Tuesday, December 3, 2024

ద సన్‌ ఫ్రమ్‌ అమెరికా



Isaac Bashevis Singer

 

నోబెల్‌ పురస్కారం పొందిన ఐజక్‌ బషేవిస్‌ సింగర్‌ కథ ‘ద సన్‌ ఫ్రమ్‌ అమెరికా’కు సంక్షిప్త రూపం. 1973లో ద న్యూయార్కర్‌ పత్రికలో ఈ కథ తొలిసారి ప్రచురితమైంది. ఇందులో పరుచుకునే ఉండే శాంతి నాకు బాగా నచ్చింది. దీన్ని కె.బి.గోపాలం గారు కూడా ‘అమెరికా కొడుకు’ పేరుతో తెలుగులోకి అనువదించారు.

–––––––

ద సన్‌ ఫ్రమ్‌ అమెరికా


అదొక చిన్న పల్లె. పేరు లెంట్షిన్‌. దాన్నిండా గుడిసెలు, పూరిపాకలు. మధ్యనే పొలాలు. అందులో కూరగాయలు పండిస్తారు. మేకలు పెంచుతారు.

ఒక చిన్న గుడిసెలో బెర్ల్‌ ఉంటాడు. ఆయన వయసు ఎనబై దాటింది. రష్యా నుండి తరిమివేయబడి పోలండ్‌కు వచ్చి స్థిరపడిన యూదు కుటుంబాల్లో వీరిదీ ఒకటి. బెర్ల్‌ పొట్టివాడు. గడ్డం తెల్లబడింది. ఏ కాలమైనా తలమీద గొర్రెచర్మం టోపీ పెట్టుకుంటాడు. ఆయనకో అర ఎకరం పొలం ఉంది. ఆవు, మేక, కొన్ని కోళ్లు కూడా ఉన్నాయి.

బెర్ల్‌ భార్య బెర్ల్‌చా. ఆమె ముఖం క్యాబేజీ ఆకులాగా ముడతలు పడివుంటుంది. సగం చెవుడు. ప్రతీ మాటను రెండుసార్లు చెప్పాలి.

బెర్ల్‌ దంపతులకు ఒక కొడుకు. పేరు శామ్యూల్‌. నలబై ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లాడు. అక్కడ లక్షలు సంపాదించాడని ఊళ్లో చెప్పుకుంటారు. పోస్ట్‌మాన్‌ బెర్ల్‌ ఇంటికి అప్పుడప్పుడు మనీయార్డర్, ఉత్తరం తెచ్చిస్తుంటాడు. ఆ ఉత్తరంలో చాలా మాటలు ఇంగ్లీషులో ఉంటాయి, కనుక ఎవరూ దాన్ని చదవలేరు.

శామ్యూల్‌ పంపించిన డబ్బును తండ్రి ఎక్కడ పెట్టాడన్నది ఎవరికీ పట్టదు. ఆ గుడిసెలోనే బల్ల, మాంసం అర, పాలవస్తువుల షెల్ఫ్, రెండు మంచాలు, మట్టి పొయ్యి ఉంటాయి. బయట చలిగా ఉంటే కోళ్లు పొయ్యి పక్కనే చేరతాయి. ఊళ్లో కలిగినవాళ్ల ఇంట్లో కిరోసిన్‌ దీపాలు ఉన్నాయి. బెర్ల్‌ వాళ్లకు కొత్త వస్తువులంటే నమ్మకం లేదు. సబ్బత్‌కు మాత్రం బెర్ల్‌చా కొవ్వొత్తులు కొంటుంది. 

దంపతులు సూర్యోదయంతో నిద్ర లేస్తారు. కోళ్లతో పాటు నిద్రకు ఉపక్రమిస్తారు. ఒక ఆవు దూడను ఈనింది, ఒక యువ జంటకు పెళ్లయింది లాంటి సంగతులు తప్ప లెంట్షిన్‌లో మరేమీ జరగవు.

శామ్యూల్‌కు కొడుకులు, కూతుళ్లు ఉన్నారు. వాళ్ల పేర్లన్నీ చిత్రంగా ఉంటాయి. అందుకే ముసలి దంపతులకు గుర్తుండవు. పేర్లలో ఏముంది? అమెరికా సముద్రానికి అటువైపు ఉంటుందట. అది ప్రపంచం అవతలి అంచు. ఊరికి వచ్చిన ఒక తాల్మూడ్‌ టీచర్, అమెరికా వాళ్లు బుర్ర నేలకు, కాళ్లు పైకి పెట్టి నడుస్తారని చెప్పాడు. అదెట్లా కుదురుతుంది? చెప్పింది టీచర్‌ కనుక అది నిజమే అయివుండాలి.

ఒక శుక్రవారం ఉదయాన బెర్ల్‌చా సబ్బత్‌ రొట్టెల కొరకు పిండి పిసుకుతోంది. అప్పుడు తలుపు తీసుకుని ఒక పెద్దమనిషి లోపలికి వచ్చాడు. పొడుగ్గా ఉన్నందున వంగి రావలసి వచ్చింది. వెంట వచ్చిన బండి మనిషి రెండు తోలు సూట్‌కేసులు తెచ్చాడు. బెల్‌చా ఆశ్చర్యంగా కళ్లెత్తింది. బండిమనిషికి అతను వెండి రూబుల్‌ అందిస్తూ, ఇద్దిష్‌లో ‘ఇక నువ్వు వెళ్లొచ్చు’ అన్నాడు. తర్వాత, ‘అమ్మా’ అని పిలిచాడు. ‘నేను శామ్యూల్‌ని. శాన్‌’. బెల్‌చా కాళ్లు మొద్దుబారాయి. పెద్దమనిషి ఆమెను కౌగిలించుకున్నాడు. నుదుటిని ముద్దాడాడు. బెల్‌చా కోడిపెట్టలాగా కిచకిచలాడింది. ‘మా బాబే’ అంది.

అప్పుడే బెర్ల్‌ కొట్టం నుండి లోపలికి వచ్చాడు. ఆయన చేతుల నిండా కట్టెలున్నాయి. వెంట మేక కూడా ఉంది. పెద్దమనిషిని చూసి బెర్ల్‌ కట్టెలు కింద పడేశాడు. ఆ పెద్దమనిషి బెల్‌చాను వదిలి బెర్ల్‌ను వాటేసుకున్నాడు. ‘నాన్నా!’ బెర్ల్‌కు నోటమాట రాలేదు. కాసేపటికి ‘నువ్వు శామ్యూల్‌వా?’ అని అడిగాడు. ‘అవును నాన్నా. నేను శామ్యూల్‌ని’. ‘చల్లగా బతుకు నాయనా’ అని కొడుకు చెయ్యి పట్టుకున్నాడు. అప్పటికీ ఆయనకు నమ్మకం కుదరడం లేదు. శామ్యూల్‌ ఈ మనిషంత పెద్దగా లేడు. అయితే అబ్బాయి అమెరికా వెళ్లినప్పుడు అతడి వయసు పదిహేనేళ్లని గుర్తొచ్చింది. ‘నువ్వొస్తున్నట్టు మాకు చెప్పనేలేదు’ అన్నాడు బెర్ల్‌.

‘నా కేబుల్‌ మీకు అందలేదా?’ అడిగాడు శామ్యూల్‌. అదేమిటో బెర్ల్‌కు అర్థంకాలేదు.

‘ఇదంతా చూసేవరకు నేను బతుకుతానని అనుకోలేదు. ఇప్పుడిక ఆనందంగా చస్తాను’ అన్నది బెర్ల్‌చా.

బెర్ల్‌ ఆశ్చర్యపోయాడు. సరిగ్గా ఈ మాటలే తానూ అనబోయాడు.

కాసేపైన తర్వాత బెర్ల్‌ ‘పేశ్చా, నువ్వు సబ్బత్‌ కొరకు మామూలు పులుసుతో పాటు మంచి డబుల్‌ ఫుడింగ్‌ కూడా చేయాలి సుమా’ అన్నాడు. బెర్ల్‌ తన భార్యను సొంతపేరుతో పిలిచి కొన్నేళ్లయి వుంటుంది. ఆమె కళ్ల నుంచి పసుపు నీళ్లు కారాయి. దృశ్యం అలుక్కుపోయింది. ‘ఇవ్వాళ శుక్రవారం. నేను సబ్బత్‌ కోసం తయారీలు చేయాలి’ అంది. ఆమె మళ్లీ రొట్టెల కోసం పిండి పిసకవలసివుంది. మరి ఇలాంటి చుట్టం వస్తే మరింత మంచి పులుసు కాయవలసి ఉంటుంది! మొదలే చలిరోజులు. చీకటి పడేలోగా పని జరగాలి.

అమెరికా నుంచి బెర్ల్‌ కొడుకు వచ్చాడన్న శుభవార్త ఇరుగుపొరుగుకు తెలిసింది. పలకరించడానికి వచ్చారు. గది నిండా మనుషులే. ఆడవాళ్లు బెర్ల్‌చాకు పనిలో సాయం పట్టారు. ఆమె కొవ్వొత్తులు ముట్టించింది. అప్పుడిక తండ్రి, కొడుకు వీధి అవతల ఉన్న చిన్న సినగాగ్‌కు బయల్దేరారు. కొడుకు పెద్ద అంగలుగా నడుస్తున్నాడు. ‘నెమ్మదిరా’ అంటూ బెర్ల్‌ హెచ్చరించాడు. ఊరంతా మంచు కప్పుకుని వుంది. కిటికీల్లోంచి కొవ్వొత్తుల వెలుగు కనిపిస్తోంది. ‘ఇక్కడ ఏమీ మారలేదు’ అన్నాడు శామ్యూల్‌.

వచ్చేసరికి బెర్ల్‌చా బియ్యంతో చికెన్‌ పులుసు చేసింది. చేపకూర వండింది. మాంసం, క్యారెట్‌ పులుసు సిద్ధం చేసింది. కుటుంబం కలిసి తాగారు, తిన్నారు. నిశ్శబ్దంలో చిమ్మెటల రొద వినబడుతోంది.

చివరి ప్రార్థన తర్వాత అడిగాడు శామ్యూల్‌: ‘నాన్నా, నేను పంపిన డబ్బంతా ఏం చేశావు?’

బెర్ల్‌ తన తెల్లటి కనుబొమ్మలను ఎగరేస్తూ, ‘ఇక్కడే వుంది’ అన్నాడు.

‘బ్యాంకులో వేయలేదా?’

‘లెంట్షిన్‌లో బ్యాంకు లేదు.’

‘మరి డబ్బులు ఎక్కడున్నాయి?’

బెర్ల్‌ తటపటాయించాడు. సబ్బత్‌లో డబ్బు తాకడం తప్పు. అయినా చూపిస్తానంటూ మంచం కిందకు వంగి బరువైనదేదో బయటికి లాగాడు. ఒక బూట్‌. దాంట్లో పైన గడ్డి కుక్కివుంది. అది తీసేశాడు. నిండా బంగారు నాణేలు!

‘నాన్నా బోలెడు సొమ్ము!’ 

‘సరే’

‘ఎందుకు ఖర్చు పెట్టలేదు?’

‘దేనికని? దేవుడి దయ. మాకు అన్నీ ఉన్నాయి.’

‘ఎక్కడికన్నా వెళ్లివుండవచ్చు కదా!’

‘ఎక్కడికి? ఇదే మన ఇల్లు’.

‘డబ్బు ఏమవుతుంది మరి?’

‘నువ్వే పట్టుకుపో.’

బెర్ల్‌ దంపతులకు నెమ్మదిగా కొడుకు అమెరికన్‌ యిద్దిష్‌ అలవాటవుతోంది. బెర్ల్‌చా కొడుకు మాటలు బాగా పోల్చుకుంటున్నది. ‘మనం ఇక్కడ ఒక పెద్ద సినగాగ్‌ కట్టొచ్చు’ అన్నాడతను. ‘ఉన్న సినగాగ్‌ పెద్దదే’ జవాబిచ్చాడు బెర్ల్‌.

‘ముసలివాళ్ల కొరకు ఒక ఇల్లు కడితే?’

‘ఎవరూ వీధుల్లో పడుకోవడం లేదు.’

మరుసటి రోజు సబ్బత్‌ భోజనం తర్వాత బెర్ల్‌ దంపతులు కాసేపు నడుం వాల్చారు. మేక కూడా కునికిపాట్లు పడుతున్నది. కొడుకు కోటు వేసుకుని, టోపీ పెట్టుకుని నడకకు బయల్దేరాడు. కోటు జేబులో చెక్‌బుక్, రుణపత్రాలు చేతికి తగిలాయి. అతడు ఏవో పెద్ద పథకాలు వేసుకుని వచ్చాడు. అమ్మానాన్నలకు సూట్‌కేస్‌ నిండా బహుమతులు తెచ్చాడు. ఊరివాళ్లకు ఏదైనా సాయం చేయాలనివుంది. న్యూయార్క్‌లోని లెంట్షిన్‌ సొసైటీ నుండి కూడా డబ్బు తెచ్చాడు. కానీ ఈ ఊరికి ఏదీ అవసరం లేదు. దూరంగా సినగాగ్‌లో ప్రార్థనలు వినబడుతున్నాయి. 


(సాక్షి సాహిత్యం; 2018 జనవరి 1)




 

No comments:

Post a Comment