Monday, May 16, 2011

చలాన్ని విన్నాను!

పురుషుడి నిర్జీవమైన బతుకులో రసం నింపడానికి స్త్రీ సృష్టించబడిందంటాడు చలం.
నిర్జీవమైన సాహిత్యంలో రసం వంపడానికి చలం పుట్టాడేమో!
అలాంటి చలాన్ని చూడగలిగే తరంలో పుట్టనివాణ్ని కాబట్టి, కనీసం ఆయన గొంతు వినడం ఒక భాగ్యమే కదా! అది ఈ మధ్యే తీరింది. వాడ్రేవు వీరలక్ష్మీదేవి వల్ల. "చలం సీడీ'ని ఆమె నాకు అభిమానంగా పంపడం వల్ల.
మూడు గంటల నిడివిగల ఇందులో వరుసగా-
౧ పురూరవ గంటన్నర రేడియో నాటకం
౨ చలం గురించి విశ్వనాథ, శ్రీశ్రీ, మో, రంగనాయకమ్మలాంటివాళ్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు
౩ బాలాంత్రపు రజనీకాంతరావుకు చలం ఇచ్చిన రేడియో ఇంటర్వ్యూ
౪ చలం పాడిన పాటలు ఉన్నాయి.
చలం వీరాభిమాని గురుప్రసాద్ వీటిని సంకలించి, కొంత రికార్డింగు చేసి, "చలం ఫౌండేషన్' తరఫున రెండేళ్లక్రితం సీడీగా తెచ్చారు. ధర 100 రూపాయలు. ఫోన్: 9951033415.

చలం మాస్టర్ పీస్ పురూరవను వినడం బాగుంది. ఊర్వశిగా శారదా శ్రీనివాసన్ గొంతు ఒకలాంటి జీరతో మత్తుగా ఉంటుంది. గొప్ప వాయిస్. అయితే, పుస్తకంగా చదివినప్పుడు నాకు అజ్ఞాతంగా వినిపించిన ఊర్వశి గొంతంత గొప్పది మాత్రం కాదు. చదవడం కంటే ముందు వినివుంటే ఇలా ఉండేది కాదేమో! బహుశా, మనం ముందే ఒక ప్రమాణానికి లోబడినప్పుడు దాన్ని అంగీకరించేస్తాం. మన ఊహే మన ప్రమాణమైనప్పుడు దాన్ని అందుకోవడం ఎవరితరమూ కాదు.
ఇక, "చలం ఎంగిలిమాటలు ఎప్పుడూ వాడలే'దని ప్రశంసిస్తాడు విశ్వనాథ. వేమన, చలం ఇద్దరూ ఒకటేనని చెబుతాడు శ్రీశ్రీ. "వేమన ఇంట్యూటివ్గా చెబితే, చలం ఇంటెలెక్చు్యవల్గా చెప్పాడు'.

ఇంటర్వ్యూలోనూ, పాటల్లోనూ చలాన్ని వినగలుగుతాం. చివరిదశలో, ముద్దముద్దగా మాట వచ్చే వయసులో. అయినా అది చలం గొంతు! ఈ ప్రపంచంతో సమన్వయం చేసుకోవడానికి తనకు ఎప్పటికి కుదురుతుందోనని వాపోయే చలం, నాలోని చీకటినే కాగితం మీద పెట్టాను తప్ప, ఎవరినో, దేన్నో దండించడానికి కాదని ఒప్పుకునే చలం, సత్యం లోపల్నుంచి దొరకాలి తప్ప, బైటెక్కడో లేదనే అన్వేషి చలం, ఈ చలం అనేవాణ్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాననే ఆధ్యాత్మిక చలం, ఎందరో చలాల ఏక గొంతుకైన చలం...

పీఎస్:
ఒకప్పుడు నా ఊహలో ఉన్న ఊర్వశిని శారదా శ్రీనివాసన్ రీప్లేస్ చేశారు. "ఒరిజినల్ వాయిస్' మరిచిపోయాను. చలం గొంతు గురించి మాట్లాడాల్సిన సందర్భంలో కూడా నేను శారద గొంతు గురించి మాట్లాడుతున్నానంటే... ఖర్మ! కొన్నయినా చలం అక్షరాలేగా నాలోనూ ప్రవహిస్తోంది.