క్రియతో సెల్ఫీ
పూడూరి రాజిరెడ్డి
కొత్తగూడెం బాలోత్సవ్‌గురించి వినడమేగాని ఎప్పుడూ పాల్గొనే అవకాశం రాలేదు. అది ఆగిపోయిన తర్వాత, దాని స్ఫూర్తితోనే కొనసాగుతున్న ‘క్రియ’ గురించి తెలిసిన ఏడాదే అనుకోకుండా అందులో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. అంతా రమణమూర్తి గారి చొరవ, నవీ¯Œ గారి కార్యదక్షత!
నాలుగు మాండలికాలనూ పలికిన ఒక పాప. కాగితంతో హంసకు జీవం పోసిన ఇంకో చిన్నారి. మట్టితో ఆకుల రేకులు తీర్చిన మరో ఆరింద. ‘మరేమో’ అంటూ ఊరిస్తూ కథ చెప్పిన ఒక బుడత. స్టేజంతా తనదిగా చేసుకుని నర్తించిన ఒక ముగ్ధ. నాన్న, నానమ్మల కష్టంలో ఎవరి కష్టం ఎక్కువ గొప్పదోనని యోచించే ఓ బాల తాత్వికుడు. జేఎన్‌టీయూకు వసంతం మూడు వారాల ముందే వచ్చింది; రెండ్రోజుల పాటు ఆవరణంతా చిన్నారి బాలలుగా పూచింది.
సముద్ర తీరంలో ఆరూ పంతొమ్మిదికి అయిన సూర్యోదయం, జాలార్లు అప్పటికే పట్టి ఒడ్డుకు చేర్చిన వలలో ఇంకా చురుగ్గా కదులుతున్న ఈల్‌చేపలు, మడ అడవుల్లో కలియ దిరుగుతున్న పసుప్పచ్చటి ఎండ్రకాయలు, గుత్తులుగా కాసి పచ్చివాసన వేస్తున్న మామిడి చెట్లు, బ్రహ్మ సమాజ భవనం, సుబ్బయ్య భోజనం, కోటయ్య కాజా; జీవితంలో మొదటిసారి వెళ్లిన కాకినాడలో ఇంకా చూడటానికి ఎంత మిగిలిపోయిందో, ఈ పిల్లల పండుగ కూడా అంతే మిగిలిపోయింది. ఎన్నో వేదికల మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటే ఏవని ఎంపిక చేసుకోగలం; ఇది బాగుందనీ, ఇది బాలేదనీ తేల్చాల్సిన తియ్యటి నేరాన్ని ఎలా చేయగలం!
సింపుల్‌భోజనం, సింపుల్ మనుషులు, పనిలో భాగంగా హడావుడి పడటమేగానీ హడావుడి చేయడమే పనిగా పెట్టుకోని నిర్వాహకులు, మట్టితో బొమ్మలు చేసే పిల్లలకు ఎప్పటికప్పుడు తడి అవసరం పడుతుందన్న వివరంతో సహా గుర్తుంచుకుని నెమ్మదిగా వరుసల మధ్య కదిలే వలంటీర్లు; ఈ క్రియకు చాలా భవిష్యత్ ఉందన్న భరోసా ఇచ్చారు. చప్పట్ల మధ్య ఆ వేదిక ఎక్కి, ఆ వేదిక మీద బహుమతి ఇస్తున్నవారు ఎవరో తెలియకపోయినా కచ్చితంగా ఎవరో పెద్దమనిషే అయివుంటాడని నమ్మేంత వయసు చిన్నారులకు– బహుశా వాళ్లు పెద్దయ్యేదాకా ఈ జ్ఞాపకం వెంబడి ఉంటుందేమో; వాళ్లు ఆరోగ్యకరంగా పెద్దవాళ్లు కావడంలో ఒక అదృశ్య శక్తిగా కూడా పనిచేస్తుందేమో. అందుకైనా ఇలాంటి బాలోత్సవాలూ, ఇలాంటి క్రియ పండుగలూ అంతటా, ఎప్పటికీ అవసరమేమో!
ప్రత్యేకించి జానపద విభాగంలో, సీనియర్లూ జూనియర్లూ రెండు కేటగిరిల్లోనూ తెలంగాణ పాటలకు ఆంధ్రీయులు డాన్స్ చేయడం ముచ్చటేసింది. ఒకవేళ ఉంటేగింటే రాజకీయాల వల్ల ఏర్పడిన అంతరాలను పూడ్చగలిగే శక్తి బహుశా సాహిత్యానికి మాత్రమే ఉందని మరోసారి నిరూపితమైంది.
మాకు బసగా ఏర్పాటైన వందేళ్ల నాటి కాస్మొపాలిటన్ క్లబ్, వస్తూపోతుంటే కనబడిన అంతకంటే పాతదైన మెక్‌లారెన్ హైస్కూలు పట్టణంలో ఆంగ్లేయుల పాదజాడలను పట్టించాయి. పేర్లు మాత్రమే తెలిసి ముఖాలుగా తెలియనివాళ్లు కలిసి, కలిసేదాకా మనం తెలుసని మనకు తెలియనివాళ్లు తెలిసి కొత్త జీవనోత్సాహాన్ని నింపారు. మనుషులుగా దాటలేని బలహీనతలు గమనింపులోకి రావడమూ, గమనిస్తూనే అందులో భాగం కావడమూ ఇంకొక తమాషా.
మూడో రోజు తెల్లారి– ఎంగిలి విస్తరాకులు, కుల్ఫీ పుల్లలు సహా మొత్తం అద్దంలా ఊడ్చి ఇచ్చేస్తారన్న భరోసాతో దీనికి వరుసగా వేదిక అవుతున్న జేఎన్‌టీయూ ఆవరణలో ఒకచోట ఫొటోలు, సెల్ఫీలు దిగే వీలుగా ఐ లవ్ జేఎన్‌టీయూకే అని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఐ లవ్ క్రియ అని పెట్టివుంటే గనక నా ఖాతాలోనూ ఒక సెల్ఫీ పడేది.
(మార్చ్ 2020)