Thursday, July 24, 2014

ఇన్మార్ బెర్గ్ మన్: లోపలి దర్శకుడు



ప్రపంచంలోని మేటి దర్శకులెందరో తమకు స్ఫూర్తిగా పేర్కొనే మహాదర్శకుడు ఇన్మార్‌ బెర్గ్‌మన్‌! ‘మూవీ కెమెరా కనుక్కున్నాక, భూమ్మీద జన్మించిన అతిగొప్ప సినిమా కళాకారుడు బెర్గ్‌మన్,’ అంటాడు దర్శకుడు వూడీ అలెన్‌.
మృత్యువు, అస్తిత్వం, నైతిక చింతన, దైవం, నిరాశ, ఒంటరితనం, కలలు, గతించిన యౌవనం, పశ్చాత్తాపం, వాంఛ లాంటి బలమైన భావనల్ని అజరామరంగా తెరకెక్కించాడు బెర్గ్‌మన్‌. తత్వోద్వేగాల సంక్లిష్ట సమ్మేళనంలాంటి ఆయన చిత్రాలకు నిజమైన సినిమా ప్రేమికులు పాఠ్యగ్రంథాల స్థాయినిస్తారు.

మనిషి అంతరంగపు అరాచకత్వాన్ని తక్కువ బడ్జెట్‌తో, పద్ధతిగా, ఏడాదికొక సినిమాగా మలుస్తూపోయాడు బెర్గ్‌మన్‌. సుమారు 45 సినిమాలు! హాలీవుడ్‌ని పట్టించుకోకుండా, తన మాతృదేశం స్వీడన్‌కే ఆయన పరిమితమవడానికి కారణం, లాభనష్టాల గురించి బేరీజు వేయనక్కర్లేని సృజనాత్మక స్వేచ్ఛ! తొలుత రంగస్థలంలో పనిచేసి, స్వయంప్రకాశంతో సినిమాల్లోకి వచ్చాడాయన. వింటర్‌ లైట్, సెవెన్త్‌ సీల్, వైల్డ్‌ స్ట్రాబెర్రీస్, పర్సోనా, క్రైస్‌ అండ్‌ విస్పర్స్, మెజీషియన్, సైలెన్స్, ఫ్యానీ అండ్‌ అలెగ్జాండర్, త్రూ ఎ గ్లాస్‌ డార్కీ... తమ జీవితకాలంలో అలాంటి ఒక్క సినిమానైనా తీయాలని సృజనశీలురు కలలుగనే క్లాసిక్స్‌!

‘మా ఇంటి పెద్ద కిటికీలోంచి వచ్చే సూర్యోదయాన్ని నేను ‘వినేవాణ్ని’. దూరంగా మోగుతున్న చర్చి గంటల నేపథ్యంలో నాకు వెలుతురు వినిపించేది,’ అంటాడు తన బాల్యంలో దృశ్యానికి ఆకర్షితుడైన తీరును గురించి  బెర్గ్‌మన్‌. పూర్తి సానుకూలంగా లేని చిన్నతనంలో ఆయన్ని భయం, సోమరితనం, నిరాశ, కోపం లాంటి దయ్యాలే ఎక్కువగా పలకరించేవి. ‘ఎప్పుడైతే దయ్యం వాస్తవమో, దానికొక మానవస్పృహ అద్దడం అత్యవసరమైపోతుంది!’ ఒక చిన్న దృశ్యం, ఒక పలకరింపు, ఒక మనిషిపట్ల కలిగే ఉద్వేగం, ఒకరు చెప్పే సంఘటన, ఒక మనిషి ముఖం... అదేదైనా కావొచ్చు, అందులోంచి గుర్తింపునకు రాగలిగే బీజాన్ని ఆయన వృక్షంగా పెంపుచేసేవాడు. మళ్లీ దాన్ని పదాలుగా, వాక్యాలుగా కాగితంలోకి రూపాంతరం చెందించి, తిరిగి ఆ అక్షరాల్ని దృశ్యాలుగా ఆవిష్కరించేవాడు. అయితే, టెక్నికల్‌ వివరాలు, లాంగ్‌ షాట్, క్లోజప్‌ లాంటి మాటలు స్క్రిప్టులో రాయడం ‘బోర్‌’ అనేవాడు. ‘సంభాషణలు మ్యూజిక్‌ నోట్సులా ఉండాలి’. రాయకుండానే అందులోని రిథమ్, టెంపో అర్థం చేసుకోవడం సరైందనేవాడు.

పరిమితమైన అవసరాలతో, పరిమితమైన స్థలంలో జీవించిన బెర్గ్‌మన్‌... షూటింగుకు కూడా పూర్తి పరిచిత, పరిమిత వాతావరణం సృష్టించుకునేవాడు. నటీనటులుగానీ, సాంకేతిక నిపుణులుగానీ ఆయనకు దాదాపుగా అందరూ ‘రెగ్యులర్సే’. గున్నార్‌ జోర్న్‌స్ట్రాండ్, మాక్స్‌ వాన్‌ సిడో, గన్నెల్‌ లిండ్‌బ్లోమ్, ఇంగ్రిడ్‌ తులిన్, లివ్‌ ఉల్‌మాన్, బీబీ ఆండర్సన్, హారియెట్‌ ఆండర్సన్, స్వెన్‌ నైక్విస్ట్‌(కెమెరామన్‌)... ఆయన సినిమాలన్నింటా దాదాపుగా ఈ పేర్లే పునరావృతం అవుతాయి. బృందానికి ‘తల్లి’లాంటి ఆదరణతో టీ, లంచ్‌ సర్వ్‌ చేయడానికి  ఒకామెను నియమించుకుని, ఆమె పేరు కూడా టైటిల్స్‌లో వేసేవాడు. అందుకే, ఒక సందర్భంలో, ‘నేను పద్దెనిమిది మంది స్నేహితులతో పనిచేస్తాను,’ అన్నాడాయన. దానివల్ల, మళ్లీ కొత్తగా ప్రారంభించాల్సిన పనిలేదు!  పనిలో పూర్తిగా నిమగ్నం కావడానికి అది ఉపకరిస్తుంది! ఇలాగైతే ఒక ఆర్టిస్టిక్‌ కంట్రోల్‌ ఉంటుందని ఆయన ఉద్దేశం!

సినిమాను సాహిత్యపు స్థాయికి తెచ్చిన బెర్గ్‌మన్‌ చిత్రంగా సాహిత్యాన్ని సినిమాగా తీయడాన్ని ఇష్టపడలేదు. అవి రెండూ భిన్నమాధ్యమాలనేవాడు. కానీ తను రాసే స్క్రిప్టును మాత్రం పూర్తిస్థాయి రచనలాగే చేసేవాడు. ఎదుటివారికి అర్థంకావడానికి అంతకంటే మార్గంలేదనేవాడు. చెప్పలేనివి కూడా అర్థం చేయించగలిగే ప్రత్యేక కోడ్‌ ఉంటే బాగుండేదని కూడా తలపోశాడు. అయినా భాషా పరిమితిని దాటి ఆయన ప్రపంచానికి చేరువయ్యాడు. అయితే, విజయానికి ప్రత్యేక విలువ లేకపోయినా, విజయం గొప్పతనం ఏమంటే, అది మనల్ని మనలా ఉండనిస్తుందన్నాడు.
దేవుడివల్ల కాదు, మనిషికి ప్రేమవల్లే విముక్తి దొరుకుతుందని విశ్వసించిన బెర్గ్‌మన్‌ సినిమాలన్నీ ఎవరికి వారు తమ దేహాన్ని నగ్నంగా చూసుకున్నంత ఆశ్చర్యంగా, గొప్పగా, చిత్రంగా, మురికిగా, వాస్తవంగా ఉంటాయి. అందుకే ఆయన్ని ఇష్టపడుతున్నానని ఎవరైనా ప్రత్యేకంగా చెప్పడంలో అర్థంలేదు; అది తమను తాము ఇష్టపడుతున్నామని చెప్పుకోవడమే!

-------------------------------------
జూలై 14న దర్శకుడు ఇన్మార్‌ బెర్గ్‌మన్‌ జయంతి
(ఫన్డే 2014)





 

Wednesday, July 23, 2014

జార్జ్ ఆర్వెల్: రాజకీయ రచయిత



చాలా చిన్నవయసునుంచే, బహుశా ఐదారేళ్లప్పటినుంచే, పెద్దయ్యాక ఎప్పటికైనా తనకు రచయిత కావాలని ఉండేదట జార్జ్‌ ఆర్వెల్‌కు! ‘ప్రపంచాన్ని ఏదో ఒక దిశకు నడిపించాలన్న బలీయమైన కాంక్షేదో రచయితను కలం పట్టేలా చేస్తుంది’. అలాగే, రాయడమంటే, ‘బిగ్గరగా ఏడ్చి, పెద్దవాళ్లను తనవైపు తిప్పుకునే చిన్నపిల్లల మారాం లాంటిది కూడా!’ ఇంకా ఆర్వెల్‌ ఉద్దేశంలోనే రాయడమంటే... ఒక వేదన. తనను తాను పూర్తి నిర్వీర్యుణ్ని చేసుకునే ప్రక్రియ. ఒక భయంకర జబ్బుతో చేసే పోరాటం. లోపల ఒక దయ్యంలాంటిదేదో కూర్చున్నవాడే రచనావ్యాసంగం జోలికి వెళ్తాడు. ఇంత నొప్పి ఉంది కాబట్టే, యౌవనంలోకి వచ్చేసరికి తనలోని రచయిత కావాలన్న ఆలోచనను విదిల్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడాయన. కానీ అది సాధ్యపడలేదు. పైగా అది తన స్వాభావిక ప్రవృత్తికే విరుద్ధంగా తోచింది. దాంతో రాయడానికి పూనుకోవడమే సరైందన్న నిశ్చయానికి వచ్చేశాడు.

బ్రిటిష్‌ వారి పాలనలో ఉన్న భారతదేశంలో ఎరిక్‌ ఆర్థర్‌ బ్లెయిర్‌గా జన్మించాడు ఆర్వెల్‌. తన రచనలతో తల్లిదండ్రులకు చీకాకుగా మారకూడదన్న ఉద్దేశంతో కలంపేరు ‘జార్జ్‌ ఆర్వెల్‌’ను ఎంచుకున్నాడు. ఉద్యోగ రీత్యా కొంతకాలం బర్మాలో పనిచేశాడు. అనివార్యంగా, సామ్రాజ్యవాదపు సాధనంగా ఉన్నాడు. స్థానికుల మీద తెల్లదొరలకుండే అర్థంలేని ఆధిపత్య కాంక్షనీ, పాలించాలనే ఆరాటమే తప్ప అర్థం చేసుకోలేని బలహీనతనీ దగ్గరగా గమనించాడు. మతమార్పిడి కోసం ఎవరైనా స్థానికుల వేషధారణను అనుసరించినా అదీ కపట నాటకంగానే కనబడేదాయనకు. స్థానికులకూ తనకూ భేదం లేదని చాటే ప్రయత్నంలో ఒక్కోసారి వెర్రి తెల్లవాడిగా మిగిలిపోయే పరిస్థితి కూడా తెచ్చుకున్నాడు.

ఆయన పేదల్ని దగ్గరగా చూశాడు. స్వయంగా పేదరికాన్ని అనుభవించాడు. అందుకే పేదరికం గురించి... నిపుణులకన్నా పేదరికంలో మగ్గుతున్న తనలాంటి సామాన్యులు మరింత నైపుణ్యంతో కూడిన సలహాలు ఇవ్వగలరన్నాడు.

‘అందరూ సమానమే; కానీ కొందరు ఎక్కువ సమానం’. పశువుల మీద మనిషి చలాయించినట్టుగానే, పేదల మీద ధనికులు ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఆ అన్యాయాన్ని సహించకూడదు! అయితే, అధికార దాహం గల మనుషుల వల్ల ఏ పోరాటమైనా కేవలం ‘నేతల మార్పిడి’కి మాత్రమే పరిమితమవుతుందని ఆయనకు తెలుసు. అందుకే, బ్రిటన్‌ సామ్రాజ్యవాదం కన్నా నాజీ జర్మనీ దుర్మార్గమైంది; అలాగే జర్మనీతో పోలిస్తే తక్కువ ప్రమాదకారి కాబట్టి, రష్యాకు మద్దతిస్తానన్నాడు. అదే సమయంలో, తనను తాను ప్రజాస్వామిక సామ్యవాదిగా  ప్రకటించుకున్నాడు. జీవితకాలం నిరంకుశత్వంపై నిబద్ధతతో పోరాడాడు. రష్యాను పూర్తి ఏకాధిపత్య పాలనా క్షేత్రంగా మార్చిన స్టాలిన్‌ను పూర్తిస్థాయిలో తిరస్కరించాడు.

ఆయుధాల చరిత్రే చాలావరకు నాగరికత చరిత్ర, అన్నాడు ఆర్వెల్‌. క్షణంలో ప్రపంచాన్ని బుగ్గి చేసే అణుబాంబును వ్యతిరేకించాడు. శాంతికాని శాంతిని తెచ్చే ఆయుధమేటను నిరసించాడు. ఆర్వెల్‌ రచనలన్నీ రాజకీయకోణంలో రాసినవే. అసలు కళకూ, రాజకీయాలకూ సంబంధం లేదనడం కూడా రాజకీయమేనంటాడు. అయితే, ఆ రాజకీయ రాతల్ని కూడా కళాత్మకస్థాయికి చేర్చాలనేది ఆయన సంకల్పం. అలా దగ్గర చేయగలిగినందువల్లే, ఆయన పుట్టించిన పదబంధాలు, ‘కోల్డ్‌ వార్‌’, ‘బిగ్‌ బ్రదర్‌’ లాంటివి సాహిత్యంలోంచి రాజకీయపరిభాషలోకీ  ప్రవేశించగలిగాయి.

ఆర్వెల్‌కు చక్కగా కాచిన టీ అంటే ఇష్టం. ఘాటైన పొగాకుతో స్వయంగా తానే చుట్టుకునే సిగరెట్లంటే ఇష్టం. జంతువుల్ని పెంచుకోవడమన్నా ఇష్టం. అలాగే, ప్రకృతి! ‘వసంతాగమనాన్ని ప్రేమించనివాడు, కార్మిక సంక్షేమ ఉటోపియాలో మాత్రం ఎందుకు సంతోషంగా ఉంటాడు!’

భార్య చనిపోయాక, స్త్రీ ఆదరణలేక ఒంటరితనంలో మగ్గాడు. పాత స్నేహితులతో రిజర్వుడుగా ఉండటం, పూర్తి కొత్తవారితో అరమరికలు లేకుండా మాట్లాడటం ఆయన చిత్రమైన ప్రవర్తన! వ్యక్తిగత అవసరాలను చాలా పరిమితం చేసుకుని, దుస్తుల విషయంలో స్వయం క్రమశిక్షణ పాటించి, ‘మనకాలపు సన్యాసి’ అనిపించుకున్నాడు.

‘యానిమల్‌ ఫామ్‌’, ‘1984’ లాంటి రచనలతో అమితమైన కీర్తిని గడించిన ఆర్వెల్‌– క్షయవ్యాధితో 46 ఏళ్లకే తనువు చాలించాడు.

నిజానికి ఆర్వెల్‌ రూపం మీద ఎవరికీ ఫిర్యాదు లేకపోయినా, తనను తాను ఆయన ఎప్పుడూ అందగాడిగా  భావించుకోలేదు. అది కొంత మథనాన్నే మిగిల్చిందాయనకు. అయితే, ఆయన సృష్టించిన వచనపు అందాన్ని మాత్రం చివరకు ఆయన కూడా వేలెత్తి చూపలేడు!
––––––––––––––––––––––––––
జూన్‌ 25న రచయిత జార్జ్‌ ఆర్వెల్‌ జయంతి
(ఫన్డే 2014)



 

Tuesday, July 22, 2014

సురవరం ప్రతాపరెడ్డి: సాంఘిక చరిత్రకారుడు



‘మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే’నంటూ చరిత్రను సామాన్యీకరించి, దానిలో ఆత్మమాంసాల్ని నింపారు సురవరం ప్రతాపరెడ్డి. ‘రాజుల చరిత్రలు మనకంతగా సంబంధించినవి కావు. సాంఘిక చరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినట్టివి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగియుండిరో,  ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పు డెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో యవన్ని తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన నభిలషింతురు. తేలిన సారాంశమేమన సాంఘిక చరిత్ర మన చరిత్రయే!’ అన్నారు సురవరం– ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ పీఠికలో.

‘తెనుగు సారస్వతము, శాసనములు, కైఫీయత్తులు, నాణెములు, సామెతలు, దానపత్రములు, సుద్దులు, జంగమకథలు, పాటలు, చాటువులు, పురావస్తు సంచయములు’ ఇలాంటి సాంఘిక చరిత్రకు పనికివచ్చు సాధనములను సమగ్రదృష్టితో చూస్తూ, నిఘంటువులలో లేని పదాలకు అర్థనిర్ణయం చేస్తూ, ‘ఒక జీవితకాలపు ముక్తఫలం’ వంటి గ్రంథరాజాన్ని తెలుగునేలకు కానుక చేశారు.

ఇంకెన్నో జీవితాలకు సరిపడిన సాఫల్యతను కూడా ఆయన అందుకున్నారు. ‘ప్రచారకుడుగా, పరిశోధకుడుగా, విద్యార్థి వసతిగృహ నిర్వాహకుడిగా, న్యాయవాదిగా, పత్రికా రచయితగా, పుస్తక ప్రచారకుడిగా, ఉపాధ్యాయుడిగా, ఆంధ్ర మహాసభ నాయకుడిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, అనేక ప్రజా ఉద్యమాల, సంఘాల ప్రోత్సాహకుడిగా’ అనేక పాత్రల్లోకి పరిణమించిన ప్రతాపరెడ్డి... అప్పటి కాలం విసిరిన సవాలుకు ఒక దీటైన జవాబు.

సాహిత్యమూ రాజకీయమూ విడదీయలేని కాలంలో, తెలంగాణను తట్టి మేల్పొల్పవలసిన సందర్భంలో ‘గోల్కొండ’ పత్రికను నడిపారు. సంపాదకుడిగానేకాదు, మేనేజర్, సబ్‌ ఎడిటర్, ప్రూఫ్‌ రీడర్, గుమస్తా, చప్రాసీగా అన్ని బాధ్యతల్నీ తనే మోయాల్సిన గడ్డుకాలంలో కూడా పత్రికను తెచ్చారు. తానూ మూడు నాలుగు కలంపేర్లతో రాశారు. అత్యధిక ప్రజానీకపు భాషకు మన్నన దక్కని వాస్తవాన్ని మ.ఘ.వ.(మహా ఘనత వహించిన) నిజాం ప్రభువువారికి మరాఠీలు, కన్నడిగులను కూడా కలుపుకొని ఇలా నివేదించారు: ‘తమ మాతృభాషలను ప్రేమించుట ఉర్దూవారికివలెనే ఇతర మూడు భాషల వారికిని సహజమనుట గమనించవలసియుండును’.

‘రెండు కోట్ల రూపాయీల’ పైబడిన వ్యయంతో భాగమతి కోసం ఖులీ కుతుబ్‌షా తలపెట్టిన భాగ్యనగరం నిర్మాణం గురించి పాదుషా ఆజ్ఞను ఇలా ప్రస్తావిస్తారు: ‘గోలకొండ ఇరుకటంగా ఉంది. మా దర్జాకు తగినట్టుగా లేదు. ఆమిర్లకు ఇబ్బందిగావుంది. నదికి అవతలిభాగంలో నగరనిర్మాణం చేయవలసింది. నాలుగుబాటలు నాలుగువీధులుండవలెను. నాలుగు కమానులు నాలుగుదిక్కుల కట్టవలెను. 14000 దుకాణాలుండవలెను. 12000 మొహల్లాలు(వాడలు) ఉండవలెను’.

తెలంగాణలో కవులే లేరన్న విమర్శకుగానూ 354 మంది కవుల కవితలతో కూడిన ‘గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక’ ద్వారా ఆరోగ్యకరమైన సమాధానమిచ్చారు. అశ్లీల కథలుగా ముద్రపడి తిరస్కరణకు గురవుతున్న చలం కథల్ని ధైర్యంగా ‘సుజాత’లో ప్రచురించారు.

సంస్కృతం, ఉర్దూ, ఫార్సీ, ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషలు తెలిసిన ప్రతాపరెడ్డి ‘హిందువుల పండుగలు’, ‘రామాయణ విశేషములు’, ‘హైందవ ధర్మవీరులు’, కథలు, వ్యాసాలు రాశారు. మతపరమైన అంశాలు రాసినప్పుడు, ఆయనలోని ఆస్తికుడిని హేతువాది త్రోసిరాజన్నాడు. ‘ఇట్టి విమర్శ పూరాచారాభిమానులకు సరపడిద’నీ, వారికి ఆగ్రహము కలుగునని ఎరిగినప్పటికీ... చారిత్రక విమర్శలలో ఆగ్రాహానుగ్రహములకు తావులేదని కూడా ఆయన ఎరుగును.

హెదరాబాద్‌ రాష్ట్ర శాసనసభ్యుడిగా కూడా పనిచేసిన ఈ నిక్కమైన వైతాళికుడు, ‘ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నావంటివారు ఏమియును పనికిరారు’ అని బాధపడ్డారు. కానీ సాహిత్యపు వీధుల్లో ఆయన అధిరోహించిన పల్లకీకి భుజం ఆనడానికి సిద్ధపడేవాళ్లెందరో!

––––––––––––––––––––––––––––––––––––––––
మే 28న రచయిత, చరిత్రకారుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి

(ఫన్డే 2014)