‘నేను మామూలు ప్రధానిని; నువ్వు సంగీత సామ్రాజ్ఞివి,’ అన్నారు జవాహర్ లాల్ నేహ్రూ, సుబ్బులక్ష్మి ఆలపించిన ‘వైష్ణవో జనతో...’ విన్న తన్మయత్వంలో. ఇంకా ఆమె గానానికి ముగ్ధులైనవాళ్లలో మహాత్మాగాంధీ, హెలెన్ కెల్లెర్, యెహుదీ మెనుహిన్, బడే గులాం అలీఖాన్ వంటివారు కొందరు మాత్రమే! ‘రవ్వంత సాంస్కృతిక జ్ఞానం’ ఉన్న ప్రతి భారతీయుడూ ఎమ్మెస్‌ను ఏదోరకంగా ఎరిగివుంటాడు!
సుబ్బులక్ష్మి గొంతులో పదాలు ఎంత అందంగా పలుకుతాయో, పదాల మధ్య విరామం కూడా అంతే అందంగా వినబడుతుంది. పారిజాతాల్ని గుప్పిట్లోకి తీసుకున్నట్టు, పావురాళ్లను ప్రేమగా నిమిరినట్టు, యోగులెవరో ఉమ్మడిగా వరమొసగినట్టు, స్వర్గద్వారంలోకి బేషరతుగా ప్రవేశించినట్టు, దైవసన్నిధిలో తీరిగ్గా నడుము వాల్చినట్టు అనుభూతి కలుగుతుంది. గాయకీ, శ్రోతా ఇరువురూ ఏకకాలంలో అమరులవుతారు.
పుట్టుకతో కాకపోయినా, తన ఆహార్యంతో మరింత బ్రాహ్మణురాలిగా ఆమె కనబడేవారు. కాంచీపురం పట్టుచీర, వజ్రం పొదిగిన నాసికాభరణాలు, తిలకం, విభూతి దిద్దుకున్న నుదురు, ముఖ్యంగా ఎంతటి సంక్లిష్టమైన రాగంలోనూ చెదరని ఆమె వదనపు ప్రసన్నత...
కళను ఊపిరిగా బతికిన దేవదాసీల పరంపరలో ‘మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి’గా ఆమె జన్మించారు. పసిప్రాయంనుంచే సంగీత సరస్సులో ఈదులాడారు. ‘శకుంతలై’(1940), ‘మీరా’(1945) లాంటి తమిళచిత్రాల్లో నాయికగా నటించారు. శకుంతలైలో దుష్యంతుడి పాత్ర పోషించిన, జీఎన్‌బీగా ప్రసిద్ధులైన జి.ఎన్.బాలసుబ్రమణియంను ఆయన గానం సహా ఇష్టపడ్డారు. ఆయన శైలికి ప్రభావితమయ్యారు. ఇక ఒక్క క్షణం కూడా మీనుంచి నేను వేరుపడి ఉండలేను, అని ఇరవైల్లోవున్న సుబ్బులక్ష్మి ఒక లేఖలో రాశారు. తన ఇంట్లో ఉన్న అసంతృప్తికి ఆయన సాంగత్యం మాత్రమే విరుగుడుగా భావించారు. ‘కన్నా’ ‘అన్బే’(ప్రియమైన) లాంటి సంబోధనలతో జీఎన్‌బీకి సుబ్బులక్ష్మి రాసిన ఉత్తరాల్ని ఆమె జీవితచరిత్ర ‘ఎంఎస్– ఎ లైఫ్ ఇన్ మ్యూజిక్’ రాసిన టి.జె.ఎస్.జార్జ్ చూడగలిగారు. లేకపోతే, ఆమెలోని స్త్రీత్వాన్ని పట్టించే ఘటన చరిత్రపొరల్లో దాక్కుండిపోయేదే!
అయితే, వారి ప్రేమ ఫలవంతం కాలేదు. అదే శకుంతలై సినిమా నిర్మించిన త్యాగరాజన్ సదాశివంను ఆమె పెళ్లి చేసుకున్నారు. అప్పటికి భార్య మరణించివున్న సదాశివంతో ఆమె పెళ్లి... ఆమెకు ఉద్వేగ పరంగా నష్టం కలిగించిందేమోగానీ సంగీతపరంగా మేలు చేసిందంటారు. వివాహం తర్వాత ఆమె పూర్తిగా భారతీయ ఇల్లాలిగా ఆయనకు అంకితమైపోయారు. ఆయన మొదటిభార్య పిల్లలు రాధ, విజయను తన బిడ్డల్లా స్వీకరించారు.
పూర్తిగా కర్ణాటక సంగీతానికే సమర్పించుకోవడానికి సినిమాలను వదిలేసిన సుబ్బులక్ష్మిని తనచేతిలోని వజ్రంలా సానపెట్టారు సదాశివం. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవాడు, కల్కి పత్రికను నడిపినవాడు, ‘రాముడికి లక్ష్మణుడు ఎంతో, నాకు సదాశివం అంత,’ అని రాజాగోపాలచారిలాంటివాడిచే అనిపించుకున్న సదాశివం... భార్య శక్తినీ, విలువనీ పూర్తిగా ఎరిగి, నిర్వహణ సామర్థ్యంతోపాటు, ప్రజాసంబంధాలూ మెరుగ్గా ఉన్న సదాశివం... సుబ్బులక్ష్మిని పద్ధతిగా ప్రపంచగుమ్మపు ఒక్కో మెట్టే ఎక్కించారు. ఏం పాడాలో, ఎలా పాడాలో, ఏది ఒత్తి పలకాలో, ఏది పునరుచ్చరించాలో లాంటి ప్రతి చిన్న వివరాన్నీ ఆయన జాగ్రత్తగా చూసుకునేవారు. ఆమె ద్వారానే ఆయన సంగీత ప్రపంచంలో జీవిస్తే, ఆయన ద్వారానే ఆమె మొత్తంగా ప్రపంచంలోనే బతికింది. అందుకే ఆయన మరణించిన తర్వాత ఏ ఒక్క కచేరీ చేయలేదు.
తమిళం, తెలుగు, సంస్కృతం, హిందీ, మలయాళం, కన్నడం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో పాడిన సుబ్బులక్ష్మి... న్యూయార్క్‌లోని కార్నెజీ హాలునూ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీనీ వేదికగా చేసుకున్నారు. ఏ సామాజిక కారణం కోసమైనా ఆమె పాడకుండా లేరు. సదాశివం షష్టిపూర్తి సందర్భంగా ఆమెకు రాధ కానుకగా ఇచ్చిన బంగారుగాజుల్ని కూడా భారత్–పాక్ యుద్ధ సమయంలో ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశారట!
మానవాళితో సంభాషించడానికి తనను దేవుడు పంపిన సంగీత వాద్యంగా భావించుకున్నారీ భారతరత్నం(1916–2004). విష్ణు సహస్రనామం, భజగోవిందం, హనుమాన్ చాలీసా లాంటి వాటితో భక్తిని ఉత్సవంగా మలిచారు. ‘వేంకటేశ్వర సుప్రభాతం’ వినడానికి ఎంతటి దేవుడూ ఉత్సాహంగా నిద్ర మేలుకోవాల్సిందే!
తన ఉచ్చారణతో ఉచ్చారణను దిద్దుకునేంత స్పష్టంగా, ఒక మానవ కంఠనాళపు పరిధిని కూడా దాటి పాడారు. పాడినకొద్దీ తేటపడే గొంతుక ఆమెది. మనిషికీ దేవుడికీ మధ్య దూరాన్ని తగ్గించే గొంతు వంతెన ఆమెది.
(2014, సెప్టెంబర్ 16న ఎమ్మెస్ జయంతి సందర్భంగా ఫన్ డే లో సత్వం శీర్షికన రాసింది...)