ఆంధ్రజ్యోతి వివిధ; 4 మార్చ్ 2019
ఏ రకమైన పనులతో ఆలోచనలతో ఎంత తీరిక లేకుండా ఉన్నామన్న ప్రశ్నలు పక్కనబెడితే, ఎవరి జీవితం వాళ్ళని కట్టి కూర్చోబెడుతోందన్నది, ఏ ఫిర్యాదులూ లేకుండా అందరం ఒప్పుకోవాల్సిన మాట.
మన కథలు ఎట్లాంటివైనా, బ్రతుకు బండి పట్టు దొరకబుచ్చుకునేందుకు మనం ఏ ప్రయత్నాలు చేస్తున్నా, మన చూపెప్పుడూ మన జీవితాలతో ముడిపడ్డ ఉన్న జాగాలను దాటి బయటకుపోదు. మన ఆలోచనలు చాలా సందర్భాల్లో మన వీలును సమర్ధించేవిగానూ, లేదా మన ఇబ్బందులను ప్రశ్నించేవిగానూ ఉంటాయే
తప్ప, పక్క వాళ్ళను అర్థం చేసుకుని కలుపుకునేలా ఉండవు. వాళ్ళ అనుభవాలను తెలుసుకుని మన అభిప్రాయాలను సరిచూసుకునేలా, కొత్తగా మలుచుకునేలా అసలే ఉండవు. 'రియాలిటీ చెక్' పేరిట, దాదాపు 60 వాస్తవ
జీవన చిత్రాలను ప్రకటించిన పూడూరి రాజిరెడ్డి పుస్తకం, చాలా గమ్మత్తుగా ఈ పని చేస్తుంది. 'నేను' అన్న స్పృహను నిష్పూచీగా కలుపుకుని, ఒక వాస్తవాన్ని దాన్ని నిండు రూపంతో హత్తుకుని, ఆ కొత్త దగ్గరితనంతో, దాని లోతులను కొలిచి చూపించగల అసాధారణమైన నేర్పు ఈ రచయిత కలంలో కనపడుతుంది.
అసలు దేన్నైనా పనిగట్టుకునెందుకు పరిశీలించాలి? మన మన సుఖ స్థావరాల నుండి బయటకు వచ్చి, వాస్తవ
జీవన చిత్రాలను మనమెందుకు గమనించాలి? ఒక నిజాన్ని- ఒక అబద్ధాన్ని దాటి, ఒక నమ్మకాన్ని- ఒక భయాన్ని దాటి, ఒక ఇష్టాన్ని- ఒక అయిష్టాన్ని దాటి, వెనుక ఉన్న మనుష్యులనీ, అనుభవాలనీ వినడం ఎందుకు అవసరమనుకోవాలి?
సమాధానం చాలా చిన్నది: మన రద్దీ జీవితాలు మన నుండి కొల్లగొడుతున్నది సమయమొక్కటే కాదని మనకి తెలిసి రావాలంటే, ఈ కాస్త ప్రయత్నమైనా కావాలి. ఈ పుస్తకం ఆ పని చేస్తుంది. ఎదిగేకొద్దీ, జీవితంలో నలిగేకొద్దీ, మనకు తెలియకుండానే మనం కోల్పోయే కుతూహలము, కరుణ, అభిరుచి, మన వ్యక్తిత్వాలను ఎలా మారుస్తున్నాయో, ఏ ఎత్తిపొడుపూ, నాటకీయతా లేకుండా సున్నితంగా గుర్తుచేస్తుంది. సహజంగా సంఘజీవిగా మనవలసిన మనిషి, టెక్నాలజీ కలిగించిన వెసులుబాటుతో, తన అభిరుచుల మేరకు, తన అవసరాల మేరకు, తన ఇష్టం మేరకు సంబంధాలు ఏర్పరచుకుని, పాక్షిక మిథ్యా ప్రపంచంలో ఊగిసలాడుతున్నాడు. ఎదురుపడుతున్న మనుష్యులు అపరిచితులుగానే విడిపోతున్నారు. ఇట్లాంటి ఓ సందర్భంలో, ఒక జాగురూకతతో మానవీయ స్పృహతో మసలుకోవడం; ఎదుటి మనిషిని రివాజుగా పలకరించడం, వాళ్ళతో మన పరిచయమూ, సంభాషణా ఎంత చిన్నవైనా కానీయండి, ఆ క్షణాలను మానవీయ స్పర్శతో వెలిగించుకోవడమన్నది ప్రయత్నపూర్వకంగా అనుభవంలోకి తెచ్చుకోవడం, ఈ పుస్తకంలో ప్రధానంగా కనపడుతూ పుస్తకాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.
ఎంచుకున్న కొన్ని ప్రాంతాలు, వ్యక్తులు లేదా సంఘటనలు, వాటి మీద ఒకానొక "నేను" గమనింపులు, వ్యాఖ్యానమూ- స్థూలంగా ఇదీ ఈ పుస్తకం. రచయిత, రైల్వేస్టేషన్, రైతు బజార్, చార్మినార్, సెంట్రల్ మాల్, - ఇలా ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మొదట అక్కడ కనపడ్డ బోర్డులు, మనుష్యులు లేదా వస్తువుల తాలూకు వివరాలను వరుసగా ఏకరువు పెడతాడు. అలా చేయడం ద్వారా మనని ఆ ప్రాంతంలో ప్రవేశపెడతాడు. ఆ వాతావరణం మనకి అనుభవంలోకి వచ్చిందన్న తరువాత, అక్కడి ఓ సంభాషణని లేదా అక్కడెదురైన ఓ దృశ్యాన్ని మనతో వివరంగా పంచుకుంటాడు. దాని పట్ల మనకు అవగాహన, అభిప్రాయాలు ఓ పక్క ఏర్పడుతూండగానే, తనవైన గమనింపులను, ప్రశ్నలను, కొన్ని చోట్ల జవాబులుగా కొన్ని ప్రతిపాదనలను మనముందుంచుతాడు. ఇప్పుడు, రచయిత మాటల ద్వారా ఏర్పడ్డ కొత్త మెలకువతో మనం ఉన్నప్పుడు, ఆ ప్రదేశానికి ఎలా తీసుకొచ్చాడో దాదాపుగా అదే తీరున, వివరాలన్నీ ఏకరువు పెడుతూ బయటకు తీసుకుపోతాడు. ఈ రాకపోకల మధ్య నున్న ఆలోచనల బరువుకి, మన చూపెలా మారిందన్నదే ఆసక్తికరమైన విషయం. నిజానికి ఇదంతా స్పష్టమైన మొదలూ తుది బిందువులతో సరళ రేఖలా కనపడుతుంది కానీ, రచయిత మొత్తం అనుభవాన్ని ఒక గోళంలా మార్చి, దానిని ఆలోచనల కొక్కేనికి తగిలించి వదిలేస్తాడు. సునిశితమైన గమనింపులతో అతను వదిలే మాటలన్నీ, మనసును పట్టి కుదపకుండా వదలవు కనుకే, ఈ పుస్తకాన్ని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది.
రియాలిటీ అంటే నిజం, వాస్తవం, ఉన్నది. ఉన్నది ఉన్నట్టు చూడటానికే ఎంతో ధైర్యం కావాలి. చెప్పడానికి మరింత నిజాయితీ, నేర్పూ కావాలి. ఇక్కడ నేర్పు అంటే సత్యాన్ని మాటల ఊతంతో వెలుగులోకి లాక్కొచ్చి చూపించగల వ్యక్తీకరణ పరమైన నేర్పొక్కటే కాదు. ఆ మాటల ద్వారా ముందు తనపైన ఒక నమ్మకాన్ని కలిగించుకోగల నేర్పు, గౌరవాన్ని కోల్పోకుండా ఉండే నేర్పూ కూడా. ఒక వాస్తవాన్ని నమోదు చేస్తున్న స్పృహతో తటస్థ వైఖరితో గంభీరంగా ఉండటానికి ప్రయత్నించకపోవడమూ, ఒకింత ఎత్తు నుండి చూస్తున్న సాధికార మనస్తత్వాన్ని ప్రదర్శించకపోవడమూ ఈ పుస్తకాన్ని ఇష్టపడేలా చేస్తాయి. నిజానికి, అతనిలోపలి మనిషి అక్షరాలకెక్కిన ప్రతిసారీ, పుస్తకపు విశ్వసనీయత పెరుగుతూనే వచ్చింది. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి పిల్లల చిరుబొజ్జల కదలికలను బట్టి, వాళ్ళ శ్వాసలని నిర్ధారించుకునే నాన్న మాటలని; ఐదువేలు పోసి కొనే జీన్స్ వేసుకోవడంలో ఉండే సౌఖ్యాన్ని ఊహించనైనా లేని మనిషి మాటలని; పిల్లాడిని తెలుగు మీడియంలో చదివించాలో, ఇంగ్లీషు మీడియంలో చదివించాలో, ఆడుకోవడానికింత మైదానమైనా లేని ఈ పట్నం బడుల్లో చదివించాలో, పల్లెలో అమ్మానాన్నల దగ్గర వచ్చేపోయే నలుగురు మనుష్యులు వాళ్ళని ఎత్తుకు ముద్దు చేసే చోట పెంచాలో తేల్చుకోలేని మనిషి మాటలని; 'ప్రశ్నలతో తెల్లారడం కాదు, సమాధానాలతో నిద్రించడమే కావాలిప్పుడు' అని బ్రతుకుతో రాజీ కోరుకునే మనిషి మాటలని, ఆ మాటల్లోని నిజాయితీని, ఎందుకో శంకించాలనిపించదు. అతనిలో మనని మనం చూసుకోలేకపోతామేమో కానీ, అతనొక అపరిచితుడయ్యే ఆస్కారమేదీ కనపడదు. వర్షం పడే ముందటి వాతావరణాన్ని గమనిస్తూ,
"ఏదో అద్భుతం జరగబోతునట్టుగా ఉంది, ఇలాంటి వాతావరణంలో ఎవరినైనా క్షమించేయొచ్చు"ననుకునే భావుకుడితడు.
"ఈ సమస్త ప్రపంచంలో ఒకానొక మనిషి మరణించడమంటే ఒక అంకె తగ్గిపోవడం కాదు, ఆ ఒక్కడితో ముడిపడి ఉన్న సమస్త ఆనందాల ప్రపంచం అంతం కావడం." అని చెప్పగల సున్నిత మనస్కుడు. సహానుభూతికి అర్థం తెలిసినవాడు. "సముద్రపు ఒడ్డున కనపడే వందల గవ్వల్లో కొన్నింటినే ఏరుకున్నట్టు, ప్రయాణంలో తారసపడే వందల దృశ్యాల్లో మనం కొన్నింటినే ఎన్నుకుంటాం. ఏవి ఏరుకుంటామో, అదే మనం."
అని చెప్పగల స్పష్టత ఉన్నవాడు. "జూ కి వెళ్ళడంలో ఉండే ఒక తియ్యటి ఇబ్బంది ఏమిటంటే - అటు జంతువులని చూడాలో, ఇటు పిల్లల్ని చూడాలో అర్థం కాదు. పళ్ళు తోముకుంటున్న నాన్ననే వాళ్ళు ఎంతో వింతగా చూస్తారు, అలాంటిది ఇంత కొత్త లోకంలో వాళ్ళకు ఎన్ని ఆశ్చర్యాలుంటాయని!"
-అనే అమాయకత్వమూ, కొంటెదనమూ మిగిలినవాడు. మెరుపుల్లా మెరుస్తోన్న ఈ వాక్యాలన్నీ ఈ పుస్తకం ఏ ఏ కారణాలకి ఎన్నదగ్గ పుస్తకమో, ఈ కలం మనిషితనం మీద, మనిషి జీవితం మీద ఎంత పదునుగా, జాగ్రత్తగా వ్యాఖ్యానించిందో చెప్పకనే చెబుతాయి. ఇన్ని గొంతుకల మేలుకలయిక, సాహిత్యంలో అరుదు.
శవాల గది లాంటి చోట్లకి వెళ్ళమంటే మామూలుగా అయితే మనం వెళ్ళలేం; మనలా లేని మనుష్యులతో కలవలేం; మన ఆర్థిక, సామాజిక స్థితిగతులను ప్రశ్నించే ప్రదేశాలకి దూరంగా ఉండాలనుకుంటాం. జీవితంలో కొత్త మనుష్యులనూ, కొత్త మలుపులనూ కోరుకోకుండా సౌఖ్యంగా బ్రతకాలనుకుంటాం. మార్పుల పట్ల మొండి వైఖరులతో ఉంటాం, మనం మరణం విషయంలో మరీ ముడుచుకుపోతాం. మన దగ్గర ప్రశ్నలుంటాయి కానీ, జవాబులు ఎన్నేళ్ళకీ తారసపడవు. మనకి లోకం అర్థం కాదు, పగలూ ప్రేమలూ అర్థం కావు, కొన్ని సార్లు మనకి మనం కూడా. కానీ, ఏది ఉందో అదే ఉంది. దేన్నైనా ఎదుర్కోగల శక్తి మనందరిలోనూ ఎంతో కొంత ఉంది. బహుశా ఆ మాట గుర్తు చేసుకుంటూనే, ఏ అనుభవానికైనా హృదయాన్ని తెరిచి ఉంచి ఎదురు వెళితే ఎలా ఉంటుందో ఈ పుస్తకం ప్రయోగంలా చేసి చూపెట్టింది. బయట ఏ చిన్న మార్పూ లేకపోయినా, కేవలం మన హృదయ నైర్మల్యమే ప్రపంచపు వైఖరిని ఏదో ఒక స్థాయిలో ప్రభావితం చేస్తుందని తెలుసుకోవడం గొప్ప స్వస్థత. దానితోటే మన జీవితేచ్ఛ, జీవనోత్సాహమూ ముడిపడి ఉండటం యాదృచ్ఛికమేమీ కాదు. మనం ఉదాసీనంగా వదిలేసే జీవనపార్శ్వాలనూ, నిర్లక్ష్యం చేసే మనుష్యుల తాలూకు ఉద్వేగాలనూ, విలువ కట్టడం చేతకాక వదిలేసుకున్న కొన్ని ప్రాంతాలనూ మనకి కొత్తగా పరిచయం చేసి, మన ఆలోచనల ముందు నిలువుటద్దంలా నిలబడే ఈ కిటికీ ప్రయాణాల పుస్తకం - లోపటి మనిషికొక కుదుపూ, ఓదార్పూ.
మానస చామర్తి
manasa.chamarthi@gmail.com