Monday, February 13, 2023

నా స్నేహితుడు అజయ్‌



నా స్నేహితుడు అజయ్‌


అజయ్‌తో నాకు పరిచయం, స్నేహం వేర్వేరు కాలేదు. మాది తొలిచూపు స్నేహం అనుకోవచ్చు. పన్నెండేళ్ల క్రితం ఉప్పల్‌లో ఒక చీకటి సాయంత్రం భగవంతం పరిచయం చేశాడు. ఆ మొదటిరోజు నుంచే తెలిసినట్టుగా మాట్లాడుకున్నాం. అంటే ఎక్కువ మాట్లాడేసుకున్నాం అని కాదు. ఎక్కువ మాట్లాడటం తెలియడానికి గుర్తు కాదు. ఏమీ మాట్లాడకపోయినా ఏ అసౌకర్యానికీ గురి కాకుండా ఉండటం! అలాంటి సౌకర్యం నాకు అజయ్‌ సాహచర్యంలో దొరుకుతుంది.

ఆ తర్వాత ఎన్నో ఖాళీ ఆదివారాలు ఎక్కడెక్కడో తిరిగాం. చూడవలసినదే చూడాలి అనే పట్టింపు ఇద్దరికీ లేకపోవడం వల్ల అతి మామూలు ప్రదేశాలు కూడా మాకు దర్శనీయ స్థలాలు అయ్యాయి. ‘బార్కాస్‌’లో ఏదో ఆఫ్రికా చాయ్‌ దొరుకుతుందంటే కూడా ఎగేసుకుని వెళ్లిపోతాం. అట్లాంటి ప్రయాణాలవి. పొద్దున్న బయలుదేరడం, ఏదో ఒక బస్సెక్కడం, సాయంత్రం తిరిగి ఊరి దాపులోకి వస్తున్నామనుకునే చోట ఆగి, కొంచెం చల్లగా సేదదీరడం... ఇంతే అజెండా! తర్వాత మాతో మెహెర్‌ కలిశాడు. అప్పట్నించీ ‘త్రీ ఎమిగోస్‌’ అయ్యాం.

అజయ్‌ నెమ్మదైన మనిషి. ఒక జీవిగా తన లోపల ఎన్నో ఆందోళనలు ఉన్నాయని తెలుసు. కానీ ఆ తాపీదనం మాత్రం మనిషి చేరవలసిన గమ్యంలా నాకు తోస్తుంది. ఇది అజయ్‌లో స్వభావరీత్యా ఎంతుందో గానీ, అందులో కొంతైనా సాధనతో ఆర్జించుకున్నదే అని నేననుకుంటాను. ఆందోళన, ఆతృత, లౌల్యాలు కలగలిసిన నాకు, నేను కోరుకునే నా భవిష్యత్‌ రూపంలా తోస్తాడు అజయ్‌. కళాకారుడిలో ఉండే సహజమైన ఆబను కూడా తను జయించినట్టే కనబడుతుంది. ఈ లక్షణాల వల్లే కావొచ్చు అజయ్‌ కథల్లో ఒక ‘ఊపు’, ‘కుదుపు’ కనబడవు; మంద్రంగా, ఇవి రాయకపోయినా నాకేం పోయేది లేదన్నట్టుగా ఉంటాయి. ఒక కళాకారుడు యోగి అయినప్పుడు మాత్రమే వచ్చే శైలి ఇది. అందుకే కొట్టొచ్చినట్టుగా ఆకర్షించవు; ముఖ్యంగా నెమ్మదితనపు శ్రేష్ఠత ఇంకా తెలిసిరానివాళ్లకు.

– పూడూరి రాజిరెడ్డి

జూలై 2022


(బి.అజయ్‌ ప్రసాద్‌ కొత్త కథల సంపుటి ‘గాలి పొరలు’ కోసం రాసిచ్చిన ఒక జనరల్‌ ఫ్రెండ్లీ నోట్‌ ఇది. ప్రచురణ: బోధి; 2022)

 

No comments:

Post a Comment