గొప్పదూరపు రచయిత
పూడూరి రాజిరెడ్డి
పతంజలి శాస్త్రి గారిని తలుచుకోగానే నాకు గుర్తొచ్చిన కథ, గారడీ. ఆ పేరు కూడా కాదు; ఒక మగవాడి పుంసత్వపు నిస్సహాయతా, ఇక దానివల్ల గట్టిగా నోరెత్తలేని బలహీనతా. ఇలాంటి కథలు ఉంటే ఆ స్త్రీ కోణంలోనో, లేకపోతే ఆ అలవాటైనవాడి కోణంలోనో ఉంటాయి. కానీ ఇలాంటి కథ నేను ఎక్కడా చదవలేదు. ఏదో ఒక వయసులో, స్థాయిలో అన్ని రకాలుగానూ జీవితంలో వెనక్కి తగ్గడం ఎలా మొదలవుతుందో కూడా ఇందులో చూడొచ్చనుకుంటాను.
ఇలాంటి కథ నేను మరెక్కడా చదవలేదు అని చెప్పగలిగే ఇంకో కథ, వడ్ల చిలకలు. మధ్య తరగతి అనే ఒక బ్రహ్మ పదార్థం మీద చాలా నిరసన, ఏవగింపు, వ్యంగ్యం సాహిత్యంలో కనబడతాయి. కానీ అదేమిటి, దాని దృక్పథం ఎలా ఏర్పడుతుంది, దాని జీవితాన్ని మలిచే అంశాలేమిటి, అది ఏం మాట్లాడుకోవడానికి చెవులు రిక్కిస్తుంది, దాని కలలను ఎలా అణిచివేసుకుంటుంది, అసలు కలలు కనడానికి కూడా ఎలా వెనుకాడుతుంది– అని చెప్పడానికి ఈ కథను ఒక నమూనాగా చూపవచ్చు.
సంపాదకుడు శక్తిమంతుడు అని పత్రికవాళ్లకు తెలుసు. కానీ కంట్రిబ్యూటర్ శక్తిమంతుడని లోకానికి తెలుసు. అందుకే సంపాదకుడు చేయలేని పనిని కంట్రిబ్యూటర్ ఇట్టే చేసేయగలడు. ఇవొక చిత్రమైన పవర్ పాలిటిక్స్. దీన్నే పోలీసు వ్యవస్థ నేపథ్యంలో, ఏసీపీ మృదువుగా చేయలేని పనిని ఎస్సైతో మొరటుగా చేయించి చూపారు పతంజలి, ఎస్సై నవ్వేడు కథలో.
కనకం గట్టెక్కిన వైనము అనే ఇంకో కథలో, అదనపు డబ్బుల కోసం పుట్టింటికి తన కూతుర్ని తరిమికొట్టిన అల్లుడిని ఎదుర్కోలేని ఒక నిస్సహాయ కానిస్టేబుల్ మామ కోసం– కస్టడీలో ఉన్న దొంగ కొత్త సినిమా రిలీజు రోజు జేబులు కొట్టడం చూస్తాము.
నడిపే బండి మీద, బతికే జీవితం మీద ఏకాగ్రత లేని ఒక పెళ్లయిన కొడుక్కు– జీవితంలో ఎలా మమేకం కావాలో అర్థం చేయించడానికి ప్రయత్నించే తండ్రి ‘జెన్’లో కనబడతాడు.
ఇంకా అతడి శీతువు, రామేశ్వరం కాకులు మంచి కథలు. లోలోపల గుబులును రేపే కథలు. తెలియని వ్యథను సున్నితంగా చెప్పే కథలు. ఇలా కథల్ని ఏకరువు పెడుతూ పోవాలని నేనేమీ అనుకోవడం లేదు. జీవన సాఫల్య పురస్కారం అందుకునే రచయితకు ఇవ్వాల్సిన సమీక్ష కాదు ఇది.
ప్రతిదాని మీదా స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవాళ్లు నన్ను భయపెడతారు, ముఖ్యంగా సాహిత్యంలో. జీవితం అర్థం కానిది అని మాత్రమే నేను అర్థం చేసుకోగలిగాను. ఆ అర్థంకానితనాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఆర్టిస్టు పడే తపన నన్ను ఆకట్టుకుంటుంది. అయితే, పతంజలి శాస్త్రిలో ఆ తెలియనితనం అంటూ ఏమీ కనబడదు. ఆయనకు అన్నీ తెలుసు అనిపిస్తుంది. అంటే, ఆయన పూర్తిగా ఏర్పడినాక, రూపుదిద్దుకున్నాక చేస్తున్న సృజన ఇది. కాబట్టి, దేనితోనూ గట్టి విభేదాల్లేవు, గట్టి పంతాల్లేవు, బయటపడిపోయే అమాయకత్వం అసలు లేదు. తన కుటుంబ నేపథ్యం వల్ల సమాజపు ఏ బరువూ ఆయన మీద లేని స్వేచ్ఛ ఉండటం కూడా దీనికి ఒక కారణమా అన్నది నేను చెప్పలేను. అయితే, ఈ పతంజలితో పోల్చుకుని తనను చిన్న పతంజలి అని చెప్పుకున్న కేఎన్‌వై పతంజలి ఒక మంచి మాటన్నారు: ‘ఉద్యమాలతో సంబంధం లేకనో, వాటితో విభేదించకుండానో కేవలం జీవితాన్ని మాత్రమే పట్టుకుని ప్రయాణించే సాహిత్యం ఎపుడూ ఉంటుంది. పతంజలిశాస్త్రి గారిది అలాంటి సాహిత్యం’.
అయితే పతంజలి శాస్త్రిని నేను ఎక్కువగా చదవలేదు. కారణాలేమిటో నాకూ తెలీదు. ఆయన ఒక ‘ఫోర్సు’గా నా దగ్గరిదాకా చొచ్చుకు రాలేదు. బహుశా చదవడం పట్ల నాకుగా ఉన్న చిత్రమైన అభిప్రాయాల వల్ల కావొచ్చు. రచయితలు వెల్లడి కాని రచనలు నాకు అభిమానాన్ని పుట్టించవు. తన గురించి ఏదోలాగానైనా చెప్పుకోవాలన్న లౌల్యం లేని రచయితలు నాకు దగ్గరివాళ్లుగా అనిపించరు. అలాగని ఆ లౌల్యమే ప్రధానమైతే ఇక ముందుకెళ్లను. కానీ తన రచనల్లో పతంజలి ఎక్కడున్నారో, ఏ పాత్రలో ఆయన్ని చూసుకోవాలో నాకు అంతుపట్టలేదు. ఇలా నిర్మమకారంగా రాసేవాళ్లు నిజానికి గొప్పవాళ్లు. కానీ నాకు దూరపువాళ్లు.
అయితే ‘ప్రగతిశీల’ ప్రయోజనం ఏమీ ఉండదని కొందరు రచయితలు కొన్ని రాయకుండా వదిలేస్తారు, ముఖ్యంగా ఒక ‘స్థాయి’కి వచ్చాక, ఇంకా ముఖ్యంగా తెలుగులో. కానీ వెన్నెల వంటి వెలుతురు గూడు రాయడం పతంజలిని ఈ మొత్తంనుంచి వేరుగా నిలబెడుతుంది. రైలు ప్రయాణంలో ఒక చిరు ఉద్వేగపు కల్లోలాన్ని చూపిన ఈ చిట్టి కథ గనక నేను చదవకపోయివుంటే ఆయనకు నేను ఇంకా దూరంగానే ఉండిపోయేవాడిని.
(2021 నవంబర్)
(పతంజలి శాస్త్రి గారికి అజో–విభో వారి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చినప్పుడు ఆయన మీద వేసిన ప్రత్యేక సంచిక కోసం రాసింది.)
No comments:
Post a Comment