అల్లం శేషగిరిరావు(1934–2000) ‘చీకటి’ సంక్షిప్త రూపం ఇది. 1995లో అచ్చయింది. ఆయన ఒరిస్సాలో జన్మించాడు. రైల్వేలో పని చేశాడు. రెండు కథా సంకలనాలు ‘మంచి ముత్యాలు’, ‘అరణ్య ఘోష’ ప్రచురించాడు. నాకు నచ్చే కథకుల్లో అల్లం శేషగిరిరావు ఒకరు.
––––
మనిషిలోని వెలుగు చీకటి
బాతుల వేటకు బయల్దేరాడు కెప్టెన్ వర్మ. డబుల్ బేరల్ షాట్‌గన్ భుజానికి తగిలించుకుని హంటింగ్ సూట్లో బంగళా మెట్లు దిగాడు. వెంట పెంపుడు కుక్క సీజర్. తంపర వైపు నడుస్తున్నాడు. చుట్టూ చీకటి. చలి మంచు. పొల్లాల్లో నక్కల మంద ఊళ. క్రాంక్... క్రాంక్... ఆకాశంలో బాతుల మంద.
అదే చీకట్లో, అదే తంపర వైపు పిట్టల వేటకు బయల్దేరాడు డిబిరిగాడు. వయసు అరవై దాటింది. గోచీ తప్ప మరేమీ లేదు. చేతిలో నాటు తుపాకి. భుజానికి పాత మురికి సంచి. అందులో ముసలి పెంపుడు కొంగ. సంచీలోంచి నాటుసారా తీసి డగ్‌డగ్‌మని గుటకేశాడు. బీడీ వెలిగించాడు.
తంపర ఒడ్డున మొగలి డొంకలో కూర్చున్న వర్మకు దూరంగా ఏదో దీపం కదులుతున్నట్టనిపించింది. అప్పుడే బాతుల మంద నీటి మీద వాలడానికి చక్కర్లు కొడుతోంది. చీకట్లో రెండు మెరుపులు ధన్ ధన్. తుపాకి నిప్పులు కక్కింది. ధప్ ధప్ మని మంటిముద్దల్లా చచ్చిన బాతులు. వాటిని నోట కరుచుకుని ఒడ్డుకు తెచ్చింది సీజర్. రిలాక్సింగ్‌గా సిగరెట్ వెలిగించి ముందుకు నడిచాడు వర్మ. దూరంగా డిబిరిగాడు చలి కాగుతున్నాడు. ‘దండాలు దొరా’.
‘నీది ఏ ఊరు?’
‘నక్కలోణ్ణి’
‘ఏ ఊరు?’
‘ఎక్కడుంటే అదే మా ఊరు’
‘ఈ రాత్రప్పుడు ఏం చేస్తున్నావు?’
‘ఏటకి వచ్చాను’ చెప్పాడు డిబిరి. దీపం ఎలుతుర్లో ఏట. బుర్ర మీద లాంతరుంటుంది. మనిషి నీళ్లల్లో ఉంటాడు. లాంతరు లైటుకి పిట్టలు ఎగిరొచ్చి వాల్తాయి. వాలగానే గబుక్కున లాగేయాలి. పక్క పిట్ట కూడా పోల్చుకోకూడదు. చిన్నప్పుడు వాళ్ల బాబు దగ్గర నేర్చుకున్నాడు.
‘పిట్టలు దొరికాయా?’
‘రెండు మూడు దీపం ఎలుతుర్లో చెక్కర్లు కొట్టాయి. నువ్వు దూరంగా తుపాకి పేల్చావు. ఆ శబ్దానికి పారిపోయాయి. మరి దిగవు’. అర్థం కాకుండా నవ్వాడు డిబిరి. నీ ఏటతో నా ఏటకి దెబ్బకొట్టేశావనే నిస్పృహ. వర్మ మనసు చివుక్కుమంది.
నాటుసారా తీసి గడగడా తాగేశాడు డిబిరి. ఎర్రటి కళ్లు. లస్క్ ఠపక్ లస్క్ ఠపక్. మందు ఎక్కువైందనుకున్నాడు వర్మ. దూరంగా పెంపుడు కొంగ సైతాన్ పట్టినట్టు దగ్గింది. వెళ్లి వలను తెచ్చాడు. డిబిరి సంచీ పక్కనే నాటు తుపాకి. దాన్ని చేతిలోకి తీసుకుంటూ సిగరెట్ ఇచ్చాడు వర్మ.
‘సారూ అది మర్డరీ తుపాకి’.
వర్మకు షాక్ కొట్టినట్లయింది. వెనక్కిచ్చేశాడు.
‘ఈ కొంగను పెంచుతున్నావా?’
ఏ జాతి పిట్టల్ని పట్టుకోవాలంటే ఆ జాతి పిట్టను మచ్చిక చేసుకోవాలి. వల మీద దీన్ని ఉంచాలి. దీన్ని చూసి అక్కడ కూడా మేతుందని నత్తగొట్లు వాలి చిక్కడిపోతాయి. కానీ దీనియమ్మ దీని అరుపులకే అవి దిగకుండా పారిపోతున్నాయని ఒక్క బాదు బాదాడు డిబిరి. అది కేర్‌మంది.
‘ఇది ఎగిరిపోదా?’
దానికి చూపులేదు. కంటిరెప్పల్ని దారంతో కుట్టేశాడు. దాని మందను చూసిందా ఎగిరిపోతుంది. చూపులేని పిట్టతో చూపున్న పిట్టల్ని వలేసి పట్టుకోవడం ఈ వేటలో తమాషా. డిబిరిగాడి హంటింగ్ టాక్టిక్స్‌కు అబ్బురపడ్డాడు వర్మ.
‘నత్తగొట్లు రాత్రిళ్లు రావుకదా? రాత్రి వలేశావు?’
‘గానీ సారూ తుంగ గుబుర్లలో గూళ్లు కట్టుకున్న కొండకోళ్లు, దాసరికోళ్లు చీకట్లో కానుకోలేక వలలో చిక్కడిపోతాయి. పరదలు కూడా ఈ అరుపుకి అప్పుడప్పుడు దిగిపోతాయి. గానీ దొరా ఇందాక నువ్వు పరదల మందని బెదరగొట్టేశావు’.
‘నేనా?’
‘నువ్వు అరప దిగి అగ్గిపుల్ల గీసి సిగరెట్టు ఎలిగించలేదూ?’
అగ్గిపుల్ల వెలుగులో వర్మ తుపాకి గొట్టాలు జిగేల్‌మన్నాయి. ఆ మెరుపుకి దిగబోతున్న పరదల మంద బెదిరి వెనక్కి తిరిగింది.
‘ఇది మర్డర్ తుపాకీ అన్నావుకదా ఇందాక... మర్డర్ చేశావా?’
గారబట్టిన పళ్లతో గుసగుస నవ్వాడు డిబిరి. ‘నేను కాదు నా బాబు. ఈ తుపాకీతో ఒకే దెబ్బకి ఒకణ్ణి ఖూనీ చేశాడు’. డిబిరి పెదాలు ఆవేశంగా కదులుతున్నాయి. చూపులు గతాన్ని చూస్తున్నాయి.
‘సాలాకాలం క్రిందట... అప్పుడు తెల్లదొరలుండేవోళ్లు. నేను చిన్నోడ్ని. ఒకరోజు ఏటకెళ్లిన మా బాబు చీకటి పడ్డా ఇంటికి రాలేదు. ఇంతలో పక్కనున్న మావోడు వచ్చి, ‘ఏట్రా డిబిరిగా! నీ బాబుని నిన్నటినుంచి పోలీస్ స్టేషన్లో కుళ్లబొడిచేస్తున్నారు’ అన్నాడు.
‘ఎందుకూ?’
‘దొంగతనం చేశాడట. షావుకారి ఇంట్లో బంగారం పోయిందట’.
కంగారెత్తిపోయి పరుగెత్తాడు. బాబాను రెండు చేతులూ చాచి కట్టేసి దూలానికి వేలాడదీశారు. కాళ్లు కట్టేసున్నాయి. గోచీ తప్ప వంటి మీద గుడ్డ లేదు. దబ్ ఫట్... వంటì æనిండా లాఠీ దెబ్బలు. చర్మం చిట్లి రక్తం ముద్ద కట్టేసింది. గావుకేకలు. కాళ్లు తన్నుకోలేక గింజుకుంటున్నాడు.
‘చెప్పరా బంగారం ఎక్కడ దాచావో’
కొడుకును కొడితేనన్నా చెబుతాడేమోనని పసివాడి బుర్రను గోడకేసి కొట్టారు. బాబోయ్ అమ్మోయ్... దెబ్బకి రాత్రి తిన్నది కక్కుకున్నాడు.
‘ఆడ్ని ఒదిలెయ్యండి. నేను నిజం చెబుతాను’. పోలీసులు నవ్వుకున్నారు.
బంగారం దాచిన చోటు తెల్లారి చూపాలని ఆదేశిస్తూ, ఒక పోలీసును వెంట పంపారు. వెళ్లాక, ‘బాబూ, నువ్వు దొంగతనం చేశావా?’ అడిగాడు డిబిరి. జుట్టు నిమిరి, కొడుకును పడుకొమ్మన్నాడు.
తెల్లారి తుపాకీ అందుకున్నాడు. మెరుపు వేగంతో థూమ్. పోలీసు ఎగిరిపడ్డాడు. ‘దొరా! నిన్న నేను దొంగతనం చేశానని ఒప్పించారే అది పచ్చి అబద్ధం. నేను దొంగతనం చేయలేదు. ఖూనీ చేశాను’. పోలీస్ ఇన్‌స్పెక్టర్ ముందు లొంగిపోయాడు. జైలుకి తీసుకెళ్లిపోయారు. పిల్లాడినే కోర్టులో సాక్షిగా వేశారు. నిజం చెప్పాలని బెదిరించారు. అబద్ధం మాత్రం ఎందుకు ఆడతాడు?
‘బాగా ఏట చెయ్యి బాగా తిను’ అని చెప్పాడు తండ్రి డిబిరికి. అప్పుడే దెబ్బలకు తట్టుకోగలవన్నాడు. మనవి దెబ్బలు తినే బతుకులన్నాడు.
తర్వాత అతడిని ఇంకేదో పెద్ద జైలుకు మార్చారు. చాలా రోజులైంది. ఒకరోజు డిబిరి ఉడుము మాంసం వంతులేసి అమ్ముతున్నాడు. ఒక కానిస్టేబుల్ వచ్చి, ‘ఓరీ ఇక్కడున్నావట్రా. నీ చెట్టు దగ్గర చూశాను. రేపు పొద్దుట నీ బాబుకు సెంట్రల్ జైలులో ఉరి తీస్తారట. కావాలంటే వెళ్లి చూసుకో’ అన్నాడు.
ఉరి... ఒళ్లు గజగజలాడిపోయింది. పెద జైలు చాలా దూరం. ఎలా వెళ్లాలో తెలీదు. ఉడుం మాంసం అమ్మిన పైసలు చాలవు. దాంతో అడుక్కున్నాడు. చేతులు చాచి. మా బాబుకు ఇలాగైందని చెప్పి. ఖూనీకోరు కొడుకని ఎగతాళి చేశారు. ఇక పరుగెత్తడం మొదలుపెట్టాడు. ఎండకీ, ఆకలికీ ఓర్చుకుంటూ, చీకటినీ, వర్షాన్నీ లెక్కచేయకుండా... ఉరుకు పరుగు నడక ఆయాసం ఆకలి... వచ్చిందా? ఇంకాదూరం. మళ్లీ నడక. పరుగు. అదిగో జైలు. ‘ఏం కావాల్రా గుంట నాకొడకా’ విసుక్కున్నాడు వార్డెన్.
‘నా బాబుకి ఈ రోజు ఉరిసిచ్చని కబురెట్టారు’
వార్డెన్ వాడి కళ్లలోకి చూశాడు. ఇంత ఆలస్యమైందేంటి? తెల్లవారుజామునే ఉరి తీసేశారు!
సచ్చిపోయాడా? నా బాబు సచ్చిపోయాడా? ఒళ్లు గజగజ వణికింది.
వార్డెన్ విస్తరాకులో రెండు జొన్నరొట్టెలు ఇచ్చి తినమన్నాడు. వాళ్ల బాబు చివరి కోరిక ఈ జొన్నరొట్టెలు. ఉరితీసేముందు, ‘బాబూ నా కొడుకు ఇంకా రాలేదూ? రాలేదుగానీ వస్తాడు. రాత్రంతా కడుపు నకనకలాడిపోతూ పరుగెత్తుకుంటూ వస్తాడు. వాడికియ్యండి బాబూ’ అన్నాడు.
బాబు శవాన్ని పాతిపెట్టిన చోటే కూర్చుని ఆ రొట్టెలు తిన్నాడు డిబిరి.
’ ’ ’
గతం పూర్తయ్యేసరికి తూర్పు ఆకాశం మీద వెలుగు. నత్తగొట్టు ఇక వేటకు పనికిరాదని చాకుతో మెడ సఫా చేశాడు డిబిరి. పెంచుకున్న కొంగను చంపడం వర్మకు పాపం అనిపించింది. అమానవీయం. తుపాకీతో కాల్చడానికీ చాకుతో కోయడానికీ మధ్య తేడా ఏమిటన్నాడు డిబిరి. కోడిని పెంచి కోసుకుని తినవా సారూ? ‘ఈరోజు నేను దీనినే తిని పొట్టనింపుకోవాలా! లేదంటే ఆకలితో సవ్వాలా!’ ఏది పాపం? భుజానికి సంచీ తగిలించుకున్నాడు డిబిరి. అప్పటికే వర్షం మొదలవుతోంది. అలాగే నిల్చుండిపోయాడు వర్మ.
(సాక్షి సాహిత్యం; మార్చ్ 12, 2018)
No comments:
Post a Comment