Showing posts with label పుస్తక పరిచయం. Show all posts
Showing posts with label పుస్తక పరిచయం. Show all posts

Monday, January 19, 2026

అసెంబ్లింగ్‌ ఇండియాస్‌ కాన్‌స్టిట్యూషన్‌


భారత ప్రజలమైన మేము...


పుస్తకం:
అసెంబ్లింగ్‌ ఇండియాస్‌ కాన్‌స్టిట్యూషన్‌: ఎ న్యూ డెమాక్రటిక్‌ హిస్టరీ

రచయితలు:
రోహిత్‌ డే
ఆర్నిట్‌ శని

–––––––––––––––––––––

1946 డిసెంబర్‌ 9న సరిగ్గా 11 గంటలకు న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌లో రాజ్యాంగ సభ మొదటిసారిగా సమావేశమైంది. ఈ సభలోని సుమారు 300 మంది సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికైనవారు కాదు. బ్రిటిష్‌ ఇండియా ప్రావిన్సుల్లోని శాసనసభలు ఎంపిక చేసినవారు. మూడేళ్లలో 5,546 పేజీల చర్చలు జరిపి, ఈ రాజ్యాంగ సభ 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు ఈ మొత్తానికైన ఖర్చు రూ.47 లక్షలు. అయితే ఈ రాజ్యాంగ సభకు వెలుపల రాజ్యాంగం కోసం పడిన భిన్న ఆరాటాలను వివరించే పుస్తకం: ‘అసెంబ్లింగ్‌ ఇండియాస్‌ కాన్‌స్టిట్యూషన్‌’. ఈ 400 పేజీల పుస్తకం ఒకప్పుడు దేశాన్ని పట్టిన రాజ్యాంగ జ్వరాన్ని కళ్లకు కడుతుంది.

రాజ్యాంగ ప్రక్రియలో కేవలం మేధావులు మాత్రమే పాల్గొనలేదనీ, ఇంకా ‘ఇండియా’గా రూపుదిద్దుకోని భారత నేల నలుమూలలలో ఉన్న సకల జనాలు చురుగ్గా పాలుపంచుకున్నారనీ చెబుతారు రచయితలు. స్వతంత్ర భారతంలో తమకు ఏం కావాలో, తాము ఎలాంటి పాలన కోరుకుంటున్నారో బలూచిస్తాన్‌ నుంచి బెజవాడ వరకు వేలాది మంది పౌరులుగా, సంఘాలుగా, తెగలుగా, పార్టీలుగా, అధికార ప్రతినిధులుగా, ట్రేడ్‌ యూనియన్లుగా తమ సంతకాలతో, వేలిముద్రలతో పంపిన అభ్యర్థనలను, అభిప్రాయాలను తవ్వితీసి, ఈ ఉత్సాహపూరిత ప్రజాకోణాన్ని అంతే ఆసక్తికరంగా వెల్లడించారు రచయితలు. ఉదాహరణకు గౌహతి నుంచి నలిన్‌కాంత బర్కాకటి పంపిన చిన్న కాగితం రాజ్యాంగ సభ సచివాలయానికి 1947 జనవరి 8న అందింది. ‘రాజ్యాంగ విషయాల్లో తన అజ్ఞానాన్ని మన్నించమంటూనే’, ఏ శాసనసభ్యుడినైనా ఎప్పుడైనా ‘రీకాల్‌’ చేసే హక్కు ఓటర్లకు ఉండాలని అతడు రాశాడు. అంటరానితనాన్ని నిర్మూలించకుండా సమైక్య భారతదేశం సాధ్యం కాదని వజీరిస్తాన్‌లోని బన్నూ నుంచి ప్రజా ప్రతినిధి కోటూ రామ్‌ కోరాడు. మహిళలకు సమాన హక్కులు; మరణశిక్ష రద్దు; జైనులు, బేనె ఇజ్రాయెలీ యూదులతో సహా మైనారిటీల హక్కులు; నగర బాలురతో సమానంగా గ్రామీణ పిల్లల హక్కుల లాంటివే కాదు, ‘చెవిటి మూగ’ వారికి ప్రత్యేక గ్యారంటీలు, విశ్వకర్మలకు ఫీజుల్లో రాయితీలు కోరుతూ కూడా లేఖలు అందాయి. విచిత్రంగా తమ లేఖల ద్వారా రాజ్యాంగ సభకు జనమే చట్టబద్ధత కల్పించారంటారు రచయితలు.

‘ఆచరణాత్మక’ కారణాల వల్ల, తొలుత రాజ్యాంగ చర్చలను రహస్యంగానే ఉంచదలిచిన పెద్దలు ఈ ప్రజాబాహుళ్యపు ఒత్తిడితో రాజ్యాంగం ఏ రూపం తీసుకుంటుందో బహిరంగపరచదలిచారు. 1948 ఫిబ్రవరి 26న ప్రచురించిన డ్రాఫ్ట్‌ కాన్‌స్టిట్యూషన్‌(ఆంగ్లం) బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. వెల: ఒక్క రూపాయి. ఇది చెల్లించలేనివాళ్లు అణాతో 24 పేజీల సారాంశం చదువుకోవచ్చు. వారంలోనే దీన్ని దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించడానికి అనుమతులు కోరుతూ లేఖలు రాసాగాయి. కె.జి.చౌబాల్‌ అనే మరాఠీ జర్నలిస్టు ‘మాతృదేశ సేవ’ కోసం తన సేవలను వాడుకోవాలని రాశాడు. రేడియోలోనే కాదు, గుళ్లు, మసీదులు, చర్చులు, ట్రేడ్‌ యూనియన్లు, శరణార్థి శిబిరాలు కూడా రాజ్యాంగాన్ని చర్చించడానికి వేదికలయ్యాయి.

ఈ పుస్తకం వెల్లడించే మరో కోణం, ‘ఇండియన్‌ యూనియన్‌’కు సమాంతరంగా, అప్పటికి స్వతంత్రంగానే ఉండదలిచిన సంస్థానాల్లో కూడా రాజ్యాంగ రచన ఎలా జరిగిందో వివరించడం. సంస్థానాలకు రాజ్యాంగ సభ 93 ప్రాతినిధ్య స్థానాలను ఇచ్చినప్పటికీ, తమను తాము ప్రజాస్వామీకరించుకోవడంలో భాగంగా అవి ఈ ప్రక్రియ చేపట్టాయి. రాంపూర్‌ పాలకుడు తన ప్రజలకు భావస్వేచ్ఛతో సహా తొమ్మిది ప్రాథమిక హక్కులను ప్రసాదించాడు. రత్‌లామ్‌ రాజ్యాంగం ఉచిత ప్రాథమిక విద్యను రాజ్య బాధ్యతగా పేర్కొంది. మణిపుర్‌ రాజ్యాంగం భారత రాజ్యాంగానికన్నా మూడేళ్ల ముందే అందరికీ ఓటుహక్కును కల్పించింది. ‘మేము ఇప్పటివరకు తమ సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకున్న 75 సంస్థానాలను గుర్తించాం’ అంటారు రచయితలు.

ఇంకా న్యాయమూర్తులు ఎలా ఇందులో భాగమయ్యారు; ట్రూమన్‌తో సహా అమెరికా, యూకే, ఐర్లాండ్, కెనడా నాయకులు, న్యాయనిపుణుల ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం ద్వారా రాజ్యాంగపు ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ రూపొందించిన సర్‌ బి.ఎన్‌.రావు ఇండియా రాజ్యాంగాన్ని ‘ప్రపంచ వేదిక’కు ఎలా పరిచయం చేశారు; ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులు తమ హక్కుల కోసం ఎలా నిలబడ్డారు లాంటి అంశాలను విపులంగా చర్చించిన ఈ పుస్తకం రాజ్యాంగపు బహుముఖ పార్శా్వలను తెలుసుకోగోరేవారికి ఆసక్తి కలిగిస్తుంది. కోట్ల మంది ఆశలను ఒక దగ్గర గుదిగుచ్చడం ఎంత దుర్భరమో, అబ్బురమో కూడా అర్థమవుతుంది. తర్వాత జరిగిన ఎన్నో రాజ్యాంగ సవరణలు కూడా ఈ ప్రజా చైతన్యపు కొనసాగింపే.

– ఎడిటోరియల్‌ టీమ్‌

(6 జనవరి 2025)
 

Wednesday, December 17, 2025

మరపురాని ప్రయాణ కథల సంకలనం



‘ప్రయాణంలో మొదలై ప్రయాణంలో ముగిసే’ నియమంతో ఎంపిక చేసిన కథల సంకలనం ‘మరపురాని ప్రయాణ కథలు’. ఖదీర్‌బాబు గారు తెచ్చిన ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కథకుల్లో ఒకరైన మధురాంతకం రాజారాం గారి కథతో పాటు నా కథా ఉండటం సంతోషం. ఈ ఇరవై కథల సంకలన ప్రచురణ: ఆన్వీక్షికి.

Sunday, November 30, 2025

స్వామినాథన్‌ జీవిత చరిత్ర


 

ఎం.ఎస్‌.స్వామినాథన్‌:

ద మ్యాన్‌ హూ ఫెడ్‌ ఇండియా
(జీవిత చరిత్ర)
––––
రచన:
ప్రియంవద జయకుమార్‌



గొప్ప శాస్త్రవేత్త... చక్కటి వ్యవహర్త


ఉన్నత విద్యావంతులున్న ఉమ్మడి వ్యవసాయ కుటుంబంలో మోన్‌కోంబు సాంబశివన్‌ స్వామినాథన్‌ జన్మించారు(తమిళనాడు, 1925). తండ్రి బాటలో మెడిసిన్‌ చదివి కుంభకోణంలోని వాళ్ల హాస్పిటల్‌ను నడిపే అవకాశం; ఐపీఎస్‌కు ఎంపికైనందున అటు వైపుగానూ కెరీర్‌ మలుచుకునే వీలు ఆయనకు ఉండినాయి. కానీ లక్షల మంది చావులకు కారణమైన బెంగాల్‌ క్షామం(1943) వేసిన ముద్ర ఆయన్ని వ్యవసాయం వైపు నడిపించింది. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా ఆయన చేసిన కృషిని చెప్పే పుస్తకం ‘ఎం.ఎస్‌.స్వామినాథన్‌: ద మ్యాన్‌ హూ ఫెడ్‌ ఇండియా’. ఇది ఆయన మేనకోడలు రాసిన ఆయన జీవిత కథ.

స్వాతంత్య్రానంతర భారతదేశం దశాబ్దాల పాటు ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య... తిండి గింజల కరువు. ‘ఏదైనా ఆగుతుంది కానీ వ్యవసాయం ఆగదు’ అన్నారు నెహ్రూ. సోమవారాలు పస్తులుండమని జనానికి పిలుపునిచ్చారు లాల్‌ బహదూర్‌ శాస్త్రి. ‘బ్లడీ అమెరికన్ల’ ముందు చేయి చాచకుండా ఉండే మార్గాల కోసం వెతికారు ఇందిరా గాంధీ. ఒక దశలో ‘పీఎల్‌ 480’ పథకం కింద అమెరికా పంపే గోధుమలే దిక్కు. ఓడలు దిగితేగానీ నోళ్లు ఆడని పరిస్థితి. ఈ దిగుమతులకు చెల్లించాల్సిన మూల్యం విదేశాంగ విధానంలో స్వతంత్రంగా నిలబడలేకపోవడం. అలాంటి స్థితిగతుల్లో ‘ఆకలి నుంచి స్వేచ్ఛే అన్నింటికన్నా గొప్ప స్వేచ్ఛ’ అన్నట్టుగా, స్వామినాథన్‌ దేశంలో హరిత విప్లవానికి బాటలు పరిచారు. ‘చరిత్ర ఆయనకు అవకాశం ఇచ్చింది, దాన్ని ఆయన రెండు చేతులా అందుకున్నారు’ అంటారు రచయిత్రి.

గాలికి పడిపోకుండా నిలబడే పొట్టి రకం గోధుమల మీద గామా కిరణాలతో ‘ఐండియన్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో స్వామినాథన్‌ ప్రయోగాలు చేశారు. దానికోసం ‘ఆటమిక్‌ ఎనర్జీ కమిషన్‌’ సాయంతో ‘గామా గార్డెన్‌’ ఏర్పాటుచేశారు. వ్యవసాయం కోసం అన్ని రంగాలు సహకరించుకోవాలంటారాయన. ఈ దశలోనే పొట్టి రకం హైబ్రిడ్‌ గోధుమలను మెక్సికోలో నార్మన్‌ బోర్లాగ్‌ విజయవంతంగా పరీక్షించారని తెలిసి, స్వామినాథన్‌ ఆయనకు ఉత్తరం రాశారు(1963). దానివల్ల పదేళ్ల కాలం కలిసొస్తుందనేది ఆయన ఆలోచన. ఇక వంద కేజీల చొప్పున వచ్చిన ఆ నాలుగు రకాల విత్తనాలను ఇక్కడి నేలలకు అనుగుణంగా కల్యాణ్‌ సోనా, సోనాలిక లాంటి విత్తనాలుగా మార్చి, వ్యవస్థలోని అన్ని అడ్డంకులను అధిగమించి, రైతుల అనుమానాలను తీర్చి, దిగుబడుల ‘చమత్కారాన్ని’ చూపించి, ఇండియా వచ్చిన నార్మన్‌ బోర్లాగ్‌నే ఆశ్చర్యపరిచేలా చేశారు స్వామినాథన్‌. నాలుగు హెక్టార్లతో మొదలైన ప్రయోగం, 1968 నాటికి పది లక్షల హెక్టార్లకు విస్తరించింది. ఈ మధ్యలోనే విక్రమ్‌ సారాభాయి సహకారంతో రైతుల కోసం దూరదర్శన్‌లో ‘కృషి దర్శన్‌’ మొదలైంది(1967). సైన్సు శక్తి, విధాన నిర్ణయం, రైతుల ఉత్సాహం– ఈ మూడూ కలగలిసి ‘యూఎస్‌ఎయిడ్‌’కు చెందిన విలియమ్‌ గాడ్‌ నోటి నుంచి తొలిసారిగా వెలువడిన మాట ‘గ్రీన్‌ రివొల్యూషన్‌’ అనేది విజయవంతమైంది. అయితే, దాని ప్రతికూల ప్రభావాలు కూడా ఎంఎస్‌కు తెలుసు. అందుకే ‘ఎవర్‌గ్రీన్‌ రివొల్యూషన్‌’ కావాలని కాంక్షించారు.

1981లో ఫిలిప్పైన్స్‌లోని ‘ఇంటర్నేషనల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ డైరెక్టర్‌ జనరల్‌ పదవి ఆయన్ని వరించింది. ఆ స్థానంలోకి వెళ్లిన మొదటి ఆసియన్‌ ఆయన. ఐఆర్‌64 లాంటి పాపులర్‌ వరి రకం ఈ కాలంలోనే వచ్చింది. ప్రణాళికా సంఘం, వ్యవసాయ మంత్రిత్వ శాఖల్లోనూ పనిచేసిన స్వామినాథన్‌ పాత్ర ఇండియాకే పరిమితం కాలేదు. చైనా, పాకిస్తాన్, ఇండోనేషియా, మయన్మార్, ఈజిప్ట్, మడగాస్కర్, థాయిలాండ్, బంగ్లాదేశ్, టాంజానియా, ఇథియోపియా లాంటి ఎన్నో దేశాల్లో వరి పరిశోధనా కేంద్రాలు ఏర్పాటయ్యేలా సహకరించారు. టైమ్‌ మ్యాగజైన్‌ ప్రచురించిన అత్యంత ప్రభావశీల ఆసియన్ల జాబితాలోని ముగ్గురు భారతీయుల్లో స్వామినాథన్‌ ఒకరు (మిగిలిన ఇద్దరు: గాంధీజీ, టాగూర్‌). ‘పది జీవితాల్లో కూడా సాధించలేనిది ఆయన ఒక్క జీవితంలో సాధించారు’ అంటారు రచయిత్రి. ముగ్గురు కూతుళ్ల తండ్రిగా, స్వతంత్ర భావాలున్న భార్య మీనా భర్తగా ఆయన కుటుంబ విశేషాలు, ఆయన పదవిలో ఉన్నప్పుడు జరిగిన సంగతులను మేళవిస్తూ పది అధ్యాయాలుగా రాసిన పుస్తకమిది. గాంధేయవాదిగా, పర్యావరణవేత్తగా, వ్యవసాయంలో స్త్రీల పాత్ర తెలిసినవాడిగా ఆయనలోని బహుకోణాలు తెలుస్తాయి. ఫిలిప్పైన్స్‌ వదిలివచ్చేటప్పుడు టగలాంగ్‌లో వీడ్కోలు ఉపన్యాసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు మీనా. రైతుల కోసం నియమించిన జాతీయ కమిషన్‌(స్వామినాథన్‌ కమిషన్‌గా పేరుపడింది)తో సహా కొన్ని పదుల కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరించి; రామన్‌ మెగసెసే, వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్, భారతరత్న లాంటి ఎన్నో గౌరవాలు పొందిన ఎంఎస్‌ తన జీవితంతోనే ఆశ్చర్యపరిచారు.

(3-11-2025)
 

Monday, November 24, 2025

అసంపూర్ణ న్యాయమేనా?


 

అసంపూర్ణ న్యాయమేనా?


(ఇన్‌)కంప్లీట్‌ జస్టిస్‌?: ద సుప్రీం కోర్ట్‌ ఎట్‌ 75–– క్రిటికల్‌ రిఫ్లెక్షన్స్‌

సంపాదకుడు:
జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌


రాజ్యాంగ అవతరణ జరిగిన రెండు రోజులకు, అంటే 1950 జనవరి 28న భారత అత్యున్నత న్యాయస్థానం తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ 75 ఏళ్లలో ఎనిమిది మంది న్యాయమూర్తుల నుంచి 34 మంది న్యాయమూర్తులకు అది విస్తరించింది. భారతీయ న్యాయవ్యవస్థ పిరమిడ్‌ పైభాగాన ఉండే సుప్రీం కోర్టును ఢిల్లీలోని ఒక భవన సముదాయంగా పరిగణిస్తే– కోర్టు రూములు, వందలాది మంది కూర్చోగలిగే న్యాయవాదుల భిన్న ఛాంబర్లతో అది కళకళలాడుతుంటుంది. అక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాదుల సంఖ్య 22,734. మరో 3,500 మంది ‘అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌’. స్టెనోగ్రాఫర్స్, రిజిస్ట్రార్స్, డ్రైవర్స్, ప్యూన్స్‌ లాంటి ఇతర సిబ్బంది 3,770. ఇక 2025 మే 31 నాటికి పెండింగ్‌ కేసులు 81,735. ప్రజాస్వామ్యానికి మూడో స్తంభంగా పరిగణించే న్యాయవ్యవస్థ ఈ 75 ఏళ్లలో ఎలాంటి ఎత్తుపల్లాలను చూసిందో లోతుగా చర్చించే పుస్తకం ‘(ఇన్‌)కంప్లీట్‌ జస్టిస్‌?’ శీర్షికే ఇది సంపూర్ణ న్యాయం చేకూర్చలేకపోయిందన్న భావన కలిగిస్తుంది. దాన్నే 24 మంది న్యాయనిష్ణాతులు తమ వ్యాసాలు, ఎడిటర్‌ స్వయంగా చేసిన ఇంటర్వ్యూల రూపంలో అభిప్రాయాలను పంచుకున్నారు.

‘అందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా మా స్థానిక హవల్దార్‌కు ఉన్నంత శక్తి లేదు’ అని 1992 నాటి కుమ్హేర్‌ ఊచకోత నుంచి బతికి బయటపడ్డ రాజస్థాన్‌కు చెందిన ‘చున్నీ లాల్‌ జాతవ్‌’ చెప్పిన మాటల్ని సీనియర్‌ జర్నలిస్ట్‌ పి.సాయినాథ్‌ ఉటంకిస్తారు. గ్రామాల్లోని అంచుల్లో ఉండేవాళ్లకు కోర్టుల్లోని న్యాయం ఎంత దూరమో ఆయన వివరిస్తారు. రాజ్యాంగానికి ‘ఫౌండింగ్‌ డాటర్‌’నని చెప్పుకొనే న్యాయవాది ఇందిరా జైసింగ్‌... సుప్రీంకోర్టులో, మొత్తంగా న్యాయస్థానాల్లో ఉండే లింగ వివక్షను, లైంగిక హింసను ఎత్తిచూపుతారు. కార్మిక చట్టాల కేసులతో పాటు, ప్రత్యేకంగా పురుష న్యాయమూర్తుల బాధితులుగా ఉన్న మహిళా న్యాయమూర్తుల కేసుల్ని వాదించిన జైసింగ్‌ ‘అది న్యాయవ్యవస్థ డర్టీ సీక్రెట్‌’ అంటారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని మరో కోర్టుకు బదిలీ చేయడం అర్థరహిత చర్య, అది ఇంకో కోర్టుకు చేస్తున్న అన్యాయం అంటారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ లోకూర్‌. కొలీజియం పేరిట న్యాయమూర్తుల ఎంపికలో కార్యనిర్వాహక వ్యవస్థను మొత్తంగా పక్కనపెడితే, దాని ఆధిక్యాన్ని చాటుకోవడానికి కార్యనిర్వాహక వ్యవస్థ పలు దారులు వెతుకుతుందంటారు లా కమిషన్‌ మాజీ చైర్మన్‌ అజిత్‌ ప్రకాశ్‌ షా.

ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ, సగటున అరవై ఏళ్ల వయసుండే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక్కోసారి రోజుకు 60–65 హియరింగ్స్‌తో వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే వాటన్నింటికి సంబంధించిన పత్రాలను ముందుగా చదివుండటం తప్ప మార్గం లేదు. ‘ప్రపంచంలో ఏ సుప్రీం కోర్టు జడ్జికి కూడా ఇంతటి పని ఒత్తిడి ఉండదు’ అంటారు సీనియర్‌ అడ్వకేట్‌ శ్రీరామ్‌ పంచు. వర్చువల్‌ హియరింగ్స్‌కు ఆన్‌లైన్‌ ఫైలింగ్స్‌ను కూడా తప్పనిసరి చేయగలిగితే సుప్రీంకోర్టు సమర్థత పెరుగుతుందనీ, కోర్టు ప్రాంగణంలో మనుషుల తొక్కిడి ఉండదనీ సలహా ఇస్తారు సీనియర్‌ అడ్వకేట్‌ మీనాక్షి అరోరా. 2023 జూలై 30 నాటికి 4,40,47,503 పెండింగ్‌ కేసులున్న జిల్లా కోర్టుల్లో 20 శాతం పోస్టులు ఖాళీగా ఉండటాన్నీ, కొన్నిచోట్ల కనీసం సరైన ప్రింటర్‌ కూడా ఉండని వైనాన్నీ వివరిస్తారు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌.రవీంద్ర భట్‌. ఇంకా రాజు రామచంద్రన్‌(జడ్జీల తొలగింపు), ఉపేంద్ర బక్షి(పిల్స్‌), కె.చంద్రు(కార్మిక చట్టాలు), ఫైజాన్‌ ముస్తాఫా(ఆర్టికల్‌ 30) లాంటివాళ్లు భిన్న అంశాలను స్పృశిస్తారు. ఎన్నో తీర్పుల ఉటంకింపులతో సాగే ఈ వ్యాసాల్ని చదవడం సామాన్య పాఠకులకు కొంత ఇబ్బందే అయినా స్పిరిట్‌ అర్థం కాకుండా పోదు.


(13-10-2025)

Friday, November 21, 2025

Shattered Lands పరిచయం


(ఈమధ్య సాక్షి ఎడిటోరియల్‌ పేజీ కోసం కొన్ని ఆంగ్ల పుస్తకాల పరిచయాలు రాస్తున్నాను. రికార్డ్‌ కోసం వాటిని ఇక్కడ ఉంచుతున్నా. అందులో ఇది మొదటిది.)
 

పుస్తక ప్రపంచం


విభజన రేఖల చరిత్ర

భారతదేశ విభజన అంటే ‘హిందుస్థాన్‌’, పాకిస్తాన్‌గా విడిపోయిన నేల గురించే అనుకుంటాం. కానీ బ్రిటిష్‌ వారి పాలనలో, అదన్‌ రేవు (యెమెన్‌) నుంచి రంగూన్‌ వరకు, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అంతా ‘ఇండియన్‌ ఎంపైరే’! అందరూ ‘ఇండియన్సే’. రూపాయే అంతటా చెల్లుబాటయ్యేది. అంతటి నేల ఐదు సార్లు ఎలా విభజితమైందో చెప్పే పుస్తకం ‘షాటర్డ్‌ ల్యాండ్స్‌’. ఢిల్లీలో పెరిగిన స్కాట్‌లాండ్‌ చరిత్రకారుడు సామ్‌ డాల్రింపుల్‌ రచయిత.

గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని నమ్మిన బర్మా (బ్రహ్మదేశ్‌) నాయకుడు యు ఒట్టామా, బ్రిటిష్‌–బర్మా ‘అధిపతి’ బా మా భారత సామ్రాజ్యంలో బర్మా అంతర్భాగమని  పోరాడారు. కానీ స్వాతంత్య్రోద్యమ సెగ నుంచి తమను కాపాడుకోవడానికి, విభజన రాజకీయాల్లో భాగంగా బ్రిటిష్‌వారు 1937లో బర్మాను విడదీశారు. ‘ఆసియా రూపురేఖలను మార్చడానికి దేవుడు పంపిన మనిషి ముందు నేను మౌనంగా నిలబడ్డాను’ అంటాడు గల్ఫ్‌కు వచ్చిన గాంధీజీని చూస్తూ యెమన్‌ రచయిత మహమ్మద్‌ అలీ లుక్‌మాన్‌. కానీ తమను ‘మెయిన్‌ ల్యాండ్‌’ అంతగా పట్టించుకోవడం లేదన్న భావన అరబ్బుల్లో ఉండేది. ‘హిందూ జాతీయవాదుల’ దృష్టిలోనేమో పవిత్ర భరతభూమి అనుకునే భౌగోళిక హద్దుల్లో అరబ్బు ప్రాంతం లేదు. 1931లో అదన్‌ రేవును, 1947లో ‘పర్షియన్‌ గల్ఫ్‌’ను విడదీయడంతో ఆ బంధమూ ముగిసింది.

ఎన్నో రిఫరెన్సులతో ఒక ఉద్విగ్న చరిత్రను కళ్లముందు నిలబెట్టే ఈ 520 పేజీల పుస్తకం అధికంగా ఒక మాటగానైనా ఉనికిలో లేని ‘పాకిస్తాన్‌’ ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులను చర్చిస్తుంది. వేల్స్, స్కాట్‌లాండ్‌ దేశాలు యూకేలో భాగమైనట్టుగానే, పాక్‌ కూడా ఇండియన్‌ యూనియన్‌లో స్వతంత్ర ప్రాంతంగా ఉండటానికి అంగీకరించిన జిన్నా తన మనసు మార్చుకోవడం, మత ద్వేషాలు కలగలిసి ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మానవతా సంక్షోభం తలెత్తింది. రాడ్‌క్లిఫ్‌ లైన్‌ అన్న ఒక్క గీతతో జాతీయతలు మారిపోయాయి. లక్షలాది మంది మరణించారు, కోట్లాదిమంది నిరాశ్రయులయ్యారు.

చదరపు కిలోమీటరు విస్తీర్ణం కలిగిన అతిచిన్న సంస్థానాల నుంచి యూరప్‌ దేశాలంతటి పెద్దవైన సుమారు ఆరు వందల సంస్థానాలే ఇప్పటి ఇండియాకు ఈ రూపునిచ్చాయనేది వాస్తవం(నాలుగో విభజన–విలీనం). ‘శరీరం లేని రెండు రెక్కలతో’ మతం పేరుతో ఏర్పడిన పాకిస్తాన్‌ నుంచి భాష కారణంగా బంగ్లాదేశ్‌ విడిపోవడంతో పుస్తకం ముగుస్తుంది(ఐదో విభజన). 1931 నుంచి 1971 వరకు జరిగిన ఐదు విభజనలు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, నేపాల్, భూటాన్,  యెమెన్, ఒమన్, యూఏఈ, ఖతార్, బహ్రయిన్, కువైట్‌ ఇప్పటి రీతిలో ఏర్పడటానికి కారణమైన పరిస్థితులను పుస్తకం లోతుగా వివరిస్తుంది. మనుషుల సూక్ష్మ వివరాలను జోడిస్తూ రాయడం వల్ల చారిత్రక నవలను చదివిన అనుభూతినిస్తుంది. ఈ ద్రవరూప సరిహద్దులు అనాదిగా ఇలాగే ఉన్నాయని నమ్మించడంలో రాజ్య ప్రయోజనాలు ఉన్నాయి; అందుకే గత ఉమ్మడి చరిత్ర పట్ల  దేశాలు మరుపును ప్రదర్శిస్తాయంటారు రచయిత. ఈ విభజనలకు బాధితులు మాత్రం ప్రజలు. ‘ఇండియన్స్‌’ తమ అవకాశాలను లాక్కుంటున్నారని బర్మాలో యు సా మొదలుపెట్టిన ప్రచారం హింసాత్మకమై లక్షలాది మంది కట్టుబట్టలతో ఆ నేలను వీడి వందల మైళ్లు నడుచుకుంటూ వచ్చారు. బెంగాలీ మహిళల మీద పాక్‌ సైన్యం జరిపిన అత్యాచారాల వల్ల 1,70,000 గర్భస్రావాలు జరగడం, 30,000 మంది ‘యుద్ధ శిశువులు’ పుట్టడం మానవత్వానికి మచ్చ. గల్ఫ్‌లోనూ జనాలు ఇబ్బందులు పడ్డారు.

కథ ఇక్కడితో ముగిసిందా? బెంగాల్‌ను ఒక దేశంగా చేయాలని సుహ్రవర్దీ పట్టుబట్టాడు. నాగాలాండ్‌ కోసం ఫిజో పోరాడాడు. ట్రావెన్‌కోర్, అండమాన్, ‘ప్రిన్సిస్థాన్‌’(సంస్థానాలన్నీ కలిపి), ‘అచ్యుతిస్థాన్‌(దళితుల కోసం) లాంటి దేశాలు కూడా ఒక దశలో ఆలోచనలుగా ఉన్నవే. కశ్మీర్, బలూచిస్తాన్, ‘రోహింగ్యా’ పోరాటాలు ఇప్పటి వాస్తవమే. కాబట్టి ఇది ఇంకా నడుస్తున్న చరిత్రే!


(8-9-2025)

 

Thursday, November 7, 2024

ఊరిలో ఒక పుస్తకావిష్కరణ

(మా ఊరి పెద్దాయన యెర్రం మోహన మురళి గారు ‘జీవన తరంగాలు’ పేరుతో తన ఆత్మకథ రాసుకున్నారు. మొన్న దసరాకు ఊరికి వెళ్లినప్పుడు జరిగిన ‘అలాయ్‌ బలాయ్‌’ కార్యక్రమంలో దీని ఆవిష్కరణ జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడింది ఇక్కడ ఇస్తున్నాను.)






ఊరి యువమిత్రుల సమక్షంలో పుస్తకావిష్కరణ. 
నాకు కుడివైపున ఉన్నది యెర్రం మెహన మురళి.
 


యెర్రం మోహన మురళి గారి
‘జీవన తరంగాలు’ మీద
పూడూరి రాజిరెడ్డి

అక్టోబర్‌ 13, 2024
నర్సింగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం


అందరికీ నమస్కారం.
నాతో పాటు వేదికను పంచుకుంటున్న మిత్రులకూ, ముందు కూర్చున్న యువమిత్రులకూ...

కరెంటు మనిషి
నాకు పాములు, కరెంట్‌ అంటే భయం. పాములతో సహవాసం తప్పకపోయినా అనివార్యం కాదు. కానీ కరెంట్‌ అట్లా కాదు. అది మనకు దాదాపుగా రెండో శ్వాస లాంటిది. శ్వాస ఆగిపోతే మనిషి ఎట్లా ఆగిపోతాడో, కరెంట్‌ ఆగిపోతే ప్రపంచం ఆగిపోతుంది. మీరు ప్రపంచాన్ని స్తంభింపజేయాలనుకుంటే ఏం చేయనక్కర్లేదు. ఒక్క కరెంట్‌ తీసేస్తే చాలు. కరెంట్‌తో ముడిపడి ఎన్ని వ్యవహారాలున్నాయంటే, మనం ఊహించలేనన్ని. మనకు కరెంట్‌ అంటే మనకు కనబడే ఏ హెల్పరో, లైన్‌మనో అంతవరకే. ఎప్పుడైనా ఫోన్‌  చేస్తే ఎవరు ఎత్తుతారో వాళ్లే. కానీ అసలు మన ఊరిదాకా ఈ లైన్‌  ఎట్లా వచ్చింది, అసలు మన దగ్గర్లో ఒక సబ్‌ స్టేషన్‌ ఎట్లా వచ్చింది, దానికి అవసరమైన ప్లానింగ్‌ ఏంటి, అసలు మొత్తం ఒక వరంగల్, కరీంనగర్‌ జిల్లాలకు ఎట్లా ప్లా¯Œ  చేశారు... ఇవన్నీ జరుగుతున్నాయంటే దాని వెనుక ఎందరో ఇంజినీర్ల కృషి ఉంది. అలాంటి విద్యుత్‌ సంస్థలో డివిజినల్‌ ఇంజినీర్‌ స్థాయిలో రిటైర్‌ అయిన యెర్రం మోహన మురళి గారు మన ఊరివాడు కావడం మనకు గర్వకారణం.

ఇంటిపేరు పంతులు కాదు!
సర్‌ కూడా వాళ్ల నాన్న పోశెట్టి పంతులును తలుచుకుంటూనే ఈ పుస్తకం మొదలుపెట్టారు. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు పోశెట్టి పంతులును చూసినుంటి. తెల్లటి బట్టలు, నల్లటి బూట్లు, అవి ఇట్లా ముందుకు వడి తిరిగి ఉండేటివి... వేసుకుని పోతుండే. పంతులోళ్లు, పంతులోళ్ల గిర్నీ అని అందరూ అంటుంటే, వాళ్ల ఇంటిపేరే పంతులు అనుకున్నా. మన ‘రామన్న’ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నప్పుడు ఎర్రం శ్రీమన్నారాయణ అని పేరొస్తే, అయితే వీళ్ల ఎర్రమోల్లా? అనుకున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక చదువు తాలూకు గౌరవం ఒక ఇంటికి ఎట్లా అంటుకుంటుందీ అని. వాళ్ల నాన్న పంతులుగా ఒక మెట్టు ఎక్కితే మోహన మురళి గారు దాన్ని అందుకుని మరిన్ని మెట్లు ఎక్కారు. మనలాంటి ఊరిలో తొట్టతొలి పెద్దస్థాయి ఉద్యోగి మోహన మురళి గారే! ఇప్పుడాయన కూతురు భవాని గారు కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మన ఊరి వరకూ ఇట్లాంటివన్నీ చాలా పెద్ద చదువులు.

నాలుగైదు విశేషాలున్నాయి:
1. మోహన మురళి గారు తన కెరీర్‌ను డిప్లొమాతో మొదలుపెట్టారు. ఉద్యోగం చేస్తూనే బీటెక్‌ చదివారు, ఎంటెక్‌ చదివారు. ఆ కొత్త పిల్లలతో పోటీ పడి టాప్‌ మార్కులు తెచ్చుకున్నారు. వాళ్లతో ఎంత కలిసిపోయిండంటే– ఈయనకు 20 ఏండ్ల సర్వీస్‌ ఉన్నంక మళ్లీ చదువుకుంటున్నారని శర్మ అని ఒకాయన బయటపెట్టేదాకా... ఏందిరా భయ్‌ అంటే ఏందిరా భయ్‌ అనుకునేదట. సీనియర్‌ అని తెలిసిన తర్వాత సార్, గారు అని మర్యాదలు మొదలయ్యాయి.
2. కెరీర్‌ అటు ఉండంగానే, సంస్కృతంలో ఎంఏ చేశారు. సంస్కృత పుస్తకాలను మూలరూపంలో చదవడానికి ప్రయత్నించారు. వాటి మీద రాసుకున్నారు. ఈ పుస్తకంలో ‘జ్ఞాన సముపార్జన పర్వం’ అని ఒక అధ్యాయం ఉంది. సర్‌కు సరిగ్గా సరిపోయే అధ్యాయం అది.
3. ఇవన్నీ ఉన్నంత మాత్రాన పుస్తకం రాయాలని ఏం లేదు. పుస్తకం రాశారు కాబట్టే, దాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నాం, దాని సందర్భంగా ఇక్కడ కలుసుకున్నాం.
4. ఆయన పుస్తకం రాసినా కూడా– ఆయనెక్కడో ఆయన స్థిరపడిన వరంగల్‌లోనే ఉండిపోయినా మనకు తెలిసేవాళ్లు కాదు. ఆయన తన మూలాలతో టచ్‌లో ఉండటానికి, తన ఊరిలో ఒక్కడిగా ఉండిపోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టే, మనం ఇక్కడ కలవగలిగాం.
5. ఇంకొక విశేషం ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఉంది. అంటే, ఆయన తన జీవితాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా బతకడానికి ప్రయత్నిస్తున్న మనిషి అని మనకు అర్థమవుతుంది.

జీవితాన్ని ప్రేమించే మనిషి
నాకు బాగా నచ్చింది, ఆయన జీవితాన్ని ప్రేమించే మనిషి అని అర్థం కావడం. ఆయన తాలూకు ఎన్నో జ్ఞాపకాలను ఈ పుస్తకంలో ఫొటోల రూపంలో పదిలంగా దాచుకున్నారు. ఆఖరికి వాళ్లమ్మాయి తాలూకు స్నేహితురాళ్లు, వాళ్ల బంధువులను కూడా.
ఆ ప్రేమ ఆయన వరకే పరిమితం కాదు... ఎలక్ట్రికల్‌ ఇంజినీర్స్‌ కాలనీ అని కడదామని దానికోసం అందరూ కలిసి 22.5 ఎకరాల భూమి శాయంపేట ప్రాంతంలో కొని, దానికి అనుమతులు సంపాదించడానికి, దానికి తుదిరూపు ఇవ్వడానికి, అందరికీ ఇక ఇల్లంటూ ఉండాలని అనుకోవడం వల్ల ఒక పద్నాలుగు, పదిహేనేళ్లు దానికోసం తండ్లాడుతూనే ఉన్నారు. సెక్రటేరియర్‌కే ఒక నలభై సార్లు వెళ్లివుంటానని రాశారు.
ఇంకోటేందంటే, ఎప్పుడో ఆయన చిట్టి డబ్బులు ఎత్తితే సరిగ్గా రాలేదని, ఎవరికీ ఆర్థిక ఇబ్బంది ఉండకూడదని దీపియా ఫ్రెండ్స్‌ అసోసియేష¯Œ  అని పెట్టుడానికి కారణమయ్యారు. ఆ పేరు కూడా నాకు బాగా నచ్చింది. దీపాన్ని గుర్తుతెచ్చేలా డిప్లొమా ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ను దీపియా చేయడం– అది 20, 30 ఏండ్లుగా ఇంకా కొనసాగుతున్నదట.

సక్సెస్‌ స్టోరీ
ఈ పుస్తకంలో వాడిన భాష, రాసిన ధోరణి సాహిత్య ప్రమాణాలకు నిలిచేది కాదని చెప్పడానికి పెద్ద కష్టపడనక్కరలేదు. కానీ ప్రతి మనిషికీ ఒక సక్సెస్‌ స్టోరీ ఉంటుందని మోహన మురళి గారి జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. సిన్సియారిటీ, హార్డ్‌ వర్క్, కుతూహలం, ఆహారంతో ప్రయోగాలు, ఒకటి వద్దనుకుంటే అట్లా వద్దన్నట్టుగానే ఉండిపోవడం... ఇట్లాంటి గుణాలెన్నో కనబడతాయి. ఇలాంటివాళ్లు మన ఊరి యువతకు ప్రేరణ కావాలి. ఎంతైనా సర్‌ కరెంట్‌ మనిషి కదా, ఆయన వెలుగు అందరిమీద ప్రసరించాలి.

ఈ పుస్తకాన్ని మన ఊరివాళ్ల మధ్య నాతో ఆవిష్కరింపచేయాలని మోహన మురళి గారు అనుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసిన ‘కేవీకేవీ’ యువమిత్రులకు అభినందనలు.  ఊరిలో ఒక సానుకూల వాతావరణం సృష్టించడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు,  దానికి జేజేలు.

 

Sunday, September 3, 2023

మెహెర్‌ను పరిచయం చేసిన పుస్తకం







నేను, అజయ్, మెహెర్‌



మెహెర్‌ను పరిచయం చేసిన పుస్తకం


మెహెర్‌ కొత్త పుస్తకం ‘పడి మునకలు’ బోధి ఫౌండేషన్‌ ద్వారా వెలువడింది. ఇంకే కామన్‌ గ్రౌండూ లేని మాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం అయ్యేలా చేసింది సాహిత్యమే. తను బ్లాగులో విరివిగా రాస్తున్న తొలి రోజుల్లో(2009) ప్రశంసించకుండా ఉండలేక ఒక కామెంట్‌ పెట్టాను. ఇది కూడా చెప్పుకోవాల్సిన విషయమా, అంటే, నేను మనుషుల పట్ల ఉదారంగా ఉంటాను గానీ, ఆ మనుషులు సాహిత్య జీవులైనప్పుడు వారిని ప్రశంసించడంలో నాకు చాలా పట్టింపులు ఉంటాయి. కాబట్టి నా ప్రశంసకు నాకు నేను చాలా విలువిచ్చుకుంటాను. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా రాయగలిగే వీలున్నప్పుడు, ఏదైనా రాసిపడేసి దాన్ని పలుచన చేయకుండా, ప్రధాన స్రవంతి పరిమితులను అధిగమించడం అనే స్పృహతో ‘ఏదైనా’ రాయగలిగే వీలును కల్పించుకున్నాడు మెహెర్‌. అలా తన రాతల్లో నేను కూడా ‘పడి మునకలు’ వేశాను. దీని సైడ్‌ ఎఫెక్ట్‌ ఏమిటంటే, అది మెహెర్‌ అంతటి రాత అయితే తప్ప ఇంకొకరిని మెచ్చుకోలేని స్థితి రావడం!

కథల కంటే ముందు మెహెర్‌ సాహిత్య వ్యాసాలే చదివాను. మెహెర్‌ను నాకు పరిచయం అయ్యేలా చేసిన తొలి వ్యాసాలు(‘దువ్వూరి స్వీయ చరిత్ర’, ‘‘కాఫ్కాయెస్క్‌’ని ఆవిష్కరించే ఒక వాక్యం’ లాంటివి) కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. తర్వాత కూడా రాసిన వ్యాసాలను కలుపుకొని(చివరివి 2022లో రాసినవి), వాటిల్లోంచి కొన్నింటిని వడగట్టుకుని, పద్ధతిగా కూర్చిన ఈ 200 పేజీల పుస్తకం వచ్చింది. ‘ఇంకేమనాలో తెలీక’ వీటిని వ్యాసాలు అనడమేగానీ– ఇవన్నీ ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రతిఫలనాలు, రీడింగ్‌ నోట్స్‌... పేరేదైనా ఇవన్నీ మెహెర్‌ సాహిత్య అవగాహనా విస్తృతిని తెలియజేస్తాయి. ఏ సీరియస్‌ సాహిత్య జీవి అయినా చదవాల్సిన పుస్తకం ఇది.

పీఎస్‌:
ఇవన్నీ నేను ఇంతకుముందు విడిగా చదివినవే. అయినా మళ్లీ మొదలుపెట్టాను. ‘పేదజనంలో దొస్తొయేవ్‌స్కీ కూడా ఒకడు’ వ్యాసంలో, ‘‘గదిలోకి అడుగుపెట్టగానే, ‘నాకు చప్పున రస్కోల్నికోవ్‌ ఉండే గది గుర్తొచ్చింది– అని తర్వాత రాసుకుంది’’ అని అనంతర కాలంలో భార్య అయి, దొస్తొయేవ్‌స్కీని అన్ని విధాలుగా కాచుకున్న అన్నా గ్రొగొర్‌యెవ్నాను ఉటంకించాడు మెహెర్‌. నాకెందుకో కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

(fb Post: 30th August 2023)

Tuesday, July 18, 2023

నా సాహిత్య సహచరులు

అంతకుముందు కూడా మానస (Manasa Chamarthiతెలుసు, రవి వీరెల్లీ (Ravinder Verellyతెలుసు. కానీ మనుషుల నిజ విలువల్ని అంచనా వేయడంలో నేను మొద్దబ్బాయినే. నాకు నచ్చేది నాకు నచ్చుతోందని గుర్తు పట్టడానికి కూడా టైమ్‌ తీసుకుంటాను. కానీ ఏదో ఒక రోజున వాళ్ల ఉనికిల తాలూకు అసలైన సాక్షాత్కారం కలుగుతుంది. ఇక నేను వారిని మనసారా స్వీకరించకుండా ఉండలేను. అలాంటిది నాకు రవి కవిత్వ సంపుటి ‘కుందాపన’ మీద ‘ఈమాట’లో మానస రాసిన ‘ఐదు కవితలు’ పరిచయ వ్యాసం (డిసెంబర్‌ 2017) చదివాక కలిగింది. ముఖ్యంగా అందులోని ‘చిన్నోడి అమ్మ’ కవిత చదివాక. దీనివల్ల ఏకకాలంలో మానస ఒక చక్కని విమర్శకురాలిగా, రవి ఒక నిక్కమైన కవిగా కనబడ్డారు. అప్పట్నుంచీ రవిని తలుచుకుంటే నాకు సీతాకోక రెక్కలు గుర్తొస్తాయి. అతడిది ‘కోమల దుఃఖం’. ఇంతవరకే అయితే ఇది రాయాలని నాకు స్ఫురించకపోవును. ఆ తర్వాతి కాలంలో మానస తన లోపలి జీవనదుల్లో మునకలేసే ‘పరవశ’గానూ నాకు అర్థమయ్యారు. ఎలాంటి భావకవి! అందుకే ఈ ఉమ్మడి రైటప్‌. వాళ్లిద్దరూ ఈ ప్రపంచపు మరో మూలన ఉన్న నా సాహిత్య సహచరులు.

(Posted in fb on 15th July, 2023)





Sunday, July 16, 2023

సినిమా మ్యూజింగ్స్‌

 అమాంతం కాకుండా కొంచెం కొంచెంగా ‘సినిమా మ్యూజింగ్స్‌’ పూర్తిచేశాను. అంతటి గాఢత అలాంటి విరామాన్ని కోరుతుంది. ఇంతకుముందు కొన్ని విడి పీసులుగా చదివినవే. అయినా పుస్తకంలో మళ్లీ కొత్తగా చదువుతున్నట్టే అనిపించింది. కొన్నాళ్లుపోయాక మళ్లీ చదివినా ఇవి ఇంతే ఫ్రెష్షుగా ఉంటాయనుకుంటాను. క్లాసిక్‌ మెటీరియల్‌కు మాత్రమే ఇలాంటి పొటెన్షియల్‌ ఉంటుంది. తనకు నచ్చిన సినిమాల ఆధారంగా జీవితపు లోతునూ, విస్తృతినీ, సంక్లిష్టతనూ అద్భుతమైన వచనంతో దర్శింపజేశాడు స్వరూప్‌.( Swaroop Thotada ) పేరుకు సినిమా వ్యాసాలేగానీ, మన లోపలి సంచలనాలకు అనుగుణంగా కొత్త కిటికీలు తెరవగలిగే పుస్తకం ఇది.

(Posted in fb on 12th July, 2023)




Monday, February 13, 2023

నా స్నేహితుడు అజయ్‌



నా స్నేహితుడు అజయ్‌


అజయ్‌తో నాకు పరిచయం, స్నేహం వేర్వేరు కాలేదు. మాది తొలిచూపు స్నేహం అనుకోవచ్చు. పన్నెండేళ్ల క్రితం ఉప్పల్‌లో ఒక చీకటి సాయంత్రం భగవంతం పరిచయం చేశాడు. ఆ మొదటిరోజు నుంచే తెలిసినట్టుగా మాట్లాడుకున్నాం. అంటే ఎక్కువ మాట్లాడేసుకున్నాం అని కాదు. ఎక్కువ మాట్లాడటం తెలియడానికి గుర్తు కాదు. ఏమీ మాట్లాడకపోయినా ఏ అసౌకర్యానికీ గురి కాకుండా ఉండటం! అలాంటి సౌకర్యం నాకు అజయ్‌ సాహచర్యంలో దొరుకుతుంది.

ఆ తర్వాత ఎన్నో ఖాళీ ఆదివారాలు ఎక్కడెక్కడో తిరిగాం. చూడవలసినదే చూడాలి అనే పట్టింపు ఇద్దరికీ లేకపోవడం వల్ల అతి మామూలు ప్రదేశాలు కూడా మాకు దర్శనీయ స్థలాలు అయ్యాయి. ‘బార్కాస్‌’లో ఏదో ఆఫ్రికా చాయ్‌ దొరుకుతుందంటే కూడా ఎగేసుకుని వెళ్లిపోతాం. అట్లాంటి ప్రయాణాలవి. పొద్దున్న బయలుదేరడం, ఏదో ఒక బస్సెక్కడం, సాయంత్రం తిరిగి ఊరి దాపులోకి వస్తున్నామనుకునే చోట ఆగి, కొంచెం చల్లగా సేదదీరడం... ఇంతే అజెండా! తర్వాత మాతో మెహెర్‌ కలిశాడు. అప్పట్నించీ ‘త్రీ ఎమిగోస్‌’ అయ్యాం.

అజయ్‌ నెమ్మదైన మనిషి. ఒక జీవిగా తన లోపల ఎన్నో ఆందోళనలు ఉన్నాయని తెలుసు. కానీ ఆ తాపీదనం మాత్రం మనిషి చేరవలసిన గమ్యంలా నాకు తోస్తుంది. ఇది అజయ్‌లో స్వభావరీత్యా ఎంతుందో గానీ, అందులో కొంతైనా సాధనతో ఆర్జించుకున్నదే అని నేననుకుంటాను. ఆందోళన, ఆతృత, లౌల్యాలు కలగలిసిన నాకు, నేను కోరుకునే నా భవిష్యత్‌ రూపంలా తోస్తాడు అజయ్‌. కళాకారుడిలో ఉండే సహజమైన ఆబను కూడా తను జయించినట్టే కనబడుతుంది. ఈ లక్షణాల వల్లే కావొచ్చు అజయ్‌ కథల్లో ఒక ‘ఊపు’, ‘కుదుపు’ కనబడవు; మంద్రంగా, ఇవి రాయకపోయినా నాకేం పోయేది లేదన్నట్టుగా ఉంటాయి. ఒక కళాకారుడు యోగి అయినప్పుడు మాత్రమే వచ్చే శైలి ఇది. అందుకే కొట్టొచ్చినట్టుగా ఆకర్షించవు; ముఖ్యంగా నెమ్మదితనపు శ్రేష్ఠత ఇంకా తెలిసిరానివాళ్లకు.

– పూడూరి రాజిరెడ్డి

జూలై 2022


(బి.అజయ్‌ ప్రసాద్‌ కొత్త కథల సంపుటి ‘గాలి పొరలు’ కోసం రాసిచ్చిన ఒక జనరల్‌ ఫ్రెండ్లీ నోట్‌ ఇది. ప్రచురణ: బోధి; 2022)

 

Tuesday, January 11, 2022

మావాడు ఈదిన (అతడే ఒక) సముద్రం

 








అతడే ఒక సముద్రం పుస్తకం చదివి పెద్దోడు రాసిన అభిప్రాయం ఇక్కడ పోస్టు చేస్తున్నా. దీన్ని జూన్‌ 2021లో ఎఫ్బీలో షేర్‌ చేస్తూ పుస్తక అనువాదకుల్లో ఒకరైన రవి వీరెల్లి ఇలా రాశారు:

'అతడే ఒక సముద్రం' పుస్తకం చదివి 'శివ తాత్విక్ పూడూరి' ఈ వ్యాసాన్ని రాసాడు. ఒక్క వరుస కూడా వదలకుండా చేనుకు నీళ్లు కట్టినట్టు ఎంత నిదానంగా, ఎంత కుదురుగా కథ చెప్పాడో చూడండి.
శివ హైదరాబాద్ లో ఇప్పుడు ఏడవ తరగతి చదువుతున్నాడు. శివ వాళ్ళ నాన్న కూడా అప్పుడప్పుడు కథలు రాస్తాడు. 🙂
లవ్ యు శివ! ❤️

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

అతడే ఒక సముద్రం

ఈ అతడే ఒక సముద్రం పుస్తకాన్ని ఎర్నెస్ట్‌ హెమింగ్వే రాసాడు. హెమింగ్వే తనకి జరిగినవన్నీ కూడా కలిపి ఈ పుస్తకం రాసాడు. ఈ కథలో ఒక ముసలాయన ఉంటాడు. అతనికి ఒక బాబు పరిచయం. ఆ బాబు ఎప్పుడు ఈ ముసలాయన కోసం తినేటివి, ఇంకా కావలసినవన్నీ తెస్తూ ఉంటాడు. ఈ బాబుకు ముసలాయన పడవ నడపడం, చేపలు పట్టడం అన్నీ నేర్పిస్తాడు. ఎందుకంటే ఈ ముసలాయన ఒక మత్స్యకారుడు.
ఒకసారి మత్స్యకారుడు సముద్రంలోకి ఒక చేపను పడదామని వెళుతాడు. ముసలాయనకు ఒక పెద్ద చేప చిక్కుతుంది. దానితో అలా మూడు రోజుల దాకా గడుపుతాడు. ఈయన దాన్ని తమ్ముడుగా అది బతికినంత కాలం గడుపుతా ననుకుంటాడు. మధ్యలో అతనికి తెలుస్తుంది, అది ఒక మహా బ్లూ మార్లిన్‌. అది ఒక్కసారిగా పైకి దూకుతుంది. అప్పుడే ముసలాయన దాని వెన్నుముక్క దగ్గర గురిచూసి పంట్రకోలను గుచ్చుతాడు. దాన్ని ఇంకా రెండు సార్లు మళ్లీ కుచ్చి చంపేస్తాడు.
అతను అనుకుంటాడు: నేను స్వయంగా నా తమ్ముడిని చంపేసానే అని. కానీ ఏం చేసేది లేక దానికి ఉచ్చు బిగించి నోరును కట్టేసి తాడుతో దాన్ని పడవకు కట్టేసి బయలుదేరుతాడు.
వెళ్లేదారిలో అతను దాని ధర గురించి ఆలోచించుతాడు. కానీ అప్పుడే సొరచేప ముసలాయన పట్టిన బ్లూ మార్లిన్‌ తోకను కొరుకుతుంది. దాని వల్ల బ్లూ మార్లిన్‌ నుండి రక్తం కారుతుంది. ఇక ఆ రక్తం వల్ల ఇంకెన్ని సొరచేపలు వస్తాయో అని అనుకుంటాడు.
అప్పుడు అతను పంట్రకోలను పట్టకుని వచ్చిన ప్రతిదానిలోకి దాన్ని గుచ్చుతాడు. కానీ ఎంత చేసినా ఆ బ్లూ మార్లిన్‌ నుండి మాంసాన్ని తింటూనే ఉంటాయి. పాపం ఇక దానిలో సగం కన్నా తక్కువ భాగం మిగిలివుంది.
అతను తనకు తాను చెప్పుకుంటాడు: అవి నన్ను నాశనం చేయగలవు కానీ ఓడించలేవు అని.
తరువాత ఆ మిగిలిన భాగంతోనే తిరిగి వెళ్లిపోతాడు.
అక్కడ బాబు ముసలాయన కోసం వేడి వేడి కాఫీ పట్టుకొస్తాడు. తరువాత ముసలయాన పడుకుంటాడు. పిల్లాడు పడవ దగ్గరికి వెళతాడు. అంతే అప్పుడే అంతా జనం దాని చుట్టూ మూగి దాన్ని చూస్తారు.
పిల్లాడు ఇంటికి తిరిగివెళ్లి ముసలాయనతో మాట్లాడుతాడు. తరువాత ఆ ముసలాయన మళ్లీ నిద్రలోకి జారుతాడు. పిల్లాడు అలా అతని ముందు కూర్చుంటాడు.
–––– ––– ––– ––––
ఈ పుస్తకం వల్ల ఎర్నెస్ట్‌ హెమింగ్వేకు నోబెల్‌ బహుమతి అందుతుంది.

– పూడూరి శివతాత్విక్


--
1.. దీన్నే ఆగస్ట్‌ 2021 భూమిక మాసపత్రికలో పిల్లల భూమిక విభాగంలో పునర్ముద్రించారు.

2. తానా జనవరి 2022 సంచికలోనూ పునర్ముద్రించారు.

కొండవీటి సత్యవతి గారికీ, సాయి బ్రహ్మానందం గొర్తి గారికీ ధన్యవాదాలు.
 

3. ఎర్నెస్ట్‌ హెమింగ్వే ‘ది ఓల్డ్‌మాన్‌ అండ్‌ ద సీ’ నవలను అతడే ఒక సముద్రం పేరుతో తెలుగులోకి అనువదించినవారు రవి వీరెల్లి, స్వాతికుమారి.

 







Sunday, April 4, 2021

జంత్రవాద్యపు మంత్రవాక్యం

ఈ సమీక్ష రాసిన అజయ్‌ ప్రసాద్‌కూ, దీనిలోంచి కొంతభాగాన్ని ప్రచురించిన ఫన్‌డే మిత్రులకూ, పూర్తిపాఠాన్ని ప్రచురించిన ‘పుస్తకం’ సంపాదకులకూ ధన్యవాదాలు.


2021 మార్చ్ 28న సాక్షిలో ప్రచురితమైన సమీక్ష
-------------------------------------





జంత్రవాద్యపు మంత్రవాక్యం ఆజన్మం

  బి.అజయ్‌ప్రసాద్‌  


వాగ్గేయకారులు కవిత్వంలోనో, పాటలోనో మాత్రమే ఉండనక్కర్లేదు. రక్తపు లోపలి అలలు తరుముకొస్తుంటే ఏ రూపంలోనైనా బైటికి ధారాళంగా వ్యక్తమయ్యే కళ అది. కదిపితే నిలువెల్లా అనేక రాగాలు పలకగల తంత్రీవాద్యంలాంటివాడు పూడూరి రాజిరెడ్డి. అతడి హృదయం సున్నితమైన జంత్రవాయిద్యం లాంటిది. తటాకంలో విసిరిన రాయికి అలలు చెలరేగినట్లు తనకెదురయ్యే అనుభవంలో అతడనేక మూర్ఛనలు పోతుంటాడు. అశేషమైన ప్రాపంచిక విషయాల ప్రవాహంలో తన ఉనికియొక్క ప్రత్యేకతని ప్రస్ఫుటం చేసుకోడానికి అతడిలోని ‘నల్ల నువ్వుల్ని’ బయటికి రువ్వే అంతర్జలం అతడిలో అనంతంగా పుడుతూనే ఉంటుంది.

రాజిరెడ్డి ‘అనుభవమే జ్ఞానం’ అనే ఉత్త ( pure ) అనుభవవాది ( empiricist ) కాదు గానీ తన సొంత అనుభవమే తన రచనకు ముడిసరుకు అని నమ్ముకున్నవాడు. ఇక్కడ వాస్తవం, అనుభవం ఒకటి కాదు. మరి అనుభవం అందరిదీ ఒకటేనా? అంటే ‘కాదు’ అన్న సమాధానానికి ఎంత విలువుంటుందో ‘అవును’ అన్నదానికి కూడా అంతే విలువ. కొందరికి నచ్చే వర్షాకాలం అతడికి ఇష్టం లేకుండొచ్చు. అతడి చలికాలపు వర్ణన మనకు వెచ్చని దుప్పటి కప్పినట్లుండొచ్చు. అతడి చేతి‘రాత’ ప్రతిభావంతమైన హస్తకళ. ఈ రసవిద్యకి ఆవల అతడి హృదయాన్ని చూడకపోతే రాజిరెడ్డిని మనం చేరనట్లే లెక్క. ‘పరిశీలించడం దాన్ని చిత్రించడం ఉత్త  Workmanship, ఆర్ట్‌ కాదు. మపాసా హృదయం ముందు అతడి పరిశీలనాశక్తి ఎంతపాటి’ అంటాడు చలం.

ఏమిటీ హృదయపు ప్రత్యేకత? I like the story of human complexity అని ఎప్పుడో చదివిన చినువా అచెబె మాట ఎందుకో ఆలా గుర్తుండిపోయింది. ఈ complexity అన్నది speciality కూడా. అనేక భయ, సందేహాలతో కూడిన మానవ ప్రత్యేకత అన్నది ఈ జీవుడి ఉనికి. ఇతడికి  – అరటిపండు తినడంకంటే తిన్న తర్వాత తొక్క ఎక్కడ వెయ్యాలన్నది పెద్ద సమస్య . ఒకరు పోసినచోట పోయడం చచ్చే చావు. పేలు చూపించుకునే సుఖం కోసమైనా అమ్మాయిగా పుడితే బాగుండుననుకుంటాడు. హాఫ్‌ బనీన్లు ఎలా వేసుకుంటారో ఇతడికి అస్సలు  అర్థం కాదు. క్లారిఫై చేసుకుంటే బాడ్‌ ఇమేజ్‌ తొలగిపోయే అవకాశం ఉన్నా మౌనంగానే ఉంటాడు. లోకం మెచ్చుకునే అనేక గొప్ప రచనలు ఇతడికి చప్పగా అనిపిస్తాయి – ఇటువంటి అనేకానేక స్వభావ సంక్లిష్టతలు ఈ ‘ఆజన్మం’ ఆమూలాగ్రం కోకొల్లలుగా కనిపిస్తాయి. ఒకే అస్తిత్వం నుంచి పుట్టిన అనేక ప్రతిఫలనాలు.

ఈ అస్తిత్వానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమంటే ‘నిర్ణయం తీసుకోలేకపోవటం’. ఇది ఈ పుస్తకం అడుగడుగునా కనిపిస్తుంది. స్వతహాగా ఇది కళాకారుల లక్షణం. తమ విస్తారమైన అంతరంగానికి ఏకముఖం ఎప్పటికీ ఇవ్వలేనితనం. Hesitation ముందుపుట్టి తరువాత నేను పుట్టాను అంటాడు కాఫ్కా. గ్రాహ్యం చేసుకుని ఈదులాడే అంతర్లోకంలో ఒకటి ఎంచుకుని మరొకటి కాదనలేని ఎరుక. సందిగ్ధం ఒక దేహ ధ్యానం.

దిన జీవితపు రద్దీలో చూసి కూడా చూడక, దైనందిన అలవాటే పొరపాటై గిడసబారి వదిలేసిన విషయాలని రచయిత మసి తుడిచి మళ్ళీ మనముందు కొత్త వెలుగులో పెట్టినట్లుంటుంది. ఇందులో పిల్లల మురిపెపు ప్రశ్నల నుంచి దైవభావన, మతాలు, మృత్యుభయాలు, మన పర సమూహాలు, జడలు, సంసార ఇబ్బందులు, ఆఖరికి కౌమారంలో శానిటరీ నాప్కిన్స్‌ తెలియని కుతూహలం నుంచి పెళ్లయ్యాక భార్య బట్టలు ఆరేయడంలో పడే ఇబ్బంది వరకూ ఈ ఆజన్మం నిండా అనుభవాల సారంగా రాజిరెడ్డి తన రుచులనో, అభిరుచులనో వ్యక్తం చేస్తూ వచ్చాడు. అవి మనవిలా కూడా అనిపించవచ్చు. కొన్నిసార్లు అతడికి రుచిగా అనిపించేది మనకు చేదు కావొచ్చు. కానీ అతడి వివరణ, వర్ణన మాత్రం మనకి రుచికరంగా లేకపోతే మనం మంచి చదువురులం కానట్టే లెక్క. తలవకుండానే తలుపుతట్టే ఆలోచనలను ఒడిసిపట్టుకోడానికి ఎప్పుడూ కలం కాగితం జేబులో సిద్ధంగా పెట్టుకునే రాజిరెడ్డి వచనం గురించి చెప్పినంత తేలిగ్గా అతడి ‘రాయడం’ గురించి చెప్పడం కష్టం. తెలుగు సమకాలీన రచనల్లో విషయం గురించి, ఉదంతం గురించి చెప్పాలనేంత ఆతృత ‘రాయడం’ మీద కనిపించదు. మనం వస్తుశిల్పాల మీద చేసినంత విస్తారమైన చర్చ ఈ ‘రాయడం’ మీద ఎప్పుడూ చేయలేదు. ప్రతిదాన్ని దృశ్యమానం చేయగల డిజిటల్‌ యుగంలో ఉదంతాలను వివరించే రొడ్డకొట్టుడు రచనలు కనుమరుగై చివరికి చిత్రీకరణకు లొంగని ఈ ‘రాయడం’ ఒక్కటే కళగా మిగిలిపోనున్న కాలం ఒకటి రానున్నది. రాజిరెడ్డి తన స్వీయానుభవాన్ని తనకు తానుగా తరచి చూసుకుని, ఆ పరీక్షనాళికలో నిలబడి దాని రంగు– రుచి–వాసన మనకందజేస్తాడు. ఈ క్రమంలో విషయం కంటే విశేషణం ముఖ్యమౌతుంది. ప్రాపంచిక విషయాల విచారణతో ఆంతరంగిక ఆత్మచైతన్యం రగిలి అవి రెండూ ఒకదానినొకటి జమిలిగా మల్లెపూల దండలో మరువం కలిపి గుచ్చిన గుబాళింపు ఉంటుంది.

అతడే చెప్పుకున్నట్లు ఇందులో అనేక ఆత్మకథాత్మక సంఘటనలు, మ్యూజింగ్స్, ఫీలింగ్స్, కథలు, ఖండికలు, కవితలు ఉన్నాయి. రాసి పెట్టుకోకపోతే మర్చిపోయే చిన్న విషయాలున్నాయి. ‘ఈ అశాశ్వతత్వమే వాటిలోని అందం.’ పుస్తకం నిండా పరుచుకున్న అతడి హృదయపు ఎతచితలు దీన్ని జీవితకాలం చదువుకోగల శాశ్వత అందాన్ని ఇచ్చాయి.

ఆత్మని అనుభవంతో రమింపచేయడం అతడు చేసే పని. అందులోకి లయించినవారికి  ఆశ్చర్యమూ, ఆత్మానందమూ.


ఆజన్మం (ఆత్మకథాత్మక వచనం)

రచన: పూడూరి రాజిరెడ్డి; పేజీలు: 304; వెల: 280; 

ప్రచురణ: కృష్ణకాంత్ ప్రచురణలు, తెనాలి. 2021. ఫోన్: 97055 53567.

దొరికేచోటు: అనల్ప బుక్ కంపెనీ (ఫోన్: 7093800303); అమెజాన్.ఇన్; నవోదయ బుక్ హౌస్ (ఫోన్: 91-9000413413, 040-24652387); కినిగె.

-------

ఏప్రిల్ 2, 2021న పుస్తకం.నెట్ ప్రచురించిన సమీక్ష లింక్:

పుస్తకంలో ప్రచురితమైన సమీక్ష


https://www.amazon.in/Aajanmam-Poodoori-Rajireddy/dp/B08WLR6W7C/ref=sr_1_1?dchild=1&keywords=aajanmam&qid=1613741208&s=books&sr=1-1


https://kinige.com/book/Ajanmam

Friday, October 9, 2015