Saturday, January 31, 2026

మంచి పుస్తకం చదివాను అన్న ఆనందం



 (గంగరాజం బిడ్డ పుస్తకం మీద డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల ట్విట్టర్లో చేసిన పోస్ట్)


గంగరాజం బిడ్డ (3/2026)

అసలు నేను ఇలాంటి పుస్తకాలు చదవను, ఖాళీగా ఉంటే మొదటి కథ చదివాను, చాలా విసుగ్గా అనిపించింది. ఇంకా ఖాళీగా ఉంటే ఇంకో కథ చదివాను. ఇదేదో బాగుందే అనిపించింది. ఎప్పుడూ పూరీ జగన్నాథ్ సినిమాలు చూసేవాడికి ఒకేసారి విశ్వనాథ్ సినిమాలు చూస్తున్నట్లు అనిపించింది. తర్వాత అన్ని కథలూ చదివాను.

తెలంగాణ మాండలికం ఈ ఉత్తరాంధ్రా వాడికి కొంత అర్థం కాకపోయినప్పటికీ, ఈ కథల్లో నా బాల్యాన్ని నేను చూసుకున్నాను. పల్లెలు, వాటిలోని మనుషులు, వాళ్ళ బ్రతుకులు అన్నీ అలవోకగా మనమక్కడే వాళ్ళమధ్యనే ఉండి వాళ్ళందర్నీ చూస్తున్నట్లుగా ఉంది ఈ పుస్తకం చదువుతూ ఉంటే.

ఈ పుస్తకంలో నాకు తెలియని తెలంగాణా మాండలికంలోని పదాలను అడిగి తెలుసుకున్నాను. చదివిన తర్వాత ఒక రకమైన సంతృప్తి. ఎక్కడో ఎప్పుడో వదిలేసిన బాల్యం, హాస్టల్ జీవితం, కౌమారం అన్నీ మళ్లీ ఉప్పెనలా ఎగిసాయి.

రచయిత పూడూరి రాజిరెడ్డి చాలా ఇబ్బందికరమైన విషయాలని చాలా సరళంగా ఈ కథల్లో రాసేశారు. అవి చదివేటప్పుడు ముఖం మీద ఒక చిరునవ్వు మెరుస్తుంది. ఈ కథల్లో ఏవో గొప్ప మలుపులు, ముగింపులు ఉండవు, అన్ని కథల్లో రచయిత మనల్ని చేయి పట్టుకుని అక్కడికి తీసుకెళ్లి అన్నీ చూపిస్తూ మనకొక అనుభూతిని అందిస్తారు. అంతే అనుభూతి మాత్రమే.

ఒక మంచి పుస్తకం చదివాను అన్న ఆనందం ఇంకా సంతృప్తి.

No comments:

Post a Comment