Monday, October 10, 2022

గన్స్, జెర్మ్స్‌ అండ్‌ స్టీల్‌: అసమాన ప్రశ్నలు

 


అసమాన ప్రశ్నలు

ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? ఈ అసమానతలకు కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఒక శాస్త్రవేత్తకు వస్తే? ఆయన చరిత్రకారుడు కూడా అయితే! జియాగ్రఫర్, ఆర్నిథాలజిస్ట్‌ లాంటి అదనపు అర్హతలు కూడా ఉంటే? ఇలాంటి ప్రశ్నలకు బహు వృత్తులు, ప్రవృత్తులు కలగలిసినవారే జవాబులు చెప్పగలరు. 

ఒకానొక సముద్రపు ఒడ్డు నడకలో అమెరికన్‌ రచయిత జేరెడ్‌ డైమండ్‌(జ.1937)ను ఒక నల్లజాతి యువకుడు, పాపువా న్యూ గినియా దీవులకు చెందిన ‘యాలి’ ఇలా నిలదీశాడు: ‘మీ తెల్లవాళ్ల దగ్గర అంత ‘కార్గో’(వస్తు సామగ్రి) ఉన్నప్పుడు, మా దగ్గర అది ఎందుకు లేదు?’ ఈ అన్వేషణలో భాగంగా ఏళ్లపాటు చేసిన పరిశోధనతో జేరెడ్‌ డైమండ్‌ రాసిన పుస్తకం ‘గన్స్, జెర్మ్స్‌ అండ్‌ స్టీల్‌: ద ఫేట్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ సొసైటీస్‌’. శీర్షికలోనే సమాధానాలను నిలుపుకున్న ఈ పుస్తకం సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం 1997లో వచ్చింది. ఆ తర్వాత దీని ఆధారంగానే ఇదే పేరుతో ‘ఎన్జీసీ’ ఛానల్‌ డైమండ్‌ హోస్ట్‌గా మూడు భాగాల డాక్యుమెంటరీ కూడా నిర్మించింది.

సులభంగా కనబడే ఈ ప్రశ్నలకు జవాబులు అంత సులభంగా దొరకవు. వీటికి సమాధానాలు కూడా వర్తమానమో, సమీప గతమో చెప్పలేదు. అందుకే చరిత్ర, పూర్వ చరిత్ర యుగంలోకి డైమండ్‌ మనల్ని తీసుకెళ్తారు. మనుషులందరూ ఆహార సేకరణ దశలోనే ఉన్న తరుణంలో పదమూడు వేల ఏళ్ల క్రితం ‘మధ్య ప్రాచ్యం’లో మొదటిసారి వ్యవసాయం మొదలైంది. బార్లీ, గోధుమ పండించారు. ఎప్పుడైతే మిగులు పంట సాధ్యమైందో అక్కడ మనుషుల వ్యాపకాలు ఇతరాల వైపు మళ్లాయి. అలా మానవాళి మొదటి నాగరికత నిర్మాణం జరిగింది. చిత్రంగా పాపువా న్యూ గినియాలో ఇప్పటికీ వ్యవసాయం మొదలుకాలేదు. దానికి కారణం, అక్కడివాళ్లు తెలివైనవాళ్లు కాదనా? ఏ చెట్టు ఏమిటో, ఏ పుట్టలో ఏముందో చెప్పగలిగేవాళ్లు; ఎంతదూరమైనా బాణాన్ని గురిచూసి కొట్టేవాళ్లు తెలివైనవాళ్లు కాకపోవడం ఏమిటి? ఏ పంటలైతే మధ్య ప్రాచ్యంలో నాగరికతకు కారణమయ్యాయో, అవి ఇక్కడ పెరగవు. ఆ భౌగోళిక పరిమితి వల్ల వాళ్లు ఇంకా ఆహార అన్వేషణ దశలోనే ఉన్నారు. అందుకే మనుషులను ‘అసమానంగా’ ఉంచుతున్న కీలక కారణం భౌగోళికత అంటారు డైమండ్‌. 

‘ఫెర్టయిల్‌ క్రెసెంట్‌’(సారవంతమైన చంద్రవంక)గా పిలిచే ఈ యురేసియా ప్రాంతంలోనే జంతువులను మచ్చిక చేసుకోవడం కూడా జరిగింది. ఇవి గొప్ప అదనపు సంపదగా పనికొచ్చాయి. ఆవు, ఎద్దు, గొర్రె, మేక, గుర్రం, గాడిద, పంది లాంటి పద్నాలుగు పెంపుడు జంతువుల్లో ఒక్క లామా(పొట్టి ఒంటె; దక్షిణ అమెరికా) తప్ప పదమూడు ఈ ప్రాంతం నుంచే రావడం భౌగోళిక అనుకూలతకు నిదర్శనంగా చూపుతారు డైమండ్‌. మనుషుల విస్తరణ కూడా సరిగ్గా ఆ భౌగోళిక రేఖ వెంబడి, అంటే ఏ ప్రాంతాలు వీటికి అనుకూలంగా ఉన్నాయో వాటివెంటే జరిగింది.
మరి ఒకప్పుడు మొదటి నాగరికత వర్ధిల్లిన మధ్య ప్రాచ్యం ఇప్పుడు ప్రపంచంలోనే సంపన్న ప్రాంతంగా ఎందుకు లేదు? భౌగోళికత ఒక కారణం అవుతూనే, దాన్ని మించినవి కూడా ఇందులో పాత్ర పోషిస్తున్నాయన్నది డైమండ్‌ సిద్ధాంతం. అయితే భౌగోళికత ప్రతికూలంగా కూడా పరిణమించవచ్చు. కరువు కాటకాలు ఓ దశలో మధ్య ప్రాచ్యాన్ని తుడిచిపెట్టాయి కూడా. 

వారికి తెలియకుండానే ఐరోపావాసుల పక్షాన పనిచేసినవి సూక్ష్మ క్రిములని చెబుతారు డైమండ్‌. ఇతర ప్రాంతాలకు విస్తరించే క్రమంలో జరిగిన పోరాటాల్లో, ఆ పోరాటాల కంటే ఎక్కువగా వీరి నుంచి వ్యాపించిన సూక్ష్మక్రిముల వల్ల ‘మూలజాతులు’ నశించాయి. దానిక్కారణం, వేల సంవత్సరాల జంతువుల మచ్చిక వల్ల వాటి నుంచి వచ్చే సూక్ష్మక్రిముల నుంచి వీరికి నిరోధకత ఏర్పడింది. కానీ అలాంటి సంపర్కం లేని అమెరికన్‌ జాతులు దాదాపు తొంభై ఐదు శాతం నశించిపోయాయి. ముఖ్యంగా ‘స్మాల్‌పాక్స్‌’(మశూచి) కోట్లాది మంది ప్రాణాలు తీసింది.

ఇంక ఎప్పుడైతే ఉక్కు వాడకంలోకి వచ్చిందో, ఆ ఉక్కుతో ముడిపడిన తుపాకులు రావడం ప్రపంచ గతినే మార్చేసింది. ఆ తుపాకుల వల్లే యూరప్‌ దేశాలు ప్రపంచాన్ని తమ కాలనీలుగా మార్చుకోగలిగాయి. ముఖ్యంగా ఆఫ్రికాలోని ప్రాచీన నాగరిక సమాజాలు, అవెంతటి ఘన సంస్కృతి కలిగినవి అయినప్పటికీ తుపాకుల ముందు నిలవలేకపోయాయి. అక్కడినుంచి ఎంతో అమూల్యమైన సంపద తరలిపోయింది.

మరి ఐరోపావాసులకు ప్రతికూలతలుగా పరిణమించినవి ఏవీ లేవా? ఏ భౌగోళిక రేఖ వెంబడి ప్రయాణిస్తూ వారికి అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండే ‘కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌’(దక్షిణాఫ్రికా)లో మనగలిగారో, దాన్ని దాటి ఆఫ్రికాలోని ఉష్ణ మండలం వైపు విస్తరించినప్పుడు కేవలం మలేరియాతో కోట్లాదిమంది చచ్చిపోయారు.

ప్రపంచం స్థిరంగా ఆగిపోయేది కాదు. ప్రస్తుత భౌతిక ప్రమాణాల రీత్యా ప్రపంచంలో అసమానతలు స్పష్టంగా కనబడుతుండవచ్చు. కానీ మొన్న కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఐరోపా, అమెరికా అల్లాడిపోయాయి. అదే పేద దేశాలు అంత ప్రభావితం కాలేదు. కాబట్టి అసమానత అనేది కూడా ఒక చరాంకం కావొచ్చు. ఒకే సమాజంలోనే కొందరు ధనికులుగా, ఇంకొందరు పేదవాళ్లుగా ఎందుకు ఉండిపోతున్నారు? ఒకే ఇంటిలోనే ఇద్దరన్నదమ్ములు భిన్న స్థాయుల్లోకి ఎందుకు చేరుతున్నారు? ఈ మొత్తంలో మానవ ప్రయత్నానికి ఏ విలువా లేదా? అందుకే డైమండ్‌ జవాబులు మరీ సరళంగా ఉన్నాయేమో అనిపించక మానదు. కానీ మార్గదర్శులు వాళ్ల జీవితాలను రంగరించి కొన్ని సమాధానాలు చెబుతారు. వాటి వెలుగులో సమాజం మరిన్ని జవాబులు వెతకాల్సి ఉంటుంది. ఎందుకంటే మానవ సమాజం అనేది మానవ స్వభావం అంత సంక్లిష్టమైనది.
 
(19th September 2022)


No comments:

Post a Comment