Saturday, November 30, 2019

Interested in just one thing: death.


I have always really been interested in just one thing: death. Nothing else. I became a human being when, at the age of ten, I saw my grandfather dead, whom at that time I probably loved more than anyone else.

It is only since that I have been a poet, an artist, a thinker. The vast difference which divides the living from the dead, the silence of death, made me realise that I had to do something. I began to write poetry. […] For me, the only thing I have to say, however small an object I am able to grasp, is that I am dying. I have nothing but disdain for those writers who also have something else to say: about social problems, the relationship between men and women, the struggle between races, etc., etc. It sickens my stomach to think of their narrow-mindedness. What superficial work they do, poor things, and how proud they are of it.

          Dezso Kosztolanyi
         Hungarian Poet and Writer (1885-1936)


Friday, November 8, 2019

ఆడియోలో రియాలిటీ చెక్

రియాలిటీ చెక్ కొన్ని భాగాలను ఇప్పుడు దాసుభాషితంలో వినవచ్చు. లింకు కింద.

ఆడియో రూపంలో రియాలిటీ చెక్


కొండ కథకు ముప్పై వేల రూపాయల బహుమతి


తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా(తెల్సా) మొన్న ఆగస్టులో నిర్వహించిన కథల పోటీలో నా 'కొండ' కథకు ముప్పై వేల రూపాయల మొదటి బహుమతి వచ్చింది. నేనో కథను పోటీకి పంపడమూ, దానికి బహుమతి రావడమూ ఇదే ప్రథమం. 
బహుమతి కథలన్నింటితో వారు ప్రత్యేక ఆన్‌లైన్‌ సంచిక దసరా రోజున వెలువరించారు. ఆసక్తి ఉన్నవారు ఈ లింకులో నా కథతో పాటు సంచిక మొత్తం చదవొచ్చు.

 తెల్సా ప్రత్యేక సంచిక 

నేను పేదవాడిని కాదుగానీ...



(5 నవంబరున ఎప్భీలో చేసిన పోస్టు)

నన్ను నేను పేదవాడిగా ఎప్పుడూ భావించుకోలేదు. రెండేళ్లు మినహా నా చదువంతా జరిగింది గవర్నమెంటు స్కూళ్లు, కాలేజీల్లోనే అయినప్పటికీ నేను పేదవాడినని అనుకోలేదు. డిగ్రీకొచ్చేదాకా నేను స్లిప్పర్లు వేసుకుని కాలేజీకి పోయినప్పటికీ నేను పేదవాడినని అనుకోలేదు. దేనికైనా నూరు రూపాయలు అడిగితే మా బాపు ముందు అరవై సరిపోవా అనేవాడు; తరువాత ఎనభైకి వచ్చేవాడు; సరిగ్గా ఆ క్షణానికి వచ్చేసరికి ఆ నూరు రూపాయల నోటేదో చేతిలో పెట్టేవాడు. కాబట్టి నాకు డబ్బుల లేమి అనేది ఎప్పుడూ తెలియలేదు.
ఇప్పుడు మా(నా) ఇంట్లో సన్నటి పెద్ద టీవీ లేదు, కొనగలగడం కన్నా అద్దింట్లో ఆ ఉన్న టీవే ఎక్కువ అనిపించడం వల్ల. చేతుల్తోనే ఉతుక్కుంటాం కాబట్టి వాషింగ్ మెషీన్ లేదు. ఫ్రిజ్లో పెట్టదగినదంటూ ఒకటి ఇంట్లో ఉండదనే నమ్మకంతో ఫ్రిజ్ కొనలేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టును నమ్ముకున్నవాడిని కాబట్టి వ్యక్తిగత వాహనం లేదు. మానసికంగా నాకో స్థిరత్వం రాలేదు కాబట్టి సొంతింటి గురించి ఆలోచన చేయలేదు. ఇలాంటి లక్షణాలున్నప్పటికీ నన్ను నేను పేదవాడినని ఎప్పుడూ అనుకోలేదు. నాకు అవసరమైన డబ్బులు నా దగ్గర ఎప్పుడూ ఉన్నాయి. డబ్బులు లేక నేను ఫలానాది కొనడాన్ని ఎప్పుడూ వాయిదా వేయలేదు. నేను అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఏ స్నేహితుడో ఫోన్ చేసి, అర్జెంటుగా ఓ నాలుగు వేలు ఉన్నయా అంటే ఇవ్వడానికి నా దగ్గర ఎప్పుడూ డబ్బులున్నాయి.
నా దగ్గర తగినన్ని డబ్బులు ఉన్నప్పటికీ నాలో ఒక ఊరితనం ఉంటుంది. ఆ ఊరితనం గమనింపులోకి వస్తుందేమో అనుకునే ప్రతిచోటునీ నేను వెళ్లకుండా అవాయిడ్ చేస్తాను. అందుకే హైదరాబాద్లో చాలా చోట్లు నాకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందుకే మా పిల్లలను నా మానసిక స్థితికి ఇబ్బందికాని బళ్లలోనే వేశాను. కానీ అది మళ్లీ ఒక న్యూనత కలిగిస్తుంది. నేను దాటలేని అవరోధాల వల్ల పిల్లల్ని సరైన స్కూళ్లలో వేయలేదేమో, వాళ్లకు తగిన చదువును నేను ఇవ్వలేకపోతున్నానేమో, చేజేతులా వాళ్లకు అన్యాయం చేస్తున్నానేమో అని విచారం కలుగుతుంది.
ఇంక దాన్ని దాటి తీరాలని నిశ్చయించుకుని, చాలా రకాలుగా సెర్చ్ చేసి ఎంపిక చేసుకుని, ఇవ్వాళ ఒక స్కూలుకు వెళ్లాను. వాళ్లు చెప్పిన ఫీజు అక్షరాలా రెండు లక్షల యాభై ఎనిమిది వేలు. దీన్నో మూడు దఫాల్లో కట్టొచ్చు. ట్రాన్సుపోర్టుకు ఒక నలభై నాలుగు వేలు. దీన్ని రెండు దఫాల్లో కట్టొచ్చు. ఇంకా యూనిఫామ్స్, పుస్తకాలు ఈ ఖర్చులో లేవు. ఒక పిల్లాడు స్కూలుకు వెళ్తున్నాడంటే ఇంకా ఇతరత్రా ఖర్చులు ఎలా వస్తుంటాయో పిల్లల్ని బళ్లకు పంపే తల్లిదండ్రులకు తెలిసేవుంటుంది. కొంత కాషన్ డిపాజిట్ కూడా ఉందిగానీ అది పిల్లాడిని మాన్పించినప్పుడు మనకు తిరిగిచ్చేస్తారు. ఈ వివరాలను వాళ్లు చెబుతున్నప్పుడు, రేపు పొద్దున్నే వచ్చి ఏక మొత్తంలో చెల్లించేవాడిలాగా బయటపడకుండా మేనేజ్ చేశాను.
నేను పోయిన స్కూల్ దగ్గరలోనే ఇంకోటి కనబడింది. దాని గురించీ కొంత వినివున్నాను కాబట్టి, ఎటూ ఇంతదూరం వచ్చానుకదా అని అక్కడికీ వెళ్లాను. వాళ్లు ఒక లక్ష డెబ్బై వేల ఫీజు, నలభై వేల ట్రాన్సుపోర్టు అన్నారు.
జీవితంలోని అత్యంత రసహీన క్షణాలు ఏమైనా ఉన్నాయంటే అది డబ్బుల గురించి మాట్లాడుకోవడం అని నేను అనుకుంటాను. అందుకే నీకు జీతం ఎంతొస్తుంది, ఈ సంవత్సరం ఎంత పెరిగింది లాంటి ప్రశ్నల్ని నేను నా నోటితో ఎవరినీ అడగను. నేనేమీ ఇవ్వాళే గుడ్డులోంచి బయటికి వచ్చి లోకాన్ని చూస్తున్నవాణ్ని కాదు. ఎంతెంత మంది ఎంతెంత తక్కువ సంపాదనలతో బతుకులను వెళ్లదీస్తున్నారో నా అవగాహనలో లేని విషయమూ కాదు, ప్రైవేటు బళ్లలో ఫీజులు ఎలా ఉంటున్నాయనే విషయం నాకు ఇంతకుముందు తెలియదనీ కాదు. ఇప్పుడు చెప్పిన దానికి కనీసం నాలుగు రెట్లు ఎక్కువ ఫీజులున్న స్కూళ్లు కూడా నాకు తెలుసు. కానీ ఆ వాస్తవం మీది నుంచి నేను దొర్లుకుంటూ వెళ్లిపోయేవాణ్ని. అది నా కంఫర్ట్ ఏరియా కాదనుకున్నాను కాబట్టి అటువైపు వెళ్లలేదూ, వాటిగురించి పట్టించుకోలేదూ.
నేను ఇద్దరు పిల్లల తండ్రిని. నా పెద్దకొడుకును ఆర్టిస్ట్ అండ్ పొయెట్ అనుకుంటాను. నా చిన్నకొడుకును స్పోర్ట్స్ మన్ అనుకుంటాను. కానీ ఒక్కసారిగా– నువ్వేమి చేసీ కనీసం ఆ రెండో స్కూల్లోనైనా నీ ఒక్క పిల్లాణ్ని కూడా చేర్పించలేవూ, ఇదంతా నువ్వు అంగీకరించి తీరవల్సిన వాస్తవమూ అనిపించేసరికి జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు నిరుపేదరికం అనుభవంలోకి వచ్చింది.

Friday, June 14, 2019

బతికున్న వాక్యంతో బతుకులోకి నడిపించే...

(మే 2016 చినుకు మాసపత్రిక కోసం జి.లక్ష్మీనరసయ్య గారు రాసిన ప్రత్యేక వ్యాసం)

తన మిత్రుడూ, నోబెల్‌ కవీ అయిన W.B.Yeatsను పరామర్శిస్తూ, How are you అని అడుగుతాడు O’Connor. బదులుగా Not very well, I can only write prose అంటాడు Yeats. కవులకి వచనం అంటే ఎంత చులకన భావమో సూచిస్తుందిది. తెలుగులో కూడా త్రి.శ్రీ. లాంటివాళ్లు ‘వచనమై తేలిపోతావ్‌’లాంటి అభివ్యక్తి ద్వారా వచనాన్ని పలచనజేస్తూ మాట్లాడారు. దీనికి భిన్నంగా వచనాన్ని ఒక Civil art లాగా an affair of good mannersగా వర్ణించాడు Somerset Maugham. ఇంకాస్త ముందుకుపోయి The Poet gives us his essence; but prose takes the mould of the body and mind entire అంటుంది Virginia Woolf. మంచి వచన ప్రాముఖ్యత గురించి కొ.కు., చే.రా.లు కూడా సానుకూల వాదన చేశారు. ఇలా కవులూ, రచయితలూ వారి వారి ప్రక్రియల్ని వెనకేసుకు రావటం మామూలే. కాని మంచి వచనం రాసిన కవులు ప్రపంచ వ్యాపితంగా ఉన్నారు. Shelley, Coleridge, T.S.Eliot, W.H.Auden, ఇంకా W.B.Yeats కూడా తమ సమకాలీనుల కంటే మంచి వచనం రాశారు. మన శ్రీశ్రీ, శివసాగర్, శివారెడ్డి, హెచ్చార్కె, సీతారాం, సతీష్‌ చందర్‌లు కవులుగా ఉంటూనే చక్కని వచనాన్ని రాశారు. అలాగే తమ వచనంలో కవిత్వాన్ని పండించిన వచన రచయితలూ ఉన్నారు.  James Joyce, Vladimir Nabokov, Miller, Soyinka, Ben Okri లాంటివాళ్లూ, తెలుగులో చలం, రావిశాస్త్రి, పతంజలి, స్వామి, గోపిని కరుణాకర్, వి.ఆర్‌.రాసాని, నామిని తమ వచనంలో చిక్కని కవిత్వాన్ని నిర్మించిన రచయితలు. ప్రస్తుతం ఈ కోవలోకి పూడూరి రాజిరెడ్డి కూడా వచ్చాడు.
గత పది సంవత్సరాల నుంచి తెలుగు సాహిత్యంలో సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్న రచయిత పూడూరి రాజిరెడ్డి. ఒకటి తరువాత ఒకటిగా ‘మధుపం’(2009), ‘పలక–పెన్సిల్‌’(ఆగస్ట్‌ 2013), రియాలిటీ చెక్‌ (డిశంబర్‌ 2013) పుస్తకాల్ని విడుదల చేసి తెలుగువారి మనసుల్ని కొల్లగొట్టాడు ఈ రచయిత. ఇంకా తను రాసిన ఏడు కథలు కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపును ఇవ్వటం సాహితీ ప్రియులకు తెలుసు. ‘‘నేను కొన్ని కథలు రాసినప్పటికీ, ప్రక్రియల మూసల్లో ఇమడని వాక్యం నాకిష్టం. ఏ రూపంలోనైనా నన్ను నేను వ్యక్తం చేసుకోవడం నాకిష్టం. కథకుడిగా కన్నా ప్రోజ్‌ రాసేవాడిగా నన్ను నేను భావిస్తాను’’ అంటాడు రాజిరెడ్డి. ఏది ఏమయినా ఈయన రాకతో తెలుగు వచనం ఫేస్‌ వాల్యూ పెరిగింది. కొత్త రక్తం ఎక్కి నవనవ మెరిసిపోతుంది.
ఒక పేజీ బతికున్న వచనాన్ని రాయగలిగిన ఏ రచయితయినా మన జీవితానికి కొంత సమకూర్చినట్లే. అట్లాంటిది ఏకంగా ఏడెనిమిది వందల పేజీల్ని జీవంతో తొణికిసలాడే మాటలు, పదాలుగా, వెరసి వైబ్రేటింగ్‌ వాక్యాలుగా మలచటం మామూలు పని కాదు. ఈయన వాక్యాన్ని ‘మోహపరిచే వాక్యమనీ’, ‘వెంటాడే వాక్యమనీ’ గుడిపాటి సరిగానే వర్ణించాడు. సుధామయి ‘మనసున్న వాక్యం’ అని పిలిచారు. రాజిరెడ్డి వాక్యంలో ‘కత్తిలోతు’ ఉందని అఫ్సర్‌ అంటాడు. ఇది ‘యూత్‌ఫుల్‌ ఎక్స్‌ప్రెషన్‌’ అని రఘోత్తమ రెడ్డి మెచ్చుకుంటాడు. అతని వాక్యాల్లో ‘పొట్టి కవితలు’న్నాయని విహారి పరిశీలన. చింతపట్ల సుదర్శన్‌ ప్రకారం ‘వాక్యాన్ని ఎన్ని రకాలుగా సుసంపన్నం చేయొచ్చో అన్ని రకాలూ చేశాడు రాజిరెడ్డి’. మాధవ్‌ శింగరాజుకయితే అతని వాక్యం ‘స్ప్రయిట్‌’. నా మటుకు నాకు ఇతని వాక్యాలు బతికున్న వాక్యాలు. అర్థంతో జవజవలాడే వాక్యాలు. మభ్యపెట్టే మధుర వాక్యాలు. వాక్యాలకు సంబంధించి ఇంతగా ఆకర్షించిన రచయిత ఇటీవలి కాలంలో లేడని చెప్పాలి. ఇంత ఆకర్షణకి కారణమేంటని ఆలోచిస్తే మూస శైలిని బద్దలు కొట్టుకుని బయటపడటమే అని తేలుతుంది.
ప్రక్రియా పరంగా చూసినా రాజిరెడ్డిది నమూనాలో ఇమడలేనితనం. అది కథా, కవిత్వమా, గల్పికా, మ్యూజింగా, మెమొయిరా, ప్రేమలేఖా, స్కెచ్చా, రిపోర్టా– లేక అన్నో, కొన్నో కలిసిన ప్రక్రియా అని స్పష్టంగా చెప్పలేని స్థితి. ఏదయినా ఉండొచ్చూ ఏదయినా లేకపోవచ్చు. అమలులోని ప్రక్రియా నియమాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఫ్లెక్సిబుల్‌గా సాగిపోవడం వల్ల రూపొందిన శిల్పమే ఇది. ఈ శిల్పమే అతని వ్యక్తిత్వాన్నీ, వస్తు వైవిధ్యాన్నీ ప్రతిఫలిస్తుంది. Technique is the key to understand the అని Ezra Pound అందుకే  అంటాడు. మూసలో ఇమడలేని స్వేచ్ఛాకాంక్ష, సిద్ధమయి ఉన్న బట్టల్లోకి దూరిపోలేని తనం, లిబరేటెడ్‌ రీతి సిద్ధాంతాల, వాదాల చట్రంలో ఇరుక్కోకుండా జీవిత వాస్తవికత ప్రాతిపదికగా తను చేసిన ఆలోచనల్లో, చింతనలో ప్రతిఫలించటం మనం గమనిస్తాం.
సిసలయిన అనుభవాల తాకిడికి సిద్ధాంతాల పదును తగ్గిపోతుంది. అసలయిన అనుభూతుల సమక్షంలో అతిశయవాదాలు వెలవెలబోతాయి. చూసిన దాన్ని గురించే రాయడు రాజిరెడ్డి. చూసిన దాని గురించి ఏం ఫీలయ్యాడు, అట్లాగే అనుభవంలోకి వచ్చినదాన్ని గురించి ఏ స్పందనలు పొందాడు, ఆ క్రమంలో అతనిలో పనిజేసిన లాజిక్‌ ఏంటి, రీజన్‌ ఏంటి, వాటితో ప్రయాణిస్తూ తాను చేసిన తాత్విక ప్రయాణం ఏంటి, ఇవీ రాజిరెడ్డి రచనల్లో మనకు కనిపించే విషయాలు. రోజువారీ అనుభవాలనుంచీ ఈతి బాధలనుంచీ ఆచరణాత్మక పాఠాల్నీ, సమీక్షల్నీ పోగుచేసుకుంటూ పాఠకులకు ఒక Practical wisdomని సరళంగా సాంద్రంగా అందిస్తూ పోతాడు. ఒక నైతిక విచికత్సకు తాను గురవుతూ మనల్నీ గురిచేస్తాడు. శైలిలో స్థిరత్వం లేనట్లే వస్తు ఎన్నికలో కూడా అతనికి స్థిరత్వం లేదు. ఒకానొక సందర్భంలో Pablo Picasso అన్నట్లు, He just goes on trying other things. ఈ స్వభావమే పబ్లిక్‌ టేస్ట్‌ని హిట్‌ చేసింది.
వస్తు రూపాల్లోని ఈ ప్రవాహ శీలతతో పాటు దాపరికం లేనితనం కూడా ఇతన్ని పాఠకులకు సన్నిహితుణ్ణి చేసింది. అసాధారణ విషయాల గురించి ఇతను మాట్లాడడు. సాధారణ విషయాల్ని గురించి అసాధారణంగా విశ్లేషిస్తాడు. అందరి అనుభవాల్లో గమనింపులో ఉన్న వాటికి భిన్నంగా స్పందించటం వీలుంటే దానికొక తాత్విక ముగింపు ఇవ్వటం. ఇలాంటి పనుల్ని కొ.కు., చలం చేసి ఉన్నారు. గోర్కీ, రాహుల్‌ సాంకృత్యాయన్‌లు కూడా ఇదే చేశారు. ఎంత కాదనుకున్నా వీరిది బోధనా శైలి. వీరు ఉపదేశాలిస్తున్నట్లుంటుంది. రాజిరెడ్డి ఆలోచన రేకెత్తించే మాటలు చెబుతున్నట్లుంటుంది. సూత్రీకరణలతో కాక సంస్కారంతో తర్కాన్ని బేరీజు వేసినట్లుంటుంది. పైవారిని పెద్దలుగా గుర్తించి గౌరవించాలనిపిస్తుంది. రాజిరెడ్డిని మనలోని తడి ఉన్న చింతనాపరుడిగా గుర్తించి అక్కున చేర్చుకోవాలనిపిస్తుంది. గొంతులో ఎక్కడా చదువరులకంటే ఒక మెట్టు పైనున్న స్పృహలేని చెలిమిపూర్వకమయిన శైలి పాఠకుల్ని ఇతని వశం చేస్తుంది. అందుకే ఇతని దారి పాలొ కొయిలొ దారికి దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా Like the Flowing River, Thoughts and Reflectionsకి చెందిన కొయిలొతో ఎక్కువ దగ్గరితనం కనిపిస్తుంది.
స్త్రీ ఆధారంగా ‘పురుషుడికి సంబంధించిన ఎన్నో ఎమోషన్సును’ పాఠకులకు పట్టించడానికే తాను ప్రయత్నిస్తున్నట్లు ‘మధుపం’లో ప్రకటించాడు రచయిత. ఆఫీసులో, ఇంట్లో, సమాజంలో పురుషులు స్త్రీ ద్వారా పొందే ఎన్నో రకాల స్పందనలనీ, భావోద్వేగాలనూ హేతుబద్ధమయిన రొమాంటిసిజమ్‌తో బయటపెడతాడీ పుస్తకంలో. పురుషుడు స్త్రీ పట్ల ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటున్నాడు, దాంపత్యంలో భార్యాభర్తల మధ్య నడుస్తున్నదేంటి నడవాల్సిందేంటి, సంసార స్వభావం ఏంటి, ఇట్లాంటి విషయాల్ని డీల్‌ చేస్తూ సంబంధిత సన్నివేశాల్నీ, పాత్రల్నీ, సంభాషణల్నీ నాటకీయతనీ ప్రవేశపెడుతూ ఈ విషయాలకు చెంది పాఠకుల్లో ఉన్న సానుకూల వాతావరణాన్ని సౌందర్యీకరిస్తూ లేనిదాన్ని వారి ఎరుకలోకి తెచ్చే ప్రయత్నంలో సాగిపోతాడు రచయిత. ‘నాకో ప్రేమలేఖ రాయవూ’ అని అడుగుతూ, ‘జీతం సంపాదించటం కాదురా, జీవించటం నేర్చుకో, బీ రొమాంటిక్‌. కొంచెం పొయెటిక్‌గా ఉండు ప్లీజ్‌’ అని భర్తకు భార్య పెట్టుకున్న రిక్వెస్టు ద్వారా సాటి మగవాడికి యాంత్రికంగా ఉండొద్దని చేసే హెచ్చరిక ఉంది. ‘ముసుగులు లేకుండా మాట్లాడితేనే నేను సేద తీరుతాను’ అని మరోచోట భార్యతో అనిపిస్తూ మగవాడి అసహజ ప్రవర్తనని సూచిస్తాడు. ‘మన జీవితంలో భార్యాపిల్లలున్నారు తప్ప మనం లేము’ అని మగవాడి ఎరుకలోకి ఒక నిజాన్ని పట్టుకొస్తాడు. మాయ చేసైనా భార్యను సంతోష పెట్టటానికి అవసరమయిన మార్గాల్ని సూచిస్తాడు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎంత సజీవంగా ఉన్నాడో భర్త అయిన తరువాత కూడా భార్యతో ఆ సై్టల్‌లోనే ఉండమంటాడు. కారణం? ‘బ్రహ్మచారి తనలోకి భావుకుడి దీపాన్ని కొడిగట్టనివ్వకుండా వెలిగించుకుంటూ ఉంటాడు’. ఇంకా ముందుకుపోయి ‘కుతూహలం పోవడమే జీవితంలో నిరాసక్తతకి కారణం’ అంటాడు. ‘మగటిమి’ని ఎద్దేవా చేస్తూ ‘మనం సీతయ్యలం. ఎవరి మాటా వినం’ అని మగవాళ్లకు చురక పెడతాడు.
స్త్రీలను ఉద్దేశించి ‘మీరు దేవతలు’ అన్న పేరుతో బ్రిలియంట్‌ కన్ఫెషనల్‌ కవిత్వం రాశాడు. ‘మా చెప్పులు తెగితే మీ రక్తనాళాలు తెగినట్లుగా, మాకు తలపోటు వస్తే మీకు గుండెపోటు వచ్చినంతగా విలవిల్లాడతారు’ అంటూ స్త్రీలముందు భేషజాల్ని వదిలి మోకరిల్లిన ఇతన్ని ఇష్టపడని పాఠకులుంటారా. చివరికి నేనెవరు అని ప్రశ్నించి ‘నేనంటే నేనే. లేదా కొందరి సమ్మేళనాన్ని. వాళ్లలోంచి వడగట్టిన భావసారాన్ని’ అని ముగించటం విజ్ఞాన దాయకం. ఇలా ‘మధుపం’లో స్త్రీ పురుష సంబంధాలకు ప్రాముఖ్యత కనపడినా దాన్ని వెన్నంటి ఒక తాత్విక చింతనా ధార నడుస్తూనే ఉంది.
‘పలక–పెన్సిల్‌’ అనే పుస్తకంని ‘ఒక మగవాడి డైరీ’గా చెప్పుకున్నాడు రచయిత. దీన్ని ‘అనుదిన తాత్వికుడి డైరీ’ అని కరెక్టుగా వర్ణించాడు అఫ్సర్‌. ఇది చదువుతూ ఉంటే Pablo Neruda ‘Memoirs’తో పాటు చలం ‘మ్యూజింగ్స్‌’ గుర్తుకొస్తాయి. బాల్యం నుంచి నేటివరకూ గడిపిన జీవితం దాని తాలూకు జ్ఞాపకాలూ, ఘటనలూ, ఊరు, బంధుజనం, కుటుంబం– వాటినుంచి ఉత్పన్నమయిన ఆలోచనలూ, తాత్వికత ఇందులో కనిపిస్తాయి. Thanks for the memories అంటాడు Leo Robin. Storing up few memories is my only chance to collect a past అంటాడు P.G.Wodehouse. ‘మన ఆస్తి మనం పోగేసుకున్న జ్ఞాపకాలేనని ఇప్పటికీ నమ్ముతాను’ అని పై ఇద్దరికంటే ఇంకా అందంగా చెబుతాడు రాజిరెడ్డి. ‘మా ఊరి ముచ్చట’ అంటూ తన ఊరి జ్ఞాపకాల్ని ముచ్చటిస్తాడు. ‘అంగీ విప్పితేనే హీరో’ అనుకున్న రోజుల్లోని అందమయిన జ్ఞాపకాల్ని వర్ణిస్తాడు. నామిని స్ఫూర్తితో స్కూలు రోజుల్లోకి వెళతాడు. పికాసో తరహా అర్థంకాని బొమ్మల్ని గీసిన జ్ఞాపకంతో ‘అర్థం వెతక్కుండానే జీవితంలో కొన్నింటిని ఆనందించవచ్చు’ అని వ్యాఖ్యానిస్తాడు.
ఇట్లా మొదలయిన చింతన చిక్కని తాత్వికతగా రూపొందుతుంది. ఒక పని చేసినందుకూ బాధపడటం, చేయనందుకూ బాధపడటమనే మనిషి స్వభావాన్ని స్పష్టత రాహిత్యానికి నిదర్శనంగా చూపుతాడు. ‘అటా? ఇటా? అదా? ఇదా?’ అనుకుంటూ సందిగ్ధంలో గడిపే అనివార్యతని జీవితానికి సహజమయినదిగా సూచిస్తాడు. ‘అది తప్పే కదా మరి’ అని తేల్చడం కన్నా కూడా మనల్ని మనం శాంతిగా ఎలా ఉంచుకోవాలన్నదే ముఖ్యం అని అంతా పర్‌ఫెక్ట్‌గా సాగాలనుకునే వాళ్లకు చెబుతాడు. Then Note Books అన్న పుస్తకంలో Every fulfilment is Slavery. It drives us to a higher fulfilment అని Albert Camus అభిప్రాయ పడతాడు. ఇలాంటి భావననే రాజిరెడ్డి ఎంత పాజిటివ్‌గా తీసుకొస్తాడో చూడండి: ‘తనకు తానే వృత్తం గీసుకుంటూ,  తిరిగి ఆ వృత్తాన్ని చెరిపేసి కొత్త పరిధిని శాసించుకుంటూ, మళ్లీ తనను తాను కొత్త విలువలకు ట్యూన్‌ చేసుకుంటూ వెళ్లడమే మనుషులు చేసేది, చేయాల్సింది, చేయగలిగేది’ అని ఊరుకోకుండా, ‘మనిషి సంతృప్తిగా బతకడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తదుపరి విలువల్ని చేరుకోవడంలో మాత్రమే లేదు. అది చేరుకోవడానికి చేసే ప్రయత్నంలో కూడా మామూలుగా ఉండగలగడం అత్యావశ్యం. ఎందుకంటే ప్రతిచోటా ఉన్నది జీవితమే.’ మనిషి ప్రవర్తనకీ, పరుగుకీ సంబంధించిన భౌతిక పరిస్థితుల ప్రభావాన్ని విస్మరించకుండానే తనను తాను సంభాళించుకోవటం అనేది తన చేతిలోనే ఉందని సూచిస్తాడిక్కడ.
‘రియాలిటీ చెక్‌’ని కొన్ని ‘కిటికీ ప్రయాణాలు’గా క్యాప్షన్‌ పెట్టుకోవడానికి కారణం వాటి పరిమితిని సూచించడానికేనని వివరణ ఇస్తాడు. తను జీవితం అనడం అంటే ఒక ‘జీవిత శకలమే’ అనడంలోనూ ఈ పరిమితి వ్యక్తమయింది. ‘నాకు కనిపించిందీ, నాకు అనిపించిందీ’; ఇదే పుస్తక సారాంశంగా స్పష్టం చేస్తాడు. ఇందులో పాఠకుల్ని పూర్తి అవుట్‌డోర్‌ వాతావరణానికి తీసుకెళ్లడం వల్ల పుస్తకం లావుగా ఉన్నా బోరు కొట్టదు. వర్ణన శైలీ, చెబుతున్న విషయాలూ చాలావరకు యూత్‌తో కనెక్టివిటీ కలిగి ఉంటాయి. తుమ్మేటి రఘోత్తమ రెడ్డి అన్నట్లు ‘జీవితంలోని చీకటి కోణాల్లోకి వెలుతురు ఫోకస్‌ చేస్తాడు’. ఇక్కడే ఉంది దీని ఆకర్షణ. రోడ్డు ప్రమాదాల్లో పోయే ప్రాణాల గురించీ, పోలీస్‌ స్టేషన్ల గురించీ, ఇరానీ హోటల్ల గురించీ, హిజ్డాల గురించీ, వ్యభిచారుల గురించీ, అడ్డా కూలీల గురించీ, మార్కెట్ల గురించీ, ఇందిరా పార్కుల గురించీ– ఇలా అనేక ప్రదేశాలతో ముడిపడిన విభిన్న సన్నివేశాల్నీ, సందర్భాల్నీ, మనకు చూపిస్తూ తన dispersed meditationsని (Francis Bacon తన వ్యాసాల గురించి అన్న మాటల్నుంచి) మనమీద కురిపిస్తూ పోతాడు. మంగలి సామాన్ని దగ్గర పెట్టుకోని రష్యాని తెలుసుకోవడానికి సంచరిస్తాడు మాక్జిమ్‌ గోర్కీ. డబ్బు అవసరపడిన ప్రతిసారీ జనానికి క్రాఫులూ, గడ్డాలూ చసి విరామంలో సంచరిస్తూ అన్వేషిస్తూ ఆ అనుభవాల్ని తాత్విక సాహిత్య ముక్కలుగా లోకానికందించాడు. మన సాంకృత్యాయన్‌ కూడా సంచార రచయితే. ఎందులో భాగంగా చేసినా ఈ పుస్తకంలో రాజిరెడ్డి చేసింది సంచార రచనే.
సృష్టి యథాతథ స్థితిని అంగీకరించేలా ఇతన్ని పురికొల్పుతున్న ప్రతిదీ దేన్నీ ప్రశ్నించలేని మౌనిగా నిలబెడుతుంది. ‘‘తనను తాను పెంపుచేసుకుని, శిఖర సమానమైన, అధిరోహించలేనంత ఎత్తున నిలబడే ఆయా ప్రతికూల భావనలకూ, వాటిని జయించలేని మనిషి అశక్తతకూ, అలా నిర్దేశించిన సృష్టికర్త సృజనకూ... చేతులెత్తేస్తూ, చేతులెత్తి మొక్కుతూ’’ అన్నప్పుడు ఆ మౌనితనానికి చెందిన ఆధ్యాత్మికత వ్యక్తమవుతుంది. Human life begins on the other side of despair అని Sartre అభిప్రాయపడినట్లు, నిర్వేదం నుంచి ఆధ్యాత్మిక జీవితం వైపు చూస్తున్నాడా ఈ రచయిత అని కొంతమంది కనిపించవచ్చు. ఇతని నిర్వేదం తాత్కాలికమే. ‘నువ్వు విజేతవైనప్పుడు, పక్కవాడు పరాజితుడు కాని రోజున ఈ ప్రపంచం మరింత బాగుంటుంది’ అని సెలవు తీసుకుంటాడు.
మానవ పరిమితుల్ని గుర్తిస్తూ, పరిమితులు ఉండటమే మానవ మస్తిష్కపు ప్రత్యేకతగా అంగీకరిస్తూ సాగిపోయే రాజిరెడ్డి Celia Green తన Aphorismsలో చెప్పినట్లు The remarkable thing about the human mind is it’s range of limitations అని మనకు గుర్తు చేస్తున్నట్లుంటుంది.
మధ్యతరగతి ప్రజల్ని ఉద్దేశించి రాస్తూ Michael Green బల్లగుద్ది చెబుతున్నట్లుగా ఇలా రాస్తాడు: Happiness is never really so welcome as changelessness. సంతోషం కంటే యథాతథ స్థితే మెరుగనుకోవడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఇలా అనుకుంటారని రచయిత ఉద్దేశ్యం. ‘యథాతథస్థితిలోనే ఒక ప్రశాంతత దొరకాలి. నా తక్షణ లక్ష్యం ఈ రోజు హాయిగా నిద్రపోవడం’ అంటాడు మన రాజిరెడ్డి. మిడిల్‌ క్లాస్‌ సైకీకి బాగా అప్పీలయ్యే ధోరణిది. ఈ ధోరణి సామాజిక పురోగతికి ఆటంకమేమో అని నాలాంటివాళ్లకు అనిపిస్తుంది. అలాగే యథాతథ స్థితిలో ప్రశాంతత దొరికే అవకాశం ఉందా? అలాంటి ప్రశాంతత దొరకగలిగినప్పుడు రచయితే ఎన్నోచోట్ల ఎన్నో సందర్భాల్లో ఎందుకు అశాంతికి గురికావాల్సి వచ్చింది? ఇలాంటి కొన్ని సందేహాలు నాకు కలిగాయి. ఇవి పొరపాటు కావచ్చేమో నాకు తెలీదు. అలాగే కొన్నిచోట్ల సింప్లిస్టిక్‌ అనిపించే స్టేట్‌మెంట్సు కూడా రాజిరెడ్డి చేస్తూ ఉంటాడు: ‘పిల్లాడు తప్పుగా మాట్లాడితే మనకు కోపం రాదు. వాడింకా మాటలు నేర్చుకుంటున్నాడని అనుకుంటాం. అలాగే ఈ జనమంతా ఇంకా బతకడం నేర్చుకుంటున్నారనుకోవచ్చు కదా!’. పిల్లల తప్పులకీ పెద్దవాళ్ల తప్పులకీ తేడా లేదా? ఉన్నప్పుడు ఇద్దరి పట్లా ఒకే రకంగా ఎలా వ్యవహరిస్తాం?  ‘ఈ ప్రపంచం ఇంకా నేర్చుకుంటూనే ఉందేమో. పర్‌ఫెక్ట్‌ అవడానికి సమయం పడుతుందేమో’ అనే ధోరణి సమాజాన్ని మార్చుకోవటానికి జరిగే ఉద్యమాలకు సానుకూలం అనిపించదు. ప్రపంచాన్ని మార్చాలని పూనుకున్నవాళ్లను తప్పు పట్టొద్దని తను చెప్పినప్పటికీ, మార్పు పట్ల వ్యక్తమయిన ధోరణి మాత్రం కొంత ప్రశ్నించదగినదే.
ప్రక్రియాపరంగా నమూనాల నడుములిరచగలిన రాజిరెడ్డి విషయపరంగా చాలావరకు మధ్యతరగతి నమూనాలో చిక్కుకుపొయ్యాడా అనికూడా నాకినిపిస్తుంది. మర్యాదా, మప్పితం, శాంతీ, సౌందర్యం, సృజన, ఊహాత్మకత, తర్కం, తత్వం, వివేకం, హేతుబద్ధత– ఇలాంటి విషయాల గురించి అద్భుతంగా స్పందనాత్మక విశ్లేషణ చేయగలిగిన రచయిత సామాజిక అసమానత్వాలూ, అన్యాయాలూ, అధికార సంబంధాలూ లాంటి విషయాల గురించి పెద్దగా స్పందించకపోవటం మధ్యతరగతి పరిమితికి లోబడే తన రచన సాగించాడనేదానికి నిదర్శనం. ఇదేదో తప్పని చెప్పటం ఇక్కడ నా ఉద్దేశ్యం కాదు. నిజానికి తన రచనా పరిమితుల్ని రచయితే నిజాయితీగా చెప్పుకున్నాడు కనుక నేనిక్కడ రంధ్రాన్వేషణ చేయనక్ఖర్లేదు.
రాజిరెడ్డి పుస్తకాల్ని రెండు మూడు సార్లు చదవగలిగాను. కొన్ని ఖండికల్ని ఇంకా ఎక్కువసార్లు చదివాను. ఇన్నిసార్లు చదివించటంలోనే మంచి సాహిత్య లక్షణం ఉందని చెప్పకనే చెప్పొచ్చు. ఆలోచనా, అనుభూతి– వివేచనా, ఉద్వేగం సమపాళ్లలో కలిసిన unified sensibility (ఎలియట్‌ భాషలో) చిక్కగా పరుచుకుపోయిన కారణంగా ఈ పుస్తకాలు ప్రాణంతో నిండిన మంచి సాహిత్యంగా తెలుగులో నిలిచిపోతాయి. Poetry is to prose as dancing is to walking అంటాడు John Wain. రాజిరెడ్డి సాహిత్యంలో వాకింగ్, డాన్సింగ్‌ కలిసి దొరకటం మన అదృష్టం. ఈ రచయితని తెలుగు పాలొ కొయిలొ అని పిలవడానికి గర్వపడుతున్నాను.






Wednesday, June 12, 2019

ఢిల్లీలో చింతకింద మల్లయ్య

2017 ఫిబ్రవరిలో జరిగిన కేంద్ర సాహిత్య అకాడమీ సమావేశాల్లో, యంగ్ హార్వెస్ట్ పేరుతో జరిగిన కార్యక్రమానికి తెలుగు తరఫున నేను హాజరయ్యానని మీలో కొందరికి తెలిసేవుంటుంది. అక్కడ చింతకింది మల్లయ్య ముచ్చట కథను ఇంగ్లీషులో చదివాను. దీన్నిThe Hero of a Non Story పేరుతో చింతపట్ల సుదర్శన్ గారు అనువదించి ఇచ్చారు.
అయితే అకాడమీ వాళ్లు తమ అన్ని సమావేశాల వీడియోలను యూట్యూబులో ఉంచారని విన్నాను గానీ పట్టించుకోలేదు. ఆ రోజు సమావేశాల అనంతరం మణిపురి వాళ్లు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనల వీడియో కోసం మొన్నెందుకో గుర్తొచ్చి వెతికితే, సహజంగానే మా వీడియో కూడా తగిలింది. అరే, నన్ను నేనే పట్టించుకోవడం మానేసినంత బాధేసి, దాన్ని ఇక్కడ షేర్ చేస్తున్నా.
మొత్తం యంగ్ హార్వెస్ట్ ప్రోగ్రాములో 22 భాషల వాళ్లు పాల్గొన్నారు. అందులో నలుగురు ఉపన్యాసాలు ఇచ్చారు, నలుగురం కథలు చదివాము, మిగిలినవాళ్లందరూ కవితలు వినిపించారు.
మా సెషన్లో నాతోపాటు కథలు చదివినవాళ్లు బెంగాలీ(Sayantani Putatunda), సింధీ(Komal Dayalani) అమ్మాయిలు ఇద్దరూ, ఒక పంజాబీ(Pargat Singh Satauj) అతనూ. నా నంబరు మూడు. ఈ సతౌజ్, నేనూ ఆ రెండ్రోజులూ రూమ్ కూడా పంచుకున్నాం. రెండో రోజు ఈ కోమల్, సతౌజ్ తో పాటు మరికొందరం కలిసి ఢిల్లీ తిరిగాం.
ఈ వీడియో సుమారు మూడు గంటలుంది. మా సెషన్ మొదటి గంటన్నర. మా తర్వాతి కవితా పఠన సెషన్ కూడా ఇందులోనే కలిపారు. మొదటి నాలుగు నిమిషాలు ఉమ్మడి పరిచయ కార్యక్రమం. 40:00 నుంచి 1:05:00 మధ్య నాది ఉంది.

ఇక నా కథా పఠనం నవ్వు తెప్పిస్తే దానికి మీరు కూడా బాధ్యులే. 

Monday, March 4, 2019

అర్బన్ ప్రపంచాన్ని మోహరించిన కొత్త చూపు


ఆంధ్రజ్యోతి వివిధ; 4 మార్చ్ 2019
రకమైన పనులతో ఆలోచనలతో ఎంత తీరిక లేకుండా ఉన్నామన్న ప్రశ్నలు పక్కనబెడితే, ఎవరి జీవితం వాళ్ళని కట్టి కూర్చోబెడుతోందన్నది, ఫిర్యాదులూ లేకుండా అందరం ఒప్పుకోవాల్సిన మాట.
మన కథలు ఎట్లాంటివైనా, బ్రతుకు బండి పట్టు దొరకబుచ్చుకునేందుకు మనం ప్రయత్నాలు చేస్తున్నా, మన చూపెప్పుడూ మన జీవితాలతో ముడిపడ్డ ఉన్న జాగాలను దాటి బయటకుపోదు. మన ఆలోచనలు చాలా సందర్భాల్లో మన వీలును సమర్ధించేవిగానూ, లేదా మన ఇబ్బందులను ప్రశ్నించేవిగానూ ఉంటాయే తప్ప, పక్క వాళ్ళను అర్థం చేసుకుని కలుపుకునేలా ఉండవు. వాళ్ళ అనుభవాలను తెలుసుకుని మన అభిప్రాయాలను సరిచూసుకునేలా, కొత్తగా మలుచుకునేలా అసలే ఉండవు. 'రియాలిటీ చెక్' పేరిట, దాదాపు 60 వాస్తవ జీవన చిత్రాలను ప్రకటించిన పూడూరి రాజిరెడ్డి పుస్తకం, చాలా గమ్మత్తుగా పని చేస్తుంది. 'నేను' అన్న స్పృహను నిష్పూచీగా కలుపుకుని, ఒక వాస్తవాన్ని దాన్ని నిండు రూపంతో హత్తుకుని, కొత్త దగ్గరితనంతో, దాని లోతులను కొలిచి చూపించగల అసాధారణమైన నేర్పు రచయిత కలంలో కనపడుతుంది.
అసలు దేన్నైనా పనిగట్టుకునెందుకు పరిశీలించాలి? మన మన సుఖ స్థావరాల నుండి బయటకు వచ్చి, వాస్తవ జీవన చిత్రాలను మనమెందుకు గమనించాలి? ఒక నిజాన్ని- ఒక అబద్ధాన్ని దాటి, ఒక నమ్మకాన్ని- ఒక భయాన్ని దాటి, ఒక ఇష్టాన్ని- ఒక అయిష్టాన్ని దాటి, వెనుక ఉన్న మనుష్యులనీ, అనుభవాలనీ వినడం ఎందుకు అవసరమనుకోవాలి?
సమాధానం చాలా చిన్నది: మన రద్దీ జీవితాలు మన నుండి కొల్లగొడుతున్నది సమయమొక్కటే కాదని మనకి తెలిసి రావాలంటే, కాస్త ప్రయత్నమైనా కావాలి. పుస్తకం పని చేస్తుంది. ఎదిగేకొద్దీ, జీవితంలో నలిగేకొద్దీ, మనకు తెలియకుండానే మనం కోల్పోయే కుతూహలము, కరుణ, అభిరుచి, మన వ్యక్తిత్వాలను ఎలా మారుస్తున్నాయో, ఎత్తిపొడుపూ, నాటకీయతా లేకుండా సున్నితంగా గుర్తుచేస్తుంది. సహజంగా సంఘజీవిగా మనవలసిన మనిషి, టెక్నాలజీ కలిగించిన వెసులుబాటుతో, తన అభిరుచుల మేరకు, తన అవసరాల మేరకు, తన ఇష్టం మేరకు సంబంధాలు ఏర్పరచుకుని, పాక్షిక మిథ్యా ప్రపంచంలో ఊగిసలాడుతున్నాడు. ఎదురుపడుతున్న మనుష్యులు అపరిచితులుగానే విడిపోతున్నారు. ఇట్లాంటి సందర్భంలో, ఒక జాగురూకతతో మానవీయ స్పృహతో మసలుకోవడం; ఎదుటి మనిషిని రివాజుగా పలకరించడం, వాళ్ళతో మన పరిచయమూ, సంభాషణా ఎంత చిన్నవైనా కానీయండి, క్షణాలను మానవీయ స్పర్శతో వెలిగించుకోవడమన్నది ప్రయత్నపూర్వకంగా అనుభవంలోకి తెచ్చుకోవడం, పుస్తకంలో ప్రధానంగా కనపడుతూ పుస్తకాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.
ఎంచుకున్న కొన్ని ప్రాంతాలు, వ్యక్తులు లేదా సంఘటనలు, వాటి మీద ఒకానొక "నేను" గమనింపులు, వ్యాఖ్యానమూ- స్థూలంగా ఇదీ పుస్తకం. రచయిత, రైల్వేస్టేషన్, రైతు బజార్, చార్మినార్, సెంట్రల్ మాల్, - ఇలా ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మొదట అక్కడ కనపడ్డ బోర్డులు, మనుష్యులు లేదా వస్తువుల తాలూకు వివరాలను వరుసగా ఏకరువు పెడతాడు. అలా చేయడం ద్వారా మనని ప్రాంతంలో ప్రవేశపెడతాడు. వాతావరణం మనకి అనుభవంలోకి వచ్చిందన్న తరువాత, అక్కడి సంభాషణని లేదా అక్కడెదురైన దృశ్యాన్ని మనతో వివరంగా పంచుకుంటాడు. దాని పట్ల మనకు అవగాహన, అభిప్రాయాలు పక్క ఏర్పడుతూండగానే, తనవైన గమనింపులను, ప్రశ్నలను, కొన్ని చోట్ల జవాబులుగా కొన్ని ప్రతిపాదనలను మనముందుంచుతాడు. ఇప్పుడు, రచయిత మాటల ద్వారా ఏర్పడ్డ కొత్త మెలకువతో మనం ఉన్నప్పుడు, ప్రదేశానికి ఎలా తీసుకొచ్చాడో దాదాపుగా అదే తీరున, వివరాలన్నీ ఏకరువు పెడుతూ బయటకు తీసుకుపోతాడు. రాకపోకల మధ్య నున్న ఆలోచనల బరువుకి, మన చూపెలా మారిందన్నదే ఆసక్తికరమైన విషయం. నిజానికి ఇదంతా స్పష్టమైన మొదలూ తుది బిందువులతో సరళ రేఖలా కనపడుతుంది కానీ, రచయిత మొత్తం అనుభవాన్ని ఒక గోళంలా మార్చి, దానిని ఆలోచనల కొక్కేనికి తగిలించి వదిలేస్తాడు. సునిశితమైన గమనింపులతో అతను వదిలే మాటలన్నీ, మనసును పట్టి కుదపకుండా వదలవు కనుకే, పుస్తకాన్ని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది.
రియాలిటీ అంటే నిజం, వాస్తవం, ఉన్నది. ఉన్నది ఉన్నట్టు చూడటానికే ఎంతో ధైర్యం కావాలి. చెప్పడానికి మరింత నిజాయితీ, నేర్పూ కావాలి. ఇక్కడ నేర్పు అంటే సత్యాన్ని మాటల ఊతంతో వెలుగులోకి లాక్కొచ్చి చూపించగల వ్యక్తీకరణ పరమైన నేర్పొక్కటే కాదు. మాటల ద్వారా ముందు తనపైన ఒక నమ్మకాన్ని కలిగించుకోగల నేర్పు, గౌరవాన్ని కోల్పోకుండా ఉండే నేర్పూ కూడా. ఒక వాస్తవాన్ని నమోదు చేస్తున్న స్పృహతో తటస్థ వైఖరితో గంభీరంగా ఉండటానికి ప్రయత్నించకపోవడమూ, ఒకింత ఎత్తు నుండి చూస్తున్న సాధికార మనస్తత్వాన్ని ప్రదర్శించకపోవడమూ పుస్తకాన్ని ఇష్టపడేలా చేస్తాయి. నిజానికి, అతనిలోపలి మనిషి అక్షరాలకెక్కిన ప్రతిసారీ, పుస్తకపు విశ్వసనీయత పెరుగుతూనే వచ్చింది. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి పిల్లల చిరుబొజ్జల కదలికలను బట్టి, వాళ్ళ శ్వాసలని నిర్ధారించుకునే నాన్న మాటలని; ఐదువేలు పోసి కొనే జీన్స్ వేసుకోవడంలో ఉండే సౌఖ్యాన్ని ఊహించనైనా లేని మనిషి మాటలని; పిల్లాడిని తెలుగు మీడియంలో చదివించాలో, ఇంగ్లీషు మీడియంలో చదివించాలో, ఆడుకోవడానికింత మైదానమైనా లేని పట్నం బడుల్లో చదివించాలో, పల్లెలో అమ్మానాన్నల దగ్గర వచ్చేపోయే నలుగురు మనుష్యులు వాళ్ళని ఎత్తుకు ముద్దు చేసే చోట పెంచాలో తేల్చుకోలేని మనిషి మాటలని; 'ప్రశ్నలతో తెల్లారడం కాదు, సమాధానాలతో నిద్రించడమే కావాలిప్పుడు' అని బ్రతుకుతో రాజీ కోరుకునే మనిషి మాటలని, మాటల్లోని నిజాయితీని, ఎందుకో శంకించాలనిపించదు. అతనిలో మనని మనం చూసుకోలేకపోతామేమో కానీ, అతనొక అపరిచితుడయ్యే ఆస్కారమేదీ కనపడదు. వర్షం పడే ముందటి వాతావరణాన్ని గమనిస్తూ, "ఏదో అద్భుతం జరగబోతునట్టుగా ఉంది, ఇలాంటి వాతావరణంలో ఎవరినైనా క్షమించేయొచ్చు"ననుకునే భావుకుడితడు. " సమస్త ప్రపంచంలో ఒకానొక మనిషి మరణించడమంటే ఒక అంకె తగ్గిపోవడం కాదు, ఒక్కడితో ముడిపడి ఉన్న సమస్త ఆనందాల ప్రపంచం అంతం కావడం." అని చెప్పగల సున్నిత మనస్కుడు. సహానుభూతికి అర్థం తెలిసినవాడు. "సముద్రపు ఒడ్డున కనపడే వందల గవ్వల్లో కొన్నింటినే ఏరుకున్నట్టు, ప్రయాణంలో తారసపడే వందల దృశ్యాల్లో మనం కొన్నింటినే ఎన్నుకుంటాం. ఏవి ఏరుకుంటామో, అదే మనం." అని చెప్పగల స్పష్టత ఉన్నవాడు. "జూ కి వెళ్ళడంలో ఉండే ఒక తియ్యటి ఇబ్బంది ఏమిటంటే - అటు జంతువులని చూడాలో, ఇటు పిల్లల్ని చూడాలో అర్థం కాదు. పళ్ళు తోముకుంటున్న నాన్ననే వాళ్ళు ఎంతో వింతగా చూస్తారు, అలాంటిది ఇంత కొత్త లోకంలో వాళ్ళకు ఎన్ని ఆశ్చర్యాలుంటాయని!" -అనే అమాయకత్వమూ, కొంటెదనమూ మిగిలినవాడు. మెరుపుల్లా మెరుస్తోన్న వాక్యాలన్నీ పుస్తకం కారణాలకి ఎన్నదగ్గ పుస్తకమో, కలం మనిషితనం మీద, మనిషి జీవితం మీద ఎంత పదునుగా, జాగ్రత్తగా వ్యాఖ్యానించిందో చెప్పకనే చెబుతాయి. ఇన్ని గొంతుకల మేలుకలయిక, సాహిత్యంలో అరుదు.
శవాల గది లాంటి చోట్లకి వెళ్ళమంటే మామూలుగా అయితే మనం వెళ్ళలేం; మనలా లేని మనుష్యులతో కలవలేం; మన ఆర్థిక, సామాజిక స్థితిగతులను ప్రశ్నించే ప్రదేశాలకి దూరంగా ఉండాలనుకుంటాం. జీవితంలో కొత్త మనుష్యులనూ, కొత్త మలుపులనూ కోరుకోకుండా సౌఖ్యంగా బ్రతకాలనుకుంటాం. మార్పుల పట్ల మొండి వైఖరులతో ఉంటాం, మనం మరణం విషయంలో మరీ ముడుచుకుపోతాం. మన దగ్గర ప్రశ్నలుంటాయి కానీ, జవాబులు ఎన్నేళ్ళకీ తారసపడవు. మనకి లోకం అర్థం కాదు, పగలూ ప్రేమలూ అర్థం కావు, కొన్ని సార్లు మనకి మనం కూడా. కానీ, ఏది ఉందో అదే ఉంది. దేన్నైనా ఎదుర్కోగల శక్తి మనందరిలోనూ ఎంతో కొంత ఉంది. బహుశా మాట గుర్తు చేసుకుంటూనే, అనుభవానికైనా హృదయాన్ని తెరిచి ఉంచి ఎదురు వెళితే ఎలా ఉంటుందో పుస్తకం ప్రయోగంలా చేసి చూపెట్టింది. బయట చిన్న మార్పూ లేకపోయినా, కేవలం మన హృదయ నైర్మల్యమే ప్రపంచపు వైఖరిని ఏదో ఒక స్థాయిలో ప్రభావితం చేస్తుందని తెలుసుకోవడం గొప్ప స్వస్థత. దానితోటే మన జీవితేచ్ఛ, జీవనోత్సాహమూ ముడిపడి ఉండటం యాదృచ్ఛికమేమీ కాదు. మనం ఉదాసీనంగా వదిలేసే జీవనపార్శ్వాలనూ, నిర్లక్ష్యం చేసే మనుష్యుల తాలూకు ఉద్వేగాలనూ, విలువ కట్టడం చేతకాక వదిలేసుకున్న కొన్ని ప్రాంతాలనూ మనకి కొత్తగా పరిచయం చేసి, మన ఆలోచనల ముందు నిలువుటద్దంలా నిలబడే కిటికీ ప్రయాణాల పుస్తకం - లోపటి మనిషికొక కుదుపూ, ఓదార్పూ.
మానస చామర్తి
manasa.chamarthi@gmail.com