మహేంద్ర కథ ‘అతడి పేరు మనిషి’కి సంక్షిప్త రూపం ఇది. 1983లో అచ్చయింది. హఠాత్తుగా జబ్బుపడి, 39 ఏళ్లకే మరణించిన మహేంద్ర(16 జూలై 1959 – 12 జూన్ 1998) కవి, చిత్రకారుడు కూడా. ‘స్వర్ణసీమకు స్వాగతం’ నవలిక రాశాడు. ఆయన మరణానంతరం ‘కనిపించని కోయిల’ కథా సంకలనాన్నీ, ‘పర్వ వేలా తరంగాలు’ కవితా సంకలనాన్నీ ఆయన అన్న, కథకుడు మధురాంతకం నరేంద్ర వెలువరించారు.
–––––
అతడి పేరు మనిషి
వర్షం అవిరామంగా కురుస్తోంది. మహల్ గ్రామం చుట్టూ వున్న కొండలపై మబ్బులు బద్దకంగా దొర్లిపోతున్నాయి.
‘‘ఏమైనా నువ్వు యిలా వొంటరిగా వచ్చేయడం ఏం సబబుగా లేదు తల్లీ. నీ అదృష్టం బాగుండి కారు చిత్తూరు దగ్గర ఆగిపోబట్టి రాత్రి ఏ హోటల్లోనో ఆగి సురక్షితంగా రాగలిగావు యిదే ఏ రిమోట్ ప్లేస్‌లోనో జరిగుంటే ఏమయ్యేదో నీకర్థం కాదు’’ ఉదయం నుంచీ మాధవి, సుధనలా మందలించడం ఎనిమిదోసారి.
‘‘జరిగినదానికి తానూ బాధపడుతోంది కదవే, వదిలెయ్’’ అక్కను విసుక్కున్నాడు కృష్ణమూర్తి.
సుధ మరీ డల్ అయిపోవడం గమనించిన మాధవి పాతభవంతి నుంచి పనిమనిషి చేత టిఫనూ, కాఫీలు తెప్పించింది.
ఇంతలో గేటు దగ్గరెవరో తారాడుతుండడం గమనించి ముందుకు నడిచాడు కృష్ణమూర్తి. ఆ ఆగంతకుడెవరో వచ్చి వరండా మెట్ల మీదే నిలుచున్నాడు. సుధ నిర్ఘాంతపోయింది. వర్షంలో ఎంతగా తడవొచ్చునో అంతగానూ తడిసి వున్నాడతను.
‘‘రాత్తిరి బిత్తరంలో దీన్ని మరిసిపొయ్యినారు, బంగారపు వస్తువుగద! తొందరపడతావుంటారని మద్దానమే బయల్దేరినా మద్దిన ఈ వాన మల్లా పనిపాటు చేసింది’’ తన చేతిలోని బంగారుగొలుసును సుధ చేతికిస్తూ ఆలస్యానికి సంజాయిషీ యిచ్చుకుంటున్నట్టుగా అన్నాడతను.
మాధవి అయోమయంగా సుధకేసి చూసింది. ‘‘వస్తున్నప్పుడు కారు ట్రబులిచ్చిందని చెప్పానుగా. అప్పుడు యితనూ యింకా కొందరూ వెనుకనుంచీ త్రోసారు. అప్పుడు పడిపొయ్యుంటుంది’’ తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ అంది సుధ. ఏదో పనివున్నదానికి మల్లే లోపలకెళ్లి కాట్ మీద బోర్లాపడింది. ‘అసలేం జరిగిందని కృష్ణమూర్తి అతణ్ని అడిగేస్తాడు. హోటల్లో ఆగిపోయినట్టు కల్పించి చెప్పినదంతా అబద్ధమని తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత తల ఎత్తి మాట్లాడగలదా? ఐనా యితడిలా దాపురిస్తాడని తానేం కలగందా? పేద్ద నిజాయితీపరుడిలా పట్టుకొచ్చాడు.’ గడిచిన భయంకరమైన రాత్రి గుర్తుకు వచ్చింది.
’ ’ ’
ఆకాశం పగిలినట్టు కుండపోతగా వర్షం. ఏడుగంటలే అయినా అర్ధరాత్రిలా ఉంది. చిత్తూరు నుంచీ మహలుకెళ్లే రోడ్డుమీద హెడ్‌లైట్స్ వేస్తున్న వెలుతురు మరక ఆధారంగా కారు దూసుకుపోతూంది. అరగంటలో మహల్లో వుంటానన్న నమ్మకం వొక్కటే సుధకు ధైర్యం యిస్తోంది.
ఆమె భయాందోళనలకు పతాక ఘట్టంలా కారు రోడ్డుకడ్డం పడివున్న తాటిచెట్టును ఢీకొని నిలిచిపోయింది. ఏడవడానికి కూడా నోరు పెగలడం లేదు. ఇంతలో ఓ మెరుపు మెరిసింది. ఆ వెలుగులో పక్కనున్న మిట్టమీద ఒక గుడిసె కన్పించింది.
అయిదారు నిమిషాల విచికిత్స అనంతరం తెగింపు తెచ్చుకుని కారు లాక్ చేసి, సెనగ చేలు కడ్డంగా నడిచి గుడిసె చేరుకుంది. కొత్తమనిషిని గుర్తు పట్టినట్టు దొడ్డిలోని మేకలు అరిచాయి.
గడపకు కొంచెం అటువైపుగా నులకమంచం మీద పడుకున్న మనిషి కన్పించాడు బోర్లా పడుకుని. నేలమీద పెట్టిన గోధుమరంగు పుస్తకం జూసి చూరుకు వ్రేలాడుతున్న లాంతరు వెలుగులో ఏదో పద్యాల్ని కాబోలు కూనిరాగంతో చదువుకుంటున్నాడు.
వణుకుతూ యింట్లోకి జొరబడింది సుధ. అతడు లేచి నిలుచున్నాడు. ఇరవైకి మించని వయసు. నల్లటి శరీరం. వుంగరాల జుత్తు.
‘‘కారు నిలిచిపోయింది’’ అప్పుడే మాటలు నేర్చిన పసిపిల్లలా అంది. అతడు రోడ్డుకేసి చూపు సారించాడు. కన్ను పొడుచుకున్నా కన్పించని చీకటి.
‘‘ఎక్కడినుంచి వొస్తావుండారు?’’
‘‘మెడ్రాసు. మహల్‌కెళ్లాలి మా మామగారింటికి’’.
‘‘పెసిడెంటు వాళ్లింటికా?’’ వచ్చిన మనిషెవరో అర్థంగావడంతో అతడు మంచం మీద దుప్పటి దులిపివేశాడు.
‘‘కూచోండి. వొరసం ఈ రాత్తరికి తగ్గేట్టు లేదు. దూరం పయానాలకు బొయ్యేటప్పుడు అడమనిషి వొంటిగా వొచ్చుండగూడదు.’’
సుధ ఇంకా ద్వారం వద్దనే నిలబడి చీర కుచ్చిళ్లను, పమిటను పిండుకోసాగింది.
‘‘పెట్లో మా ఆడోళ్ల కోకలుండాయి. మీ గుడ్డలు ఆరేవరకూ అవి కట్టుకుందురా?’’ అని ప్రశ్నార్థకంగా జూసి, చెక్కపెట్టి మీదినుంచీ ట్రంకును దించి వున్నవాటిలో మంచి చీరను తీసి ఆమెకిచ్చాడు. సుధ తటపటాయించడం చూసి, ‘‘ఈ తేమగుడ్డల్లో తెల్లారగట్ల నానితే రేపు మద్దానానికి జరం ఖాయం’’ ఆమెకు ఏకాంతం కల్పించడం కోసం కాబోలు, రావిఆకుల మోపును తీసుకుని మేకల దొడ్డిలోకి పోయాడు.
పొయ్యి ముట్టించి ఎసరు బెడ్తూ, ‘‘మేము మాలోళ్లము, మా యిండ్లలో మీరు భోజనం జేద్దురా’’ అని నవ్వుతూ ‘‘కారు నిల్సిపోంగా యిట్టొచ్చినారుగానీ– చెన్నపట్నం పుట్టిమునిగితే మటకు మీరు మా గడప దొక్కుతారా?’’
అతడు తనకంటే రెండు మూడేళ్లయినా చిన్నవాడుగా వుండొచ్చు. కానీ ఆ మాట్లాడుతున్న తీరు తనకన్నా యిరవై ముప్పై ఏళ్లు పెద్దవాడు మాట్లాడుతున్నట్టుగా ఉంది.
మరో పది నిమిషాల్లో వంట పూర్తి చేసి అతడు సుధను భోజనాని కాహ్వానించాడు. బాగా ఆకలయిందేమో గబగబా అన్నం ముగించింది. సొమ్మసిల్లినట్టుగా మంచం మీద వాలిపోయింది.
హఠాత్తుగా ఏ రాత్రివేళప్పుడో మెలకువ వచ్చింది. గుడిసె కప్పు ఈదురుగాలికి లేచిపోయేలా ఉంది. అతడు నేలమీద పడుకుని వున్నాడు. చిరుగుల చాప. కప్పుకోను దుప్పటి లేదు. నిద్ర పోతున్నాడా? నటిస్తున్నాడా? విద్యుద్ఘాతం తిన్నదానిలా గజగజ వణికిపోయింది. దుప్పటిని గొంతువరకూ లాక్కుంది. ‘అతడు తలుచుకుంటే యింకేమైనా వుందా? భగవంతుడా, నిరపాయకరంగా తెల్లారేట్టు చూడు.’
ఉదయం అతడు మరికొందరి సాయంతో చెట్టును అవతలికి లాగించేశాడు. అందరూ పది గజాలు తోయగానే కారు స్టార్టు అయింది. లాంఛనంగా కృతజ్ఞత చెప్పుతూ రెండు పది రూపాయల నోట్లను అతని చేతిలో కుక్కింది. అతడు వారిస్తూ ఏదో చెప్పబోయాడు. కారు స్టార్ట్ అయిన ఉత్సాహంలో ఆ మాటలను సరిగ్గా విన్పించుకున్నట్టు లేదు.
’ ’ ’
‘‘అతడు వెళ్లిపోయాడా?’’
‘‘మా మామయ్య కష్టపడి సంపాదించిన సొత్తు కాబట్టి మళ్లీ చేతికొచ్చింది. కృష్ణతో అతనికేమన్నా ఇచ్చి పంపమని చెప్పాను. భోజనం చేసి ముగ్గురమూ క్యారమ్స్ ఆడుకుందాం’’ అంటూ సుధ చేయి పట్టుకుని బంగళా నుంచి పాత భవంతిలోకి లాక్కుపోయింది మాధవి.
రాత్రి గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టిన తర్వాత వీధి తలుపు తెరుచుకుంది. కృష్ణమూర్తి ‘నాగయ్యా నాగయ్యా’ అని పిలుస్తూ వరండాలోకి వచ్చాడు. వెనుకనే వచ్చిన రాజమ్మ ‘నాగయ్య సందేళ కూతురింటికి పోయినాడయ్యా’ అంది. కృష్ణమూర్తి వీధిలైటు వేశాడు. వరండాలో మూల ఎవరో నిద్రపోతున్నారు. అతణ్ని లేపాడు. ‘ఏమయ్యా, నువ్వింకా మీ ఊరికి పోలేదా? వానలో అంతదూరం పోలేక పొయ్యుంటావు. నువ్విప్పుడు మల్లిమడుగు వెళ్లి– మునసామి తెల్సునా? అతడితో చెప్పి ప్రెసిడెంటు వాళ్లింట్లో ఎవర్నో తేలు కరిచిందని ఈడ్సుకురా’’ అన్నాడు.
‘‘తేలా? నాకు తెలవని తేలు వైద్దమా? కొత్తకోట పెద్ద చెంగయ్య మా నాయినే గదా. బాటరీ ఒకటి తేండి. మందాకు పెరుక్కొస్తా’’ అన్నాడు.
‘‘ఏ ఆకో, దొరుకుతుందా’’ అన్నాడు కృష్ణమూర్తి.
‘‘ఈడలేకపోతే మావూరికన్నా పొయ్యి పెరక్కరానా. అయిదు నిమిసాల్లో వస్తా సూడండి’’. వర్షంలో చీకట్లో కలిసిపోయాడు.
సుధ, మాధవి చేతిలో పడివుంది. కాళ్లూ చేతులూ చల్లబడ్డాయి. ‘ఏమని బయల్దేరిందో– అన్నీ గండాలే’.
మరో పది నిమిషాల్లో మందాకు కోసం పోయినవాడు తలుపులు త్రోసుకుని లోపలికొచ్చాడు. ఆకులు దంచి మందు తయారుచేసి సుధచేత మింగించాడు. కిరోసిన్ దీపంలో ఆకువాడ్చి కాలికి కట్టు కట్టాడు. పావు గంటకు సుధకు స్పృహ వచ్చింది.
రాజమ్మ కళ్లు తుడుచుకుంటూ ఆకులు దంచిన చోట శుభ్రం చేయసాగింది. ‘ఇదేదో కాగితం ఆకుల్తో బాటు దంచేసుండావు సూడు’. పెడనవ్వు నవ్వి వీధిలోకి గిరవాటేశాడు. రూపాయి నోట్లున్న జేబులోనే మందాకు కోసుకొచ్చాడు. నోట్లు కూడా ఆకుల్తో బాటే దంచబడ్డాయి!
సుధ దీనంగా అతడికేసి చూస్తూవుంది. ‘‘నాకేమైనా పెట్టాలనిపిస్తే ఇంత అన్నం పెట్టించండి. నిన్న పొద్దున తిన్న అన్నమే. ఈ వొరసం పున్నాన పగులంతా కోమిటోళ్ల సత్రంలో గొంతు కూసొనుంటి. రాత్తిరి మనింటికాడ ఎవురన్నా బయటికొస్తారేమోనని దీపాలు ఆర్పేదాకా సూస్తావుంటి. ఈ పొద్దు నాకూ నా మేకలకూ ఉపాసమే’’ అన్నాడు. చెళ్లుమని చెంపదెబ్బ కొట్టినట్టయింది సుధకు. అతడు యింత చేసినందుకు తానేం చేయగల్గింది?
రాజమ్మ అతని ముందు విస్తరి వేసి అన్నం పెడుతోంది. తలవాల్చుకుని బురద బురదగా వున్న అరుగుపై మిడికాళ్ల మీద కూచొని వున్నాడతను. అంతవరకూ దూరంగా పడుకున్న కుక్క అతని దగ్గరికొచ్చి తోకాడించసాగింది.
‘‘చివరకు కుక్కకు పడేసినట్లు నీకు యింత అన్నం పడేస్తున్నాం గదా’’ భోరున ఏడ్చేస్తూ సుధ అతణ్ని డైనింగ్ హాల్లోకి లాక్కుపోయింది.
(సాక్షి సాహిత్యం; 16 ఏప్రిల్ 2018)
No comments:
Post a Comment