Saturday, March 10, 2018

వినూత్నమైన కథా కథనాలు



తను, తన కుటుంబం - కుటుంబ జీవితానికి సంబంధించినవే కాకుండా తన అనుభవాలను, జ్ఞాపకాలను యథాతథంగా అక్షరీకరించి 'చింతకింది మల్లయ్య ముచ్చట్లు' పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు (పూడూరి రాజిరెడ్డి).

ఇవన్నీ స్వీయ కథనాలు. అందునా ఆత్మకథాత్మకాలు కాబట్టి కథలన్నింటిలోనూ వున్న రచయిత ఆలోచనాధార చైతన్య స్రవంతిని జ్ఞాపకం తెస్తుంది. అవిచ్ఛిన్నమైన అన్సెన్సార్డ్ఆలోచనాధార చైతన్య స్రవంతి అని చెప్పబడుతుంది. ఇందులో వున్న 'మంట' కథ ఒక్కటే పూర్తి చైతన్య స్రవంతి ధోరణిలో వచ్చింది. కొన్నింటిలో పాక్షిక చైతన్య స్రవంతి ధోరణి, మరి కొన్నింటిలో చైతన్య స్రవంతి ఛాయలు కనిపిస్తాయి. అన్సెన్సార్డ్గా వచ్చే చైతన్య స్రవంతి ధోరణిలో కనిపించే కాముకత్వం, లైంగిక ప్రకోపం, అశ్లీలాలు మర్యాదస్తులకు కొరుకుడు పడడం కష్టమే. చైతన్య స్రవంతి వల్ల వచ్చే ప్రమాదమేమిటంటే, రచయిత తనకు తెలియకుండానే తాను బహిర్గతమవుతాడు. తాను, తన ఇష్టాయిష్టాలు, న్యూనతలు - అసంతృప్తులు, తన జీవితం, తన కుటుంబ జీవితాన్ని కూడా బజార్న పెట్టే అవకాశముంది. అందుకే చాలామంది రచయితలు దాని జోలికి పోలేదు. దాన్ని డీల్చేసే సత్తా కూడా చాలామందిలో లేకపోవడం కూడా ఒక కారణమే. ఒక విస్తృతి అధ్యయనశీలి, ఒక తాత్త్వికుడు, ఒక అసంతృప్త జీవి అంతరంగ మథనమే అనేకానేక విషయాల్ని పాఠకులతో పంచుకుంటుంది. అందులో భాష మరీ ప్రధానం. చైతన్య స్రవంతి పద్ధతిలో భాషతో చెడుగుడు ఆడుకోవచ్చు. శ్రీశ్రీ నుండి లెనిన్ధనిశెట్టి వరకు అలాగే సక్సెస్అయ్యారు. కోవలో వచ్చిన మరో వినూత్న శైలి పూడూరి రాజిరెడ్డిది.  మౌఖిక కథనరీతికి దగ్గరగా వుండి రచయిత మనతో ముచ్చటిస్తున్నట్లే వుంటుంది. కొన్నిసార్లు రచయిత మనమే అన్నట్లుగా, అనుభవాలు మనవే అన్నట్లుగా భ్రమింపజేస్తుంది. కథ ప్రారంభమే మన చేతుల్లో వుంటుంది. ఒకసారి ప్రారంభించామా ఆటోమేటిగ్గా చివరివాక్యం వరకు అద్భుత శైలీ ప్రవాహంలో కొట్టుకుపోక తప్పదు. ద్రవరూప శైలి ఎంతటి గొప్ప పఠనీయతని సాధించి పెట్టిందో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. యు..నరసింహమూర్తి అనే విమర్శకుడు 'తెలుగు వచనశైలి' పేరిట వచనాన్ని అద్భుతంగా రాసే వారి పరిచయాన్ని, వారి వచనశైలి గొప్పదనాన్ని వివరిస్తూ ఒక బృహద్గ్రంథమే రాశారు. ఒకవేళ వారు బతికివుంటే తప్పకుండా పూడూరి రాజిరెడ్డికి ఒక అధ్యాయమే కేటాయించేవారు.

మనం ఊహించినట్టుగా మన జీవితం ఉండదనీ, మనం కోరుకున్నట్లుగా మన జీవితం కొనసాగదనీ తెలిసినప్పుడు, వాటిని ఇతరుల జీవితాలలో చూడడం అనవసరమని 'చింతకింది మల్లయ్యతో ముచ్చట' పెడితే తెలుస్తుంది. అబ్సర్డ్కథాకథనానికి 'రెండడుగుల నేల' గురించి చెప్పుకోవాలి. ఇందులో కొన్ని కథలు స్కెచ్ లాగా లేదా డాక్యుమెంటరీ కథనాలుగా వున్నాయనే మాట వినపడింది. అది నిజం కాదు. లాటిన్అమెరికన్కథకుడు 'బోర్హెస్' పద్ధతి అది. ఇది శిల్పపరంగా కొనసాగే వినూత్న ప్రక్రియ. టెక్నిక్గురించి తెలియనివారు ఇది కథ కాదు, స్కెచ్అని పొరపడే ప్రమాదముంది. ఇవి కథలు అయినా కాకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ఒక అద్భుతమైన రచనాశైలి పుస్తకం నిండా కమ్ముకుని వుంది. అది మనసు చివరిదాకా లాక్కెళ్ళి ఆసక్తిగా చదివింపజేస్తుంది. అదే పుస్తకం ప్రత్యేకత.

చింతకింది మల్లయ్య ముచ్చట్లు (ఇతర కథలు); రచన: పూడూరి రాజిరెడ్డి; పేజీలు: 154; వెల: 144; ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు. ప్రచురణ కర్త ఫోన్: 9848023384

(నవ తెలంగాణ పత్రిక సాహిత్యం పేజీ దర్వాజాలో మార్చి 5న వచ్చిన పరిచయం.)

-
కె.పి.అశోక్కుమార్


No comments:

Post a Comment