Friday, May 13, 2022

సినిమాలు ఎలా చూస్తున్నాను?

 



ఫొటో రైటప్‌: 

(కింది వరుస) మహమ్మద్‌ ఖదీర్‌బాబు, కూనపరాజు కుమార్, వేమూరి సత్యనారాయణ, హెచ్చార్కె, వి.మల్లికార్జున్, అనిల్‌ అట్లూరి, రామరాజు, వి.రాజారాంమోహన్‌ రావు, సాయి పాపినేని.

(మెట్ల మీద కింది నుంచి పైకి) శాంత, జయ, సూజాత వేల్పూరి, ఉమా నూతక్కి, ప్రసాద్‌ సూరాడ, శ్రీనాథ్‌ రెడ్డి, శిఖామణి, మానస ఎండ్లూరి, రుబీనా పర్వీన్, చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ, మనోజ్ఞ ఆలమూరు, పూడూరి రాజిరెడ్డి)

 


ఏప్రిల్‌ 16–17, 2022

‘శాంతారామ్‌’, మన్నెగూడ



సినిమాలు ఎలా చూస్తున్నాను?
----------------------------------------


(మొన్న శని, ఆదివారాలు– అంటే ఏప్రిల్‌ 16, 17 తేదీల్లో, మహమ్మద్‌ ఖదీర్‌బాబు నిర్వహణలో, మాజీ పోలీస్‌ అధికారి చిలుకూరి రామశర్మ– చదువరి శాంత దంపతుల ఆహ్వానం మేరకు వారింట్లో ఓ ఇరవై మంది మిత్రులం కలిశాం. పౌర్ణమి వెన్నెలను చూడటం అనేది దీనికి సాకు(1). ఇదొక ఉప రైటర్స్‌ మీట్‌ లాంటిది. అందుకే ప్రసంగాలు లేవు. ఒక్క హెచ్చార్కే గారూ(డయాస్పోరా సాహిత్యం), నేనూ మాత్రమే మాట్లాడాం. మా ‘వెళ్లిపోవాలి’ వచ్చిన తర్వాత, నన్నో సినిమాజీవిని చేసి, సినిమాల గురించి మాట్లాడమన్నారు. సాధికార వ్యాఖ్యానాలు నాకు చేతగావు కాబట్టి, నేను ఎలా సినిమాలను చూసుకుంటూ వచ్చానో చెప్పాను. రాత కొంత క్రమాన్ని డిమాండ్‌ చేస్తుంది కాబట్టి ఆ మేరకు స్వల్ప మార్పులు చేశాను. సారం మాత్రం అదే.)

నా తరఫు చాలామందిలాగే నేను కూడా చిన్నప్పుడు చిరంజీవి పిచ్చోణ్ని. ఆ పేరు తలుచుకుంటేనే వైబ్రేషన్‌ వచ్చిన రోజులున్నాయి. అసలు సినిమాలు బాగుండకపోవడం అనేది తెలీదు. బొమ్మ ఎదురుగా కనబడుతుంటే బాగోకపోవడం ఏంటి ఇంకా? ఇంటర్మీడియట్, డిగ్రీ దాకా రిలీజైన ప్రతి సినిమా చూడాలని అనుకునేవాణ్ని. అరే, వాళ్లు అన్ని లక్షలు ఖర్చు పెట్టి తీసినదాన్ని మనం పది రూపాయలు ఇచ్చి చూడగలుగుతున్నాం కదా అని సంబరపడేవాణ్ని. చేతివేళ్ల మీద– బాలకృష్ణ సినిమా ఇదొచ్చిందీ, వెంకటేశ్‌ సినిమా చూశాను, నాగార్జునది చూశాను, తర్వాత మోహన్‌బాబు, రాజశేఖర్‌... జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌... అయితే అన్నీ చూసేసినట్టే! సంవత్సరంలో నూరు నుంచి నూటాయాభై దాకా చూసిన రోజులున్నాయి. ప్రతి రెండు రోజులకో సినిమా అనుకోవచ్చు. అసలు నేను బయటి ఖర్చు అంటూ పెడితే అది సినిమాకే. మళ్లీ థియేటర్లో ఏ సమోసానో ఎప్పుడూ కొనలేదు.

నేను న్యూస్‌ పేపర్లలో విధిగా చదివిన వాటిల్లో ఒకటి, ఏ థియేటర్లో ఏ సినిమాలు నడుస్తున్నాయి అనే సమాచారం. అవి చూడకపోయినా ఊరికే చదవడం కూడా బాగుండేది. అట్లా ఒకసారి కాచిగూడ పరమేశ్వరిలో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఉందని చూసి, పటాన్‌చెరు నుంచి పరుగెత్తుకొచ్చాను( అప్పటికి డిగ్రీ అయ్యి, తొలి ఉద్యోగంలో ఉన్నాను.) ఒక్క మార్నింగ్‌ షో మాత్రమే వేశారు. నేను రెండో రోజు వచ్చేసరికి అదీ తీసేశారు. ఎంత నిరాశపడ్డానో చెప్పలేను. ‘వేరే’ సినిమాలు అనుకునేవి కూడా చూడాలనే ఆకలి అప్పుడప్పుడే మొదలైంది. మణిరత్నం ఒక్కడే నేను అప్పటికి చూస్తున్న ‘వేరే’. సత్యజిత్‌ రే, శ్యామ్‌ బెనెగల్, ఇలాంటి పేర్లు తెలుసు. కానీ ఎప్పుడూ వాళ్ల సినిమాలు చూడలేదు. చూసే అవకాశం కూడా లేదు. కానీ లోలోన ఒక భయం ఉండేది. వీళ్ల సినిమాలు మనం చూడలేమేమో, మెల్లగా నడుస్తాయేమో, నచ్చకపోతే వాళ్లమీద గౌరవం పోతుందేమో అనుకునేవాణ్ని. కానీ ‘పథేర్‌ పాంచాలీ’ చూసిన తర్వాత, నా భ్రమలు పోయాయి. కమర్షియల్‌ సినిమాను ఎంతగా ఆనందించగలమో వీటిని కూడా అంతే హాయిగా చూడగలం అన్నది అర్థమైంది. వాటిని ఏ అంశాల్లో ఇవి అధిగమిస్తాయో, ఎందువల్ల ఇవి క్లాసిక్స్‌ అవుతాయో, ఎందుకు ఇలాంటివే ఒక దేశపు ప్రాతినిధ్య సినిమాలుగా నిలబడతాయో అన్నది మెల్లమెల్లగా తెలిసొచ్చింది.

జర్నలిజంలోకి వచ్చి, హైదరాబాద్‌లో ఉండటం మొదలుపెట్టాక ప్రత్యామ్నాయ సినిమాల తావులు తెలియడం మొదలైంది. గోథె జెంత్రమ్, అలయన్స్‌ ఫ్రాన్సైజ్, హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌... ఒకసారి ఓ ఇటాలియన్‌ సినిమాను లామకాన్‌లో వేస్తున్నారని తెలిసి వెళ్లాను. ఇలాంటి జాగాలు నాలాంటివాడివి కాదు అన్న బెరుకు ఎందుకో నన్ను వదలదు. స్క్రీనింగ్‌ ఎక్కడో అర్థం కావడం లేదు. బయట కనబడే తెర దగ్గర ఎవరూ లేరు. మొత్తానికి ఎవరినో అడిగితే, ముఖం విప్పార్చుకుని చూశాడు. తర్వాత అర్థమైందేమిటంటే, ఆయనే ప్రదర్శకుడూ, అప్పటిదాకా నేనే తొలి ప్రేక్షకుడినీ అని!

యూట్యూబ్‌ అనేది పెద్ద నిధి. బెర్గ్‌మన్‌ సర్వస్వం సహా నేను ఎన్నో అందులోనే చూశాను. సినిమా అనేది ఒక సముద్రం. వాటిల్లో ఏది ఎంపిక చేసుకోవాలి అనేదానికి నేను ఏం చేసేవాడినంటే, ఈ వందేళ్లలో వచ్చిన వంద గొప్ప సినిమాలు అని రకరకాల జాబితాలు ఉంటాయి. వాటి తోక పట్టుకుని పోయేవాడిని. రోజర్‌ ఎబర్ట్‌కు నచ్చిన సినిమాలు ఏమిటి? లేకపోతే ఏ స్కోర్సెసీ నోట్లోంచో ఫలానా సినిమా అని ఊడిపడితే అదేమిటో చూడాలనుకోవడం... ఇట్లా నాకు దొరికినవి చూసుకుంటూ వచ్చాను.

సినిమాలు చూడటంలో ఒక షిఫ్ట్‌ లాంటిది ఏమిటంటే– క్లాసిక్స్, ఇంగ్లిష్‌ సినిమాలు పక్కనపెట్టెయ్‌... ఒక దేశానికి సంబంధించిన ఒక్క సినిమా అయినా చూడాలి. అన్నా కరేనినా నవల చదివితే మనకు ఆ మనుషుల ఉద్వేగాలు, చింతన, మనకుగా రూపుకట్టే వారి ముఖాల నీడలు తెలుస్తాయి. కానీ నిజంగా రష్యాలో మనుషులు ఎలా ఉంటారు? వాళ్లు వేసుకునే బట్టలు ఎలా ఉంటాయి? వాళ్ల ఇండ్లు ఎలా ఉంటాయి? వీటిని సినిమాల్లోనే చూడగలం. సాహిత్యం మీద సినిమా పైచేయి సాధించే సందర్భం నా ఉద్దేశంలో ఇదొక్కటే. అందుకని టాంజానియా, నైజీరియా, ఇండోనేషియా, అజర్‌బైజాన్, అల్బేనియా, రొమేనియా, అర్మేనియా, ఇట్లా చూసుకుంటూ వస్తాను. వాటిల్లో కూడా మంచి సినిమాలు ఏమిటనేది వెతుక్కోవడానికి గూగుల్‌ ఉండనే ఉంది. చైనాలో కూడా భూమ్మీద గడ్డి మొలుస్తుంది, వాకిళ్లకు గేట్లుంటాయి, అక్కడక్కడా చిన్న నీటికుంటలుంటాయి అని అనుకోవడం వేరు, దృశ్యంగా చూడటం వేరు కదా. సినిమాలతో ఇంకో ఎడ్వాంటేజీ ఏమిటంటే, ఏ తైవాన్‌నో, వియత్నాంనో తెలుసుకోవడానికి అక్కడ వచ్చిన ఒక పుస్తకం చదవలేం. దానికి వెచ్చించాల్సిన టైము, ఓపిక ఎక్కువ. కానీ ఒక రెండు గంటల్లో ఒక సినిమా చూసేయగలం.

ఇవన్నీ చూసినదానికి బహుశా ఫలశ్రుతి లాంటిది మా ‘వెళ్లిపోవాలి’. ఇరానియన్‌ సినిమా, ముఖ్యంగా కియరొస్తామీ చూపిన అతి మామూలుతనం, టర్కీ దర్శకుడు న్యూరీ బిల్జే జైలన్‌ కదా క్లౌడ్స్‌ ఆఫ్‌ మేలో తన అమ్మానాన్న కజిన్లనే యాక్టర్లుగా వాడినట్టు తెలిసిన హింటూ, కొంత బ్రెస్సన్, కొంత ఎరిక్‌ రామర్‌... వీళ్లందరినీ మార్గదర్శకులుగా పెట్టుకొని, తీరా షూట్‌ సమయానికి వీళ్లందరినీ పక్కనపడేసి మాకు తోచినట్టు చేసుకుంటూపోతే తయారైన చిత్రరాజం వెళ్లిపోవాలి. మేము ఊహించని విధంగా తెలుగు సాహిత్యలోకం దాన్ని నెత్తిన పెట్టుకుంది. అందుకు చాలా హేపీ!

––––
ఫుట్‌నోట్‌:
(1). అయితే ఆరోజు అనూహ్యంగా ఆకాశం మబ్బుపట్టింది. అయినా మబ్బులు అంటేనే తేలిపోయేవి అని కదా. ఎవరైనా పిలవగానే బ్యాగును భుజాన వేసుకుని ఎగేసుకుని ఎందుకు పోతాము, అక్కడో పెద్దమనిషి తన హోదాను పక్కనబెట్టి చివరి కారు వచ్చేదాకా గేటు దగ్గర ఎందుకు నిలబడతాడంటే... ఏదో హ్యూమన్‌ ఇంటరాక్షన్‌ కోసం. ఇంకా ఏ రుబీనా పర్వీన్‌ లాంటివాళ్ల జీవితగాథో వినడం కొసరు.

No comments:

Post a Comment