సమాజంలో భౌతికంగా మనిషి ఎదగగలిగే ఎన్నో హోదాలున్నాయి. కానీ ‘రచయిత’ కావడం అనేది వేరే లెవెల్. రాయడం వల్ల వచ్చే ‘రిటర్నులు’ ఏమిటనేవి ఇదమిద్దంగా ఎవరూ చెప్పలేరు. అయినాకూడా కొందరు రాస్తూనేవుంటారు. రాయడం అనేది వారికి గాలి వీచినంత, పూవు పూచినంత, ప్రవాహం సాగినంత సహజం.
రచయిత అనే ట్యాగ్ మనం ఊహించలేనంత పెద్దది. రచయిత అనగానే ఒక మేధావి, ఒక ఆలోచనాపరుడు, జీవితంలో అన్నీ చూసినవాడు అనే ఇమేజ్ కదలాడుతుంది. ఆటోమేటిగ్గా అది ఒక ప్రత్యేక గౌరవానికి కారణం అవుతుంది. అయితే రాసేవాళ్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి. చదివేవాళ్లు తగ్గిపోయారు, పుస్తకాలు అమ్ముడు కావడం లేదు, అసలు ఎవరికైనా కాంప్లిమెంటరీ కాపీ ఇచ్చినా దాన్ని ఆసాంతం చదువుతారన్న ఆశ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత స్థితప్రజ్ఞుడైనా కొంత నిరాశ పడక తప్పదు. మరి ఇలాంటప్పుడు ఎవరైనా ఎందుకు రాయాలి?
అసలు ఏ రచయితకైనా తన పుస్తకాన్ని పాఠకులు చదవాలి, పుస్తకం అమ్ముడు కావాలి అని అంత పట్టింపు ఎందుకు? అని ఎదురు ప్రశ్నిస్తారు దీపక్ విలాస్ పర్బత్. ‘వెల్ డన్! యు ఆర్ హైర్డ్’, ‘ఎ మాంక్ ఇన్ సూట్’ లాంటి రచనలు చేసిన దీపక్, అచ్చయ్యే పుస్తకాల్లో 60–70 శాతం చదవనివే ఉంటాయంటారు. అందుకే అమ్మడానికి బదులుగా ఫ్రీ గిఫ్ట్‌గా ఇవ్వడం ద్వారా పుస్తకానికి వచ్చే ఆ వందో, రెండు వందలో ఖరీదు కంటే కూడా ఎక్కువ సంపాదించవచ్చని చెబుతారు. ‘‘ఒక మోటివేషనల్ స్పీకర్‌గా మనం ఒక కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్‌కు ఏ విజిటింగ్ కార్డో, బ్రోషరో ఇస్తే– మనం అక్కడినుంచి వచ్చిన మరుక్షణం అది చెత్తబుట్టలో పడిపోవచ్చు. పైగా అలాంటివి ఎన్ని ఇచ్చినా మన గురించి వాళ్లకు ఒక సరైన అంచనా రాకపోవచ్చు. అదే ఒక పుస్తకం ఇస్తే? బ్రోషర్ కంటే తక్కువ ఖర్చుతో ప్రింటయ్యే పుస్తకం మన గురించిన అత్యుత్తమ పరిచయ పత్రం అవుతుంది. ఆయన చదవకపోవచ్చు, ఊరికే ర్యాకులో పెట్టేయొచ్చు; కానీ ఇచ్చివెళ్లినవాడు ఒక రచయిత అనే ఇమేజ్ పనిచేస్తుంది. ఆ సైకాలజీతోనే మనం ఆడుకోవాలి,’’ అంటారు.
ఆ కారణంగానే పుస్తకాన్ని మీ ఎదుగుదలకు ఒక పెట్టుబడిగా వాడుకోండి అని సలహా ఇస్తారు కైలాశ్ సి.పింజానీ. ‘డేట్ యువర్ క్లైంట్స్’, ‘క్యాచ్ ద షార్క్’ లాంటి రచనలు చేసిన కైలాశ్... ఏ ఫీల్డ్ వాళ్లయినా ఎదగడానికి పుస్తకాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవచ్చునంటారు. ‘‘ఉజ్జాయింపుగా సమాజంలో తొంభై తొమ్మిది శాతం మంది రచయితలు కాలేరు. కాబట్టి, ఆ రాయగలిగేవాళ్లు అమాంతం ఆ ఒక్క శాతం బ్రాకెట్లోకి వచ్చేస్తారు. ఆ గుర్తింపే మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. మీరు రాకెట్ అనుకుంటే, పుస్తకం మీకు రాకెట్ లాంచర్ అవుతుంది,’’ అని చెబుతూ అర్జెంటుగా ఒక పుస్తకం రాసేయమని సలహా ఇస్తారు.
అంత అర్జెంటుగా ఎలా రాసేయడం? ముప్పై రోజుల్లో పుస్తకం ఎలా రాయాలో ఈ ఇరువురు సహచరులు ‘సూపర్ ఫాస్ట్ ఆథర్’ పేరుతో శిక్షణ ఇస్తుంటారు. ‘‘పుస్తకం నూటాయాభై పేజీలకు మించకూడదు. ఏ మనిషైనా రాయగలిగేవి మూడు ఏరియాలు: సొంతం జీవితంలోని డ్రామా, వృత్తిపరమైన అనుభవాలు, ప్రత్యేక ఇష్టాయిష్టాలు. పెద్దగా రీసెర్చ్ అవసరం లేని టాపిక్ ఎంచుకోండి. దాన్ని పది అధ్యాయాలుగా విభజించుకోండి. ప్రతి అధ్యాయానికీ పది ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోండి. ఒక ప్రశ్నను ఒక పేరాగా విస్తరించండి. దానికి జవాబును మూడు పేరాల్లో రాయండి. అంటే పది అధ్యాయాల్లో వంద ప్రశ్నలకు నాలుగు వందల పేరాలు అవుతాయి. రోజుకు ఐదు ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఇరవై రోజుల్లో వంద ప్రశ్నలు పూర్తవుతాయి. ఐదు రోజులు రీసెర్చ్‌కు వదిలేస్తే, ఇంకో ఐదురోజుల్లో మార్పులు చేర్పులు, కరెక్షన్స్ చేయండి. ముప్పయ్యో నాటికి ఫస్ట్ డ్రాఫ్ట్ రెడీ! ఎగ్జామ్ హాల్లో ఇచ్చే మూడు గంటల సమయంలో మనకు ఇష్టం లేని పాఠాల మీద ఎన్నో అడిషనల్ పేపర్లు రాసివుంటాం. అలాంటప్పుడు మనకు ఇష్టమైన టాపిక్ మీద రాయడం ఎంత సులభం?’’ అంటారు కైలాశ్.
ఇలా మ్యాగీ నూడుల్స్‌లా వండే రచనలు ఎలా ఉంటాయో తెలీదు. బాగుండొచ్చు కూడా. అయితే కొందరు తెలుగు కవులు, రచయితలకు ఇవి కొత్త చిట్కాలు కాకపోవచ్చు. వాళ్లు ఇంతకంటే వేగంగా రాయగలరు; ఇంతకంటే బాగా ప్రమోట్ చేసుకోగలరు. తేడా అల్లా దీపక్, కైలాశ్ లాంటివాళ్లకు తమ విషయంలో ఒక పారదర్శకత ఉంది; మనవాళ్ల విషయంలో అదీ కనబడదు.
కేవలం నెమ్మదిగా రాయడం వల్లే ఒక రచన గొప్పదైపోదు. తన రాత మీద రచయిత ఎంత ప్రాణం పెడతాడన్నది ముఖ్యం. ‘యుద్ధము–శాంతి’ మహానవలను టాల్‌స్టాయ్ తొమ్మిదిసార్లు తిరగరాశాడట. ‘కరమజోవ్ బ్రదర్స్’ చదువుతున్నప్పుడు దోస్తోవ్‌స్కీ ఒక ఆధ్యాత్మిక జ్వర పీడితుడిలా కనబడతాడు. వాక్యంలో పెట్టాల్సిన ఒక్క కామా గురించి కూడా ఆస్కార్ వైల్డ్ తల బద్దలుకొట్టుకునేవాడట. యావజ్జీవితం సాహిత్యమే ఊపిరిగా బతికాడు చలం. జీవితకాలం రాసిన మొత్తం కూడా గట్టిగా ఒక పుస్తకానికి మించనివాళ్లు ఉన్నారు. వాళ్లు నిజంగా రచయితలు. కానీ ఇప్పుడు పుంఖానుపుంఖంగా వస్తున్న పుస్తకాలు కొన్ని చెట్ల ప్రాణాలు తీయడానికి తప్ప పనికిరావు. కాబట్టి రాసేవాళ్లందరూ రచయితలు కారు. వచ్చిన ప్రతిదీ పుస్తకం కాదు. దాన్ని వేరు చేసుకోగలగడమే పాఠకుల విజ్ఞత.
(సాక్షి ఎడిట్: 22 ఆగస్ట్ 2022)
No comments:
Post a Comment