Showing posts with label చింతకింది మల్లయ్య ముచ్చట. Show all posts
Showing posts with label చింతకింది మల్లయ్య ముచ్చట. Show all posts

Tuesday, November 1, 2022

చింతకింది... ఆవిష్కరణ సభలో

జి.ఉమామహేశ్వర్, పూడూరి రాజిరెడ్డి, నామాడి శ్రీధర్, మామిడి హరికృష్ణ, కృష్ణమెహన్‌ బాబు, జయంతి శ్రీనివాస్, సిద్ధార్థ

పూడూరి రాజిరెడ్డి, కాశిరాజు, ఆదిత్య కొర్రపాటి, మెహెర్, ?, కుమార్‌ కూనపరాజు
 




చింతకింది మల్లయ్య ముచ్చట ఆవిష్కరణ సభ
రవీంద్రభారతి మినీ హాల్‌
17 సెప్టెంబర్‌ 2017

మిత్రులు, పెద్దలు...

డిగ్రీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు రామ్‌నగర్‌లో ఉన్నాను. ఏదైనా ఉద్యోగం చేయడమా, ఇంకేదైనా చదవడమా అనే కన్‌ఫ్యూజన్‌ దశ అది. రెండంతస్థుల ఇల్లు. గుండ్రంగా చుట్టూ పోర్షన్లు ఉంటాయి. నలుగురం ఉండెటోళ్లం. ఓనర్‌ పేరు కూడా గుర్తుంది. అర్జున్‌రావు. ఆ టైములో కలిగిన ఒక సడెన్‌ ఫీలింగ్‌ను ఒక చిన్న కథగా రాసుకున్న. దాని పేరు: ఆమె పాదాలు. చిన్నదంటే మరీ చిన్నది. ఒక పేజీ. అంతకుముందుకూడా ఏదో రాస్తూవున్నా. కానీ ఇది కొంచెం ముద్దుగా అనిపించింది. 1998 సంగతి. దాదాపు ఇరవై ఏళ్లు అవుతోంది.

రెండు మూడేళ్ల తర్వాత పటాన్‌చెరులో జాబ్‌ చేస్తున్నప్పుడు మరో చిన్న కథ రాసిన.

రెండే మాటలు చెప్పదలిచాను.

నిజానికి ఈ సంకలనాన్ని ఇప్పుడు తేవాలన్న ఆలోచన నాకు లేదు. ఎప్పుడో నేను రాయాల్సినవన్నీ రాశాక చివరి పుస్తకంగా ఇది తేవాలని అనుకున్నా. కథలు రాయడం అనేదే నా ప్రధానమైన విషయం కాదు. వచనం నా ప్రధానమైన సాధన. అందులో కథ కూడా ఒకటి.
కానీ మన దగ్గర సమస్యేమిటంటే, ‘‘అవన్నీ రాస్తున్నావు సరే, కథేదీ?’’ అంటారు.
కేవలం, కథకుడిగా నిరూపించుకుంటేనే ఈ సాహిత్యలోకం మనల్ని అర్హుడిగా లెక్కిస్తుందన్న భావన వల్ల కూడా ఈ సంకలనం వేయొద్దనుకున్నా. ఒక మొండితనంతో.

ఇంకో కారణం ఏమిటంటే, మన దగ్గర కథనే సాధన చేస్తూ కథకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు కూడా ఇప్పటివరకూ సంకలనాలు తేలేదు. ఒక పుస్తకం దాటేన్ని కథలు వాళ్లు రాసినప్పటికీ. వాళ్లే తేలేదు, నేను తేవడమేంటనే గిల్టు వల్ల కూడా పుస్తకం ఇప్పుడప్పుడే వద్దనుకున్నాను.

కానీ కృష్ణమోహన్‌బాబు గారు రెండు మూడు సార్లు అన్నారు. మీ కథలు వేద్దాం అని. తెలుగులో పరిస్థితి మీకు తెలియనిది కాదు. పుస్తకం వేస్తామని పబ్లిషర్లు అడిగే రోజులు కావు. సీరియస్‌గానే అడుగుతున్నారు; కథలన్నీ ఒక దగ్గర పడుంటాయిగదా అనుకున్న. అందుకే ఇది నాది కాదు, పూర్తిగా కృష్ణమోహన్‌బాబు పుస్తకం. ఆయన చొరవతో ఆయన వల్ల వచ్చిన పుస్తకం. వాళ్ల మొదటి ప్రచురణగా నా కథలు ఎంచుకోవడం సంతోషం.

థాంక్యూ.


(ఛాయా ప్రచురణగా 2017లో వచ్చిన ‘చింతకింది మల్లయ్య ముచ్చట’ కథల సంపుటి ఆవిష్కరణ సభలో నేను మాట్లాడిన మాటలు.)

– నాకు సంబంధించిన అన్నీ ఇక్కడ పోస్టు చేయడంలో నాక్కూడా ఒక సౌలభ్యం ఉంది.

– మరో దేనికోసమో వెతుకుతుంటే, ఇది తగిలింది :–)





Wednesday, June 12, 2019

ఢిల్లీలో చింతకింద మల్లయ్య

2017 ఫిబ్రవరిలో జరిగిన కేంద్ర సాహిత్య అకాడమీ సమావేశాల్లో, యంగ్ హార్వెస్ట్ పేరుతో జరిగిన కార్యక్రమానికి తెలుగు తరఫున నేను హాజరయ్యానని మీలో కొందరికి తెలిసేవుంటుంది. అక్కడ చింతకింది మల్లయ్య ముచ్చట కథను ఇంగ్లీషులో చదివాను. దీన్నిThe Hero of a Non Story పేరుతో చింతపట్ల సుదర్శన్ గారు అనువదించి ఇచ్చారు.
అయితే అకాడమీ వాళ్లు తమ అన్ని సమావేశాల వీడియోలను యూట్యూబులో ఉంచారని విన్నాను గానీ పట్టించుకోలేదు. ఆ రోజు సమావేశాల అనంతరం మణిపురి వాళ్లు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనల వీడియో కోసం మొన్నెందుకో గుర్తొచ్చి వెతికితే, సహజంగానే మా వీడియో కూడా తగిలింది. అరే, నన్ను నేనే పట్టించుకోవడం మానేసినంత బాధేసి, దాన్ని ఇక్కడ షేర్ చేస్తున్నా.
మొత్తం యంగ్ హార్వెస్ట్ ప్రోగ్రాములో 22 భాషల వాళ్లు పాల్గొన్నారు. అందులో నలుగురు ఉపన్యాసాలు ఇచ్చారు, నలుగురం కథలు చదివాము, మిగిలినవాళ్లందరూ కవితలు వినిపించారు.
మా సెషన్లో నాతోపాటు కథలు చదివినవాళ్లు బెంగాలీ(Sayantani Putatunda), సింధీ(Komal Dayalani) అమ్మాయిలు ఇద్దరూ, ఒక పంజాబీ(Pargat Singh Satauj) అతనూ. నా నంబరు మూడు. ఈ సతౌజ్, నేనూ ఆ రెండ్రోజులూ రూమ్ కూడా పంచుకున్నాం. రెండో రోజు ఈ కోమల్, సతౌజ్ తో పాటు మరికొందరం కలిసి ఢిల్లీ తిరిగాం.
ఈ వీడియో సుమారు మూడు గంటలుంది. మా సెషన్ మొదటి గంటన్నర. మా తర్వాతి కవితా పఠన సెషన్ కూడా ఇందులోనే కలిపారు. మొదటి నాలుగు నిమిషాలు ఉమ్మడి పరిచయ కార్యక్రమం. 40:00 నుంచి 1:05:00 మధ్య నాది ఉంది.

ఇక నా కథా పఠనం నవ్వు తెప్పిస్తే దానికి మీరు కూడా బాధ్యులే. 

Saturday, December 29, 2018

చింతకింది మల్లయ్య ముచ్చట మీద చేపూరు సుబ్బారావు గారి సమీక్ష


నా చింతకింది మల్లయ్య ముచ్చట కథల సంపుటి మీద ప్రతిలిపి ఆంగ్ల విభాగంలో డిసెంబర్ 26 నాడు ప్రచురితమైన చేపూరు సుబ్బారావు గారి సమీక్ష లింకు ఇక్కడ:

Review of Chintakindi Mallaiah and Other Stories



Saturday, March 10, 2018

ఒక అంతర్ముఖుని బహుముఖ రూపాలు


పాఠకుడిగా ఒక కథను చదవడమంటే ఆ రచయిత వెంట ప్రయాణించడం లాంటిది. రచయిత చెప్పాలనుకున్న వస్తువు, విషయం, ముగింపు, గమ్యం అయితే, కథని నిర్మించే తీరు, చెప్పే పధ్ధతి ప్రయాణంలాంటిది. అందుకే ఒకే విషయం మీద ఎన్ని కథలు చదివినా మన అనుభూతిలో తేడాలుంటాయి. దాన్ని శిల్పమన్నా, శైలి అన్నా, అది పాఠకుడి ప్రయాణాన్ని మనోరంజకం చేయడమే దాని ఉద్దేశం.
పూడూరి రాజిరెడ్డితో కథల ప్రయాణం అద్భుతమైన అనుభవం. మనకు విసుగు తెలీకుండా కబుర్లు చెబుతూనే వుంటాడు. తన అనుభవాలు చెబుతూనే, అందులోనుండి గ్రహించిన జీవిత సత్యాలను, తాత్త్విక అవగాహనను మనతో పంచుకుంటాడు.

(పూర్తి పాఠం దిగువ లింకులో)


http://eemaata.com/em/issues/201712/14495.html

వినూత్నమైన కథా కథనాలు



తను, తన కుటుంబం - కుటుంబ జీవితానికి సంబంధించినవే కాకుండా తన అనుభవాలను, జ్ఞాపకాలను యథాతథంగా అక్షరీకరించి 'చింతకింది మల్లయ్య ముచ్చట్లు' పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు (పూడూరి రాజిరెడ్డి).

ఇవన్నీ స్వీయ కథనాలు. అందునా ఆత్మకథాత్మకాలు కాబట్టి కథలన్నింటిలోనూ వున్న రచయిత ఆలోచనాధార చైతన్య స్రవంతిని జ్ఞాపకం తెస్తుంది. అవిచ్ఛిన్నమైన అన్సెన్సార్డ్ఆలోచనాధార చైతన్య స్రవంతి అని చెప్పబడుతుంది. ఇందులో వున్న 'మంట' కథ ఒక్కటే పూర్తి చైతన్య స్రవంతి ధోరణిలో వచ్చింది. కొన్నింటిలో పాక్షిక చైతన్య స్రవంతి ధోరణి, మరి కొన్నింటిలో చైతన్య స్రవంతి ఛాయలు కనిపిస్తాయి. అన్సెన్సార్డ్గా వచ్చే చైతన్య స్రవంతి ధోరణిలో కనిపించే కాముకత్వం, లైంగిక ప్రకోపం, అశ్లీలాలు మర్యాదస్తులకు కొరుకుడు పడడం కష్టమే. చైతన్య స్రవంతి వల్ల వచ్చే ప్రమాదమేమిటంటే, రచయిత తనకు తెలియకుండానే తాను బహిర్గతమవుతాడు. తాను, తన ఇష్టాయిష్టాలు, న్యూనతలు - అసంతృప్తులు, తన జీవితం, తన కుటుంబ జీవితాన్ని కూడా బజార్న పెట్టే అవకాశముంది. అందుకే చాలామంది రచయితలు దాని జోలికి పోలేదు. దాన్ని డీల్చేసే సత్తా కూడా చాలామందిలో లేకపోవడం కూడా ఒక కారణమే. ఒక విస్తృతి అధ్యయనశీలి, ఒక తాత్త్వికుడు, ఒక అసంతృప్త జీవి అంతరంగ మథనమే అనేకానేక విషయాల్ని పాఠకులతో పంచుకుంటుంది. అందులో భాష మరీ ప్రధానం. చైతన్య స్రవంతి పద్ధతిలో భాషతో చెడుగుడు ఆడుకోవచ్చు. శ్రీశ్రీ నుండి లెనిన్ధనిశెట్టి వరకు అలాగే సక్సెస్అయ్యారు. కోవలో వచ్చిన మరో వినూత్న శైలి పూడూరి రాజిరెడ్డిది.  మౌఖిక కథనరీతికి దగ్గరగా వుండి రచయిత మనతో ముచ్చటిస్తున్నట్లే వుంటుంది. కొన్నిసార్లు రచయిత మనమే అన్నట్లుగా, అనుభవాలు మనవే అన్నట్లుగా భ్రమింపజేస్తుంది. కథ ప్రారంభమే మన చేతుల్లో వుంటుంది. ఒకసారి ప్రారంభించామా ఆటోమేటిగ్గా చివరివాక్యం వరకు అద్భుత శైలీ ప్రవాహంలో కొట్టుకుపోక తప్పదు. ద్రవరూప శైలి ఎంతటి గొప్ప పఠనీయతని సాధించి పెట్టిందో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. యు..నరసింహమూర్తి అనే విమర్శకుడు 'తెలుగు వచనశైలి' పేరిట వచనాన్ని అద్భుతంగా రాసే వారి పరిచయాన్ని, వారి వచనశైలి గొప్పదనాన్ని వివరిస్తూ ఒక బృహద్గ్రంథమే రాశారు. ఒకవేళ వారు బతికివుంటే తప్పకుండా పూడూరి రాజిరెడ్డికి ఒక అధ్యాయమే కేటాయించేవారు.

మనం ఊహించినట్టుగా మన జీవితం ఉండదనీ, మనం కోరుకున్నట్లుగా మన జీవితం కొనసాగదనీ తెలిసినప్పుడు, వాటిని ఇతరుల జీవితాలలో చూడడం అనవసరమని 'చింతకింది మల్లయ్యతో ముచ్చట' పెడితే తెలుస్తుంది. అబ్సర్డ్కథాకథనానికి 'రెండడుగుల నేల' గురించి చెప్పుకోవాలి. ఇందులో కొన్ని కథలు స్కెచ్ లాగా లేదా డాక్యుమెంటరీ కథనాలుగా వున్నాయనే మాట వినపడింది. అది నిజం కాదు. లాటిన్అమెరికన్కథకుడు 'బోర్హెస్' పద్ధతి అది. ఇది శిల్పపరంగా కొనసాగే వినూత్న ప్రక్రియ. టెక్నిక్గురించి తెలియనివారు ఇది కథ కాదు, స్కెచ్అని పొరపడే ప్రమాదముంది. ఇవి కథలు అయినా కాకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ఒక అద్భుతమైన రచనాశైలి పుస్తకం నిండా కమ్ముకుని వుంది. అది మనసు చివరిదాకా లాక్కెళ్ళి ఆసక్తిగా చదివింపజేస్తుంది. అదే పుస్తకం ప్రత్యేకత.

చింతకింది మల్లయ్య ముచ్చట్లు (ఇతర కథలు); రచన: పూడూరి రాజిరెడ్డి; పేజీలు: 154; వెల: 144; ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు. ప్రచురణ కర్త ఫోన్: 9848023384

(నవ తెలంగాణ పత్రిక సాహిత్యం పేజీ దర్వాజాలో మార్చి 5న వచ్చిన పరిచయం.)

-
కె.పి.అశోక్కుమార్