్‌ సినిమాలో లేడీ వాయిస్‌. ఇవి నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తూ ఉంటాయి. ఈ చిన్న చిన్న బిట్స్‌ చాలా ఇంపార్టెంట్‌ నాకు. బాలసుబ్రహ్మణ్యం ఇట్లా నాకు ఎప్పుడు అనుభూతి కలిగించాడు! ఆయన గురించి చెప్పాలంటే అంతటా ఆయనే ఉన్నాడు, ఎక్కడా దొరకడం లేదు అనే సమస్య వస్తోంది.

అయితే ‘విధాత తలపున ప్రభవించినది’ ఈ పాట విన్నప్పుడు నాకు జీవిత ఉత్సాహం పొంగుకొస్తుంది. ఎందుకో తెలీదు. అందులోని మాటలకు మించి ఆ ఆరా  ఏదో నన్ను తాకింది. దానికి సిరివెన్నెలకు క్రెడిట్‌ ఇవ్వాలా, హరిప్రసాద్‌ చౌరాసియాకా, బాలసుబ్రహ్మణ్యంకా అర్థం కాదు. ఎందుకో అట్లా హృదయం గంతులేస్తుంది. అదే ‘ఆమని పాడవే హాయిగా’ అంటే నాకు నీరసం పుడుతుంది. ఈ మ్యాజిక్‌ ఏంటో అర్థం కాదు. అంటే మనకు తెలియకుండానే ఆ పాటకూ, నాకూ మధ్య ఏదో కుదిరింది. బాలసుబ్రహ్మణ్యంకూ, నాకూ కూడా అట్లా చాలా ఏళ్ళు చాలా చాలా సార్లు కుదిరింది.


(2020 అక్టోబర్‌)

(మోదుగుల రవికృష్ణ తెచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతి సంచిక కోసం పంపింది.)


 

Saturday, October 15, 2022

ఒంటరి సమూహం


ఒంటరి సమూహం

సుమారు ఆరు దశాబ్దాలుగా అలుపెరగకుండా రాస్తున్న ‘అత్యంత ప్రాధాన్యం గల స్త్రీవాద రచయిత్రి’ ఆనీ ఎర్నౌను 2022 నోబెల్‌ సాహిత్య పురస్కారం వరించింది. ఈ గౌరవం దక్కిన తొలి ఫ్రెంచ్‌ మహిళ ఆమె. ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారం పొందిన పదిహేడో మహిళ.

సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; అయినా కూడా మహిళలు, అణిచివేతకు గురైనవారి పోరాట గాథలను సజీవంగా ఉంచుతున్నానంటారు 82 ఏళ్ల ఆనీ ఎర్నౌ. శరీరం, లైంగికత; సాన్నిహిత్య సంబంధాలు; సామాజిక అసమానతలు; చదువు ద్వారా వర్గాన్ని మార్చుకునే ప్రయత్నం ఆమె రచనల్లో కనబడతాయి.  

ఫ్రాన్స్‌లోని చిన్న పట్టణం నార్మండీలో వారి కుటుంబం నివసించింది. బతకడానికి నాకు పుస్తకాలు అక్కర్లేదని కరాఖండీగా చెప్పే తండ్రిని కలిగిన అతి సాధారణ నేపథ్యం. ఒక కెఫే యజమానిగా అలెగ్జాండర్‌ డ్యూమా, ఫ్లాబర్ట్, ఆల్బర్ట్‌ కామూ లాంటి రచయితలను చదవడం వల్ల తనకేం ఒరుగుతుందని ఆయన నిశ్చితాభిప్రాయం. కానీ ఆనీలో అది పూర్తి విరుద్ధంగా పనిచేసింది. పుస్తకాలు మాత్రమే తనకు అత్యంత ప్రీతికరమైనవనీ, ఎంత చెడ్డ జీవితంలోనూ తనను తాను ఒక ‘అ–పాఠకురాలిగా’ ఊహించలేననీ అంటారామె. ఆరేళ్ల వయసు నుంచే అక్షరంలోని గమ్మత్తుకు ఆకర్షితురాలయ్యారు. వందలాది పుస్తకాలను ఉచితంగా చదువుకోవడం కోసమే పుస్తకాల షాపులో పనిచేయాలని కలగన్నారు. ఒక శ్రామిక కుటుంబంలో పుట్టి, బుద్ధెరిగాక మధ్యతరగతి జీవితాలతో పోల్చుకున్నప్పుడు తమ పరిస్థితి పట్ల సిగ్గుపడిన ఆనీ ఎర్నౌ చదువుకోవడం ద్వారా జీవితాలను మార్చుకోగలమన్న అభిప్రాయానికి చాలా త్వరగా వచ్చారు. దానికి అనుగుణంగానే ముందు టీచర్‌గా, అనంతరం లిటరేచర్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

వర్జీనియా వూల్ఫ్‌ అంటే ఆనీకి పిచ్చి అభిమానం. సైమన్‌ ది బోవా ఆమె చైతన్యాన్ని విస్తృతపరిచారు. స్త్రీవాదం అనేది తప్పనిసరైనది అన్న అవగాహనతో ఇరవై ఏళ్ల వయసు నుంచే తన రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. తన కుటుంబానికి తెలియకుండా చేయించుకున్న అవాంఛిత గర్భస్రావం గురించి ‘క్లీన్డ్‌ ఔట్‌’ రాశారు. ఆ అనుభవంలోని జుగుప్స, భయానకాలకు వెరవకుండా, దీన్నే పునర్దర్శనంలాగా ‘హ్యాపెనింగ్‌’ రాశారు. ఒక స్త్రీ తన శరీరం మీద తన నియంత్రణనూ, స్వాతంత్య్రాన్నీ స్థాపించుకోవడానికి సంబంధించిన అతిముఖ్యమైన నవలగా ఇది నిలిచిపోయింది. తను దాటివచ్చిన జీవిత దశలనే ఆనీ పుస్తకాలుగా మలిచారు. ఆమె కౌమార జీవితం ఒక పుస్తకం. వైవాహిక జీవితం ఒక పుస్తకం. తూర్పు యూరోపియన్‌ మనిషితో ప్రేమ వ్యవహారం(ప్యాషన్‌ సింపుల్‌) ఇంకో పుస్తకం. తల్లి మరణం ఒక పుస్తకం. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అనుభవాలు మరో పుస్తకం. ఫ్రాన్స్‌ చరిత్రతో ముడిపడిన ‘ది ఇయర్స్‌’ను ఆమె మ్యాగ్నమ్‌ ఓపస్‌గా పరిగణిస్తారు. ఉత్తమ పురుష(నేను) కథనాలకు భిన్నంగా దీన్ని థర్డ్‌ పెర్సన్‌లో రాశారు. 

ఏ వ్యక్తిగత అనుభవమో ‘పొరపాటున’ సాహిత్యంలోకి వస్తే– దానికీ, తనకూ ఏ సంబంధమూ లేదని ఒక డిస్‌క్లెయిమర్‌ లాంటిది ఆ రచయిత తగిలించడం కొత్త సంగతేం కాదు. మరీ ముఖ్యంగా సంక్లిష్ట కుటుంబ సంబంధాలు, సన్నిహిత మానవ సంబంధాలు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు మరీ ఎక్కువ. ఇక వ్యక్తిగతం అన్నదే కొందరికి నిషిద్ధాక్షరి. వ్యక్తి నుంచి కూడా సమాజాన్ని దర్శించవచ్చునన్న అవగాహన ఉన్నవాళ్లు తక్కువ. కానీ ఆనీ ఎర్నౌ సాహిత్య సర్వస్వం ఆత్మకథాత్మకమే. ఇది కల్పన అని చెబితే రచయితకో రక్షణ కవచం ఉంటుందన్న ఆలోచన ఆమెకు లేక కాదు. కానీ అది మోసం చేయడంలా భావించారు. వ్యక్తిగత జీవితాన్ని ఒక ప్రయోగశాలలో పరీక్షించుకున్నంత కచ్చితత్వంతో తన అనుభవాలను నమోదు చేశారు. అందువల్లే ఆమె ‘గ్రేట్‌ ట్రూత్‌ టెల్లర్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌’గా నిలవగలిగారు. నార్మండీ లాంటి చిన్నపట్టణంలో తన జీవితాన్నీ, తండ్రితో తన సంబంధాన్నీ ‘ఎ మ్యాన్స్‌ ప్లేస్‌’గా రాస్తున్నప్పుడు తన రచనాపద్ధతిని గురించి ఆమె ఘర్షణపడ్డారు. తండ్రిని ఒక కాల్పనిక పాత్రగా మలవడంలో తన రచనా ఉద్దేశమే నెరవేరదని భావించారు. అందుకే ఉన్నది ఉన్నట్టే రాయడానికి సంకల్పించారు. అందుకే ఆమెను ఫిక్షన్‌ రచయిత అనాలా, నాన్‌–ఫిక్షన్‌ రచయిత అనాలా అన్న చర్చకూడా వచ్చింది. కొందరు ఆమెను ‘మెమొయిరిస్ట్‌’ (జ్ఞాపకాల రచయిత) అన్నారు. నవలగా, ఆత్మకథగా కాకుండా తన రచనలను ఆటోసోషియోబయోగ్రాఫికల్‌(సామాజిక ఆత్మకథ)గా మలవగలగడం ఆమె ప్రత్యేకత. చరిత్ర, ఆత్మకథల కలగలుపు ఆమె పద్ధతి. 

ఇంట్లో పుస్తకాలను చూసి, ఇవన్నీ చదువుతావా అని ఆశ్చర్యపోయిన తన కజిన్, పుస్తకాలతో మనుషులకేం పని అన్నట్టుగా బతికిన తన తండ్రిలాంటివాళ్లు నిజానికి తనకు ఎక్కువ స్ఫూర్తి కలిగించారని చెప్పే ఆనీ... మర్చిపోయి అంతర్ధానమయ్యే లోపల జ్ఞాపకాలను పదిలపరుస్తున్నానంటారు. ఫ్రాన్స్‌ ఉమ్మడి జ్ఞాపకాలను ఆమె తన ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అనువాదాల ద్వారా అవి ప్రపంచ స్మృతులుగా కూడా మారాయి.

తన ప్రపంచంగా అనిపించని పారిస్‌ విలాసాలకు దూరంగా ప్రకృతి, నిశ్శబ్దాల కోసం సబర్బన్‌ ప్రాంతంలో నివసించే ఆనీ ఎర్నౌ... ఒక దశలో ‘మహిళా విప్లవం’ చూడకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డానంటారు. కానీ అబార్షన్‌ హక్కులు రావడానికీ, స్త్రీ శరీరం మీద మారుతున్న పురుష ప్రపంచ ధోరణికీ ఆమె కూడా ఒక కారణం అయ్యారు. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; కానీ ప్రయోజనం లేకుండా మాత్రం ఉండదు.

(10th October 2022)
 


 

Thursday, October 13, 2022

పతంజలి శాస్త్రి: గొప్పదూరపు రచయిత

 గొప్పదూరపు రచయిత

పూడూరి రాజిరెడ్డి


పతంజలి శాస్త్రి గారిని తలుచుకోగానే నాకు గుర్తొచ్చిన కథ, గారడీ. ఆ పేరు కూడా కాదు; ఒక మగవాడి పుంసత్వపు నిస్సహాయతా, ఇక దానివల్ల గట్టిగా నోరెత్తలేని బలహీనతా. ఇలాంటి కథలు ఉంటే ఆ స్త్రీ కోణంలోనో, లేకపోతే ఆ అలవాటైనవాడి కోణంలోనో ఉంటాయి. కానీ ఇలాంటి కథ నేను ఎక్కడా చదవలేదు. ఏదో ఒక వయసులో, స్థాయిలో అన్ని రకాలుగానూ జీవితంలో వెనక్కి తగ్గడం ఎలా మొదలవుతుందో కూడా ఇందులో చూడొచ్చనుకుంటాను.

ఇలాంటి కథ నేను మరెక్కడా చదవలేదు అని చెప్పగలిగే ఇంకో కథ, వడ్ల చిలకలు. మధ్య తరగతి అనే ఒక బ్రహ్మ పదార్థం మీద చాలా నిరసన, ఏవగింపు, వ్యంగ్యం సాహిత్యంలో కనబడతాయి. కానీ అదేమిటి, దాని దృక్పథం ఎలా ఏర్పడుతుంది, దాని జీవితాన్ని మలిచే అంశాలేమిటి, అది ఏం మాట్లాడుకోవడానికి చెవులు రిక్కిస్తుంది, దాని కలలను ఎలా అణిచివేసుకుంటుంది, అసలు కలలు కనడానికి కూడా ఎలా వెనుకాడుతుంది– అని చెప్పడానికి ఈ కథను ఒక నమూనాగా చూపవచ్చు.

సంపాదకుడు శక్తిమంతుడు అని పత్రికవాళ్లకు తెలుసు. కానీ కంట్రిబ్యూటర్‌ శక్తిమంతుడని లోకానికి తెలుసు. అందుకే సంపాదకుడు చేయలేని పనిని కంట్రిబ్యూటర్‌ ఇట్టే చేసేయగలడు. ఇవొక చిత్రమైన పవర్‌ పాలిటిక్స్‌. దీన్నే పోలీసు వ్యవస్థ నేపథ్యంలో, ఏసీపీ మృదువుగా చేయలేని పనిని ఎస్సైతో మొరటుగా చేయించి చూపారు పతంజలి, ఎస్సై నవ్వేడు కథలో.

కనకం గట్టెక్కిన వైనము అనే ఇంకో కథలో, అదనపు డబ్బుల కోసం పుట్టింటికి తన కూతుర్ని తరిమికొట్టిన అల్లుడిని ఎదుర్కోలేని ఒక నిస్సహాయ కానిస్టేబుల్‌ మామ కోసం– కస్టడీలో ఉన్న దొంగ కొత్త సినిమా రిలీజు రోజు జేబులు కొట్టడం చూస్తాము. 

నడిపే బండి మీద, బతికే జీవితం మీద ఏకాగ్రత లేని ఒక పెళ్లయిన కొడుక్కు– జీవితంలో ఎలా మమేకం కావాలో అర్థం చేయించడానికి ప్రయత్నించే తండ్రి ‘జెన్‌’లో కనబడతాడు.

ఇంకా అతడి శీతువు, రామేశ్వరం కాకులు మంచి కథలు. లోలోపల గుబులును రేపే కథలు. తెలియని వ్యథను సున్నితంగా చెప్పే కథలు. ఇలా కథల్ని ఏకరువు పెడుతూ పోవాలని నేనేమీ అనుకోవడం లేదు. జీవన సాఫల్య పురస్కారం అందుకునే రచయితకు ఇవ్వాల్సిన సమీక్ష కాదు ఇది.

ప్రతిదాని మీదా స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవాళ్లు నన్ను భయపెడతారు,  ముఖ్యంగా సాహిత్యంలో. జీవితం అర్థం కానిది అని మాత్రమే నేను అర్థం చేసుకోగలిగాను. ఆ అర్థంకానితనాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఆర్టిస్టు పడే తపన నన్ను ఆకట్టుకుంటుంది. అయితే, పతంజలి శాస్త్రిలో ఆ తెలియనితనం అంటూ ఏమీ కనబడదు. ఆయనకు అన్నీ తెలుసు అనిపిస్తుంది. అంటే, ఆయన పూర్తిగా ఏర్పడినాక, రూపుదిద్దుకున్నాక చేస్తున్న సృజన ఇది. కాబట్టి, దేనితోనూ గట్టి విభేదాల్లేవు, గట్టి పంతాల్లేవు, బయటపడిపోయే అమాయకత్వం అసలు లేదు. తన కుటుంబ నేపథ్యం వల్ల సమాజపు ఏ బరువూ ఆయన మీద లేని స్వేచ్ఛ ఉండటం కూడా దీనికి ఒక కారణమా అన్నది నేను చెప్పలేను. అయితే, ఈ పతంజలితో పోల్చుకుని తనను చిన్న పతంజలి అని చెప్పుకున్న కేఎన్‌వై పతంజలి ఒక మంచి మాటన్నారు: ‘ఉద్యమాలతో సంబంధం లేకనో, వాటితో విభేదించకుండానో కేవలం జీవితాన్ని మాత్రమే పట్టుకుని ప్రయాణించే సాహిత్యం ఎపుడూ ఉంటుంది. పతంజలిశాస్త్రి గారిది అలాంటి సాహిత్యం’.

అయితే పతంజలి శాస్త్రిని నేను ఎక్కువగా చదవలేదు. కారణాలేమిటో నాకూ తెలీదు. ఆయన ఒక ‘ఫోర్సు’గా నా దగ్గరిదాకా చొచ్చుకు రాలేదు. బహుశా చదవడం పట్ల నాకుగా ఉన్న చిత్రమైన అభిప్రాయాల వల్ల కావొచ్చు. రచయితలు వెల్లడి కాని రచనలు నాకు అభిమానాన్ని పుట్టించవు. తన గురించి ఏదోలాగానైనా చెప్పుకోవాలన్న లౌల్యం లేని రచయితలు నాకు దగ్గరివాళ్లుగా అనిపించరు. అలాగని ఆ లౌల్యమే ప్రధానమైతే ఇక ముందుకెళ్లను. కానీ తన రచనల్లో పతంజలి ఎక్కడున్నారో, ఏ పాత్రలో ఆయన్ని చూసుకోవాలో నాకు అంతుపట్టలేదు. ఇలా నిర్మమకారంగా రాసేవాళ్లు నిజానికి గొప్పవాళ్లు. కానీ నాకు దూరపువాళ్లు.

అయితే ‘ప్రగతిశీల’ ప్రయోజనం ఏమీ ఉండదని కొందరు రచయితలు కొన్ని రాయకుండా వదిలేస్తారు, ముఖ్యంగా ఒక ‘స్థాయి’కి వచ్చాక, ఇంకా ముఖ్యంగా తెలుగులో. కానీ వెన్నెల వంటి వెలుతురు గూడు రాయడం పతంజలిని ఈ మొత్తంనుంచి వేరుగా నిలబెడుతుంది. రైలు ప్రయాణంలో ఒక చిరు ఉద్వేగపు కల్లోలాన్ని చూపిన ఈ చిట్టి కథ గనక నేను చదవకపోయివుంటే ఆయనకు నేను ఇంకా దూరంగానే ఉండిపోయేవాడిని.


(2021 నవంబర్‌)

(పతంజలి శాస్త్రి గారికి అజో–విభో వారి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చినప్పుడు ఆయన మీద వేసిన ప్రత్యేక సంచిక కోసం రాసింది.)


 

Monday, October 10, 2022

గన్స్, జెర్మ్స్‌ అండ్‌ స్టీల్‌: అసమాన ప్రశ్నలు

 


అసమాన ప్రశ్నలు

ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? ఈ అసమానతలకు కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఒక శాస్త్రవేత్తకు వస్తే? ఆయన చరిత్రకారుడు కూడా అయితే! జియాగ్రఫర్, ఆర్నిథాలజిస్ట్‌ లాంటి అదనపు అర్హతలు కూడా ఉంటే? ఇలాంటి ప్రశ్నలకు బహు వృత్తులు, ప్రవృత్తులు కలగలిసినవారే జవాబులు చెప్పగలరు. 

ఒకానొక సముద్రపు ఒడ్డు నడకలో అమెరికన్‌ రచయిత జేరెడ్‌ డైమండ్‌(జ.1937)ను ఒక నల్లజాతి యువకుడు, పాపువా న్యూ గినియా దీవులకు చెందిన ‘యాలి’ ఇలా నిలదీశాడు: ‘మీ తెల్లవాళ్ల దగ్గర అంత ‘కార్గో’(వస్తు సామగ్రి) ఉన్నప్పుడు, మా దగ్గర అది ఎందుకు లేదు?’ ఈ అన్వేషణలో భాగంగా ఏళ్లపాటు చేసిన పరిశోధనతో జేరెడ్‌ డైమండ్‌ రాసిన పుస్తకం ‘గన్స్, జెర్మ్స్‌ అండ్‌ స్టీల్‌: ద ఫేట్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ సొసైటీస్‌’. శీర్షికలోనే సమాధానాలను నిలుపుకున్న ఈ పుస్తకం సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం 1997లో వచ్చింది. ఆ తర్వాత దీని ఆధారంగానే ఇదే పేరుతో ‘ఎన్జీసీ’ ఛానల్‌ డైమండ్‌ హోస్ట్‌గా మూడు భాగాల డాక్యుమెంటరీ కూడా నిర్మించింది.

సులభంగా కనబడే ఈ ప్రశ్నలకు జవాబులు అంత సులభంగా దొరకవు. వీటికి సమాధానాలు కూడా వర్తమానమో, సమీప గతమో చెప్పలేదు. అందుకే చరిత్ర, పూర్వ చరిత్ర యుగంలోకి డైమండ్‌ మనల్ని తీసుకెళ్తారు. మనుషులందరూ ఆహార సేకరణ దశలోనే ఉన్న తరుణంలో పదమూడు వేల ఏళ్ల క్రితం ‘మధ్య ప్రాచ్యం’లో మొదటిసారి వ్యవసాయం మొదలైంది. బార్లీ, గోధుమ పండించారు. ఎప్పుడైతే మిగులు పంట సాధ్యమైందో అక్కడ మనుషుల వ్యాపకాలు ఇతరాల వైపు మళ్లాయి. అలా మానవాళి మొదటి నాగరికత నిర్మాణం జరిగింది. చిత్రంగా పాపువా న్యూ గినియాలో ఇప్పటికీ వ్యవసాయం మొదలుకాలేదు. దానికి కారణం, అక్కడివాళ్లు తెలివైనవాళ్లు కాదనా? ఏ చెట్టు ఏమిటో, ఏ పుట్టలో ఏముందో చెప్పగలిగేవాళ్లు; ఎంతదూరమైనా బాణాన్ని గురిచూసి కొట్టేవాళ్లు తెలివైనవాళ్లు కాకపోవడం ఏమిటి? ఏ పంటలైతే మధ్య ప్రాచ్యంలో నాగరికతకు కారణమయ్యాయో, అవి ఇక్కడ పెరగవు. ఆ భౌగోళిక పరిమితి వల్ల వాళ్లు ఇంకా ఆహార అన్వేషణ దశలోనే ఉన్నారు. అందుకే మనుషులను ‘అసమానంగా’ ఉంచుతున్న కీలక కారణం భౌగోళికత అంటారు డైమండ్‌. 

‘ఫెర్టయిల్‌ క్రెసెంట్‌’(సారవంతమైన చంద్రవంక)గా పిలిచే ఈ యురేసియా ప్రాంతంలోనే జంతువులను మచ్చిక చేసుకోవడం కూడా జరిగింది. ఇవి గొప్ప అదనపు సంపదగా పనికొచ్చాయి. ఆవు, ఎద్దు, గొర్రె, మేక, గుర్రం, గాడిద, పంది లాంటి పద్నాలుగు పెంపుడు జంతువుల్లో ఒక్క లామా(పొట్టి ఒంటె; దక్షిణ అమెరికా) తప్ప పదమూడు ఈ ప్రాంతం నుంచే రావడం భౌగోళిక అనుకూలతకు నిదర్శనంగా చూపుతారు డైమండ్‌. మనుషుల విస్తరణ కూడా సరిగ్గా ఆ భౌగోళిక రేఖ వెంబడి, అంటే ఏ ప్రాంతాలు వీటికి అనుకూలంగా ఉన్నాయో వాటివెంటే జరిగింది.
మరి ఒకప్పుడు మొదటి నాగరికత వర్ధిల్లిన మధ్య ప్రాచ్యం ఇప్పుడు ప్రపంచంలోనే సంపన్న ప్రాంతంగా ఎందుకు లేదు? భౌగోళికత ఒక కారణం అవుతూనే, దాన్ని మించినవి కూడా ఇందులో పాత్ర పోషిస్తున్నాయన్నది డైమండ్‌ సిద్ధాంతం. అయితే భౌగోళికత ప్రతికూలంగా కూడా పరిణమించవచ్చు. కరువు కాటకాలు ఓ దశలో మధ్య ప్రాచ్యాన్ని తుడిచిపెట్టాయి కూడా. 

వారికి తెలియకుండానే ఐరోపావాసుల పక్షాన పనిచేసినవి సూక్ష్మ క్రిములని చెబుతారు డైమండ్‌. ఇతర ప్రాంతాలకు విస్తరించే క్రమంలో జరిగిన పోరాటాల్లో, ఆ పోరాటాల కంటే ఎక్కువగా వీరి నుంచి వ్యాపించిన సూక్ష్మక్రిముల వల్ల ‘మూలజాతులు’ నశించాయి. దానిక్కారణం, వేల సంవత్సరాల జంతువుల మచ్చిక వల్ల వాటి నుంచి వచ్చే సూక్ష్మక్రిముల నుంచి వీరికి నిరోధకత ఏర్పడింది. కానీ అలాంటి సంపర్కం లేని అమెరికన్‌ జాతులు దాదాపు తొంభై ఐదు శాతం నశించిపోయాయి. ముఖ్యంగా ‘స్మాల్‌పాక్స్‌’(మశూచి) కోట్లాది మంది ప్రాణాలు తీసింది.

ఇంక ఎప్పుడైతే ఉక్కు వాడకంలోకి వచ్చిందో, ఆ ఉక్కుతో ముడిపడిన తుపాకులు రావడం ప్రపంచ గతినే మార్చేసింది. ఆ తుపాకుల వల్లే యూరప్‌ దేశాలు ప్రపంచాన్ని తమ కాలనీలుగా మార్చుకోగలిగాయి. ముఖ్యంగా ఆఫ్రికాలోని ప్రాచీన నాగరిక సమాజాలు, అవెంతటి ఘన సంస్కృతి కలిగినవి అయినప్పటికీ తుపాకుల ముందు నిలవలేకపోయాయి. అక్కడినుంచి ఎంతో అమూల్యమైన సంపద తరలిపోయింది.

మరి ఐరోపావాసులకు ప్రతికూలతలుగా పరిణమించినవి ఏవీ లేవా? ఏ భౌగోళిక రేఖ వెంబడి ప్రయాణిస్తూ వారికి అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండే ‘కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌’(దక్షిణాఫ్రికా)లో మనగలిగారో, దాన్ని దాటి ఆఫ్రికాలోని ఉష్ణ మండలం వైపు విస్తరించినప్పుడు కేవలం మలేరియాతో కోట్లాదిమంది చచ్చిపోయారు.

ప్రపంచం స్థిరంగా ఆగిపోయేది కాదు. ప్రస్తుత భౌతిక ప్రమాణాల రీత్యా ప్రపంచంలో అసమానతలు స్పష్టంగా కనబడుతుండవచ్చు. కానీ మొన్న కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఐరోపా, అమెరికా అల్లాడిపోయాయి. అదే పేద దేశాలు అంత ప్రభావితం కాలేదు. కాబట్టి అసమానత అనేది కూడా ఒక చరాంకం కావొచ్చు. ఒకే సమాజంలోనే కొందరు ధనికులుగా, ఇంకొందరు పేదవాళ్లుగా ఎందుకు ఉండిపోతున్నారు? ఒకే ఇంటిలోనే ఇద్దరన్నదమ్ములు భిన్న స్థాయుల్లోకి ఎందుకు చేరుతున్నారు? ఈ మొత్తంలో మానవ ప్రయత్నానికి ఏ విలువా లేదా? అందుకే డైమండ్‌ జవాబులు మరీ సరళంగా ఉన్నాయేమో అనిపించక మానదు. కానీ మార్గదర్శులు వాళ్ల జీవితాలను రంగరించి కొన్ని సమాధానాలు చెబుతారు. వాటి వెలుగులో సమాజం మరిన్ని జవాబులు వెతకాల్సి ఉంటుంది. ఎందుకంటే మానవ సమాజం అనేది మానవ స్వభావం అంత సంక్లిష్టమైనది.
 
(19th September 2022)