Tuesday, November 19, 2024

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథ ‘ఏస్‌ రన్నర్‌’


పెద్దిభొట్ల సుబ్బరామయ్య


పెద్దిభొట్ల సుబ్బరామయ్య (1938–2018) కథ ‘ఏస్‌ రన్నర్‌’కు సంక్షిప్త రూపం ఇది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన కథకుడు సుబ్బరామయ్య. ఇంగువ, నీళ్లు, పూర్ణాహుతి లాంటివి ఆయనకు బాగా పేరు తెచ్చాయి.

––––

డైలీ దౌడ్‌


ఎవరో కుర్రవాడు రన్నింగ్‌ రేస్‌ చేస్తున్నవాడిలా పేవ్‌మెంట్‌ మీద బాణంలాగా పరుగెత్తిపోతున్నాడు. రామచంద్రమూర్తి ఒక్క క్షణం ఆగి వెనుదిరిగి చూస్తూ నిలబడ్డాడు. అంతలోనే ఆ కుర్రవాడు కనుచూపుమేర దాటిపోయాడు. వేగంగా పరుగెత్తుతున్న వారెవరిని చూచినా అతడు అలాగే నిలబడిపోతాడు. తర్వాత నవ్వుకుంటాడు.

అతడు మళ్లీ నడవడం ప్రారంభించాడు. మరొక ఫర్లాంగు దూరం నడిస్తే కానీ బస్సు స్టాపు చేరుకోలేడు. ఎంత పెందలాడి యింట్లో నుంచి బయలుదేరితే తప్ప బస్సు అంది ఆఫీసుకు చేరుకోవడం కష్టం. అప్పటికి సీతమ్మ ఎంతో పెందలకడనే– నిద్రలేచి పనులు ప్రారంభిస్తుంది. అవి సర్దుకొని, యివి సర్దుకొని వంటకు ఉపక్రమించి ఎంత ఉరుకులు పరుగుతు పెడుతూ చెమటలు కక్కుతూ పనిచేసినా తొమ్మిది గంటల లోపున వంట తయారు కాదు. నాలుగు మెతుకులు నోట వేసుకుని తాను తయారయ్యేసరికి తొమ్మిదిన్నర అవుతుంది. ఎంత వేగంగా నడిచినా బస్‌స్టాపుకు చేరుకునే సరికి మరొక పావుగంట. ఆ తర్వాత బస్సు కోసం పడిగాపులు పడి ఉండాలి. ఎంతకూ తనెక్కవలసిన బస్సు రాదు. పోనీ ఓపిక చేసుకుని నడిచిపోదామా అంటే ఆఫీసు దగ్గరా దాపూ కాదు. అయిదు కిలోమీటర్ల దూరంలో ఊరికి అవతలి వైపున ఉంటుంది.

‘పోనీ ఆఫీసుకు దగ్గర్లో ఏదైనా యిల్లు చూసుకోరాదూ?’ అన్నారు చాలామంది. కానీ అక్కడి అద్దెలు తాను భరించలేడు. ఆఫీసులో కొందరు జల్సారాయుళ్లు ఉన్నారు. కొత్త కరెన్సీ నోటుల్లా పెళపెళ లాడుతుంటారు. కానీ వారి సీట్లు అటువంటివి.

తన సీటు అటువంటిది కాదు. చాకిరీకి మాత్రం ఏమీ తక్కువ ఉండదు. టన్నుల కొద్దీ ఫైళ్లు పేరుకుపోతుంటాయి. ఫలితం మాత్రం నెల తిరిగేసరికి వచ్చే ఆ జీతపు రాళ్లే. అందులో బోలెడన్ని కట్లూ, కత్తిరింపులూ.

అతడు కోటు వేసుకుంటాడు. ‘మీకేమండీ కోటు తొడుక్కుంటారు దర్జాగా’ అంటారు కొందరు. వారికి తెలియదు తన లోపలి చొక్కాలోని ఎన్ని చిరుగులను బయటికి కనబడకుండా ఆ కోటు కప్పుతున్నదో!

ఎండ చిటచిట లాడుతున్నది. రామచంద్రమూర్తి నుదుట పట్టిన చెమటను అరచేత్తో తుడుచుకుంటూ వీధి చివరకు కళ్లు చికిలించి చూశాడు. ఏదో బస్సు వస్తున్నది. నంబరు సరిగా కనిపించడం లేదు. చత్వారం వస్తున్నదేమో! ఎస్సెల్సీ రిజిస్టరులో ఉన్న తన పుట్టిన తేదీ నిజమే అయితే తనకిప్పుడు నలభై ఎనిమిది వెళ్లి రెండు నెలలయింది. ఇంకా ఏడేళ్లు సర్వీసున్నది. బస్సు దగ్గరికి వచ్చాకకానీ నంబరు సరిగా కనిపించలేదు. అది తన బస్సు కాదు. రామచంద్రమూర్తి ఆలోచిస్తూ నిలబడ్డాడు. తాను ఆఫీసుకు నడిచిపోతే ఎంతసేపటిలో పోగలడు? వేగంగా నడవగలిగితే గంట. పరుగెత్తి పోతే? ఇప్పుడు తాను పరుగెత్తగలడా? ఒకప్పుడు పరుగెత్తాడు. తమ జిల్లా పేరు నిలబెట్టాడని విపరీతంగా మెచ్చుకున్నారు. ఫొటోలు తీశారు, దండలు వేశారు.

తానప్పుడు రోజూ పరుగెత్తేవాడు. మైళ్ల కొద్దీ దూరం అతని సన్నని కాళ్ల క్రింద తరిగిపోయేది. ఆ కండరాలకు అలుపు తెలిసేది కాదు. ఇంతకాలం తరువాత పరుగెత్తగలడా?

పక్కనే నిలబడి ఉన్న వ్యక్తిని ‘‘ఏమండీ! టైమెంత అయింది?’’ అని అడిగాడు. కొంచెం విసుగుతో చేతి గడియారం వంక చూసి ‘‘నైన్‌ ఫిఫ్టీ’’ అని సమాధానం చెప్పాడు. 

బాప్‌రే. తాను పదిగంటలకల్లా సీటులో ఉండాలి. లేకపోతే ఆ కొత్త ఆఫీసరు అగ్గిరాముడై పోతాడు. అసలా మనిషి ముఖం చూస్తేనే అదొక రకంగా ఉంటుంది. మెడ అంతా కొవ్వుపట్టి ఉంటుంది. ఎవరి వంకైనా చూడదలుచుకుంటే మెడ ఒక్కటీ తిప్పి చూడలేడు. మొత్తం శరీరమే గిర్రున తిరగవలిసి ఉంటుంది.

ఇప్పుడు పది దాటుతున్నది కదా? ఈ బస్సు ఎప్పుడే వచ్చేట్టు? తానెలా ఎక్కేట్టు? ఎన్ని గంటలకు ఆఫీసుకు చేరుకునేట్టు? ఆఫీసరుకు ఏమి సంజాయిషీ ఇచ్చుకునేట్టు?

అదుగో బస్సు. ఇంతకాలానికి దాని దర్శనమైంది. రామచంద్రమూర్తి కమ్మీ పట్టుకుని వదల్లేదు. దిగేవారు దిగగానే లోపలికి దూసుకుపోయాడు. బస్సెక్కడం అనే విద్యలో ఈ మాత్రపు ప్రాథమిక అనుభవమైనా లేకపోతే– ఆ సూట్‌వాలాలాగా పేవ్‌మెంట్‌ మీదనే గంటలు తరబడి నిలబడిపోక తప్పదు. సోదరా! దూసుకుపోయేవాడిదే రాజ్యం. లేకపోతే నీ సంగతి అంతే. 

రామచంద్రమూర్తి కళ్లముందు యెప్పటిదో దృశ్యం కనిపించింది. మరీ చిన్నప్పుడు తమ ఊరికి నాలుగు మైళ్ల దూరంలో ఉన్న చిన్న పట్నంలో స్కూలు చదువు. పొద్దున్నే లేచి చద్దన్నం తిని పుస్తకాల సంచీ భుజానికి తగిలించుకుని నడక ప్రారంభించేవాడు. సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు మరీ హుషారుగా ఉండేది. నాలుగు మైళ్లు పరుగెత్తుకుంటూ తిరిగి వచ్చేవాడు. ఆ విధంగా రన్నింగ్‌ అలవాటయింది. స్కూల్‌ పోటీలలో తానే ప్రథముడు. దాంతో ఇంకా అభిరుచి పెరిగింది. ఎక్కడికి వెళ్లినా పరుగెత్తుతూ వెళ్లడమే. 

బస్సు ఆగింది. రామచంద్రమూర్తి ఇద్దరు వ్యక్తులను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసి మళ్లీ కిందికి దిగాడు. టైమ్‌ కనుక్కున్నాడు. గుండె గతుక్కుమన్నది. మళ్లీ నడక. మరో అర ఫర్లాంగు దూరం. ఎండ నియంత పరిపాలనలా భయంకరంగా ఉంది.

ఆ రోజు... అంతర్‌ జిల్లా ఎథ్లెటిక్స్‌ ముగింపు రోజు. రన్నింగ్‌ ఫైనల్స్‌. ట్రాక్‌ అంతా శుభ్రంగా ఉంది. మొత్తం పద్దెనిమిది మంది. మెత్తని ప్రేలుడు వినిపించగానే ముందుకు దూకాడు. కళ్లముందు ట్రాక్‌ తప్ప మనుషులు కనిపించలేదు. గుండెకు తగిలిన పలుచని దారం తెగిన తర్వాత కొద్ది గజాల దూరం పరుగెత్తిపోయి పచ్చికలో కూలబడిపోయాడు. జనం మూగారు. పైకెత్తి గాలిలోకి ఎగరవేశారు. కలెక్టరు తనకు ట్రోఫీ బహూకరిస్తున్నప్పుడు కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశం అంతా మార్మోగిపోయింది. ‘ద ఫాస్టెస్ట్‌ రన్నర్‌ ఆఫ్‌ ద స్టేట్‌’ అని సావనీర్‌లో ఫొటో కింద వ్రాశారు.

రామచంద్రమూర్తి ఆఫీసు మెట్లెక్కుతున్నాడు. ఆయాసంతో వగరుస్తున్నాడు. ఆ ట్రోఫీ ఇంకా తనదగ్గరే ఉంది. దాన్ని ఇతర చిన్న చిన్న కప్పులూ దాచేందుకు తన దగ్గర అద్దాల బీరువాలు లేవు. కొన్ని అసలైన వెండికప్పులు డబ్బు అవసరం వచ్చినప్పుడు వాటికి కాళ్లొచ్చి వెండి దుకాణాల్లోకి వెళ్లిపోయాయి.

స్ప్రింగు డోరు తెరుచుకుని లోపల అడుగు పెట్టేసరికి అయ్యగారు పేపరు చదువుతున్నారు. శబ్దం విని కుర్చీ మొత్తం పక్కకు తిప్పి గడియారం వంక చూసి మొహాన గంటు పెట్టుకుని పేపరు బల్లమీద పడేసి ‘‘ఊ’’ అన్నాడు. రామచంద్రమూర్తి రిజిస్టరు అందుకోబోతూ ఉంటే ‘‘కాస్సేపాగండి– ఎలాగూ పన్నెండు అవుతుంది. ఈ పూటకు లీవు పెట్టేద్దురుగాని’’ అన్నాడు. ‘‘లీవు వుందా? అంతా వాడేసుకున్నారా?’’

రామచంద్రమూర్తి రిజిస్టరు మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకుని ‘‘ఉందనే అనుకుంటానండి’’ అన్నాడు.

‘‘గూడ్‌. అది సరేనండీ. మీరెన్నింటికి బయలుదేరుతారు ఇంటినుంచి?’’

‘‘బస్సులతో బాగా ఇబ్బందిగా ఉందండి. ఆపరు, ఎక్కించుకోరు’’

‘‘గూడ్‌. కాబట్టి మనకు బస్సు సరిపడదని అర్థం– అంతేనా?’’

రామచంద్రమూర్తి తల వంచుకున్నాడు.

‘‘బస్సు మీద వస్తే లాభం లేదని తెలిశాక మీరు వేరే వసతి చూసుకోవాలి. మరో మీన్స్‌ ఆఫ్‌ కన్వేయన్స్‌. పోనీ ఒక స్కూటరు కొనుక్కోగూడదూ?’’

రామచంద్రమూర్తి నవ్వేందుకు ప్రయత్నించాడు. ‘‘డబ్బు కావాలి కదండీ’’ అన్నాడు.

‘‘గూడ్‌– డబ్బులేదు కాబట్టి కారు, స్కూటరు వగైరాలు వీల్లేదు. ఆగవు, ఎక్కించుకోవు కాబట్టి బస్సు వీల్లేదు. మరి కొంచెం ముందుగా యింటిదగ్గర బయలుదేరితే?’’

‘‘అప్పటికి యింట్లో వంటకాదండి’’

‘‘ఓహో అదొకటా? కాబట్టి అదీ వీలులేదు. ముందు లీవ్‌ లెటరు రాయండి. ఈ లోపల నేను ఉపాయం ఆలోచిస్తాను’’

లీవ్‌ వ్రాస్తున్నంతసేపూ ఆఫీసరు రామచంద్రమూర్తి వంక తమాషాగా చూస్తూ కూర్చున్నాడు. ‘‘ఆ ఉపాయం తట్టింది. అది బెస్టు’’.

‘‘చెప్పండి సార్‌’’

‘‘తొమ్మిదింటికి ఇంట్లోనుంచి బయటికి రండి– వెంటనే పరుగు ప్రారంభించండి. ఎక్కడా ఆగకండి. అరగంటలో ఆఫీసులో ఉంటారు. పైగా వొంటికి ఎంతో మంచిది. ఏమంటారు?’’ ఈ మాటలని అతడు నవ్వడం ప్రారంభించాడు.

రామచంద్రమూర్తి మొహం జేవురించింది. మనిషి నిలువెల్లా ఊగిపోయాడు. ‘‘మీ ధోరణి మీ హోదాకు తగినట్టు లేదు. అయామ్‌ సారీ. రియల్లీ సారీ. అన్నట్టు మీకు తెలియదేమో. పరుగెత్తమని సలహా ఇచ్చారు. ఐ వజ్‌ ఎ ఫేమస్‌ రన్నర్‌ వన్స్‌’’ అని స్ప్రింగ్‌ డోర్‌ మూసి యివతలికి వచ్చాడు.

’ ’ ’

ఆ సాయంకాలం ఆఫీసు నుంచి బయటపడి రామచంద్రమూర్తి నుదురు చేత్తో రుద్దుకున్నాడు. చల్లనిగాలి వీస్తున్నది. వేగంగా నడవడం ప్రారంభించాడు. ఈ ప్రాంతంలో పెద్ద ఆవరణ ఉంది. కొందరు యువకులు రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూవుంటారు. అతనికి పరుగెత్తాలని సరదా పుట్టింది. ప్యాంట్‌ కొంచెం పైకి మడిచాడు. కోటు చేతులు పైకి మడిచాడు. ‘‘రన్‌ రన్‌’’ అనుకున్నాడు. అలా తమ వీధికి చేరుకునేవరకూ పరుగెత్తుతూనే ఉన్నాడు.

ఆయాసంతో వగర్చుతూ యింటికి వచ్చిపడ్డాడు. మంచం మీద కూలబడిపోయాడు. సీతమ్మ ఆదుర్దాగా ‘‘ఏమిటండీ’’ అంటూ వచ్చింది. ఆయాసంలోనే ‘‘మంచినీళ్లు... వద్దు కాఫీ’’ అన్నాడు. ఆమె లోపలికి వెళ్లింది. అతడు కాళ్లు చాపి మంచంలో వెల్లకిలా పడుకున్నాడు. అయిదు నిమిషాల తర్వాత వచ్చి చూసి ఆమె అదిరిపడింది. భయంతో పరుగెత్తుతూ వెళ్లి దగ్గర్లోనే ఉన్న డాక్టరును పిలుచుకొచ్చింది. ఆయన పరీక్ష చేసి ‘‘చిన్న పెరాలసిస్‌ స్ట్రోక్, అదే పక్షవాతం. కుడి కాలూ చెయ్యీ పడిపోయాయి. విశ్రాంతిగా పడుకోనివ్వండి. నేను మళ్లీ వచ్చి చూస్తాను. ప్రాణభయం ఏమీలేదు’’ అని చెప్పి వెళ్లిపోయాడు.

రామచంద్రమూర్తి కళ్లలో నీళ్లు ఉబికి వచ్చి బుగ్గల మీదుగా కిందికి జారుతున్నాయి.

‘‘రన్‌... రన్‌ మై డియర్‌ బాయ్‌ రన్‌...’’


(సాక్షి సాహిత్యం; జూన్‌ 18, 2018)


 

No comments:

Post a Comment