(మా ఊరి పెద్దాయన యెర్రం మోహన మురళి గారు ‘జీవన తరంగాలు’ పేరుతో తన ఆత్మకథ రాసుకున్నారు. మొన్న దసరాకు ఊరికి వెళ్లినప్పుడు జరిగిన ‘అలాయ్ బలాయ్’ కార్యక్రమంలో దీని ఆవిష్కరణ జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడింది ఇక్కడ ఇస్తున్నాను.)
ఊరి యువమిత్రుల సమక్షంలో పుస్తకావిష్కరణ.
నాకు కుడివైపున ఉన్నది యెర్రం మెహన మురళి.
యెర్రం మోహన మురళి గారి
‘జీవన తరంగాలు’ మీద
పూడూరి రాజిరెడ్డి
అక్టోబర్ 13, 2024
నర్సింగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం
అందరికీ నమస్కారం.
నాతో పాటు వేదికను పంచుకుంటున్న మిత్రులకూ, ముందు కూర్చున్న యువమిత్రులకూ...
కరెంటు మనిషి
నాకు పాములు, కరెంట్ అంటే భయం. పాములతో సహవాసం తప్పకపోయినా అనివార్యం కాదు. కానీ కరెంట్ అట్లా కాదు. అది మనకు దాదాపుగా రెండో శ్వాస లాంటిది. శ్వాస ఆగిపోతే మనిషి ఎట్లా ఆగిపోతాడో, కరెంట్ ఆగిపోతే ప్రపంచం ఆగిపోతుంది. మీరు ప్రపంచాన్ని స్తంభింపజేయాలనుకుంటే ఏం చేయనక్కర్లేదు. ఒక్క కరెంట్ తీసేస్తే చాలు. కరెంట్‌తో ముడిపడి ఎన్ని వ్యవహారాలున్నాయంటే, మనం ఊహించలేనన్ని. మనకు కరెంట్ అంటే మనకు కనబడే ఏ హెల్పరో, లైన్‌మనో అంతవరకే. ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఎవరు ఎత్తుతారో వాళ్లే. కానీ అసలు మన ఊరిదాకా ఈ లైన్ ఎట్లా వచ్చింది, అసలు మన దగ్గర్లో ఒక సబ్ స్టేషన్ ఎట్లా వచ్చింది, దానికి అవసరమైన ప్లానింగ్ ఏంటి, అసలు మొత్తం ఒక వరంగల్, కరీంనగర్ జిల్లాలకు ఎట్లా ప్లా¯Œ చేశారు... ఇవన్నీ జరుగుతున్నాయంటే దాని వెనుక ఎందరో ఇంజినీర్ల కృషి ఉంది. అలాంటి విద్యుత్ సంస్థలో డివిజినల్ ఇంజినీర్ స్థాయిలో రిటైర్ అయిన యెర్రం మోహన మురళి గారు మన ఊరివాడు కావడం మనకు గర్వకారణం.
ఇంటిపేరు పంతులు కాదు!
సర్ కూడా వాళ్ల నాన్న పోశెట్టి పంతులును తలుచుకుంటూనే ఈ పుస్తకం మొదలుపెట్టారు. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు పోశెట్టి పంతులును చూసినుంటి. తెల్లటి బట్టలు, నల్లటి బూట్లు, అవి ఇట్లా ముందుకు వడి తిరిగి ఉండేటివి... వేసుకుని పోతుండే. పంతులోళ్లు, పంతులోళ్ల గిర్నీ అని అందరూ అంటుంటే, వాళ్ల ఇంటిపేరే పంతులు అనుకున్నా. మన ‘రామన్న’ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నప్పుడు ఎర్రం శ్రీమన్నారాయణ అని పేరొస్తే, అయితే వీళ్ల ఎర్రమోల్లా? అనుకున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక చదువు తాలూకు గౌరవం ఒక ఇంటికి ఎట్లా అంటుకుంటుందీ అని. వాళ్ల నాన్న పంతులుగా ఒక మెట్టు ఎక్కితే మోహన మురళి గారు దాన్ని అందుకుని మరిన్ని మెట్లు ఎక్కారు. మనలాంటి ఊరిలో తొట్టతొలి పెద్దస్థాయి ఉద్యోగి మోహన మురళి గారే! ఇప్పుడాయన కూతురు భవాని గారు కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మన ఊరి వరకూ ఇట్లాంటివన్నీ చాలా పెద్ద చదువులు.
నాలుగైదు విశేషాలున్నాయి:
1. మోహన మురళి గారు తన కెరీర్‌ను డిప్లొమాతో మొదలుపెట్టారు. ఉద్యోగం చేస్తూనే బీటెక్ చదివారు, ఎంటెక్ చదివారు. ఆ కొత్త పిల్లలతో పోటీ పడి టాప్ మార్కులు తెచ్చుకున్నారు. వాళ్లతో ఎంత కలిసిపోయిండంటే– ఈయనకు 20 ఏండ్ల సర్వీస్ ఉన్నంక మళ్లీ చదువుకుంటున్నారని శర్మ అని ఒకాయన బయటపెట్టేదాకా... ఏందిరా భయ్ అంటే ఏందిరా భయ్ అనుకునేదట. సీనియర్ అని తెలిసిన తర్వాత సార్, గారు అని మర్యాదలు మొదలయ్యాయి.
2. కెరీర్ అటు ఉండంగానే, సంస్కృతంలో ఎంఏ చేశారు. సంస్కృత పుస్తకాలను మూలరూపంలో చదవడానికి ప్రయత్నించారు. వాటి మీద రాసుకున్నారు. ఈ పుస్తకంలో ‘జ్ఞాన సముపార్జన పర్వం’ అని ఒక అధ్యాయం ఉంది. సర్‌కు సరిగ్గా సరిపోయే అధ్యాయం అది.
3. ఇవన్నీ ఉన్నంత మాత్రాన పుస్తకం రాయాలని ఏం లేదు. పుస్తకం రాశారు కాబట్టే, దాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నాం, దాని సందర్భంగా ఇక్కడ కలుసుకున్నాం.
4. ఆయన పుస్తకం రాసినా కూడా– ఆయనెక్కడో ఆయన స్థిరపడిన వరంగల్‌లోనే ఉండిపోయినా మనకు తెలిసేవాళ్లు కాదు. ఆయన తన మూలాలతో టచ్‌లో ఉండటానికి, తన ఊరిలో ఒక్కడిగా ఉండిపోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టే, మనం ఇక్కడ కలవగలిగాం.
5. ఇంకొక విశేషం ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఉంది. అంటే, ఆయన తన జీవితాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా బతకడానికి ప్రయత్నిస్తున్న మనిషి అని మనకు అర్థమవుతుంది.
జీవితాన్ని ప్రేమించే మనిషి
నాకు బాగా నచ్చింది, ఆయన జీవితాన్ని ప్రేమించే మనిషి అని అర్థం కావడం. ఆయన తాలూకు ఎన్నో జ్ఞాపకాలను ఈ పుస్తకంలో ఫొటోల రూపంలో పదిలంగా దాచుకున్నారు. ఆఖరికి వాళ్లమ్మాయి తాలూకు స్నేహితురాళ్లు, వాళ్ల బంధువులను కూడా.
ఆ ప్రేమ ఆయన వరకే పరిమితం కాదు... ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ కాలనీ అని కడదామని దానికోసం అందరూ కలిసి 22.5 ఎకరాల భూమి శాయంపేట ప్రాంతంలో కొని, దానికి అనుమతులు సంపాదించడానికి, దానికి తుదిరూపు ఇవ్వడానికి, అందరికీ ఇక ఇల్లంటూ ఉండాలని అనుకోవడం వల్ల ఒక పద్నాలుగు, పదిహేనేళ్లు దానికోసం తండ్లాడుతూనే ఉన్నారు. సెక్రటేరియర్‌కే ఒక నలభై సార్లు వెళ్లివుంటానని రాశారు.
ఇంకోటేందంటే, ఎప్పుడో ఆయన చిట్టి డబ్బులు ఎత్తితే సరిగ్గా రాలేదని, ఎవరికీ ఆర్థిక ఇబ్బంది ఉండకూడదని దీపియా ఫ్రెండ్స్ అసోసియేష¯Œ అని పెట్టుడానికి కారణమయ్యారు. ఆ పేరు కూడా నాకు బాగా నచ్చింది. దీపాన్ని గుర్తుతెచ్చేలా డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్‌ను దీపియా చేయడం– అది 20, 30 ఏండ్లుగా ఇంకా కొనసాగుతున్నదట.
సక్సెస్ స్టోరీ
ఈ పుస్తకంలో వాడిన భాష, రాసిన ధోరణి సాహిత్య ప్రమాణాలకు నిలిచేది కాదని చెప్పడానికి పెద్ద కష్టపడనక్కరలేదు. కానీ ప్రతి మనిషికీ ఒక సక్సెస్ స్టోరీ ఉంటుందని మోహన మురళి గారి జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. సిన్సియారిటీ, హార్డ్ వర్క్, కుతూహలం, ఆహారంతో ప్రయోగాలు, ఒకటి వద్దనుకుంటే అట్లా వద్దన్నట్టుగానే ఉండిపోవడం... ఇట్లాంటి గుణాలెన్నో కనబడతాయి. ఇలాంటివాళ్లు మన ఊరి యువతకు ప్రేరణ కావాలి. ఎంతైనా సర్ కరెంట్ మనిషి కదా, ఆయన వెలుగు అందరిమీద ప్రసరించాలి.
ఈ పుస్తకాన్ని మన ఊరివాళ్ల మధ్య నాతో ఆవిష్కరింపచేయాలని మోహన మురళి గారు అనుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసిన ‘కేవీకేవీ’ యువమిత్రులకు అభినందనలు. ఊరిలో ఒక సానుకూల వాతావరణం సృష్టించడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు, దానికి జేజేలు.
No comments:
Post a Comment