'ఆజన్మం' రాజిరెడ్డి గురించి.
నాకు రాజిరెడ్డి గారి రచనతో పరిచయం యాదృచ్ఛికంగా జరిగింది. అంటే నేను నేనుగా వాటిని వెతుక్కొని చదవలేదు. అలా తారసపడింది, అంతే. 2014 మే కినిగె సంచికలో నాదొక కథ వచ్చింది. అప్పట్లో కథని ఎవరైనా చదివి ఏమైనా రెస్పాండ్ అయితే బాగుండనే బాల్యపు దశలో ఉండి, ప్రతిరోజూ, అంటే మే నెల ఎండలంతా కినిగె కామెంట్స్ సెక్షన్స్ లోనే గడిపా. అలా చూస్తుండగానే జూన్ నెల వచ్చింది, కొత్త సంచిక, కొత్త కథలు కలుపుకొని. అదిగో అలా ‘రెక్కల పెళ్ళాం’ చదివాను. అదివరకు సాహిత్యం ఎక్కువ చదవకపోవడం, అప్పటికి చదివిన కాస్త సాహిత్యం కూడా ‘ఇహ’ లోకపు రీతులకే కట్టుబడిన జీవితాల మీదే వెలుగు ప్రసరించడం వల్ల, ఈ కథ చదవగానే విప్పుకున్న రెక్కలు, మొలుస్తున్న ఎర్రటి తురాయి మనసులో ముద్ర పడ్డాయి. అప్పటికి నాకు తురాయి అంటే అర్ధం తెలియదు. ఆ విధంగా ఆన్లైన్ లో ఆంధ్రభారతి డిక్షనరీ కూడా ఈ కథే పరిచయం చేసింది.
నిజం చెప్పాలంటే నేను రాజిరెడ్డి గారి సాహిత్యం చదివింది మొన్నటివరకు చాలా అంటే చాలా తక్కువ. నేను రియాలిటీ చెక్ చదివింది లేదు. అసలు ఆ పుస్తకం ముట్టింది లేదు. ఇంకా మధుపం, పలక-పెన్సిల్, చింతకింది మల్లయ్య ముచ్చట పుస్తకాలు అరువు తెచ్చుకున్నా, ఇష్టంగా ఆసాంతం ఏ పుస్తకం చదవలేకపొయ్యా. బహుశా ‘ఇలా ఉంటేనే సాహిత్యం నాకు నచ్చుతుంది’ అనే గీత గీసుకొని ఉండటం వల్ల, నాకు ఇష్టమైన సాహిత్యం పరిధి సహజంగా చిన్నదయింది. కానీ, ‘గంగరాజం బిడ్డ’ చదివిన తర్వాత, ఆయన రచనలు అన్ని రోజులు చదవకపోవడం వల్ల నేనేదో కోల్పోయానేమో అని అనిపించినా, అదేంటో నా పూర్తి గ్రహింపులోకి రాలేదు. ఆయన్నీ పూర్తిగా చదవాలనే కాంక్ష అయితే మొదలయింది ఆ కథ నుండే. కానీ, ఎప్పుడూ ఏదోక ఆటంకం. అనవసరపు పనులతో తీరికలేని తనం. అప్పుడే మళ్లీ ‘ఆటా సభల్లో నా ప్రసంగం (డిసెంబర్ 14, 2019)’ అని ఒక బ్లాగ్ లింక్ నాకు 2020 మొదటిరోజే ఎదురయితే చదివాను.
ఆ కొత్త సంవత్సరం రోజు ఆయన ప్రసంగంలో ఉన్న మూడు విషయాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి- ఒకటి ఆయన సాహిత్యం వైపు రావడానికి వెల్లడించిన కారణం, రెండు రాయడం పట్ల ఆయనకున్న దృక్పథం, మూడు జీవితాన్ని శుభ్రం చేసుకోవడానికి రాతని ఒక సాధనంగా ఎంచుకోవడం.
ఈ మూడు విషయాలు నా పఠనా ప్రపంచంలో ఒద్దికగా మోహరించి ఆయన మిగతా రచనలన్నీ చదివించేలా చేశాయి. ఇప్పుడు ‘ఆజన్మం’ అని చెప్పుకుంటున్న రాతల్లో మునుపటి కథల్లో కనపడని ఒక తత్త్వం ఉందేమోననిపిస్తుంది నాకు. ఆ తత్త్వానికి కారణం, ఈ రాతల్లో ఆయనకే పరిమితమితమైన చూపుతో లోకాన్ని చూసి, లోపలికి గ్రహించి, ఆ గ్రహింపును నిశితంగా పరిశీలన చేసి, దానిమీద ఒక స్థిరమైన అభిప్రాయం రావడానికి లోపల కొంత నలిగి, తీరా ఒక నిర్ణయానికి వచ్చేశాక దాని ధర్మం చెడకుండా బయటకు ఎలా చెప్పాలో అని ఒక వందసార్లు దానిని లోపల మననం చేసుకున్నాక, నిర్మమత్వంతో ఒక మాట రాస్తారు. అయన మెదడు గూటి దాటి ఒక మాట బయటకు రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. దీనికి మనం‘రాజిరెడ్డి తత్త్వం’ అనే పేరు ఒకటి పెట్టుకుందాం. ఈ వైవిధ్య గుణమే ఇందులో ఉన్న రాతల్ని, ఆయన రాసిన మిగతా రచనల ప్లేన్ లో కాకుండా, మరొకటేదో భిన్నమైన యూనివర్స్ లో నుండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాయి. ఆ వేరొక లోకం కూడా స్వతహాగా తనంతట తానుగా తెలుసుకున్న విలువల చుట్టే కట్టుబడి ఉంటుంది.
ఆయన రాతల్లో కనిపించే ముఖ్యలక్షణం- ఎంచుకున్న అనుభవాల్లోంచి గ్రహించిన సత్యాలు రాయడం, జీవితం పట్ల ఉన్న నిబద్ధత, నిజాయితీని అక్షరాలవైపు ప్రసరించడం, ఆ రచనలతో కొంచెమైనా జీవితాన్ని శుభ్రపరచుకోవాలనే ఆయన ఆశ. అంటే సుదీర్ఘమైన అనంత కాలరేఖ మీద వేసిన జీవితపు తప్పటడుగులను, రాతల్లో మరొకసారి అనుభవించి, జీవికి అంటుకుపోయిన మలినాలను కొద్దికొద్దిగా శుభ్రం చేసుకోవడమే తన ముందున్న కర్తవ్యం. ఈ ప్రాసెస్ లో తనని తాను కొత్తగా మళ్ళీ పరిచయం చేసుకోవడం, అనుభవాలను అనుభావాల్లాగే గుర్తు చేసుకోవడం పరిపాటి (అంటే తనదైనది ఏదీ ఆ అనుభవాలకు జోడించకుండా, వాటిని యథాలాపముగా పరిశీలన చెయ్యడం). అందుకేనేమో 'ఆయన బతికేదంతా, ఆయన జార్చుకున్న క్షణాల్లోనే', గతంలోనే. ఆ గత కాల స్పృహతో ప్రస్తుతాన్ని జాగ్రత్తగా జీవించాలనుకుంటారు.
ఇలా కన్ఫెషన్ ఎలిమెంట్ ఉన్న రచనల్లో, వెలుగు ప్రసరించిన నిజాలకుండే విలువ కంటే దాచేయబడిన సత్యాలకు శక్తి ఎక్కువ. అలా అని దాచేయబడినవన్నీ సంపూర్ణ సత్యాలని, అక్షరాల్లో పొందుపరిచనవన్నీ పాకిక్షమైనవని కొట్టిపారేయలేము. జీవితం పట్ల ఉండే నిబద్ధతతో తమను తాము నిశితంగా పరిశీలన చేసే ఇటువంటి రచనల్లో, జీవిత సారానికి సంబందించిన అమూర్త రూపమేదో ఎదురుపడుతుంది. కానీ, అలా జరగాలంటే దాచుకోడానికి వీలుండి కూడా, మనసొప్పక, ఇతరులతో సహజంగా పంచుకోలేని కొన్ని వైయక్తిక జీవిత అనుభవాలెన్నో నిజాయితీగా పరీక్షకు పెట్టాల్సిందే. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఇదిగో ఇలాంటివన్నీ- “బయటికి చెప్పినవీ చెప్పలేకపోయినవీ లోపల ఉన్నవీ లోలోపల దాక్కున్నవీ అంతరాంతరాళాల్లో రక్తంలో ఉన్నవాటిని వేరుచేయడానికి శ్రమపడాల్సినవీ…. తప్పులు ఒప్పులు కన్ఫెషన్లు కోరికలు ఇబ్బందులు హిడెన్ ఎజెండాలు ఓపెన్ ఆదర్శాలు...”. అసలు నిజ్జంగా ఒక మనిషి తన మనసులోనున్న ఆలోచనలు, ఏరుకున్న జీవిత అనుభవాలు, చేసిన తప్పులు, ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుకు వచ్చే గతం తాలూకా చెత్త పనులు, ఇవన్నీ రచనల్లో వ్యక్తపరచగలడా? ఉన్నదున్నట్టు, జరిగింది జరిగినట్టు ఒక fact లా, ఏ conceptual ఫ్రేమ్ తాలూకా భావాలని/వాదాలని వాటికి జోడించకుండా, నిర్భీతితో వాటినన్నింటినీ తన రచనల్లో చెప్పుకోగలడా? అది కొంత అసాధ్యమేమో! అందుకే ఆయనే రాతకు పరిధిని కూడా ఆయనే సూచించుకున్నారు. లోపలున్న భావాలూ అక్షరాలలో నింపినప్పుడు, వాటికుండే సహజ గుణమేదో పాక్షికంగా వడలి పోతుందేమోనని అభిప్రాయపడ్డారు. అందుకే ఒక చోట ఇలా రాస్తారు- “అనుకుంటాంగానీ, నిజంగా మనిషి మనసులో ఉన్నవన్నీ రాయలేం. ఇలాంటి నా లోపలి విషయాలు ఇంకా వెయ్యి ఉన్నాయేమో, అనిపిస్తోంది. ఇంకొకటి చెప్పాలి. నిజంగా రాయలేమా అంటే, ఒక క్షణంలో మనకు కలిగిన భావాన్ని వాక్యంలోకి తర్జుమా చేస్తే అది సంపూర్ణ సత్యం కావాలని లేదు. అది ఆ క్షణానికి సత్యమే. కానీ ఎప్పటికీ నిలిచే సత్యం కాకపోవచ్చు.” అందుకేనేమో నేను చెప్పుకోవాల్సినవన్నీ రాయలేకపోయానని, ‘పూర్తి స్వచ్ఛంగా’ గా ఉండలేకపోయానని బాధపడతారు ఆయన.
రాజిరెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఆయన రాయడం/సాహిత్యం వైపు రావడానికి ప్రధానంగా పనిచేసిన కారణం ‘ఈగో’ అని చెప్పారు. అయితే ఆ ‘ఈగో’ అంటే ఏంటి? ఆయన రచనల్ని ఎరుకలో ఉంచుకొని, ఏ సెన్స్ లో ఈ పదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు? ఆయన చెప్పిన ‘ఈగో’కి బహుశా ఇలా ఒక సమాధానం మనం చెప్పుకోవచ్చు, ఒక రకంగా తనకు సంబంధించిన వైయక్తిక సత్యాలే తప్ప, సామూహిక సత్యాలని అలానే ఉమ్మడితనాల్ని అంగీకరించని తన గోడే ఈ రాతలంతా. అయితే శైశవదశలో చాలామందిలాగే రచనకి, జీవితానికి ఏ మాత్రం లంకె లేని రాతలు రాసి అబ్బురపడ్డారు. ఒకానొక రోజు ‘ఏమీ తెలియకుండా, అనుభవంలోంచి చీల్చుకుని రాకుండా ఒక్క వాక్యం కూడా రాయొద్దన్న ఇంగితం’ కలిగి, ఇంటెనకున్న జామచెట్టు సాక్షిగా పాత రాజిరెడ్డి కాలిపోయారు. అయన రచనలు కాకుండా ‘రాజిరెడ్డి కాలిపోయారని’ ఎందుకన్నానంటే, ఆయన ఇక ముందు నుండి రాసిందంతా ఆయన గురించే. ఇదే మాటను ఇదిగో ఒక చోట ఇలా అంటారు-’లోకం గురించి రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. నా గురించి రాసుకోగలిగేది నేను ఒక్కడినే కదా!’. ఒకొక్కసారి నాకేమనిపిస్తుందంటే ఆయన రాతల్లో జరిగినట్టుగా చెప్పే చాలా సంఘటనలు, నాకు మటుకు ఆయన మనస్సులో జరిగిన ఆలోచనల ఘర్షణల్లాగానే అనిపిస్తాయి. అవి మేటర్స్ అఫ్ ఫాక్ట్స్ కాదు కేవలం possibilities నేమో! ఇలా possibilities గురించి మాట్లాడటం వల్ల ఆయన ఒక్కరు కాదేమో అనిపిస్తుంది. రాజిరెడ్డి గారు నా అనుమానానికి వంత పాడుతూ ఇదిగో ఇలా అన్నారు ఒకచోట “నేనెప్పుడూ ఒకణ్ని కాదు, ఇద్దరం.” బహుశా అందుకేనేమో “మంచీ మర్యాదా” లో రమేశ్‌గాడు, “ప్రాణవాయువు” లో హరిగాడు తన కవల సోదరుడన్నా, అదేంటో నాకు ఈ రెండూ కూడా రాజిరెడ్డి గారి స్వీయానుభవాలే అనిపిస్తాయి. ఇలా అనిపించిడానికి కారణం, facts కి, possibilities కి మధ్య నుండే సన్నని గీత ఆయన రాతల్లో చెరిగిపోతుందనుకుంటాను.
ఇలా లోపల నలిగిపోవడం, చిన్న చిన్న విషయాలకు ఎందుకు అంత బుర్ర పాడుచేసుకోవడం ఎందుకంటే, ‘చెప్పాలని ఒక దుగ్ధ. ఇంకా ముఖ్యంగా ఇవన్నీ చెప్పేస్తే ఏర్పడే ఖాళీతనం ఇష్టం’ అని చెప్తారు. ఇంత ఘర్షణ పడితే తప్ప శాంతి రాదనీ ఆయన నమ్మకం. అందుకే ఆయన అంటారు “నాతో నేను శాంతి పొందడం ఒక్కటే ఈ జీవితకాలం నేను చేస్తున్న సాధన.”
చివరిగా ఒక మాట- అయితే మొన్న మెహెర్ భాయ్ ఒక మాట చెప్పారు- “Your search for a suitable form of art may well end in finding a better version of yourself.” ఈ మాట బాగుంది. కానీ, రాజిరెడ్డి గారి విషయంలో నాకేమనిపిస్తుందంటే suitable form కోసం ఆయన అదే పనిగా ఎప్పుడు వెతుక్కోలేదేమో. ఈ ever changing world లో, ఒకొక్క phase లో, ఆయన అనుభవములోకి వచ్చిన మానవ సంబంధాల గాఢతని, అప్పుడు అందుబాటులో ఉన్న form లోకి ఒంపుకున్నారేమో. మనిషి మారుతున్న కొద్దీ పాత forms లలో ఆయన మాటలు ఇమడక, ఆ forms కి యెడంగా వస్తూ, ఇదిగో ఇలా ఈ ‘ఆజన్మం’ సమయానికి అయన మానసిక నిర్మాణానికి తగ్గట్టుగా అచ్చంగా సరిపడే శిల్పం తారసపడింది అనుకుంటా. అందుకేనేమో వీటికి అంత అందమూ, శాశ్వతంగా నిలిచిపొయ్యే గుణమూ ఉన్నాయని నా గట్టి నమ్మకం.
ఇకపోతే రియాలిటీ చెక్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. ఆజన్మం కి సంబంధించిన కొన్ని రాతలు ఆన్లైన్లో దొరుకపుచ్చుకొని, చదివి, రాసిన నోట్ ఇది. పుస్తకం మొత్తం చదవాలి, మళ్ళీ, మళ్లీ.
‘కాంటెంపరరీ తెలుగు రచయితలలో నీకు ఇష్టమైన రచయిత ఎవరు?’ అని ఎవరు నన్ను అడిగినా తడుముకోకుండా వెంటనే చెప్పే సమాధానం మెహెర్ భాయ్ అని. అయితే ఆ లిస్ట్ లో ఇప్పుడు ‘అజన్మం’ రాసిన రాజిరెడ్డి గారు చేరారు. ఇంకో విధంగా చెప్పాలంటే రాజిరెడ్డి అనే మనిషే నచ్చాడు. ఎందుకంటే ఈ ఆజన్మంకి సంబందించినవరకు రాత, మనిషి వేరు కాదు.
PS- నేను రాసేవాటి గురించి నాకుండే ఒకే ఒక్క అభిప్రాయం- am I making any sense at all? అని. అందుకే ధైర్యం చేసి ఆయన్ని ట్యాగ్ చేయలేకపోతున్న 😕
-మేడి చైతన్య