నేను, అజయ్, మెహెర్
మెహెర్‌ను పరిచయం చేసిన పుస్తకం
మెహెర్ కొత్త పుస్తకం ‘పడి మునకలు’ బోధి ఫౌండేషన్ ద్వారా వెలువడింది. ఇంకే కామన్ గ్రౌండూ లేని మాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం అయ్యేలా చేసింది సాహిత్యమే. తను బ్లాగులో విరివిగా రాస్తున్న తొలి రోజుల్లో(2009) ప్రశంసించకుండా ఉండలేక ఒక కామెంట్ పెట్టాను. ఇది కూడా చెప్పుకోవాల్సిన విషయమా, అంటే, నేను మనుషుల పట్ల ఉదారంగా ఉంటాను గానీ, ఆ మనుషులు సాహిత్య జీవులైనప్పుడు వారిని ప్రశంసించడంలో నాకు చాలా పట్టింపులు ఉంటాయి. కాబట్టి నా ప్రశంసకు నాకు నేను చాలా విలువిచ్చుకుంటాను. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా రాయగలిగే వీలున్నప్పుడు, ఏదైనా రాసిపడేసి దాన్ని పలుచన చేయకుండా, ప్రధాన స్రవంతి పరిమితులను అధిగమించడం అనే స్పృహతో ‘ఏదైనా’ రాయగలిగే వీలును కల్పించుకున్నాడు మెహెర్. అలా తన రాతల్లో నేను కూడా ‘పడి మునకలు’ వేశాను. దీని సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే, అది మెహెర్ అంతటి రాత అయితే తప్ప ఇంకొకరిని మెచ్చుకోలేని స్థితి రావడం!
కథల కంటే ముందు మెహెర్ సాహిత్య వ్యాసాలే చదివాను. మెహెర్‌ను నాకు పరిచయం అయ్యేలా చేసిన తొలి వ్యాసాలు(‘దువ్వూరి స్వీయ చరిత్ర’, ‘‘కాఫ్కాయెస్క్’ని ఆవిష్కరించే ఒక వాక్యం’ లాంటివి) కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. తర్వాత కూడా రాసిన వ్యాసాలను కలుపుకొని(చివరివి 2022లో రాసినవి), వాటిల్లోంచి కొన్నింటిని వడగట్టుకుని, పద్ధతిగా కూర్చిన ఈ 200 పేజీల పుస్తకం వచ్చింది. ‘ఇంకేమనాలో తెలీక’ వీటిని వ్యాసాలు అనడమేగానీ– ఇవన్నీ ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రతిఫలనాలు, రీడింగ్ నోట్స్... పేరేదైనా ఇవన్నీ మెహెర్ సాహిత్య అవగాహనా విస్తృతిని తెలియజేస్తాయి. ఏ సీరియస్ సాహిత్య జీవి అయినా చదవాల్సిన పుస్తకం ఇది.
పీఎస్:
ఇవన్నీ నేను ఇంతకుముందు విడిగా చదివినవే. అయినా మళ్లీ మొదలుపెట్టాను. ‘పేదజనంలో దొస్తొయేవ్‌స్కీ కూడా ఒకడు’ వ్యాసంలో, ‘‘గదిలోకి అడుగుపెట్టగానే, ‘నాకు చప్పున రస్కోల్నికోవ్ ఉండే గది గుర్తొచ్చింది– అని తర్వాత రాసుకుంది’’ అని అనంతర కాలంలో భార్య అయి, దొస్తొయేవ్‌స్కీని అన్ని విధాలుగా కాచుకున్న అన్నా గ్రొగొర్‌యెవ్నాను ఉటంకించాడు మెహెర్. నాకెందుకో కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
(fb Post: 30th August 2023)
No comments:
Post a Comment