Monday, November 29, 2021

ఉండాల్సిన మనిషి



(సాకం నాగరాజ గారికి డెబ్బై యేళ్లు వచ్చిన సందర్భంగా చిన్న అభినందన సంచిక వేస్తున్నామనీ, మీరు ఏదైనా రాయాలనీ నామిని ఫోన్ చేశారు. చిన్న పీస్ రాసి పంపాను. దేనికైనా ఒక హెడ్డింగ్ పెడతాం కదా, అలా ఒకటి పెట్టాను. అయితే, ఈ సంకలనం మొత్తానికి తాను ఒక పేరు ఎలాంటిది పెట్టాలని ఆలోచిస్తున్నాడో సరిగ్గా నేను అలాంటిదే పెట్టానని సంతోషపడ్డారు నామిని. అలా నా శీర్షికతోనే పుస్తకం వచ్చింది.)


ఉండాల్సిన మనిషి


సాకం నాగరాజ గారితో నాకు పరిచయం ఉందని చెప్పలేను. అసలు అలాంటివారితో ఎవరికైనా పరిచయం ఉంటుందా! అలాగని ఉండకుండానూ ఉంటుందా? వాళ్లు ఒక ప్రవాహంలా కదిలిపోతుంటారు. నామిని చెప్తూవుంటాడు: ఆయన మా ఇంటికొస్తాడా, నాతో ఒక్క మాటా మాట్లాడడు సా; ఇక్కడినుంచి కోట పురుషోత్తంకు ఫోన్‌ చేస్తాడు. మళ్లీ కోట పురుషోత్తం ఇంటికి వెళ్తాడా; అక్కడినుంచి మా ఇంటికి ఫోన్‌ చేస్తాడు. ఇదీ సాకం. ఆయన అంతటా ఉంటాడు; ఎక్కడా ఉండడు. బహుశా ఈ హైరానా ఆయన జీవలక్షణం కావొచ్చు. ఎప్పుడూ ఏదో పనిలో మునిగి ఉండేవాళ్లకు మాత్రమే ఉండే హడావుడి.


నెత్తిన గంప ఉన్నవాడు వడివడిగా నడుస్తాడు. అయితే ఆ బరువు ఆయన స్వచ్ఛందంగా మోపుకున్నదే. అందువల్లే ఆయన చాలా పుస్తకాలు వేయగలిగాడు. వాటిని కొరియర్‌ డబ్బులు ఖర్చుపెట్టుకుని మరీ పంపుతాడు. తెలుగు కథకు జేజే, రైతు కథలు, విరామం, డిగ్రీ విద్యార్థులకు ప్రపంచ కథలతో మొదలుకొని నిన్నా మొన్నా సింగమనేని నారాయణ నివాళి పొత్తం దాకా. వీటి సంకలనం వెనుక నామిని ఉన్నాడేమో అని నా అనుమానం. కానీ ఎవరు వెనకున్నా, పుస్తకం చిన్నదైనా, పెద్దదైనా ఎవరో ఒకరు ముందుండి చేయగలిగితేనే జరిగే పనులు ఇవన్నీ. అట్లాంటి గట్టి సంకల్పం సాకం.


ఆయన్ని మొదటిసారి తిరుపతిలో జరిగిన వర్తమాన కథ–2009 ఆవిష్కరణ సభలో చూశాను.  నేను అదే మొదటిసారి తిరుపతి వెళ్లడం. నా చింతకింది మల్లయ్య ముచ్చట కథ అందులో వేశారు. అప్పటినుంచీ మనం ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే మన సాకం ఉన్నాడులే అనే భరోసా కలిగింది. ఆ ఆవిష్కరణ వల్లే నామిని, కోట, ఆర్‌ఎం(ఉమామహేశ్వరరావు) పరిచయం కలిగింది. చిత్రంగా ఈ పదేళ్లలో సాకం కంటే వీళ్లందరితోనే నేను మాట్లాడింది ఎక్కువ. అందుకే అన్నాను, ఆయనతో ఎవరికీ పరిచయం ఉండే అవకాశం లేదని. పోతూ ఉండటమే ఆయన స్వభావం. పూర్తిగా పాతకాలం మనిషి. కానీ ఈ భూమ్మీద ఉండాల్సిన మనిషి.


– పూడూరి రాజిరెడ్డి

మార్చ్‌ 2021

 

No comments:

Post a Comment