అలవాటైన గొంతు
నాకు సంగీతజ్ఞానం ఏమీ లేదు. అందరిలాగే నేను ఊరికే పాటలు వినేవాడిని అంతే. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా ఏం చెప్తాను, ఏం అభిప్రాయం ఉంది నాకు?
ఈ బాలసుబ్రహ్మణ్యం, చిరంజీవి లాంటి వాళ్లు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మన జీవితంలోకి వచ్చేశారో కూడా తెలియదు. మన అంటే 70, 80ల్లో జీవితాలు ప్రారంభించిన వాళ్ళని నా ఉద్దేశం. కొద్దిగా సినిమా అనే ఊహ తెలిసేనాటికే వాళ్ళు వాస్తవమై ఉన్నారక్కడ. చిరంజీవిని ఎందుకు కలిపి చెప్తున్నానంటే, నేను చిన్నప్పుడు ప్రతి సినిమాలోనూ చిరంజీవే ఉంటాడు అనుకునేవాణ్ణి. అట్లనే ప్రతి పాట బాలసుబ్రమణ్యం పాడతాడు అంతే. ఆ పేరు తెలుసు అని కూడా కాదు, ఆ గొంతు తెలుసు. కాబట్టి వీళ్లు మనకు నచ్చడం, నచ్చకపోవడం అనే అవకాశమే లేదు. మనం ఎంపిక చేసుకోలేదు. సినిమా అనే మహత్తరమైన శక్తి మన కోసం ఎంపిక చేసి ఉంచిన గొంతు బాలసుబ్రమణ్యం. అది ఎంతగా అలవాటైపోయింది అంటే, ఆ గొంతు ఒక స్టాండర్డ్. ఒక ప్రమాణం. అట్ల లేనిది ఇంకా గొంతు కాదు అనిపించేది. అబ్బా, ఈ బాలసుబ్రమణ్యం లేకపోతే ఈ పాటలన్నీ ఏమైపోయేవి అనిపించేది.
నాకు ఒకటి బాగా గుర్తుంది. జేసుదాసు గొంతు మొదటిసారి విన్నప్పుడు– అది ఆస్తులు అంతస్తులో ఎర్రమందారమో– ఇదేంట్రా ఇట్లా ఉంది గొంతు అనుకున్నాను. నిజానికి అదొక అమృతధార అని తర్వాత, చాలా తర్వాత ఎప్పుడో తెలుసుకోగలిగాను. ఘంటసాలది కూడా అట్లనే. మరీ పాత పాటలు నేను చాలా ఆలస్యంగా విన్నాను. బాలును విన్న చెవులతో నాకు ఘంటసాలది కూడా ఆనలేదు. అదీ బాలు! అంతగా నా చెవులు, చేతన ఆక్రమించుకున్నాడు. అట్లా ఎన్నో ఏళ్లు మునిగి తేలి, మునిగి తేలిన తర్వాత బాలసుబ్రమణ్యం కాకపోతే చాలు ఆ పాట వినసొంపు అనేంతగా యాష్ట కూడా పెట్టాడు. చెవులకి ఎప్పుడూ ఒక కొత్త శబ్దం కావాలి మనకు. కొత్తదనమే అందం. కానీ అన్ని ఏండ్లు ఒక గొంతు ఉనికిలో ఉండగలగడం మాత్రం ఆశ్చర్యమే. తొందరగా గ్రహించగలగడం, గొంతు మార్చి పాడగలగడం ఇట్లా రకరకాల కారణాలు చెపుతారు. వాటన్నింటికీ అతీతమైనది ఏదో ఆయనకు ఆ స్థానం ఇచ్చి ఉంటుంది.
నాకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే నాకు ట్యూన్ ముఖ్యం. మంచి ట్యూన్ పడినప్పుడు దానిలో ఎవరు పాడినా ఒకటే అనిపిస్తుంది. ‘నవమి నాటి వెన్నెల నీవు’ బాలు కాకుండా మనో పాడితే దాని సొంపు తగ్గుతుందా? కొన్ని మంచి సినిమాలు ఉంటాయి. అందులో అందుబాటులో ఉన్న మంచి నటుడు ఎవరు నటించినా ఒకటే. యాక్టర్ కూడా ప్లస్ కావడం అనేది అరుదుగా జరుగుతుంది. అలాగే నేను మాటలకి కూడా పెద్ద ప్రాధాన్యత ఇవ్వను. వినడానికి బాగుండాలి. కాబట్టి కేవలం సంగీతం వల్ల నాకు నచ్చిన పాటలు బోలెడున్నాయి. ఒక్కోసారి దీనికి భిన్నమైన అభిప్రాయం కూడా ఉంటుంది. ఉదాహరణకు శుభసంకల్పం సినిమాలో ‘హరిపాదాన పుట్టావంటే గంగమ్మ’ పాట మధ్య ఒక లేడీ వాయిస్ వస్తుంది. అట్లాగే కిల్లర్ సినిమాలో ‘పిలిచే కుహు కుహు వయసే’ ముందు ఒక హమ్మింగ్ లాగా ఉంటుంది. టైటానిక్ సినిమాలో లేడీ వాయిస్. ఇవి నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తూ ఉంటాయి. ఈ చిన్న చిన్న బిట్స్ చాలా ఇంపార్టెంట్ నాకు. బాలసుబ్రహ్మణ్యం ఇట్లా నాకు ఎప్పుడు అనుభూతి కలిగించాడు! ఆయన గురించి చెప్పాలంటే అంతటా ఆయనే ఉన్నాడు, ఎక్కడా దొరకడం లేదు అనే సమస్య వస్తోంది.
అయితే ‘విధాత తలపున ప్రభవించినది’ ఈ పాట విన్నప్పుడు నాకు జీవిత ఉత్సాహం పొంగుకొస్తుంది. ఎందుకో తెలీదు. అందులోని మాటలకు మించి ఆ ఆరా ఏదో నన్ను తాకింది. దానికి సిరివెన్నెలకు క్రెడిట్ ఇవ్వాలా, హరిప్రసాద్ చౌరాసియాకా, బాలసుబ్రహ్మణ్యంకా అర్థం కాదు. ఎందుకో అట్లా హృదయం గంతులేస్తుంది. అదే ‘ఆమని పాడవే హాయిగా’ అంటే నాకు నీరసం పుడుతుంది. ఈ మ్యాజిక్ ఏంటో అర్థం కాదు. అంటే మనకు తెలియకుండానే ఆ పాటకూ, నాకూ మధ్య ఏదో కుదిరింది. బాలసుబ్రహ్మణ్యంకూ, నాకూ కూడా అట్లా చాలా ఏళ్ళు చాలా చాలా సార్లు కుదిరింది.
(2020 అక్టోబర్)
(మోదుగుల రవికృష్ణ తెచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతి సంచిక కోసం పంపింది.)
బాలును విన్న చెవులతో నాకు ఘంటసాలది కూడా ఆనలేదు. అదీ బాలు
ReplyDeleteఇది మీ వెర్షన్. బాగుంది.
మా వెర్షన్ తద్విలోమం.
ఘంటసాల వారి గానామృతము గ్రోలు
కర్ణములకు హితవు కాదు సూవె
బాల సుబ్బి ఎట్లు పాటపాడిన గాని
అమృతమునకు సాటి యనగ గలదె
విధాత తలపున పాటలో సుశీలమ్మ గొంతు కూడా అమృతతుల్యం.
ReplyDeleteసిరివెన్నెల పాటలు ఇప్పటికీ నిత్యనూతనం
paaTa rachayitakE agrataamboolam ivvaali. SannivESaanni grahinci, tagina bhaavamtO, bhaashatO paaTa vraaSi praaNam pOstEnee migataavaaLLu tama sangeetantO, gaatramtO daani alankarinci alarincagalaru. saahityam pElavamgaa unTE migataavaaLLu Emee cEyalEru. naa maTuku vidhaata talapuna paaTa ghanata sirivennelagaarikE dakkaali. PaanDava udyOgavijayaala padyaala ghanata Tirupati VenkaTESvarula kavuladi kaaka marevaridi?
ReplyDelete"బాలసుబ్రమణ్యం కాకపోతే చాలు ఆ పాట వినసొంపు అనేంతగా" - ఇది
ReplyDeleteబాలసుబ్రమణ్యం అయితే చాలు ఆ పాట వినసొంపు అనేంతగా - అని సరి చెయ్యాలేమో చూడండి.
oh sorry, i get it now, you're right.
Delete