Monday, November 21, 2011

పాత చొక్కాను తడిమిన ఆనందం

జీవితం క్షణికం కావొచ్చు. కానీ క్షణం అసత్యం కాదు.
-యండమూరి వీరేంద్రనాథ్

యండమూరితోనే నాకు సాహిత్యం పరిచయం. కానీ "అనూహ్య' పరిచయం. అట్టలూడిపోయిన పుస్తకమొకటి మామయ్య వాళ్లింట్లో పడివుంది. అలా అంతకుముందు కూడా కొన్ని పడివున్నవి తిప్పిచూశానుగానీ అవి రాసినవాళ్ల పేర్లుగానీ, వాళ్లను మళ్లీ చదవాలన్న కోరికగానీ కలగలేదు. ఈ చీకట్లో సూర్యుడు అందుకు విరుద్ధం. నన్ను అంతరిక్షంలో గిరికీలు కొట్టించాడు. కొన్ని రోజులు యశ్వంత్ లాగా మౌన గంభీరంగా ఉండటం గొప్పనుకునేవాణ్ని. కాదు, వాయుపుత్రలాగా అల్లరిగా ఉండటమే గొప్ప కాబోలనుకునేవాణ్ని. చివరకు ఇద్దరిగానూ ఉండలేక, నాలా నేను ఉండటానికి ఇప్పటికీ విఫల యత్నం చేస్తున్నాను.
మళ్లీ ఈ మధ్యలో ప్రకాశం జొరబడ్డాడు. మాసిన దిండులాంటివాడు. ఇంకెప్పుడో గాంధీ వచ్చిచేరాడు. రెపరెపలాడే కొత్తనోటులాంటివాడు. అయితే, అటు ప్రకాశంలా ఉండిపోనూలేము. ఇటు గాంధీలాగా పచ్చనోట్లు తగలబెడుతూ చిర్నవ్వుతో చూడనూలేము. కాకపోతే, మన ప్రియురాలు ఎప్పుడు పిలుస్తుందా? తలవాల్చేందుకు పల్చటి పొత్తి కడుపు ఎప్పుడు లభిస్తుందా? అని కలలు కనడం మాత్రం చేయగలిగాము.
ఇంకా, చెంగల్వపూదండలూ వెన్నెల్లో ఆడపిల్లలూ గోదారులూ ప్రేమలూ పర్ణశాలలూ అభిలాషలూ అనైతికాలూ ప్రార్థనలూ యుగాంతాలూ...
ఈయనెవరో నాకోసమే రాస్తున్నాడా?
మందాకిని స్నానించినప్పుడు ప్రవహించే సబ్బు నురుగు పుట్టించే కొన్ని ఉత్తేజిత క్షణాలు... యండమూరిని చదవడం.

పైనెక్కడో సాహిత్యంతో పరిచయం అన్నానా!
కొంత పెద్దయ్యాక, పెద్దాళ్లు రాసింది చదివితే, యండమూరి రాసింది క్షుద్ర సాహిత్యం అని తెలిసింది. కానీ, దాన్ని క్షుద్ర సాహిత్యం అని అంగీకరించడానికి నాలో దాగివున్న క్షుద్రుడు అడ్డుపడ్డాడు.
ఇంకా యండమూరి దురదృష్టం ఏమిటంటే, "కామూ'ను చదివి ఆయన అంతర్ముఖం రాస్తే, కాపీ కాపీ అన్నవాళ్లు... అదే కామూలాంటివాళ్లను తెలుగులోకి తెచ్చినవాళ్లను సృజనశీలురుగా ముద్రవేయడం. బహుశా పేరొచ్చినవాడిని మనం సహించం. డబ్బు కూడా వచ్చినవాడంటే అసలు భరించం. సాహిత్యం సంపద ఇవ్వడమేమిటి మరి? చర్చలకూ, వాదోపవాదాలకూ పనికిరావాలిగానీ!

యండమూరి డబ్బు కోసం మాత్రమే రాసినవాడా?
ఒక మామూలు యువ ఉద్యోగి. మొదటిసారి స్లీపరు క్లాసులో ప్రయాణిస్తున్నాడు. అంగీ విడిచి, బనీన్ మీద పడుకోవాలి! సహ ప్రయాణీకులు ఖరీదుగా కనిపించారు. వాళ్ల మధ్య అలా చేస్తే తన పల్లెటూరితనం బయటపడుతుంది. ఎలా? ఇంతలో ఓ కాఫీ అమ్ముకునే కుర్రాడు వచ్చాడు. అతడికివ్వాల్సిన చిల్లర కోసం ఆ ఖరీదు మనుషులు ఎంత చిల్లరగా ప్రవర్తించారని! డబ్బులివ్వలేదు. రైలు కదిలింది. కుర్రాడు పరుగెత్తుకుంటూ వచ్చి కిందపడ్డాడు. మట్టిలో దొర్లాడు. యువకుడు చలించాడు. జేబులో ఉన్న డబ్బులో గుప్పిడితో తీసి పిల్లాడివైపు విసిరికొట్టాడు. ఖరీదైన వ్యక్తిత్వాల మీద తనకు ఉన్న భ్రమ అనే "మిస్ట్" ఇట్టే కరిగిపోయింది. ఇక వాళ్లను ఖాతరు చేయకుండా, లుంగీ బనీన్ మీదే కాళ్లు జాపుకుని హాయిగా పడుకున్నాడు.
బహుశా, యండమూరి కూడా తన విమర్శకుల విషయంలో ఇదే చేసివుంటాడు.

అయితే, నాటకాలు, నవలలు, వ్యక్తిత్వ వికాసాలు అనబడే మూడు దశలుగా ఉన్న తన సాహితీ జీవితంలో... యండమూరి మొదట్లో ఉన్నట్టు మధ్యలో లేడు. మధ్యలో ఉన్నట్టు ఇప్పుడు కనబడడు. అది మార్పుగా కాకుండా, తనను తాను ఏమార్చుకుంటూ వెళ్లాడేమోననిపిస్తుంది. సమాజపు కన్నీళ్లు తుడవడం కంటే, అందుకోసం టిష్యూ పేపర్స్ అమ్మితే బాగుంటుందన్న ఆలోచనాధోరణిలో పడిపోయాడు. పోరాటమే తప్ప జీవితంలో జయాపజయాలు ఉండవని తెలిసినా విజయసూత్రాలు లిఖించడం మొదలుపెట్టాడు.

ఇక ఇది నాకు సరిపోదని బీరువా అడుగున మడతపెట్టి దాచిన పొట్టి చొక్కా యండమూరి సాహిత్యం. వేసుకోవడానికి కుదరకపోయినా, తడిమి చూసుకుంటే అపురూపంగా ఉంటుంది.

(నవంబర్ పద్నాలుగున యండమూరి పుట్టినరోజు)

Monday, November 14, 2011

ఏమిటీ అస్తిత్వవాదం?



సాక్షి ఫన్డేలో నవంబరు 13న ప్రచురితం.