ఈ సమీక్ష రాసిన అజయ్ ప్రసాద్‌కూ, దీనిలోంచి కొంతభాగాన్ని ప్రచురించిన ఫన్‌డే మిత్రులకూ, పూర్తిపాఠాన్ని ప్రచురించిన ‘పుస్తకం’ సంపాదకులకూ ధన్యవాదాలు.
2021 మార్చ్ 28న సాక్షిలో ప్రచురితమైన సమీక్ష
-------------------------------------
జంత్రవాద్యపు మంత్రవాక్యం ఆజన్మం
బి.అజయ్‌ప్రసాద్
వాగ్గేయకారులు కవిత్వంలోనో, పాటలోనో మాత్రమే ఉండనక్కర్లేదు. రక్తపు లోపలి అలలు తరుముకొస్తుంటే ఏ రూపంలోనైనా బైటికి ధారాళంగా వ్యక్తమయ్యే కళ అది. కదిపితే నిలువెల్లా అనేక రాగాలు పలకగల తంత్రీవాద్యంలాంటివాడు పూడూరి రాజిరెడ్డి. అతడి హృదయం సున్నితమైన జంత్రవాయిద్యం లాంటిది. తటాకంలో విసిరిన రాయికి అలలు చెలరేగినట్లు తనకెదురయ్యే అనుభవంలో అతడనేక మూర్ఛనలు పోతుంటాడు. అశేషమైన ప్రాపంచిక విషయాల ప్రవాహంలో తన ఉనికియొక్క ప్రత్యేకతని ప్రస్ఫుటం చేసుకోడానికి అతడిలోని ‘నల్ల నువ్వుల్ని’ బయటికి రువ్వే అంతర్జలం అతడిలో అనంతంగా పుడుతూనే ఉంటుంది.
రాజిరెడ్డి ‘అనుభవమే జ్ఞానం’ అనే ఉత్త ( pure ) అనుభవవాది ( empiricist ) కాదు గానీ తన సొంత అనుభవమే తన రచనకు ముడిసరుకు అని నమ్ముకున్నవాడు. ఇక్కడ వాస్తవం, అనుభవం ఒకటి కాదు. మరి అనుభవం అందరిదీ ఒకటేనా? అంటే ‘కాదు’ అన్న సమాధానానికి ఎంత విలువుంటుందో ‘అవును’ అన్నదానికి కూడా అంతే విలువ. కొందరికి నచ్చే వర్షాకాలం అతడికి ఇష్టం లేకుండొచ్చు. అతడి చలికాలపు వర్ణన మనకు వెచ్చని దుప్పటి కప్పినట్లుండొచ్చు. అతడి చేతి‘రాత’ ప్రతిభావంతమైన హస్తకళ. ఈ రసవిద్యకి ఆవల అతడి హృదయాన్ని చూడకపోతే రాజిరెడ్డిని మనం చేరనట్లే లెక్క. ‘పరిశీలించడం దాన్ని చిత్రించడం ఉత్త Workmanship, ఆర్ట్ కాదు. మపాసా హృదయం ముందు అతడి పరిశీలనాశక్తి ఎంతపాటి’ అంటాడు చలం.
ఏమిటీ హృదయపు ప్రత్యేకత? I like the story of human complexity అని ఎప్పుడో చదివిన చినువా అచెబె మాట ఎందుకో ఆలా గుర్తుండిపోయింది. ఈ complexity అన్నది speciality కూడా. అనేక భయ, సందేహాలతో కూడిన మానవ ప్రత్యేకత అన్నది ఈ జీవుడి ఉనికి. ఇతడికి – అరటిపండు తినడంకంటే తిన్న తర్వాత తొక్క ఎక్కడ వెయ్యాలన్నది పెద్ద సమస్య . ఒకరు పోసినచోట పోయడం చచ్చే చావు. పేలు చూపించుకునే సుఖం కోసమైనా అమ్మాయిగా పుడితే బాగుండుననుకుంటాడు. హాఫ్ బనీన్లు ఎలా వేసుకుంటారో ఇతడికి అస్సలు అర్థం కాదు. క్లారిఫై చేసుకుంటే బాడ్ ఇమేజ్ తొలగిపోయే అవకాశం ఉన్నా మౌనంగానే ఉంటాడు. లోకం మెచ్చుకునే అనేక గొప్ప రచనలు ఇతడికి చప్పగా అనిపిస్తాయి – ఇటువంటి అనేకానేక స్వభావ సంక్లిష్టతలు ఈ ‘ఆజన్మం’ ఆమూలాగ్రం కోకొల్లలుగా కనిపిస్తాయి. ఒకే అస్తిత్వం నుంచి పుట్టిన అనేక ప్రతిఫలనాలు.
ఈ అస్తిత్వానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమంటే ‘నిర్ణయం తీసుకోలేకపోవటం’. ఇది ఈ పుస్తకం అడుగడుగునా కనిపిస్తుంది. స్వతహాగా ఇది కళాకారుల లక్షణం. తమ విస్తారమైన అంతరంగానికి ఏకముఖం ఎప్పటికీ ఇవ్వలేనితనం. Hesitation ముందుపుట్టి తరువాత నేను పుట్టాను అంటాడు కాఫ్కా. గ్రాహ్యం చేసుకుని ఈదులాడే అంతర్లోకంలో ఒకటి ఎంచుకుని మరొకటి కాదనలేని ఎరుక. సందిగ్ధం ఒక దేహ ధ్యానం.
దిన జీవితపు రద్దీలో చూసి కూడా చూడక, దైనందిన అలవాటే పొరపాటై గిడసబారి వదిలేసిన విషయాలని రచయిత మసి తుడిచి మళ్ళీ మనముందు కొత్త వెలుగులో పెట్టినట్లుంటుంది. ఇందులో పిల్లల మురిపెపు ప్రశ్నల నుంచి దైవభావన, మతాలు, మృత్యుభయాలు, మన పర సమూహాలు, జడలు, సంసార ఇబ్బందులు, ఆఖరికి కౌమారంలో శానిటరీ నాప్కిన్స్ తెలియని కుతూహలం నుంచి పెళ్లయ్యాక భార్య బట్టలు ఆరేయడంలో పడే ఇబ్బంది వరకూ ఈ ఆజన్మం నిండా అనుభవాల సారంగా రాజిరెడ్డి తన రుచులనో, అభిరుచులనో వ్యక్తం చేస్తూ వచ్చాడు. అవి మనవిలా కూడా అనిపించవచ్చు. కొన్నిసార్లు అతడికి రుచిగా అనిపించేది మనకు చేదు కావొచ్చు. కానీ అతడి వివరణ, వర్ణన మాత్రం మనకి రుచికరంగా లేకపోతే మనం మంచి చదువురులం కానట్టే లెక్క. తలవకుండానే తలుపుతట్టే ఆలోచనలను ఒడిసిపట్టుకోడానికి ఎప్పుడూ కలం కాగితం జేబులో సిద్ధంగా పెట్టుకునే రాజిరెడ్డి వచనం గురించి చెప్పినంత తేలిగ్గా అతడి ‘రాయడం’ గురించి చెప్పడం కష్టం. తెలుగు సమకాలీన రచనల్లో విషయం గురించి, ఉదంతం గురించి చెప్పాలనేంత ఆతృత ‘రాయడం’ మీద కనిపించదు. మనం వస్తుశిల్పాల మీద చేసినంత విస్తారమైన చర్చ ఈ ‘రాయడం’ మీద ఎప్పుడూ చేయలేదు. ప్రతిదాన్ని దృశ్యమానం చేయగల డిజిటల్ యుగంలో ఉదంతాలను వివరించే రొడ్డకొట్టుడు రచనలు కనుమరుగై చివరికి చిత్రీకరణకు లొంగని ఈ ‘రాయడం’ ఒక్కటే కళగా మిగిలిపోనున్న కాలం ఒకటి రానున్నది. రాజిరెడ్డి తన స్వీయానుభవాన్ని తనకు తానుగా తరచి చూసుకుని, ఆ పరీక్షనాళికలో నిలబడి దాని రంగు– రుచి–వాసన మనకందజేస్తాడు. ఈ క్రమంలో విషయం కంటే విశేషణం ముఖ్యమౌతుంది. ప్రాపంచిక విషయాల విచారణతో ఆంతరంగిక ఆత్మచైతన్యం రగిలి అవి రెండూ ఒకదానినొకటి జమిలిగా మల్లెపూల దండలో మరువం కలిపి గుచ్చిన గుబాళింపు ఉంటుంది.
అతడే చెప్పుకున్నట్లు ఇందులో అనేక ఆత్మకథాత్మక సంఘటనలు, మ్యూజింగ్స్, ఫీలింగ్స్, కథలు, ఖండికలు, కవితలు ఉన్నాయి. రాసి పెట్టుకోకపోతే మర్చిపోయే చిన్న విషయాలున్నాయి. ‘ఈ అశాశ్వతత్వమే వాటిలోని అందం.’ పుస్తకం నిండా పరుచుకున్న అతడి హృదయపు ఎతచితలు దీన్ని జీవితకాలం చదువుకోగల శాశ్వత అందాన్ని ఇచ్చాయి.
ఆత్మని అనుభవంతో రమింపచేయడం అతడు చేసే పని. అందులోకి లయించినవారికి ఆశ్చర్యమూ, ఆత్మానందమూ.
ఆజన్మం (ఆత్మకథాత్మక వచనం)
రచన: పూడూరి రాజిరెడ్డి; పేజీలు: 304; వెల: 280;
ప్రచురణ: కృష్ణకాంత్ ప్రచురణలు, తెనాలి. 2021. ఫోన్: 97055 53567.
దొరికేచోటు: అనల్ప బుక్ కంపెనీ (ఫోన్: 7093800303); అమెజాన్.ఇన్; నవోదయ బుక్ హౌస్ (ఫోన్: 91-9000413413, 040-24652387); కినిగె.
-------
ఏప్రిల్ 2, 2021న పుస్తకం.నెట్ ప్రచురించిన సమీక్ష లింక్:
పుస్తకంలో ప్రచురితమైన సమీక్ష
https://www.amazon.in/Aajanmam-Poodoori-Rajireddy/dp/B08WLR6W7C/ref=sr_1_1?dchild=1&keywords=aajanmam&qid=1613741208&s=books&sr=1-1
https://kinige.com/book/Ajanmam