Sunday, March 5, 2023

అన్నపరెడ్డి బౌద్ధ్ధసాగరం

 



బౌద్ధ్ధసాగరం


దేనికైనా మధ్యేమార్గంలో పోవాలంటారు పెద్దలు. అతివాదాలు ప్రపంచానికి వినాశనకరం. ఈ మధ్యేమార్గం అనేది బౌద్ధం నుంచి ప్రజల్లోకి వచ్చిన భావధార. ఇంతకీ మధ్యేమార్గం అంటే ఏమిటి? మధ్యమాప్రతిపద్‌ అని సంస్కృతంలో, మజ్జిమాపతిపదా అని పాలీలో పిలిచే ఈ మార్గం ‘రెండు అంత్యాలను వదిలి, ఆ అంత్యాన్నో ఈ అంత్యాన్నో కౌగిలించుకోకుండా, అంటే మరీ అతికి పోకుండా, మధ్య దారిలో పోవాలని చెబుతుంది.’ ‘సత్యం, ఆ అంత్యంలోనో, ఈ అంత్యంలోనో కాక మధ్యలో ఉంటుందనే భావనను బౌద్ధ సిద్ధాంతాలకు అన్వయించడం జరిగిం’దని విశదీకరిస్తుంది ‘మహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు’. దీన్ని కూర్చినవారు ‘ఉపాసక’ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి.
 
మధ్యేమార్గం మన జీవితాలకు ఒక సంయమనాన్ని ఇస్తే, మరి ఆ సంయమనం సాధించడానికి కావాల్సిన ఉపకరణం– ధ్యానం. ఆ ధ్యానంలో రకరకాల మార్గాలున్నాయి, రకరకాల తుది ఫలితాలున్నాయి. బుద్ధుడి ద్వారా ప్రపంచానికి అందిన ఒక ధ్యాన ప్రక్రియ– విపశ్యన. ‘ఇది ఎరుక, అప్రమత్తత, జాగరూకత, పరిశీలనల మీద ఆధారపడినది.’ ఇది ఉనికిలో ఉన్న మిగిలిన ధ్యానాలకు భిన్నం. సమాధి స్థితిలో మనస్సు ‘అనేక మార్మిక స్థితులను చేరుతుంది. కానీ ప్రపంచాన్ని యథాతథంగా చూడలేడు. కాని బుద్ధునికి కావలసింది ప్రపంచాన్ని యథాతథంగా చూడగలగడం...(అందుకే) విపశ్యనను కనిపెట్టాడు. విపశ్యన అంటే, మనస్సును పూర్తిగా విముక్తం చేసి, వస్తువుల యథార్థ స్థితికి తీసుకెళ్లి, తద్వారా నిర్వాణానికి చేర్చే అంతర్ప్రజ్ఞ’ అని చెబుతుంది ఇదే మహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు. ఇది ఒక విశ్లేషణాత్మక విధానం. ‘దుఃఖాన్ని, రూపారూప ప్రపంచంలో ఆత్మలేని తనాన్ని ఎరుకపరిచేది ఈ జ్ఞానం’.

2008లో వెలువడిన ఈ మహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువులో ఇంకా ఇలాంటి ఎన్నో మాటలకు, రీతులకు అర్థాలు, వివరాలు తెలుస్తాయి. రెండు అట్టల నడుమ బౌద్ధ మహాసాగరాన్ని ఇముడ్చుకున్న గ్రంథం ఇది. పదం పదంలో జ్ఞాన పథం! తెలిసీ, అసత్యం పలకడానికి ఎవరైనా సిగ్గుపడాలనీ, అలాగే పర్యాలోచన(రిఫ్లెక్షన్‌) చేసి కర్మలను పరిశుద్ధం కావించుకోవాలనీ రాహులునికి బుద్ధుడు బోధించింది రాహులోవాద సూత్రం. ‘ఏ ధర్మమూ, వస్తువూ అదే విధంగా ఏ రెండు క్షణాల పాటు ఉండదు’ అని చెప్పేది క్షణికవాదం. యోగ అంటే, కాడి కిందకు తేవటమే. ‘ఎలాగైతే కాడికి పూన్చిన ఎద్దులు నియమబద్ధంగా నడుస్తాయో, అలాగే యోగం మనిషి మనస్సును సంయమిస్తుంది’. ఇక పవిత్రాక్షరం ఓమ్‌ తాంత్రిక బౌద్ధంలో శూన్యతను సూచిస్తుంది. అయితే ఈ గ్రంథం వట్టి ప్రతి పదార్థాల పదకోశం కాదు. ఇది బౌద్ధ సూత్రాలను, శాస్త్రాలను, సిద్ధాంతాలను, పారిభాషిక పదాలను గణనీయంగా వివరిస్తుంది. కొత్తగా బౌద్ధాన్ని తెలుసుకోగోరేవారికీ, అవగాహన చేసుకోగోరేవారికీ ఇది ఒక కరదీపిక. ‘ఇటువంటి బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు తెలుగులో– బుద్ధుని కాలంలోనే బౌద్ధం ఆంధ్రదేశంలో ప్రవేశించినా, క్రీ.పూ. 300ల నుంచి క్రీ.శ. 700ల వరకు, వేయి సంవత్సరాల పాటు, ఆంధ్రదేశాన్ని దున్ని వేసినా– ఒక్కటీ వెలువడలేదు’ అని ప్రకాశకులు (మిసిమి ప్రచురణలు) ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, ‘తెలుగులో వెలువడిన ప్రథమ మహా బౌద్ధ విజ్ఞాన నిఘంటువు’ ఇదని ఘనంగా ప్రకటించారు. అయితే, ‘నేను త్రిపిటకాచార్యుడను కాను. అంతకంటె బౌద్ధ వాజ్ఞయ మహాధ్యక్షుడను అసలే కాను. ఒక సామాన్య బౌద్ధ విద్యార్థిని. అలాగే ఈ ప్రయత్నం చేశాను... ఆ మహా సముద్రంలోని జ్ఞాన జలాన్ని నా ‘బుడ్డి చెంబు’ పట్టింనత మేరకే గ్రహించాను’ అని వినయంగా చెప్పుకొన్నారు కూర్పరి అన్నపరెడ్డి. నిఘంటువు ముందు ‘మహా’ అని చేర్చడం కూడా, బౌద్ధ సంప్రదాయాన్ని(ఉదా: మహా నిదాన సుత్త, మహా పదాన సుత్త) పాటించాలనే కోరికతో చేశానని చెప్పినప్పటికీ ఇది ‘మహా’ అని చేర్చడానికి తగినదే.

బౌద్ధానికి సంబంధించిన అనేక గ్రంథాలను తెలుగులో వెలువరించిన అరుదైన రచయితగా కూడా అన్నపరెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇందులో అనువాదాలు, పరిశోధనలు, స్వతంత్ర రచనలు ఉన్నాయి. మానవీయ బుద్ధ, బుద్ధ దర్శనం, బుద్ధుని దీర్ఘ సంభాషణలు, బుద్ధుని సూత్ర సమచ్ఛయం, తెలుగులో బౌద్ధం, ఆచార్య నాగార్జునుడు, మహోన్నత బుద్ధుడు, నలభై రెండు ప్రకరణాల సూత్రం, బుద్ధుని ధర్మం– శిష్యులు, పోషకులు లాంటి పుస్తకాలను ఆయన వెలువరించారు.
 
1933 ఫిబ్రవరి 22న మహాశివరాత్రి పర్వదినాన గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు అన్నపరెడ్డి. లెక్చరర్‌గా పనిచేశారు. ‘చదివింది తత్వశాస్త్రం. బోధించింది సమాజశాస్త్రం. రాసింది మనోవిజ్ఞాన శాస్త్రం. అభిమాన విషయం సాహిత్యం, గ్రంథ రచన’. 1996 నుంచి 2011 వరకు ‘మిసిమి’ మాసపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. చాలామంది సాధారణ తెలుగు పాఠకులకు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ఆయన ద్వారానే పరిచయం. మేధావుల మెతకలు, అస్తిత్వవాదం ఆయన ఇతర రచనలు. ‘చింతనాగ్ని కొడిగట్టిన వేళ’ ఆయన ఆత్మకథ. బౌద్ధమతం అవలంబించిన తర్వాత తన పేరును బుద్ధఘోషుడు అని పెట్టుకున్నారు. ఆ పేరుతో రచనలు చేశారు. కానీ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డిగానే ఎక్కువమందికి పరిచితుడు. 2021 మార్చ్‌ 9న ఆయన మరణించారు. ఇది ఆయన జయంతి, వర్ధంతుల ఉమ్మడి సందర్భం. కొంతమంది తాము బతికి ఉన్నంతకాలం సెలయేరుల్లా్ల ప్రవహిస్తారు. వారి దగ్గరికి ఎప్పుడు సమీపించినా మెదడుకు ఇంత జ్ఞానతడి చేసుకుని రావొచ్చు. అలాంటి ఒక తెలుగు సెలయేరు అన్నపరెడ్డి!

(27 ఫిబ్రవరి 2023)