Wednesday, December 8, 2021

Collection of Autobiographical Sketches




(ఆజన్మం పుస్తకం మీద మిత్రుడు శిరీష్ ఆదిత్య జూన్ 2021లో రాసిన అభిప్రాయం.)

Poodoori Rajireddy’s Aajanmam is a collection of short autobiographical sketches written over a period of a decade or so. The write-ups include philosophical ramblings, observations of physical surroundings, questions and notes to self, memoir among other things. Across the pieces, the reader gets to travel, in a sense, alongside the writer and to listen to his thoughts and musings. While that might get monotonous after a while despite the broad range of topics, what keeps the reader hooked is Rajireddy’s incredible ability to translate into words feelings we are aware of in the deepest recesses of our hearts but never were able to pinpoint and communicate them precisely. 

The other thing that Rajireddy achieves in this collection, and in his other writing as well, is to give us a sense of what it feels like to go through life on an everyday basis. The fact that most of our lives happen inside our heads is easy to see but hard to write about without turning either boring or self-obsessed. And I have not read many writers, Geoff Dyer being another exception, who have been able to do that in such an interesting and insightful method; On what happens in our lives during minutes and hours when nothing much is happening. 

In the preface of his book 'Chintakindi Mallayya Muchchata', Rajireddy states, "I cannot write anything that is not me". But who is this me exactly? It is a question he repeatedly asks and attempts in myriad ways to answer in Aajanmam. And in that exploration, he inspires the reader to undertake a similar journey. Aajanmam is like an impressionistic painting with innumerable short, casual strokes giving us a truer picture than a more traditionally autobiographical transcription of reality might have.

- Sirish Aditya

Monday, November 29, 2021

కళ - మనిషి

ఆజన్మం పుస్తకం వచ్చిన తర్వాత రాసింది. ప్రచురణ: ఈమాట

కళ - మనిషి

ఉండాల్సిన మనిషి



(సాకం నాగరాజ గారికి డెబ్బై యేళ్లు వచ్చిన సందర్భంగా చిన్న అభినందన సంచిక వేస్తున్నామనీ, మీరు ఏదైనా రాయాలనీ నామిని ఫోన్ చేశారు. చిన్న పీస్ రాసి పంపాను. దేనికైనా ఒక హెడ్డింగ్ పెడతాం కదా, అలా ఒకటి పెట్టాను. అయితే, ఈ సంకలనం మొత్తానికి తాను ఒక పేరు ఎలాంటిది పెట్టాలని ఆలోచిస్తున్నాడో సరిగ్గా నేను అలాంటిదే పెట్టానని సంతోషపడ్డారు నామిని. అలా నా శీర్షికతోనే పుస్తకం వచ్చింది.)


ఉండాల్సిన మనిషి


సాకం నాగరాజ గారితో నాకు పరిచయం ఉందని చెప్పలేను. అసలు అలాంటివారితో ఎవరికైనా పరిచయం ఉంటుందా! అలాగని ఉండకుండానూ ఉంటుందా? వాళ్లు ఒక ప్రవాహంలా కదిలిపోతుంటారు. నామిని చెప్తూవుంటాడు: ఆయన మా ఇంటికొస్తాడా, నాతో ఒక్క మాటా మాట్లాడడు సా; ఇక్కడినుంచి కోట పురుషోత్తంకు ఫోన్‌ చేస్తాడు. మళ్లీ కోట పురుషోత్తం ఇంటికి వెళ్తాడా; అక్కడినుంచి మా ఇంటికి ఫోన్‌ చేస్తాడు. ఇదీ సాకం. ఆయన అంతటా ఉంటాడు; ఎక్కడా ఉండడు. బహుశా ఈ హైరానా ఆయన జీవలక్షణం కావొచ్చు. ఎప్పుడూ ఏదో పనిలో మునిగి ఉండేవాళ్లకు మాత్రమే ఉండే హడావుడి.


నెత్తిన గంప ఉన్నవాడు వడివడిగా నడుస్తాడు. అయితే ఆ బరువు ఆయన స్వచ్ఛందంగా మోపుకున్నదే. అందువల్లే ఆయన చాలా పుస్తకాలు వేయగలిగాడు. వాటిని కొరియర్‌ డబ్బులు ఖర్చుపెట్టుకుని మరీ పంపుతాడు. తెలుగు కథకు జేజే, రైతు కథలు, విరామం, డిగ్రీ విద్యార్థులకు ప్రపంచ కథలతో మొదలుకొని నిన్నా మొన్నా సింగమనేని నారాయణ నివాళి పొత్తం దాకా. వీటి సంకలనం వెనుక నామిని ఉన్నాడేమో అని నా అనుమానం. కానీ ఎవరు వెనకున్నా, పుస్తకం చిన్నదైనా, పెద్దదైనా ఎవరో ఒకరు ముందుండి చేయగలిగితేనే జరిగే పనులు ఇవన్నీ. అట్లాంటి గట్టి సంకల్పం సాకం.


ఆయన్ని మొదటిసారి తిరుపతిలో జరిగిన వర్తమాన కథ–2009 ఆవిష్కరణ సభలో చూశాను.  నేను అదే మొదటిసారి తిరుపతి వెళ్లడం. నా చింతకింది మల్లయ్య ముచ్చట కథ అందులో వేశారు. అప్పటినుంచీ మనం ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే మన సాకం ఉన్నాడులే అనే భరోసా కలిగింది. ఆ ఆవిష్కరణ వల్లే నామిని, కోట, ఆర్‌ఎం(ఉమామహేశ్వరరావు) పరిచయం కలిగింది. చిత్రంగా ఈ పదేళ్లలో సాకం కంటే వీళ్లందరితోనే నేను మాట్లాడింది ఎక్కువ. అందుకే అన్నాను, ఆయనతో ఎవరికీ పరిచయం ఉండే అవకాశం లేదని. పోతూ ఉండటమే ఆయన స్వభావం. పూర్తిగా పాతకాలం మనిషి. కానీ ఈ భూమ్మీద ఉండాల్సిన మనిషి.


– పూడూరి రాజిరెడ్డి

మార్చ్‌ 2021

 

Sunday, November 28, 2021

వారిదైన వ్యక్తీకరణ


 

వారిదైన వ్యక్తీకరణ


‘బ్రదర్స్‌ కరమజవ్‌’లో ఇవాన, అల్యోషా ఇద్దరూ ఒక హోటల్లో మాట్లాడుకుంటున్నప్పుడు– గ్లాసు తీసిన తర్వాత టేబుల్‌ క్లాత్‌ మీద గ్లాసు అచ్చును గమనిస్తాడు ఇవాన్‌. అంత సున్నితమైన గమనింపును పాఠకుల దృష్టికి తెచ్చిన దాస్తోయెవస్కీ ముద్ర అది. నోటి దుర్వాసనను చెక్‌ చేసుకోవడానికి ‘ద క్యాచర్‌ ఇన్‌ ద రై’లోని హోల్డెన్‌ కింది పెదవిని పైకి వంచి ముక్కుకు తగిలేలా గాలి వదులుతాడు. అసలైన సాహిత్య పరిమళాన్ని ఆనందించడానికి శాలింజర్‌ ఇచ్చిన వివరం అది. ‘ది  ఓల్డ్‌మాన్‌ అండ్‌ ద సీ’లో సముద్రంలో చేపల వేటకెళ్లి వచ్చాక, సామగ్రిని అక్కడే వదిలేద్దామనుకుంటాడు వృద్ధుడు. అక్కడ వదిలేయడం ద్వారా ఎవరికైనా దొంగతనం చేయాలన్న టెంప్టేషన్‌ ఎందుకు పుట్టించాలని తన నిర్ణయం మార్చుకుంటాడు. ఈ వాక్యాన్ని రాసిన దొర హెమింగ్వే. ఆ రచయిత మాత్రమే రాయగలిగే వాక్యం ఆ రచయితని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

ఆ పసి రాకుమారుడు కాంతిగల వీపు కానవచ్చేటట్లుగా బోరగిలపడటం– నున్నని వీపుగల కూర్మావతారంగా కనబడుతున్నదట. ఈ చిత్రిక ‘కవికర్ణ రసాయనము’ లోనిది. అదే పద్యంలో ఇంకా వివిధ భంగిమల్లో దశావతారాలను కళ్లకు కడతాడు సంకుపాల నృసింహకవి. అసలే సూర్యుడు ఒక అగ్నిగుండం. దానికితోడు సాయంకాలం కమలినీ విరహంలో ఉన్నాడు. ఇంక ఆ వేడికి తట్టుకోలేక సముద్రంలో మునిగాడని సూర్యాస్తమయాన్ని దృశ్యమానం చేస్తుంది భాస్కర రామాయణం. సూర్యుడి వాడిౖయెన కిరణాల తాకిడికి వేగిపోయిన జగత్తు మీద వీచడం కోసం గుండ్రని విసనకర్రగా వికాసం పొందాడని చంద్రోదయాన్ని వర్ణిస్తాడు విష్ణుమాయా విలాసములో రోసనూరి వేంకటపతి. ఇక గయోపాఖ్యానములో రామనామాత్యుడు– ఆమె సౌందర్యాన్ని చూపడానికి తాను కూడా తగనని అద్దం గుర్తించి, ముఖం చాటేసిందంటాడు. తెలుగు పద్యసాహిత్యం నిండా ఎన్నో గొప్ప వ్యక్తీకరణలు.

చలికాలంలో రైల్వే స్టేషన్‌లో అంచులు పగిలిన కప్పుల్లో టీ తాగుతున్న శాలువా ముసుగులో ఉన్న కూలీలను చిత్రించిన త్రిపుర నుంచి, చెరువులో బెకబెకమంటున్న కప్పలు చీకట్లో మనిషి ఒంటేలు శబ్దానికి ఒక క్షణం నిలిచి, మళ్లీ అరవడం మొదలుపెట్టాయని రాసిన అజయ్‌ప్రసాద్‌ దాకా ఆధునిక తెలుగు సాహిత్యంలోనూ కాలాన్ని నిలిపి చూపే ఎన్నో విలువైన క్షణాలు! తల్లి కాళ్లకు వంగి దండం పెట్టే కొడుక్కు తల్లి పాదాల పసుపు వాసన తగలడం; ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే ఉద్యోగిణి చీర కుచ్చిళ్లలో చిన్నారి కొడుకు తలదాచుకోవడం, మౌన రుషిని తలపించే కప్ప కూర్చున్న భంగిమ; ఇలాంటి వ్యక్తీకరణలు సాహిత్యానికి ప్రాణం. సూక్ష్మంలో మోక్షం చూపే వాక్యాలివి. ఒక దగ్గర కనబడిన వాక్యం ఇంకో దగ్గర ఉండదు. అది అక్కడికి సర్వ స్వతంత్రమైనది. ఆ కవిదో, ఆ రచయితదో ఇక వారిదే. అలాంటిది ఇంకొకరు ముట్టుకోరు. ఎంగిలి వాక్యాలు రాయలేదని చలాన్ని విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించింది అలాంటి ఎంగిలి వాక్యాలు రాయని ఏ రచయితకైనా వర్తిస్తుంది.

సాహిత్యానికి మరో వైపు కూడా ఉంది. పునరుక్తి దీని ప్రధాన లక్షణం. లేత భానుడి కిరణాలు భూమిని తాకుతున్నాయి అనే వాక్యాన్ని కథల్లో ఎన్నిసార్లు చదివుంటారు? పడక్కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని పత్రిక చదివే పరంధామయ్య ఆదివారపు అనుబంధాల్లో ఎన్నిసార్లు పరామర్శించి ఉంటాడు? పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా బాల్యంలోనే ప్రతిభను చాటే నాయకులు ఎందరు తగిలారు? చిట్టచివరన, అస్తమిస్తున్న సూర్యుడి వైపు ఎందరు కథానాయికలు పయనించివుంటారు? ఇలాంటి వ్యక్తీకరణలు ముందుగా ఎప్పుడు, ఎలా వచ్చాయో చెప్పగలిగే సాహిత్య చరిత్రలు మనకు లేవు. అవి వచ్చినప్పుడు తాజావే కావొచ్చు. వాటికవే విలువైనవే కావొచ్చు. కానీ వాడీ వాడీ అరగదీయడం వల్ల పాతకంపు కొడతాయి.

ఈ జాడ్యం తెలుగుకే పరిమితమైనది అనుకోవాల్సిన పనిలేదు. ‘ఇట్‌ వాజ్‌ ఎ డార్క్‌ అండ్‌ స్టార్మీ నైట్‌’(అదొక చీకటి తుఫాను రాత్రి) అనే వాక్యం ఎక్కడినుంచి ఊడిపడిందనే చర్చ ఆంగ్ల సాహిత్యంలో ఈమధ్య బాగా జరిగింది. అదొక చీకటి తుఫాను రాత్రి... అని గంభీరంగా ఎత్తుకోగానే తర్వాత ఏమయివుంటుందన్న కుతూహలం సహజంగానే పుడుతుంది. కానీ ఎన్నిసార్లు ఆ కుతూహలం నిలుస్తుంది? కథల్లో మహాచెడ్డ ప్రారంభాలకు పెట్టింది పేరుగా ఈ వాక్యాన్ని అభివర్ణించింది ‘రైటర్స్‌ డైజెస్ట్‌’ పత్రిక. క్లీషేకూ, మెలోడ్రామాకూ, అతిగా రాయబడిన వచనానికీ ఉదాహరణగా నిలిచిన ఈ వాక్యంతో ఎన్నో కథలు మొదలయ్యాయి. బ్రిటన్‌ రచయిత ఎడ్వర్డ్‌ బుల్వర్‌ లిట్టన్‌ 1830లో రాసిన ‘పాల్‌ క్లిఫ్పోర్డ్‌’ అనే నవల ప్రారంభంతో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని కొందరి వాదన. ఆయన ఎంతో సాహిత్యం సృజించినప్పటికీ, ఈ ‘అపకీర్తి’ వాక్యంతో ఆయన కీర్తి నిలిచిపోయిందని సరదాగా వ్యాఖ్యానించారు విమర్శకులు. కానీ తమాషా ఏమిటంటే, 1809లో ‘ఎ హిస్టరీ ఆఫ్‌ న్యూయార్క్‌’ పుస్తకం రాస్తూ వాషింగ్టన్‌ ఇర్వింగ్‌ ఇదే వాక్యాన్ని వ్యంగ్యంగా ఉదాహరిస్తాడు. అంటే, అంతకు ఎంతోముందే ఈ వాక్యం సాహిత్యంలోకి చొరబడి పాఠకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిందన్నమాట! చిన్న కథల పితామహుడు అని చెప్పే ఎడ్డార్‌ అలెన్‌ పో కూడా దీన్ని వాడకుండా తమాయించుకోలేకపోయాడు.

‘మాస్టర్లు’ పునరుక్తులు వాడినా వారి ఇతరత్రా విస్తారమైన ప్రతిభలో అవి చెల్లిపోతాయి. కానీ సాహిత్య ‘విద్యార్థులు’ వాటికి దూరంగా ఉండటమే వారిని స్వతంత్రంగా నిలబెడుతుంది. జీవితపు అనుభవం లేకపోవడం, జీవితానికి చేరువగా వెళ్లి వాక్యాలను పిండుకోవడం తెలియనివారు మాత్రమే స్టాక్, ప్లాస్టిక్‌ వ్యక్తీకరణలను ఏ ప్రయత్న బరువూ లేకుండా తమ రాతల్లోకి తెచ్చేసుకుంటారు. ఎవరిని చదివినా ఒకేలా అనిపించడానికి ఇదే కారణం.

(ప్రచురణ: 22 నవంబర్ 2021)



Saturday, November 27, 2021

ఎల్లలు దాటించే కళ




ఎల్లలు దాటించే కళ



నిత్యం మధుర ఫలాలు తినేవాడికి పులుపు మీద మనసు పుడుతుందట. మనిషి స్వభావాన్ని అత్యంత సన్నిహితంగా చూసినవాడు మాత్రమే చెప్పగలిగే ఈ వాక్యాన్ని కవులకే కవి అయిన కాళిదాసు పదిహేను వందల సంవత్సరాల క్రితం అన్నాడట. ఈ అట ఎందుకంటే, సంస్కృతంలో దీన్ని చదివినవాళ్లు ఎంతమందో మనకు తెలియదు. తక్కువ మంది అని మాత్రమే నిశ్చయంగా చెప్పగలం. ఆ కాళిదాసుకు వెయ్యి సంవత్సరాల ముందు, మనిషికి శాంతిలోని సౌఖ్యాన్ని తెలియజేయడానికి బుద్ధ భగవానుడు చెప్పాడని చెప్పేదంతా పాలీ భాషలో ఉంది. అయినా అదంతా మనకు చేరింది. బైబిల్, ఖురాన్‌ తమ మూలభాషలైన హీబ్రూ, అరబిక్‌లను దాటుకొని ప్రపంచ మూలమూలలకూ వ్యాపించాయి. ఒక్కమాటలో దీనంతటికీ కారణం: అనువాదం.

గ్రీకు సోక్రటీసు మనకు సన్నిహితుడే. పారశీక రూమీ మనకు కావాల్సినవాడే. గోర్కీ ఎక్కడో రష్యాలో రాస్తే ఇక్కడి పల్లెటూళ్లలో కూడా సమోవార్ల వెచ్చదనం అనుభవించాం. మావో ఎక్కడో చైనాలో ఏదో చెబితే మన పక్కనే ఉండి మనకు చెప్పాడనుకుని కార్యరంగంలోకి దూకాం. మపాసా ఎక్కడో ఫ్రాన్సులో చెప్పినదానికి మన చలం చెప్పేవాటితో పోలికలు వెతికాం. పక్కనే కన్నడ దేశంలో ఉన్న భైరప్ప ఏం రాశాడో; పొరుగున మరాఠా ప్రాంతంలో ఉన్న శరణ్‌ కుమార్‌ లింబాలే ఏం చేశాడో అనాయాసంగా తెలుసుకోగలం.

బహుశా ప్రపంచంలోని సారస్వతం అంతా తన అనువాద రూపంలోనే బతికి ఉంది. ఈ ప్రపంచం నిలిచింది, వివేకవంతమైంది అనువాదంతోనే. ఒక భాషలోని రచనను ఇంకో భాషవాళ్లకు తెలియజేయాలని ఒక అనువాదకుడు ఎందుకు ఉవ్విళ్లూరుతాడో, ఎందుకు తపిస్తాడో దానికి తనవైన కారణాలు ఉండొచ్చు. భావజాల వ్యాప్తి మొదలు తాను అనుభవించిన సంతోషాన్ని ఇంకొకరికి పంచడం దానికి ప్రేరేపకాలు కావొచ్చు. మూల భాషలోంచి లక్ష్య భాషలోకి దాన్ని ఎలా తేవాలో చెప్పడానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ తెచ్చిన దాని పట్ల అన్నే నిరసనలూ ఉన్నాయి. పోయే గింజంతా పోగా మిగిలిన పొల్లు మాత్రమే అనువాదం అని చెప్పేంతగా. పూలనే కాదు, ఆ రాళ్లను ముఖాన కొట్టించుకోవడానికి కూడా అనువాదకుడు సిద్ధపడతాడు. పుష్కిన్‌ కవిత్వాన్ని ఇంకో భాషలోకి అనువదించలేమంటారు. అది నిజమే కావొచ్చు. ఆ కారణంగా ఎవరూ అనువాదానికే పూనుకోకపోతే, ఆ అమృతం తాగలేకపోయిన ఇతర భాషీయులకు కనీసం సువాసన అయినా పీల్చే అవకాశం లేకుండాపోతుంది కదా. దీనికి భిన్నంగా, అనువాదకుల వల్ల కూడా ఆ లక్ష్యభాషలు అభివృద్ధి చెందాయి. కొత్త పదాలు పుట్టాయి. కొత్త వ్యక్తీకరణలు పరిచయం అయ్యాయి. ఒక్క మాటలో రచన అనేది ఒక కళ అయితే, అనువాదం కూడా దాదాపుగా అంతకు తగ్గని కళ.

బహుశా ఆ స్వీయాభిమానంతోనే కాబోలు, ఈ మధ్య కొందరు అనువాదకులు ‘ట్రాన్స్‌లేటర్స్‌ ఆన్‌ ద కవర్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక చిరు ఉద్యమం చేపట్టారు. ప్రచురణ సంస్థలు రచయితల పేర్లను మాత్రమే కవర్‌ పేజీ మీద వేస్తున్నాయనీ, తమ పేర్లను కూడా గౌరవంగా ముఖపత్రం మీద ముద్రించాలనీ లండన్‌లోని ‘ద సొసైటీ ఆఫ్‌ ఆథర్స్‌’ ప్రచారం ప్రారంభించారు. సెప్టెంబర్‌ 30 నాటి అంతర్జాతీయ అనువాద దినోత్సవం దీనికి ఒక ట్రిగ్గర్‌గా పనికొచ్చింది. దానికి కొనసాగింపుగా ప్రసార మాధ్యమాల్లో చర్చలు జరుగుతున్నాయి. రచయితల సమూహం ప్రచురణకర్తలకు బహిరంగ లేఖ రాశారు. దానికి బలం పెరిగేలా సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఎందరో ప్రసిద్ధ అనువాదకులు దీనికి సమ్మతి తెలిపారు. పదకొండు వేల మంది సభ్యులున్న అమెరికాకు చెందిన ‘ఆథర్స్‌ గిల్డ్‌’ కూడా వీరికి మద్దతుగా నిలిచింది.

ఇక్కడొక సంగతి ప్రస్తావించాలి. సుమారు యాభై లక్షల రూపాయల నగదు కలిగిన ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజు సొమ్మును రచయితతోపాటు అనువాదకులకూ 2016 నుంచి సమంగా పంచుతున్నారు. ఇది అనువాద ప్రతిభను గొప్పగా గౌరవించడమే. అయితే, 2018లో ‘ఫ్లైట్స్‌’ పుస్తకానికిగానూ ఈ పురస్కారం గెలుచుకున్న పోలండ్‌ రచయిత్రి ఓల్గా తొకార్చుక్‌ పేరును కవర్‌ మీద వేశారు గానీ, దాన్ని ఆంగ్లంలోకి అనువదించిన జెన్నిఫర్‌ క్రాఫ్ట్‌ పేరును వేయలేదు. పుస్తకం లోపల వేస్తారు; కానీ చూడగానే ఇది అనువాదం అని తెలియకుండా ఉండేందుకు అదో చిన్న యుక్తి అనేది కొంతమంది ప్రచురణకర్తల వాదన. అదే సంవత్సరం సాహిత్యంలో అత్యున్నత గౌరవమైన నోబెల్‌ పురస్కారం కూడా పొందిన తొకార్చుక్‌ కూడా ముఖపత్రం మీద అనువాదకుల పేరు వేయాలన్న వాదనకు మద్దతునివ్వడం గమనార్హం.

భిన్న అనువాదాల్లో వెలువడే అదృష్టం ఉన్న రచయితలు కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు అడిగినా అనువాదకుడి పేరు కవర్‌ మీద వేయడం జరగకపోవచ్చు. కానీ వారి ప్రతిభతో నిమిత్తం లేకపోయినా అనువాదం కావడమే గొప్ప అదృష్టం అయ్యే రచయితలు మరికొందరు ఉంటారు. అలాంటప్పుడు ఆ డిమాండ్‌ సులువుగానే అంగీకారం పొందుతుంది. అయితే రచయిత, అనువాదకుడు సమానం అవుతారా? కచ్చితంగా కాదని ఆ సంతకాలు పెడుతున్న అనువాదకులు కూడా ఒప్పుకుంటారు. రచయితకూ అనువాదకుడికీ మధ్య ఒక గౌరవప్రదమైన దూరం ఉండాలి. బహుశా కవర్‌ పేజీ మీద పేరు వేయడం అనేది మరింతమందిని అనువాదంలోకి దిగేలా పురిగొల్పడానికీ, ఏదో భాషలో చీకట్లో ఉండిపోయిన అద్భుతమైన రచనను ప్రపంచానికి తెలియజెప్పడానికి కావాల్సిన డ్రైవ్‌ ఇవ్వడానికీ కారణం కాగలదేమో.

‘అనువాదం గనక లేకపోతే, నేను నా దేశ సరిహద్దులకే పరిమితమయ్యేవాణ్ని’ అన్నాడు స్పానిష్‌ రచయిత సెర్వాంటెజ్‌. కదా! అందువల్లే ఆయన ‘డాన్‌ కిహోటీ’ మనదాకా వచ్చాడు. ప్రపంచ ఎల్లలను చెరపడంలో రచయితల కన్నా అనువాదకుల పాత్రే ఎక్కువనే విషయంలో మాత్రం ఎవరికీ సందేహం లేదు.

(ప్రచురణ: అక్టోబర్ 25, 2021)


 

Friday, November 26, 2021

‘శ్రవణ’ మేఘాలు

 



‘శ్రవణ’ మేఘాలు


చదవడం ఏకాంత అనుభవం. వినడం సామూహిక అనుభవం.


పాతకాలంలో ఏ గ్రామపెద్దో మర్రిచెట్టు నీడన ప్రపంచ ధోరణిని వైనవైనాలుగా వివరించేవాడు. ఏ పెద్దతాతో చలిమంట కాచుకుంటూ తన జీవిత అనుభవసారాన్ని పంచేవాడు. ఆరుబయట వెన్నెల వాకిళ్లలో నులకమంచాల మీద మేను వాల్చిన నాన్నమ్మలు పిల్లల గుంపును పోగేసుకుని కథల మీద కథలు చెప్పేవారు. పురాతన మానవులు తాము వేటాడి తెచ్చిన జంతువును విందుకు సిద్ధం చేస్తూ, తమ ప్రాచీనుల వీరోచిత గాథలను ఆ మాంసంతో పాటు నంజుకునేవారు. బహుశా మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యానికి ఈ వినడం అనే సంబం«ధం ఒక కందెనగా పనికొచ్చేది. ఇవే కథలు, గాథలు రకరకాల కళారూపాలుగా మారి, వాటిని ప్రత్యేకించి చక్కటి గొంతుతో, అంతకంటే ఆకట్టుకునే హావభావాలతో ప్రదర్శించే కళాకారులు వచ్చారు. దాంతో వినడం ఒక పరిమిత సమూహ అనుభవ పరిధిని దాటింది. వాడకట్టు అనుభవంగానో, యావత్‌ గ్రామ అనుభవంగానో విస్తరించింది.


కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. అక్షరం అనేది పుస్తకాల దొంతరలుగా ఆకాశం ఎత్తు పెరిగింది. ఒక మనిషి గొంతును సజీవంగా ఒక యంత్రంలో బంధించడాన్ని లోకం చెవులొగ్గి విన్నది. పదిహేనో శతాబ్దంలో జర్మనీకి చెందిన జాన్‌ గూటెన్‌బెర్గ్‌ అచ్చుయంత్రాన్ని రూపొందించాడు. పంతొమ్మిదో శతాబ్దపు చిట్టచివరలో ఇటలీకి చెందిన మార్కోనీ రేడియోకు తుదిరూపమిచ్చాడు. రెండూ విడి విడి అంశాలే అయినా, రెండింటి సామ్యం మనిషి మనో ప్రపంచ విస్తరణకు తోడ్పడటం! అయినా మనిషి అంతటితో ఆగలేదు. వినడం పోయింది. చూడటం వచ్చింది. అమెరికాలో టీవీ వచ్చిన కొత్తలో ఈ సుఖకరంగా వినే అవకాశమున్న రేడియోను కాదని, దానికే ముఖం అప్పగించాల్సిన టీవీని ఎవరు చూస్తారని విసుక్కున్నారట అప్పటి పెద్దవాళ్లు. అయినా అది రావడమే కాదు, ప్రపంచమంతటా అలవాటైపోయింది. అక్షరాన్ని, వినడాన్ని అమాంతం మింగేసింది.


మరి పెరిగిన సాంకేతిక జ్ఞానం ఒక్కోసారి ముందుకు వెళ్లడం కోసం, వెనక్కి కూడా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో దృశ్యం పనికి రాదు. వంట చేస్తూ గరిట తిప్పుతున్నప్పుడు చూపు ఒక్కచోటే నిలపమంటే కుదరదు. ఒంటరిగా నడుస్తున్నప్పుడు తోడు కాగలిగేది ఒక అజ్ఞాత గొంతుకే. కళ్లు మూసుకుని, కుర్చీలో తలవాల్చి, మగతగా ఒక అనుభవంలోకి, ఒక అనుభూతిలోకి మేలుకోవాలంటే దృశ్యం పనికిరాదు; శ్రవణమే కావాలి.


అంధులకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేందుకుగానూ వాళ్లకోసం మాట్లాడే పుస్తకాలను(ఫోనోగ్రాఫిక్‌ బుక్స్‌) సంకల్పించాడు థామస్‌ ఆల్వా ఎడిసన్‌ 1877లో. కానీ 1952లో న్యూయార్క్‌ కేంద్రంగా గల క్యాడ్‌మాన్‌ రికార్డ్స్‌ వాళ్లు కవి డైలాన్‌ థామస్‌ కవితలను ఆయన గొంతులోనే చదివించి అమ్మకాలను చేపట్టడంతో ‘ఆడియో బుక్స్‌’ అనే భావనకు బీజం పడింది. దీంతో చదవడం అనే ప్రక్రియ, వినడం అనే కొత్త రూపంలో జరగడం ప్రారంభమైంది. చెట్టుమీది కాయను, సముద్రంలోని ఉప్పును ఎట్లా కలిపింది సృష్టి! అక్షరాన్నీ, శ్రవణాన్నీ ఎలా ముడివేసింది సాంకేతిక పరిజ్ఞానం! మరి ఆ మేఘాలు అంతటికీ వ్యాపించకుండా ఉంటాయా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆడియో బుక్‌ మార్కెట్‌ పరిధిని 2019లో 2.67 బిలియన్‌ డాలర్లుగా అంచనావేశారు. ఇది ప్రతి సంవత్సరం రెండంకెల వృద్ధిని సాధిస్తోందని తేల్చారు.


మన తెలుగు వరకే తీసుకుంటే– శ్రీశ్రీ గొంతులోనే తన కవితలను చదివించిన గూటాల కృష్ణమూర్తి ప్రయత్నం; తన కథలను నేరుగా ఆడియో రూపంలోనే విడుదల చేసిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఉత్సాహం; తమ రచనలను యూట్యూబ్‌లో వినిపిస్తున్న కొందరి ఆరాటం లాంటివి విడివిడి సంఘటనలు. కానీ ఐదేళ్ల క్రితం విశ్రాంత ప్రభుత్వోద్యోగి కొండూరు తులసీదాస్‌ సరదాగా చదువుతూ రికార్డు చేస్తూ పోయిన ‘దాసుభాషితం’ ఇప్పుడు వందలాది టైటిళ్లు, వెయ్యికి పైగా గంటల నిడివి కలిగివుంది. పుస్తకాన్ని చదవమని చేతికిస్తే– చదివే తీరిక లేని కొడుకు తనకోసం చదివి వినిపించమన్నందుకు మొదలైన ఈ తండ్రి ప్రయత్నం ‘తెలుగు సంగీత, సాహిత్య, కళల శ్రవణ భాండాగారం’గా రూపుదిద్దుకుంది. అయితే స్వీడన్‌కు చెందిన ఆడియో స్ట్రీమింగ్‌ కంపెనీ ‘స్టోరీటెల్‌’ నాలుగేళ్లుగా భారతదేశంలో మౌఖిక సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లీషు, మరాఠీ, హిందీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, గుజరాతీ, తమిళం, మలయాళంతో పాటు ఇప్పుడు తెలుగు పుస్తకాలు కూడా ఇందులో ఆడియోలుగా రికార్డు అవుతున్నాయి. పాపులర్‌ సాహిత్యం నుంచి ప్రజా సాహిత్యం దాకా; ఏనుగుల వీరాస్వామయ్య నుంచి ఏకాంత ద్వీపంగా బతికే రచయిత దాకా; స్వయంగా రాసేవారి గొంతుల్లోనూ, గొంతే పెట్టుబడిగా కలిగిన కళాకారుల ద్వారానూ రికార్డ్‌ అవుతున్నాయి. కనీసం ఐదు లక్షల టైటిల్స్‌ ఇందులో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా ‘ఆడిబుల్‌’ పేరుతో ఈ ఆడియో బుక్స్‌ రంగంలోకి వచ్చినా ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీకే పరిమితమైంది.


చదవలేకపోవడం ఒక సమస్య అయితే, రకరకాల కారణాల వల్ల చదవడం అనే ప్రక్రియ మీద ఆసక్తి కోల్పోవడం ఇంకో సమస్య. ఈ రెండు కోవల మనుషులకూ ఈ కొత్త విప్లవం గొప్ప తోడు. చదవడంలో ఉత్సాహం పోతే గనక వినడం ద్వారా దాన్ని తిరిగి ఉత్సవం చేసుకోవచ్చు. అన్ని లైట్లూ ఆపేసుకుని, ఆ గొంతును అనుసరించడంలో ఏర్పడే దృశ్యాలను ఆ చీకట్లో సృజించుకోవడం ఒక పద్ధతి; ఇంటిల్లిపాదీ దగ్గరగా కూర్చుని వింటూ, ఒకే అనుభూతి మిగిలినవాళ్ల ముఖాల్లో ఎలా ప్రతిఫలిస్తున్నదో చూస్తూ ఆనందించడం రెండో పద్ధతి. అటు ఏకాంత అనుభవంగానూ, ఇటు సమూహ అనుభవంగానూ ఆనందించగల అవకాశం మనకు ఇప్పుడు ఉన్నది.


(ప్రచురణ: సెప్టెంబర్ 27, 2021)

Thursday, November 25, 2021

యుద్ధము–అశాంతి

సాక్షి సోమవారం ఎడిటోరియల్ కోసం రాజకీయాలకు ఆవల కొత్తగా కళ, సాహిత్యం, సంస్కృతి అంశాల పరిధిలో ఏదైనా రాయాలని నిర్ణయమయ్యాక, నా వాటాగా నెలకొకటి రాయాల్సి వస్తోంది. అందులో భాగంగా రాసిన మొదటి ఎడిట్ ఇది. ప్రచురణ: ఆగస్టు 30, 2021





యుద్ధము–అశాంతి


ప్రపంచం తన గురించి తాను రాసుకోగలిగితే గనక, అది టాల్‌స్టాయ్‌లాగా రాస్తుంది, అంటాడు ఐజాక్‌ బేబెల్‌. అదే ప్రపంచం తన గురించి ఒకే ఒక్క నవల రాసుకుంటే గనక, అది కచ్చితంగా ‘వార్‌ అండ్‌ పీస్‌’ అవుతుంది. పన్నెండు వందల పేజీలు, ఐదు వందలకు పైగా పాత్రలు, ఇందులో కనీసం 160 మంది చరిత్రలో వాస్తవమైన మనుషులు, ప్రతి పాత్రకూ తనదైన వ్యక్తిత్వం, ఆహార్యం, దృక్కోణం లాంటి భయపెట్టే వివరాలకు తోడు, తన కాలానికి అర్ధ శతాబ్దం వెనక్కి వెళ్లి టాల్‌స్టాయ్‌ ఈ మహానవలను రాశాడు. ఇది రెండు రకాల ఫీట్‌. ఇన్ని పాత్రలను సమన్వయం చేసుకోవడంతో పాటు వాటన్నింటినీ గతంలో భాగం చేయడం! పైగా ఈ బృహత్‌ నవలను టాల్‌స్టాయ్‌ తొమ్మిది సార్లు తిరగరాశాడంటారు. ఆ అన్నిసార్లూ కూడా టాల్‌స్టాయ్‌ చేతిరాతను అర్థం చేసుకుంటూ ఆయన భార్య సోఫియా దాన్ని ఫెయిర్‌ చేసింది. అలా ఈ మహా నిర్మాణానికి ఆమె కూడా రాళ్లెత్తిన కూలీ.


తొలుత టాల్‌స్టాయ్‌ దీనికి పెట్టిన పేరు: 1805. జారిస్టు రష్యాను నెపోలియన్‌ నేతృత్వంలోని ఫ్రాన్స్‌ ఆక్రమించిన 1805–1812 నాటి కాలాన్ని చిత్రించిన ఈ నవల తొలిభాగం 1863లో ప్రచురితమైంది. చరిత్ర పుస్తకాలు, తత్వశాస్త్ర పాఠాలు, డాక్యుమెంట్లు, ఇంటర్వ్యూలు అన్నింటినీ శోధించి, క్రిమియన్‌ యుద్ధంలో సైనికుడిగా తన అనుభవాలను జోడించి, చరిత్రనూ కల్పననూ కలగలుపుతూ, తన యౌవనశక్తిని అంతా రంగరించి టాల్‌స్టాయ్‌ సృజించిన ఈ నవల వంద కెమెరాలు మోహరించినట్టుగా యుద్ధ బీభత్సాన్ని ప్రతి కోణం నుంచి చూపుతుంది. వేలాది మంది చచ్చిపోతారు, మాస్కో తగలబడుతుంది, జనాలు బళ్లు కట్టుకుని దొరికిన సామాన్లు వేసుకుని ఊళ్లు వదిలి వెళ్లిపోతారు, ఇవ్వాళ్టి యుద్ధంలో గెలిచిన సైనికుడు రేపు ఓడిపోతాడు. గుడారాల్లో కాగితం మీద గీసుకునే గీతలు, కార్యక్షేత్రంలో పూర్తి భిన్న తలరాతను రాస్తాయి.

జీవితానికో అర్థవంతమైన లక్ష్యం ఏర్పరుచుకోవడానికి విఫలయత్నాలు చేసే పియరీ(పీటర్‌), రష్యన్‌ విలాస సమాజం పట్ల విసిగిపోయిన ఆంద్రేయ్‌(ఆండ్రూ), చురుకైన బాలిక నుంచి పొందికైన ప్రౌఢగా పరిణామం చెందే నటాషా ప్రధాన పాత్రలుగా, బెష్కోవులు, బోల్‌కోన్‌స్కీలు, రోస్టోవ్‌లు, కారగైన్లు, డ్రౌబెట్‌స్కాయ్‌లు అనే ఐదు కులీన కుటుంబాల మధ్య గల సంబంధాల భూమికగా రాసిన ఈ నవలలో టాల్‌స్టాయ్‌– ఆర్టిస్టు, సైకాలజిస్టు, తాత్వికుడు, చరిత్రకారుడిగా భిన్న పాత్రలు పోషిస్తాడు. పూర్తి నవలా లక్షణాలు లేవని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ– యుద్ధ సన్నివేశాలను మాంటేజ్‌ షాట్స్‌లా చూపడం, ప్రతి సన్నివేషాన్ని ఎవరో ఒకరి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చెప్పడమనే శిల్పపరమైన పనితనం టాల్‌స్టాయ్‌ను గొప్ప దృశ్యమాన రచయితగా నిలబెడుతాయి.

అది సూడాన్, ఇరాక్, కశ్మీర్, అఫ్గానిస్తాన్‌ ఏదైనా కావచ్చు; రెండు యుద్ధాల మధ్య విరామమే శాంతి అన్నట్టుగా, ఈ ప్రపంచం నిత్య సంక్షోభం, కల్లోలం. అయితే, నెపోలియన్‌ చక్రవర్తి అంతటివాడే అయినాసరే, అతడు కోరుకున్నంత మాత్రాన యుద్ధం రాదు; ఒకవేళ అతడు ఆపాలనుకున్నా ఆపలేడు. మనం ఇచ్ఛా స్వాతంత్య్రాలు అనుకునేవి భ్రాంతి జన్యం. ఇంద్రియ గోచరం కాని పరాధీనత అనేది అంగీకరించి తీరాల్సిన వాస్తవం. ఎన్నో శక్తులు ఎన్నో రీతుల్లో ప్రవర్తిస్తున్న తుది పర్యవసానం ఈ వర్తమానపు వాస్తవం. నవల చివరన టాల్‌స్టాయ్‌ చేసే ప్రతిపాదనలు ఈ ప్రపంచ నడతకు మనల్ని ఏకకాలంలో బాధ్యులుగానూ, బాధితులుగానూ నిలబెడతాయి. అయితే ఈ యుద్ధం ‘అనివార్యం’ అవుతున్నప్పుడు కూడా, సామాన్య మానవుడు తన రోజువారీ జీవన సంరంభంలో భాగం అవుతున్నాడు. అదే అతడి ధిక్కార ప్రకటన. ఆ యుద్ధ శాంతులను సమాంతరంగా చిత్రించడమే జీవితానికి టాల్‌స్టాయ్‌ ఇచ్చిన భరోసా!

టాల్‌స్టాయ్‌ రుషుల పరంపరలోని రచయిత. అందుకే గాంధీజీ లాంటి మరో రుషితుల్యుడిని దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ‘టాల్‌స్టాయ్‌ ఫార్మ్‌’ నెలకొల్పేలా ప్రభావితం చేయగలిగాడు. మరింత సమకాలీనం కావడమే గొప్ప రచనల లక్షణం. అట్లా ఈ కాలానికి కూడా అవశ్యమైన రచన ఇది. ఎన్నో భాషల్లోకి అనువాదం కావడంతోపాటు సినిమాలుగా, టీవీ సీరియళ్లుగా, సంగీత రూపకాలుగా, నాటకాలుగా, రేడియో నాటకాలుగా ఎన్నో రూపాల్లో ఇది ప్రపంచంలోని శూన్యాన్ని భర్తీ చేస్తూనేవుంది. దీన్ని ఒక్కసారైనా చదవడం ఏ సీరియస్‌ పాఠకుడికైనా జీవితలక్ష్యం లాంటిది కావడంలో తప్పేమీలేదు. దాన్నే మరోసారి పురిగొల్పుతోంది చైనా మూలాలున్న అమెరికా రచయిత్రి యీయూన్‌ లీ.

కోవిడ్‌ మహమ్మారి మొదలైన కొత్తలో ఈ అనిశ్చిత జీవితంతో విసుగెత్తి, అందివచ్చిన ఆన్‌లైన్‌ ఆయుధాన్ని అర్థవంతంగా వినియోగించుకోవాలనుకుంది లీ. మనుషులను కలిసే వీల్లేని సంక్షోభ కాలంలో, అంతరంగాలకు చేరువయ్యేలా సామూహిక పఠనానికి పిలుపునిచ్చింది. దానికిగానూ ఆమె ఎంచుకున్న నవల: వార్‌ అండ్‌ పీస్‌. ‘పబ్లిక్‌స్పేస్‌’ ఆధ్వర్యంలో 2020 మార్చ్‌ 18 నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాల్‌స్టాయ్‌ అభిమానులు భాగమయ్యారు. రోజూ ఒక అరగంట సేపు 12–15 పేజీలు చదవడం, చర్చించుకోవడం చేశారు. 85 రోజుల్లో మొత్తం నవల పూర్తయ్యింది. ఆ పఠనానుభవాలతో ‘టాల్‌స్టాయ్‌ టుగెదర్‌: 85 డేస్‌ ఆఫ్‌ వార్‌ అండ్‌ పీస్‌’ పేరుతో పుస్తకం కూడా రాసింది. ఈ సెప్టెంబర్‌ 14న అది విడుదల కానుంది. అదే కాదు విశేషం, ఈ ఉత్సాహంతో మరో విడత పఠనానికి ఆ తెల్లవారి, సెప్టెంబర్‌ 15 నుంచి సిద్ధమవుతున్నారు. పాల్గొనడానికి అర్హత ఆ పుస్తకం చేతిలో ఉండటమే!

తెలుగులో కూడా రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు చేసిన అనువాదం ‘యుద్ధము–శాంతి’ మన ముందుంది. ఆ మధ్య ‘సాహితి’ వారి రీప్రింట్‌ కూడా వచ్చింది. ఇక్కడ కూడా ఎవరైనా అలాంటి పనికి పూనుకోవచ్చు.

Tuesday, April 6, 2021

గోల్కొండ కోటలో వజ్రాల వేట 

 అతడు చక్రవర్తి అయితే తప్ప ఒక మనిషి జీవిత కాలంలో ఇలాంటి నిర్మాణం సాధ్యమా? ఎంతటి వైభవానికైనా కాలదోషం పట్టాల్సిందేనా? శాశ్వతత్వం పొందే మార్గం ఏమిటి? గోల్కొండ కోట, సాత్ గుంబజ్ రియాలిటీ చెక్.  #GolcondaFort #RealityCheck #రియాలిటీచెక్

దీని పూర్తిపాఠాన్ని ఆడియో రూపంలో నా యూట్యూబ్ రేడియోలో వినవచ్చు.

రియాలిటీ చెక్: గోల్కొండ కోటలో వజ్రాల వేట


Sunday, April 4, 2021

జంత్రవాద్యపు మంత్రవాక్యం

ఈ సమీక్ష రాసిన అజయ్‌ ప్రసాద్‌కూ, దీనిలోంచి కొంతభాగాన్ని ప్రచురించిన ఫన్‌డే మిత్రులకూ, పూర్తిపాఠాన్ని ప్రచురించిన ‘పుస్తకం’ సంపాదకులకూ ధన్యవాదాలు.


2021 మార్చ్ 28న సాక్షిలో ప్రచురితమైన సమీక్ష
-------------------------------------





జంత్రవాద్యపు మంత్రవాక్యం ఆజన్మం

  బి.అజయ్‌ప్రసాద్‌  


వాగ్గేయకారులు కవిత్వంలోనో, పాటలోనో మాత్రమే ఉండనక్కర్లేదు. రక్తపు లోపలి అలలు తరుముకొస్తుంటే ఏ రూపంలోనైనా బైటికి ధారాళంగా వ్యక్తమయ్యే కళ అది. కదిపితే నిలువెల్లా అనేక రాగాలు పలకగల తంత్రీవాద్యంలాంటివాడు పూడూరి రాజిరెడ్డి. అతడి హృదయం సున్నితమైన జంత్రవాయిద్యం లాంటిది. తటాకంలో విసిరిన రాయికి అలలు చెలరేగినట్లు తనకెదురయ్యే అనుభవంలో అతడనేక మూర్ఛనలు పోతుంటాడు. అశేషమైన ప్రాపంచిక విషయాల ప్రవాహంలో తన ఉనికియొక్క ప్రత్యేకతని ప్రస్ఫుటం చేసుకోడానికి అతడిలోని ‘నల్ల నువ్వుల్ని’ బయటికి రువ్వే అంతర్జలం అతడిలో అనంతంగా పుడుతూనే ఉంటుంది.

రాజిరెడ్డి ‘అనుభవమే జ్ఞానం’ అనే ఉత్త ( pure ) అనుభవవాది ( empiricist ) కాదు గానీ తన సొంత అనుభవమే తన రచనకు ముడిసరుకు అని నమ్ముకున్నవాడు. ఇక్కడ వాస్తవం, అనుభవం ఒకటి కాదు. మరి అనుభవం అందరిదీ ఒకటేనా? అంటే ‘కాదు’ అన్న సమాధానానికి ఎంత విలువుంటుందో ‘అవును’ అన్నదానికి కూడా అంతే విలువ. కొందరికి నచ్చే వర్షాకాలం అతడికి ఇష్టం లేకుండొచ్చు. అతడి చలికాలపు వర్ణన మనకు వెచ్చని దుప్పటి కప్పినట్లుండొచ్చు. అతడి చేతి‘రాత’ ప్రతిభావంతమైన హస్తకళ. ఈ రసవిద్యకి ఆవల అతడి హృదయాన్ని చూడకపోతే రాజిరెడ్డిని మనం చేరనట్లే లెక్క. ‘పరిశీలించడం దాన్ని చిత్రించడం ఉత్త  Workmanship, ఆర్ట్‌ కాదు. మపాసా హృదయం ముందు అతడి పరిశీలనాశక్తి ఎంతపాటి’ అంటాడు చలం.

ఏమిటీ హృదయపు ప్రత్యేకత? I like the story of human complexity అని ఎప్పుడో చదివిన చినువా అచెబె మాట ఎందుకో ఆలా గుర్తుండిపోయింది. ఈ complexity అన్నది speciality కూడా. అనేక భయ, సందేహాలతో కూడిన మానవ ప్రత్యేకత అన్నది ఈ జీవుడి ఉనికి. ఇతడికి  – అరటిపండు తినడంకంటే తిన్న తర్వాత తొక్క ఎక్కడ వెయ్యాలన్నది పెద్ద సమస్య . ఒకరు పోసినచోట పోయడం చచ్చే చావు. పేలు చూపించుకునే సుఖం కోసమైనా అమ్మాయిగా పుడితే బాగుండుననుకుంటాడు. హాఫ్‌ బనీన్లు ఎలా వేసుకుంటారో ఇతడికి అస్సలు  అర్థం కాదు. క్లారిఫై చేసుకుంటే బాడ్‌ ఇమేజ్‌ తొలగిపోయే అవకాశం ఉన్నా మౌనంగానే ఉంటాడు. లోకం మెచ్చుకునే అనేక గొప్ప రచనలు ఇతడికి చప్పగా అనిపిస్తాయి – ఇటువంటి అనేకానేక స్వభావ సంక్లిష్టతలు ఈ ‘ఆజన్మం’ ఆమూలాగ్రం కోకొల్లలుగా కనిపిస్తాయి. ఒకే అస్తిత్వం నుంచి పుట్టిన అనేక ప్రతిఫలనాలు.

ఈ అస్తిత్వానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమంటే ‘నిర్ణయం తీసుకోలేకపోవటం’. ఇది ఈ పుస్తకం అడుగడుగునా కనిపిస్తుంది. స్వతహాగా ఇది కళాకారుల లక్షణం. తమ విస్తారమైన అంతరంగానికి ఏకముఖం ఎప్పటికీ ఇవ్వలేనితనం. Hesitation ముందుపుట్టి తరువాత నేను పుట్టాను అంటాడు కాఫ్కా. గ్రాహ్యం చేసుకుని ఈదులాడే అంతర్లోకంలో ఒకటి ఎంచుకుని మరొకటి కాదనలేని ఎరుక. సందిగ్ధం ఒక దేహ ధ్యానం.

దిన జీవితపు రద్దీలో చూసి కూడా చూడక, దైనందిన అలవాటే పొరపాటై గిడసబారి వదిలేసిన విషయాలని రచయిత మసి తుడిచి మళ్ళీ మనముందు కొత్త వెలుగులో పెట్టినట్లుంటుంది. ఇందులో పిల్లల మురిపెపు ప్రశ్నల నుంచి దైవభావన, మతాలు, మృత్యుభయాలు, మన పర సమూహాలు, జడలు, సంసార ఇబ్బందులు, ఆఖరికి కౌమారంలో శానిటరీ నాప్కిన్స్‌ తెలియని కుతూహలం నుంచి పెళ్లయ్యాక భార్య బట్టలు ఆరేయడంలో పడే ఇబ్బంది వరకూ ఈ ఆజన్మం నిండా అనుభవాల సారంగా రాజిరెడ్డి తన రుచులనో, అభిరుచులనో వ్యక్తం చేస్తూ వచ్చాడు. అవి మనవిలా కూడా అనిపించవచ్చు. కొన్నిసార్లు అతడికి రుచిగా అనిపించేది మనకు చేదు కావొచ్చు. కానీ అతడి వివరణ, వర్ణన మాత్రం మనకి రుచికరంగా లేకపోతే మనం మంచి చదువురులం కానట్టే లెక్క. తలవకుండానే తలుపుతట్టే ఆలోచనలను ఒడిసిపట్టుకోడానికి ఎప్పుడూ కలం కాగితం జేబులో సిద్ధంగా పెట్టుకునే రాజిరెడ్డి వచనం గురించి చెప్పినంత తేలిగ్గా అతడి ‘రాయడం’ గురించి చెప్పడం కష్టం. తెలుగు సమకాలీన రచనల్లో విషయం గురించి, ఉదంతం గురించి చెప్పాలనేంత ఆతృత ‘రాయడం’ మీద కనిపించదు. మనం వస్తుశిల్పాల మీద చేసినంత విస్తారమైన చర్చ ఈ ‘రాయడం’ మీద ఎప్పుడూ చేయలేదు. ప్రతిదాన్ని దృశ్యమానం చేయగల డిజిటల్‌ యుగంలో ఉదంతాలను వివరించే రొడ్డకొట్టుడు రచనలు కనుమరుగై చివరికి చిత్రీకరణకు లొంగని ఈ ‘రాయడం’ ఒక్కటే కళగా మిగిలిపోనున్న కాలం ఒకటి రానున్నది. రాజిరెడ్డి తన స్వీయానుభవాన్ని తనకు తానుగా తరచి చూసుకుని, ఆ పరీక్షనాళికలో నిలబడి దాని రంగు– రుచి–వాసన మనకందజేస్తాడు. ఈ క్రమంలో విషయం కంటే విశేషణం ముఖ్యమౌతుంది. ప్రాపంచిక విషయాల విచారణతో ఆంతరంగిక ఆత్మచైతన్యం రగిలి అవి రెండూ ఒకదానినొకటి జమిలిగా మల్లెపూల దండలో మరువం కలిపి గుచ్చిన గుబాళింపు ఉంటుంది.

అతడే చెప్పుకున్నట్లు ఇందులో అనేక ఆత్మకథాత్మక సంఘటనలు, మ్యూజింగ్స్, ఫీలింగ్స్, కథలు, ఖండికలు, కవితలు ఉన్నాయి. రాసి పెట్టుకోకపోతే మర్చిపోయే చిన్న విషయాలున్నాయి. ‘ఈ అశాశ్వతత్వమే వాటిలోని అందం.’ పుస్తకం నిండా పరుచుకున్న అతడి హృదయపు ఎతచితలు దీన్ని జీవితకాలం చదువుకోగల శాశ్వత అందాన్ని ఇచ్చాయి.

ఆత్మని అనుభవంతో రమింపచేయడం అతడు చేసే పని. అందులోకి లయించినవారికి  ఆశ్చర్యమూ, ఆత్మానందమూ.


ఆజన్మం (ఆత్మకథాత్మక వచనం)

రచన: పూడూరి రాజిరెడ్డి; పేజీలు: 304; వెల: 280; 

ప్రచురణ: కృష్ణకాంత్ ప్రచురణలు, తెనాలి. 2021. ఫోన్: 97055 53567.

దొరికేచోటు: అనల్ప బుక్ కంపెనీ (ఫోన్: 7093800303); అమెజాన్.ఇన్; నవోదయ బుక్ హౌస్ (ఫోన్: 91-9000413413, 040-24652387); కినిగె.

-------

ఏప్రిల్ 2, 2021న పుస్తకం.నెట్ ప్రచురించిన సమీక్ష లింక్:

పుస్తకంలో ప్రచురితమైన సమీక్ష


https://www.amazon.in/Aajanmam-Poodoori-Rajireddy/dp/B08WLR6W7C/ref=sr_1_1?dchild=1&keywords=aajanmam&qid=1613741208&s=books&sr=1-1


https://kinige.com/book/Ajanmam

Saturday, March 27, 2021

హిజ్డాలతో ఒక సంభాషణ

వేషధారణకే అయినా, అమ్మాయిని అబ్బాయిగా మననిచ్చే సమాజం, అబ్బాయిని అమ్మాయిగా ఎందుకు ఉండనివ్వదు? వీళ్లను ఎందుకు తనలో భాగంగా కలుపుకోదు?

రియాలిటీ చెక్ లోని హిజ్డాలతో ఒక ఆత్మీయ సంభాషణ కథనాన్ని ఇప్పుడు నా యూట్యూబ్ రేడియోలో వినవచ్చు.

 హిజ్డాలతో ఒక ఆత్మీయ సంభాషణ

Monday, March 22, 2021

చలికాలపు రోజులు

 చలికాలంలో ఏం జరుగుతుంది? 

అంతకుముందు హైస్పీడులో తిరిగిన ఫ్యాన్ ఒకటో నంబరు దాటదు. బండి స్టార్ట్ కావడానికి మొరాయిస్తుంది. అగ్గిపుల్ల రెండోసారి గీకాల్సి వస్తుంది. కొబ్బరి నూనె గడ్డకడుతుంది. రోజులు పొట్టివి అవుతాయి. తలుపు చెక్కలు వ్యాకోచిస్తాయి. పాలు పెరుగు కావడానికి ముత్యమంత ఎక్కువ తోడు వేయాల్సి వస్తుంది. వేడినీటి స్నానం కోసం ప్రాణం తహతహలాడుతుంది... చలికాలంలో- ప్రకృతిలో, ఆ ప్రకృతిలో భాగమైన మనుషుల్లో వచ్చే మార్పుల్ని ఈ రియాలిటీ చెక్ కాలమ్ ద్వారా పట్టించడానికి ప్రయత్నించాను.#రియాలిటీచెక్. #RealityCheck. #పూడూరిరాజిరెడ్డి.

Friday, March 19, 2021

ఆజన్మం పుస్తక పరిచయం

"సాహిత్యంలో సాధారణంగా ఇమడవనిపించే క్షణాలను తన చిత్రమైన చూపుతో ఒడుపుగా వచనంలోకి లాక్కొచ్చుకున్నాడు. ఏ డ్రామా కోసం ప్రాకులాడుతూ సజీవ క్షణాలను సాహిత్యకారులు తరచుగా నిర్లక్ష్యం చేస్తారో, ఆ క్షణాల సౌకుమార్యాన్ని, ఆ అనుభూతుల తాలూకు సౌందర్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. గెలిచాడు కూడా. ఇది ఆత్మకథ కాదు. అందువల్ల కొన్ని సంఘటనలను విస్మరించడం లేదు; మరికొన్ని సంఘటనలను పెంచిచూపడమూ లేదు. ఇవి రచయిత జీవితకథలు కావు. జీవితాన్ని నిరాపేక్షతో రచయిత గమనించి నమోదు చేస్తున్న చెల్లాచెదురు సంఘటనలు ఇవి. ఈ కథనాలు అతనివి. కాని ఈ కథనాలు కేవలం అతని గురించి కావు. ఒక గోళంలో ఉంటూనే ఆ గోళం వెలుపలగా నిలబడి దాన్ని గమనించడం అందరికీ చప్పున పట్టుబడే విద్య కాదు."

పూర్తి పరిచయం దిగువ లింకులో.

 ఈమాటలో ఆజన్మం పుస్తక పరిచయం

Tuesday, March 16, 2021

నేనెలా రాస్తాను?

ఒకటేదైనా రాయడానికి మనల్ని ఏది ట్రిగ్గర్‌ చేస్తుందో అది మ్యాజిక్‌. ఏడేళ్ల క్రితం కినిగె మ్యాగజైన్‌లో నబొకోవ్‌ రచనా పద్ధతి అన్న వ్యాసం చదువుతూ ఉండగా, అందులో పెన్సిళ్లు, రబ్బర్ల ప్రస్తావన వచ్చింది. మిగిలిన అంశాలేవీ నాకు పట్టలేదు. కానీ భౌతికమైన, అత్యంత అల్పమైన వివరణ అయిన పెన్సిళ్లు, రబ్బర్ల ప్రస్తావన నన్ను లోపలెక్కడో కదిలించింది. అంతే! నేను చదువుతున్నది పక్కనపెట్టి, ఇది దాదాపుగా రాసేశాను. అంటే, రాయడం గురించి నా లోపల ఉన్న ఆలోచనలు అన్నింటినీ ఖాళీ చేసుకున్నాను. తర్వాత నబొకోవ్‌ వ్యాసం చదవడం పూర్తి చేసి,  తీరిగ్గా నాది దిద్దుకున్నాను. ఆజన్మంలో అనుబంధంగా ఇచ్చిన ఈ వ్యాసాన్ని పుస్తకం విడుదలైన సందర్భంగా ఈమాట తిరిగి ప్రచురించింది.

నేనెలా రాస్తాను? లేదా, నా రాతకు సంబంధించిన కొన్ని విషయాలు 

Saturday, March 13, 2021

రైతు బజార్‌ Rythu Bazaar

 మీరు ఎప్పుడైనా ఒక రైతుబజార్‌కు వెళ్లారా? ఇరువైపులా రాశుల్లా పోసివున్న కూరగాయల్లో రత్నాలను దర్శించారా? కొత్తిమీర వాసన ముక్కుకు ఎలా తగులుతుంది? టమోటాలను చూస్తే ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా లేత ఆనిగెపుకాయను చూసినప్పుడు దాన్ని చేతుల్లోకి తీసుకోబుద్ధయిందా? దాన్ని గిచ్చకుండా ఉండటానికి వేళ్లను తమాయించుకున్నారా?   రైతుబజార్‌ అంటే నగరానికి వచ్చిన పల్లెటూరు. కుప్పపోసిన వ్యవసాయ క్షేత్రం. గమనించండి, ఇంట్లో తాజా కూరగాయలు ఉన్నప్పుడు వంట కూడా ఉత్సాహంగా చేయాలనిపిస్తుంది. రైతుబజార్‌లో కూరగాయలు కొన్న, చూసిన అనుభవాలు ఈ రియాలిటీ చెక్‌లో. #RealityCheck #రియాలిటీచెక్‌ #పూడూరిరాజిరెడ్డి

రైతుబజార్ అనుభవం

Tuesday, March 2, 2021

Aajanmam Welcome Video ఆజన్మం పుస్తక ఆవిష్కరణ









ఫిబ్రవరి 14, 2021 రోజు ఊళ్లో మా ఇంట్లో జరిగిన ఆజన్మం ఆవిష్కరణ దృశ్యాలు

ఫొటోల్లో బాపు, పెద్దబాపు, అమ్మ, అత్తమ్మలు, చెల్లె, బావ, నా భార్య, పిల్లలు ఉన్నారు.

----------------------------------------------------------------


(28 ఫిబ్రవరి 2021 నాటి ఎఫ్బీ పోస్టు)

ఎటూ కోరుకున్నదే కాబట్టి పుస్తకం అచ్చుదాకా అయితే వస్తుంది. తీరా అది వచ్చేశాక చేయాల్సిన క్రతువులు కొంత చీదర పుట్టిస్తాయి. అందులో ఆవిష్కరణ ఒకటి. మధుపంకు సభ జరపలేదు. పలక–పెన్సిల్‌కూ జరపలేదు. రియాలిటీ చెక్‌ అప్పుడు మీరట్లా తెనాలి వస్తే చాలన్నారు; కాబట్టి వెళ్లొచ్చాను. చింతకింది మల్లయ్య ముచ్చటప్పుడు స్టేజీ మీదికి రాకపోయినా ఫర్లేదని అలాగే కథ నడిపించారు. కానీ ఆజన్మంకు ఏదైనా చేయాల్సిన ‘బరువు’ నామీదే పడింది. దానికి సంబంధించిన ఆలోచన తెగడం లేదు. జూమ్‌ మీటింగ్‌ ఎందుకో వద్దనుకున్నాం. ఫిజికల్‌ మీటింగ్‌ అంటే ఒక తతంగం. దానికి ప్రత్యామ్నాయంగా ఈ వీడియో బైట్ల ఆలోచన ఇచ్చాడు అజయ్‌. అయితే ఇది పుస్తకాన్ని విడుదల చేస్తూ, అంతకుముందే మనం వాళ్ల చేతికిచ్చిన పుస్తకాన్ని వక్తలు చదివొచ్చి మాట్లాడటం లాంటిది కాదు. ఆ రచయిత రైటింగుతో వాళ్లకున్న ఎటాచ్మెంట్‌ ఏమిటో చెప్పడం. కొంత ‘బ్రెయిన్‌ స్టార్మింగ్‌’ తర్వాత దీనికి నేను సంసిద్ధుడనయ్యాను.

ఇంకొక విశేషం ఏమిటంటే– నేను ఆ ఆదివారం ఊరికి వెళ్లాల్సి వచ్చింది. పుస్తకాలేమో ప్రెస్సువాళ్లు తరువాతి వారం ఇస్తామన్నారు. ఊరికి వెళ్లేప్పుడు ఒకట్రెండు కాపీలు పట్టుకెళ్తే బాగుంటుంది కదా అని శనివారానికి ఏమైనా ఇమ్మంటే ఒప్పుకున్నారు. ఒక కాపీ చేతికిచ్చి, పట్టుకుపోవడానికి వీలుగా మిగతావి ప్యాక్‌ చేశారు. ఊరికి వెళ్లేముందు అందులోంచి రెండు కాపీలు తీద్దామని అనుకున్నది కూడా, దాన్ని ఓపెన్‌ చేయడంలో పిల్లలకు ఒక సంబరం ఉంటుంది కదా అని అలాగే ఉంచేశాను. నేను వెళ్లేసరికి మల్లన్న బోనాలని మా చెల్లె వాళ్లు, అత్తమ్మలు ఊరికి వచ్చి ఉన్నారు. ఇక అప్పటికప్పుడు పిల్లలు ప్యాకెట్‌ ఓపెన్‌ చేయడం అనేదే బహుశా పుస్తక ఆవిష్కరణ సభనేమో అన్న తలంపు వచ్చింది.

అట్లా నా తేల్చుకోలేనితనం అటు పుస్తకావిష్కరణా జరిగేట్టు చేసింది; ఇటు సమాంతరంగా ఈ ఆలోచన కూడా నడుస్తున్నది కాబట్టి వీడియో బైట్లూ వచ్చేశాయి. డబుల్‌ సెలబ్రేషన్‌! ఇందులో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పను. కానీ అందరికీ ❤

Aajanmam Welcome Video

Saturday, February 27, 2021

'సంఘటనలన్నీ ఆలోచనల ఘర్షణలే'



26 ఫిబ్రవరి 2021 రోజు మేడి చైతన్య రాసిన fb పోస్ట్. ఫొటో క్రెడిట్ కూడా తనదే. 
అయినా ట్యాగ్ చేయకపోయినా తెలియడానికి ఎంతసేపు పడుతుంది చైతన్యా:-)
-------------------------------------------


'ఆజన్మం' రాజిరెడ్డి గురించి.

నాకు రాజిరెడ్డి గారి రచనతో పరిచయం యాదృచ్ఛికంగా జరిగింది. అంటే నేను నేనుగా వాటిని వెతుక్కొని చదవలేదు. అలా తారసపడింది, అంతే. 2014 మే కినిగె సంచికలో నాదొక కథ వచ్చింది. అప్పట్లో కథని ఎవరైనా చదివి ఏమైనా రెస్పాండ్ అయితే బాగుండనే బాల్యపు దశలో ఉండి, ప్రతిరోజూ, అంటే మే నెల ఎండలంతా కినిగె కామెంట్స్ సెక్షన్స్ లోనే గడిపా. అలా చూస్తుండగానే జూన్ నెల వచ్చింది, కొత్త సంచిక, కొత్త కథలు కలుపుకొని. అదిగో అలా ‘రెక్కల పెళ్ళాం’ చదివాను. అదివరకు సాహిత్యం ఎక్కువ చదవకపోవడం, అప్పటికి చదివిన కాస్త సాహిత్యం కూడా ‘ఇహ’ లోకపు రీతులకే కట్టుబడిన జీవితాల మీదే వెలుగు ప్రసరించడం వల్ల, ఈ కథ చదవగానే  విప్పుకున్న రెక్కలు, మొలుస్తున్న ఎర్రటి తురాయి మనసులో ముద్ర పడ్డాయి. అప్పటికి నాకు తురాయి అంటే అర్ధం తెలియదు. ఆ విధంగా ఆన్లైన్ లో ఆంధ్రభారతి డిక్షనరీ కూడా ఈ కథే పరిచయం చేసింది. 

నిజం చెప్పాలంటే నేను రాజిరెడ్డి గారి సాహిత్యం చదివింది మొన్నటివరకు చాలా అంటే చాలా తక్కువ. నేను రియాలిటీ చెక్ చదివింది లేదు. అసలు ఆ పుస్తకం ముట్టింది లేదు. ఇంకా మధుపం, పలక-పెన్సిల్, చింతకింది మల్లయ్య ముచ్చట పుస్తకాలు అరువు తెచ్చుకున్నా, ఇష్టంగా ఆసాంతం ఏ పుస్తకం చదవలేకపొయ్యా. బహుశా ‘ఇలా ఉంటేనే సాహిత్యం నాకు నచ్చుతుంది’ అనే గీత గీసుకొని ఉండటం వల్ల, నాకు ఇష్టమైన సాహిత్యం పరిధి సహజంగా చిన్నదయింది. కానీ, ‘గంగరాజం బిడ్డ’ చదివిన తర్వాత, ఆయన రచనలు అన్ని రోజులు చదవకపోవడం వల్ల నేనేదో కోల్పోయానేమో అని అనిపించినా, అదేంటో నా పూర్తి గ్రహింపులోకి రాలేదు. ఆయన్నీ పూర్తిగా చదవాలనే కాంక్ష అయితే మొదలయింది ఆ కథ నుండే. కానీ, ఎప్పుడూ ఏదోక ఆటంకం. అనవసరపు పనులతో తీరికలేని తనం. అప్పుడే మళ్లీ ‘ఆటా సభల్లో నా  ప్రసంగం (డిసెంబర్ 14, 2019)’ అని ఒక బ్లాగ్ లింక్ నాకు 2020 మొదటిరోజే  ఎదురయితే చదివాను.

ఆ కొత్త సంవత్సరం రోజు ఆయన ప్రసంగంలో ఉన్న మూడు విషయాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి- ఒకటి ఆయన సాహిత్యం వైపు రావడానికి వెల్లడించిన కారణం, రెండు రాయడం పట్ల ఆయనకున్న దృక్పథం, మూడు జీవితాన్ని శుభ్రం చేసుకోవడానికి రాతని ఒక సాధనంగా ఎంచుకోవడం.

ఈ మూడు విషయాలు నా పఠనా ప్రపంచంలో ఒద్దికగా మోహరించి ఆయన మిగతా రచనలన్నీ చదివించేలా చేశాయి. ఇప్పుడు ‘ఆజన్మం’ అని చెప్పుకుంటున్న రాతల్లో మునుపటి కథల్లో కనపడని ఒక తత్త్వం ఉందేమోననిపిస్తుంది నాకు. ఆ తత్త్వానికి కారణం, ఈ రాతల్లో ఆయనకే పరిమితమితమైన చూపుతో లోకాన్ని చూసి, లోపలికి గ్రహించి, ఆ గ్రహింపును నిశితంగా పరిశీలన చేసి, దానిమీద ఒక స్థిరమైన అభిప్రాయం రావడానికి లోపల కొంత నలిగి, తీరా ఒక నిర్ణయానికి వచ్చేశాక దాని ధర్మం చెడకుండా బయటకు ఎలా చెప్పాలో అని ఒక వందసార్లు దానిని లోపల మననం చేసుకున్నాక, నిర్మమత్వంతో ఒక మాట రాస్తారు. అయన మెదడు గూటి దాటి ఒక మాట బయటకు రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. దీనికి మనం‘రాజిరెడ్డి తత్త్వం’ అనే పేరు ఒకటి పెట్టుకుందాం. ఈ వైవిధ్య గుణమే ఇందులో ఉన్న రాతల్ని, ఆయన రాసిన మిగతా రచనల ప్లేన్ లో కాకుండా, మరొకటేదో భిన్నమైన యూనివర్స్ లో నుండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాయి. ఆ వేరొక లోకం కూడా స్వతహాగా తనంతట తానుగా తెలుసుకున్న విలువల చుట్టే కట్టుబడి ఉంటుంది. 

ఆయన రాతల్లో కనిపించే ముఖ్యలక్షణం- ఎంచుకున్న అనుభవాల్లోంచి గ్రహించిన సత్యాలు రాయడం, జీవితం పట్ల ఉన్న నిబద్ధత, నిజాయితీని అక్షరాలవైపు ప్రసరించడం, ఆ రచనలతో కొంచెమైనా జీవితాన్ని శుభ్రపరచుకోవాలనే ఆయన ఆశ. అంటే సుదీర్ఘమైన అనంత కాలరేఖ మీద వేసిన జీవితపు తప్పటడుగులను, రాతల్లో మరొకసారి అనుభవించి, జీవికి అంటుకుపోయిన మలినాలను కొద్దికొద్దిగా శుభ్రం చేసుకోవడమే తన ముందున్న కర్తవ్యం. ఈ ప్రాసెస్ లో తనని తాను కొత్తగా మళ్ళీ పరిచయం చేసుకోవడం, అనుభవాలను అనుభావాల్లాగే గుర్తు చేసుకోవడం పరిపాటి (అంటే తనదైనది ఏదీ ఆ అనుభవాలకు జోడించకుండా, వాటిని యథాలాపముగా పరిశీలన చెయ్యడం). అందుకేనేమో 'ఆయన బతికేదంతా, ఆయన జార్చుకున్న క్షణాల్లోనే', గతంలోనే. ఆ గత కాల స్పృహతో ప్రస్తుతాన్ని జాగ్రత్తగా జీవించాలనుకుంటారు.

ఇలా కన్ఫెషన్ ఎలిమెంట్ ఉన్న రచనల్లో, వెలుగు ప్రసరించిన నిజాలకుండే విలువ కంటే దాచేయబడిన సత్యాలకు శక్తి ఎక్కువ. అలా అని దాచేయబడినవన్నీ సంపూర్ణ సత్యాలని, అక్షరాల్లో పొందుపరిచనవన్నీ పాకిక్షమైనవని కొట్టిపారేయలేము. జీవితం పట్ల ఉండే నిబద్ధతతో తమను తాము నిశితంగా పరిశీలన చేసే ఇటువంటి రచనల్లో, జీవిత సారానికి సంబందించిన అమూర్త రూపమేదో ఎదురుపడుతుంది. కానీ, అలా జరగాలంటే దాచుకోడానికి వీలుండి కూడా, మనసొప్పక, ఇతరులతో సహజంగా పంచుకోలేని కొన్ని వైయక్తిక జీవిత అనుభవాలెన్నో నిజాయితీగా పరీక్షకు పెట్టాల్సిందే. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఇదిగో ఇలాంటివన్నీ- “బయటికి చెప్పినవీ చెప్పలేకపోయి­నవీ లోపల ఉన్నవీ లోలోపల దాక్కున్నవీ అంతరాంతరాళాల్లో రక్తంలో ఉన్నవాటిని వేరుచేయడానికి శ్రమపడాల్సినవీ….   తప్పులు ఒప్పులు కన్ఫెషన్లు కోరికలు ఇబ్బందులు హిడెన్‌ ఎజెండాలు ఓపెన్‌ ఆదర్శాలు...”. అసలు నిజ్జంగా ఒక మనిషి తన మనసులోనున్న ఆలోచనలు, ఏరుకున్న జీవిత అనుభవాలు, చేసిన తప్పులు, ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుకు వచ్చే గతం తాలూకా చెత్త పనులు, ఇవన్నీ రచనల్లో వ్యక్తపరచగలడా? ఉన్నదున్నట్టు, జరిగింది జరిగినట్టు ఒక fact లా, ఏ conceptual ఫ్రేమ్ తాలూకా భావాలని/వాదాలని వాటికి జోడించకుండా, నిర్భీతితో వాటినన్నింటినీ తన రచనల్లో చెప్పుకోగలడా? అది కొంత అసాధ్యమేమో! అందుకే ఆయనే రాతకు పరిధిని కూడా ఆయనే సూచించుకున్నారు. లోపలున్న భావాలూ అక్షరాలలో నింపినప్పుడు, వాటికుండే సహజ గుణమేదో పాక్షికంగా వడలి పోతుందేమోనని అభిప్రాయపడ్డారు. అందుకే ఒక చోట ఇలా రాస్తారు- “అనుకుంటాంగానీ, నిజంగా మనిషి మనసులో ఉన్నవన్నీ రాయలేం. ఇలాంటి నా లోపలి విషయాలు ఇంకా వెయ్యి ఉన్నాయేమో, అనిపిస్తోంది. ఇంకొకటి చెప్పాలి. నిజంగా రాయలేమా అంటే, ఒక క్షణంలో మనకు కలిగిన భావాన్ని వాక్యంలోకి తర్జుమా చేస్తే అది సంపూర్ణ సత్యం కావాలని లేదు. అది ఆ క్షణానికి సత్యమే. కానీ ఎప్పటికీ నిలిచే సత్యం కాకపోవచ్చు.” అందుకేనేమో నేను చెప్పుకోవాల్సినవన్నీ రాయలేకపోయానని, ‘పూర్తి స్వచ్ఛంగా’ గా ఉండలేకపోయానని బాధపడతారు ఆయన.

రాజిరెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఆయన రాయడం/సాహిత్యం వైపు రావడానికి ప్రధానంగా పనిచేసిన కారణం ‘ఈగో’ అని చెప్పారు. అయితే ఆ ‘ఈగో’ అంటే ఏంటి? ఆయన రచనల్ని ఎరుకలో ఉంచుకొని, ఏ సెన్స్ లో ఈ పదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు? ఆయన చెప్పిన ‘ఈగో’కి బహుశా ఇలా ఒక సమాధానం మనం చెప్పుకోవచ్చు, ఒక రకంగా తనకు సంబంధించిన వైయక్తిక సత్యాలే తప్ప, సామూహిక సత్యాలని అలానే ఉమ్మడితనాల్ని అంగీకరించని తన గోడే ఈ రాతలంతా. అయితే శైశవదశలో చాలామందిలాగే రచనకి, జీవితానికి ఏ మాత్రం లంకె లేని రాతలు రాసి అబ్బురపడ్డారు. ఒకానొక రోజు ‘ఏమీ తెలియకుండా, అనుభవంలోంచి చీల్చుకుని రాకుండా ఒక్క వాక్యం కూడా రాయొద్దన్న ఇంగితం’ కలిగి, ఇంటెనకున్న జామచెట్టు సాక్షిగా పాత రాజిరెడ్డి కాలిపోయారు. అయన రచనలు కాకుండా ‘రాజిరెడ్డి కాలిపోయారని’ ఎందుకన్నానంటే, ఆయన ఇక ముందు నుండి రాసిందంతా ఆయన గురించే. ఇదే మాటను ఇదిగో ఒక చోట ఇలా అంటారు-’లోకం గురించి రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. నా గురించి రాసుకోగలిగేది నేను ఒక్కడినే కదా!’. ఒకొక్కసారి నాకేమనిపిస్తుందంటే ఆయన రాతల్లో జరిగినట్టుగా చెప్పే చాలా సంఘటనలు, నాకు మటుకు ఆయన మనస్సులో జరిగిన ఆలోచనల ఘర్షణల్లాగానే అనిపిస్తాయి. అవి మేటర్స్ అఫ్ ఫాక్ట్స్ కాదు కేవలం possibilities నేమో! ఇలా possibilities గురించి మాట్లాడటం వల్ల ఆయన ఒక్కరు కాదేమో అనిపిస్తుంది. రాజిరెడ్డి గారు నా అనుమానానికి వంత పాడుతూ ఇదిగో ఇలా అన్నారు ఒకచోట “నేనెప్పుడూ ఒకణ్ని కాదు, ఇద్దరం.” బహుశా అందుకేనేమో “మంచీ మర్యాదా” లో రమేశ్‌గాడు, “ప్రాణవాయువు” లో హరిగాడు తన కవల సోదరుడన్నా, అదేంటో నాకు ఈ రెండూ కూడా రాజిరెడ్డి గారి స్వీయానుభవాలే అనిపిస్తాయి. ఇలా అనిపించిడానికి కారణం, facts కి, possibilities కి మధ్య నుండే సన్నని గీత ఆయన రాతల్లో చెరిగిపోతుందనుకుంటాను.  

ఇలా లోపల నలిగిపోవడం, చిన్న చిన్న విషయాలకు ఎందుకు అంత బుర్ర పాడుచేసుకోవడం ఎందుకంటే, ‘చెప్పాలని ఒక దుగ్ధ. ఇంకా ము­ఖ్యంగా ఇవన్నీ చెప్పేస్తే ఏర్పడే ఖాళీతనం ఇష్టం’ అని చెప్తారు. ఇంత ఘర్షణ పడితే తప్ప శాంతి రాదనీ ఆయన నమ్మకం. అందుకే ఆయన అంటారు “నాతో నేను శాంతి పొందడం ఒక్కటే ఈ జీవితకాలం నేను చేస్తున్న సాధన.”

చివరిగా ఒక మాట- అయితే మొన్న మెహెర్ భాయ్ ఒక మాట చెప్పారు- “Your search for a suitable form of art may well end in finding a better version of yourself.” ఈ మాట బాగుంది. కానీ, రాజిరెడ్డి గారి విషయంలో నాకేమనిపిస్తుందంటే suitable form కోసం ఆయన అదే పనిగా ఎప్పుడు వెతుక్కోలేదేమో. ఈ ever changing world లో, ఒకొక్క phase లో, ఆయన అనుభవములోకి వచ్చిన మానవ సంబంధాల గాఢతని, అప్పుడు అందుబాటులో ఉన్న form లోకి ఒంపుకున్నారేమో. మనిషి మారుతున్న కొద్దీ పాత forms లలో ఆయన మాటలు ఇమడక, ఆ forms కి యెడంగా వస్తూ, ఇదిగో ఇలా ఈ ‘ఆజన్మం’ సమయానికి అయన మానసిక నిర్మాణానికి తగ్గట్టుగా అచ్చంగా సరిపడే శిల్పం తారసపడింది అనుకుంటా. అందుకేనేమో వీటికి అంత అందమూ, శాశ్వతంగా నిలిచిపొయ్యే గుణమూ ఉన్నాయని నా గట్టి నమ్మకం.

ఇకపోతే రియాలిటీ చెక్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. ఆజన్మం కి సంబంధించిన కొన్ని రాతలు ఆన్లైన్లో దొరుకపుచ్చుకొని, చదివి, రాసిన నోట్ ఇది. పుస్తకం మొత్తం చదవాలి, మళ్ళీ, మళ్లీ.  

‘కాంటెంపరరీ తెలుగు రచయితలలో నీకు ఇష్టమైన రచయిత ఎవరు?’ అని ఎవరు నన్ను అడిగినా తడుముకోకుండా వెంటనే చెప్పే సమాధానం మెహెర్ భాయ్ అని. అయితే ఆ లిస్ట్ లో ఇప్పుడు ‘అజన్మం’ రాసిన రాజిరెడ్డి గారు చేరారు. ఇంకో విధంగా చెప్పాలంటే రాజిరెడ్డి అనే మనిషే నచ్చాడు. ఎందుకంటే ఈ ఆజన్మంకి సంబందించినవరకు రాత, మనిషి వేరు కాదు.

PS- నేను రాసేవాటి గురించి నాకుండే ఒకే ఒక్క అభిప్రాయం- am I making any sense at all? అని. అందుకే ధైర్యం చేసి ఆయన్ని ట్యాగ్ చేయలేకపోతున్న 😕

-మేడి చైతన్య

Wednesday, February 24, 2021

ఎంతో ఎదురుచూసిన పుస్తకం



ఫొటోల్లో అజయ్ ప్రసాద్, పూడూరి రాజిరెడ్డి, మెహెర్ ఉన్నారు.
మబ్బుల 5 గంటల చలిలో ఇరానీ హోటల్లో కలవాలన్నది అజయ్ ఐడియా.
--------------------------------------------------------------------------------

 

(19 ఫిబ్రవరి 2021 రోజు facebookలో మెహెర్ రాసిన పోస్టు)

రాజిరెడ్డి ‘ఆజన్మం’ ఇవాళే చేతికొచ్చింది. ఈమధ్య కాలంలో ఇంతగా ఎదురుచూసిన పుస్తకం లేదు. ఈమధ్య అనేముంది, నేను రాయటం మొదలుపెట్టాకా ఎవరి పుస్తకం కోసమూ ఇంతగా ఎదురుచూడలేదు. అలాగని ఇందులోనివేవీ ఇంతకుముందు చదవలేదని కాదు. చాలా పీసెస్ అవి వెబ్ మేగజైన్లలో పబ్లిష్ కాకముందే చదివాను. అలాగని నా స్నేహితుడి రచన కాబట్టీ కాదు ఈ ఎదురుచూపు. అలా అనుకుంటే రాజిరెడ్డి మిగతా పుస్తకాల కోసం నేనేం ఇంతలా ఎదురుచూడలేదు, ఇలా పోస్టులూ పెట్టలేదు. నా కంటెంపరరీ రైటింగులో నన్ను బాగా ఆకట్టుకున్న ఏకైక వర్క్ కాబట్టి, దీని విలువ ఎక్కువమంది గుర్తించటమా ఎవరూ గుర్తించకపోవటమా అన్నదాన్నిబట్టి తెలుగు సాహిత్య చవిటిమాగాణాల మీద నాతో నేను వేసుకున్న పందేల ఫలితం తేలుతుంది కాబట్టి- దీని కోసం ఎదురు చూశాను.

ఈ పుస్తకంలోని రచనలు ‘ఆజన్మం’ పేరుతో 2013లో సాక్షిలో ఆదివారం సంచికలో శీర్షికగా మొదలయ్యాయి. అది మొదలైన మూడో/ నాలుగో వారానికే నేను ఫేస్బుక్ లో ఒక పోస్టు పెట్టాను (https://bit.ly/3ptphCs). ఆ వారం శీర్షికలో ‘ఫిక్షన్’, ‘నాన్ ఫిక్షన్’ల మధ్య తేడాపై రాజిరెడ్డి చేసిన తీర్మానాన్ని నెగేట్ చేస్తూ ఆ పోస్టు పెట్టాను. అయితే ఆ పోస్టులో రాజిరెడ్డితో విభేదించటంతోపాటు, నా తోటి రచయిత మొదలుపెట్టిన ఒక కొత్త ప్రయాణాన్ని గుర్తించిన కుతూహలం కూడా ఉంది. ఆ పోస్టు చివర్లోని వాక్యాలివి:
‘‘“నేను” వైపు చూసుకోవటంలో రెండు రకాలున్నాయి. [రచయిత] తనని తాను మనుషుల్లో ప్రత్యేకతగా చూసుకోవటం ఒకటి. తనని తాను మనిషికి ప్రతినిధిగా చూసుకోవటం ఒకటి. ఈ రెంటి మధ్యా గీత చాలా పల్చన. మొదటి రకం కేవలం narcissism. రెండోది, ఒక శాస్త్రీయమైన కుతూహలం. ఈ ఫలానా గెలాక్సీలో, ఫలానా సౌరకుటుంబంలో, మూడో గ్రహమైన భూమ్మీద పుడుతూ జీవిస్తూ చివరికి చచ్చే ఈ మనిషి అనే జీవిని పరిశీలించాలంటే... రచయితకు అతి దగ్గరగా అందుబాటులో ఉన్న స్పెసిమన్ తానే. కాబట్టి మొత్తం మానవాళికి ప్రాతినిధ్యం వహించగలిగే ఈ స్పెసిమన్ ని శ్రద్ధగా చూస్తాడు, తన పరిశీలనల్ని నిర్మమత్వంతో నమోదు చేస్తాడు.... ప్రక్రియల్ని నిరాకరించే దిలాసా రాజిరెడ్డిలో ఉంది (I hope it’s not his job as a journalist that’s making it compulsory for him to resort to these ingenious inventions). ప్రక్రియల మధ్య గీతలున్నాయని మర్చిపోగలిగేంత తన్మయత్వంలో కూడా పడిపోతేనో....’’
అంతకుముందు వచ్చిన రాజిరెడ్డి పుస్తకాలు ‘మధుపం’, ‘రియాల్టీ చెక్’లలో నాకు ఒక రచయితా, జర్నలిస్టూ కలగాపులంగంగా కలిసి కనపడ్డారు. ‘ఆజన్మం’తోనే రాజిరెడ్డి జర్నలిస్టును పూర్తిగా వెనక వదిలిపెట్టి ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. అది గమనించినందుకే నాకు ఆ కుతూహలం. ఈ ఏడేళ్ళలో వాటిని చదువుతూ వచ్చిన సందర్భాలన్నీ ఒక ఎక్సయిట్మెంట్. వీటిలో ఇండివిడ్యువల్ పీసెస్ ఏమైనా ఒక్కోచోట నిరాశ పరిచినా, తన మానసిక నిర్మాణానికి అచ్చంగా సరిపోయే శిల్పాన్ని కనుక్కోవటంలో ఆయన చేసిన ప్రయాణం నాకు ఎప్పుడూ గొప్పగానే అనిపించింది. ఇది తెలుగులో ఇంతకుముందు లేని శిల్పం అనను. అయితే ఇంతకుముందు ఈ తోవలో వచ్చినవేవీ, ఇలా అయితే లేవు. ఈ రచనల తీరుని బట్టి ఇది సహజమే కావొచ్చు. మన రచనా శిల్పాన్ని మన మానసిక నిర్మాణంవైపుకు దగ్గరగా జరిపేకొద్దీ ఈ వైవిధ్యం, అద్వితీయత వస్తాయి. ఆ తోవలో ఒంటరిగా సాగే ధైర్యం లేనప్పుడూ, ఆ నిశితమైన అన్వేషణ లేనప్పుడూ ఇప్పటి మిగతా కంటెంపరరీ రైటింగ్ మల్లే ప్రతి రచనా ఇంకో రచనకి నకల్లాగ, ఏ ఇండివిడ్యువాలిటీ లేకుండా, బాగా ఏడ్చి పౌడరు పూసుకున్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఆ రచనలకి సమాజం కోసం రాస్తున్న యుటిలిటేరియన్ కోణం ఒకటి ఆపాదించి సంతృప్తి పడతారు రచయితలు. మానవానుభవాన్ని అక్షరాల్లోకి తీసుకురావటం చేతకానప్పుడు, అది ఒక norm గాక exception అయి మిగిలినప్పుడు, అది కంటపడినా conceptual binaries లో కూరుకున్న మెదడుకి దాని విలువ అర్థం కానప్పుడు... ఇక ఏం చేయగలరు పాపం! ఇక ఇదొక గుంపులాగ మారుతుంది. రాజిరెడ్డి లాంటి రచయితల గురించి మాట్లాడటానికి వీళ్ల దగ్గర ‘వాక్యం బాగుంటుంది’, ‘వచనం బాగుంటుంది’ లాంటి డొల్లపుచ్చు విశేషణాలు తప్ప ఏమీ దొరకవు. ఎందుకంటే వాళ్ళకి ఈ రచనల్లో సామాజిక చలన సూత్రాలు లేవు, రాజిరెడ్డి విప్లవ ప్రసవ వేదనలెక్కడా పడలేదు, ఏ ఉద్యమానికీ ఎడమ భుజం అరువిచ్చిన పాపాన పోలేదు. కానీ అలాంటివాటి గురించి.. I am constitutionally incapable of giving a fuck కాబట్టి, ఏం చెప్పలేను.
‘సాక్షి’లో ‘ఆజన్మం’ శీర్షిక మొదలైన కొన్ని వారాలకే ఆగిపోయింది. తర్వాత కొన్ని పీసెస్ కినిగె వెబ్ మేగజైన్లో నేనే పబ్లిష్ చేశాను. అప్పట్లోనే మా మధ్య స్నేహం కూడా మొదలైంది. దాంతో మేం రాసుకున్నవన్నీ బైటికి పంపే ముందు ఒకరికొకరు పంపుకోవటం మొదలైంది. అలా ఇవన్నీ బైట పబ్లిష్ కాకముందే చదవగలిగాను. ‘ఆజన్మం’ స్కోప్ ని చాలామంది కంటే బాగా అర్థం చేసుకోగలిగాను. చాలామంది కంటే ముందే అర్థం చేసుకోగలిగాను. అందుకే గత ఏడాది ‘ఈ దశాబ్దం ధ్రువతారలు’ అన్న పోస్టులో ఇలా రాశాను:
‘‘రాజిరెడ్డి తలకు ఎత్తుకున్న ఈ ప్రాజెక్టుని ఎవరైనా దగ్గరగా గమనించారో లేదో తెలీదుగానీ, ఇది 'సాక్షి'లో మొదలై 'కినిగె పత్రిక'లో కొన్నాళ్లు నడిచి ప్రస్తుతం 'ఈమాట'కు చేరే దాకా నేను ఒక్కటీ వదలకుండా చదువుతూ వచ్చాను. ...బహుశా 'ఆజన్మం' పుస్తకంగా వచ్చాకనే దాని బృహత్ ఆకాంక్షా, అందులోని తెగువా అందరికీ అర్థమవుతాయేమో. ఫిక్షన్ అనే వ్యవస్థతో రాజిరెడ్డి పెట్టుకున్న తగువు తెలుగులో ఇదివరకూ ఎవ్వరూ పెట్టుకుని ఉండరు. దీనికి మధ్యలో అడపాదడపా బై ప్రొడక్టుల్లాగా వచ్చిన కథలు కూడా ఉన్నాయి. వాటినెందుకు కథలన్నాడో, వీటినెందుకు కథలనలేదో, ఈ రేఖామాత్రమైన బేధాన్ని పసిగట్టి అర్థం చేసుకుంటేనే ఫిక్షన్ తో రాజిరెడ్డికి ఉన్న తగువేమిటో అర్థమవుతుంది, కొంతలో కొంత రాజిరెడ్డీ అర్థమవుతాడు.’’
ఏడేళ్ళ క్రితం సాక్షిలో ‘ఆజన్మం’ అన్న పేరు చూడగానే దొంగిలించేయాలన్నంత ముచ్చటేసింది. ఆ తర్వాత ఆ పేరు మీద రాజిరెడ్డి రాసినవి చూశాక, దొంగిలించినా అంత గొప్పగా ఆ పేరు మీద ఏం రాయలేనులే అనిపించింది. ‘ఆజన్మం’ అని పేరుపెట్టి నలభై ఏళ్ళకే ఈ పుస్తకం తెచ్చేశాడు రాజిరెడ్డి. ఇప్పుడు ఆజన్మానికి అతీతంగా ఏం చేస్తాడన్నది మరో కుతూహలం.
Congratulations
mate! Go

Tuesday, February 23, 2021

ఆజన్మం దొరికేచోటు


తొలి కాపీ అందుకున్న రోజు
Photos: Shaik Anwar

ఆజన్మం
ఆత్మకథాత్మక వచనం
------------------------

ఇందులో కొన్ని అనుభవాలూ జ్ఞాపకాలూ ఉన్నా ఇది ఒక వయసుకొచ్చాక జీవితంలో జరిగిన మంచేమిటీ చెడేమిటీ అని బేరీజు వేసుకుంటూ రాసిన పుస్తకం కాదు. ఆత్మకథాత్మక సంఘటనలే ఉన్నప్పటికీ ఇవన్నీ పేర్చితే ఆత్మకథ రాదు. ఇందులో మ్యూజింగ్స్‌ ఉన్నాయి, ఫీలింగ్స్‌ ఉన్నాయి, కథలున్నాయి, ఖండికలున్నాయి, కవితలు కూడా ఉన్నాయి. రాసిపెట్టుకోకపోతే మర్చిపోయేంతటి చిన్న విషయాలున్నాయి. ఈ అశాశ్వతత్వమే వాటిల్లోని అందం. అన్నీ ఒక మనిషి జీవితంలోని అతి సూక్ష్మమైన, సున్నితమైన సందర్భాలు. #ఆజన్మం #Aajanmam

మ్యూజింగ్స్/ ఆత్మకథలు/ ఆత్మకథాత్మక వచన సంపుటి ఆజన్మం మీద ఆసక్తి ఉన్నవాళ్ల కోసం ఈ సమాచారం:

పుస్తకాలు కావాలనుకునేవారు Amazonలో కింది లింకులో ఆర్డర్ చేయొచ్చు. 

ఆజన్మం పుస్తకాల కోసం...  

ఈ-బుక్ చదవాలనుకునేవారు పైన బార్లో ఇచ్చిన లింకులో కినిగెలో ఆర్డర్ చేయొచ్చు.

Wednesday, February 17, 2021

ఆజన్మం ప్రోమో

(fb post)

నా కొత్త పుస్తకం ఆజన్మం తొలి కాపీలు చేతికి అందినై. మరీ సినిమాటిక్ ఫీలింగ్ ఏమీ కాదు. కానీ కొంతేదో చేయగలిగామన్న సంతోషం.

304 పేజీల ఈ మ్యూజింగ్స్/ ఆత్మకథలు/ ఆత్మకథాత్మక వచన సంపుటి గురించి వీళ్లను సంప్రదించవచ్చు.ప్రచురణ కర్త: కృష్ణకాంత్ ప్రచురణలు, ఫోన్: 9705553567; పంపిణీదారు: అనల్ప బుక్ కంపెనీ, ఫోన్: 7093800303

నేను కూడా మాడర్న్ అవుతున్నానని చాటుకోవడానికి పుస్తకం మీద సరదాగా చిన్న ప్రోమో ఒకటి చేశాం. థాంక్యూ మెహెర్.

Aajanmam


Wednesday, February 10, 2021

నా కొత్త పుస్తకం

 (9 ఫిబ్రవరి 2021 నాటి facebook పోస్టు.)

నా కొత్త పుస్తకం ఆజన్మం నిన్న ప్రింటుకు వెళ్లిపోయింది. ఈ శనివారానికి కొన్ని కాపీలైనా నా చేతిలోకి వస్తాయి. ఈ ఒక్క పుస్తకం కోసం నేను చాలా ఎదురుచూశాను. రకరకాల కారణాల వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు వాటన్నింటినీ దాటుకుని వాస్తవరూపం దాల్చుతోంది. ప్రతి చెడు వల్ల నాకు ఎంతో కొంత మంచే జరిగింది. ఈ ఆలస్యం కూడా పుస్తకం మరింత పూర్ణ రూపం తీసుకోవడానికి ఉపకరించింది.

నా పుస్తకాల ప్రచురణలో అన్నిసార్లూ నాకు కలిసొచ్చింది. నేను అసలు ఎదురుచూడటం అంటూ లేకుండానే అవి జరిగిపోయాయి. మొదటి పుస్తకం తప్ప, మిగిలినవన్నీ ఆఫర్ వచ్చాకే సంకలనం చేశాను. నా పట్ల అది ఆయా ప్రచురణకర్తల ఆత్మీయత. అందుకే నా పాత పబ్లిషర్స్ గుడిపాటి గారు, అఫ్సర్ గారు, కృష్ణమోహన్ బాబు గారు, తెనాలి ప్రచురణలు సురేశ్, నారాయణ గార్లను ఇక్కడ ఇష్టంగా గుర్తుచేసుకుంటున్నాను.

పుస్తకాల సంఖ్యను పెంచుకోవడం మీద నాకు ఆసక్తేమీ లేదు. మనదంటూ ఇదీ అని ఒకే ఒక్క పుస్తకం నిక్కమైనది ఉంటే చాలనుకుంటాను. అలా చూసుకున్నప్పుడు నా పుస్తకం ఏది? వాటికి ఎంత పేరొచ్చినా మధుపం, రియాలిటీ చెక్ లాంటివి పాత్రికేయుడిగా మాత్రమే రాయగలిగేవి. చింతకింది మల్లయ్య ముచ్చట కథల సంపుటి ఇప్పటికి అసంపూర్ణం. కానీ పత్రికల్లో పనిచేయకపోయినా, ఇంకే పనిలో ఉన్నా బహుశా నేను రాయగలిగే ఏకైక పుస్తకం, ఈ ఆజన్మం. ఇకనుంచీ పూడూరి రాజిరెడ్డి అనగానే ఎవరికైనా నేను గుర్తుకు రావాలనుకునే పుస్తకం ఈ ఆజన్మం. ఒక్క వారంలో "అనల్ప"  పంపిణీలో  అందుబాటులోకి వస్తుంది. మూడేళ్లుగా ఈ పుస్తకంతో కలిసి ప్రయాణిస్తున్న 'నా పబ్లిషర్', శ్రేయోభిలాషి సుధామయి గారికి (నో) థాంక్యూలు. 




Saturday, February 6, 2021

నా కథ: గంగరాజం బిడ్డ

రైటర్స్ మీట్ వెలువరించిన కొత్తకథ-2018 సంకలనంలో గంగరాజం బిడ్డ ప్రచురితమైంది. రాస్తున్నప్పుడు ఇది ఒక పిల్ల..కథే అనుకున్నా. కానీ అజయ్, మెహెర్, కాకుమాని లాంటివాళ్ల స్పందన విన్నాకే ఇందులోని సౌందర్యం తెలిసిరావడం మొదలైంది. గత పదేళ్లలో తనకు నచ్చిన పది కథల్లో ఇదీ ఒకటని రాశాడు మెహెర్‌. ఇది ఒక సంపూర్ణమైన కథ అన్నాడు కాకుమాని శ్రీనివాసరావు. అయితే దీన్ని నాస్టాల్జియాగా పొరబడటం చాలా తేలిక. ఇందులోని ఉద్వేగం పూర్తిగా నాదే. కానీ నా జీవితంలో జరగని/జరిగిన ఘటనలను ఒక కాలావధిలోకి ఎలా తెచ్చానన్నదే ఇందులోని శిల్ప విశేషం.

‘తెల్సా’ వాళ్లు కథాపఠనం కోసం నన్ను అడిగినప్పుడు ఆప్షన్లుగా మూడు కథలు ఇస్తే, వాళ్లు దీన్ని ఎంచుకున్నారు. అయితే ముఖాముఖిలో చదవడం నాకు అసౌకర్యంగా ఉంటుందేమోనని ఆడియో ఫైల్‌ పంపుతానన్నాను. ముందు దానికే ఒప్పందం కుదిరిందిగానీ, మళ్లీ ప్రాక్టికల్‌ ఇబ్బందుల వల్ల చదవడమే మంచిదనుకున్నాం. అప్పటికి నేను కూడా కొంత ముదిరిపోయాను కాబట్టి ఒప్పేసుకున్నాను. ఈ ఆడియో రికార్డింగు ఇచ్చిన అనుభవం కూడా యూట్యూబ్‌ ఛానల్‌ మొదలుపెట్టాలన్న ఆలోచనకు కారణమైంది. 

ఏ కథనైనా మనది మనం చదువుకోవడమే ఉత్తమమైన అనుభవం. అలా కానప్పుడు రచయిత మరుగున ఉండి చదివే ఈ ఆడియో వినడం ఒక మేలైన ప్రత్యామ్నాయం. లింకు దిగువ:

(ఫొటో క్రెడిట్‌: అజయ్‌ ప్రసాద్‌)     

 గంగరాజం బిడ్డ

Monday, February 1, 2021

బ్రెడ్ ప్యాకెట్

 మొదటి వీడియోకే సబ్‌స్క్రైబర్లు 90 మంది దాటారు. ఈ స్పందన ఉత్సాహభరితంగా ఉంది. దానిమీద చాలామంది పాజిటివ్ కామెంట్లే చేసినా, వ్యక్తిగతంగా ఒకరిద్దరు మిత్రులు మాత్రం కొంచెం పట్టిపట్టి చదివినట్టు ఉందనీ, ఇంకొంచెం సాఫీగా ఉంటే బాగుండేదనీ అన్నారు. నాక్కూడా కొంత సాగదీసి చదివినట్టు అనిపించింది. ‘మొదటి’ ప్రయత్నం కదా అని నచ్చజెప్పుకున్నా.


చాలా విషయాలు మనల్ని చుట్టేస్తాయి; కానీ వాటి గురించి ఎవరూ చెప్పరు. రుతుస్రావ సమయంలో మహిళలు వాడే శానిటరీ ప్యాడ్స్‌ గురించి మీకు, ముఖ్యంగా మగవాళ్లకు ఏ వయసులో తెలిసింది? అదేమిటో తెలియని ఒక కౌమారపు బాలుడి కుతూహలం ఈ రెండో వీడియో. నా యూట్యూబ్‌ రేడియోలో.

Tuesday, January 26, 2021

నా యూట్యూబ్ ఛానల్ మొదటి వీడియో

 నేను కూడా ఆ క్లబ్బులో చేరుతున్నట్టుగా యూట్యూబ్ ఛానల్ ఒకటి మొదలుపెట్టాను. సున్నా జ్ఞానంతోనే దీన్ని మొదలుపెట్టినప్పటికీ- యూట్యూబును యూట్యూబుతోనే జయించాలన్నట్టుగా మొదటి అప్లోడ్ అయితే విజయవంతంగా చేయగలిగాను. ఈ ఛానల్ ఎందుకో చెప్పే పరిచయం మొదటి వీడియో.

RajiReddy Writings