Wednesday, February 16, 2022

సోదరుడు దోస్తోవ్‌స్కీ

 



సోదరుడు దోస్తోవ్‌స్కీ

‘‘అమ్మా, నా బంగారం! నిజానికి మనం అంతా అందరికీ బాధ్యులమే. కానీ ఈ సత్యం మానవాళి గుర్తించటం లేదు. గుర్తించిననాడు భూమి స్వర్గంగా మారిపోతుంది.’’ (కరమజోవ్‌ సోదరులు)తెలుగు సాహిత్యం వరకూ గతేడాది చివర్లో ఒక అద్భుతం సంభవించింది. అది రష్యన్‌ మహానవల ‘బ్రదర్స్‌ కరమజోవ్‌’కు తెలుగు అనువాదం రావడం! ఆ నవల సృష్టికర్త, ఈ పదాన్ని దాని అక్షరమక్షరంతో నిజం చేసిన ఫ్యోదర్‌ దోస్తోవ్‌స్కీ (1821–1881) ద్విశతాబ్ది  జయంతి కూడా గతేడాదే(నవంబర్‌ 11) కావడం మరో విశేషం. ఆ సందర్భాన్ని ఉత్సవం చేయడం కోసమే ‘రష్యన్‌ సాహిత్యాభిమాన వేదిక’ ఈ బృహత్‌ కార్యానికి పూనిక వహించింది. తొమ్మిది వందల పేజీల ఈ నవలను ‘సాహితి’ ప్రచురించింది. దీని అనువాదకురాలు అరుణా ప్రసాద్‌ ఒక జీవితకాలానికి సరిపడా ప్రేమకు అర్హురాలు! 

ఇంత ఊరించిన తర్వాత దీన్ని చదవడానికి పాఠకుడు ఆతృత పడితే దెబ్బతినొచ్చు. మొత్తంగా పుస్తకంలో ఏం ఉందో(‘పితృహత్య’) మొదటే తెలిసిపోతుంది. కాబట్టి, ఆ క్షణంలో  ఏం మాట్లాడుకుంటున్నారో అదే ముఖ్యం. రంగస్థలంపై పాత్రలు వచ్చి, అంతరంగాన్ని ‘ఏకపాత్రాభినయం’లా ఎలా ఆవిష్కరించుకుంటాయో ఇవీ అలాగే చేసినట్టుగా తోస్తుంది. కానీ ఆలోచిస్తే అంత అవాస్తవం ఏమీ అనిపించదు. ఒక ఉద్వేగంలోకి వెళ్లిన మనిషి ఎలా వదరుతాడో ఇక్కడా అంతే! అయితే సంభాషణల్లో జీవితపు మౌలిక ప్రశ్నల్ని ఎలా వెతుక్కుంటారన్నది ముఖ్యం.

ఎన్ని చిత్తవృత్తులు, ఎన్ని వృత్తాంతాలు, ఎన్ని ఒప్పుకోళ్లు, ఎన్ని వేడుకోళ్లు! ఇందులో ప్రతి ఒక్కరూ ‘పాపం’ చేసినట్టే ఉంటారు. దానికి తగిన ‘శిక్ష’ అనుభవిస్తూనే ఉంటారు. అల్పులు, ఉన్మత్తులు, మొరటు మనుషులు, ఏ పెద్దరికమూ నిలుపుకోలేని హాస్యగాళ్లు... అసలు ‘నీచుడు’ అనుకునేవాడిలోనూ అత్యంత సున్నితపు పొరలు ఉంటాయని తెలుస్తున్నప్పుడు ఆనంద బాష్పాలు కారుతాయి. తను చచ్చేంత డబ్బు అవసరంలో ఉన్నా, ఆ డబ్బు కోసం అవసరమైతే తండ్రినే చంపేంత కోపంగా ఉన్నా, అదే డబ్బు అడిగితే తనకు కాత్యా ఇస్తుందని తెలిసినా, ఆమెను కాదని గృషెంకాను ప్రేమిస్తున్నప్పడు, కాత్యాను ఆ డబ్బు అడగలేకపోయానని ద్మిత్రీ విచారణలో చెప్పడం మానవాంతరంగపు లోతుకు అద్దం. ఇంతే లోతైన మరో ఘట్టం– ‘ఎల్డర్‌’ జోసిమా దగ్గర తన తప్పును ఒప్పుకున్న ‘రహస్య అతిథి’... ఆయన ముందు నైతికంగా తగ్గిపోయానని భావించి తిరిగి ఆయననే చంపాలనుకోవడం! మన మూలమూలలా ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, రచయిత ఎంత సూక్ష్మాంశాల దగ్గరికి వెళ్తాడంటే ఇంత సున్నితమైన నవల మరొకటి ఉందా అనిపిస్తుంది.

ఒకే అమ్మాయి (గృషెంకా) కోసం తండ్రీ కొడుకులు ఫ్యోద్ర్, ద్మిత్రీ పోటీ పడటం; ఒకే అమ్మాయి(కాత్యా) కోసం అన్నాదమ్ములు ద్మిత్రీ, ఇవాన్‌ బరిలో ఉన్నట్టనిపించడం... జీవితపు చేదు వాస్తవం. ఇందులో ముగ్గురు సోదరులైన ద్మిత్రీ ఒక మృగంలానూ, ఇవాన్‌ మేధావిలానూ, అల్యోషా ఆధ్యాత్మిక జీవిగానూ కనబడతారు. అయితే దోస్తోవ్‌స్కీకి మృగాల పట్ల తక్కువ అభిప్రాయం లేదు. ‘మృగాలెప్పుడూ, ఎన్నటికీ మానవుడంత క్రూరంగా ఉండజాలవు’.

బహు గొంతులు, సూక్ష్మంలోనూ సూక్ష్మం దోస్తోవ్‌స్కీని అనితర సాధ్యమైన రచయితగా నిలబెడతాయి. ప్రతి పాత్రలోనూ రచయిత ఎంతగా పరకాయ ప్రవేశం చేస్తాడంటే, అదింక ఇంకోలా మాట్లాడే వీలున్నట్టు కనబడదు. చిన్న పాత్రలైన గ్రిగొరీ, మేడమ్‌ హోలకోవ్, లిజి, కొల్యాకు కూడా ఇది వర్తిస్తుంది. ఆఖరికి, తుంటరి పిల్లాడు ఇల్యూష గుండుసూదిని గుచ్చిన రొట్టెను విసరడంతో తిని చనిపోయిన కుక్క జుట్చ్‌కా కూడా ఒక ‘వ్యక్తి’గా దర్శనమిస్తుంది. అదే మథనంతో మరణానికి చేరువైన ఇల్యూషా కూడా అంతే నొప్పి పుట్టిస్తాడు. జీవితాన్ని చివరికంటా శోధించి, అందులోని సర్వ వికారాల్నీ తడుముతూ కూడా అది ప్రేమకు అర్హమైనదే అని చాటడం దోస్తోవ్‌స్కీ లక్ష్యం! అందుకే దేవుడి సృష్టిలోని సకల దుర్మార్గాలనూ పరిపరి విధాలుగా ఇవాన్‌ ఎత్తి చూపినప్పుడు కూడా దానికి స్పందనగా– తనను నిర్బంధించిన మహా ధర్మాధికారి పెదవులను క్రీస్తు ముద్దాడిన కథనాన్ని పునర్జీవిస్తూ – అల్యోషా, అన్న పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాడు. 

ఆధ్యాత్మిక రాజ్యస్థాపన ద్వారానే నిజమైన సోదర భావం నెలకొంటుందని దోస్తోవ్‌స్కీ విశ్వాసం. అరెస్టయ్యి, గంటలకొద్దీ సాగిన విచారణ తర్వాత, అలసటతో నిద్రపోయినప్పుడు... తనకు తలగడ పెట్టే దయ చూపినవారెవరని ద్మిత్రీ కదిలిపోతాడు. అదెవరో రచయిత చెప్పడు. కానీ ఎంతటి నిరాశలోనైనా ఒక దయగల చేయి ఎప్పటికీ ఉంటుందని చాటుతాడు. ‘అటువంటి ఒక్క జ్ఞాపకం ఉన్నా అది కూడా మనను కాపాడటానికి ఉపయోగపడుతుంది’ అని ముగింపులో వీడ్కోలు చెబుతూ పిల్లలకు అల్యోషా చెప్పేది ఇందుకే. 

అసలు హంతకుడు ఎవరో బయటపడేప్పటికి ఈ నవల కాస్తా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ రూపు తీసుకుంటుంది. కానీ దీని విస్తృతి రీత్యా ఆ వర్గానికి పరిమితం చేయడం దీన్ని సరైన అంచనా కట్టకపోవడమే అవుతుంది. ఇది సమస్త మానవాళి పశ్చాత్తాపాల చరిత్ర! జీవన మధువును నింపుకోవడానికి ప్రతి ఒక్కరూ పడే తహతహ. పాపభీతితో కుమిలిపోయే ఎందరో జీవన్మృతుల వ్యథ. 1880లో ఈ నవల వచ్చిన 4 నెలలకు దోస్తోవ్‌స్కీ మరణించాడు (ఈ ఫిబ్రవరి 9న 140వ వర్ధంతి.) ఆ లెక్కన ఇది ఒక మహారచయిత చివరి వీలునామా కూడా!

‘అద్భుతాలను’ ఆశిస్తాడు మనిషి. కానీ అద్భుతం వల్ల కాక మామూలుతనం వల్ల దాని విలువ పెరగాలి. ఈ పుస్తకం ఎంత మామూలుదంటే, ఆ మామూలుతనమే అద్భుతంగా తోస్తుంది.

(ప్రచురణ: 14 ఫిబ్రవరి 2022)


Tuesday, February 15, 2022

పలుకుబడి

 



పలుకుబడి

ఒక కాకి ఏ పనిమీదో అప్పుడే తాటిచెట్టు మీద వాలుతోంది. పని ఉండో లేకో ఒకాయన అదే తాటిచెట్టు దగ్గరికి అప్పుడే వస్తున్నాడు. ఆ కాకి కాలు తగిలి తాటిపండు సరిగ్గా ఆయన తలమీద రాలి పడిందట. కాకి కాలు తగిలితే తాటిపండు ఊడి పడుతుందా? ఇది మనకు పట్టింపు ఉన్న విషయం కాదు. కాకతాళీయం అనే మాటకు అర్థం ఆ కాకి, ఆ తాటిపండుతో ముడిపడిన వృత్తాంతమే మనకు కావాల్సినది. కొంత నాటకీయంగా ధ్వనించే ఈ కాకతాళీయం అనే మాటను ఎన్నోసార్లు వినివుంటారు. ఈ మాట చదువుతున్నప్పుడో, విన్నప్పుడో ఎప్పుడైనా తాటిపండు తల మీద రాలిపడుతున్న దృశ్యం మనసులో మెదిలిందా?

దీనికంటే నాటకీయమైనవి ఈ చండ్రనిప్పులు. రాజకీయ విమర్శల్లో ఫలానా ఆయన చండ్రనిప్పులు చెరిగాడంటారు. నిప్పులు చెరగడంలోనే ఒక కవిత్వం ఉంది సరే, కానీ ఈ చండ్ర అనేది ఏమిటి? ఇది ఒక చెట్టు. అది కాలుతున్నప్పుడు రేగే శబ్దం జోరుగా చిటపటమంటూ ఉంటుంది. కానీ ఈ మాట విన్నప్పుడు ఎప్పుడైనా ఆ ఉగ్రరూపంతో ఉన్న చెట్టు కళ్లముందు కదలాడిందా? దాదాపుగా ఇలాంటి మాటే, అట్టుడకటం. ఇందులో పెద్ద గోప్యమైన అర్థం ఏమీలేదు. మామూలు అట్టు ఉడకటమే. కానీ అట్టు పెనం మీద ఉడుకుతున్న, పొంగుతున్న ఇమేజ్‌ ఈ మాటతో జోడీ కట్టిందా అన్నదే అనుమానం. లేకపోతే అంత ఉడికీ ఏం ప్రయోజనం!

ఎటూ పెనం, పొయ్యి దగ్గరే ఉన్నాం కాబట్టి– ఈ ఆనవాలు సంగతేమిటో చూద్దాం. ఆనవాలు దొరక్కుండా చేయాలంటారు. ఆ పనిలో అది ఆయన ఆనవాలు అంటారు. అర్థం తెలుస్తోంది. కానీ ఇంతకీ ఏమిటివి? పాలల్లో ఒక్క నీటిబొట్టు కూడా లేకుండా చిక్కగా కాస్తే మిగిలేవి ఈ ఆనవాలుట! అదే వంటింట్లో ఉన్నప్పుడే కరతలామలకం ఏమిటో కూడా రుచి చూద్దాం. ఫలానా విషయం ఆయనకో, ఆవిడకో కరతలామలకం అంటారు. చేతిలో లేదా చేతి తలం మీద ఉన్న అమలకం. అనగా ఉసిరికాయ. అంటే అంత సులభంగా అందుకోగలిగేదీ, అందుబాటులో ఉన్నదీ అని. ఇంత సులభమైనది కూడా దాని అర్థంతో సహా బొమ్మ కడుతోందా అన్నది సందేహం.

ఇలాంటి వ్యవహారాలకు అర్థం చెప్పుకోవడం నల్లేరు మీద నడక ఏమీ కాదు. దీన్నే ఇంకోలా చెప్పుకొంటే, నల్లేరు మీద నడక చాలా సుఖం, హాయి. ఎందువల్ల? అసలు ఈ నల్లేరు ఏమిటి? ఇసుకలో నడిచినప్పుడు కాలు దిగబడిపోతుంది. కానీ అదే ఇసుకలో అక్కడక్కడా విస్తరించి ఈ నల్లేరు గుబురు గనక ఉందంటే దానిమీద అడుగులేస్తూ ఎంచక్కా నడిచిపోవచ్చు. పల్లేరు గాయలు గుర్తొచ్చాయంటే సరేగానీ ఈ నల్లేరు ఎంతమందికి తెలుసు? అన్నట్టూ గుచ్చాయంటే గుర్తొచ్చేది, ఏకు మేకవడం. ఏకు అనేది నేతపనిలో భాగం. మెత్తగా, సౌకుమార్యంగా, సాధువుగా ఉండేది కాస్తా మేకులాగా దుర్మార్గంగా తయారైన సందర్భంలో దీన్ని వాడతాం.

అన్నీ మనకు తెలుస్తాయా? ప్రయత్నిస్తాం, మళ్లీ ప్రయత్నిస్తాం, అయినా తెలియకపోతే వదిలేస్తాం. ఏదైనా పని జరగనప్పుడు కూడా అంతేగా. కాకపోతే వదిలేముందు ఒక మాట అనేసు కుంటాం, అందని మానిపండు అని. ఏమిటీ మానిపండు? దీని రుచి ఎలా ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడా దొరకదు. ఎందుకంటే, ఎక్కలేనంత పొడవైన, అందలేనంత పొడవైన మాను అంటే చెట్టుకు కాస్తుంది కాబట్టి. దీనికి దగ్గరగా వినిపించే మరో వ్యవహారం, అందలం. అక్కన్న మాదన్న అందలం ఎక్కితే, సాటి సరప్ప చెరువు గట్టెక్కాడట. ఏదో ఒకటి ఎక్కాలిగా ఆయన కూడా. ఇంతకీ మాదన్నతో కలిసి అక్కన్న ఎక్కిందేమిటి? పల్లకీ. మరి పల్లకీ ఎక్కడమంటే ఆ రోజుల్లో తమాషా! అదొక హోదాకు చిహ్నం. ఎవరో సమాజంలో అందె వేసిన చేతులకే అలాంటి యోగాలు దక్కేవి. ఇంతకీ ఏమిటీ అందె? కడియం. బిరుదుటందె అని కూడా అంటారు. ఒక మనిషి విద్వత్తు గలవాడనీ, ప్రవీణుడనీ, నిష్ణాతుడనీ చేతికి తొడిగే సర్టిఫికెట్‌ ఈ ఆభరణం. ఇలాంటివి కూపస్థమండూకాలకు దొరకడం కష్టం. అదేలే, కూపము అనగా బావి, ఆ బావిలో ఉండే, ఆ బావినే ప్రపంచంగా భావించుకునే కప్పలకు ఇలాంటి గౌరవాలు దక్కవూ అని చెప్పడం!

ఇకముందైనా ఇలాంటి మాటల్ని వాటి భావచిత్రాలతో గ్రహిద్దామని ఒడిగడదామా! అయ్యో, పాపానికి ఒడిగట్టినట్టుగా ధ్వనిస్తోందా? ఒడి అంటే ఒడి అనే. ఒడిగట్టడం అంటే ఒక పనికి పూను కోవడం అనే మంచి అర్థమే. కానీ కాలం చిత్రమైంది. ఎంత మంచి ఉద్దేశంతో మొదలైనవైనా కొన్ని మాటల్ని ఎందుకో ప్రతికూలంగా నిలబెడుతుంది. ఒక విధంగా దీని మంచి భావాన్ని తుంగలో తొక్కింది అనుకోవచ్చు. ఇంతకీ తుంగ అంటే మామూలు తుంగేగా? తుంగలో ఒక విషపూరిత తుంగ కూడా ఉంటుందట. ఆ తుంగలో గనక ఏదైనా ధాన్యాన్ని తొక్కితే ఇంక అది ఎప్పటికీ మొలకెత్తదట. అంటే ఒకదాన్ని సర్వనాశనం చేయడం తుంగలో తొక్కడం.

ఇవన్నీ రాస్తూపోతే ఎప్పటికి ఒక కొలికికి వచ్చేను? అదేలే, ఒక కొసకు, చివరకు, ముగింపు నకు. కానీ చాలా మాటలు, భావాలు, వ్యక్తీకరణలు తెలియకుండానే తుంగలో అడుగంటు తున్నాయి. భాష అనేది మన జీవనాడి. ఉత్త పలుకుగా అది బోలు గింజే. కానీ పూర్ణరూపంతో సారాన్ని గ్రహిస్తే అది అమృతాహారమే; పాతకాలం  పెళ్లిళ్లలో గాడిపొయ్యి మీద వండుకున్నంతటి విందుభోజనమే. ఓహో, మళ్లీ ఇదొకటి వివరించాలా! పశువులకు గడ్డి వేసే గాడి ఏమిటో, దానికీ గాడిపొయ్యికీ సంబంధం ఏమిటో... అసలు ఉందో లేదో తెలుసుకుంటేనే మన భాష ఒక గాడిన పడుతుంది.  

(ప్రచురణ: 17 జనవరి 2022)

(Note: ఇందులో ‘నల్లేరుపై నడక’ అనే మాటతో అనంతపురంకు చెందిన రచయిత సడ్లపల్లె చిదంబర రెడ్డి గారు విభేదించారు. ఆయన దాన్ని నల్ల నీళ్ల యేరుగా చెప్పారు. అదే నల్లేరుగా మారిందన్నారు. ఎర్రెర్రని నీటి ప్రవాహంలో నీరు ఎంత లోతుందో, ఏ వైపు కోసుకుపోయిందో తెలీదు; అదే వానలు తగ్గిన తర్వాత ఒండు తేరుకుని నీరు నల్లబడుతుంది; నల్ల అంటే ఇక్కడ జనవ్యవహారంలో(ముఖ్యంగా రాయలసీమ) పారదర్శకం; ఈ నల్లేటిని దాటాలన్నా, దాని వెంబడి పోవాలన్నా భయం ఉండదు; దీన్నే నల్లేరు నడక, నల్లేరు మీద బండి నడక అంటారని ఆయన వివరణ.)


Monday, February 14, 2022

చదువులో ధ్యానం

 



చదువులో ధ్యానం

ఒక సంస్కృతిని నాశనం చేయడానికి పుస్తకాలను కాల్చే పనిలేదు; జనాన్ని చదవకుండా చూడండి చాలు అంటాడు అమెరికన్‌ రచయిత రే బ్రాడ్బరీ. ఇదే అర్థం ఇచ్చే వాక్యాన్ని రష్యన్‌ కవి జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ ఇంకోలా చెబుతాడు. పుస్తకాన్ని కాల్చడానికి మించిన పెద్ద నేరాలు ఉన్నాయి; అందులో ఒకటి వాటిని చదవకపోవడం! చిరిగిన చొక్కానైనా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్న కందుకూరి వీరేశలింగం మనకు ఉండనే ఉన్నారు. చదవడం అనేది ఎంత ప్రాధాన్యత కలిగినదో చెప్పడానికి జార్జ్‌ ఆర్‌.ఆర్‌. మార్టిన్‌ ఉటంకింపు ఒక్కటి సరిపోతుంది. ప్రపంచాన్ని కుదిపిన ‘ఎ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’, అది భాగమైన ‘ఎ సాంగ్‌ ఆఫ్‌ ఐస్‌ అండ్‌ ఫైర్‌’ సిరీస్‌ సృష్టికర్త అంటాడు: చనిపోయేలోగా ఒక పాఠకుడు వెయ్యి జీవితాల్ని జీవిస్తాడు. ఎప్పుడూ చదవనివాడు మాత్రం ఒకటే జీవితం గడుపుతాడు.

చదవడం అనేది ఒక ఈవెంట్‌. ఒక పోటీ. స్నేహితుల దగ్గర పుస్తకాలు తెచ్చుకోవడం, దాని గురించి మాట్లాడుకోవడం, లైబ్రరీలు, రీడింగ్‌ రూములు, అద్దె పుస్తకాల షాపులు, పాత పుస్తకాల షాపులు, అక్కడే నిలబడి పుస్తకంలో ఏ కొన్ని పేజీలనో ఆబగా చదువుకోవడం... అదంతా ఒక పాత కథ. వెయ్యి పేజీల పుస్తకమైనా ఇట్టే ముగిసిపోయేది. దిండు సైజు నవలైనా అసలు బరువయ్యేది కాదు. చదవడం అనేది గొప్ప విషయం అని అర్థమవుతూనే, దానికి దూరమైపోవడం కూడా నిజమని తెలుస్తూనే ఏమీ చేయలేని చిత్రమైన స్థితిలో ఉన్నాం.

టెలివిజన్‌ నన్ను చాలా ఎడ్యుకేట్‌ చేస్తుంది; ఎవరైనా టీవీ ఆన్‌ చేసిన ప్రతిసారీ నేను గదిలోకి వెళ్లి పుస్తకం చదువుకుంటాను అన్నాడు వ్యంగ్యంగా గ్రూచో మార్క్స్‌. దృశ్యం రావడం అనేది చదవడాన్ని దెబ్బకొట్టిందని అందరికీ ఇప్పుడు తెలిసినదాన్నే అందరికీ తెలియకముందే చెప్పాడీ కమెడియన్‌. వేగవంతమైన రోజువారీ జీవితంలో నెమ్మదిగా సాగే చదువుకు స్థానం లేకుండా పోయింది. ప్రతిదాన్ని కథనంలో పెట్టాలనే సామాజిక మాధ్యమాల ధోరణి పుస్తకం మీద కాసేపు శ్రద్ధగా చూపు నిలపనీయని స్థితికి తెచ్చింది. ఒక అంచనా ప్రకారం, ప్రింటు కాగితాన్ని చదివేవాళ్లు దాన్ని సగం చదివి వదిలేస్తే, అదే అంశాన్ని డిజిటల్‌లో అయితే ఐదో భాగం చదవడమే ఎక్కువ.

అయితే చదవడం అనేది కొంతవరకూ రూపం మార్చుకుంది అని కూడా చెప్పొచ్చు. ఆడియో బుక్‌ వింటే చదవడం అవుతుందా, అవదా? ఆన్‌లైన్‌ క్లాసులు వింటే చదవడం వచ్చినట్టా, కాదా? ఏదైనా పీర్‌ ప్రెషర్‌. గొప్ప స్వీడిష్‌ సినిమా చూసినంత మాత్రాన దాన్ని పంచుకోవడానికి ఎవరూ లేకపోతే మళ్లీ సమూహంలో భాగం కావడానికి బిగ్‌బాస్‌ గురించి మాట్లాడవలసిందే. అందుకే ప్రతి మార్పునూ భౌతిక పరిస్థితులే శాసిస్తాయి. ఈ పరిస్థితులు చాలావరకూ సాంకేతికమని చెప్పక తప్పదు. చదవడం మీద ఆసక్తి ఉన్నవాళ్లను కూడా అందులో మునగనీయని స్థితి.

పాము మందును పాము విషంలోంచే తయారు చేస్తారు. పోయిన చోటే వెతుకు అన్నట్టుగా, పోవడానికి కారణమైనదే ఇప్పుడు కొత్తగా ఊతం అవుతోంది. ఏ డిజిటల్‌ మాధ్యమాలైతే చదువును చంపేశాయని భావిస్తున్నామో అవే మళ్లీ పెరగడానికి కారణమవుతున్నాయి. క్లబ్‌ హౌజ్‌ పుస్తకాలను చర్చించడానికి ఉపకరిస్తోంది. ఫేస్‌బుక్‌ గోడల మీద క థలు, వ్యాసాలు అచ్చవుతున్నాయి. చదివిన పుస్తకాల గురించి మాట్లాడే ‘బుక్‌టోక్‌’ విదేశాల్లో బాగా ఆదరణ పొందుతోంది. దీనివలన పుస్తకాల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం ద్వారా కూడా సెలబ్రిటీలు కావొచ్చని ఇది నిరూపిస్తోంది. టిక్‌టోక్‌లో భాగమైన దీన్ని ఇండియాలో కూడా తిరిగి ప్రారంభం కావొచ్చన్న ఆశాభావాన్ని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యక్తం చేశారు.

దృశ్యం విసుగెత్తి సృజనకు ఉన్న అవధులను గుర్తుతెస్తుంది. స్వీయ ఊహాత్మక ప్రపంచంలోకి వెళ్లాలంటే శబ్దమే దారి. బహుశా, అందువల్లే మళ్లీ ఆడియో బుక్స్‌ పాపులర్‌ అవుతున్నాయి. ఇంకొకటి: ఒకప్పుడు లోకానికి మన ముఖాన్ని చూపుకోవడమనే ఉబలాటం ఎక్కువగా ఉంటుంది. అదింక రొటీన్‌ స్థాయికి వచ్చేశాక, మన ముఖం కనబడటం అనేది ప్రాధా న్యత కోల్పోతుంది. ప్రైవసీ అనేది గొప్ప ప్రివిలేజ్‌ అవుతుంది. అందుకే ముఖం కనబడకుండా వినగలిగే, మనగలిగే సామాజిక మాధ్యమాలకు ఆదరణ దక్కుతుంది. అప్పుడు చూడటంలో కన్నా చదవడంలోనే ఎక్కువ ఆనందం దొరికే స్థితి వస్తుంది. బహుశా ప్రపంచం ఈ సంధికాలంలో ఉన్నదేమో.

ఈ స్థితిని దర్శించే కాబోలు కొందరు చదువరులు అప్పుడే ‘స్లో రీడింగ్‌’ అనేదాన్ని ప్రచారంలోకి తెస్తున్నారు. ప్రతి అక్షరాన్ని ఆబగా కాకుండా, జీర్ణించుకుంటూ, ఆస్వాదించుకుంటూ చదవమని చెబుతున్నారు. ప్రపంచాన్ని ఒకసారి స్లో మోషన్‌లో దర్శించండి. ఇంకా స్ఫుటంగా, స్పష్టంగా, దాని అన్ని సూక్ష్మ వివరాలతో, దానిదైన ప్రత్యేకతలతో. మీ చుట్టూ ఉన్నదే మరింత తదేకంగా, ఏకాగ్రతగా చూడటంలో ఎలాంటి ధ్యానస్థితి ఉంటుందో చదవడంలో కూడా అలాంటిదాన్ని అనుభవంలోకి తెచ్చుకొమ్మని సూచిస్తున్నారు.

‘ఆధునిక జీవితంలోని వేగాన్ని తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన ప్రతిక్రియల్లో నెమ్మదిగా చదవడం ఒకటి’ అంటాడు కార్ల్‌ హోనోరే. ‘ఇన్‌ ప్రెయిజ్‌ ఆఫ్‌ స్లో’ అనే పుస్తకాన్ని కూడా రాశాడీ కెనడా పాత్రికేయుడు. ఏ రిజొల్యూషన్స్‌ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నవాళ్లు ఈ రానున్న కొత్త సంవత్సరంలో ఇదొకటి తీర్మానం చేసుకోవచ్చు. చదవడం అనేది ఎటూ ఉంటుంది. కానీ దాని పూర్ణరూపంతో మనలోకి ఇంకేలా చదవాలని ఒక తీర్మానం చేసుకుందాం. ఒక హైకూను చదివినంత మెత్తగా, నెమ్మదిగా చదవడాన్ని ఆనందిద్దాం.  

(ప్రచురణ: 20 డిసెంబర్ 2021)