మధురాంతకం నరేంద్ర గారి మనోధర్మ పరాగం నవల మీద నా అభిప్రాయం.
-
రవి వీరెల్లి గారు కోరడంతో ‘ఆటా’(అమెరికా తెలుగు అసోసియేషన్) నవలల పోటీకి నేను కూడా ఒక న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. నా మరో ముగ్గురు సహనిర్ణేతలు సాయి బ్రహ్మానందం గొర్తి, పి.సత్యవతి, శివకుమార్ తాడికొండ గార్లు. మొదటి బహుమతిని ఏకాభిప్రాయంతో మధురాంతకం నరేంద్ర గారి ‘మనోధర్మ పరాగం’కు ఇచ్చాం. అయితే నవలను అచ్చువేసేటప్పుడు మరెవరో ముందుమాట రాయడం కాకుండా, మా నలుగురినే మా అభిప్రాయాలను క్లుప్తంగానైనా రాసిమ్మని అడిగారు నరేంద్ర. అప్పుడు నేను రాసింది ఇది:
రచయిత ‘గొంతులు’ వినేముందు
పూడూరి రాజిరెడ్డి
ఈ నవల పీడీఎఫ్ నా చేతుల్లోకి వచ్చినప్పుడు ముందు దీని టైటిల్ భయపెట్టింది. పైగా కథను చెబుతున్నది ఎవరు? స్త్రీయా, పురుషుడా, లేక కాలమా అనేది స్పష్టత లేకపోవడం మరింత ఇబ్బంది పెట్టింది. కానీ దీన్ని పక్కన పెట్టనీయని ఏదో వెలుగు మాత్రం ఉందని తెలుస్తోంది. ఒక నవలల పోటీకి వచ్చిన రచనను పక్కన పెట్టే్ట ఆప్షన్ లేకపోయినా దాన్ని రాయడంలో రచయిత ఎఫర్ట్ ఎంత ఉంది, దాన్ని ఎంత సీరియస్‌గా చదవాలి అన్నది మనకు తెలుస్తూనే ఉంటుంది. రచయిత పేరు తెలియకుండా చదివిన ఈ నవల ఎవరో ‘రాయడం బాగా తెలిసినవాడు’ రాసినది అన్నది మాత్రం అర్థం అవుతోంది. ‘డు’ అనే ఎందుకు అంటే, ఇలాంటి సబ్జెక్టు ఒక మగ రచయితే రాయగలడు. భక్తిపారవశ్యంలో తేలి వచ్చే కీర్తనల్లో కూడా అంతఃగర్భితంగా వినబడే శృంగార భావనను ఒక మగ రచయితే పట్టుకోగలడని నా నమ్మకం.
పుస్తకం ముందుకు సాగకపోవడానికి మరో కారణం, దీని ఫార్మాట్. ఒక పాత్ర వచ్చి తన గురించి చెప్పుకుంటుంది, తర్వాత మరొక పాత్ర, తర్వాత మరో పాత్ర వచ్చి స్విచ్ వేసినట్టుగా తన తలపోత వినిపిస్తుంది. ఇది ఇక ఒక తంతుగా సాగుతున్నదే అనిపించేలోగానే నవల నూరు పేజీలకు చేరుకుంది. ఆ ఇద్దరు యువతులు ఒక తిరుగుబాటు చేద్దామని ఆ ఫొటో స్టూడియోకు వెళ్లే ఘట్టం ఎప్పుడైతే వచ్చిందో– అప్పటికే ఇది ఎవరినో మనసులో పెట్టుకుని రాస్తున్నాడని అస్పష్టంగా అనిపిస్తున్నది దీంతో స్పష్టమయ్యిందో– ఇక నవల ఎత్తుకుంది. చిత్రంగా అంతకు ముందటి అభిప్రాయాన్ని మార్చేస్తూ ఈ ఫార్మాటే దీనికి సరైనది అనిపించింది. ఇక్కడ నెరేటర్ పాత్రలకు పరిచితుడు కాదు. చారిత్రక ఆధారాలపై మాత్రమే కథనం ఆధారపడినప్పుడు ఈ ఇంటర్వ్యూ తరహా దూరం తప్పదు. కానీ డీటెయిల్స్‌ను పూరించుకోవడంలో ఉన్నది రచయిత శక్తి. ప్రతి పాత్రా; తంజావూరు, మధురై, మద్రాసు, కోయంబత్తూరుల్లోని ప్రతి వీధి రచయితకు పరిచయం ఉన్నదే అనేంత దగ్గరికి వెళ్లగలిగాడు. అలాగే ఒక పాత్ర నుంచి మరో పాత్ర కథనానికి పాఠకుడిని సిద్ధం చేస్తున్న ప్రతిసారీ మధ్యలోకి నెరేటర్‌ను ప్రవేశపెట్టి, ఆ కాలపు సామాజిక రాజకీయ సాంస్కృతిక పరిణామాలను వివరించడం ఒక విరామంగానూ; ఆ పరిణామాల్లో ఈ పాత్ర ఎలా భాగంగా ఉందోనన్న అదనపు సమాచారం కోసమూ రచయిత వాడుకున్నాడు. అయితే ప్రదర్శన జరుగుతున్నప్పుడు చూడటం కాకుండా, జరిగిన అనంతరం దాని నెమరువేత శిల్పాన్ని ఎంచుకోవడం వల్ల కొన్ని సూక్ష్మ వివరాలను చెప్పడానికి అది బాగా కలిసొచ్చింది. అదే సమయంలో ఎక్కడైనా పెద్ద ఉద్వేగం వచ్చినప్పుడు అక్కడ కొంతసేపు నిలిచే అవకాశం లేకుండా పోయింది. మనకు తెలియని మనుషుల్ని అర్థం చేసుకోవడంలో, వాటి గురించిన సమాచార లభ్యతలో ఉన్న పరిమితే దానికి కారణం. కానీ ఈ ఫార్మాట్‌కు ఉన్న సానుకూలత ఏమిటంటే, మరిన్ని కొత్త ఆధారాలు బయటపడినప్పుడు మరో పాత్రని ప్రవేశపెట్టి ఆ వివరాలను కూడా రచయిత అందించగలడు. ఈ రచయిత ఎవరై ఉంటారన్న ప్రత్యేకమైన ఆసక్తి నాకు ఎప్పుడు కలిగిందంటే– వాత్సాయన కామసూత్ర చదివితే గొంతు మరింత విప్పారుతుందని అప్పుడప్పుడే ప్రసిద్ధురాలవుతున్న బ్రాహ్మణ గాయని కుంభకోణం మంగతాయారుకు ఒక పాతతరం దేవదాసీ గాయని సలహా ఇచ్చే సన్నివేశం ఎదురైనప్పుడు.
చిత్తూరు స్కంధ కుముదవల్లి, శ్రీరంగం అముదవల్లి, మధురై మోహనాంబ, తంజావూరు ధనకోటి, వేలూరు రామస్వామి పొన్న గాయత్రి– ఈ పాత్రలకు పెట్టిన పేర్లు నిండుగా నోటితో పలకాలి అనేంత బాగున్నాయి. ప్రధాన కథకు అంతగా సంబంధం లేకపోయినా వచ్చే సరళకుమారి లాంటి పాత్రలు రచయిత దృష్టి దేవదాసీ వ్యవస్థకు మాత్రమే పరిమితమై లేదనీ; మొత్తంగా భిన్న స్థాయుల్లోని స్త్రీ పురుష సంబంధాలను శృంగారంతో సహా వ్యాఖ్యానిస్తూ పరిధి విస్తరించుకున్నాడనీ అనిపించింది. పైగా 2020 సంవత్సరంలోనూ అలాంటి ‘పురుషాధిపత్య’ సమాజంలోనే ఉన్న సి.కె.నాగలక్ష్మి మునిమనవరాలిని కూడా కథనంలోకి తేవడం ద్వారా నవల రిలవెన్స్ మరింత పెరిగింది. రచయిత పూర్తి స్పృహతోనే ఇందులో ఏ ఒక్క మగ పాత్రకు గొంతు ఇవ్వలేదని కూడా నాకు అనిపించింది. నాగలక్ష్మి తమ్ముడు దండపాణిని వదిలేసి ఏ ప్రాముఖ్యతాలేని అతడి రెండో భార్య ద్వారా కథను నడపడం దీనికి నిదర్శనం. దీనివల్ల సి.కె.నాగలక్ష్మి యావజ్జీవితానికి సంబంధించిన ఎన్నో సమాధానాలను ఇవ్వగలిగే, ఎన్నో సందేహాలను తీర్చగలిగే విశ్వనాథన్ పాత్రను విస్మరించగలిగే సృజనాత్మక ఔచిత్యం ఏర్పడింది. ప్రశ్నలు రేపి, సమాధానాలు పూరించుకునేలా వదిలేయడంలోనే ఉంది రచయిత ప్రజ్ఞ.
(అక్టోబర్ 2020)
No comments:
Post a Comment