జిడ్డు కృష్ణమూర్తి
11 May 1895 - 17 Feb 1986
ఆలోచనాపరుడు
చిన్నారిగా ఇంకా ఆటలు ఆడుకుంటున్న జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో అనుకోని మలుపు– అతను దివ్యజ్ఞాన సమాజం దృష్టిలో పడటం! ఆ పిల్లాడే మున్ముందు అవతరించనున్న ‘వరల్డ్ టీచర్’ మైత్రేయుడికి వాహకుడై మానవజాతికి ‘మోక్షం’ కలిగిస్తాడని లెడ్‌బీటర్, అన్నీబీసెంట్‌లాంటి వాళ్లు సంపూర్ణంగా విశ్వసించారు; దానికి తగిన ఇమేజ్‌ను కృష్ణమూర్తికి కల్పించారు.
అయితే, యువకుడిగా కృష్ణమూర్తి జీవితంలోని రెండో మలుపునకు పూర్తి కారణం ఆయనే! తననొక దేవుడి అవతారంగా నమ్ముతుండటాన్ని ఆయన పూర్తిగా నిరసించాడు; తనచుట్టూ ఏర్పాటైన ‘ది ఆర్డర్ ఆఫ్ ద స్టార్’ సంస్థని రద్దుచేశాడు; సత్యాన్ని కనుగొనడానికి తొక్కుడుపడిన దారంటూ ఒకటి లేదు, అది వ్యవస్థలు అందిచ్చేది కాదు, అది పూర్తిగా వ్యక్తిగత ప్రయాణం, అని తేల్చేశాడు.
కృష్ణమూర్తి ఆలోచనల్లో సత్యానికి దారి చూపే గురువంటూ లేడు, దానికి పనికొచ్చే మతమంటూ లేదు, దానికోసం ఎవరూ చేయిపట్టుకుని నడిపించరు. అన్వేషణ, ప్రశ్నించే గుణాలే సత్యాన్ని చేరేందుకు ఉపకరణాలు!
కానీ దేవుడికో, గురువుకో ఒక నమస్కారం పెట్టేయడం తేలిక; వాటిచుట్టూవున్న అంశాల్ని తర్కించి అవగాహన చేసుకోవడం కష్టం; అందుకే జిడ్డు కృష్ణమూర్తి బాటలో నడవడంకన్నా ఏదో ఒక మతం చాటున దాక్కోవడం మనుషులకు సులభమవుతోంది. అయితే, ఈ మానవ బలహీనత గురించి కృష్ణమూర్తికి బాగా తెలుసు.
మనిషి తనకుతానుగా బతకడు; కనబడని షరతులకు లోబడివుంటాడు; అదృశ్య సంకెళ్లకు బందీగా ఉంటాడు; నిత్యం రొద పెట్టే కీచుగొంతులకు బానిసయి ఉంటాడు; భావజాలాల ఒత్తిడిలో మునిగివుంటాడు. వీటన్నింటినీ తట్టుకుని ఒంటరిగా నిలబడాలంటే చాలా సామర్థ్యం ఉండాలి; ఇది లేనివాళ్లు మరొకరివైపు చూస్తారు; వాళ్లే గురువును నిలబెడతారు.
గురుపీఠాన్ని నిరాకరించిన ఈ సరికొత్త ఆలోచనాపరుడికి అనూహ్యమైన సంఖ్యలో అనుచరులు ఏర్పడ్డారు. వాళ్లు కృష్ణాజీ, కృష్ణ అని పిలిచేవారు. తనను గురువుగా కాకుండా ఒక స్నేహితుడిలా మాత్రమే చూడమన్నాడు కృష్ణమూర్తి. ప్రపంచమంతా తిరిగాడు; వేలాది ప్రసంగాలు చేశాడు; వ్యక్తులతోనూ, సమూహాలతోనూ సంభాషించాడు. అవే మనకు లభ్యమవుతున్న ఆయన తత్వచింతన!
ఏ మతమైనా నీ శత్రువును కూడా ప్రేమించమనే చెబితే, ఇన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంత హింస ఎందుకు చోటు చేసుకుంటోంది? జాతీయత పేరుతో, మతం పేరుతో, సిద్ధాంతాల పేరుతో, మనుషుల మధ్య గీసుకునే గీతలు అవి ఏ రకమైనవైనా పనికిరావన్నాడు. గాలి వీచినప్పుడు అది గీతలు చూసుకోదు; సత్యం కూడా అలా వ్యాపించాలి; అప్పుడు మాత్రమే జీవితానికి ఆధ్యాత్మిక సొబగు అద్దగలం. భయం, ఘర్షణ, హింస లేకుండా జీవించగలిగే స్వేచ్ఛ అందరికీ ఉండాలి. ఎవరూ సెకండ్ హాండ్ మనిషిలా బతగ్గూడదు; సొంతంగా ఆలోచించాలి; చేస్తున్న ఆలోచన మీద పూర్తి స్పృహ కలిగివుండాలి; ధ్యానం అంటే ఏదో ఒకటి చేయడం కాదు; ఏదీ చెయ్యకుండావుంటే దానికదే కలిగే ఒక స్థితి!
రోజువారీ జీవితంలో మనిషి ఎదుర్కునే అన్ని రకాల ఘర్షణలనూ ఆయన చర్చించాడు. ఒక సందర్భంలో, ‘‘నా రహస్యం ఏమిటో మీకు తెలుసుకోవాలనుందా? అయితే వినండి, ఏది జరిగినా నేను పట్టించుకోను,’’ అన్నాడు. సమస్య ఉందని గుర్తించడానికీ, సమస్యను మనసుకు తీసుకోకుండా ఉండటానికీ మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాను పసిగట్టాలని ఆయన ఉద్దేశం!
జిడ్డు కృష్ణమూర్తి అన్న పేరు కూడా ఒక పూర్వవాసన కలిగివుంది కాబట్టి, కేవలం సాంకేతికంగా, తనను ‘కె’ అనిపించుకున్నాడు. ఆలోచనలు పవిత్రమైనవేమీ కావు; నన్ను కూడా గుడ్డిగా నమ్మవద్దన్నాడు. ఎప్పటికైనా నేను తెలుసుకున్న సత్యమే ఉంటుంది తప్ప, నీకు పనికొచ్చే సత్యం ఉండదు, నీది నువ్వే తెలుసుకోవాలి, అని చెప్పాడు. తానేదో తెలుసుకున్నాడు కాబట్టి, తనకు గొప్పదనాన్ని ఆపాదించడానికి నిరాకరించాడు. మనుషులు మూర్ఖులైతే సత్యాన్నీ, వ్యక్తినీ కలగలుపుతారు; వ్యక్తి చుట్టూ ఆలయం నిర్మిస్తారు; వ్యక్తికంటే సత్యం గొప్పది; సత్యంకన్నా వ్యక్తి ఏనాటికీ గొప్పవాడు కాదు, అన్నాడు. ఆ విషయం చెప్పినందుకైనా ఆయన గొప్పవాడు!
(సాక్షి ఫన్‌డే; 11 మే 2014)
––––––––––––––––––––––

No comments:
Post a Comment