(నోట్: కల్లూరి భాస్కరం గారి 'మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే' ఆవిష్కరణ సభలో నేను మాట్లాడాను. ఒక పుస్తక ఆవిష్కరణ సభలో ఇట్లా అధికారికంగా మాట్లాడటం, అంటే ఒక బుక్ ఇనాగ్యురేషన్ ఇన్విటేషన్ మీద పేరు వేయడం ఇదే మొదటిసారి నాకు. అంతకుముందు కొన్నిసార్లు మాట్లాడాల్సి వచ్చినా అవన్నీ ఇన్‌ఫార్మల్ సమావేశాలు. కల్లూరి భాస్కరం గారు చాలా శ్రద్ధగా రాసే రచయిత అని నాకు గౌరవం. కానీ ఈ తరహా పుస్తకం నా శక్తికి మించినది. కానీ ఆయన నన్ను మాట్లాడమని కోరితే నిరాకరించగలిగే శక్తి కూడా లేకపోయింది. అక్కడ మాట్లాడిన ప్రసంగ పాఠం ఇది. తెల్లారి ఈనాడు మెయిన్ పేజీలో వచ్చిన కవరేజీ క్లిప్ కూడా జత చేస్తున్నా. అందులోని విజయలక్ష్మి పేరును విజయభారతి అని చదువుకోగలరు.)
ఎగ్జిబిషన్లో పుస్తకావిష్కరణ అంటే సామూహిక వివాహం లాగా. ఇక్కడున్నవారు నిజంగా దీనికోసమే వచ్చినవారో, లేకపోతే తరువాయి పెళ్లి/ఆవిష్కరణ కోసం ఉన్నవారో తెలీదు. ఏ కారణం వల్లయినా సరే, ఈ క్షణంలో ఇక్కడున్న వారందరికీ నమస్తే.
సంస్కృతం అటుండనీ, నేను తెలుగు మహాభారతమే చదవలేదు. చదవలేను కూడా. ఒరులేయవి యొనరించిన లాంటి ఒకట్రెండు పద్యాలు తప్ప నాకు ఇంకో పద్యం అర్థం కాదు. మహాభారతం అంటే దూరదర్శన్ సీరియల్ అనుకునే నాలాంటివాడిని వీరభద్రుడంతటివాడి పక్కన నన్ను భాస్కరం గారు వక్తగా ఎందుకు కూర్చోబెట్టినట్టు?
ప్రతిదీ ఒక తరం నుంచి ఇంకో తరానికి ఏదోమేరకు బదిలీ అవుతూనేవుంటుంది. మనకు తెలిసో, తెలియకుండానో మన పూర్వీకుల వారసత్వాన్ని మోస్తూనేవుంటాం. ఆ అవిచ్ఛిన్నతకు ప్రతీకలాగా, నన్ను ఇప్పటి తరఫు ప్రతినిధిగా భావించారని నేను అనుకుంటున్నా.
ఒకసారి గుడిమల్కాపుర్‌లో నడుస్తూవున్నాను. ఈ ఎల్జీబీటీ ఇలాంటిది ఏదో మనసులో మెసులుతూ ఉందేమో. ఉన్నట్టుండి శిఖండి గుర్తొచ్చాడు. అందులో అంబ ముందు ఆత్మహత్య చేసుకుంటుంది, తర్వాత శిఖండిగా పుడతాడు. అంటే ముందు అతడిలోని స్త్రీ బలవంతంగా చచ్చిపోయింది. మిగిలిన పురుష దేహంతో అతడు బతుకును ఈడ్చాడు. ఈడ్చాడు అని ఎందుకు అంటున్నానంటే, భీష్ముడు అతడిని గౌరవించడు. తనలోని స్త్రీ చచ్చిపోయింది, చంపబడింది అనే పాయింట్ నన్ను ఎక్సయిట్ చేసింది. ఇదంతా కూడా ఒక ప్రతీక యేమో. దాని గురించి వ్యాఖ్యానించుకోవడానికి ఎంత స్కోప్ ఉందికదా అనిపించింది. ఒక కాలాతీతమైన పాత్రను సృష్టించడంలో మహాభారత కర్త గొప్పదనం అది.
మహాభారతం ఇందాక నేను చదవలేదు అన్నాను. కానీ మహాభారతం కనీసం విననివాళ్లెవరు ఈ నేలమీద? ప్రతి పాత్రనూ మానవ సహజంగా ఆవిష్కరించుకోవచ్చు, అదే సమయంలో వాటిమీద ఒక మాయపొరను కప్పి మాట్లాడుకోవచ్చు. చూడండి, మహాభారతంలో పర్ఫెక్ట్ క్యారక్టర్సే కనబడవు. అన్నీ మానవ సహజమైన ఉద్వేగాలను, లోపాలను, రక్తమాంసాలతో సహా ప్రదర్శిస్తాయి. ఆ పొరలు తొలగిస్తూ, ఆ ప్రతీకలన్నింటినీ డీకోడ్ చేస్తూ, భారతంలోని ఆత్మను, వాస్తవాన్ని పట్టుకోవడమే భాస్కరం గారు ఈ పుస్తకం అంతటా చేసిన పని.
పేరుకే ఇది మహాభారత వ్యాఖ్యానం. ఇందులో ప్రస్తావనకు రాని విషయమంటూ కనబడదు.
బుద్ధుడు, గురజాడ, కన్యాశుల్కం, క్రూసేడ్లు, మంగోలులు, మెసపటోమియా, సిరియా, రాజరాజనరేంద్రుడు, కృష్ణదేవరాయలు, సుమేరులు, భ్రూణ హత్యలు, గ్రీసు ఒలింపిక్స్, రాజుల పుట్టుక, బానిస వ్యవస్థ, దశావతారాలు, హింస అహింస, అలెగ్జాండర్, సెల్యూకస్, భ్రూణ హత్యలు, నీటి యుద్ధాలు, ఆఖరికి కశ్మీర్ సమస్య. నేను చెప్పినప్పుడు వీటన్నింటికీ ఒక క్రమం కనబడట్లేదు; కానీ పుస్తకంలోకి వచ్చేసరికి అవన్నీ ఒక ప్యాటర్న్‌లోకి ఒదిగిపోతాయి.
మహాభారతం గురించి మనకు ఒకటి చెబుతారు కదా, ఇందులో ఉన్నదే ప్రపంచంలో ఉన్నదీ, ఇందులో లేనిదేదీ ప్రపంచంలో కూడా లేదూ అని. అట్లా సమకాలీన సాహిత్య, మేధో ప్రపంచం ఆలోచనల్లో ఉన్న భారతీయ వర్తమాన సామాజిక స్థితిగతులు అన్నీ ఇందులో ప్రతిఫలిస్తాయి. మళ్లీ ఊరికే ప్రస్తావనగా కాదు, ప్రతిదీ దానిదైన సందర్భంలోనే వస్తుంది, దానికి రచయిత ఇవ్వగలిగే వెలుతురు సోకే వస్తుంది. ఒకచోట, పాశ్చాత్య సమాజానికి భారతదేశం అంటే ఎందుకు అంత ఆకర్షణో చెప్తూ–
పాశ్చాత్య సమాజపు వర్తమానానికి భారతీయ సమాజం గతం, అంటారు. వాళ్లు దాటిపోయిన దశను మనం జీవిస్తున్నాం ఇంకా.
మళ్లీ దీనికే కొనసాగింపుగా ఇంకోచోట, ఆయుధోపజీవుల గురించిన ప్రస్తావన వస్తుంది. అంటే ఆఫ్గనిస్తాన్‌లోని నిరంతర అశాంతికి మూలాలేమిటి అన్నది వచ్చినప్పుడు, భారతీయ సమాజం దాటివచ్చిన గతం ఇంకా ఆఫ్గనిస్తాన్‌లో ఉందంటారు. గుర్తుంచుకోవాల్సింది ఒకప్పటి గాంధార దేశం అది. ధృతరాష్ట్రుడి భార్య గాంధారి అక్కడి అమ్మాయే. ప్రపంచ పరిణామం ఎన్ని లేయర్సులో ఉందో దీన్నిబట్టి అర్థమవుతుంది.
ఈ పుస్తకం మనం అనుకునే చాలా గీతల్ని చెరిపేయొచ్చు. జగజ్జనని అనే కాన్సెప్టు మనది కాదు, మనది మాత్రమే కాదు, అది ఇంకా పైకి పశ్చిమానికి, ఇరాన్–సిరియాల్లోనే ఉంది అని చెబుతుంది. దేవాలయ క్రతువులు, తులసికోటలు అన్నీ ఇక్కడివే అని మనస్ఫూర్తిగా నమ్ముతుంటే గనక దాన్ని దెబ్బ కొడుతుంది. ఇజ్రాయిల్‌లోనూ అలాంటి నిర్మాణాలు ఉన్నాయంటుంది.
గ్రీసు ద్వీపమైన క్రీటుకూ, రామాయణ కాలపు కృతయుగానికీ లంకె కుదిర్చే ప్రయత్నం ఉంటుంది;
పర్షియన్ చక్రవర్తి క్జెరెక్సెస్‌కూ శ్రీరాముడికీ ఉన్న పోలికలు చెబుతుంది.
అతడు గ్రీసు మీదికి వెళ్తే, ఇతడు లంక మీదికి వెళ్లాడు. ఇద్దరూ సముద్రం మీద వారధి నిర్మించాల్సి వస్తుంది. ఇద్దరికీ సముద్రుడు ప్రసన్నం కాకపోతే కోపం వస్తుంది. ఇద్దరూ సూర్యవంశ క్షత్రియులు.
గ్రీకుల మినోస్‌కూ, మన మనువుకూ ఎలాంటి సామ్యాలున్నాయో చెబుతుంది. మినోస్, మనువు– ఆ పేర్ల సామ్యం ఒక్కటే కాదు, ఇద్దరూ కూడా ప్రళయం వచ్చినప్పుడు నౌకలో వచ్చి ఈ ప్రపంచాన్ని రక్షించినవారే.
ఆఖరికి మహాభారతంలోని ప్రధాన పాత్రలకు మూలపురుషులైన పూరుడు, ఆయన తండ్రి యయాతి, ఆయన తండ్రి నహుషుడు, ఆయన ముత్తాత పురూరవుడు ఎక్కడో పశ్చిమాసియాలో పుట్టినవాళ్లు అయివుండొచ్చు అన్నదాన్ని ఏదోమేరకు బలపరుస్తుంది.
ఒక విధంగా మనం ఇప్పుడు భారత సంప్రదాయం, సంస్కృతి అని వేటిని అనుకుంటున్నామో అవన్నీ ఆ లెవాంట్– అంటే ఆ సిరియా, ఇరాక్, లెబనాన్, ఇజ్రాయిల్... అని ఇప్పుడు విభజించుకుంటున్న ప్రాంతంలోనే పుట్టివుండొచ్చు, అక్కడే మన మూలం ఏదో ఉండొచ్చు, అని చెబుతుంది. అదే సమయంలో దీనికి భిన్నమైన ప్రమాణం దొరికితే అంగీకరించడానికి కూడా సిద్ధంగా ఉంటుంది.
పాండురాజు సంతానం కోసం ప్రయాణం చేసిన శతశృంగం టిబెట్‌లో ఉందని ఒక రిఫరెన్సు. మన కాళీమాతకూ మెడూసా దేవతకూ ఉండే పోలికలేమిటో ఇంకోచోట. మెసొపటేమియా దేవుడు పొసైడన్‌కూ–నటరాజ రూపంలోని శివునికీ మధ్య ఉండే సామ్యం ఒక చోట. ఇద్దరూ త్రిశూలం ధరిస్తారు. ఇద్దరి వాహనం వృషభం అందులో కొన్ని. నల దమయంతుల ప్రేమకథను పోలిన కథ గ్రీకు పురాణాల్లో ఒడీసియస్ పెనెలొపిది. ‘ఇంతమేరకు ఇది భారతదేశం’ అని మనం గీసుకునే ఎల్లల్ని ఈ పుస్తకం చెరిపేస్తుంది.
ఇంకో తమాషా చూడండి: ఒక సందర్భంలో నహుషుడు వేదప్రమాణాన్ని నిరాకరిస్తాడు. అంటే మాంసం తినడం కోసం పశువుల్ని చంపడం తప్పంటాడు. దీన్ని బ్రాహ్మలు వ్యతిరేకిస్తారు. ఫలితంగా తన సింహాసనం కోల్పోతాడు. నాగరికత స్థిర వ్యవసాయంలోకి మళ్లుతున్న దశకీ, పశుపాలన చేస్తూ బతికే దశకూ మధ్య ఘర్షణను అది చిత్రిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది పూర్తి విరుద్ధం. కానీ గమనించవలసింది, పవర్ ప్లే అనేది అట్లానే ఉంది, ఆ మాంసం చుట్టూ, పశువుల చుట్టూ.
అందుకే రచయిత అంటాడు, అసలు చాలా విషయాలకు మనం ఇంకా భారతకాలంలోనే ఉన్నాం, ఆధునికతలోకి ప్రవేశించనే లేదూ అని.
ఇరవై ఏళ్ల క్రితం రాసిన కథలో తల నెరిసింది అంటే అతడు వృద్ధుడు అని. కానీ ఇప్పుడు నాతో సహా ఎందరికో జుట్టు నెరుస్తోంది. అంటే ఆ వాక్యం దాని నిజమైన అర్థం కోల్పోయింది. కానీ ఎప్పుడో మూడువేళ్ల ఏళ్ల క్రితం చరిత్రకు ప్రతిబింబంగా ఉన్న భారతం ఇప్పటికీ రిలవెంట్‌గా ఉండటం ఏమిటి, మ్యాజిక్ కాకపోతే.
ఇంకోటి కూడా ఇక్కడ చెప్పబుద్ధవుతోంది.
శర్మిష్ఠ–దేవయాని కథ చూడండి. ఒకసారి పొరపాటున దేవయాని విడిచిన మైల బట్టలను శర్మిష్ఠ కట్టుకున్నప్పుడు– నా బట్టలు నువ్వు కట్టుకుంటావా అని స్థాయీభేదాలు మాట్లాడి శర్మిష్ఠను దేవయాని అవమానిస్తుంది. కానీ దీనికి కొనసాగింపుగా జరిగింది ఏమిటి? శర్మిష్ఠ ఇష్టపడిన యయాతినే దేవయాని పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. ఒక విధంగా ఆమె (మానసికంగా) మైల చేసిన వాడిని ఈమె కట్టుకోవాల్సి వచ్చింది.
ఎంత గొప్ప శిల్పం ఇది. చిన్న కథ నిర్మాణానికి గొప్ప ఫ్రేమ్ ఇది. ఇప్పటి ఆధునిక కథకు మూలపురుషుడు అని చెప్పుకునే అమెరికన్ రచయిత ఎడ్గార్ అలెన్ పో మహా అయితే 1820ల్లో రాశాడు. రెండు వందల ఏళ్ల కిందట. ఎప్పటి మహాభారతం!
ఈ పుస్తకం, అంటే మన భాస్కరం గారి పుస్తక నిర్మాణం గురించి కూడా చెప్పాలి. ఒక విధంగా ఇది కూడా మహాభారతం అంతటి సంక్లిష్టమైనదే.
ఇది నాలుగు స్రవంతులుగా ప్రారంభమవుతుంది.
ఒకటి ఎటూ మహాభారతం.
రెండోది, 200–250 ఏళ్ల క్రితం నాటి అలెక్స్ హేలీ ‘రూట్స్’ లేదా ఏడు తరాలు నవల లింక్.
మూడోది, 70–80 ఏళ్ల క్రితపు భారత స్వాతంత్య్రోద్యమపు గాంధీజీ లింక్.
నాలుగోది, రచయితకు ఉన్న తనదైన వ్యక్తిగత అన్వేషణ.
అట్లా అని తర్వాతి మూడు పాయలు అవే ఉంటాయని కాదు. అవి ముగుస్తూనే ఇంకో ప్రవాహం వచ్చి కలుస్తుంది. అది గ్రీకు పురాణం కావొచ్చు, సుమేరు గాథ కావొచ్చు, ఒక ఐరిష్ కథ కావొచ్చు. బైబిల్ కథ కూడా కావొచ్చు. ఏవి వచ్చినా ఈ అన్ని ప్రవాహాలూ ఒక్కోసారి సమాంతరంగా ఒరుసుకుంటూనూ, మరోసారి ఖండించుకుంటూనూ సాగుతాయి. అయినా ఎక్కడా జర్క్ రాదు. సాఫీగా, హాయిగా ఒక మేళనంలాగా ప్రవహిస్తాయి. ఇదీ రచయితకు సబ్జెక్టు మీద ఉన్న అథారిటీ. పట్టు.
తెలుగునాట ప్రతి ఇంట్లోనూ ఒక ఒక మహాభారతం ఉండేంత ప్రాచుర్యం ఉన్నా, తెలుగునేల మీద ఒక భైరప్ప ఎందుకు పుట్టలేదో అర్థం కాదు. ఒక పర్వ ఎందుకు రాయబడలేదో తెలీదు. నిరాశ ఏల? భైరప్ప లేకపోతేనేం, మనకు భాస్కరం ఉన్నారు.
ఈ పుస్తకాన్ని, లేదా మానవ నాగరికతా క్రమాన్ని స్థూలంగా ఇట్లా విభజించుకోవచ్చు.
ఒకటి, వ్యవసాయానికీ పశుపాలనకూ మధ్యన జరిగిన ఘర్షణ.
రెండు, ఆదివాసీలు, నాగరికుల మధ్య జరిగిన ఘర్షణ.
3. గణాలు– స్థిరరాజ్యాలుగా ఏర్పడుతున్న కాలపు మధ్యపోరాటం.
4. లైంగికత పట్ల ఏ కట్టూ లేని దశా, దానికి పవిత్రత ఆపాదించబడుతున్న దశల మధ్య ఘర్షణ.
5. ఇంకా ఎక్కువ చర్చకు వచ్చేది– మాతృస్వామ్య వ్యవస్థలోంచి పితృస్వామ్య వ్యవస్థలోకి ప్రపంచం పరిణామం చెందుతున్నప్పుడు పుట్టిన ఘర్షణ.
మహాభారతం పరంగా చూస్తే కౌరవులు పితృస్వామ్యానికి సూచిక. పాండవులు మాతృస్వామ్యానికి ప్రతీక. ఇట్లా చెప్పడానికి ఎన్నో రిఫరెన్సులు ఇస్తాడు రచయిత. పాండవులను కౌంతేయులు అని వ్యవహరించే చిన్న వివరం నుంచి, తపతీ సంవరుణుల ప్రేమ కథ, ఆ వంశ చరిత్ర దాకా.
తమాషా ఏమిటంటే– మాతృస్వామ్యం పాతది, పితృస్వామ్యం అప్పటికి ప్రగతిశీలం. కానీ భారతంలో విజయం సాధించింది పాండవులు. అంటే మాతృస్వామ్య వ్యవస్థ గెలిచినట్టు. సమాజం ఒకవైపు పరిణమిస్తుంటే దాన్ని ఎందుకు నిలువరించడానికి ప్రయత్నించివుంటాడు భారత రచయిత?
మన పాత సినిమాల్లో చూడండి. స్త్రీ కొంత స్వేచ్ఛగా, కొంత టిప్పుటాపుగా తయారై, ఇంట్లోంచి బయటికి వచ్చినప్పుడు– ఆ పాత్రకూ హీరో పాత్రకూ ఘర్షణ పుడుతుంది. చిట్టచివరికి, సినిమా ముగింపులో ఆ అమ్మాయి వాటిని అన్నింటినీ కట్టిపెట్టి హీరో పాదాల దగ్గర వాలిపోతుంది. ఎందుకూ అంటే? దర్శకుడి టార్గెట్ ప్రేక్షకులు ఇంకా హీరో దశలోనే ఉన్నారు కాబట్టి. సమాజం ఏ పోకడ పోయినా ఆమెను వెనక్కి గుంజి చూపించడంలోనే ప్రేక్షకుల ఈగో తృప్తి చెందుతుంది. బహుశా భారత కర్త టార్గెట్ శ్రోతలు కూడా మాతృస్వామ్యంలో ఉండివుంటారు. అందువల్లే పాండవులను గెలిపించివుంటాడు.
ఇంకొకటి:
పితృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది అంటారు. కానీ పూర్తిగా ఏర్పడిందా? మా అమ్మమ్మ గారి ఊరు, మా అత్తగారి ఊరు అనే అంటున్నాం. అంటే పరిణామం ఇంకా సాగుతూనేవుంది. లేదా ఘర్షణ అయినా సాగుతోంది. స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు, హింస కూడా ఆ ఘర్షణకు ప్రతిఫలనాలేమో అనిపిస్తుంటుంది.
ఈ పుస్తకం ప్రకారమే చెప్పుకుంటే– పూతనను కృష్ణుడు చంపడం అనేది ప్రతీక మాత్రమే. పూతన ఇప్పుడు మన ఊహల్లో స్థిరపడ్డట్టుగా రాక్షసి కాదు, అప్పటికి ఉన్న దేవత. ఆ మాతృదేవతను వెనక్కి నెట్టేసి, ఈ పురుషస్వామ్యపు ఆధిక్యతను ప్రతిష్టించడం ఆ కథ ఉద్దేశం. గమనించాల్సింది, ఒక పరిణామం అంతకుముందు ఉన్నదాన్ని మొత్తం అంతం చేయడం జరగదు అంటారు రచయిత. పశ్చిమ భారతంలో ఇప్పటికీ పూతన అనే పేరు పెట్టుకునేవాళ్లు ఉన్నారట.
లైంగికత అంశమే చూడండి. సత్యవతి వివాహ సందర్భంగానీ, ద్రౌపది వివాహం ధర్మసమ్మతమేనా అనిగానీ, కుంతి పిల్లల పుట్టుక గురించిగానీ ఇందులో చాలా చర్చ నడుస్తుంది. గుంపులు–గుంపుల మధ్య సామూహికంగా జరిగిన వివాహాలు, అన్నదమ్ములందరూ ఒక స్త్రీని పెళ్లాడిన వివాహాలు నుంచి ఇప్పుడు మనం ఉన్న ఒక స్త్రీ– ఒక పురుషుడు దశకు సమాజం క్రమంగా పరిణామం చెందుతూ వచ్చింది. దీనికి ఎన్నో కథల్ని మనకు మహాభారతం ఊతంగా వినిపిస్తాడు రచయిత. అయితే, లైంగికత అనేది ప్రకృతి ధర్మంగా మాత్రమే భావించిన ఒక ఎక్స్‌ట్రీమ్ నుంచి లైంగికత అనేది పూర్తిగా సామాజిక నియతిలో భాగమైన మరో ఎక్స్‌ట్రీమ్‌కు వచ్చాం, అంటాడు. ఆ లైంగికత మీద మోపబడుతున్న ఒత్తిడే భిన్న వికృతాలుగా ప్రతిఫలిస్తున్నదేమో.
మహాభారతం అధారంగా మన గతాన్నీ, దాని వెలుగులో మన వర్తమానాన్నీ అర్థం చేసుకోవడానికి భాస్కరం గారి పుస్తకం గొప్ప ఉపకరణం. అయితే భారతాన్ని రీజన్‌తో పని లేకుండా తీసుకోవడం గుడ్డి విశ్వాసం అవుతుంది. ఆ టెక్స్›్ట మీద గౌరవం లేకపోతే ఒక మహత్తరమైన సాంస్కృతిక సంపద నాలాంటివాళ్లకు అందకుండా పోతుంది. అటు గౌరవం ఇస్తూనే ఇటు రీజన్‌ను పక్కన పెట్టకుండా గొప్ప సంయమనం చూపాడు రచయిత.
నాకు చాలాసార్లు విమర్శ అనేది సెకండరీ లిటరేచర్ అనిపిస్తుంది. నువ్వెంత గొప్ప వ్యాఖ్యానం చెయ్యీ, నువ్వు సృజనకారుడితో సమానం కాలేవు. నువ్వు కడుతున్న భవనానికి పునాది ఇంకొకరిది. అందుకే ఎనర్జీని ఉత్తినే వృథా చేసుకోవడం అని కూడా అనిపిస్తుంటుంది. ఇది భాస్కరం గారికి తెలియదని నేను అనుకోను. అయినా ఇంత కష్టం ఎందుకు పడ్డట్టు?
రెండు ప్రయోజనాలు:
1. మొదట్లో సామూహిక వివాహం అన్నాను. ప్రపంచం కూడా ఇంతే కదా. ఆయా మనుషులు ఆయా ప్రాంతాల్లో ఎందుకు ఉండాల్సివస్తుందో వస్తుంది. వాటికి ఏవేవో కారణాలు, ఒత్తిళ్లు, ఆశలు, రాజకీయాలు పనిచేస్తాయి. అప్పుడు అప్పటికే ఉన్న మనుషులతోనూ, అక్కడికే వస్తున్న మనుషులతోనూ ఏర్పడే ఘర్షణ, అనంతర సర్దుబాటు, ఇదే చరిత్ర పొడుగునా.
ప్రపంచం అంతా దాదాపు ఒకే చరిత్రను పంచుకుంది, ఒకేరకమైన సర్దుబాట్లు చేసుకుంది. మన పౌరాణిక గాథలు అవే చెబుతున్నాయి, మన విశ్వాసాలు అవే చెబుతున్నాయి. అయినా వ్యవస్థను గడ్డ కట్టించే ప్రయత్నం ఒకటి చరిత్ర పొడవునా జరిగింది, ఇప్పటికీ జరుగుతూనేవుంది. అయినా సమాజం మన నియంత్రణలో లేనివిధంగా ద్రవంలా పలురీతుల్లో ప్రవహిస్తూనే ఉంది. ఇది మన వశంలో, ఎంతటి అధికార వశంలోనైనా లేని విషయం అని స్పష్టం చేయడం రచయిత లక్ష్యాల్లో ఒకటి అని నేను అనుకుంటున్నా.
2. బహుశా, మనిషి అస్తిత్వానికి మూలకేంద్రకాన్ని అన్వేషించడం రచయితకు ఎక్సయిటింగ్‌గా తోచింది. ఈ ప్రపంచం మొత్తాన్నీ ఒక వృత్తం చేసి, మనిషిని దానికి కేంద్రంగా నిలబెడతాడు. ఈ మొత్తం చరిత్రలో మన ముందున్న తరాల వారసత్వాన్ని మనకు బదలాయించడం ద్వారా మన ఉనికికి ఒక దన్నును ఇస్తాడు.
మౌఖిక చరిత్రలు ఉన్నప్పుడు మనం అందరికీ ఒక అస్తిత్వం ఉండింది; మనం అందరం ప్రాముఖ్యం ఉన్నవాళ్లమే; లిఖిత చరిత్రలు రాయడం మొదలైనప్పటినుంచే మనిషి చరిత్రహీనుడయ్యాడు, అంటాడు. ఈ లిఖిత పుస్తకంలో ఆ మౌఖిక గాథల సారాన్ని ఇమడ్చడం ద్వారా నరుడికి, సామాన్యుడికి కిరీటం తొడిగాడు.
మానవ స్వభావంలోని సంక్లిష్టతే మొత్తం నాగరికతను ప్రభావితం చేస్తూ వచ్చిందని నాకు అనిపిస్తుంటుంది. నేను సామ్యానుడిని, నేను అందరిలాంటివాడిని అంటే ఒప్పుకోబుద్ధి కాదు. నేను పక్కవాడికంటే కొంచెం ప్రత్యేకం అనుకునే గుణం ఎందుకో మనిషిని వదలదు. అలా ఆపాదించుకునే అవ్యక్త గొప్పతనమే మంచికీ చెడుకూ రెంటికీ దారితీసుండవచ్చు. ఒక తెగ, మతం, ప్రాంతం ఏవీ దీనికి అతీతం కావు. ఈ సంక్లిష్టతను కూడా ఈ పుస్తకం డిస్కస్ చేయడం నాకు నచ్చింది.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అంటే నాకు గౌరవం. వాళ్లు ఎంపిక చేసుకునే పుస్తకాలు చూజీగా, పికీగా ఉంటాయి. కానీ వాళ్ల మీద నా ఫిర్యాదు ఏమిటంటే– దానికి తగ్గ ప్రొడక్షన్ వాల్యూ అన్నిసార్లూ కనబడదు. ముఖ్యంగా తప్పుల విషయంలో. ఈ 800 పేజీల పుస్తకంలో బీభత్సంను భీభత్సం అని రావడం తప్ప నాకు మరో దోషం కనబడలేదు. పైగా మంచి కాగితం వాడారు. అందుకు అభినందనలు.
ఇన్ని మంచి మాటలు చెప్పిన తర్వాత దీనికి ఏమైనా ఒక దిష్టి చుక్క పెడదాం అనిపించింది. ముగింపుకు వచ్చేసరికి పుస్తకం సరిగ్గా అయిపోయింది అన్న ఫీలింగ్ రాదు. పాఠకుల్ని రోడ్డు మీద వదిలేసి, వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. ఆ లోపం రచయితది కూడా కాదేమో. ఎంత తవ్వుకుంటే అంత చరిత్ర! దీనికి కామా పెట్టగలమేగానీ ఫుల్‌స్టాప్ ఎట్లా? అందుకే ఇంత భారీ పుస్తకం కూడా ఇంకో మహత్తర ప్రణాళికకు ప్రిలోగ్ మాత్రమే అంటున్నాడు. చూద్దాం ఇంకా ఏం రాయబోతున్నారో.
దీన్ని మినహాయించి ఇక చివరి మాట:
కొన్ని మాటలు అయిందానికీ కానిదానికీ వాడటం వల్ల వాటి నిజవిలువను పోగొట్టుకుంటాయి. అందులో అద్భుతం ఒకటి. ఈ పుస్తకంలో రచయిత నిభాయించుకోలేక ఆ మాట కొన్నిసార్లు వాడుతుంటాడు. నేను కూడా అదే చెబుతున్నా. కాకపోతే స్పోకెన్ వర్డ్‌కు ఉండే ఎంఫసిస్‌తో. ఈ పుస్తకం ఒక అద్భుతం!
మంత్రకవాటం తెరిస్తే
మహాభారతం మన చరిత్రే
ఆవిష్కరణ సభ – హైదరాబాద్ బుక్ ఫెయిర్, ఎన్టీఆర్ స్టేడియం
డిసెంబర్ 29; సాయంత్రం 5:30
––––––––––––––––