వ్యక్తి విషాదం
యుద్ధాన్ని నేను ద్వేషిస్తాను, అన్ని రూపాల్లోని యుద్ధాన్నీ నేను ద్వేషిస్తాను, అంటాడు ఆర్చెమ్ చపేయే. ఈ ఉక్రెయినియన్ రచయిత తనను తాను ‘పసిఫిస్ట్’ అని చెప్పుకొంటాడు. శాంతికాముకుడు అని ఈ మాటకు విస్తృతార్థం. యుద్ధం, హింస ఏ కోశానా సమర్థనీయం కావు అనేది ఇలాంటివాళ్ల భావన. పాపులర్ ఫిక్షన్, క్రియేటివ్ నాన్‌ఫిక్షన్ రచనలతో ఆర్చెమ్ ఉక్రెయిన్‌లో మంచి ఆదరణ ఉన్న రచయిత. నాలుగుసార్లు ‘బీబీసీ ఉక్రెయిన్ బుక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఫైనలిస్టు. ఫొటోగ్రఫీ, విజువల్ స్టోరీటెల్లింగ్ మీద కూడా ఈమధ్యే మక్కువ పెంచుకున్నాడు. ఈమధ్యే అంటే ఉక్రెయిన్ మీద రష్యా దాడికి దిగకముందు. రాజధాని నగరం కీవ్ మీద బాంబుల మోత మొదలుకాగానే ఆయన చేసిన మొదటి పని, ముందు తన కుటుంబాన్ని అక్కడినుంచి సురక్షిత చోటుకు తరలించడం. రెండోది, యుద్ధంలో చేరడానికి తన పేరును నమోదు చేసుకోవడం. యుద్ధం మీద ఆర్చెమ్ అభిప్రాయాలు ఏమీ మారలేదు. కానీ అణిచివేత తనమీద మోపిన యుద్ధం కాబట్టి దీన్నుంచి పారిపోలేనంటాడు.
ఓలెహ్ సెన్‌త్సోవ్– రచయిత, దర్శకుడు. ‘క్రిమియా’ ఆయన స్వస్థలం. ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియాను రష్యా తన అనుబంధంగా మార్చుకున్నప్పుడు చేసిన నిరసనలకుగానూ తీవ్రవాద ఆరోపణల మీద అరెస్టయ్యాడు. ఐదేళ్లు జైల్లో ఉన్నాడు. (బలవంతపు సప్లిమెంట్స్, మెడికేషన్ కలుపుకొని) 145 రోజుల పాటు చేసిన నిరవధిక నిరశనకుగానూ దాదాపు చావుదాకా వెళ్లొచ్చాడు. 2019లో నేరస్థుల బదిలీ ఒప్పందం మీద ఉక్రెయిన్‌కు వచ్చాక దాడి నేపథ్యంలో ‘ద సెకండ్ వన్స్ ఆల్సో వర్త్ బైయింగ్’ అనే వ్యంగ్య నవల రాశాడు. ఉక్రెయిన్‌లో 1990ల నాటి నేరస్థుల గ్యాంగుల నేపథ్యంలో సాగే ‘రైనో’ సినిమా 2020లో విడుదలైంది. దానికి సానుకూల సమీక్షలు వచ్చాయి. అయితే, మళ్లీ యుద్ధం మొదలుకాగానే ప్రాదేశిక భద్రతా దళంలో చేరిపోయాడు. ఇంకా ఈ జాబితాలో స్తానిస్లావ్ అసెయేవ్, క్రిస్టియా వెంగ్రీనియుక్ లాంటి ఉక్రెయిన్ రచయితలూ ఉన్నారు.
అమెరికా రచయితలు ఎర్నెస్ట్ హెమింగ్వే, ఇ.ఇ.కమ్మింగ్స్, టి.ఇ.లారెన్స్, జె.ఆర్.ఆర్.టోల్కీన్ లాంటివాళ్లు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. జె.డి.శాలింజర్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. జార్జ్ ఆర్వెల్ స్పానిష్ సివిల్ వార్‌లో పాల్గొని గాయపడ్డాడు. తెలుగు కవి, కథకుడు శిష్టా›్ల ఉమామహేశ్వరరావు; మరో రచయిత అంగర వెంకట కృష్ణారావు కూడా యుద్ధ అనుభవం ఉన్నవారే. అసలు కవిగానో, రచయితగానో ఉండటమే దానికదే ఒక యుద్ధం కదా!
ఈ రచయితలు మనకు గుర్తున్నది వాళ్లు పట్టుకున్న ఆయుధం వల్ల కాదు, వారి రచనల వల్ల. కాకపోతే అది వారికి ఒక అనుభవంగా పనికివచ్చింది. కానీ ఆ ‘అనివార్యత’ ఎంత దుర్మార్గమైనది? రాసుకోగలిగేవాడు రాసుకునే, ఆనందంగా నర్తించే అమ్మాయి నర్తిస్తూ ఉండగలిగే ప్రపంచాన్ని కోరుకోవడం మరీ అంత పెద్ద కోరికా? లేక, ఇంకో తలంలో వీటన్నింటికీ కారణం అవుతున్న ‘ఇంకో’ మనిషి బుద్ధి అంత చిన్నదా?
యుద్ధం అనేది ఏ ఒక్క రూపంలోనో ఉండదని అందరికీ తెలుసు. నేరుగా సరిహద్దు యుద్ధాలు చేయకపోయినా, భిన్నరకాల యుద్ధాల్లో ఎందరు తెలుగు కవులు పాల్గొనలేదు! భావజాల పోరాటాలు మాత్రం యుద్ధం కాదా? సమస్య ఏమిటంటే– ఈ యుద్ధాలు గీతకు అటువైపు ఉన్నావా, ఇటువైపు ఉన్నావా అని తేల్చుకునే విపత్కర పరిస్థితిలోకి మనిషిని నెడతాయి. దీనికి స్పందించడం తప్ప ఇంకో మార్గం ఉండదు. అప్పుడు సమూహంగా మాట్లాడటం తప్ప వ్యక్తికి విడిగా చోటుండదు. వ్యక్తి అనేవాడు లేకుండాపోవడం కంటే బౌద్ధిక విషాదం ఏముంటుంది?
అవసరాన్ని బట్టి మనిషి వ్యక్తిగానూ, సమూహంగానూ ఉంటాడు. కానీ సరిగ్గా అదే సందర్భంలో గీతకు అటువైపు ఉన్నవాడు కేవలం విడి మనిషిగానే ఉండదలిస్తే! నేటికి సత్యాలుగా కనబడివి, రేపటికి మబ్బుల్లా కదిలిపోవని ఎవరూ చెప్పలేరు. కానీ యుద్ధాలు, భావజాలాల్లో వర్తమానపు కెలేటరల్ డామేజ్ అనబడే అనివార్య నష్టం లెక్కలోకి రాదు. వీళ్ల వల్ల గాయపడ్డ ఆ ‘ఎదుటి’ మనిషి ఎవరో వీరికి ఎప్పటికీ సంపూర్ణంగా తెలియకపోవచ్చు. నిరసనకారుల గుంపును చెదరగొట్టడానికి పోలీసులు చేసే లాఠీఛార్జీలో రెండు దెబ్బలు తినేవాడి నొప్పి ఎవరికీ పట్టదు. ఏ కోర్టులూ, ఏ ప్రజాసమూహాలూ దీనికి న్యాయం చేయలేవు. కానీ ఒక్కడు మాత్రం తన జీవితకాలం ఆ రెండు దెబ్బల బరువును మోయాల్సి వస్తుంది. ఆ చివరి మనిషి గాయానికి కూడా లేపనం పూయనంతవరకూ, అసలు ఆ మనిషికి గాయం కాని పరిస్థితులు వచ్చేంతవరకూ మనది నాగరిక సమాజం కాబోదు.
వేపచెట్టు మీద వాలి కూసేది ఒక కాకి కాదు. అది ‘ఫలానా’ కాకి మాత్రమే అవుతుంది. దాని కూతకు స్పందనగా వచ్చి జతకూడది కూడా ఇంకో కేవలం కాకి కాదు. అది మరో ఫలానా కాకి అవుతుంది. రెండూ వేర్వేరు కాకులు, ఇద్దరు వేర్వేరు సంపూర్ణ మనుషుల్లా. అవి వాలిన వేపచెట్టుకు కూడా మనం పేరు పెట్టివుండకపోవచ్చుగానీ అది కూడా దానికదే ప్రత్యేక యూనిట్. దానికదే యూనిక్. దాన్ని పోలిన చెట్టు, దానిలాగా కొమ్మలను విరుచుకున్న చెట్టు ఇంకోటి ఎక్కడా ఉండదు. మన ఇంట్లో మన కాళ్లకు తగిలే పిల్లిలాంటిది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. కానీ మనుషులే కేవలం సమూహ అస్తిత్వాలకు పరిమితమయ్యే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నప్పుడు, ఇంక పక్షులు, జంతువులు, చెట్లూ చేమలను కూడా విడిగా గుర్తించాలంటే మనిషి ఎంత సున్నితం కావాలి! ఎంత సూక్ష్మం కావాలి!
(1st August, 2022)
No comments:
Post a Comment