ఒంటరి సమూహం
సుమారు ఆరు దశాబ్దాలుగా అలుపెరగకుండా రాస్తున్న ‘అత్యంత ప్రాధాన్యం గల స్త్రీవాద రచయిత్రి’ ఆనీ ఎర్నౌను 2022 నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ఈ గౌరవం దక్కిన తొలి ఫ్రెంచ్ మహిళ ఆమె. ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారం పొందిన పదిహేడో మహిళ.
సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; అయినా కూడా మహిళలు, అణిచివేతకు గురైనవారి పోరాట గాథలను సజీవంగా ఉంచుతున్నానంటారు 82 ఏళ్ల ఆనీ ఎర్నౌ. శరీరం, లైంగికత; సాన్నిహిత్య సంబంధాలు; సామాజిక అసమానతలు; చదువు ద్వారా వర్గాన్ని మార్చుకునే ప్రయత్నం ఆమె రచనల్లో కనబడతాయి.
ఫ్రాన్స్‌లోని చిన్న పట్టణం నార్మండీలో వారి కుటుంబం నివసించింది. బతకడానికి నాకు పుస్తకాలు అక్కర్లేదని కరాఖండీగా చెప్పే తండ్రిని కలిగిన అతి సాధారణ నేపథ్యం. ఒక కెఫే యజమానిగా అలెగ్జాండర్ డ్యూమా, ఫ్లాబర్ట్, ఆల్బర్ట్ కామూ లాంటి రచయితలను చదవడం వల్ల తనకేం ఒరుగుతుందని ఆయన నిశ్చితాభిప్రాయం. కానీ ఆనీలో అది పూర్తి విరుద్ధంగా పనిచేసింది. పుస్తకాలు మాత్రమే తనకు అత్యంత ప్రీతికరమైనవనీ, ఎంత చెడ్డ జీవితంలోనూ తనను తాను ఒక ‘అ–పాఠకురాలిగా’ ఊహించలేననీ అంటారామె. ఆరేళ్ల వయసు నుంచే అక్షరంలోని గమ్మత్తుకు ఆకర్షితురాలయ్యారు. వందలాది పుస్తకాలను ఉచితంగా చదువుకోవడం కోసమే పుస్తకాల షాపులో పనిచేయాలని కలగన్నారు. ఒక శ్రామిక కుటుంబంలో పుట్టి, బుద్ధెరిగాక మధ్యతరగతి జీవితాలతో పోల్చుకున్నప్పుడు తమ పరిస్థితి పట్ల సిగ్గుపడిన ఆనీ ఎర్నౌ చదువుకోవడం ద్వారా జీవితాలను మార్చుకోగలమన్న అభిప్రాయానికి చాలా త్వరగా వచ్చారు. దానికి అనుగుణంగానే ముందు టీచర్‌గా, అనంతరం లిటరేచర్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
వర్జీనియా వూల్ఫ్ అంటే ఆనీకి పిచ్చి అభిమానం. సైమన్ ది బోవా ఆమె చైతన్యాన్ని విస్తృతపరిచారు. స్త్రీవాదం అనేది తప్పనిసరైనది అన్న అవగాహనతో ఇరవై ఏళ్ల వయసు నుంచే తన రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. తన కుటుంబానికి తెలియకుండా చేయించుకున్న అవాంఛిత గర్భస్రావం గురించి ‘క్లీన్డ్ ఔట్’ రాశారు. ఆ అనుభవంలోని జుగుప్స, భయానకాలకు వెరవకుండా, దీన్నే పునర్దర్శనంలాగా ‘హ్యాపెనింగ్’ రాశారు. ఒక స్త్రీ తన శరీరం మీద తన నియంత్రణనూ, స్వాతంత్య్రాన్నీ స్థాపించుకోవడానికి సంబంధించిన అతిముఖ్యమైన నవలగా ఇది నిలిచిపోయింది. తను దాటివచ్చిన జీవిత దశలనే ఆనీ పుస్తకాలుగా మలిచారు. ఆమె కౌమార జీవితం ఒక పుస్తకం. వైవాహిక జీవితం ఒక పుస్తకం. తూర్పు యూరోపియన్ మనిషితో ప్రేమ వ్యవహారం(ప్యాషన్ సింపుల్) ఇంకో పుస్తకం. తల్లి మరణం ఒక పుస్తకం. బ్రెస్ట్ క్యాన్సర్ అనుభవాలు మరో పుస్తకం. ఫ్రాన్స్ చరిత్రతో ముడిపడిన ‘ది ఇయర్స్’ను ఆమె మ్యాగ్నమ్ ఓపస్‌గా పరిగణిస్తారు. ఉత్తమ పురుష(నేను) కథనాలకు భిన్నంగా దీన్ని థర్డ్ పెర్సన్‌లో రాశారు.
ఏ వ్యక్తిగత అనుభవమో ‘పొరపాటున’ సాహిత్యంలోకి వస్తే– దానికీ, తనకూ ఏ సంబంధమూ లేదని ఒక డిస్‌క్లెయిమర్ లాంటిది ఆ రచయిత తగిలించడం కొత్త సంగతేం కాదు. మరీ ముఖ్యంగా సంక్లిష్ట కుటుంబ సంబంధాలు, సన్నిహిత మానవ సంబంధాలు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు మరీ ఎక్కువ. ఇక వ్యక్తిగతం అన్నదే కొందరికి నిషిద్ధాక్షరి. వ్యక్తి నుంచి కూడా సమాజాన్ని దర్శించవచ్చునన్న అవగాహన ఉన్నవాళ్లు తక్కువ. కానీ ఆనీ ఎర్నౌ సాహిత్య సర్వస్వం ఆత్మకథాత్మకమే. ఇది కల్పన అని చెబితే రచయితకో రక్షణ కవచం ఉంటుందన్న ఆలోచన ఆమెకు లేక కాదు. కానీ అది మోసం చేయడంలా భావించారు. వ్యక్తిగత జీవితాన్ని ఒక ప్రయోగశాలలో పరీక్షించుకున్నంత కచ్చితత్వంతో తన అనుభవాలను నమోదు చేశారు. అందువల్లే ఆమె ‘గ్రేట్ ట్రూత్ టెల్లర్ ఆఫ్ ఫ్రాన్స్’గా నిలవగలిగారు. నార్మండీ లాంటి చిన్నపట్టణంలో తన జీవితాన్నీ, తండ్రితో తన సంబంధాన్నీ ‘ఎ మ్యాన్స్ ప్లేస్’గా రాస్తున్నప్పుడు తన రచనాపద్ధతిని గురించి ఆమె ఘర్షణపడ్డారు. తండ్రిని ఒక కాల్పనిక పాత్రగా మలవడంలో తన రచనా ఉద్దేశమే నెరవేరదని భావించారు. అందుకే ఉన్నది ఉన్నట్టే రాయడానికి సంకల్పించారు. అందుకే ఆమెను ఫిక్షన్ రచయిత అనాలా, నాన్–ఫిక్షన్ రచయిత అనాలా అన్న చర్చకూడా వచ్చింది. కొందరు ఆమెను ‘మెమొయిరిస్ట్’ (జ్ఞాపకాల రచయిత) అన్నారు. నవలగా, ఆత్మకథగా కాకుండా తన రచనలను ఆటోసోషియోబయోగ్రాఫికల్(సామాజిక ఆత్మకథ)గా మలవగలగడం ఆమె ప్రత్యేకత. చరిత్ర, ఆత్మకథల కలగలుపు ఆమె పద్ధతి.
ఇంట్లో పుస్తకాలను చూసి, ఇవన్నీ చదువుతావా అని ఆశ్చర్యపోయిన తన కజిన్, పుస్తకాలతో మనుషులకేం పని అన్నట్టుగా బతికిన తన తండ్రిలాంటివాళ్లు నిజానికి తనకు ఎక్కువ స్ఫూర్తి కలిగించారని చెప్పే ఆనీ... మర్చిపోయి అంతర్ధానమయ్యే లోపల జ్ఞాపకాలను పదిలపరుస్తున్నానంటారు. ఫ్రాన్స్ ఉమ్మడి జ్ఞాపకాలను ఆమె తన ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అనువాదాల ద్వారా అవి ప్రపంచ స్మృతులుగా కూడా మారాయి.
తన ప్రపంచంగా అనిపించని పారిస్ విలాసాలకు దూరంగా ప్రకృతి, నిశ్శబ్దాల కోసం సబర్బన్ ప్రాంతంలో నివసించే ఆనీ ఎర్నౌ... ఒక దశలో ‘మహిళా విప్లవం’ చూడకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డానంటారు. కానీ అబార్షన్ హక్కులు రావడానికీ, స్త్రీ శరీరం మీద మారుతున్న పురుష ప్రపంచ ధోరణికీ ఆమె కూడా ఒక కారణం అయ్యారు. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; కానీ ప్రయోజనం లేకుండా మాత్రం ఉండదు.
(10th October 2022)
No comments:
Post a Comment