ఒక గణింపుతో మాట్లాడాల్సివచ్చే ఫార్మల్ ఇంటర్వ్యూలంటే, నారాయణస్వామికి పూర్తి అయిష్టం. అదే ఉత్తినే ఇద్దరూ కూర్చుని, టేప్ రికార్డర్ ఆన్ చేయకుండా, తెలిసిన మనుషులకు మల్లే రోజువారీ విషయాలను కలబోసుకోవడం మహాఇష్టం. బహుశా, ఆ ‘క్యాజువల్ టోన్’ ఆయన్ని ‘ఆర్కే నారాయణ్’ అయ్యేలా చేసివుంటుంది!
‘రచయిత కావాలంటే మంచి చదువరి అయ్యుండాలి; భాషమీద గొప్ప సాధికారత ఉండాలి. కానీ కథ చెప్పేవాడిగా నిలబడటం దైవదత్తం. ఆయన పేజీ తిప్పేట్టు చేస్తాడు; రాస్తున్న మనిషి నీకు తెలుసు అనిపిస్తాడు. ఏ కోర్సూ కూడా నిన్ను ఆర్కే నారాయణ్ చేయలేదు,’ అంటాడు రచయిత జెఫ్రీ ఆర్చర్.
హెడ్‌మాస్టర్ కొడుకుగా అదేబాటలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా కుదిరినా, ఆ పని నారాయణ్‌కు ‘నిరర్థకం’గా కనబడిందట. అందుకే రచయిత అయిపోతానని వాళ్ల బామ్మ దగ్గర ప్రకటించేశాడు. ఆమె సూచన మేరకు, ఒక శుభముహూర్తాన(నిజంగానే) నోటుబుక్కు ముందేసుకుని కూర్చున్నాడు. స్వామి అనే పిల్లాడు ఒక చిన్న రైల్వేస్టేషన్‌కు వెళ్లడం, రైలు రాకపోకలు చూడటం అనే ఊహ తళుక్కుమందట! అదే ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’(1935)కు పడిన తొలివాక్యం.
చిన్న స్టేషన్, దానికో మాస్టర్, మర్రిచెట్టు... ‘స్టేషన్‌కు ఏం పేరు పెట్టాలి? రైల్వే టైమ్‌టేబుల్లో ఉండకూడదు. ఎందుకంటే ఎవరో ఒక అధికప్రసంగి, నువ్వు పేర్కొన్న దుకాణం లేదేమిటి, అని తప్పులు ఎంచుతాడు. అది వాస్తవ పట్టణం అయితే, ఆ చీదరంతా భరించాలి. అలాంటి ఆలోచనలో ‘మాల్గుడి’ నాలోకి దొర్లుకుంటూ వచ్చింది. దానికి అర్థం లేదు. తిరుచ్చి దగ్గర లాల్‌గుడి అని ఒక ఊరుంది; కుంభకోణం దగ్గరో మరోచోటో మన్‌గుడి అని మరో ఊరుంది. కానీ మాల్గుడి ఎక్కడా లేదు. నాకు కావాల్సిందే సరిగ్గా అదే’.
మాల్గుడికి కచ్చితమైన భౌగోళిక సరిహద్దులు లేవు, ఏవో కొన్ని కేంద్రాలు తప్ప. మళ్లీ, మాల్గుడి లాంటి ప్రదేశాలు మీకు వందలకొద్దీ కనబడతాయి. అలాగే స్వామి కూడా! అలాంటి పిల్లలు ఆఫ్రికాలోనూ ఉంటారు; అమెరికాలోనూ ఉంటారు. మళ్లీ స్వామికే ప్రత్యేకమైన మూలాలు కూడా ఉంటాయి. లోకల్, గ్లోబల్.
‘బాల్యంలో స్వీయస్పృహ తక్కువగా ఉంటుంది. విషయాలను విశ్లేషించవు; ఇలా జరగాలన్న అంచనాలుండవు; ఇది మంచి, ఇది చెడు అని తేల్చడానికి పూనుకోవు; జీవితం ఎలా వస్తే అలా స్వీకరిస్తావు; స్వాభావికంగా బతికేస్తావు’.
స్వామి ఇంగ్లీషులో మాట్లాడతాడు. ఆమాటకొస్తే ఆయన పాత్రలన్నీ ఇంగ్లీషులోనే మాట్లాడతాయి. పెరిగిన వాతావరణం వల్ల, అదొక పరాయి భాష అన్న భావనే ఆయనకు కలగలేదట. ఆయన్ని ప్రభావితం చేసిన పుస్తకాలూ, రచయితలూ... అంతా అదే భాష. అందుకే, పుట్టిన తమిళమంత, పెరిగిన కన్నడమంత మామూలుగా ఇంగ్లీషులో రాయగలిగాడు. తొలితరపు భారతీయ ఆంగ్ల రచయిత కాగలిగాడు. గ్రాహం గ్రీన్ స్నేహం ఆయన్ని అంతర్జాతీయ పాఠకులకు దగ్గర చేసింది. ‘ది ఇంగ్లీష్ టీచర్’కు ముందు ‘జాస్మిన్ హోమ్’ అని పేరు పెడదామనుకున్నారట నారాయణ్. కవితాత్మకంగా, ఆకర్షణీయంగా, కరుణరసపూరితంగా ఉండే శీర్షికల్ని గ్రీన్ వద్దనేవాడు. ఇద్దరిలోనూ ఉన్న ఆ పొడిమాటల గుణంవల్లే వారి స్నేహం అర్ధశతాబ్దంపాటు, గ్రీన్ మరణం వరకూ కొనసాగింది.
‘ద బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్’, ‘మిస్టర్ సంపత్’, ‘ఫినాన్సియన్ ఎక్స్‌పర్ట్’, ‘వెయిటింగ్ ఫర్ ద మహాత్మ’, ‘ద గైడ్’, ‘ద మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి’, ‘టాకెటివ్ మ్యాన్’ లాంటి నవలలు, ‘మాల్గుడి డేస్’, ‘అండర్ ద బన్యాన్ ట్రీ’ లాంటి కథాసంకలనాలు, ఆత్మకథ ‘మై డేస్’... అందంగా బౌండు చేసిన నోటుపుస్తకాలు తప్ప నారాయణ్‌కు రచయితగా పెద్ద డిమాండ్లేమీ లేవు. కాకపోతే, ‘ఆలోచించడంతో సరిపోదు. రాయడంవల్లే నువ్వు రచయిత కాగలవు’. మరొకటీ కావాలి: ‘జనాన్ని గమనించడంలో ఒక ఆనందం ఉండాలి; కానీ ఆ గమనింపు అదేపనిగా చేసినట్టుగా ఉండకూడదు’.
అయితే, ఆత్మకథాత్మకంగా కనబడే ఆయన పుస్తకాలకు, ‘ఈ కథలో ఏముంది? ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ శక్తివంతమైన క్లైమాక్స్ లేదు. అసలు ఎటు తీసుకెళ్దామని దీన్ని?’ లాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అయినా అదే శైలికి కట్టుబడి ఉండటానికి కారణం, ఇంకోరకంగా నేను రాయలేకపోవడమే, అంటారు. కానీ నెమ్మదిగా పాఠకుల్ని ఒప్పించగలిగారు. చిన్న మనుషులు, చిన్న సంపాదనలు, చిన్న సమస్యలు, అంతా చిన్నగా... పుస్తకం కూడా చిన్నదిగానే ఉండాలి; రెండొందల పేజీలకు మించకూడదు! రచయితకు ఒక ప్రత్యేక లక్ష్యం ఉండాలన్నది కూడా ఆయన అభిమతం కాదు. ఒక పాత్రగా, అది ప్రతినాయకుడైనా సరే, దాన్ని నిలబెట్టగలిగేదేదో పట్టుకోవడంలోనే ఉంది ఆయనకైనా, పాఠకునికైనా అసలైన మజా!
––––––––––––––––––––––––––––––––––––––––
అక్టోబర్ 10న రచయిత ఆర్కే నారాయణ్(1906–2001) జయంతి
(2014 ఫన్డే)