ఒ.హెన్రీ అన్న కలంపేరుతో కీర్తినొందిన కొసమెరుపు కథల మాస్టర్ విలియమ్ సిడ్నీ పోర్టర్ కథ ‘ద గిఫ్ట్ ఆఫ్ మ్యాజీ’ సారం ఇది. 1862లో జన్మించి 1910లో మరణించిన ఈ అమెరికన్ కథకుడి ‘ద లాస్ట్ లీఫ్’ కథ కూడా జగత్ప్రసిద్ధం.
–––––––
నువ్వే నాకు బహుమతి
ఒక డాలరు ఎనబై ఏడు సెంట్లు.
మొత్తం ఉన్నది అంతే. మాంసమో, మరోటో కొన్నప్పుడల్లా జాగ్రత్తగా మిగిల్చిన ఒక్కో సెంటు అది. మూడుసార్లు లెక్కించింది డెల్లా. ఒక డాలర్ ఎనబై ఏడు సెంట్లు. రేపే క్రిస్మస్!
మంచం మీద పడి ఏడవటం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి. డెల్లా అదే చేసింది.
జేమ్స్ డిలింగ్హుమ్ యంగ్‌కు గతంలో వారానికి 30 డాలర్లు వచ్చేవి. ఇప్పుడు 20 డాలర్లే వస్తున్నప్పుడు ఆ పేరు మరీ పొడుగ్గా కనబడుతోంది. జేమ్స్ డి.యంగ్ అంటే చాలు. దాన్ని కూడా పొట్టి చేసి ‘జిమ్’ అని పిలుస్తుంది డెల్లా.
ఏడ్చిన తర్వాత ఆ శోకపు గుర్తులను ముఖం మీద తుడిచేసుకుంది. కిటికీ దగ్గర నిలబడి నిరాసక్తంగా బయటకు చూసింది. రేపే క్రిస్మస్ పండుగ. జిమ్ కోసం బహుమతి కొనడానికి ఆమె దగ్గర ఉన్నవల్లా 1.87 డాలర్లు మాత్రమే. నెలలుగా పోగేసినదానికి ఇదీ ఫలితం! ఇరవై డాలర్లతో వారంపాటు ఇల్లు గడపడం సాధ్యమా? అన్నీ ధరలు పెరిగిపోయే.
1.87 డాలర్లు మాత్రం ఉన్నాయి జిమ్‌కు బహుమతి కొనడానికి. తన జిమ్ కోసం. జిమ్‌కు తగ్గ బహుమతి ఇవ్వాలని గంటలు గంటలు ఆలోచించింది. కానీ ఏం లాభం?
గది కిటికీల మధ్య ఒక సన్నటి అద్దం ఉంది. దాన్లో మొత్తం మనిషి ఒకేసారి కనబడటం కష్టం. మొత్తం కనబడాలంటే కొంత నైపుణ్యం ఉండాలి. డెల్లా లాంటి నాజూకు అమ్మాయి ఆ కళలో నిష్ణాతురాలైంది. కిటికీ దగ్గర నుంచి వచ్చి అద్దం ముందు నిలబడింది. ఆమె కళ్లు కాంతిమంతంగా మెరుస్తున్నాయి. కానీ ముఖం వివర్ణమైంది. తన జుట్టును మొత్తంగా కిందికి వదిలేసింది.
డెల్లా, జిమ్ దంపతులు రెండు విషయాలకు గర్వపడతారు. ఒకటి జిమ్ బంగారపు వాచీ. అది వాళ్ల నాన్న నుంచి అతడికి వచ్చింది. అంతకు చాలా ఏళ్ల క్రితం వాళ్ల తాతది. ఏ రాజు దగ్గర కూడా అలాంటి వాచీ ఉండివుండదు. ఇక వాళ్లు గొప్పగా భావించే రెండో విషయం, డెల్లా జుట్టు. ఆ జుట్టు ఏ రాణి దగ్గర ఉన్న వజ్రాభరణాల కన్నా కూడా అందమైనది.
డెల్లా వదిలిన జుట్టు చూడ్డానికి గోధుమరంగు నీటిప్రవాహంలా మెరుస్తోంది. ఆమె మోకాళ్ల దగ్గరకు వచ్చింది. అదే ఆమెను దుస్తుల్లాగా కప్పింది. దాన్ని మళ్లీ త్వరగా ముడేసుకుంది. ముడేసుకున్నాక ఒక్క క్షణం అలా నిస్తేజంగా నిలుచుంది. రెండు కన్నీటి చుక్కలు ఆమె చెంపల మీదుగా జారిపోయినై.
తన పాత బ్రౌన్ కోటు వేసుకుని, పాత బ్రౌన్ టోపీ పెట్టుకుని వీధిలోకి వచ్చింది. నడుస్తూ ఒక బోర్డు ఉన్న చోట ఆగింది. ‘మిసీజ్ సోఫ్రోనీ. అన్ని రకములైన జుట్టు సరుకులు’.
రెండో అంతస్థు వరకు ఆగకుండా పరుగెత్తి, అలుపు తీర్చుకోవడానికి ఆగింది డెల్లా. తెల్లగా భారీగా వున్న మిసీజ్ సోఫ్రోనీ నిరాసక్తగా చూసింది డెల్లా వంక.
‘మీరు నా జుట్టు కొంటారా?’ అడిగింది డెల్లా.
‘నేను ఉన్నదే అందుకు’ అంది సోఫ్రోనీ. ‘నీ టోపీ తీసేయ్; జుట్టు చూడాలి’.
మరోసారి గోధుమవర్ణపు నీటిప్రవాహం కిందకు జారింది. జుట్టు బరువును అంచనా వేస్తున్నట్టుగా ఎత్తి, ‘ఇరవై డాలర్లు’ అంది సోఫ్రోనీ.
‘త్వరగా ఇవ్వండి’
మరి రెండు గంటల పాటు డెల్లా నగరంలోని ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి పరుగెత్తంది, జిమ్‌కు తగిన బహుమతి వెతకడం కోసం. అన్ని దుకాణాలు గాలించిన తర్వాత ఎట్టకేలకు దొరికింది. అది కచ్చితంగా జిమ్ కోసమే తయారైవుండాలి. అదొక బంగారు వాచీ గొలుసు. నిరాడంబరంగా ఉంది. దాని గొప్పతనం అంతా దానికోసం వాడిన మెటీరియల్‌లో ఉంది. ఒకటేదైనా సరళంగా, నిరాడంబరంగా ఉందంటే అది విలువైనదని అర్థం చేసుకోవచ్చు. మంచి వస్తువులన్నీ అలాగే వుంటాయి. జిమ్ వాచీకి ఈ గొలుసు సరిగ్గా నప్పుతుంది. దానికోసం 21 డాలర్లు చెల్లించింది. దాన్ని తీసుకుని చేతిలో మిగిలిన ఎనబై ఏడు సెంట్లతో ఇంటికి వేగంగా నడిచింది.
ఇక ఈ గొలుసు గనకవుంటే జిమ్ తన వాచీని ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకోవచ్చు. అంత మంచి వాచీకి తగిన పట్టీ లేదు. అందువల్ల జిమ్ ఎవరి సమక్షంలోనైనా దాన్ని బయటకు తీసి టైమ్ చూసుకోవడానికి ఇబ్బంది పడేవాడు. ఇప్పుడిక ఆ బాధ లేదు.
ఇంటికి వచ్చిన డెల్లా మనసు కాస్త కుదుట పడింది. ఇప్పుడు మరింత యుక్తిగా ఆలోచించి, కత్తిరించినది పోగా మిగిలిన జట్టును తన ముఖానికి నప్పేలా దువ్వింది. నలబై నిమిషాల తర్వాత ముఖం చూడబుద్ధేసేలా తయారైంది. పాఠశాల పిల్లాడిలాగా కనబడుతోంది. అద్దంలో తనను తాను చాలాసేపు అలాగే చూసుకుంది. ‘జిమ్ గనక నన్ను చంపకపోతే’ తనులో తాను అనుకుంది డెల్లా. ‘రెండోసారి నన్ను చూసినప్పుడు, డబ్బుల కోసం ఆడిపాడే అమ్మాయిలా ఉన్నాననుకుంటాడు. కానీ ఏం చేయగలను నేను? ఉన్న ఒక డాలర్ ఎనబై ఏడు సెంట్లతో.’
ఏడు వరకు డిన్నర్ రెడీ చేసింది. జిమ్ ఏ రోజూ ఆలస్యంగా రాడు. వాచీ గొలుసును చేతిలో పట్టుకుని జిమ్ వచ్చే తలుపు దగ్గర కూర్చుంది. అతడి అడుగుల శబ్దం వినపడగానే ఆమె ముఖం పాలిపోయింది. ‘దేవుడా, ఆయన నేను ఇప్పుడు కూడా అందంగా ఉన్నాననుకునేట్టు చేయి’ అని లోలోపల ప్రార్థించింది.
గుమ్మంలోంచి జిమ్ ఇంట్లోకి వచ్చాడు. డెల్లాను వింతగా చూశాడు. అతడి ముఖం అభావంగా ఉంది. డెల్లాకు దాన్ని చదవడం సాధ్యం కాక, భయపడింది.
‘జిమ్, డియర్’ అంటూ ఏడ్వడం మొదలుపెట్టింది. ‘నన్ను అలా చూడకు. నేను జుట్టును అమ్మేశాను. నీకు బహుమతి ఇవ్వకుండా ఈ క్రిస్మస్ గడపడం నా వల్లకాలేదు. నా జుట్టు త్వరగానే పెరుగుతుంది. నువ్వు పట్టించుకోవుకదా? మనం సంతోషంగా ఉందాం. నీ కోసం ఏం తెచ్చానో చూడు’.
‘నువ్వు జట్టు కత్తిరించావా?’ నెమ్మదిగా అడిగాడు జిమ్. జరిగినది అర్థం చేసుకోవడానికి అతడు శ్రమపడ్డాడు.
‘కట్ చేసి అమ్మశాను’ చెప్పింది డెల్లా. ‘ఇప్పుడు నేను నచ్చడం లేదా? జుట్టు లేకపోయినా నేను నీ పాత డెల్లానే’.
జిమ్ ఊరడిస్తున్నట్టుగా ఆమె చుట్టూ చేతులు వేశాడు. పది సెకన్ల తర్వాత తన కోటు జేబులోంచి కాగితంలో చుట్టివున్నదాన్ని టేబుల్ మీద పెట్టాడు. ‘నీ జుట్టు పోయినంత మాత్రాన నీ మీద నా ప్రేమ ఏమీ తగ్గదు డెల్. కానీ నువ్వు ఆ కాగితం తెరిచి చూస్తేగానీ నా బాధేమిటో నీకు అర్థం కాదు’.
ఆ కాగితం విప్పుతూనే డెల్లా సంతోషంతో అరిచింది. ‘ఓ ఓ’. వెంటనే ఆ సంతోషం కన్నీళ్లుగా కరిగిపోయింది. అందమైన దువ్వెనలు! వాటికి నగలు పొదిగివున్నాయి. డెల్లా అందమైన జుట్టుకు బాగుంటాయని తెచ్చాడు. ఆమె వాటినో షాపులో చూసి ఇష్టపడింది. అవి ఖరీదైనవైనా తన సొంతం అవుతాయన్నంత విశ్వాసంతో చూసింది. అవి వచ్చేసరికి ఆమెకు జుట్టు లేకుండా పోయింది.
ఇంకా జిమ్ తన బహుమతి ఏమిటో చూడలేదు. డెల్లా చేతిలో ఉన్న ఆ బంగారు గొలుసు ఆమె చేతిలా మెరుస్తోంది. ‘బాగుందా జిమ్? దీనికోసం నగరమంతా గాలించాను. నీ వాచీ ఇవ్వు’.
జిమ్ కూర్చుని నవ్వాడు.
‘డెల్లా, మన క్రిస్మస్ బహుమతుల్ని కాసేపు పక్కన పెడదాం. ఆ దువ్వెనలు కొనడానికి నేను వాచీని అమ్మేశాను. మనం డిన్నర్ చేయడం మంచిదేమో’.
భూమ్మీద ఎందరో బహుమతులు ఇచ్చుకుంటారు. కానీ ఈ యువదంపతులు ఒకరిమీద ఒకరికి గల అపారమైన ప్రేమతో ఇచ్చుకున్న బహుమతులు ఎంత గొప్పవి!
(సాక్షి సాహిత్యం; 22 జనవరి 2018)